కళ్ళముందు పట్టెడన్నం దొరకక
తనువు చాలిస్తున్న అభాగ్యులను చూసి
ఉండబట్టలేక ఒక్క అడుగు బయట వేశాను
గుప్పెడు బియ్యాన్ని చేతిలో పట్టుకొని!
ఏ దిక్కుకు పోవాలో తెలియక
అంబేద్కర్ బొమ్మ ముందు
దిగులుతో కూర్చున్నాడొక వలసకూలీ!
చేతులు చాచాలంటే ఆత్మాభిమానం అడ్డు వచ్చినట్టుంది
ఒకప్పుడు బుక్కెడు బువ్వ కోసం తండ్లాట పడ్డవాళ్ళలో నేనూ ఒకడినని భుజం తట్టాను
దైన్యంతో కూడిన అతని చూపులు ఇంకా వెంటాడుతూనేఉన్నాయి!
చిరిగిన పరదా వెనక
ఏ ఆసరా లేని డెబ్బై ఏళ్ల పైబడిన వృద్ధురాలు
పింఛను పైసలు రోగాలురొప్పులకు పోగా
ఖాళీ డబ్బాలు సప్పుడు చేస్తున్నాయి
ఆ అవ్వకు బతుకు నిత్య సమరం!
మా ఇంటి తొవ్వ ఎట్ల తెలిసింది బిడ్డా అని అడిగింది
ఈ దేశంలో ఏ తొవ్వ చూసినా కొస్సకు ఉండేది పేదల ఇండ్లే కదా అవ్వ అని చెప్పి ముందుకు నడిచిన!
అతడో కళాకారుడు
కళను అమ్ముకోని, అమ్ముకోలేని పిచ్చిమారాజు
ఇంట్లో ఏమీ లేకపోయినా అందరూ ఇంట్లో ఉండాలని పాటకడుతున్నాడు
గర్జించడమూ, గళమెత్తడమే అతడికి తెలుసు
పైసలు లెక్కపెట్టుకునుడు, లెక్కలేసుకునుడు తెల్వదు
గజ్జెలు ఓ మూల నుండి జాలిగా చూస్తున్నాయి
పాట ఒక్కసారిగా ఘొల్లుమన్నది!
ఇదో ఇద్దరు పండుటాకుల కథ
అన్నీ అమ్ముకొని ముగ్గురు బిడ్డల పెండ్లి చేసిళ్ళు
సర్టిఫికేట్లల్ల ఏం తప్పైందో ఏమో ఒక్కరికే పింఛను వస్తదట
ఒక్క పింఛను పైసలల్ల ఇద్దరు బతకాలే...
మందులూ మాకులు అన్నీ అందులోనే!
కొంతమందికిది ఒక్కపూట ఖర్చు!
వచ్చేటప్పుడు రెండు చేతులెత్తి మొక్కి
మళ్ళెప్పుడస్తరు బిడ్డా అని అడిగిర్రు
ఈసారి నా కళ్ళల్ల నీళ్ళు తిరిగినయి!
గడపగడపకో తీరని వ్యధ
ఏదేమైనా మళ్ళోసారి వెళ్లిరావాల్సిందే -
వాళ్ళు ఎదురుచూస్తుంటారు!