నడక కైనా
పనికైనా
మేమేగా తోపులం!
దోచుట
దాచుట
సాతగానోల్లం!
సెమట బొట్లను
డబ్బు జబ్బున్నోల్లకు
ఇచ్చె అత్తరులం!
పూట కింత తిండి
పెయ్యిమీనో బట్ట
ఉంటే మేమే మా రాజులం!
కల్గిన దాంతో
పిల్లాజెల్లలతో
సుకంగా ఉండేటోల్లం
కరోనా
కనికరం లేనిది
లాక్డౌన్ ను తోలుకచ్చింది
సప్పట్లు కొట్టినం
దీపాలు వెట్టినం
అదేమన్న వలస జీవా?
పోవడాన్కీ!
దొరలు
ఆల్ల తాబేదార్లు
సాలినంత సంపాయించినంక గదా!
పోయేది
లచ్చల కోట్ల పాకేజీల
వలస కూలీల పేర్లు లేవాయే!
డెబ్బైయేల్ల సంత యేలుబడిలో
సెప్పుల్లేని నడకలాయే!!
యేలికల కంటే నేనేం తక్కువనా? అంటూ
సురక్కుమనే సూరీడి మంటకి
కాల్లు నెర్రెలు వాసిన
నడుమ నడుమ కాటికంపే
రైల్లు,లారీలు మస్తుగున్న
జనం నేతల కోతలే దప్ప
ఆదుకునే సేతులు కావాయే!
సేతులు కాలినంక
ఆకులు వట్టుకునుడు
మనోల్లకు అలవాటె గదా!
పొయేటోల్లు పోతరు
ఉంటె ఓటర్లైతరు
మల్ల నాలుగేండ్లకు గదా!
ఓటరు కూలీ అవసరము!!
అప్పటిదాంక ఈల్లకు యాదికుంటదా?