కరోనా...నువు
మా ముక్కుల్లో చేరకముందే
మా డొక్కల్లో
ఆకలి వైరస్ ఉంది
మా బ్రతుకుల్లో
కుల,మత వైరస్ ఉంది
కొత్తగా మేం భయపడేదేమి లేదు
ఎన్నో ఏండ్లుగా
అవమానాల్ని భరిస్తూ
తిండిలేక
నాడు రేగడి మట్టి బుక్కినం
నేడు గడ్డి తింటూ
చస్తూ బ్రతుకుతున్నాం...
అమెరికా దోపిడోల్లు
ఈ దేశమొచ్చినప్పుడు
గోడల చాటున
దాచిపెట్టబడినం...
కనిపించని నువు మాత్రం
మేమింకా ఈ దేశంలోనే
ప్రాణాలతోనే ఉన్నామని
అగుపించేలా చేశావ్...
ఈ దేశ పాలకులను
ప్రజా పీడకులుగా
ప్రపంచం కళ్లెదుట
పరిచావ్...
ఈ భూమిపై
దేవుడు దెయ్యం లేదని
తేల్చేశావ్...
ఇంకా మొక్కేటి మూర్ఖుల జూసి
'ఛీ' అన్నావ్...
కరోనా...
మేమెవరో నీకైనా తెలుసా
అడుక్కునే వాళ్ళం...
రోజూ వారి అడ్డా కూలోళ్లం...
కార్మికులం ఉత్పత్తి శ్రామికులం...
ఆత్మగౌరవ పతాకలం....
మేం ఆకలని అరిస్తే
అజ్ఞానాన్ని నింపారు
పనికి తగిన జీతమడిగితే
అవమానించారూ
అన్యాయమిదంటే
శిక్షించారు...
ప్రశ్నించడం మా హక్కంటే
దేశద్రోహులన్నారు...
మా పాలకులు నియంతలు
చంపడంలో నీ'యంతే'
మాకెలాగు తప్పదు.
కరోనా ...
నేటికి ఆకలితోనే ఉన్నాం
సామాజికంగా దూరంగానే ఉన్నాం
మా ఆకలి తీరేదాకా
అవమానాలు పోయేదాకా
పోరాడుతూనే ఉంటాం
మా ప్రాణాలు
నీ వంతో
ఆకలి వంతో
కుల మత వైరస్ వంతో
మేమైతే బ్రతికేందుకే పోరాడుతాం...
రేపు ఎలాగుంటది
ఒక్కటే ప్రశ్న
సమాధానాలు మాత్రం
వేరేందుకో?
రేపు నిన్నటికంటే
దుర్మార్గంగా ఉంటది
కష్టంగా ఉంటది
ఆకలితో ఉంటది
అవమానాలతో ఉంటది
భూమి తమలో
కలుపేసుకోవచ్చు కూడా
-ఓ పేదోడు
నష్టంగా ఉంటది
కష్టమేమీ కాదు
ఆకలి అంచుకు రాదు
అవమానాల ఊసుండదు
చావునే చంపొచ్చు
-ఓ ధనికుడు
మార్పు నిత్యం
జగమెరిగిన సత్యం
మనిషి ప్రకృతిని జయించాడు
ప్రకృతిలో ఓడిపోయాడు
సింగల్ నైట్ లో జరుగలేదేది
భూమి పుట్టుకకి
జీవి పుట్టుకకి
మనిషిగా రూపంతరీకరణకి
భాషకు భావాలకు
మతం గెలిచింది
సైన్సు ఓడింది
మతం గుట్టు రట్టయ్యింది
సైన్సు లేచి నిలిచింది
త్యాగాలు కోటనుకోట్లు
ఒక ప్రశ్నకి
ఒక్కటే సమాధానంకై
పాత సాంప్రదాయాలు
పాతిబెట్టబడ్డాయి
ప్రగతిశీల భావాలు
విశ్వ వ్యాప్తమయ్యాయి
ఆ ప్రశ్నతోనే
ప్రశ్నేప్పుడూ శాస్ర్తీయమే
ఒకే సమాధానాంకై
మనుషుల్లో సమానత్వం లేదు
వారి ఆలోచనల్లో కూడా
సమాదానాలందుకే వేర్వేరూ
నిజంగా
మనుషులమైతే
ఒకే ప్రశ్నకి ఒకే సమాధానంకై
కలబడదాం
రేపటికై
నిలబడదాం
సమనత్వంకై
1
పైలంగా వెళ్ళిరండీ!!
ప్రాణాలనే కాదు
పసిపిల్లలనూ
మూటల్లా
జబ్బలగ్గట్టుకొని
నెర్రెలువారిన పాదాలతో
మండుటెండలని
కన్నీటితో చల్లారుస్తూ
వందల కిలోమీటర్లు
దాటి
కన్నూరికి పోయే
వలస కూలీలారా
పోండి!
మళ్ళీ రండి!!
మీరు జేసిన కష్టం
యజమాని
మీకు చేసిన నష్టం
ధ్వంసమైన కలలు
కార్చిన కన్నీళ్లు
ఆకలికి జిక్కి
కాలి బూడిదైన మీ వాళ్ళు
ఏది...
ఏ ఒక్కటి
మరిచిపోకండి
పోండి!
మళ్ళీ రండీ!!
కరోనా తరుముతున్న
ఇంతటి విపత్కాలంలోనూ
ఆకలితో మాడ్చి
వీపుల్ని లాఠీలతో ఒలిపించిన
కారకులు పాలకులని
గుండె గుండెకు
చెరిగిపోకుండా చెక్కండి
ఈ దేశ నియంతల
బాకీ తీర్చుకొను
మీ పాదాల
ఒరలో దాచిన
కత్తులతో
మళ్ళీ రండీ!
తల్లి వేరూ పిల్ల వేరూ
మెలేసుకున్నట్టు
చేయూతనిచ్చి
ఆకలి పేగులకి
జీవం పోసిన
మనుషులను
మనస్సు నిండా
పలకరించేందుకు
మళ్ళీ రండీ!
పైలంగా వెళ్లి రండీ!!
2
రిలీజ్ ది పోయెట్ నౌ
అక్షరాలు
ఎరుపెక్కాయి
బెంగాల్
బంగ్లాదేశ్ వీధుల్లో
పదాలయ్యి
ప్రచారం చేస్తున్నాయి
వాక్యాల వారధులు
నిర్మిస్తున్నాయి
గాయాలని
గేయాలుగా వినిపిస్తున్నాయి
రాష్ట్రాలు
దేశాలు దాటి
దేహాల భావాలని
భౌతిక శక్తిగా మార్చి
నినదిస్తున్నాయి
నిర్బంధించబడిన
తోటి అక్షరాలని
అక్షరాలుగా మార్చిన
ప్రపంచ వస్తువులని
ఫాసిస్ట్
నియంతల నుండి
విడిపించి
అల్లుకొని
ఆసు పాటలో
చరణాలయ్యేందుకు
ఘర్జిస్తున్నాయి
సత్యాన్ని విలువల్ని
రేపటి చరిత్రలో నిలిపేందుకు
జాతి కుల మతాల్లేకుండా
లింగ ప్రాంత భేదాల్లేకుండా
మనుషుల్ని మనుషులుగా
గౌరవించాలని
ప్రశ్నించే ప్రజాగొంతుల
గొంతు కోయద్దని
సాగుతోంది
అక్షర యుద్ధం
కదలిరా...
నువ్వో అక్షరమై
ప్రజల ప్రజాగొంతుల
విడుదలకై
(భీమా కోరేగావ్ కుట్ర కేసులో నిర్బంధించబడిన ప్రజాస్వామిక వాదుల్ని కవులు,లాయర్లు,
ప్రోఫెసర్లు,దళిత,ఆదివాసీ ప్రజలందరిని విడుదల చేయాలని బెంగాల్,బాంగ్లాదేశ్ కవులు "రిలీజ్ ది పోయెట్ నౌ" అంటూ చేస్తున్న కాంపెయిన్ కు మద్దతుగా నా అక్షరాలు...)
3
మేమిక్కడా-మీరక్కడా
మేమిక్కడా-మీరక్కడా
జైళ్లోనే ఉన్నాం
మేం భయంతో
మీరు గర్వంతో
మేమిక్కడా-మీరక్కడా
ఆలోచిస్తూనే ఉన్నాం
మేం భయటికెట్లారావాలని
మీరు ప్రజల లోపలికెట్లాపోవాలని
మేమిక్కడా-మీరక్కడా
రాస్తూనే ఉన్నాం
మేం విలాప గీతాలని
మీరు విముక్తి గీతాలని
4
కవి
అతనికి
పక్షులంటే చాలా ఇష్టం
తియ్యగా పలుకుతాయని
స్వేచ్ఛగా ఎగురుతాయని
ఓ రోజు
దారెంట నడుస్తున్నాడు
పంజరంలో
బంధించబడిన
పక్షుల చూసాడు
తనకు ప్రాణం పోయినట్టనిపించింది
ప్రతీ జీవి
స్వేచ్ఛగా బ్రతకాలని
దాని హక్కదని
గట్టిగా అరిచాడు
మృగాలను ఎదురించి
బంధీగున్న పక్షులను
విముక్తి పథానికి నడిపించాడు
అది నేరమని
క్రూర
మృగరాజ్యం
తనని ఖైదు చేసింది
కసి కసిగా
స్వేచ్ఛా నినాదాలతో
దూసుకొస్తున్న
పక్షుల గుంపు
తమని విడిపించినతని
విడుదలకై
5
చెల్లను గాక చెల్లను
కాలాలు పరుగెత్తుతున్నా
సంవత్సరాలు పారిపోతున్నా
కష్టాల కన్నీటి సాగరాలు
సునామిలై
ముంచేస్తున్నా
నలుదిక్కుల ఆంక్షలు
సంకెళ్ళై
తొక్కేస్తున్నా
కన్న పిల్లల కోసం
నిలువెత్తు
ఉక్కు రూపాలై
ఎవరి సాయమందకున్నా
నమ్ముకున్న
వ్యవసాయం కై
నిత్యం నేటికీ
పొలాలల్లో
గింజలై మొలకలై
తిండిపెట్టే పంటలై
అకలిని తీర్చే
అవని పుత్రికలు
నా తల్లులు
నేనేం రాసినా
చెల్లను గాక చెల్లను
మిమ్ము రాయకుండా
మీ దుఃఖాన్ని చేరిపేయకుండా
అమ్మలారా...అయ్యలారా...
మీ ఇంట్లో బురదెయ్యాలని
మిమ్ము ముంచెయ్యాలని
రోగాలు అంటియ్యాలని
నాకేమాత్రం లేదు
నా మీద ఉమ్మకండి
నాకు వేరే దారిలేదు
నా బాటలో సాఫీగా
సవ్వళ్లతో సాగేదాన్ని
పంట చేల దాహం తీర్చి
ప్రజల పాదాలను తాకి
పసి మనస్సు పరవళ్లతో
తల్లి సంద్రపు ఒడికి
నిరాటంకంగా చేరేదాన్ని
నా దారులు మూశారు
అడ్డుకట్ట లేశారు
అక్రమంగా నా జాగన
అద్దాల మేడలు నిర్మించినారు
వంపులున్న గరీభోని
మీదికి ఎగదోసినారు
మీ ఇల్లు కూలిపోతే
మీ పంట మురిగిపోతే
మీ రోడ్డు గండి కొడితే
మీ రోగం ముదిరిపోతే
నా మీద ఉమ్మకండి...
నాకేమాత్రం అర్హతలేదు
అర్హులు వస్తున్నారదిగో...
పర్మిషనిచ్చినోడు...
పైసలు తిన్నోడు...
అబ్బో...
నటనలో ఆస్కార్లు
మీరు ఓటేసినొళ్లు
మిమ్ము కాటేసేటోళ్లు
మీకికనైనా చాతనైతే
కసిగా గురిజూసి ఉమ్మండి
వరంగల్లో
వరదెందుకాగిందని....
విద్రోహమే విద్రోహమే
ముమ్మాటికీ విద్రోహమే
చారిత్రక సత్యమిది
తెలంగాణకి ద్రోహమే
నెహ్రూ పాలనలో పటేలు సైన్యాలు నరహంతక నైజాముల మారణహోమపు ఘట్టం....
భూమి భుక్తి విముక్తికై
సాగే సాయుధ పోరునణిచి
ఆపరేషన్ పోలో తో
పటేల్ సైన్యాలు నైజాం రాజకార్లు
ప్రజలపైన విరుచుకపడి
మాన ప్రాణాలనే తీసి
ఊచకోత కోసిన రోజది
మతోన్మాదుల్లారా....
మీకు విమోచన సంబరాలా?
ఎర్ర మందారాలు పంచిన
పది లక్షల ఎకరాలను
తిరిగి దొరలకు అప్పజెప్పి
జనాల వెట్టికి నెట్టి
అధికార దాహంతో
నిజాంకు భరణమిచ్చి సాగనంపి
స్వతంత్ర తెలంగాణ ఆత్మగౌరాన్ని చంపి
దురాక్రమంగా యూనియన్లో కలిపిన దినమిది
అగ్రకులోన్మాదుల్లారా...
మీకు విలీన సంబరాలా?
విద్రోహమే విద్రోహమే
ముమ్మాటికీ విద్రోహమే
చారిత్రక సత్యమిది
తెలంగాణకి ద్రోహమే
నెహ్రూ పాలనలో పటేలు సైన్యాలు నరహంతక నైజాముల మారణహోమపు ఘట్టం....
చీకటే భయపడే
చిమ్మచీకటిలో
గాలికి ఊపిరాడని
శూన్యంలో
వేసవిని తలపించే
వేడిలో
వ్యాధిగ్రస్తమైన అవయవాల
అవస్థతో
అండాసెల్ లో
ఆమరణ దీక్షలో
ప్రో.సాయిబాబా
ప్రశ్నిస్తున్నాడు
విపత్కాలంలో
నిర్మానుష్యంలో
చదువుకొను వార్త
పత్రికడిగితే నేరమా...?
కుటుంబీకులకు మిత్రులకి
రాసిన ఉత్తరాలపై నిషేధమా...?
కనీస వైద్యం అందించరా...?
న్యాయవాదుల కలిపించరా...?
నన్ను జీవచ్చవంగా మార్చి
చిత్రవధ చేస్తున్నారు
ఇదేనా జైళ్ల సంస్కరణా...?
చెప్పు రాజ్యమా
చెప్పు సమాధానమని
ప్రశ్నిస్తున్నాడు
మిత్రులారా...మీకు తెలుసు
తనకు సానుభూతి
అస్సలు నచ్చదు
సంఘీభావంగా
నిలబడమంటున్నాడు
న్యాయమే
నినదించమంటున్నాడు
రాజ్యహింస లేని
సమాజం కోసం
ఉద్యమించమంటున్నాడు
రండి...మిత్రులారా
20.10.2020
( ప్రో.సాయిబాబా రేపు చెయబోతున్న ఆమరణ దీక్షకు సంఘీభావంగా...)
చేయవలసింది
ఉత్సవం కాదు
చేయాల్సిందిప్పుడు
సమీక్ష...
గతానికైన
గాయాన్ని
వర్తమాన
శిక్షని
భవిష్యత్
బాధని
సవివరంగా
చేయాల్సిన
సమీక్ష
అజ్ఞాన తాయత్తు కట్టి
జోగిని బసివిని మాతంగుల జేసీ
దేవుని కుతి దీర్చమంటూ
అందాల ఆటబొమ్మల జేసీ
కార్పొరేటోడికి తాకట్టుపెడుతూ
రంగు రంగుల ముగ్గుల్లో
విషపు పొగల
క్లబ్బుల్లో పబ్బుల్లో
ఉక్కు గొలుసులతో
బంధించి
ఉత్సవానికి పిలుస్తారు
మీరు వెళ్ళకండి...
మహిళ బతుకు కాదది
అవనియంత పరిచి
ఆకాశమంత పొగిడి
పాతాలానికేసి తొక్కుతారు
జర పైలం....
కొత్తగా పుట్టింది కాదిది
మనువాద పితృస్వామ్యం
నీపై చేసిన ఆధిపత్యం
కత్తుల్తో చర్మమొలిచినట్టు
హక్కులన్నీ ఒక్కటొక్కటిగా
కాల్చేసింది పూడ్చేసింది
కట్టు కథలు కుట్ర కథలు
రోత పురాణాలు
పతివ్రత మంత్రమేసి
పరువును ఆపాదించి
గడప దాటకుండా
సూదిమొనల గీత గీసింది
బాల్యంలో
తండ్రి దగ్గర
యవ్వనంలో
భర్త దగ్గర
వృద్ధాప్యంలో
కొడుకు దగ్గర
బ్రతుకంతా
మగాడి బ్రతుకు కిందాని
ఆదేశించింది
కన్యాశుల్కం
సతీ సహగమనం
వితంతు విహహ రద్దు
దాసీ వ్యవస్థ
ఒక్కటి కాదు లెక్క లేనన్ని
దురాచారాలు...
తీసిన ప్రాణాలు
ఏ మట్టిని తాకినా చెప్తాయి
తరాల కాలగమనం జరిగింది
ప్రాణమొక్కటే మిగిలినప్పుడు
పోరాటమే సరైంది...
ఎందరో వీరవనితల పోరు ఫలితం
ప్రపంచ స్వేచ్ఛా పోరాటం...
నియంతల పాలననణిచి
శ్రమ దోపిడి లేని
ఎట్లాంటి భేదాలే లేని
అందరూ సమానంగా బ్రతికే
ప్రజా స్వపరిపాలనకోసం
త్యాగాలు కోకొల్లలు
మహిళా ప్రత్యేక చట్టాలు
చుట్టూ రక్షణ వ్యవస్థ
శాస్త్ర సాంకేతిక వృద్ధి
అన్నీ రంగాల్లో భాగస్వామ్యం
అయినా ఏం మారింది
పట్ట పగలే పసిపిల్ల మొదలు
పండు ముసలి పై అత్యాచారాలు
అక్షరాస్యత ఎంతున్న
మనువు మూర్ఖత్వం తలకెక్కిచేసే
గృహ హింస వరకట్న వేధింపులు
వేల సంవత్సరాల ....
దురాచార పర్వమింకా వేటాడబట్టే
ఎంత చెప్పినా
ఒడువని దుఃఖమిది
ఆడజాతిని అమాంతంగా
అంతంచేసే కుట్రలు
పురుషాధిపత్యం అణిచేసిన
బ్రతుకులు ఏమని చెప్పగలం?
తల్లీ... జర పైలం
ఉత్సవం కాదిప్పుడు
చేయాల్సింది
సమీక్ష...
శ్రామిక మహిళా
పోరాట చరిత్ర సమీక్ష...
స్త్రీ పురుష సమానతకు
చేయాల్సిన సమీక్ష
మతోన్మాదమెంత
మొరిగినా
రవ్వంత బెదరని
చూపులు
కావాలీ లోకానికి
నిషేధాజ్ఞలెంత
నీల్గినా
నిన్నుగా నిలబెట్టే
నినాదమే
కావాలీ జగానికి
విద్వేషమెంత
రెచ్చినా
భిన్న సంస్కృతుల
ప్రేమించే రాజ్యాంగమే
కావాలీ దేశానికి
09.02.2022
ఎందయ్యో...ఇంకా లేవకపోతివి. సుట్టుపక్కల పొరగాళ్ళు కాగితాలు సేయించుకోవట్టే. సిగ్గనిపిత్తలేదా....లే...గియ్యాల్నన్నా సేపియ్యరాదు...అని గరంగరంగా మల్లమ్మ భర్తపై కారాలు మిరియాలు నూరుతున్నది.
"నీ యవ్వ ఏం ఒర్రుతానవే...నీ అయ్యిచ్చిండు పదెకురాలని ఎగురుతానవా...ఎకరం భూమికే ఏతుల్ జెత్తానవ్ బాగా.నోర్ముయ్ సేపిత్తగాని."అంతే గరంగా కయ్యిన లేసిండు మల్లయ్య.
అవ్వో...నీ మొఖానికి నేనే ఎక్కువ.ఇంకా భూమి గావాల్న.ఉన్నది జెయ్య శాతనైతలేదు గాని.ఇగురం లేదు.ఇగురం దక్కువ ముండకొడుకా...ఇయ్యాల్నన్న పో...కోపం ప్రేమను కలిపి బాధ్యత గుర్తు చేసింది మల్లమ్మ.
ఆ చివరి మాటతో "ఐతేమానే గానీ... పో...గా జాబుల వెట్టిన కాగితాలు తేపో పోతా..." అని సప్పున సల్లారిండు మల్లయ్య
ఆమె తెచ్చియ్యగానే ఆ కవర్ లోనున్న కాగితాలన్నీ చూసుకొని బజార్ కి బయలుదేరుతాడు మల్లయ్య.
*********
"ఓ సిగ్గుదక్కువోడా...కొద్దిగన్నా ఏమనిపిత్తలేదా సెత్తకు.ఊరంతా కాగితాలు సెయించుకోవట్టే. ఇజ్జత్ ఇరాము లేకుండా కుడిదిలెక్క తాగుదమని అచ్చినావ్.నీ తాగుడుమీద మన్నువడా..."భర్తను వెతుకుంటచ్చి మరి తిడుతున్న రాజమ్మ.
"నీ యవ్వ మందిలకచ్చి ఇజ్జత్ దీత్తనవ్...ఛల్ నడువ్ నీ యవ్వ.పో అత్తాన గాని పో.గా కాగితాల ముచ్చట అరుసుకుందామనే అచ్చిన ఈడికి..."అంటూ ముసి మూసి నవ్వు కోపం కలగలుపుకొని చెప్పిండు రాజయ్య.
నీ మొఖం జూసినా గట్లనే ఉన్నది.తాళ్ళల్లా మాట్లాడుదమని అచ్చినవా...నువ్వైతే ఇయ్యాల గనుక కాగితాలు సేపియ్యలేదనుకో బుడ్డ పోరిని దీసుకొని మా అవ్వగారింటికి పోత.నీ ఇట్టం ఇగ.ఈడ్నే తాగు...బొర్రు...ఈడ్నే పండు..."అని వార్నింగ్ ఇచ్చింది రాజమ్మ.
"ఆ సేపిత్తగాని పో...మందిల ఒర్రకు."అని రాజమ్మ వార్నింగ్ కి తలొగ్గి జేబులున్న కాగితాలు చూసుకొని బజార్ కెక్కాడు రాజయ్య.
*********
నడుచుకుంటూ వెళ్తున్న మల్లయ్య బజార్ పైకి వచ్చిన రాజయ్యను చూసి..."అరేయ్ మామా ఎటు పోతానవ్ రా" అన్నాడు.
"మీ సేవ కాడికే...కాగితాలు జెపియ్యాలే...నువ్వేటో బయలెళ్లినవ్..."అన్నాడు రాజయ్య.
"నేనూ గాడికేరా...నీను గూడా అత్తాగు."అన్నడు మల్లయ్య.
"దా...బండి మీద కూసో..."అంటూ రాజయ్య మీ సేవ కాడికి బండి పోనిచ్చిండు.
మీ సేవ దగ్గర జనమంతా భారీ లైన్ కట్టిండ్రు.అక్కడికి మల్లయ్య,రాజయ్య లు చేరుకుండ్రు.
"అరేయ్ మామా... మందెక్కువున్నరు గదరా...ఎంత సేపైతదో జర అడుగురా..." బండి దిగుకుంటా అన్నడు మల్లయ్య.
బండి పక్కకు బెట్టి "సరే మామ" అనుకుంట "ఓ రమేషన్న మా మల్లయ్య మామది,నాది రెండు కాగితాలున్నాయ్.జర తీస్కొరాదు"అన్నడు రాజయ్య.
"తీస్కుంట గానీ...గంటా,రెండు గంటల టైం పడ్తది.ఆ పేపర్లిచ్చి లైన్ల నిలబడుర్రి."అన్నడు మీ సేవ రమేష్.
"సరే అన్న...మర్సిపోకు ఈడ్నే కూసుంటాం...జర పిలువు మరి"అంటూ రాజయ్య ఇద్దరి కాగితాలను ఇదివరకున్న పేపర్ల కింద పెట్టి లైన్ లోకి వెళ్లి మల్లయ్య మామ ను పిలుసుకున్నాడు.
మల్లయ్య మాంచి వాగుడుకాయ. రాజయ్య అవసరానికి మాట్లాడేటోడు.ఇద్దరు వరుసకు మామ అల్లుళ్లు. కానీ ఇద్దరు మామా మామా అని పిలుసుకోవడం వాళ్ళకలవాటు.
"అరేయ్ మామా...గీ రైతు బంధు ముచ్చటెందిరా...?"అంటూ మల్లయ్య ముచ్చట మొదలుబెట్టిండు.
"గదా మామ, మనకు యవుసానికి పెట్టుబడికి తిప్పలయింతది గదా...గందుకే సర్కారు ఎకురానికి ఐదు వేల రూపాలిత్తాంది...." అన్నడు రాజయ్య.
"నాకు రొండెకురాలు,నీకేమో ఎకురం భూమి.మనకు ఎంతత్తయిరా.తిప్పి తిప్పి గొడితే ఉరియా బత్తాలకు సాలయి. వాడిచ్చేదేందిరా...తోక మట్టా..." అన్నడు మల్లయ్య.
"నీ యవ్వ...ఏదో అడుగముందుకే రైతులాదుకోను సర్కారిత్తంటే గట్ల మాట్లాడుతానవ్.ఎవడన్నా ఇచ్చిండ్ల గిట్లా...పిలిసి పిల్లనిత్తెనటా...అన్నట్టున్నది నీ యవ్వారం"అన్నడు రాజయ్య.
"గది కాదుర మామ...నీ అసొంటోనికి,నా అసొంటోనికి ఈకకు రాకపోయినా,తోకకు రాకపోయినా పైసలతోని పాయిదా ఉంటది.దానికో అర్థముంటది. ఎవుసం జేయనోడు కూడా పైసలు తింటాండు కదరా...గట్ల పైసలన్ని దండుగనే కధా" అని ఆ పథకంలోని మర్మాన్ని పట్టిండు మల్లయ్య.
"గదంతా నీకెందుకే... నీకు బెట్టింది నువ్ దినక.అన్ని అక్కేర్రాని ముచ్చట్లు పెడ్తవు.పని లేదు నీకు" అని చిరాకుతో అన్నడు రాజయ్య.
వీళ్ళిద్దరూ మాటలు వింటూ అదే లైన్ లో కూర్చున్న కార్తిక్ కలుగజేసుకొని...మల్లయ్య మొఖం జూస్తూ...
"బాపూ... నువ్ జెప్పింది,అక్షరాల నిజం.ఎనుకట తెలంగాణ రైతాంగ పోరాటంలో దొరల కాన్నుండి భూములు గుంజుకొని జనానికి పంచ్చిండ్లు గదా.ఆ భూములని తిరిగి వాళ్ళకే చట్టబద్ధంగా అప్పజెప్పేందుకే గీ పథకం.ఇది రైతుకు బంధువు కాదు.రైతుల భ్రమలో పెట్టేది.
సరే...ఒక్కమాట మనకోసమే అనుకుందాం...పెట్టుబడి కోసమే ఇత్తానమని జెప్పిండ్రు గదా.మరి గా ఇరవై,వందల ఎకురాలు ఉన్నోడికి పెట్టుబడి పెట్టుకునేంత లేదా?సర్కారిచ్చుడెందుకు?ఇట్లా రాష్ట్రం మొత్తంల పెద్ద కులపొల్లు,బాగా డబ్బున్నోళ్లు వందల ఎకురాలకు పట్టాలు జెపిచ్చుకొని లక్షల రూపాలు ప్రజల సొమ్ము తింటుండ్రు.ఇది బాపు సెప్పినట్టు నిజంగా దండగ ఖర్చే.ఆ పైసల తోని నా అసొంటోనికి నౌకర్లియ్యచ్చు కదా,సర్కార్ బళ్ళన్ని బాగు చెయ్యచ్చు కదా,ఇంకా రైతులు పండించిన పంటకు తగ్గ గిట్టుబాటు ధర కల్పిస్తే సాలదా.కానీ చెయ్యరు.ఇది బలిసినోడికే బలం కూడబెట్టేది.పేరుకు మాత్రమే పేదోళ్లకు.ఏదో యవుసాన్ని ,రైతును ఉద్దరిస్తున్నట్టు.రైతు బంధు- రైతుల పెట్టుబడి సహాయర్థమని ప్రగల్భాలు పలుకుతున్నారు"అంటూ అస్సలు నిజాన్ని,ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని విడమరిచి చెప్పిండు కార్తిక్.
"నిజమే బాబు.సోయి లేని సర్కారు.మనం ఓటేసినం.వాడు పోటేసిండు. బతుకు పాడుగాను పెనం మీంచి పోయిల వడ్డట్టాయే..."అని తన నిస్సహాయతను బయటపెట్టుకున్నడు మల్లయ్య.
"అవునే మామ...మళ్ల ఓట్లకు రారానే కొడుకులు.అప్పుడు జెప్పుదాం వీళ్ళ సంగతి."అంటూ మనస్సు మార్చుకుని వంత పాడాడు రాజయ్య.
ఇట్లా...ఎన్నెన్నో రాష్ట్ర సంగతులు మాట్లాడుకుంటున్నరు.అంతలోనే మీ సేవ రమేష్ "మల్లయ్య"అని పేరు పిలిచిండు.
"జనమంతా ఒక్కదాటి పైకి వత్తె,మన కట్టాలు ఎంతరా...గది జరుగాలే" అనుకుంటూ లేచి వెళ్ళాడు.ఆయన వెంటే రాజయ్య లేసిండు.
సాదా బైనమా కి సంబంధించిన కాగితాలను అప్లై చేసి ఇద్దరూ బండిపై ఎక్కి ఇంటి ముఖం పట్టారు.
ప్రియమైన నా తరం పాఠకులారా...
మీకో నాటకం గురించి చెప్పాలనుకుంటున్నా. నేను రాసింది కాదు,చదివింది. అద్భుతమైనదని చెప్పడానికి కాదు, చాలా చాలా అవసరమని చెప్పడానికి.ఎందుకంటే ఇందులో సజీవమైన రచన వస్తువు ఉంది. సజీవమైన ప్రజల భాష ఉంది.మనువు కుట్రతో పెట్టిన కట్టుబాట్లతో కనీస అవసరాలకు దూరమైన మనిషి బాధ సజీవంగా ఉంది.అందుకే ఈ రచన ఈ తరం పాఠకులకు,రచయితలకు చాలా అవసరమని భావిస్తున్నా.మూడు వంతుల నీరున్న భూమిపై త్రాగేందుకు నీరు తాకని ప్రజలున్నారు. నీళ్లను తాకనివ్వని మూర్ఖులున్నారు.ఈ కుట్రను తిప్పికొడ్తూ ఫూలే దంపతులు అంటరానివాళ్ల కోసం బాయి తవ్వించారు.బి ఆర్ అంబేడ్కర్ మహాద్ చెరువు(1927.మార్చి.20) పోరాటం చేసిండు.అయినా వివక్షా పోలేదు.అందుకే మళ్ళీ మళ్ళీ ఈ మను కుట్రలను చేధించాల్సిన అవసరమూ ఉంది.అంతేకాదు నేటికి దాహంతో నిస్సహాయంగా ఎదురుచూసే గొంతులు తడపాల్సిన బాధ్యత ఈ తరం మనుషులపై ఉంది.దాన్ని గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం.ఇందులో నా అనుభూతి తప్ప మొత్తమంతా రచయిత అక్షరాల అల్లికనే.ఇది సమీక్ష కాదు,కేవలం నా అనుభూతి మాత్రమే...
2004లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు "THIRST" పేరుతో అచ్చువేశారు. HCU లో M.A ఇంగ్లీష్ సాహిత్యంలో, ఎంఫిల్ సెమినార్ పేపర్ గా ఉండటమే కాదు,తమిళనాడులోని తిరువళ్వార్ విశ్వవిద్యాలయం M.A సిలబస్ గా ఉంది. అంతే కాదు చదివిన వారి గుండెల్లో... వివక్షననుభవిస్తున్న దళితుల జీవితాల్లో ఉంది... ఇదే నేను మీకు చెప్తానన్నా "దాహం" ...డాక్టర్ M.M వినోదిని గారు రాసింది. 31 పేజీల్లో, 20 పాత్రలతో,5 సీన్లలో సజీవంగా అద్దిన దళిత మహిళ ఆత్మగౌరవ పోరాటం దాహం. వాస్తవ రూపం...
దాహం నాటకం కాదు, జీవితం. చేయని నేరానికి ఊరికి దూరంగా వెలివాడ లో ఉంటూ శిక్ష అనుభవిస్తున్న వారి జీవితం.హక్కుగా దక్కాల్సినది అగ్రకులాలు లాక్కుంటే దక్కించుకొను నేటికీ న్యాయంగా పోరాడుతున్న వారి జీవితం. దాహం తీరనిది కాదు,తీరేదే,అంతకన్నా దక్కేది.దక్కించుకునేది.
రచయిత దాహం నాటకంలో గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. నాటకం కథా విషయానికొస్తే దళితవాడలో చీరగ్గట్టిన ఉయ్యాలలో పిల్లవాడు ఏడుస్తున్నాడు...పెద్ద రెడ్డి కోడలికి పాలు పడకపోతే ఆయన మనవడికి పాలివ్వడానికి గంగమ్మ వెళ్ళిపోతుంది...తాగే మంచినీళ్ల కోసం పొద్దున వెళ్లి మిట్ట మధ్యాహ్నమైన నీళ్లు దొరక్క తన్నులు తిని "సంపుతున్నర్రో" అనే కేకలతో... శౌరమ్మ ఏడుపు తో దాహం మొదలవుతుంది.వాడ ఇట్లాగే దుఃఖంతో వాస్తవంగా మేల్కొంటుంది...
గ్రహాలన్నీ గుద్దుకున్నట్టు, భూగోళం బద్దలైనట్టు వార్త ఊరంతా పాకింది. వాడ పైకి వచ్చింది. పెద్ద మాల వచ్చిండు ఎట్లా జరిగిందని అడగడమే కాదు, పెద్ద రెడ్డికి కోపం వచ్చిందని నీ భర్తను రమ్మన్నాడటాని అన్నాడు. శౌరమ్మకు అర్థం కాలేదు"నేనేం జేశానయ్యా... పొద్దుట్నుంచి నిలబడి నిలబడి ఎండకి తులూడోస్తంది.ఇంకా మొయినంగా లేసి జూశా...బాయి ఖాళీగా ఉంది అటూ ఇటూ జూశా... యెవురు గనబళ్ళా.. గబగబా గట్టెక్కి తూర్పు గిలక మీద చేదేశా అంతే...యాడ్నుంచి వూడి పడ్డాయో గాని... గద్దలు ధట్టెం మీద వాలినట్టు వచ్చి పడ్డయ్.. లంజలు... ముందు ఆ దూడ బాతు మొకంది వొచ్చింది నోటికొచ్చినట్టు తిట్టుకుంట... కుక్కలెగబడ్డట్టు ఎగబడినయ్. నా కులం తక్కువ దాన్నంట. కట్ట యెక్కగూడదంట.ముట్టగూడదంట.అసలూ బాయి వాళ్ళదేనంట.నాకు మండిపోయిందనుకో...ఇగ ఆపుకోలేకపోయ్యా..యెవురి బతుకులేందో అందరికి తెలుసన్నా. కుట్ర చేస్తే ఏదైనా అప్పనంగా నే వచ్చుద్దన్న. మేం కూడా ఊరోళ్ళమే... బాయి మాదిగోడా అన్న.. ఊర్లో మడుసులది గాని వూరి చివరి పందులది గాదన్నారు. మడుసులు సత్తన్న నీళ్లు బొయ్యరు మీరే పందులన్న... అంతే ఇంగా వజాన మీదకి దూకి యెదర్రొమ్ము మీద చెయ్యేసి కిందికి నెట్టేశారు.బిల్ట ఈటుగా పడ్డా... ఇష్టం వచ్చినట్టు కుమ్మేరు. కాళ్లతో ఎగిరెగిరి తన్నేరు.. జుట్టు పట్టి ఈడ్చేరు.. కుండెత్తి పగలనూకి దిక్కున్నకాడ చెప్పుకోమన్నారు దుఃఖం ఆగలేదు" అంటూ ఏడుస్తుంది...శౌరమ్మ.
కుండ నీళ్లు దక్కకుండా చేసిన కుట్ర. కుళ్ళిన హృదయాలున్న అగ్రకుల భావజాలపు మనుషులు. శౌరమ్మ నోటికొచ్చినట్టు తిట్టింది. మొదలే తిట్టలేదు. అదే ప్రపంచ నేరం అయింది. మెదడున్న ఎవరైనా ఆలోచిస్తే శౌరమ్మ తప్పు లేదని తెలుస్తోంది. కానీ ఇది కట్టుబాట్లకు పుట్టినోనికి జరిగిన నేరం. క్షమించరాని నేరం. శిక్ష వేయాల్సిందే. ఇలాగే చిన్నగా మొదలవుతుంది.నేరం మోపడానికి వాళ్లకు సాకుకావాలి.దొరకబట్టారు.
ఊరి కట్టుబాట్లు తెంపింది కాబట్టి పంచాయతీ చేయాలన్నారు పెద్ద రెడ్డి,వెంకట్ రెడ్డి... పది వేల జరిమానా లేదంటే బట్టలిప్పి శౌరమ్మను ఊరంతా తిప్పు తామన్నడు.శౌరమ్మ భర్త నర్సయ్య పెద్ద రెడ్డి ని ఎంత ప్రాధేయపడినా ఒప్పుకోలేదు.అగ్రకుల తత్వం అంటే ఇదే. అగ్రకుల భావజాలాన్ని మోస్తూ తమ సంపదను పెంచుకోవడం, అధికారాన్నీ అహంకారాన్నీ, జులుం ని ప్రదర్శించడం.నీతిమాలిన తత్వం.చదివే వాళ్లకు పిచ్చి కోపమొస్తుంది.నువ్వు మనిషివేనారా...అని గళ్ళ పట్టి తన్నాలనిపిస్తది.నిజాన్ని రచయిత అలా రాసారు మరి...
దళితవాడ సమీక్షించుకుంటున్నది. గతాన్ని తడుముకుంటున్నది.మా అమ్మ చేసింది తప్పు కాదని వాళ్లను ముక్కలు ముక్కలుగా నరుకుతానని ఆవేశంతో ఉరకలేసే దాసుకు గతం ఆలోచింపజేయడమే కాదు ఇంకా పదునెక్కిస్తుంది.ఆవేశంతో వూరి దొరలకి ఎదురు పోయిన చిన్నాన్న ఏమయ్యాడో? తాత కన్నీటితో చెప్తాడు. ఎవరు చంపారో? ఎందుకు చంపారో?పుష్పమ్మ, పున్నెమ్మ లు,మాలపల్లి పెద్దలు విడమర్చి వివరంగా చెప్పారు. కన్నీటితో చెప్పారు.కల్పించి కాదు వాస్తవాన్ని వాస్తవంగా నిజాయితీగా చెప్పారు.
భగభగ మండే ఎండాకాలంలో ఊరంతా గుక్కెడు నీళ్లకోసం రోదిస్తుంటే పెద్ద రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి మాలపల్లి వచ్చిండు ఆశ్చర్యమే! ఊరంతా తిరిగినా(భూమి ఎవ్వరూ ఇవ్వలేదు కావొచ్చు) నీళ్ళు ఎక్కడ పడకపోతే మన వాడకొచ్చిండు. అందరికీ నీళ్ల కోసం బాయి తవ్వుదామని మన మంచం లో కూర్చొని మాట్లాడి, తెల్లారి కొబ్బరికాయ కొట్టిండు మరోమారు రాలేదు.ఊరంతా నాలుగు రోజులు బాయి చుట్టూ పెకిలించి పోయారు.వాళ్లు కూడా మళ్ళీ రాలేదు. మాలపల్లె మొత్తం రెక్కలు ముక్కలు చేసుకొని పిల్ల జల్లతో చెమట చిందించి బావి తవ్వారు.పుష్కలంగా నీళ్లు పడ్డాయి.ఊరి బాయికి నాలుగు గిరకలు కాదు, మాకు ఐదో గిరకుండాలి.రేపు రేపు ఎట్లా ఉంటుందోనని దాసు చిన్నాన్న పట్టుబట్టిండు. విషపు మనిషి సుబ్బారెడ్డి మనసులొకటి పెట్టుకొని సరేనన్నాడు.బావిపై గిరకేసి చేదెయ్యగానే కొయ్య విరిగింది.పురోహితుడు వచ్చాడు. కడజాతి వాడు ఊరోళ్లతో సమానంగా నీళ్ళు తాకరాదు. గంగమ్మకు కోపం వచ్చింది. కాదని తాకితే గంగ లోపలికి వెళ్ళి పోతుందని కుట్ర రాజేసిండ్రు.
ఎంతటి దుర్మార్గం? ఎన్నో రోజుల నుండి కష్టపడి తవ్విన బాయి లోని పుష్కలమైన నీళ్లు దూరమయ్యాయి.కాదు కాదు దూరం చేశారు.ఎంతటి మూఢ నమ్మకాన్ని పేర్చారు చూశారా... తాగితే నీళ్లు లోపలికి పోవడమేంటీ? గుండె రగులుతోంది కదా నాకైనా మీకైనా.దాసు చిన్నాన్న సుబ్బారెడ్డిని నిలదీసిండు. కొయ్య కొత్తదె య్యకుంటే బాయి పూడుస్తానన్నాడు.అన్యాయాన్ని ప్రశ్నించాడు ఇదీ నేరమే.తెల్లారి చెట్టుకు శవమై వేలాడాడు చిన్నాన్న.దాసు రక్తం ఇంకా ఇంకా మరుగుతున్నది.గతాన్ని చూసి భయపడుకుంటా మీరు బ్రతికిండ్రు కానీ నీ మేం అలా బతుకం. పోరాడుతాం అన్నాడు దాసు. యువకులంతా ఏకమయ్యారు. రేపు పంచాయతీలో మేమే మాట్లాడుతమన్నారు. ఏం చేయాలో వాడ ప్రజలకు వివరంగా చెప్పిండు దాసు.తెల్లారి గుంపుగా వాడంతా వెళ్లారు.
నేరస్తులు రాజ్యమేలుతున్నారు కులమే అధికారంగా బ్రతుకుతున్నారు.రాజులాగా తీర్పిచ్చేందుకు సిద్దంగానున్న పెద్ద రెడ్డి సీన్ రివర్స్ అయ్యింది."అయ్యా బాంఛాన్ " గాకుండా ఏయ్ రెడ్డి అన్నారు. పెద్ద రెడ్డి గుండెఝల్లుమంది కావచ్చు. అయినా కూడా సవరించుకొని జరిమానా అడిగిండు పెద్ద రెడ్డి.దాసు,చంద్రయ్య,రాజు, దిబ్బడు, ప్రసాద్ లు ప్రశ్నల బాణాలు కురిపిస్తున్నారు.జరిమానా ఎక్కడిది?భరించలేకపోతున్నారు. పెద్ద రెడ్డి,వెంకట్ రెడ్డి,చిన్న రెడ్డి. ఏంరా పాత కథలు మర్చిపోయిండ్రారా?అంటే అందుకే వచ్చినమన్నరు మాలపల్లె యువకులు. అంతేకాదు ఏయ్... పిల్ల రెడ్డి, పిచ్చి రెడ్డి ఎక్కువ మాట్లాడకండి. మీకంటే మాకు బాగోచ్చు మాటలు.చేతలంటావా మేం రోజు చేసేది అదే.జాగ్రత్త లేదంటే నరుకుతామంటున్నారు యువకులు.ఇదంతా కాదురా జరిమానా ఏది రా?అని మళ్ళీ అడిగిండు పెద్ద రెడ్డి. జరిమానా ఎందుకు దాసు మళ్ళీ ప్రశ్నించాడు.బాయి ఎక్కడమే కాకుండా మా పెద్ద కులం ఆడోళ్ళను మీ అమ్మ పందులని తిట్టింది.అందుకే అన్నాడు పెద్ద రెడ్డి.కాదు... మా అమ్మని కొట్టి కుండ పలగ్గొట్టినందుకు మీ ఆడోళ్లే క్షమాపణ చెప్పాలి.అందుకే ఒక్కొక్కలుగా రాలేదు. వాడ వాడంతా వచ్చినం.న్యాయం జరిగేదాకా కదిలేది లేదన్నడు దాసు.
మీరు బాయి ఎక్కితే గంగమ్మ లోపలికి పోతదని పూజారి చెప్పిండు కదా అని పెద్ద రెడ్డి అనగానే పుష్పమ్మ,పున్నెమ్మలు మీరు ఇద్దరు(బ్రాహ్మణులు,రెడ్లు) ఆడిన నాటకం అంటూ---
పుష్పమ్మ- "యెంది మేం గట్టెక్కితే బాయ్ యెండిపోద్దా?మేం చేదేస్తే గంగమ్మ లోపలికి యెల్లిపోద్దా? అసలు ఈ బాయి తొవ్విందేవురూ? మీ పెద్ద కులపోళ్ళందరూ గొంతు తడుపుకొను సుక్క నీళ్లు లేక అల్లాడిపోతుంటే గంగమ్మని పాతాళం నుండి పైకి తెచ్చిందేవురూ? నువ్వా? మీ నాయనా? మీ పెద్ద జాతోల్లా"
పున్నమ్మ --"నువ్వాగుమే పుష్పమ్మ (పెద్ద రెడ్డి వైపు తిరిగి ఎగతాళిగా) యెందయ్యా పెద్ద రెడ్డి "గంగమ్మ లోపలికి యెళ్లిపోద్ది" (పెద్ద రెడ్డి కంఠాన్ని అనుకరిస్తుంది) యెందయ్యా యెల్లేది,యాడికి దాని జుట్టు పట్టుకొని పైకి లాకొచ్చింది మేవు.. కడుపునిండా ఇసం పెట్టుకొని మీ నాయనా నవ్వుకుంటూ మాలపల్లెకొచ్చిండు.మేం బాయి తవ్వడం మొదలు పెడితే కొబ్బరికాయలు గొట్టి పసుపు కుంకుమలు జల్లినప్పుడు దప్ప ముందుకొచ్చాడా? కనీసం కనబడ్డాడా? ఒక్కసారన్నా గడ్డపలుగేశారా?ఒక్క తట్ట మన్నన్నా ఎత్తి పోశారా? కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని బాయి తవ్వింది మేవు.. మట్టి ఎత్తి పోసింది మేవు.. గంగమ్మ గొంతును చెమట చుక్కల తో తడిపి పాతాళం నుంచి పైకి ఈడ్చుకొచ్చి బాయిలో కట్టేసింది మేవు. బాయిలో బిందెలు పారేసుకొని ఎక్కడన్నా దిగి దీశాడా? ఎన్నిసార్లు దిగి మావొళ్ళు దీశారు.. ఎన్నిసార్లు పూడిక తీయడానికి మా వొళ్ళు దిగలేదు.మీ పెళ్లి గాని ఆడపిల్లలు వురికొచ్చి దూకితే పైకెత్తకొచ్చి పేణం నిలిపిందెవరు? మా పిల్లలు గారు... అంతెందుకు పోయినేడాది పంతులు గారి కోడలు ఉబ్బి మూడో రోజు పైకి తేలి గవులు కొడతంటే తీసిందెవరు? నీళ్ళని ఎత్తి పోసి బాయిని కడిగిందెవరు" పున్నెమ్మ అన్నది.అప్పుడు పోనీ గంగమ్మ ఇప్పుడు లోపలికెట్లా పోతుందని చిన్నెంకటి అన్నాడు.ఒక్క సమాధానం లేదు. నిజానికి నిజమే సమాధానం...ఆ అబద్ధపు కట్టుబాట్లన్నీ కట్టుకథలని తేలింది...
పంచాయితీ అనగానే "మీకేం తెలుసు", "మీరు ఆడోళ్ళు", "మీరు లోపలికి పొండి", "మీరు మాట్లాడకండి", "ఇది వేరే విషయం" తీర్పు ఇవ్వడం మగవాని హక్కు అంటూ మీసం తిప్పే పితృస్వామ్య వ్యవస్థలో ఈ మాలపల్లి తల్లుల ధైర్యం స్ఫూర్తినిస్తుంది.ఆ ధైర్యం అణిచివేత,అవమానాల నుండి ప్రతీకారంగా వచ్చింది.ఇంకా ఆ ధైర్యానికి ఉద్యమ నేపథ్యం లేకపోలేదు.అస్తిత్వ ఉద్యమాల నుండి విప్లవోద్యమాల వరకు ముందుండి నడిచింది దళిత వాడలే. వెట్టి చాకిరి,అంటరాని తనం,సారా,గుట్కా సామాజిక రుగ్మతలన్నింటికి వ్యతిరేకంగా పోరాడారు.అంతే గాకుండా భూమి భుక్తి విముక్తి పోరాటాలు చేశారు..
అచ్చం ఆ ధైర్యంతోనే నిజాయితీగా,పదునుగా మాట్లాడారు...
ప్రశ్న అంటే ఆకాశం నుండి ఊడి పడేది కాదు. చాలా సహజంగా... అంటే ఆకలంత సహజంగా వచ్చేది. పెద్ద రెడ్డి ఇంకా కొనసాగిస్తూ బాయెక్కద్దనేది ఊరి కట్టుబాటు.మన పెద్దోళ్ళు పెట్టిందంటాడు.ఒక సెకండ్ విరామం లేకుండా దాసు కాదు మీ పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు కాదు అన్నాడు ఇంకా "బాయికట్ట యెక్కగోడదా... యెక్కుతే మీరు జరిమానా యేస్తారా?యేవురు యెక్కగోడదు?కట్టుబాటు యెవురు పెట్టారు?యెవరి కోసం పెట్టారు? కట్టుబాటు యిట్టా ఉండాలని యెవురు నిర్ణయించారు? జరిమానా ఇంత కట్టాలని యెవురు నిర్ణయించారు? యిట్టా జెయ్యడానికి మీకు హక్కెవరిచ్చారు... అసలు?
ఇది మారాలి అన్నాడు దాసు... చిన్నాన్న అడిగిందే దాసు అడిగాడు.ప్రశ్నించడం లో తప్పేముంది. ఇది ఇప్పటిది కాదు.తరాలది. ప్రశ్నించడం మనిషి భావజాలం కానీ నేరమంటోంది మను భావజాలం...
చివరి కొచ్చాం పంచాయతీ మధ్య మధ్యలో ఒకామే గంగమ్మ దగ్గరికి వచ్చి చిన్నమ్మ(పెద్ద రెడ్డి కోడలు) కొడుకు పాల కోసం ఏడుస్తున్నాడు రమ్మంటుంది. గంగమ్మ దిక్కరిస్తుంది.వచ్చినామే అయ్యా నువ్వైనా చెప్పయ్య అనగానే పెద్ద రెడ్డి ముఖం కింద కేస్తాడు..సిగ్గుతో. అంతలోనే పాల కోసం ఏడ్చే పిల్లవాడిని పంచాయతీ మధ్య బండపై వేసి గంగమ్మను బతిమిలాడుతున్న పెద్ద రెడ్డి భార్య,పెద్ద రెడ్డి కోడలు.చిన్న రెడ్డి మాల పెద్ద కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతుంటాడు.కోరలు ఊడిపోయిన అగ్ర కుల పెద్ద మనుషులు. మీరు చెప్పినట్టే కొయ్య యేపిచ్చి ఐదో గిరక పెడతానంటాడు పెద్ద రెడ్డి.పిల్లగానికి పాలియ్యమని బతిమిలాడుతుంటాడు.గంగమ్మ "యెందయ్యా మీరనేది ఇంకా మీకర్థం కాలేదా? మేం పంచాయతికి యెందుకొచ్చామో? మేవొచ్చింది బాయి గిలక్కొసం కాదు.గిలక మీరిచ్చిన యియ్యక పోయినా యేసుకుంటాం... నీలు చేదుకుంటాం.. అందుగ్గాదు మేము పంచాయతీకొచ్చింది... మాయత్తని కొట్టినందుకు.. కుండ పగలనూకినందుకు... మొత్తం మా జాతిని పందులని తిట్టినందుకు తప్పొప్పుకుంటే పాలిస్త..."అప్పటిదాకా కదిలేది లేదంటది.పెద్ద రెడ్డి తప్పయింది అంటడు.చెప్పేది నువ్వు కాదు నీ మరదలు చెప్పాలంటే వెంటనే పెద్ద రెడ్డి మరదలు ఉరికొచ్చి శౌరమ్మ ముందు చెంపలు వాయించుకుంటూ తప్పయింది క్షమించమంటుంది. ప్రేమ పంచడమే తెలిసిన గంగమ్మ పిల్లోడిని ఒడిలోకి తీసుకుని పాలిస్తుంది...ఇది దళిత మహిళల ఆత్మగౌరవ పోరాటం.ఈ విజయానికి గింత చరిత్ర ఉంది.రేపు గంగమ్మ కడుపులో పుట్టిన కొడుకు,పాలిచ్చిన కొడుకు సమానంగా బ్రతకలనేదే ఈ పుస్తక లక్ష్యం.
ఇది ఒక్క మాలపల్లి,మాదిగ పల్లి వ్యధ మాత్రమే కాదు.ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో దళితవాడలు దాహంతో ఎదురుచూస్తున్నాయి...వివక్షతో పీడించబడుతున్నాయి...ఈ వివక్షను రూపుమాపడానికి ఎన్నో చట్టాలున్నాయి ఒక్కటీ అమలు కావడం లేదు.ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మనుధర్మమే రాజ్యాంగంగా చేసుకొని ఆర్ ఎస్ ఎస్ ఆంగమైన బిజెపి పాలన సాగిస్తున్నది. వేల యేండ్ల కిందటి కట్టుబాట్లను ఆంక్షలను శిక్షలతో విధిస్తున్నది.వేధిస్తున్నది. ఉత్తర ప్రదేశ్ లో మంచి నీళ్లు తాగితే తక్కువ కులపోళ్లని బట్టలిప్పి కొట్టారు.మను భావజాలం దేశమంతటా తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇంకా రెండు గ్లాసుల పద్ధతి, జోగిని బసివిని మాతంగిని దురాచారాలు పోలేదు...అత్యాచార హత్యలు ఆగలేదు..తినే ఆహారం, వేసుకునే బట్టల పైన ఆంక్షలు,అంబేద్కర్ రింగ్టోన్ పెట్టుకుంటే చావ గొట్టిన సాక్షాలు... అగ్రకులం అమ్మాయిల/అబ్బాయిల ప్రేమిస్తే కులోన్మాద హత్యలు...విద్యను బ్రాహ్మణీకరించి విద్యార్థులను అజ్ఞానం వైపు మళ్లిస్తు ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారు... ప్రశ్నించిన విద్యార్థులపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు...జైళ్లలో నిర్బంధించి వేధిస్తున్నారు.పౌరసత్వాన్నే తొలగించే కుట్ర చేస్తున్నారు.ప్రాణమున్న మనుషుల జీవశ్చవాలుగా చేస్తున్నారు....
ఇటువంటి సందర్భంలో ఈ పుస్తకం చదువుతుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి అందుకే పీడితులందరూ ఏకమవ్వాలి...బూర్జువా రాజకీయ పార్టీల,డ్వాక్రా గ్రూపుల ఓట్ బ్యాంకు గా కాకుండా,స్త్రీ పురుషులు ప్రజాస్వామిక పోరాటాల్లో చైతన్య సంఘాలుగా ఎదగాలి. మను వారసుల ఫాసిస్ట్ పాలనా విధానాలను ప్రశ్నించాలి... ఎండగట్టాలి... పడగొట్టాలి... ఎలాగైనా ఎలాగైనా భూమిపై మనిషిని బతికించేందుకు పంచాయతీ చేయాల్సిందే.... ఆత్మగౌరవ పోరూ కేతనం ఎగరేయాల్సిందే....దాహం తీర్చుకోవాల్సిందే....
(M.M వినోదిని గారు రాసిన "దాహం" నాటకం చదివిన తరువాత)
జ్ఞాపకం మనిషి సంపాదించుకున్న సంపద.దాంట్లో ఏ స్వార్థముండదు. అందరికీ పంచాలనుకుంటారు. పంచుకోలేకపోతే ఏమవుతానోనని గాభరా పడుతుంటారు.ఎవ్వరైనా తమ జ్ఞాపకాలను పంచుకునేటప్పుడు పసిపిల్లలై పోతారు.వాళ్ల జ్ఞాపకాలకు తగ్గట్టుగా ముఖ కదలికల్ని, భాషని,భావావేశాల్ని వ్యక్తపరుస్తుంటారు. చెప్తూ చెప్తూ వినే వారి ముఖాల్లోకి తొంగి చూస్తుంటారు.అలా తమ జ్ఞాపకాల మూటని ఒక్కొక్కటి విప్పిజెప్తూ సంతోషపడి, దుఃఖపడి తన సొంతాస్తి లాగే మళ్ళీ మూట గట్టుకొని తమ గుండె గదిలో పదిలపరుచుకుంటారు.నిజానికి జ్ఞాపకాలకు న్యాయ నిర్ణేతలుండరు. మార్కులుండవు. సత్కారాలుండవు. బిరుదులుండవు. ఎవరికి వారుగా ఆస్వాదించుకోవడం తప్ప.
అటువంటి జ్ఞాపకమే రెబల్.ఈ నవలను హెచ్చార్కె గారు 1960 చరిత్రని 2020 లో రాశారు. హెచ్చార్కె గారు ఇందులో కథానాయకుడైన పవన్ కుమార్ జీవితంలోని "బాల్యం,విద్యాభ్యాసం, సాహిత్యాభిరుచి, పెళ్లి, ఎమర్జెన్సీ క్రూరత్వం, విమోచన పత్రిక తో ప్రయాణం, పార్టీ చీలికల దుఃఖం, చివరిగా రాజీనామా"లాంటి ప్రధానమైన సంఘటనల అనుభవాల్ని, 1961-85 మధ్య కాలంలోని రాజకీయ పరిస్థితుల్ని రచయిత టోన్ లో, పవన్ కుమార్ తనకు చెప్పినట్టుగా చెప్తాడు. ఈ ప్రక్రియ పాఠకునిగా నన్ను బాగా ఆకట్టుకుంది. అట్లాంటి ఈ నవల గురించి నా అనుభూతిని పంచుకుంటున్నా.నేను తడమని జ్ఞాపకాలు ఇంకా ఎన్నో ఇందులో మిగిలేవున్నాయి.
నిస్సహాయురాలైన అమ్మ, అసహనపు ములుగర్రైనా నాన్న, వెన్న పూసిన జొన్న రొట్టె నిచ్చే నానమ్మ పవన్ కుమార్ జీవితం లో చెరగని ముద్రలు. తన బాల్యంతో పెనవేసుకున్న నాలుగూర్లు, అక్కడి ప్రకృతి, మిత్రులు, బర్రెలు కాసిన జ్ఞాపకాలు, కథ జెప్పే పుల్లన్నతో తియ్యని రాత్రులు, కథల పుస్తకాలతో తీరని ఆకలి,వీపుపై నాన్న ములుగర్రతో చేసిన సత్కారాలు,రమణమూర్తి మాస్టారు,ఆయనిచ్చిన శ్రీశ్రీ-మహాప్రస్థానం, అడుగడుగున భుజం తట్టిన తీరు, ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షల్లో జరిగిన అవమానం,అయినప్పటికీ పాసై స్టడీ సర్టిఫికేట్ లో "ఇంటలిజెంట్ బట్ గల్లిబుల్"అని రమణమూర్తి సర్ రాసిన పదాలు. ఇలా లెక్కలేనన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తాడు, భయపడతాడు, సంబరపడుతాడు. పెద్దయ్యాక తన జీవితాన్ని జాక్ లండన్ నవలలోని పాత్రలతో పోల్చుకుంటూ తనని తానే తత్వవేత్తల భుజం తట్టుకుంటూ జాక్ లండన్ గామారిపోతాడు. అట్లా సాహిత్యాన్ని తన జీవితంలోకి వంపుకొన్నాడు.
పవన్ కుమార్ ఉన్నత విద్య కోసం విజయవాడలోని లాహిరి పట్నంలోని లయోలా కాలేజ్ లో చేరాడు.నాలుగేళ్ళ కళాశాల విద్యను "జైలు జీవితం"తో పోల్చుకున్నాడు.ఎందుకంటే తనకు అధ్యాపకుల తీరు,తన అభిరుచుల ఆకలిని తీర్చలేని విద్యా విధానం నచ్చలేదు.అయిష్టంగానే చదివాడు. పవన్ కుమార్ పి.యు.సి లో ఉండగానే 'జ్వాల' పత్రిక కు,డిగ్రీలో లో 'జ్యోతి', 'మార్చ్' పత్రికలకు కవితలు రాశాడు. అయినా కూడా ఆ కాలేజీలో ఉన్న సాంస్కృతిక వేదికైన 'ఎలైట్ క్లబ్' తనను గుర్తించలేదని బాధపడతాడు. ఇంకా తెలుగు గొప్పతనాన్ని చెప్పిన విశ్వనాథ సత్యనారాయణ ఉపన్యాసం, అసహనంలో ఉన్న చండ్రపుల్లారెడ్డిని కలిసి అసంతృప్తితో వెనుతిరిగి రావడం గుర్తు చేసుకున్నాడు.ముందే ప్లాన్ చేసుకోలేదు. తన యెద ఒత్తిడి పెరిగితే స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు. అది తనంతట తానే రాదనుకుంటాడు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్నీ సాధించుకోవాలనుకుంటాడు.
తన కాలేజ్ అనుభవాలు చెప్తుంటే నాకు నేటి విద్యా వ్యవస్థ గుర్తొచ్చింది.ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల అభిరుచుల్ని చంపేసి, ఒత్తిళ్ళతో చదివించడం, ర్యాంకుల్లో బంధించడం,లేదంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి ఆశాస్త్రీయమైన విద్యను ప్రభుత్వాలే ప్రోత్సహించడం తప్పని ఎన్ని పోరాటాలు చేసినా ప్రశ్నించే గొంతుల 'దేశ ద్రోహులంటూ' జైళ్ల పాల్జేయడం జరుగుతున్నది. ఇది ముమ్మాటికీ ప్రగతినిరోధకం. ఇకనైనా ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రజాస్వామికంగా విద్య కొనసాగుతే దేశ ప్రజలు బాగుపడతారు.
ఆ తరువాత పవన్ కుమార్ పీజీ చదవడానికి విశాఖపట్నం వెళ్ళాడు.ఆంధ్ర యూనివర్సిటీలో MA తెలుగు. ఆ రెండేళ్ళు తన పన్నెండేళ్ల జీవితాన్ని మార్చింది.విశాఖలో విప్లవాభిమానిగా మొదలై సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు.అందుకోసం విశాఖపట్నం లో తనకు నచ్చిన రామకృష్ణ బీచ్ లో నారాయణ మూర్తి,గంటి ప్రసాదం,వంగపండు ప్రసాదరావు,సి.వి.సుబ్బారావు, కృష్ణ బాయి,చలసాని ప్రసాద్ ఇంకా ఇతర విశాఖ విరసం యూనిట్ సభ్యులను కలుసుకునేవాడు. సహచర్యం బలపడింది. అక్కడి ప్రతి అనుభవాన్ని మనసులో ఇమిడించుకున్నాడు. ఆ రోజుల్లో పాత సాంప్రదాయాలతో వ్యక్తి పూజలతో,భక్తి రక్తి లో,తూలుతున్న కవులను వ్యతిరేకిస్తూ "రచయితలారా మీరెటువైపు"అనే చారిత్రక కరపత్రం వేసిన విశాఖ విద్యార్థుల్లో ఒకరైన N.S. మరణం యాది చేసుకుని కుమిలి పోయాడు.పార్వతీపురం కుట్రకేసు కోర్టు ఆరుబయట జరుగుతుండగా అక్కడికొచ్చిన శివసాగర్ ను చూసి మురిసిపోయాడు. రమణారెడ్డి ప్రసంగం విని ఎంతో స్ఫూర్తి పొందాడు. విశాఖలో నేర్చుకున్న ప్రతిదీ తన గ్రామంలో అప్లై చేశాడంటే ప్రజా ఉద్యమాల పట్ల తనెంత ప్రేరేపించబడ్డాడో తెలుస్తుంది.ఇదే శాస్త్రీయ విద్య అంటే. పుట్టినూరికి ఉపయోగపడేది.
తన విద్యానంతరం విద్యార్థి ఉద్యమంలో క్రియా శీలకంగా పని చేస్తూ, తన జీవితం ప్రజా పోరు బాటలో రూపుదిద్దుకుంటున్న క్రమంలోనే తను ప్రేమించిన మరదలు విజయ ను పెళ్లి చేసుకున్నాడు."కట్నకానుకలు లేవు,సాంప్రదాయ క్రతువులు లేవు, ఆడంబరాలు,అనవసర విందు వినోదాల్లేవు.అసలు పంతులే లేకుండా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే పవన్ కుమార్, విజయ లు "ఎవరు కూడా గిఫ్టులు తీసుకు రావద్దు, భోజనాలు ఉండవని" ముందుగానే కార్డు లో రాసి పంపడం ముచ్చటైన ముచ్చట. ఎవ్వరూ రారనుకున్నారు. హాలంతా నిండింది. ప్రగతిశీలతని ప్రజలు ఎప్పుడూ స్వాగతిస్తూనేవుంటారని చెప్పడానికి ఇలాంటి ఆదర్శ వివాహాలు నిదర్శనం.కుల వర్గ నిర్ములానకి, ఆదర్శ వివాహాలు నేటి అవసరం.అందుకు ప్రత్యేక రక్షణ చట్టాలు కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి.
దేశమంతా ఎమర్జెన్సీతో అట్టుడికిపోతున్నది.ప్రభుత్వ విధానాలను ఏమాత్రం ఈసడించుకున్న అరెస్టులు చేయబడుతున్నారు.అలాగే పెళ్లయిన కొద్ది రోజులకే పవన్ కుమార్ అరెస్ట్ చేయబడ్డాడు. అప్పటి పరిస్థితిని చెప్పడానికి పవన్ కుమార్ విలియం శీరర్ అనే జర్నలిస్టు రాసిన "ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది థర్డ్ రీక్"అనే పుస్తకాన్ని చదివాడు. దాన్ని ఇందిరమ్మ ఎమర్జెన్సీ తో పోల్చిండు.అహంకారంతో చేసిన దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి పాలనాధికారాలు దక్కించుకోవడానికి "నాజీజం" తో హిట్లర్ 12 సంవత్సరాలు, "నేషనల్ సోషలిజం" తో ఇందిరమ్మ 21 నెలలు ప్రజలపై ధమనకాండ సాగించారు. ప్రభుత్వ విధానాలను ఏ కొంచెం వ్యతిరేకించిన అరెస్టులు, అత్యాచారాలు,హత్యలు,ఎన్కౌంటర్లు తప్పలేదు. చెల్లాచెదురైన జీవితాలు లెక్కేలేదని చెప్పాడు. ఇంకా ఎమర్జెన్సీ నేటికీ ఆగలేదని గుర్తు చేస్తూ "నేషనల్ సోషలిజం ఇందిరా నుంచి రాజీవ్ ద్వారా వాజ్ పై నుండి మోడీ వరకు కాంతులీనుతూ నే ఉంది. ఇండియా మరో థర్డ్ రీక్ అయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంది.ఈసారి 21 నెలలు ఉండదు.అంత బహిరంగంగానే ఉండదు"అంటాడు. అవును నేడు కళ్ళ ముందు జరుగుతున్న నిర్బంధాన్ని ప్రతీ ఒక్కరు చూస్తున్నారు. ప్రాథమిక హక్కులు దక్కించుకోను పోరాడుతున్నారు. పీడించబడుతున్నారు,ప్రశ్నిస్తూనే చంపబడుతున్నారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలకు,నిర్బంధాలకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడితేనే మానవ మనుగడ సాధ్యం.
పవన్ కుమార్ రెండేళ్ల ముషీరాబాద్ జిల్లా జైలు లో ఎంతోమందిని చూశాడు. ఎమర్జెన్సీ లో అరెస్ట్ చేయబడింది కమ్యూనిస్టులే కాదు ఆర్ ఎస్ ఎస్ వాళ్లు,జమాతే ఇస్లామ్,ఫ్యాక్షనిస్టులు,ఆనంద మార్గ్ వాళ్ళు,వంగవీటి రంగా లాంటి వాళ్ళు.వ్యవస్థ మారకుండా ప్రభుత్వ అధికారానికి రావడానికి అవకాశం ఉన్న వాళ్లంతా అరెస్టు చేయబడ్డారు. అక్కడ చాలా మంది అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్ పార్టీ వాళ్ళను, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నాడు. కాశీపతితో ఇంగ్లీష్ సాహిత్యం పై చర్చించాడు.ఎన్కౌంటర్ పత్రిక పింగళి దశరథరామ్ ను,సోషలిస్ట్ నేత సత్యనారాయణ రెడ్డి లాంటి ఎంతో మంది తో మాట్లాడాడు. పవన్ కుమార్ కు జైలు జీవితం పోరు జీవితాన్ని నేర్పింది. రెబల్ గా మారాడు.పార్టీలో ఫుల్ టైమర్ గా పని చేయాలనుకున్నాడు.
విప్లవోద్యమం చాలా బలంగా పుంజుకుంటున్న ఆ దశలోనే పవన్ కుమార్ జైలు నుండి విడుదలైన తర్వాత చండ్రపుల్లారెడ్డి తో పరిచయం బలపడింది.పార్టీ తనకు 'విమోచనా' పత్రిక భాద్యతలు అప్పగించింది. ఇక పవన్ విజయ లు ఎనమిదేళ్ళు విమోచన పత్రికతో నడిచారు. పవన్ కుమార్ రచయితగా, కవిగా, కథకుడిగా, ఉపన్యాసకుడిగా ప్రజల మధ్య గడిపాడు.ప్రజల్లోకి వెళ్లి గ్రామ సీమల్లో నిర్మాణాలు చేసి 'ప్రతిఘటన' పోరాటాల్లో పాల్గొన్నాడు. వరవరరావు తో సాన్నిహిత్యాన్ని పంచుకున్నాడు. ఎందరో అమరుల అమరత్వాన్ని గుండెల్లోకి హత్తుకున్నాడు. ఎంతో మంది రెబెల్స్ సహచర్యంలో తనో రెబల్ గా జీవించాడు. అలా జీవించడం ప్రతీ మనిషికి వచ్చే అవకాశం. ప్రగతిశీల చరిత్రను నిర్మించే సదవకాశం.ఆ అవకాశం పవన్ కుమార్ కొచ్చిందని సంతోషపడ్డాడు.
ఆ సంబరమెంతో కాలం లేదు. ఎన్నికలు,సాయుధపోరాటం,ప్రజాసంఘాల అవసరం లాంటి అంశాలతో విప్లవ పార్టీల్లో చీలికలొచ్చాయి. సి.పి పార్టీ రెండుగా, ఆ తర్వాత నాలుగుగా చీలిపోయింది. దాంతో పవన్ కుమార్ ఘర్షణ మొదలయింది. రోజులు గడిచే కొద్దీ పార్టీలో జరిగే వ్యక్తిగత వైరుధ్యాలతో ఘర్షణ ఇంకా పెరిగింది.అది తట్టుకోలేక సహచరులిద్దరూ చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చాక పార్టీకి రాజీనామా పత్రం రాశారు.ఆ పత్రంలో "పాలక పాలిత బలాబలాల రీత్యా చూసినా, ఇప్పటివరకు ఉన్న మన అనుభవాలను బట్టి చూసినా,ఈ మార్గంలో 'ప్రజలకు రాజ్యాధికారం' అనేది జరిగే పని కాదు.ప్రజల కోసం పనిచేసే వ్యూహం, ఎత్తుగడలు మౌలికంగా మారాలి. ఈ మార్పుకి దోహదం చేసేలా పని చేయగలిగితేనే విప్లవోద్యమంలో పని చేయాలి.ప్రస్తుతం మన పని ఆ మార్పుకి దోహదం చేయదని మేము అనుకుంటున్నాము. మీరందరూ మా వలె కాకుండా, ప్రస్తుత పని ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాం.మీ నిమగ్నతా,నిబద్ధతలను గౌరవిస్తున్నాం. మీతో స్నేహసంబంధాల్ని ఉంచుకుంటూ మా జీవితం మేము జీవించడానికి ప్రయత్నిస్తాం"అని రాశారు. అలా ఉద్యమానికి దూరమయ్యారు. ఎంత దుఃఖమో తన ఆలోచనలు,ఆశయాల నడకను వదిలి మరో జీవితంలోకి పోవడం.ఆ తర్వాత కొద్ది రోజులకు పవన్ కుమార్ తన వ్యక్తిగత జీవితంలోకి ఒదిగి పోయాడు. నిజమైన ధనవంతుడు రామోజీరావు 'ఈనాడు' పత్రిక లో చేరాడు.
పవన్ కుమార్ తన జ్ఞాపకాల ప్రయాణంలో తన సహచరిని అప్పుడప్పుడు 'అమ్మ' అని పిలిచేవాడు. ఇది "ఆడవాళ్ళ శ్రమను దోచుకునే ఒక ఎత్తుగడ అని స్త్రీ వాదుల నిజమైన విమర్శ" అని గుర్తుచేసుకున్నాడు. స్త్రీలపై జరిగేటి భరించరాని హింసని చాలా సందర్భాల్లో వ్యతిరేకిస్తాడు. పవన్ కుమార్ పెద్దయ్యాక కూడా చాలా సార్లు వేధనపడ్డాడు. జైల్లో వున్నప్పుడు పుట్టబోయే బిడ్డను, తన సహచరిని తలుచుకొని పొరుగు వారి సూటుపోటీ మాటల్తో తనెంత క్షోభ అనుభవిస్తుందోనని కుంగిపోయాడు. మరొకసారి తనకు ప్రాణమైన వాళ్ళమ్మ నాకు "ముగ్గురు కొడుకులే" అంటే నేనింత పరాయి వాన్నయ్యానా? అని కుమిలిపోయాడు. ఆ తర్వాత విరసంకు,తన పార్టీకి ఇంకా కన్న ఊరికి దూరమయ్యానని దుఃఖ పడ్డాడు. ఆ దుఃఖంతోనే పరాయి వాడై విజిటర్ గా తన బిడ్డ దగ్గరకు అమెరికా వెళ్ళాడు.అమెరికా నుండి కన్న ఊరిని ఇట్లా కలబోసుకున్నాడు.
పవన్ కుమార్(పేరు వేరైనా) నిజం.అతని జీవితం,జీవించింది నిజం. అతని పోరు నిజం.అతని బాధ నిజం. అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మద్యే జీవించాడు. సమాజాన్నిమార్చాలనుకున్నాడు, మారదని ఆగిపోయాడు. కారణాలు కాదనలేం. అయితే సమాజాన్ని మార్చాలనుకున్న జీవితమే నేటి తరానికి కావాలి.అదే 'రెబెల్' తత్వం కావాలి.
పవన్ కుమార్ లాంటి ఎందరో ఒకానొక దశలో రెబెల్ గా బతికినోళ్ళంతా తమ జ్ఞాపకాలను చరిత్ర మాలలో గుదిగుచ్చాలి. భవిష్యత్ తరాలకు కానుకగా ఇవ్వాలి. ఆ నిజాయితీ పరమైన జ్ఞాపకాల బాటలో సమసమాజ నిర్మాణంకై పోరాటం నడవాలి.
"అనిమేష" అంటే రెప్పవాల్చనిది ప్రకృతి. కోట్ల సంవత్సరాల కాలం నాటి నుండి జీవకోటి కోసం విశ్రాంతి తీసుకొనిది.మనిషి పుట్టినప్పటి నుంచి అనేక బాధలను భరిస్తూ, ప్రేమను పంచుతూ మానవ మనుగడలో సంపూర్ణ భాగమైంది.కానీ ఇదంతా మరిచిన మనిషి, బుద్ధునికే అందని హద్దులేని ఆశతో ప్రకృతిపై అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కాలమెంతో చెడ్డదని నిందిస్తున్నాడు.ప్రపంచ మార్కెట్ వస్తువే కాదూ మార్కెట్టే తానై అతి తెలివితో ప్రాణాంతకమైన విపత్తులకు, వ్యాధులకు కారణమవుతున్నాడు.శాస్త్ర విజ్ఞానంతో ఎంతెత్తుకెదిగినా తనను తాను కాపాడుకోలేని ప్రమాద అంచుకు నెట్టి వేయబడుతున్నాడు.చచ్చి బ్రతుకుతున్నాడు. ఒకవేళ బ్రతికి బట్ట గట్టినా ఆ తర్వాత జీవచ్ఛవంలాగా బ్రతికీడుస్తున్నాడు.ఈ క్రమం ఒక్కసారి పొరపాటున జరిగింది కాదు, అనేకానేక సార్లు ప్రకృతిని విధ్వంసం చేయడం,తప్పయింది అంటూ నేలకు ముక్కు రాయడం జరుగుతున్నది. అట్లా ప్రకృతిపై ఎదగిన,అంతే వేగంగా పతనమైనా మనిషి గురించి ఈ కరోనా నేపథ్యంలో గత గుణపాఠాలను గుర్తు చేసేదే ఈ “అనిమేష” కావ్యం.
“అనిమేష” ఉపద్రవ కావ్యం రాసింది తెలుగు సమాజానికి తెలుగు సాహిత్యానికి సుపరిచితులైన నందిని సిద్ధారెడ్డి. ఇది మంజీర రచయితల సంఘం ప్రచురించింది. ఈ "అనిమేష" 19 గాథల ఉపద్రవ గాథా కావ్యం. ఇందులోని ప్రతి ఒక్కటి ప్రతి మనిషి గత, వర్తమాన అనుభవాలను తడుతుంది. ఎనిమిది నెలలైనా ఆగని కరోనా విపత్తు అంశంగా మొదలై వేల ఏండ్ల నాటి గుణపాఠాలను మనిషికి గుర్తు చేస్తుంది.ఈ కావ్యం తపనంతా ప్రకృతి, మనిషి; మనిషి, ప్రకృతి. మనిషి ప్రకృతి పై ఎదిగిన విధానాన్ని, చేసిన విద్వంసాన్ని, ఆఖరికి మనిషి పతనాన్ని గురించి చెప్తుంది.అయినా మారని మనిషిని హెచ్చరిస్తుంది.మన కళ్ల ముందు జరిగిన విపత్తును ఒకే దగ్గర చూస్తే ఆ దుఖమెంత భారంగా ఉంటుందో ఆ బాధంతా ఈ కావ్యం మోసింది. ఇది ప్రపంచ ప్రజల దుఃఖం.కవి ఈ కావ్యంలో చేసిన పదాల ప్రయోగాలు, తెలవని పదాలేమున్నా తెలుసుకోవాలనే తపన పాఠకులను మరింత చదివించేలా చేస్తుంది. ప్రకృతిని ప్రేమించే,ప్రకృతిని కాపాడుకోవాలనుకునే ప్రతి మనిషి ఈ కావ్యాన్ని ఇష్టపడతారని నా భావన. నేనూ రాసింది ఈ కావ్యంలోని పదాలతోనే. ఇది నా అనుభూతి మాత్రమే. సమీక్ష కాదు.
ప్రకృతి పుట్టినప్పటి నుండే కోటానుకోట్ల బ్యాక్టీరియాలు, వైరస్ ల వంటి సూక్ష్మజీవులు పుట్టాయి. కొన్ని మానవ మనుగడకు అవసరమైనవి,కొన్ని హానికరమైనవి.కానీ మనిషి చేసిన వికృత చేష్టల వల్ల పుట్టినటువంటి వైరసొకటి నేడు మనిషిని భయపెడుతున్నది. ఎంతగా అంటే
“తలుపులకవతల ఏ ద్రోహం తచ్చాడుతుందో తెలువదు
.....................
చేతుల్ని చూసి కళ్ళు భయపడతాయి
నులుముకోవడానికి లేవబోయి
మునివేళ్ళు చతికల బడతాయి
కడుక్కోవడానికి వెళ్ళినప్పుడల్లా”. ఇది అందరూ అనుభవించిన భయం.ఇప్పటికి అనుభవిస్తున్న తెలియని భయం.
"చంపడానికి కత్తే అక్కర్లేదు
ఉరి తీయడానికి తాడే అక్కర్లేదు
ప్రపంచీకరణ యుద్ధానికి
అణుబాంబులు అక్కరలేదు
వైరస్ చాలు
ప్రపంచమే హడల్ అని "అపరిచిత గాథ"లో మనిషి భయాన్ని సరళంగా కవిత్వీకరిస్తాడు. మరి ఈ వైరస్ ఎక్కడ మొదలైందని ప్రపంచమంతా గుసగుసలాడుతుంటే వినిపించిన పేరు వూహన్.సుందరమైన, సౌకర్యవంతమైన, అధునాతన శాస్త్ర సాంకేతికత కలిగిన నగరం. అటువంటి నగరంలో కరోనా సోకిన తర్వాత తలకిందులైన నగర పరిస్థితి ధైన్యమైనది. ఇప్పుడు అది ఎంత దుఃఖంలో ఉందంటే
“కాళ్ళ కింద నదులే
కళ్ళకింద నదులే” అని రెండు వాక్యాల్లో నగర స్థితిని చెప్తాడు. వూహాన్ లో వైరాలజీ శాస్త్రవేత్త షీ, డాక్టర్ లీ ఎవరు చెప్పినా ప్రభుత్వం వినలేదు.అందుకే వారిని
“దగ్గి దగ్గి చచ్చేదాకా
దేశం చూడలేదు”. ఎందుకంటే అహంకారానికి నిజం నచ్చదు అధికారానికి ప్రాణం లెక్కే లేదు అని ప్రభుత్వ తీరును చెప్తాడు. కరోనా ప్రాణాంతక యాత్ర అక్కడితోనే ఆగలేదని
“ప్రపంచీకరణ కదా/ విపణులతోపాటు/ విపత్తులు దిగుమతి చేసుకోవాల్సిందే”నని, అట్లా మనిషి కొనితెచ్చుకున్న విపత్తే ఈ కరోనా ని చెప్తాడు. ఎవరు, ఎలా తీసుకు వచ్చారో తెలియదు కానీ దేశాలు దాటి ప్రపంచవ్యాప్తం అయ్యింది. ఎందుకంటే
“వైరస్ కు సరిహద్దులు లేవు/వర్ణభేదాలు అంతకంటే లేవు/ వర్గం కులం మతం వరుసకైనా లేవు/.../శరీరమైతే చాలు.మనుషుల్లా తనకేమి భేదాల్లేవు.ఎవ్వరినైనా చంపడమే. అట్లాగే చంపుకుంటూ వస్తున్నది. అలాంటి సందర్బంలో రాత్రికి రాత్రే ముందస్తు చర్యల్లేకుండా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దాంతో దేశంలో మారిన భౌగోళిక స్థితిని చెప్తూ
“ఎయిర్ వేలు రైలు వేలు రోడ్డు వేలు
సీ వేలు స్కై వేలు
ఏ వేలూ లేవు
వేలు లేని వేళ
వేళకాని వేళ
వేల శవాలు కుప్పబడతాయి”. ఎవరికీ ఎవరూ లేని అట్లాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రతి రోగికి ఆత్మీయులై మునిసిపాలిటీ సిబ్బంది,అర్ధం కాని రోగంపై మనుషుల కాపాడాలనే తపనతో వైద్యంచేస్తున్న డాక్టర్లు,నర్సుల సాహసాన్ని మొక్కాలి అంటాడు కవి.ఇది నిజం.వాళ్లే గనుక లేకపోతే శవాల గుట్టలతో భూమంతా నిండిపోయేది.దాదాపు 200 దేశాల్లో ఇదే పరిస్థితి.ఇంకా లాక్ డౌన్ కాలంలో వైద్య,రక్షణ,రాజకీయపరమైన కొత్త పదజాలం అనివార్యంగా వచ్చిందని.
“కొత్త భాష
కొత్త బాధ
కొత్త సంకెళ్ళు” అంటూ మూడు పదాల్లో క్లుప్తంగా కరోనా విపత్కాలన్ని వివరిస్తాడు. నిజానికి ఈ పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు.ఎన్నో ఏండ్ల నుండి మూఢనమ్మకాల్లో మగ్గుతున్న మనుషులకు ఈ నిజం అర్దమై వుండాలి. అదేమిటంటే టావో, బుద్ధుడు, అల్లా, క్రీస్తు, నారాయణుడు, షిరిడిసాయి, ఏడుకొండలస్వామి అందరూ మాస్కులేసుకొని తలుపులేసుకున్న సంగతి. లేని దేవుళ్ళ పేరు జెప్పి నమ్మించి పబ్బం గడుపుకునే బాపతు గాళ్ళు చేసే నీచ రాజకీయల సంగతి ప్రజలంతా అర్థం చేసుకోవాలి.ఇలాంటి కుటిల రాజకీయాలు జేసే ప్రభుత్వాల, మతోన్మాదుల ప్రచారానికి కౌంటర్ గా “చప్పట్లు కొడితేం
పక్షులు లేవయి
గంటలు మోగిస్తేం
ధైర్యం పలుకదు” అని శాస్త్రీయ దృక్పథాన్ని చెప్తాడు.
ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికోదిలి లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ప్రాణాలను బిగపట్టుకొని తరలిపోతున్న వలస దుఃఖాన్ని 'వలస గాథ"లో చాలా ఆర్ద్రంగా గా వివరించారు.ప్రపంచంలోని అంతస్తులను, పట్టణాలను, చారిత్రక కట్టడాలను, సుందరమైన స్థలాలను తీర్చిదిద్దింది వలస కూలీలే.అలాంటి వలస జీవులు ఏమి పనుల్లేక, తినడానికి తిండి లేక పూట పూట గండంగా బ్రతుకీడుస్తున్నారు.ఆకలికి భరించలేని స్థితి వచ్చింది. ఆకలి చావుల పరంపర కొనసాగుతున్న దశలో ”కాయానికి తాళం వేయగలం/ కడుపుకు తాళం లేదు”అని అంటాడు.అందుకే బతికుంటే బచ్చలాకైన తిని బతుకోచ్చనుకుంటూ వలస జీవి కన్నూరికి పయనం గట్టాడు. రోడ్డు పొడుగునా వందలు వేల కిలోమీటర్లు నడిచారు.వాళ్ల రూపం పూర్తిగా మారింది.”మూటాముల్లె తలమీద/ చంటి పిల్ల చంకలో/వేలు పట్టుకొని పిలగాడు”తో నడక మొదలై తల్లిని,పిల్లల్ని,చుట్టాల్ని తలుచుకుంటూ వెళ్లే సందర్భంలో ఎన్నో విషాదకర ఘటనలు వలస జీవి కళ్లముందు సాక్షాత్కరించాయి.మనం కూడా ప్రత్యక్ష,పరోక్ష సాక్ష్యులం.అందులో మచ్చుకు కవి చెప్పిన వాటిలో... సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణం,చంటి పిల్లల సంకలేసుకొని కిందపడిన భార్య,సోమయతండా ఆదివాసీ మహిళ బిడ్డకు పాలివ్వడానికి పాలు రాక గడ్డి తినడం,బిడ్డ ఏడుపు భరించలేక గుండె పగిలి రైల్వేస్టేషన్లో తల్లి మరణం,ఇలా నడుస్తూ నడుస్తూ మనుషులు హటాత్తుగా కూలిపోతున్నారు.బ్రతికుంటేనే భాద అనుకుంటూనే మళ్ళీ ఎలాగైనా బ్రతకాలనే చిన్నిపాటి ఆశతో ప్రతి ఒక్కరు కన్నూరికి చేరాలని నడుస్తూనే ఉన్నారు. అలా నడిచి నడిచి అలిసిన శరీరాలు రైలు పట్టాలపై సేద తీరుతుండగా గూడ్సు రైలెక్కి శవాలైన సందర్భమింకా కళ్ళ ముందట తిరుగుతూనే ఉంది.ఇంకా విదేశం నుండి కంటైన్ మెంట్ లన్ని దాటి చనిపోయిన తల్లిని చూడటానికి వచ్చిన కొడుకు స్థితిని చెప్తూ..
“అక్కలుంటారు తమ్ములుంటారు
భారంగా బంధువులుంటారు
ఎవరి మీద పడి ఏడవటానికుండదు
ఎవరి కన్నీళ్లు తుడవటానికి లేదు
అనుమానితుడు”. తల్లికి కొడుకు అనుమానితుడైన సందర్బం చరిత్రలో కనబడదేమో కదా.ఇంకా కరోనా సోకిన కొడుకుని హాస్పటల్లో చేర్పించగా డాక్టర్లు అతను చనిపోయాడని చెప్పగా తల్లిదండ్రుల ఆవేదన “అదేదో మాకు సోకితే మంచిగుండు/మమ్ముల కదలనిస్తలేరుగని”అని గుండె బండరాయి చేసుకున్న సందర్భాన్ని "ప్రాణగాథ"లో ఎంతో దీనంగా చెప్తాడు.
ఒకపక్క కరోనా ఎవరిని వదలకుండా చంపుతుంటే దేశాధినేతలు మాత్రం అహంకారాన్ని,నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.ఒకరి దేశంపై ఒకరు బురద జల్లుకుంటున్నారు.కుల మత జాతి లింగ భేధాలతో మూర్ఖులవుతున్నారు.
”మతం ఒక వైరస్
ఎప్పుడో మెదడును కమ్మేసింది
రాజకీయం మరో వైరస్
రక్తనాళాల్లో చేరిపోయింది
వ్యాపారం వావిలేని జీవి
మనస్సును మత్పరించింది
ఇవ్వాల్ల మనిషి ఎక్కడ దొరుకుతాడు
ఒట్టి శరీరం తప్ప
అదీ బతకనివ్వకుండా
ఇప్పుడిదిగో ఈ వైరస్” అంటూ మనిషిని పీల్చి పిప్పి జేసిన ప్రపంచ పాలకవర్గాల పీడనని,మతోన్మాదాన్ని, వ్యాపారికరణ హీనత్వాన్ని, వైరస్ క్రూరత్వాన్ని ఈ ఒక్క పాదంలో చెప్తాడు. కాని మనిషి వినడు కదా అందుకే వేల సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా రేబిస్,మీజిల్స్,స్పెయిన్ ఫ్లూ,స్పానిష్ ఫ్లూ,ఫ్రెంచ్ ఫ్లూ,ఆసియన్ ఫ్లూ,హాంగ్కాంగ్ ఫ్లూ,అమెరికన్ ఫ్లూ, చైనా వైరస్, కలరా,ఎబోలా,ఎయిడ్స్,స్వైన్ ఫ్లూ,బర్డ్ ఫ్లూ వంటి రోగాలతో లక్షల మంది చనిపోయారు.అలా సేవాగుణం,చిత్తశుద్ధి లేని నీచ రాజకీయ నాయకులు, బుద్ధిలేని కొందరు కుల మత జాతి లకు పుట్టిన కుల్లుగాల్లు “వైరస్ లకు దేశాల పేర్లు”పెట్టి ద్వేషాలకు దారులేస్తున్నారు”అని అంటాడు. ఇంకా "ప్రాణాలు గాల్లో వేలాడుతున్న వేళ/గందరగోళాలు మూర్ఖం అని చెప్తూ “ప్రపంచ సంరక్షణ/ప్రపంచ దేశాల బాధ్యత” అనే సత్యాన్ని చెప్తాడు.
మనిషి కోరికలు పరిమితికి మించినవి.చాలా ప్రమాదమైనవి. అయినా ప్రకృతి కొండలని,నదీజలాలను, జంతువులను, పక్షులను ముఖ్యంగా మనుషుల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటూ వచ్చింది. ఇది ఎప్పటికీ మారదు.అందుకే మానవుడు ప్రకృతినెంత గాయం చేసినా పాల కోసం రొమ్ము కొరికిన/ పసిబిడ్డగా తలచి తల నిమిరింది”అని చెప్తాడు. కానీ అంతటితో ఆగకుండా “పక్షిని చూసి విమానమై ఎగిరినవాడు/గుర్రాన్ని చూసి రైలయి ఉరికినవాడు/సింహాన్ని చూసి నియంతలా జూలు విదిల్చినవాడు” సౌకర్యాన్ని మించి ప్రకృతిని వాడుకోవడం, తోటి వారికి గూడు లేకుండాచేయడం,స్వార్థంతో నన్ను మించినవాడు లేడని మనిషి అపోహాతో విర్రవీగడం.ఇది నిజంగా మనిషి బుద్దిలేని తనమే. అయినా చాలనట్టు ఇంకా ప్రపంచీకరణలో ప్రపంచ మార్కెట్ గా మారిన “ఆశానుబావుడు”మనిషని కవి చీదరించుకుంటాడు. అడవి పట్ల ఆదినుండి ఉన్న అభిప్రాయాల్ని చెప్తూ “అడవిని మొక్కింది ఆదిమం/అడవిని వేటాడింది రాచరికం/అడవిని నరికింది నాగరికం/అమాంతం ఆసాంతం అడవిని/బాంబులతో బద్దలుకొడుతున్నది ప్రపంచీకరణ”అంటాడు. నేడు మానవుడు క్రూర విద్వంసకుడుగా మారాడు.అందుకే మనిషి విలువలు మరచి స్వార్థంతో వికృతంగా బహురూపిగా మారి,వికృత ముఖంతో “పిచ్చుకలను చంపి/ప్రపంచ పిచ్చుకల దినం ఆచరించేవాడు/ తల్లిని చంపి తల్లుల దినోత్సవం/నవ్వులు చిదిమి నవ్వుల దినోత్సవం/సర్వనాశనం చేసి/ సంరక్షణ దినం” పాటిస్తాడు. అట్లాగే “ఒక చేతితో పర్యావరణ ఉద్యమానికి విరాళం ఇచ్చి/మరో చేత్తో పర్యావరణ విధ్వంసానికి దిగుతాడు” అంటూ ప్రకృతిని ఒలుచుకు తినేవాడు, ప్రకృతిని కాపాడుకునేవాడు ఒక్కటి కాదనే ఎరుకను కూడా కవి మన ముందుంచుతాడు.
చివరిగా... ప్రకృతిని అందంగా తీర్చిదిద్దింది మనిషి, మనిషి బ్రతుకును అంతకంటే అత్యద్భుతంగా తీర్చిదిద్దింది ప్రకృతి.దీనికి కాలమే సాక్ష్యం.గత కాలపు ప్రాణాంతక వ్యాధులను చైతన్యంతో పట్టుదలతో సాహసించి వ్యాక్సిన్లను కనిపెట్టి ఎందరినో కాపాడాడు.అలాగే ఈ కరోనా వైరస్ కు కూడా వ్యాక్సిన్ ని కనిపెట్టి త్వరలో చరిత్రలో నిలుస్తాడు.ఇది సత్యం.ఇది తథ్యం.ఎందుకంటే “విధ్వంసం ఎప్పుడు చెల్లదు/విలయం ఎంతోకాలం నిలవదు”అనే ఆశవాదాన్ని ప్రజల్లో నింపి ప్రపంచ మానవాళికి ఈ మాటలతో కవి భరోసానిస్తాడు.ఇంకా కవి మాటల్లో మూడు అయితేనే మనిషి. “బ్రతుకు/బతికించు/బతుకనివ్వు”;అందం/అనుబంధం/ఆదర్శం"-ఈ మూడు మూడింటితోనే జీవిత పరమార్థమని అందుకు మనిషి నిజమైన సంఘజీవిగా బ్రతకాలని చెప్తాడు. అట్లాగే గతకాలపు విపత్తులకు,వ్యాధులకు,యుద్ధాలకు మనిషే కారణం గనుక పరిష్కారం కూడా మనిషె.కాబట్టి మనిషితోనే ఎలాగైనా రేపు “చరిత్ర ద్వారం/తెరుచుకుంటుంది/పేచీ లేదు/మనిషి బతుక్కి కాలం పూచీ/సమస్త ప్రాణి/ సహజీవనానికి/పూచీ పడాల్సింది మనిషి/ఈ తరానికి/ రాబోయే తరాలకు అది హామీ”. ఇది ప్రతి ఒక్కరు ఎరుకలో పెట్టుకొని బ్రతకాలి.బ్రతకనివ్వాలని దానికి మనిషి హామీ పడాలనే బాధ్యత గుర్తు చేస్తాడు.
పాలక వర్గాలు,ప్రపంచ మైనింగ్ మాఫియా తరాల సహజ సంపదను కాజేస్తూ,తోటి వారిని,ఆదివాసులను నిర్వాసితుల జేస్తున్నారు.ఇది తప్పని, అన్యాయమని ప్రశ్నిస్తే దోపిడీని, హింసని చట్టబద్ధత చేసి ప్రజల్ని నిర్బంధించడం, హింసించడం, చంపడం కూడా చేస్తున్నారు.ఇదంతా మనం తరాలుగా చూస్తూనే ఉన్నాం.మాట్లాడుతున్నాం. అయినా ఇంకా ఇంకా బిగ్గరగా మాట్లాడాలి.లేకుంటే మరో ఉపద్రవానికి మనమంతా నేల కూలిపోవాల్సి ఉంటుంది. తప్పెవరూ జేసినా శిక్ష అందరికనే విషయం మర్చిపోవద్దు. అందుకే ప్రకృతి పరిరక్షణకు మనిషైన ప్రతోడు నిజాయితిగా నడవాల్సిన, నిలబడాల్సిన భాద్యత, అనివార్యత ఉంది. లేకుంటే ఏ ఒక్కరం మిగలం. ఈ అనివార్యమైన మందలింపే ఈ కావ్యపు లక్ష్యం.
01.11.2020
కవి కంటికి మనసుకు జరిగిన సహజమైన సంభాషణే ఈ"దృశ్యం నుండి దృశ్యానికి" కవిత్వం. ఇందులో 46 కవితలున్నయి.ఇవి ఒక వర్గానికో,కులానికో ఏదో ఒక దానికో మాత్రమే పరిమితమై రాసినవి కావు.విశాలమైన భావనల అనుభూతి.ఇందులో ప్రధానంగా కాలానికి మనిషికి మధ్య జరిగిన ఘర్షణ,మనిషితత్వం-జీవితం,ప్రకృతి,స్త్రీ సమస్య,సామాజిక అంశాలు,ప్రకృతి విపత్తులు వంటివి ఉన్నయి.ఇవి ఏక కాలంలో,ఒక ప్రాంతంలో నిలకడగా కూర్చొని రాసినవి కావని అనిపిస్తుంది.అందుకే కవితలన్నీ ఆకట్టుకునే విధంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నయి.కవి మనసుతో చూసిన దృశ్యాలను కళ్లకు కట్టినట్టుగా అక్షర రూపంలో చూపిస్తడు.చాలా కవితల్లో చివరి వాక్యం పూర్తి కవితను ఆవిష్కరించేవిధంగా ఉంటది.నాకైతే భిన్నమైన కవిత్వంగా భావిస్తున్న.ఇందులోని కొన్ని దృశ్యాలను మీ ముందుంచడానికి చిన్న ప్రయత్నం చేస్తున్న.
ఈ కవిత్వం రాసింది వి ఆర్ విద్యార్థి.తెలుగు సాహిత్యానికి సుపరిచితులు.రిటైరయ్యాక కూడా సాహిత్యం పై తనకున్న శ్రద్ధతో దీన్ని మన ముందు ఆవిష్కరించాడు.నేర్చుకునే వాళ్లకు ఉపయోగపడే విధంగా మలిచాడు.
"ఒక మహా విస్పోటనమే కదా
నీకు నాకు జన్మనిచ్చింది"
అంటూ ఒక బలమైన వాస్తవాన్ని చెబుతూ కాలానికి మనిషికి అనునిత్యం జరిగే ఘర్షణ గుర్తు చేస్తూ...
"హిమాలయం శ్వేత కమలమై
భూగోళమంత వికసించాలి
సింధు జలది ధరణి చుట్టూ
శాంతి వలయాలుగా విస్తరించాలి"
అంటూ స్వచ్ఛమైన కలగంటాడు.ఉగ్రవాదం,హింసమత్తు ఎప్పుడు అంతరిస్తాయోనని కాలాన్ని ప్రశ్నిస్తాడు."ఇప్పుడు" అనే మరో కవితలో తనే సమాధానంగా ఈ మాట చెప్తాడు
"ఇక ఇప్పుడు మనం
యుద్ధాన్ని ప్రకటించాల్సింది
దేశాల సరిహద్దుల మధ్య కాదు
మనిషి ఉన్మాదపు ఆలోచనల మీద"
అంటూ మనిషి ఆలోచనలు క్రూరంగా మారాయని,2021 వచ్చినా మనిషి ఇంకా కులం,మతం,లింగం,ప్రాంతం,వంటి వివక్షల పేర్చుతూనే ఉన్నాడని,అలాంటి అజ్ఞానాన్ని విషంలా ఎక్కించే ప్రగతి నిరోధక శక్తుల ఆలోచనలపై యుద్దం తప్పదని చెప్తాడు.
ఇంకా మనిషి దిగజారిన విధానాన్ని చెప్తూ
"ఏకంగా తనే దేవుళ్లను సృష్టించి
తన రుగ్మతలన్నీ నింపి
రాజ్యం చేయడం మొదలుపెట్టాడు
దేవుళ్ళయితే అడుగడుగునా వున్నారు
మనిషే కనిపించకుండా పోయాడు"
ఈమాట నిజం కాదని అనగలమా?.దేవుళ్ళ పేర జరిగే మూఢనమ్మకాలు ఆఖరికి మనిషి ఉనికినే లేకుండా చేస్తాయనేది ఈ కవితలో చెప్తాడు.
ఇంతలో కవి హృదయం మరో ప్రపంచాన్ని కాంక్షిస్తుంది.
"కులం లేదు మతం లేదు
జాతి లేదు జాతీయత లేదు
కృత్రిమ సరిహద్దులెన్నో
అధిగమిస్తాం
దేశికుల మాటలన్నీ
డొల్లలు
వొస్తావా
నేనొక ప్రపంచాన్ని కనుగొన్నాను" అంటూ మరో ప్రపంచంలోకి మనిషిని ఆహ్వానిస్తాడు.
ఇంకా ఇందులో కొందరు వ్యక్తుల్ని, కొన్ని సంఘటనల్ని యాది చేసుకుంటాడు.అవి తన హృదయాన్ని ఎంతగా కదిలించాయో రాసుకుంటాడు. రాజస్థాన్ కార్మికుడు,హిందుస్తానీ గాయకుడు "సికిందర్"ను తన ప్రతిబింబంగా "అద్దం"అనే కవితలో ప్రేమతో రాస్తాడు.కళల బాకీ తీర్చడం కోసం ఇద్దరు ఎంత వేదన పడ్డారో చెప్తూ
"ఐనా చివరి బాకీ తీరదు
కాలం మన విషయంలో
తేల్చాల్సింది చాలా ఉంది
పద మలుపు మలుపులో నిలదీద్దాం"
అంటాడు.
సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకులు, కవి బి నరసింగరావు గారికి అభివాదములతో ముచ్చటిస్తూ తనలోని సాహితీ ప్రయాణపు వేదనని తనముందు పరిచినప్పుడు అదంతా ఓపిగ్గా విని నర్సింగరావు గారు నవ్విన నవ్వు గురించి రాస్తూ...
"అది నా లోకాల్ని కంపింప జేసింది
నా చుట్టూ నిర్మించుకున్న
అభిప్రాయాల కుడ్యాల్ని కూల్చివేసింది
విశ్వాసాల సంకెళ్లను రాలగొట్టింది"
అని నర్సింగరావు గారి చేత మళ్ళి కోత్తగా ప్రేరేపించబడతాడు.
సమ్మక్క సారక్కల అమరత్వాన్ని స్మరించుకుంటూ ఆదివాసుల పై జరిగే దాడిని చెప్తూ
"నీతి నిత్యం పరిమళించే గిరిజాతులు
బతుకు లోకానికి చక్రవర్తులు
ఓర్వగలదా దళారి లోకం!
మతపు మాయ మెరుపుల బేహార్లుగానో
పురందుల దండమయ్యో
దండెత్తి వొస్తుంది
ఓనరులన్నీ కబళించి వేస్తుంది”
అంటూ శతాబ్దాలనుండి ఆదివాసీ ప్రజలపై జరుగుతున్న హింసాకాండను,ప్రకృతి విద్వాంసాన్ని,దళారి పెట్టుబడి దారుల కుట్రలను బట్టబయలు చేస్తాడు.
అనాది నుండి ప్రపంచమంతా విశాల మనసున్న పల్లెలు, మనుషుల అన్ని అవసరాలు తీర్చేవి.కానీ ప్రపంచీకరణ వచ్చి పల్లెలనెట్లా వల్లకాడులా మార్చాయో చెప్తూ
"ఇప్పుడు చూడు ప్రపంచీకరణ
గ్రామాల్ని ఎలా ఒంటరితనంలోకి నెట్టిందో!
ఎలా ఎడారుల్ని చేసిందో
చిన్నబోయిన గ్రామాలకు
తిరిగి చిరునవ్వు లెప్పుడో?
పూర్వవైభవాలెప్పుడో?" అని వలపోస్తాడు.
హుద్ హుద్ తుఫాన్ విపత్తు ధాటికి బలైన వారిని తలచుకొని విలపిస్తాడు.తుఫాన్ ఉత్తరాంధ్రకు చేరిందని వార్త వినగానే విశాఖపట్నం గుర్తుకొచ్చి
"నిరంతరం కలల అలలతో రెపరెపలాడే ఆ తీరం
ఎలా గాయపడింది...
విశాఖ ఆత్మ ఎంత ఘోషిందో
కృష్ణక్కా ఎలా ఉన్నావు?
చలసాని క్షేమమేనా
మాస్టారు మంచేనా
ఏమైనా ఇది చేదు కాలం...
ఓదార్చలేనంత దూరంగా వున్నాను"
అంటూ అమెరికా నుండి రాలేని,ఓదార్చలేని నిస్సహాయతను అక్షరరూపంలో రాసుకుంటాడు.
మహిళా సమస్యపై మాట్లాడుతూ....
"ఆడది చెడిపోయినప్పుడు
తోడుగా చెడింది చెట్టా పుట్టా?
మగవాడికి లేని శీలము
ఆడవాళ్ళకే అవసరమేమిటో"
అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,హత్యలు నిరసిస్తూ పితృస్వామ్య భావజాలం ఉన్న మనుషులకు సూటి పదునైన ప్రశ్న వేస్తాడు.
మరో కవితలో కామందుల క్రూరత్వాన్ని చెప్తూ
నిర్భయ చట్టం ముందుగూడా
వాడు నిర్భయంగా గంతులేస్తాడు
పైశాచికంగా ప్రవర్తిస్తాడు"
అంటూ ఉన్మాది స్వరూపాన్ని చెప్తూ
ఆడపిల్లలకు ఏడవకండి,మీలో అంతులేని పోరాట శక్తి ఉందని
"ధైర్యమే మీ కవచం
తిరుగుబాటు మీ ఆయుధం"
అని ధైర్యాన్ని చెప్తాడు.
చివరగా సాహితీ ప్రపంచానికి వద్దాం.నా ఇంట్లో గ్రంధాలయముంది,మెదట్లో అంతులేని జ్ఞానముంది,నా ఉపన్యాసాల్లో చాతుర్యముందని భ్రమపడే "అజ్ఞాన సామ్రాట్టు" గురించి చెప్తు
"చర్చలకు పిలిచిన నీలి సరస్సులోని
తెల్ల హంసల్ని
పూల తోటలోని గొంగలిపురుగుల్ని
ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపుల్ని
ఎప్పుడూ పట్టించుకోను" అని ఆ అజ్ఞాన సామ్రాట్టు అనుకుంటాడని,
ఇంకా తను అహంకారంతో
"గంగాజలం గూడా
నా శంఖంలో పోస్తేనే
అది తీర్థమవుతుంది
ఏ జెండా ఎగరాలన్నా
నా పెరట్లో పెరిగిన
గడకర్రయే మూలాధారం"
అని విర్రవీగుతాడు.
కానీ ఇప్పుడు కావల్సింది నిజమైన ప్రజాకవని.అతనెలా ఉంటాడంటే ఒక వర్గానికి మాత్రమే చెందకుండా,ప్రలోభాలకు లొంగకుండా ఉంటూ
"దేశాలు చీలినా
ఎల్లలన్నీ చెదిరినా
ప్రభుత్వాలు కూలినా
విధానాలు మారినా
జనం వెంట నడిచేవాడు
ప్రజా గళమై పలికేవాడు
ప్రజల చరిత్ర నిక్షిప్తం చేసేవాడు
అతడే సుమీ! ప్రజాకవి"
అంటూ ప్రజాకవికి నిజమైన నిర్వచనాన్ని చెప్తాడు.అది అందరూ ఆచరించాలని చెప్తూనే "నువ్వు నువ్వుగా రాయి" అంటూ ముందు తరపు భాద్యునిగా నేటితరానికి మార్గదర్శకం చేస్తాడు.
"నువ్వు దిగివచ్చిన లోకాల్ని రాయి
నీ వెంట తెచ్చిన అనుభూతుల్ని రాయి
మా అజ్ఞానపు అంధకారాన్ని తెంపు
మా ఎదల పాచుట్టు దులుపు
మా హృదయాల్లో నవ వసంతాల్ని చిలుకు"
అంటూ నేటి తరాన్ని మీకు చేతనైనంత వరకు ప్రగతిశీల భావంతో చరిత్రను,మమ్మల్ని కూడా నడిపించండి, మీ అనంతరం మరో తరం ఆ బాధ్యతను తన భుజాలకి ఎత్తుకుంటది అని చెప్తాడు.
విశాలమైన అంశాల పట్ల విశాల దృక్పథంతో ఉన్న కవిత్వమిది.ఈ కవితలు చదువుతుంటే దృశ్యాలు కండ్ల ముందటే తిరుగుతుంటాయి.అదే ఈ కవిత్వం గొప్పతనం.అదే కవి ఊహ శక్తి. కవి అనే వాళ్లు ఎంతగా ఆలోచించవచ్చో,ఎంతగా ఆలోచించగలరో "దృశ్యం నుండి దృశ్యానికి" చెప్తుంది.వి ఆర్ విద్యార్థి గారు ఇంకా "విద్యార్థి"నే అని మన తరానికి ఈ పుస్తకం ద్వారా సంకేతమిచ్చాడని అనిపిస్తుంది.
'బహుళ' నవలను ఉత్తరాంధ్ర సాహితీకారుడు అట్టాడ అప్పల్నాయుడు రాయగా శ్రీకాకుళ సాహితీ ప్రచురించింది.ఈ నవలను నాలుగు తరాల మనుషులతో వందేళ్ల చరిత్ర గతిని తాకుతూ బాధ్యతతో నడిపిన తీరు కనిపిస్తుంది.
466 పేజీల ఈ నవలను ఎవరు చదవాలి?ఎప్పుడు చదవాలి?ఎందుకు చదవాలనే ప్రధాన ప్రశ్నలు వేసుకుంటే...
ఈ తరం చదవాలి,అలస్యమొద్దు ఇప్పుడే చదవాలి,భవిష్యత్ సమాజ నిర్మాణం కోసం చదవాలనే సమాధానాలే వస్తాయి.ఎందుకంటే ఈ నవల ప్రధానంగా వంశధార,నాగావళి,ప్రళయవతి నదుల తడుల జాడల్లోని శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లోని పల్లెల్లో,గుడాల్లో, వాడల్లోని భూమి సమస్య,అంతకు మించి స్త్రీ సమస్య,గ్రామీణ ఆదివాసీల,రైతుల,రైతు కూలీల సమస్య,కుల సమస్య,జమీందార్ల ఈనాందార్లు అరాచకాలు,షావుకార్ల దోపిడీ,కార్పొరేట్ల వనరుల దోపిడీ,బూర్జువా రాజకీయ నాయకుల స్వార్థం,ప్రజలపై రాజ్యం అణిచివేత,రాజ్య హింస, అన్నింటికీ పరిష్కార మార్గంగా విప్లవోద్యమం,కొనసాగింపుగా బహుజనోద్యమం కలయిక వంటి అంశాలతో గతాన్ని ప్రస్తుతాన్ని చిత్రీకరించింది.
నవలలోని కొన్ని పాత్రలు ఆమాయకత్వంగా,వీరోచితంగా, చైతన్యవంతంగానూ మరికొన్ని పాత్రలు దళారితనంతో, నియంతృత్వంగా ఉంటాయి.ఆసక్తికరమైన విషయం ఏంటంటే సందర్భానుసారంగా హఠాత్తుగా పాత్రలు ప్రవేశించి పాఠకుల్ని గతానికి తీసుకెళ్లి మళ్ళీ వర్తమానంతో పయనింపజేస్తాయి.
ఈ నవల కడదాకా మహిళలు, పురుషులు సమాన స్థాయిలో జీవించిన విధానం, విప్లవోద్యమంలో నడిచిన తీరు అద్భుతం.
నారాయుడుతో నవల మొదలై తాతైన పెదనారాయుడిని యాది చేసుకుంటుంది.ప్రజా కళల్ని,తాతని వీరోచితంగా ఎత్తి పడుతూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది.గుడి లోపలి అగ్రహార సాహిత్యాన్ని ఈసడించుకుంటుంది.కళకు కులం లేదని నారాయుడుతో చెప్పిస్తుంది. ప్రేమకు కులం లేదని బంగారమ్మను నారాయుడిని ఒక్కటి చేస్తుంది.ఎన్ని కష్టాలొచ్చినా వీడొద్దంటుంది.పరిస్థితులు దుర్మార్గమైనవి.వాళ్ళ బంధం ఎంతో కాలం నిలవలేదు.
కొన్నాళ్లకు కొడుకు రాధేయతో తిరిగి పుట్టినూరుకొచ్చిన బంగారమ్మ భరించిన కులపరమైన అవమానాలు,వేదన భారం మోయలేనిది.నిత్యం గొల్ల కాపుల గొడవలు,తండ్రి మరణం,తండ్రి తర్వాతి తండ్రి లాంటి రామస్వామి నాయుడు చేరదీత,అన్నపూర్ణమ్మ(రామస్వామి బిడ్డ) చేయూత అయినా ఆగని అవమానాలు"నా వల్లే నారాయుడి కి ఇన్ని కష్టాలు"అని ఓ రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా మాయమైన బంగారమ్మ.ఆ తల్లి ఎక్కడ ఎలా మళ్ళీ ప్రత్యక్షమవుతుందోనని ఎదురు చూస్తూ చదవసాగాను.
పెద్దల ఒత్తిడితో అన్నపూర్ణమ్మ కొన్ని నెలలకు నారాయుడిని పెళ్లాడింది.బంగారమ్మ కొడుకు రాధేయను పెదబాబు అంది.తనూ ఇద్దరు ఆడపిల్లల్ని,ఒక మొగ పిల్లాడ్ని కంది.బంగారమ్మ బాధల్ని,నారాయుడి బాధల్ని కలిపి భుజాన కెత్తుకుంది. ఎంత బరువైన దించలేదు.ఇద్దరూ వ్యవసాయం మొదలుపెట్టిన్రు.కరువు వెంటాడింది.అప్పు మీద అప్పు పెరిగింది.పిల్లల ఆకలిని దీర్చ,రాధేయ చదువుకు ఇంకా ఇంకా అప్పు చేయాల్సి వచ్చింది.నారాయుడు బంగారమ్మను,అన్నపూర్ణమ్మ ను,బాధల్ని ఎప్పటికి తలుచుకునే వాడు.
రాధేయ పై చదువులకు పట్నానికి కాలేజ్ కెళ్లాడు.స్వామి మాస్టర్ పోరు పాఠాలు ఆలోచింపజేశాయి. సత్యం,కైలాసం ల అమరత్వం తన గుండెను తాకింది.జన కళా మండలి పాటగడయ్యాడు, నాటకాలు రచించ సాగాడు, ఉపన్యాసాలిచ్చాడు.అజ్ఞాత సూరీడు 'బలరాం' నాయకత్వంలో తన జీవితాన్ని చైతన్యవంతం గా మలుచుకున్నాడు.కనకం నాయుడు లాంటి వాళ్ళతో కలిసి పోరాటాల్లో నడిచాడు.
అటు కుటుంబాన్ని,ఇటు ఉద్యమాన్ని రెంటినీ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలోనే సంద్యతో పెళ్లి.ఆదర్శ వివాహం.అందరూ ఆచరించాల్సిన కుల నిర్ములన కార్యక్రమం.సంధ్య పెళ్లిని విప్లవ కార్యకర్తలైన తండ్రి బలరాం ఒప్పుకున్నట్టు తల్లి సీతాలమ్మ ఒప్పుకోలేక పోయింది.సీతాలమ్మ విప్లవ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పటికీ బిడ్డ జీవితంలో భర్త తన వెంటే వుండేవాడై ఉండాలని భావించింది.నా జీవితంలా తన జీవితం కాకూడదని ఒప్పుకోలేకపోయింది. కానీ చేసేదేమిలేక వూకుంది.
ఇద్దరూ పెళ్లికి ముందు తర్వాత ఉద్యమాల్లో పాల్గొన్నారు.అక్రమ కేసుల్లో లాఠీ దెబ్బలు తిన్నారు,చిప్ప కూడు తిన్నారు.సీతాలమ్మ ,ఇంకా ప్రజలెందరో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు.
రాధేయ సంధ్యలు కష్టాల్ని భుజాలపైకి ఎత్తుకున్నారు.ఉపాధి కోసం మూర్తి గారి వార్త పత్రికలో ఇష్టమైన ఎడిటోరియల్ పేజీ బాధ్యత చూడడం, సంపాదకీయాలు రాయడం, ఇంటర్వ్యూలు చేయడం,కొంత కాలానికే ఆ పత్రిక మూత పడడంతో బాధల్ షురూ... కొంత సెట్ అయింది జీవితం అనుకునే సమయానికి మళ్ళీ అవాంతరాలు రావడం యధావిధిగా రోడ్ పై పడ్డం రొటీన్ అయిపోయింది.అయినా ఏమాత్రం నిరాశ పడకుండా ప్రయత్నించడం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో చివరగా వ్యవసాయం మొదలుపెట్టారు.సంధ్య రైతుగా మారింది.ప్రమీల నడిపే స్కూల్ లో రాధేయ చిత్రకళ,సాహిత్యం నేర్పసాగాడు.రాధేయ అక్కడే సత్యకాం(ప్రమీల కొడుకు) ని కనుగొన్నాడు.రాజకీయం నేర్పాడు.
ఇంట్లో గొడవలు,వ్యవసాయంలో తప్పని గండాలతో భాద పడే క్రమంలో జాబ్ రావడంతో పట్నానికి మకాం మార్చారు.వాళ్లకు అనుపమ,కిరణ్ ఇద్దరూ జన్మించారు.
ఆ తర్వాత తండ్రి నారాయుడు మరణం,కొన్నేళ్లకు అన్నపూర్ణమ్మ మరణం,ఆ తర్వాత భార్య సంధ్య కేన్సర్ తో మరణించడం తనను ఎంతో కుంగదీశాయి.
ఈ నవల కుల నిర్మూలనకు తీసుకున్న కార్యక్రమం గురించి చెప్తుంది.విప్లవోద్యమం బలంగా ఉన్న రోజుల్లోనే ప్రమీల (రాధేయ మిత్రుని భార్య) కి కులం పేర జరిగిన అవమానాన్ని ఖండిస్తూ కుల నిర్ములాన కార్యక్రమం సామూహికంగా చేయడం కనపడుతుంది.అది మంచి పరిమాణం కానీ తర్వాత దాని కొనసాగింపు కనపడదు.
నిజానికి ఈ నవలలో అంటే చరిత్రలో ముఖ్యంగా శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలపై జరిగిన రాజ్యహింసను కండ్లకు కట్టినట్టు చూపించారు.నారాయుడి జీవితంలా ఎందరో అక్రమ కేసులతో,పోలీస్ చిత్రహింసలతో బలయ్యారో, కుటుంబాలు ఎట్లా చిన్నాభిన్నం అయ్యాయో,నిత్య ఎన్కౌంటర్లతో ఎందరో తల్లులకు కడుపుకోత మిగిలిందో తలుచుకుంటే దుఃఖామాగదు.
అనంతరం విప్లవ పార్టీ చీలికలు,తర్వాత ఏం చేయాలనే తెల్వని సంధి, మూర్తి లాంటి వాళ్ళు ఎందరో వ్యక్తిగత సంసారాల్లోకి జారుకోవడం బాధించినా, సత్యాకాం లాంటి ఈ తరం యువకులు ప్రత్యామ్నాయ రాజకీయాలకు అంబేద్కరిజాన్ని జోడిస్తూ ప్రజా రాజకీయాల్లో భాగమవడం సంతోషమేస్తోంది.
సత్యకాం రాధేయతో...
"మార్చుకోవాలి గదా సార్ అన్నీ!గతాన్ని అలాగ ఫాలో అయిపోవడం కాదు.వర్తమానానికి పనికొచ్చేట్టు మార్చుకోవాలి గదా"అంటాడు.
అట్లాగే సత్యకాం "పెదనారాయుడి సభ"ను జరపబోతుండడం,సత్యకాం ద్వారా రాధేయకందిన ఆహ్వానంతో కొన్నేళ్ల తర్వాత రాధేయ కొడుకు కొడుకైన ప్రభాత్ తో ఊరికి రావడం,ఊరంతా కృత్రిమ మవ్వడం,ఊరి యంత్రికత నిరాశపరుస్తుంది.అంతటా ఇదే ఘోష.
రాజకీయాల పట్ల రాధేయ సత్యకాంల సంభాషణ ఇలా సాగింది.
"కార్పొరేటికరణ చేసే అభివృద్ధి మనుషుల్ని విడదీస్తుంది.దాని విధ్వంసం మనుషుల్ని ఏకం చేస్తుంది "
"మనుషుల్ని ఏకం చేసే అభివృద్ధి కోసం ఆలోచించాలి సార్ అంటాడు సత్యకాం."
ఆ తర్వాత సొంతూరిలో మనిషిగా నిషేధింపబడడం,పోలీస్ వాగ్వాదం,సభ జరుగుతుండటం,ప్రజా కళల ప్రదర్శన,రాధేయ పాట పాడి అనంతరం మాట్లాడుతూ...
"సమాజాన్ని మార్చడానికి బహుళ ప్రయోగాలు అవసరం.బహుజన ఉద్యమం అవసరం అని ఇక్కడ సత్యకాం ద్వారా, మీ ద్వారా, మీ విశాల ఐక్య సంఘటన ఉద్యమం ద్వారా తెలుసుకున్నాను. మీ వెంట నుంటాను.మీతో నడుస్తాను. నమస్కారం" అని ఉపన్యాసాన్ని ఉద్వేగబరితంగా ముగించాడు.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాల అణిచేందుకు ప్రజా విద్యార్థి మహిళ హక్కుల సంఘాల పై సంవత్సరం పాటు నిషేధం విధించడం చూస్తే సత్యకాం అన్నట్టు,రాధేయ చెప్పినట్టు ప్రజల్ని ఏకం చేసే బాధ్యత ఎత్తుకోవాలి.జీవించే హక్కు కోసం,రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఫాసిస్ట్ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా 'బహుళ' పోరాట రూపాలతో పోరాడేందుకు అందరూ సిద్ధం కావాలి.
ప్రజా కళలు ప్రజా సాహిత్యం
వర్ధిల్లాలి...వర్ధిల్లాలి...
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు