ఏముంది కరిగించనీకి..గుట్లా,గట్లా?
యిసుమంత కొవ్వుపొరలేనోళ్ళు
రెక్కాడందే డొక్కాడని
చెమటసంతకాలు
ఏనాడో రోడ్డునపడ్డోళ్ళు..
గాయాల్ని ఉండసుట్టి
సుట్టబట్టలేకుంట మోస్తున్నోళ్ళు
అలుపులేక సోళిపోతూ నడుస్తుండ్రు
గూటికో..కాటికో
నడుకకు మెతుకు సూపే నాయకులేరి?
నడుకకు బడ్జెట్ భరోసా కల్పిస్తదా?
★★★
వాళ్లు ఎన్నెముకై నిలబెట్టినోళ్ళు
నిట్టాడై మోసినోళ్ళు కదా దేశాన్ని
ఎండకు వానకు కందకుంట
కాపుకాసే భవంతులు
పాదం కములకుంట గమ్యం చేర్పే వంతెనలు, రోడ్లు
విలాసాల్ల ముంచెత్తే వాహనాలు, గృహోపకరణలు
వాళ్ళ స్వేదజలంల మొలకెత్తినయే కదా..
ఎట్లమరుస్తాం పెబూ!
ప్రళయాలు నేర్పే పాఠాలు ఒంటబట్టలేదా?
విపత్తుల తత్వం బోధపడలేదా తండ్రీ?
ఆధిపత్యపు,అహంకారపు మసకసూపులను
మానవత్వంతో కడిగి
మళ్ళోపాలి సూడుర్రయ్యా..
ఎప్పటికైనా అంతరించాల్సింది
మహమ్మారి భావజాలమే..
మనిషి కాదని తేటతెల్లమైతది.