మా రచయితలు

రచయిత పేరు:    ఆచార్య ఎం రామనాథం నాయుడు

సాహిత్య వ్యాసలు

తెలుగు ఖండకావ్యాల విశిష్టత

ప్రాచీన మానవుడి మస్తిష్కంలోనే ఆలోచన ఆవిర్భవించింది. అది క్రమంగా వికసించింది. తన మనసులో చోటు చేసుకున్న ఆలోచనలను సాటి మానవుడి మనసులోకి ఎక్కించేందుకు ప్రయత్నం మొదలైంది. కథలు చెప్పడం ద్వారానో, సన్నివేశాలను కల్పించడం ద్వారానో ఆ ఆలోచనను ఎదుటి వారిలో చొప్పించేందుకు ప్రాచీన మానవుడు ప్రయత్నించాడు. పర్యవసానంగా సాహిత్యం ఆవిర్భవించింది. ఇతివృత్తం, పాత్రపోషణ, వర్ణనలు, ఇంపైన నుడికారం మొదలైన వాటి ద్వారా తాను చెప్పదల్చుకున్న విషయాలను చమత్కారంగా తెలియజేసి సాటి మానవుణ్ణి ఇతోధికంగా చైతన్య పరిచేందుకు మానవుడు ప్రయత్నించాడు.

విజ్ఞాన సర్వస్వంగా పరిగణింపబడే భారతం వచ్చింది. ధర్మ సర్వస్వంగా పరిగణింపబడే రామాయణం వచ్చింది. భక్తి సర్వస్వంగా పరిగణింపబడే భాగవతము తదితర పురాణాలు వచ్చాయి. మేథస్సుకు పదును పెట్టే పంచకావ్యాలు వచ్చాయి. పెద్ద కావ్యాలను చదువలేనివారికి అనువుగా లఘు కావ్యాలు వచ్చాయి. వీటినే "ఖండ కావ్యాలు" అని కూడా అనవచ్చు. మేఘసందేశం, ఋతుసంహారం వంటి వాటిని లఘుకావ్యాలుగా లేదా ఖండ కావ్యాలుగా పరిగణించారు. ఈ విధంగానే తెలుగులో కూడా ఖండకావ్య రచన జరిగింది.

నన్నయతో ప్రారంభమై క్షీణ యుగం దాకా సాగిన ప్రాచీన సాహిత్యమంతా ఒక ఎత్తైతే, 1875 నుంచి రూపుదిద్దుకున్న ఆధునిక సాహిత్యం మరో ఎత్తు. ఆధునిక సాహిత్యయుగంలో పాఠకులు పెరిగారు. వారి అభిరుచులు పెరిగాయి. అభిరుచులకు అనుగుణంగా సాహిత్య ప్రక్రియలు కూడా పెరిగాయి. అలా పెరిగిన ప్రక్రియల్లో ఖండకావ్యం ఒకటి.

ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో ఖండకావ్యానికి ఎంతో ప్రాముఖ్యముంది. 20వ శతాబ్ద ప్రారంభంలోనే మొలకెత్తిన ప్రక్రియ ఇది. ఆంగ్ల సాహిత్య సంపర్క ఫలితంగా ఆవిర్భవించిన ఆధునికాంధ్ర సాహిత్య ప్రక్రియల్లో ఇది కూడా ఒకటి.

ఆంగ్లేయుల ప్రభావం వల్ల తెలుగువారి జీవన విధానంలోనూ పెను మార్పులు చోటుచేసుకున్నాయి. వేగము, వైవిధ్యము, బహుముఖీనత, జీవన లక్షణాలుగా పరిణమించాయి. అందువల్ల మహా కావ్యాలను చదివి అర్థం చేసుకొని ఆకళింపజేసుకునే తీరిక, ఓపిక వారిలో కొరవడ్డాయి. వీలైనంత తక్కువ పరిశ్రమతో, వీలైనంత ఎక్కువ ఆనందాన్ని పొందాలనిపించింది. నిడివి తక్కువగా వుండే ప్రక్రియల మీద ఆసక్తి కలిగింది. అలా వచ్చిన ప్రక్రియల్లో ఒక్కటే ఖండకావ్యం.

ఆవిర్భావ వికాసాలు

తెలుగులో ఖండకావ్య ప్రక్రియను ప్రవేశ పెట్టిన ఖ్యాతి గురజాడకే దక్కుతుంది. 'పూర్ణమ్మ' అద్భుతమైన ఖండకావ్యం. ఖండకావ్య ప్రక్రియని రాయప్రోలు "తృణకంకణం" ద్వారా పరిపుష్టం చేశాడు. ఆ తరువాత జాషువా, విశ్వనాథ, నాయని, అబ్బూరి రామకృష్ణారావు, వెంకట పార్వతీశ కవులు, వేదుల, దేవులపల్లి, పింగళి, కాటూరి, కొడాలి ఆంజనేయులు, కరుణశ్రీలు పద్యాలలో ఖండ కావ్యాలు రచించి ఖ్యాతి పొందారు. కుందుర్తి, సినారెలు వచన కవిత్వంలో ఖండ కావ్యాల వంటివి రచించారు. జాషువా, వేదుల మహా కావ్యాలేవి రాయకపోయినా ఖండకావ్యాల ద్వారానే ప్రఖ్యాతినార్జించారు.

ఖండకావ్య ప్రక్రియలో సిద్ధహస్తునిగా జాషువాను పేర్కొనాలి. ఎవ్వరూ స్పృశించని గిజిగాడు, సాలీడు, చీమ, శిశువు, శ్మశానవాటిక వంటి వాటిపై జాషువా ఖండ కావ్యాలు రాయటం విశేషం. విశ్వనాథ దేశభక్తిని ప్రబోధించే ఖండ కావ్యాలు రాశాడు. వేదుల ఖండ కావ్యాలలో వేదన, ప్రణయం, దేశభక్తి వుంటాయి. కరుణశ్రీ పాకీపిల్లపై ఖండకావ్యం రాయటం గమనార్హం. ఆధునిక పద్య కవులైన ఉత్పల, సంపత్కుమార, బేతవోలు, భూమయ్య, రసరాజు, నాగభైరవ మొదలైనవారు కూడా ఖండకావ్యాలు రచించారు.

నిర్వచనం

ఖండ కావ్యాన్ని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఈ విధంగా నిర్వచించాడు. మహాకావ్యములలో ఏకదేశములైన రసవత్ సంఘటనలనుగాని, నగరార్ణవ శైలర్లు చంద్రార్కోదయాదులలో నేదైన ఒకటిగాని తీసికొని రసభావ బంధురములైన రమణీయ రచనలు చేయవచ్చు. అట్టి వానికే ఖండకావ్యములని పేరు".

స్వయం సంపూర్ణమై, పూర్వాపర నిరాకాంక్షయై పరిసమాప్తారకరమై రసపర్యవసాయి కాగలిగిన కావ్యేక్రదేశము ఖండ కావ్యముఅని ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంలో సంపత్ రాఘవాచార్య వివరించాడు.        ఉదాత్తమైన మహాకావ్యంకంటె ఈ ఖండ కావ్యం తక్షణ హృదయ స్పృక్కు కవి హృదయజ్వలనములో వెలువడిన రసభావ సంగీతమునకిది తారాస్థాయి", "మహా కావ్యముల నుండి రసవద్దట్టములు కాని, ఒక ఏక విషయమును గురించి వ్రాసిన కొన్ని పద్యములు కాని విడిగా తీసినచో అవి ఖండ కావ్యములగును" అని విశ్వనాథ అభిప్రాయ పడ్డాడు.

ఖండకావ్యంలో శీర్షికకి ప్రాధాన్యముగాని పూర్వోత్తర కథలతో సంధానము అవసరము లేదు. జాషువా కవి రచించిన 'కర్ణుడు' అనే శీర్షికలో కర్ణుని పై కవికి గలిగిన భావ పరంపర మాత్రమే ఉంటుంది.  కర్ణుని చరిత్ర అంతా వుండదు" అని కడియాల రామమోహనరాయ్ తెలియజేశాడు. ఖండ కావ్యమనగా చిన్నకథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యములుండి ఆశ్వాస విభక్తముగాని రచనకావచ్చును లేక ఒక పద్యమో, కొన్ని పద్యములలో వున్న రచన కావచ్చును" అని సినారె నిర్వచనం.

లక్షణాలు
1. ఖండ కావ్యం పద్యంలోకాని, గేయంలోకాని, వచనంలోకాని వుండవచ్చు.
2. మహా కావ్యాల్లోని ఏ సంఘటననైనా తీసుకొని ఖండకావ్యం రాయవచ్చు.
3. అష్టాదశ వర్ణనలలో ఏదైనా ఒక వర్ణన తీసుకొని రాయవచ్చు.
4. ఖండకావ్యం దేనికదే సంపూర్ణంగా ఉంటుంది.
5. ఖండకావ్యంలోని వస్తువుకు ముందుగాని, వెనుకగాని ఏదీ వుండనక్కరలేదు.
6. మహాకావ్యంకంటే కూడా సులభంగా ఖండకావ్యం పాఠకుల హృదయంలో ప్రవేశించగలదు.
7. ఖండకావ్యంలో ఆత్మాశ్రయకవిత్వం వుంటుంది. అయితే అది ఉండాలన్న నియమమేదీ లేదు.
8. ఖండకావ్యంలో కవిభావం చిక్కగా ఉంటుంది.
9. ఖండకావ్యానికి చిన్న కథ వుండవచ్చు.
10. కొన్ని పాత్రలు మాత్రమే వుండవచ్చు.
11. ఖండకావ్యానికి యోగ్యం కాని వస్తువంటూ లేదు.
12. పద్యాల సంఖ్య పరిమితంగా ఉంటుంది.
13. ఒక పద్యం కూడా ఖండకావ్యమనిపించేందుకు వీలుంది.
14. ఖండకావ్యానికి విషయమే ప్రధానం.
15. ఖండకావ్యంలో ఆశ్వాస విభజన వుండదు.
16. పద్యాల ఛందస్సు సూచించబడదు.

ఖండకావ్య వర్గీకరణ

తెలుగులో వచ్చిన ఖండ కావ్యాలను వస్తువును బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించుకోవచ్చునని విమర్శకులు భావిస్తున్నారు. అవి


1. రామాయణ ఖండకావ్యాలు
2. భారత ఖండకావ్యాలు
3. భాగవత ఖండకావ్యాలు
4. ఇతర ఖండకావ్యాలు

డాక్టర్ సి. నారాయణరెడ్డి తన ఆధునికాంధ్ర కవిత్వము – సాంప్రదాయములు, ప్రయోగములు అనే తన సిద్ధాంతవ్యాసంలో ఖండకావ్యాలను ఐదు  రకాలుగా వర్గీకరించాడు. అవి - 1. కథాత్మకమైనవి     2. ప్రణయాత్మకమైనవి  3. ప్రకృతిపరమైనవి  4. ప్రబోధాత్మకమైనవి  5. వర్ణనాత్మకమైనవి.

1. కథాత్మకమైనవి

1. కరుణశ్రీ - కుంతీకుమారి 2 . జాషువా - ఫిరదౌసి , ముంతాజ్ మహల్ ,

2. ప్రణయాత్మకమైనవి

1. రాయప్రోలు - తృణకంకణం 2. దువ్వూరి - కడపటి వీడుకోలు 3. అబ్బూరి - జలజమాలిక

3. ప్రకృతివరమైనవి

1. జాషువా - గిజిగాడు, సాలీడు  2. కరుణశ్రీ – పుష్పవిలాపం  3. తుమ్మల - గరిగపంట  4 . పింగళి, కాటూరి - కాపుపాట.

4. ప్రబోధాత్మకమైనవి

1. విశ్వనాథ - ఆంధ్ర ప్రశస్తి  2. జాషువా - బాపూజీ 3. తుమ్మల - మహాత్మా

5. వర్ణనాత్మకమైనవి

1. జాషువా - శ్మశానవాటిక  2. కృష్ణశాస్త్రి - కృష్ణపక్షం.

 

ఆధార గ్రంథాలు
1 . ఆధునికాంధ్ర కవిత్వము , సంప్రదాయములు : ప్రయోగములు - డాక్టర్ సి . నారాయణరెడ్డి
2 . తెలుగు సాహిత్య చరిత్ర - ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న
3 . తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్ ద్వా . నా . శాస్త్రి

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు