మా రచయితలు

రచయిత పేరు:    ఉప్పులేటి సదయ్య

కవితలు

నన్ను కన్న తల్లి 

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది

తాను పనికి పోవచ్చని

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది ఒక్కపూటైనా కడుపునిండా బువ్వ తింటుందని

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది జీవంలేని బట్టలై నా దొరుకుతాయని

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది అక్షరాల మర్మమేందో తెలుస్తుందని

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది అంకెల అంతు చూస్తుందని

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది సాంఘికం లో అసాంఘికం ఎరుగునని

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది  రాజకీయాల రంగు బయటపెడుతుందని ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది మూడు రంగుల మురుగు తెలుపుతుందని

ఒక తల్లి బిడ్డను బడికి పంపుతుంది నూతన మానవ ఆవిష్కరణ జరుగుతుందని

హు........

నన్ను కన్న తల్లి

ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తే

నన్ను కన్న నా గురువు

ప్రపంచాన్ని నాకు పరిచయం చేశాడు

 

కథలు

నక్క-తోక 

రాత్రంతా ఒక్కటే  కుక్కల మొరుగుడు. ఒక సక్కిన నిదుర పట్టిన పాపాన పోలే. భౌ భౌమని మొరుగుడుకు చెవులు గడెలుపడ్డై కాని మొరిగె కుక్కల నోరు బొంగు పోలే. అదేం సిత్రమో కాని మమ్ముల ఎప్పుడు చూసిన మొరగని కుక్కలు కొత్త మొకాలు కొత్త ఆకారాలు చూసినప్పుడు మాత్రం రికాం లేకుంట మొరుగుతై. అవ్విటికి కూడా తెలుసు మా వోల్లు ఎవలు మందోల్లు ఎవలని. కుక్కల మొరుగుడు చుక్కల మెరుపుల మధ్య కష్టంగానే తెల్లారింది. నిదుర సరిగా లేక కళ్లు మంట మండుతున్నయి. పానం సొలిగినట్టు అయితంది. పానంల ఎట్లున్న తప్పదన్నట్ట్టు మొక్కి చీపురుపట్టి బర్కు బర్కు మని సప్పుడు రాంగ ఊడుత్తండ్లు  అలుకులేని పొక్కిలి ఆకిలల్ల. ఎటుదిక్కు చూసినా ఒక్క మగ పురుగు కనిపిత్తలేదు. నిన్న మసుకు పడంగా  కలో గంజో తాగి పత్తా లేకుండ పోయిండ్లు. ఊరంత నిమ్మలంగానే ఉన్నట్టుగా ఉన్నది. కాని మొత్తం మన ఆధీనంల లేకుంట ఉన్నది. మచ్చల మచ్చల బట్టలు, బారెడు బారెడు తుపాకులతోని గిచ్చుతే రక్తం కారే పొల్లగాండ్లతో ఊరు ఊరుంత కుయ్యిమనకుంట  ఉన్నది. ఎక్కడనో ఒక్క కాడ కుక్క మొరుగుతూనే ఉంది. దాని మొరుగుడు ఏవో సంకేతాలు అందిస్తున్నది. ఊల్లె ఏం జరుగుతుందో ఎవలనన్న అడుగుదాం అనుకుంటే మనకెంత తెలుసో అల్లకు కూడా అంతే తెలుసు. కాని ఏదో జరుగుతుందని మాత్రం అందరికి ఎరికె. బారెడు తుపాకి ఒక్కటి బుజాన పెట్టుకొని ఇద్దరు రంగు, రూపం నడుక మనది కాని మిలిటిరి పోలీసులతోని మాదిగ వాడకు అచ్చిండ్లు లోకల్‍ పోలీసు. అచ్చిరాంగానే బూతుల వర్షం కురిపిస్తూ ఆడుకునే పోరన్ని చెంప మీదకెల్లి పెడెల్‍మని సరిసిండు. ఆ దెబ్బకు మిరుగులు రాలినై. కండ్లకు చెక్కరచింది. లబోదిబోమని మొత్తుకుంట ఇంట్లకు ఉరికిండు. కొట్టుడాపి మొగ పురుగు లేని మాదిగ ఆడోల్లను నోటికచ్చిన తిట్లు తిడుతూ... ఏ లం... కాన పెద్ద మాదిగోడెవ్వడే అని చాలా సౌమ్యంగా అడిగిండు. మొక్కి, చీపురు చేతులపట్టుకోని తిడుతున్న పోలీసులకు గౌరవిస్తూ దండం పెట్టింది మాదిగ నడీడు మనిషి. ‘‘ఎవ్వడెవ్వడె పెద్ద మాదిగ లం...కొడుకులు ఉన్నరా? దెంకపోయిండ్ల? ఈ నవ్వల కుక్కల్‍దెం....’’అంటూ ఇంక తిట్టబోయిన పోలీసుకు ‘‘ఇగో గీ ఇంటాయన, గా యింటాయిన బాంచెన్‍’’ అని సూపించింది. చూపటమే ఆలస్యంగా అటువైపుగా నడక సాగించాడు తెలుగు పోలీసు. మిటిటిరి పోలీసులు మాత్రం చూపులతోనే కండకండాలుగా కొరుక్కతింటం అన్నట్టుగా సూత్తండ్లు నడీడు మాదిగ స్త్రీని. అది గమనించి  ఆ మాదిగ మహిళ పక్కనే ఉన్న కుక్కను ‘‘అడీ, ఈ కుక్కలకు గత్తరు రాను’’ అని మొరం తేలిన వాకిల్లోని ఒక్క రాయిని తీసి కుక్కను కొట్టి గుడిసెలకు పోయింది.

                ‘‘అరేయ్‍ లం...కొడుక ఎవ్వడెవ్వడుర పెద్ద మాదిగలు’’.

                ‘‘అయ్యా! బాంచెన్‍ నేనుమా అన్న కొడుకు’’

                ‘‘సరె నడువుండ్లి అమీన్‍ సాబ్‍ ఊరుసాటింపు చెయ్యిమన్నడు. పాయి చెయ్యుండ్లి. నిన్న సావుకారి సేండ్ల ఏరుకచ్చిన మిరుపకాయలు, పల్లికాయలు అనుమండ్ల కాడికి తీసుకు రమ్మని ఊరంత సాటింపు చెయ్యిపోండ్లిర. జెప్పన నడువుండ్లి’’ అనంగనే  బిరాన లేసి, తోలు డప్పు సంకన ఏసుకొని అయిదు గుడిసెల అవుతల ఉన్న తోటి పెద్ద మాదిగ బక్కయ్య దగ్గరకు పోయిండు ఎంకయ్య. వరుసకు కొడుకే, కాని వయసుల ఎంకయ్య కంటే బక్కయ్య పెద్దవాడు. వరుస పెట్టి పిలుత్తడు సిన్నాయిన్న అని. అప్పుడప్పుడు తిట్టుడు కూడా తిడుతడు. ఇది వాల్ల ఇద్దరి మధ్యల మాములే. బక్కయ్య బక్కగా ఉండటం వల్ల బక్కయ్య అనే పేరు పెట్టారు. ‘‘అరేయ్‍ బక్కా, అమీన్‍సాబ్‍, ఊరు సాటింపు చెయ్యిమన్నడు. నడువురా’’ అనంగానే అతన్ని ‘‘ఆగుర నాయిన్న’’ అని ఎంకయ్య ఎంట నడిసిండు బక్కయ్య. ఇగపోతే వీళ్లిద్దరిని తోటి మాదిగలు, ఊరంతా ముద్దుగా పిలుసుకునే మారు పేర్లు కూడా ఉన్నాయి.  బక్కయ్యను నక్క అని, ఎంకయ్యను తోక  అని పిలుస్తారు. ఎక్కడ పంచాయితీ జరిగినా ఏ కులస్థులైన చివరకు ఊరి దొర అయినా ఈల్లు ఇద్దరు లేనిది పంచాయితీ చేసిన పాపాన పోలేదు అంటే వీల్ల ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పంచాయితీ జరుగుతున్నంత సేపు నిమ్మలంగ ఇని బాగ ఇసారించి మాట్లాడెటోడు బక్కయ్య. తప్పు ఎవ్వలది ఉన్న కరాకండిగ చెప్పేవాడు. ఈ బక్కయ్యను అనుసరిస్తూ ఏప్పటికి తనవెంట పోవటం వల్లన ఎంకయ్యకు తోక అని పేరు పెట్టారు తోక ప్రియులంత. ఎంకయ్య సింగరేణి నౌకరుసేసి అల్లునికి పెట్టిచ్చి అచ్చిండు. కొంచెం తెల్లబట్టలు ఏసుకోని ఆడ ఆడ ఇంగిలీసు పదాలు మాట్లాడి బాగా తెలిసినోని లెక్క బడాయిలు కొడుతూ అబాసు పాలవడం సర్వసాధారణం అయ్యింది. ఇంట్ల తిండికి లేకున్నా, మసిలెక్క ఉన్న బట్టలు ఏసుకున్నా, పండగలకో పబ్బానికో అప్పాలు అడుక్కతిన్నా గాని బక్కయ్య లాలూచితనం ఎరుగడు. ఎంకయ్య కొద్దిగ లాబం జరుగుతది అనుకుంటే మసిపూసి మారేడుకాయ చేద్దామని సూసే స్వభావం కలవాడని ఊరి జనమంతా చెవులు కొరుక్కుంటరు. బక్కయ్యకు మనిషి మాట్లాడే మాటల వెనకాల ఆంతర్యం తెలుసు. రేపు ఏం జరుగబోతుందో ఊహించగలిగే వాడు. ఎంకయ్య పెడితే పెండ్లి కోరుతడు లేకపోతే సావు కోరుతడు. చివరకు దొరది తప్పు దొరికిన దండం బాంచెన్‍ ఎటు సూసిన కొద్దిగ మీ దిక్కే....అని గునుగుతూ ‘‘ఇగ మీకు తెలువనిది ఏమున్నది, మీకింద ఎంతటోల్లం, మీరు్ల  సేసి ఉండవలిసింది కాదు’’ అంటూ తప్పు ఎత్తి సూపే నేర్పు గలవాడు.

                నిశబ్దంగా ఉన్న ఊరిలో ఒక్కసారిగ చిర్రెచిటికెనతోటి దనదన వాయిస్తూ ‘‘నిన్న సావుకారి తోటల ఏరుకచ్చిన మిరుపకాయలు, పల్లికాయలు పట్టుకోని అనుమండ్ల గద్దెకాడికి రావాలని అమీన్‍సాబ్‍ చెప్పిండో హో....’’ డడడడ..... డాంటక్క టక్క టక్క డాంటక్కటక్క టక్క...అని ఊరిలో ఉన్న కమ్మరి, కుమ్మరి, కాపు, తెనుగు, నాతకని, మాల, బెస్త, మేదరి వాడలంత తిరిగి ఊరు సాటింపు సేసిండ్లు. చిర్రె సిటికెన బ్వుసేతెల పుర్రచెయి జబ్బకు దప్పు ఏసుకోని తిరిగి రాంగ ‘‘అరేయ్‍ ఎంకటిగా ఇగో గీ పెరండ్ల వడి ఇంటికి పోదాంపద..’’ బక్కయ్య అన్నడు.

                ‘‘ఇంటికెందుకుర, అమీన్‍ సాబ్‍కు కలువద్దా....కలుద్దాం పా. మనం గింత పనిసేసినం సర్కారుకు కలువకుంటే ఎట్ల? కలిసే పోదాం...’’ ఎంకయ్య.....

                ఓరి తోకోడ ‘‘తల్లి సన్ను కోసెటోడు పోలీసోడు. గాడికి పోయి కలుద్దామంటవేందిర ఏతుల లం...కొడుక. ఇనుర జెర్ర నా మట ఇనుర’’.

                ‘‘నీయవ్వ నువ్వో మనిషివారా? సర్కారుకు కలువకపోతే మనల గురించి ఏమనుకుంటడుర... కలువాలే’’ అని అనుమాండ్ల కాడికి దారితీసిండు ఇంటికి పోయే దారిడిసి.

                ‘‘ఇనుర...

                అద్దుర...

                నీ దయర, మన ఇండ్లదాక అచ్చినం కదరా. పోదాం పారా. ఇంటికాడ కూడ ఉండద్దుర, ఆని కంట్లె పడద్దుర, ఎటన్న పోదాంపార’’ లొట్టిమీద కాకిలెక్క ఒర్రిన ఇనలే. ఎంకయ్య చెయ్యి పట్టుకోని ఎంబడి తీసుక పోయిండు అనుమండ్లకాడికి ఉబ్బెచ్చులకు పులినోట్లే తలుకాయ పెట్టిపోయినట్టు.

                మూల తిరిగి దొర ఇంటికాడికి రాంగానే కందికట్టె కొట్టినట్టు సప్పుడయితంది. అడుగు ముందుకు పడ్డకొద్ది చెవులకు ఇనికిడి దగ్గర అయితంది అవ్వ, అయ్యఇవే రెండు మాటలు ఇనపడుతన్నయి. అప్పటికే దొరికినోన్ని దొరికినట్టు తీసుకచ్చి విశాలంగా ఉన్న అనుమండ్ల గద్దె మీద బోర్లబొక్కల పండబెట్టి పిర్రల మీదికెల్లి ఒక్కటే దంచుడు. రెండు, మూడు దెబ్బలు దాక ఒర్రి తరువాత తిమ్మిరెక్కి ఏం ఏర్పడక ఒర్రుడు ఆగిపోతంది అనుమంతుడు సూడంగనే. ఎర్ర గొర్రెలెక్క ఉన్న కొంత మంది మిలిటిరి పోలీసులు మంటపెట్టి పల్లి కాయలు కాలుసుకొని ఆవురావురు మన్నట్టు బుక్కుతాండ్లు. ఇదంతా గమనించిన బక్కయ్యకు ఏం జరుగబోతుందో కండ్ల ముందట కనిపిత్తంది. అవ్వన్ని ఏం పట్టనట్టు ఎంకయ్య మాత్రం అమీన్‍ సాబ్‍ దగ్గరకు పోయి సెప్పులు ఇడిసి మాల మాదిగ సబ్బండ వర్ణాలకు సాటింపు సేసినం బాంచెన్‍ అని దండం బెట్టిండు అతి వినయంగా.

                ‘అందరైండ్రు కదరా ఈన్ని పండబెట్టుండ్లి లంజకొడుకునుఅని ఎంకయ్యను సూపించిండు అమీన్‍ సాబ్‍. సుపటమే తరువాయ్‍ ఎంకయ్యను గద్దెమీద పండబెట్టి చేతుల మీద, కాళ్ళమీద ఇద్దరు పోలీసులు నిలవడ్డరు. ఇంకో పోలీసు కట్టెవట్టి పిర్రల మీదికెల్లి ఇయ్యర మయ్యర కొట్టుతాంటే అవ్వ, అయ్యఅని కొంత సేపు మొత్తుకున్నడు. తరువాత  అరుపులు బందయినయి. ఇదంతా కండ్ల రిండ సూసిన బక్కయ్య ఎంకని పని అయింది తరువాత నేనేఅని ఎట్లనన్న ఈ గండం నుంచి బైటపడాలని ఇకమతుసేసి దొర గడికి ఆనుకొని కూసొని మోకాళ్ళ మధ్యల తలకాయ పెట్టి కంగు, కంగు మని ఒక్కటే దగ్గుడు. బుక్కెడు, బుక్కెడు ఊంచుకుంట అచ్చిపోయే పానాలు సేసి తేలగండ్లు సేసిండు. కొంత సేపటిదాక ఏం జరిగిందో గద్దెమీద పోలీసుల కాళ్ళ కింద ఉన్న ఎంకయ్యకు, గొడకానుకొని పాణం కాపాడుకోను విశ్వప్రయత్నం చేసిన బక్కయ్యకు తెలువలేదు. దెబ్బ మీద దెబ్బ తలుగడం వల్ల తిమ్మిరెక్కి ఏం జరుగనట్టే నడిసిండు ఎంకయ్య, సోలుక్కుంట, కిందమీద సేసుకుంటు బక్కయ్య, ఇద్దరు కలిసి ఇంటిమొకం బట్టిండ్లు. ఎవ్వల ఇంటికాల్లు పోయిండ్లు.

                వ్యానుల పల్లికాయ, మిరుపకాయ లోడు సేసుకోని, జీబులల్ల పోలీసులు ఊరు దాటిండ్లు. మాపటల్లకు కుక్కల  మొరుగుడు  బందైంది. బిక్కుబిక్కు మంటూ అరసేతిల పాణం పెట్టుకోని ఇండ్లల్లకు సేరుకున్నరు మొగోల్లంత.

                తిమ్మిరి తక్కో అయిన కొద్ది ఎంకయ్యకు కూసోవత్తలేతు. పిర్రలు జలుపుతున్నయి. అప్పటిదాక మానం బోతదని చెప్పని బాధనంతా నొప్పి ఎక్కువ అయినకొద్దీ ఇగ లాబంలేదని భార్యను పిలిసి జరిగిందంతా సెప్పుకున్నడు. ఉన్నట్టుండి ఒక్కసారి లబొదిబో అని ఏడుపు...ఏం జరిగిందాఅని అందరు ఇంటిముందట జమగూడిండ్లు బక్కయ్యతో సహ. నా ముండకొడుకును పోలీసులు కొట్టిండ్లాట బాంచెన్‍. ఆని సేతులు కాలిపోను. ఆడు నాషడంగాను. ఆని మీద మన్ను పొయ్యఅని ఏడ్తుత్తంది ఏం చేసేది లేక భార్య. కాళ్ళ మీద కూసున్న బక్కయ్య కలిపించుకొని ఇన్నవార, లం....కొడుక అద్దుర అంటే పోదామంటివి. ఏమైందిర? ఆరి బక్కోడ, నన్ను కొట్టుడు సూసి కంగుకంగుమని దగ్గుకుంట గుడ్లు కిందమీద జేసుకుంట దొర గోడకు ఒరిగినవర  నక్క లం...కొడుక. నేను నీ లెక్కన్నార.. ఎంకయ్య’.

                ‘‘మరేం సెయ్యి మంటవ్‍ర, నేను సెప్పుతే ఇనక పోతివి. ఆడు పోలీసు బట్టలేసుకుంటే తల్లి సన్ను కొసుటానికి ఎనుక ముందాడడు. ఆని నౌకరసోంటిదన్న. నువు ఇన్నవుర. ఏతులకు అమీన్‍ సాబ్‍ను కలుదాం అన్నవ్‍. ఏమయిందిర పండబెట్టి పిర్రలు పలుగకొట్టిండు’’.

                ‘‘ఆవ్‍ బక్కులు ఇద్దరు పోయిండ్లు కదా. నా మొగన్ని ఒక్కన్నే కొట్టిండు నిన్నెందుకు కొట్టలే’’ అని సేతులు ఆడిస్తూ  బక్కయ్య మీదికి అరిచింది ఎంకయ్య భార్య. మధ్యల కలిపించుకొని ‘‘ఆని తోని నేను కూడ దెబ్బలు తినల్నానే  సిన్నవ్వ. నేను ఎంత మంచిగ సెప్పిన ఇనలే. నేనేం చెయ్యాలే. ఆడు ఏతులకు పోయి పాణం మీదికి తెచ్చుకున్నడు’’ అని ఉన్నది ఉన్నట్టు సెప్పిండు తన తప్పులేదని బక్కయ్య.

                ఇక్కడ జరిగిందంతా అచ్చిన జనాలు సూసుకుంట అయ్యో పాపం అని కొందరంటే, అబ్బా ఈని ఏతులతనం ఇంక పొనిచ్చుకోలే అని ముసిముసి నవ్వేటోల్లు కొంతమంది. నీలగిరాకు, ఆయిలాకు ఏసి మసల మలస కాగబట్టి తానం పోసిండ్లు. ఇరువై రోజులదాక ఎంకయ్యకు ఏరుగ కూసోరాలే. పోలీసులు కొట్టిన దానికంటే బక్కయ్య పాణం కాపాడుకొవటానికి సేసిన ఇకమతు ఇమిడిచ్చుకోలేక పోతాండు ఎంకయ్య.

                ఈ సంఘటన ఎప్పుడు మాట్లాడుకున్న అబ్బ నీకు నక్క అని ఎవ్వలు పెట్టిండ్లో కాని మంచి ఇకమతుతోని బైటపడ్డవే. ఈ తోకొనికి ఉబ్బెచ్చులతనం బోదే, అచ్చినోల్లందరికి గోసి జరిపి పిర్రలు సుపిత్తె ఎర్రగా ఆసినైఅంటూ యువకులంతా పగలబడి నవ్వేటోల్లు.

ఉడో

            ‘‘వాడేమో రకరకాల సట్టాలు రకరకాలుగా తేవట్టే... ఈ మల్కనన్న ఓడిపోతడ.. ఓడిపోడ...?’’

            ‘‘ఏమోర ఆనికి ఎదురుగా ఉన్నోల్లు బలం కల్లోల్లు కాదాయే. ఈనికేమో పట్టపగాలు లేకుంట ఆయితన్నయి. ఇగ పోరగండ్లను సూడపోతే ఆడు సావుమంటె ఎనుక ముందాడకుంట సచ్చెటందుకు తయారైతండ్లాయే’’.

            ‘‘ఈసారి బాగ పంచుతండ్లు కింద మీద పడి గెలువల్లని’’.

            ‘‘ఆడు ఎన్ని సేసిన తెలుగు రాష్టంల రాడు, ఓడిపోతడు.’’

            ‘‘ఒక్క తెలుగు రాష్టంలో రాకపోతేనే ఓడిపోతడార. మిగిత రాష్టాలన్ని ఆని మాయలకే ఊగిసలాడవట్టె’’.

            ‘‘ఏమోర కొద్దిగ నకమొకలే అనిపిత్తంది. ఇగ మన రాష్ట నాయకుడు కూడా ఏదో ప్రంటు పెట్టె. గెలుత్తడంటవ?’’

            ‘‘ తేలు మంత్రం తెలువనోడు పాము గు....ల ఏలు పెట్టినట్టున్నది.ఈడ ఏదో బౌరూపుల ఏషం ఏసి గెలిసిండు. కాని ఆయన గొప్పలు ఏమున్నయి. మాటకీరోల్లను, భూతుకోరోల్లను, కొద్దిగ తెలివికల్లోల్లను రకరకాల ఆశ సూపి దగ్గర ఉంచుకున్నడు. సింగిబెంగి ఏగురుతండు. ఈనెది డిల్లిల పప్పు ఉడుకది.’’

            ‘‘ఎందుకో ఈసారి సెయి అత్తది అనిపిత్తంది. అమ్మ ఎంత సెసింది మనకోసం. భూములు ఇచ్చే. కైలాప్‍ ఆపె... ’’ ఇంక అనంగానే మధ్యల సొచ్చి ‘‘ఎనుకట మా తాత గుర్రం ఎక్కితే ముడ్డంత కాయకాసిందని సెప్పకు. ఇప్పుడంత  గడ్డంగాలి... ఆ మాయల పకీరు మాటలతోని గారడి సేత్తండు. ఇన్నవ...’’

            ‘‘అరే ఏం సేత్తెందిర ఆడు, ఆని కాందాను పుట్టక ముందు నుంచి తింటనం కాదుర గొడ్లను. గవ్వి తినద్దనుడేంది. ఎనుకట దేవాన దేవతలే తిన్నరు. ఇయ్యల్ల ఈనే అచ్చి ఆవు తినద్దు. అది గోమాత, దాని ఉచ్చ దాగాలే. అన్ని రోగాలు పోతయి అని ఉనుక దంచుడు దంచుకుంట మన నోటికాడి బుక్కను గుంజుకుంటండు. ఎవ్వని అలువాటు ఆనిది. పచ్చికూర పారేపిత్తదాట ఎండిన కూర ఏడిపిత్తదాట’.  ఎంత రుసిగుంటది. మంచి బలం అది. తినద్దంటడార....!’’ -- చర్చ మంచి వేడిగ సాగుతంది.

            పక్కనే కూర్చున్న ఒక్క యువకుడు ఏం మాట్లాడలేక వారి ప్రతి మాటకు తనకు తానే సమాధానం చెప్పుకుంట మౌనంగ ఉండి వారి ఆసక్తిని ఆసక్తిగా చూస్తున్నాడు.

            గొడ్డు కూర ఆనంగానే ఆ యువకునికి ఒక్కసారి పదేండ్ల కిందటి జరిగిన సంగటనలు యాదికచ్చినై.

            బడికి పోయి అచ్చెటల్లకు మొత్తం మాదిగ గూడెమంత పెద్ద పెద్ద గైల మీద గొడ్డుకూర ఆర్సేసి ఉన్నది. మాదిగ పోరగండ్లంత సంబురపడుకుంట ఉరికచ్చిండ్లు. పుస్తకాల సంచి ఆడపారేసి ‘‘గొడ్డును కోసిండ్లానే అవ్వ’’ అని అడిగిండు.

            ‘‘ఆ గాల్లది దొమ్మచ్చి సచ్చిందాట బిడ్డ. పగటీలి కోసుకచిండ్లు. కూరంత ఇప్పుడే ఆర్సేనిన. కొంత అండిన. ఇగో బొక్కలు పొయి మీద ఏసిన. ఉడుకుతన్నై.....’’

            ‘‘ఉడికనయ, సూడె బొక్కలు?’’

            ‘‘నువ్వు కాల్లైతే కడుకచ్చుకోపో...’’

            దవ్వ దవ్వ ఉరికి అంపుల కాడ లోటతోని కాలు సేతులు కడుకున్నడు సారుకలు సారుకలుగా. ఒక్క బొక్క గిన్నెల ఉడికిన బొక్కలు ఏసి ఇచ్చింది. పొయికాడనే కూసోని తల్లిదండ్రులతోని మంచిగ కంకిండు. రాతిరి కడుపురిండ తిని పన్నరు అందరు.

            రోజులాగే ఈ రోజు కూడ తెల్లారింది. నిదుర లేచి టైంకు బడికి పోదామనుకున్నడు పిలగాడు. తల్లి దండ్రి ఇద్దరు తునుకల గైని బైట ఎండల కట్టిండ్లు.

            ‘‘ఇయ్యల్ల బడికి పోకుర. ఈడ కావలుండు’’.

            ‘‘నేను ఉండ పో. బడికి పోత’’

            ‘‘ఇయ్యల్ల ఒక్కరోజు పోకపోతే ఏం కాదు తియ్యి. ఉండు కావలుండు. నేను కైకిలి పోత. ఒక్కతునుక పోయిందనుకో బిడ్డా, సెముడల్‍ తీత్త అని బెదిరిచింది’’ అవ్వ.

            ‘‘నేనుండనే నా దోస్తుగాల్లంత ఇట్లవడే పోతరు. రేపు బల్లె మల్ల నా మానం తీత్తరు. నేనుండనంటె ఉండ.’’

            ‘‘మానం తీతర? తినంగ మానం అనిపియ్యలేదా..? ముడుసు కొట్టుకొని మూలిగెం తింటివి కదా. బొక్కలు కంకితివి కదా. పిలగాడు ఏం సప్పుడు సెయ్యలే’’.

            తప్పంతా తనదే అన్నట్టు మౌనంగ ఉండిపోయాడు.

 

            సద్దిపెట్టుకొని ఎవ్వల పనులకు ఆల్లు పోయిండ్లు. ఒక్క కట్టె పట్టుకొని పుస్తకాలు ముందటేసుకొని తునుకల కావలున్నడు పిలగాడు సదువుతూ. కాకులు ఎక్కడికెల్లి అచ్చినయో వాసన పట్టుకొని. నిన్న మొన్న సూత్తామంటె ఒక్క కాకి కనిపియ్యలే. ఇయ్యల్ల సూడు ఎగేసుకోని అచ్చినై.

            కావ్‍ కావ్‍ మంటు ఒక్కటే అరుపు. చెట్టమీద ఆలి నాసి పెట్టుకుంట సూత్తన్నై.... పుస్తకం  తెరిచి ‘‘అయ్య అరకతో వచ్చాడు అరుగు మీద పెట్టాడు’’ అంటూ సదివిందే సదువుతాండు ఊగుకుంట. గింతంత కూడ సప్పుడు సెయ్యకుంట కాకులు అచ్చి గైమీద ఆలినై. పిలగాడు తల ఎత్తి సూసెటల్లకు గై మీద కాకులు. ‘‘ఉడో, ఉడో’....అంటూ ఒకటే ఆరుపులు. ఆ అరుపులకు కాకులు లేచి కాళ్ళతోని తునుకలు పట్టుకొని గాలిలోకి ఎగిరికై. అచ్చిన పని చెయ్యకుంట పోతమా...? అన్నట్టు.                  పొద్దందాక ఇదే తతంగం అయ్య అరకతో వచ్చి అరుగుమీద పెట్టుడైతలేదు. కాకులు కొట్టుడైతలేదు. మొత్తానికి పిలగాన్ని నమ్మిచి కాకులు అందిన కాడికి ఎతుక పోయినై.

            మాపటిలి కల్ల పనికి పోయినోల్లు ఇంటికచ్చిండ్లు. పిలగాని డ్యూటి అయిపోయినట్టు చెంగో బిల్ల అని ఉరికిండు. సీకటిపడే ఆల్లకు గైని ఇంట్ల కడుదామని తీత్తె తునుకలు కొన్ని కాకులు ఎత్తుక పోయినై. ‘‘కాకుల కావలుండు మంటే ఏడ ఆడుకున్నవ్‍రా...తునుకలన్ని కాకుల పాలు సేసినవ్‍’’ అని అవ్వ రెండు సరిసింది.

            ‘‘నేను ఎటు పోలేదు నీయవ్వ ఆన్నే కూసున్న సదువుకుంట’’

             ‘‘సదువుల పడి ముక్కలన్ని కాకుల పాలు చేసినవ. దొరుకుతదార కూర’’ అంటూ గైని లోపల కట్టిండ్లు.

            ఇల్లంత ఒక్కటే వాసన. ఎండ సక్కగ కొట్టక మంచిగ ఆరలేదు. తెల్లారి బడికి పోయిండు పిలగాడు. దోస్తులతోని కూసుంటే వాడు ఏసుకున్న బట్టలు కూరవాసన అత్తన్నై. కొద్దిగ ఇజ్జత్‍ అనిపిచ్చి తోటి విద్యార్థులకు దూరం జరిగి కూసున్నడు.

            దీర్ఘాలోచనలో ఉన్న యువకున్ని పిలిచిండు ఒక నడీడు మనిషి. ‘‘ఏమైందిర ఏం నప్పుడు సేత్తలేవు ఏదో ఆలోచనల పడ్డవ్‍’’ అనంగానే బాల్యం నుండి బైటికచ్చిన యువకుడు ‘‘ఏ ఏం లేదన్న మీరే దేశ రాజకీయాలు చర్చిస్తుండ్లు కదా. ఇనుకుంట కూసున్న అంతేనే....’’ బదులిచ్చాడు.

            ‘‘గంత రాజకీయాలు మాకేం తెలుసు కాని ఆడు గట్ల చెయ్యవట్టె ఏం చేసుడంటూ విచారం వ్యక్తం చేసిండు’’                

‘‘అన్నా....! నిజానికి దేశం మొత్తం రేపు ఏమైతదో మంచి మంచి మేదావులకే ప్రశ్నగ మిగిలిపోయింది. హిందు ధర్మం అంటూ మాట్లాడుతూ మనమంత ఐక్యంగ ఉండాలని ఇంట్లకచ్చి రెచ్చకొట్టె ప్రసంగాలు చేత్తండు. పూర్వం జరిగిన పోరాటాల వల్ల ఎంతో కొంత స్వేచ్చగ మనం బతుకుతన్నం. ఇప్పుడు హిందు ధర్మం అని మాట్లాడుతు మను ధర్మశాస్త్రాన్ని అమలు చేయబూనిండు. మనువు చెప్పిన చాతుర్వర్ణంల ఎక్కడ కూడ మనం ఉండం. శూద్రులను, ముస్లీంలను, కన్వర్ట్ క్రిష్టియన్స్ని ఏం చేత్తడో అర్థం అయితలేదు. హిందువునని గర్వించు హిందువుగ జీవించుఅని యావత్‍ దేశాన్ని ఉసిగొలుపుతండు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థను తట్టి లేపుతండు. ఆవును దేవతఅన్నడు. కాని పూర్వం మన తాతలు తిండికి లేక పురుగులు పడ్డ గొడ్లు, బర్లు కోసుక తిన్నరు. కొంత పరిస్థితులు మారినంక పండగకో పబ్బానికో కొనుక్కచ్చి కోసుకుంటండ్లు. ఇయ్యల్ల  తినద్దు. తింటే కేసులంటండు. గోమాత దగ్గర మొదలు పెట్టి చాపకింద నీరుల ఏర్పడకుండ మన ఆర్థిక, రాజకీయ, మానసిక, స్వేచ్చల మీద గొడ్డపెట్టుగ మారిండు.

            ఇంక పచ్చిగ చెప్పలంటే మన భాష, మన స్వేచ్చ, మన రాజకీయం, (మనం మనై అనుకునేటివి) మన శరీరం మీద మనకే హక్కులేదు. మనం మనై అనుకునే సకులం మనై కాదు. మనం నవ్విన, ఏడ్చిన, దగ్గిన ఆకరుకు పిత్తిన ఆని లెక్కనే చెయ్యాలే. వాడు ఒదిలే ఊపిరి పీల్చుకుని బ్రతుకాలే....లేదంటే నువ్వు దేశద్రోహివి.

            ‘‘ఇంతకు ముందున్నోడు ఎవ్వడు గింత అద్దుమానంగ సెయ్యలేదుర. ఈడే లావు చెల్లిచ్చుకుంటండు....’’ మధ్యలో కల్పించుకొని తాత ముడ్డి కిందే సుకున్న పంచె దులుపుకుంట లేస్తు అన్నడు.

            ‘‘నిజంగనే...తాత నువ్వన్నది. కాని అందరు గసోంటోల్లె కాకపోతే ఎక్కువ తక్కువలు. వీడు ఇంతగానం చెంగలిచ్చినప్పుడు ప్రతిపక్షంల కూసున్న వాడెందుకు సప్పుడు చెయ్యలేదు. ఆల్లంత ఒక్కటే మనల దోసుక తినెటోల్లు. ఈడు సేసేది మనకు తెలుత్తంది. ఆడు సేసింది తెలువలే గంతే తేడా....’’

 

            ‘‘ఎహె....ఇయ్యల్ల ఇంట్ల రేపు మంట్లె. ఎవ్వడో అద్దంటే మనం మన అలువాట్లు మానేత్తమ? బరాబర్‍ తిందాం. రేపు గొడ్డును కోసుకుందాం’’ ఒక్క వ్యక్తి ఆవేశంగా అన్నడు.

            ‘‘ఔర నిజమే. ఎప్పుడన్న మనస్సు గుంజి కిల కూర తిందామనని తెచ్చుకుంటే రెండు వందల రూపాలాయే. కంకెడు కూర రాకపాయే. చెలో జమ చెయ్యండ్లి. తెచ్చి కోసుకుందాం. ఎవ్వడెవ్వడో లక్షల కోట్లు ముంచి పోయిండు దేశాన్ని. ఇంకొక్కడేమో మనం సావకుంట బతుకకుంట కనిపిచిందల్ల దోసుకొని దాసుకోవట్టే. ఆల్లందరు దేశానికి పెద్ద మనుసులు. మనం మావుసం కూర తింటే దొంగలమార. నీయవ్వ లంగ రాజకీయాల నోట్లేల నా లం...పియ్యి.’’ ఉగ్రమచ్చినట్టు ఊగుతండు నడీడుమనిషి.

            అప్పుటికప్పుడు పైసలు జమచేసిండ్లు. మాపటికల్ల గొడ్డును తేవాలే. నడిజాము రాతిరి మొదలు పెడుదాం. తెల్లారంగ కూర ఇంట్ల కత్తది. చాలా ఐక్యంగ సంకల్పించిన కార్యం చేయ బూనిండ్లు కూర బాదితులు. యువకుని మనస్సులో ఆలోచనల సుడులు తిరుగుతన్నయి.

            పోలీసులకు తెలుత్తె ఎట్ల..? మా ఊరి మాదిగలను అరేస్టు సేత్తర ...? రాష్ట్రంల ఉన్న మాదిగోల్లను, దేశంల ఉన్న మాదిగోల్లను...? అందరిని ఒక్కసారి అరెస్టు సెత్తర... ఏ జెల్లపెడుతరు...? రేపు కూర పుష్టిగ తినవచ్చు....! మల్లి బొక్కలు కంకవచ్చు...! తునుకల గై కాడ కావలుండల్ల...? కనుమరుగైన కాకులత్తె ఉడోఅని కొట్టల్ల...

సంఘర్షణ 

వయసులో చిన్నవాడైనా కానీ ఊరిలో సోమయ్య అంటే అందరికీ గౌరవం. పెద్దవారు అయినా కానీ సోమయ్య కనిపిస్తే నమస్కారం పెట్టుతరు. అంతే గౌరవంగా సోమయ్య కూడా ప్రతి నమస్కారం పెట్టి  బాగోగులు అరుసుకుంటాడు. సోమయ్య ఒక పంచముడు. ఊరిలో లో బాగా చదువుకున్న వ్యక్తి సోమయ్య. ఏదో ఒక నౌకరు సంపాదిస్తాడు అనే ఆశాభావం వ్యక్తం చేస‌్తరు అందరూ. సోమయ్య ఎవరితో మాట్లాడిన నవ్వుతూ, ఎదుటి వ్యక్తిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా విలువ ఇస్తూ మాట్లాడటం అలవాటు. అతనితో మాట్లాడిన  వారందరూ మంచి పిల్లగాడు, నిజాయితీపరుడు, అందరి  బాగోగులు కోరేవాడు, ఎవ్వలకు ఏ సమస్య వచ్చినా బాధ  పంచుకునే వాడు.... సోమయ్య తో పరిచయం లేనివారు మాత్రం వాడు మోరు దోపోడు, మాట్లాడుడే రానివాడు, బాగా గర్వం, కోపిష్టి, అనే భావం కూడా ఉన్నది .

సోమయ్యకు ఒంటరిగా గడపడం ఇష్టం. తాను చదువుతున్న కాలంలో సమకాలిన రాజకీయాలు అర్థం చేసుకుని వాటి  లోపాలు  ఇసారించుడు ఇష్టం. ఎక్కువ సమయం పుస్తకాలతో గడపటం ఇష్టం. ఈ  హుందాతనం అంతా తన కొంతమంది  మిత్రులకు మాత్రమే తెలుసు. కానీ సోమయ్యకు ఎక్కడ  రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేదు. కేవలం ఒక్కరు ఇద్దరు నమ్మకమైన  స్నేహితుల దగ్గర తప్ప.

సోమయ్య చిన్నతనంలో తన తండ్రికి ఆరోగ్యం బాగా లేక దావకాన పొంటి తిరిగి బాగా పైసలు ఖర్చుపెట్టిన మనిషి మంచిగా కాలే. చివరికి భారం మొత్తం ఏసు దేవుని మీద ఏసి  క్రిస్టియన్ల కలిసిండ్లు. మందుల పని తనమా.... దేవుని కరుణన తెలువది కాని సోమయ్య తండ్రి మంచిగా అయ్యిండు. అప్పటి నుంచి సోమయ్య కుటుంబం హిందువుల నుండి  క్రిస్టియన్ గా మారిపోయింది. సోమయ్య కూడా బైబిల్ చదువుతు, ప్రార్థనలు చేస్తూ బాగానే భక్తి పెంచుకున్నాడు.

సామాజిక స్పృహ పెరిగిన కొద్దీ దేవుళ్ళ రాజకీయం ఏమిటి "దేవుణ్ణి పుట్టించిన మనిషి ఎలాంటి అవకాశవాది"అనేటువంటి అంతర్గత కుట్రలు గ్రహించడం మొదలుపెట్టాడు. కానీ అవి ఎక్కడ  బహిర్గతం చేసే సాహసం చేయలేదు. ఒకవేళ  ఈ కుట్రలు బహిర్గతం చేస్తే తనకు సమాజం ఎలాంటి గుర్తింపు ఇస్తుందో తెలుసు.

కొక్కిలిపడ్డ తండ్రిని చూసుకుంటా ఉన్న ఎకరం భూమిని సాగు చేసుకుంటూ తమ పరిధిలో జీవిస్తున్నాడు. ఒక నాటి కాలాన పెళ్లి ప్రస్తావన మొదలైంది అప్పటికే అనేక రకాల కారణాలు చూపుతు దాట వేస్తున్నాడు. ఈసారి మాత్రం" కత్తెరల దొరికిన పోక" లెక్క అయింది తప్పించుకునే అవకాశం లేదు. తన మిత్రురాలితో పెళ్లి కుదిరింది ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పెళ్ళి చేసుకోవాలనేది సోమయ్య పంతం నిలిచింది.కాని పెళ్ళి మాత్రం పాస్టర్ గారు చేయాలనే ఇతరుల వాదన కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అనే కోరిక నిలువలేక పోయింది.చర్చి కి పోవాలి బాప్స్మిత్తం తీసుకోవాలి .ఇదంతా సోమయ్య కు నరకంగా ఉన్నది.చర్చిలో కూచుంటే పాస్టర్ చెప్పే ఊకదంపుడు వాక్యాలకు పాములు,తేల్చారు,జెర్రులు పాకినట్టు అయింది. ఇదంతా కేవలం కానుకల కోసం అక్కడకు వచ్చిన వారందరిని గొర్రెల గా ముద్ర వేస్తూ, పాపులు గా నిందిస్తూ తన ప్రసంగం కొనసాగిస్తున్నాడు. సోమయ్య కు బ్రతికుండగానే శరీరానికి నిప్పు పెట్టినట్టు అయింది కానీ అక్కడినుంచి జారు కోవటానికి ఎలాంటి మార్గం కనిపించలేదు. అందరూ కానుకలు సమర్పించుకున్నారు చివరగా  కొంతమంది బైబిల్ లో ఎక్కువ పైసలు పెట్టి పాస్టర్ గారి దృష్టిని ఆకర్షించి ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. సోమయ్యకు ఊపిరి కలవడం లేదు.

పాస్టర్ అమ్మకు సోమయ్య కొత్తగా కనిపించాడు. ఎవరు బాబు నువ్వు  అని ప్రశ్నించింది. నేను ఫలానా వ్యక్తిని అని బదులు ఇచ్చాడు. నీకేనా  పెళ్లి కుదిరింది మరో ప్రశ్న....... ఏం చెప్పలేక తన కిందికి దించుకున్నాడు అనేక రకాల ఆలోచనల తోటి.... నువ్వు నువ్వు బాగా చదువుకున్నావు కదా బాబు  మంచి జ్ఞానవంతునివి కదా చర్చికి ఎందుకు రావడం లేదు వెకిలిగ అడిగింది పాస్టర్ అమ్మ,

చదువుకున్నాను కాబట్టే రాలేక పోతున్నాను అనే బదులు ఇవ్వాలి అనుకున్నాడు కానీ సంస్కారం అడ్డొచ్చే నేను ఇన్ని రోజులు లు ఇక్కడ లేను అక్క అందువల్ల రాలేకపోయాను..... సరే ఇకనుంచి తప్పకుండా రా మరి.... అత్తవా పెళ్లి అయినాక తపిస్తావా,,, ఇంకో ప్రశ్న.

ఒక్కసారి  సోమయ్యకు భూమిని తలకిందులు చేయాలన్నంత కోపం వచ్చింది బాగా మాట్లాడాలి అనుకున్నాడు కానీ కోపం అంతా అనుకొని ఉన్నాడు. సోమయ్యకు పెళ్లి అయి అప్పుడే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. పాస్టర్ అమ్మ అనుమానం నిజం చేయ తలచి చర్చికి పోవటం మానేశాడు. ఎక్కడన్నా అనుకోకుండా కలిసిన కూడా పాస్టర్ అమ్మ అదే పాడటం నువ్వు చర్చికి రా బాబు అని సోమయ్య చిరునవ్వు నవ్వి వస్తా అనడం ఒక ఒక అలవాటుగా మారిపోయింది.

రాను రాను ఊరిలో  మత మార్పిడి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఐతన్నై. ఇది చూసి సోమయ్యకు ఆశ్చర్యంతో కూడిన ఒక ప్రశ్న తలెత్తింది. సరేలే హిందూమతంలో లేని కొంత అనుకూల వాతావరణం ఇందులో ఉంది కాబోలు అందుకే మారుతున్నారు అనుకొని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు.

ఈ కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్టు గానే సోమయ్య మీద  ఒత్తిడి కూడా పెరుగుతుంది చర్చకు రావాలి లేదంటే సైతానుకు లోను అంతం అని సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి సోమయ్య తగిన సమాధానం చెప్పుతు  ఎదుటి వ్యక్తి మారుతాడని ఆశగా చూడడం అలవాటయింది

నాలుగు సంవత్సరాలు గడిచిన సోమయ్యకు ఇంకా పిల్లలు కలగలేదు తాత, అమ్మ  వరుస వాళ్ళు  ద్వంద అర్థాలు వచ్చే విధంగా మాట్లాడటం జరుగుతుంది అయినా సోమయ్యకు ఏమాత్రం బాధగా కనిపించేది కాదు. నా వాళ్లు అనుకునేవాళ్ళు మరియు క్రమం తప్పకుండా చర్చికి పోయేవాళ్ళు కూడా పిల్లలు లేనితనాన్ని ఎత్తిచూపుతూ నువ్వు దేవుడనవు, దయ్యం అనవ్వు నీకు పిల్లలు ఎట్లా పుడతారు. మనం ఒక దాన్ని నమ్ముకుంటే దాన్ని పట్టుకొని ఉండాలి. నువ్వు  అటు హిందువు  అన్నట్టు కాదు ఇటు చర్చికి ఆచ్చినట్టు కాదు ఇగ దేవుడు ఎట్లా కరుణిస్తాడు. అట్లా లగ్గం అయినా వాళ్లకు ఇట్లా పిల్లలు ఐతండ్లు. నీకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కాకపోయే...... ఒక ఐదు వారాలు ఉపవాసం ఉండి దేవుని కుటుంబాల అందరిని పిలిచి ప్రార్థన పెట్టియ్యి . వంట కూడా చేపియ్యి. నీకు  అనుకున్నది జరుగుతది అని ఒక దేవుని బిడ్డ ఉచిత సలహా ఇచ్చిండు.

సోమయ్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కోపాన్ని దిగమింగుకొని ...అంటే చర్చి కి రాకపోతే పిల్లలు పుట్టరా......? దేవుడు అందరివాడు అయినప్పుడు వచ్చిన వాళ్లను, రాని వాళ్లను ఒక తీరుగా చూడాలి కాని గివ్వేం రాజకీయాలు..ఇది కరెక్టు కాదు కదా  అని ప్రశ్నించాడు సోమయ్య...

అది ఇది కాదు రా మనం మందిరానికి పోకపోతే సైతాను అనేది ఎప్పుడెప్పుడూ మనల నాశనం చేయాలని సూతదిర అంటూ బదులిచ్చాడు......

సరే నువ్వు అన్నది నిజం అనుకుందాం చర్చికి అత్త లేను కాబట్టి పిల్లలు అయిత లేరు.... మరి  పాస్టరయ్య ఎప్పటికీ దేవుని సన్నిధిలోనే ఉంటాడు కదా..... దేవుని సేవ  చేసుకుంటాడు కదా మరి  పాస్టర్ కు ఎందుకు పిల్లలు కాలేదు

సోమయ్య.....

నువ్వు గియ్యే ఒకదానికి ఒకటి లింకు పెట్టి మాట్లాడుతావు ఎవ్వరు చెప్పింది వినవు నీ మంకు నీదే పెద్దలు మంచికో చెడుకో చెబుతారు వినాలి అడ్డమైన కొషన్ ఏత్తె ఎట్లా అని గద్దరిచిండు  దేవుని బిడ్డ....

సరేనె నువ్వు మంచో, చెడో చెప్తే ఇంటా కానీ నువ్వు అబద్ధం చెపుతున్నావు ఊహల్ల బతుకు మంటున్నావు అది నాకు  చేతకాదు అంటున్న ఏది ఉన్నా నిజం కావాలి ,నిజాయితీగా బ్రతకాలి, అనేది  నేను బలంగా నమ్ముకున్న అట్లనే బతుకుతా అంతే తప్ప అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని ప్రచారం చేసిందంటే ప్రాణం ఉన్న శవం లెక్క బ్రతుకుడుతోని సమానం. అది నాకు చేతన కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నిన్ను మతం

ఒడిసి పెట్టి నా లెక్క ఉండు మంట లేను కదా నువ్వు నన్ను చర్చికి రమ్మనడానికి.....? నా పిచ్చి నాది, నీ పిచ్చి నీది నన్ను ఈ విషయంలో తిప్పల పెట్టకు నాతోని ఇంకోసారి ఈ మాటలు మాట్లాడకు అని గట్టిగా చెప్పిండు సోమయ్య...

ఏమని తిట్టాలో అర్థం కాక"సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే ఉంటదా లంద తోల్లకు పోతది" నువ్వు కూడా  గసోంటోనివే అని కోపంగా పోయిండు దేవుని బిడ్డ

సోమయ్య అయితే తనకున్న తెలివితోనో, మాటకారి తనంతోనో మూర్ఖపు వాదన నుంచి  తప్పించుకున్నాడు. కానీ సోమయ్య భార్యకు తప్పలేదు. మొగాన్ని చర్చికి తీసుకచ్చుడు తెలవదా.ఇంకెప్పుడు నీ దిక్కు తింపుకుంటవు, అని సోమయ్య తల్లి కోడలి మీద గరం గరం మాట్లాడుడు మొదలు పెట్టింది. ఆడేం అంటే ఆయనకి తగ్గట్టు నువ్వు కూడా తయారైనవా కాదు నా మాట వినడు గద్దరితడు నువ్వు బుధురకిచ్చి చర్చికి తీసుకురా అని చెప్పింది.

కన్న తల్లి మాట  వినని నీ కొడుకులు నా మాట ఇంటాడ అత్తమ్మ..... అయినా " ఆయన"ఏం చెప్పినా అందులో మంచి ఉంటది కాబట్టి నేను ఆయనని ఒత్తిడి చేయా, నిన్నే గద్దరిచ్చిందంటే నన్ను మెచ్చుకుంటడా.....?

 అబ్బో భర్త మీద బాగానే ఉన్నది పిల్లకు ప్రేమ అంటూ ఎటకారంగా  మాట్లాడింది తాను ఏమి చేసేది లేక....

సోమయ్యకు రాను రాను దేవుని గోల ఎక్కువ అయింది. ఒకసారి అయితే తల్లినే స్వయంగా నా కొడుకు తినుడు పండుడు తప్ప దేవుడు అనడు ఏమనడు అని పక్కోలతోని చెప్పంగా విని కళ్ళకు రక్తం వచ్చింది కానీ తల్లి కదా ఏమి అనలేక ఆ మాట గుర్తుకు వచ్చిన ప్రతిసారి మనసు కలి కలి అయితది.

 

చాలా రోజుల తర్వాత సోమయ్య దోస్తులు ఇద్దరూ అనుకోకుండా కలిసిండ్రు. చాలా అలా సంతోషం గా అలాయి బలాయి తీసుకున్నారు. మంచి  చెడులు

ఈసారించు కొన్న తర్వాత కూల్ డ్రింక్స్ తినటానికి కార తీసుకుని ప్రశాంత వాతావరణంలోకి పోయిండ్లు. ఈ ముగ్గురిలో ఎవరికి కూడా ఆల్కహాల్ తాగే అలవాటు లేకపోవడం మూలంగా కూల్డ్రింక్స్ కె పరిమితం అయ్యింది వీరి స్నేహబంధం.

 

నిజానికి సోమయ్య ఇద్దరూ మిత్రులకు కంటే వయసులో చిన్నవాడు కానీ అన్నా అని పిలుస్తారు. చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటారు. ఈ ఇద్దరు మిత్రులలో ఒకరు హిందువు ఇతని పేరు ఈశ్వర్. ఇంకో మిత్రుడు క్రిస్టియన్ ఇతని పేరు ప్రభు.

చాలా రోజుల తరువాత కలవడం మూలంగా  కొంత సమయం దాకా మౌనం రాజ్యమేలింది తర్వాత నిమ్మదిగా మౌనాన్ని దూరం చేస్తూ ఊరిలోని మంచి, చెడులు , పంటలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి వాటితో మొదలైంది కూల్ డ్రింక్ తాగుతూ

ఎవరు ఏం మాట్లాడినా మాటల్లో ఒక  ఆశ మాత్రం కనిపిస్త లేదు. నిరాశ తలెత్తుతుంది. ప్రభు మాత్రం చాలా అలా హుషారుగా ఉంటూ హుషారుగా మాట్లాడుతాడు... సోమయ్య ప్రభువును అన్నా పిల్లలు మంచి ఉన్నారా అనీ అడిగిండు

ఏ అన్న సూపర్ పొద్దుందాక పనిచేసి  ఇంటికి పోతే ఇగ  టైం మొత్తం పిల్లల తోనే బయటికి ఎల్లుడే అయితలేదు. ఎవ్వవలెను కలుసుడు కూడ అయితలేదు. అంటూ చెప్పుకొచ్చాడు. ఈశ్వర బాపు ఏమైంది నువ్వు పిల్లల గురించి దావకాన కు పోతివి కదా ఏమన్నారు డాక్టర్ లు అడిగిండు ప్రభు. ఏముంది బాబు అంతా మంచిగానే ఉంది ఏం సమస్య లేదని అన్నారు.... ఈశ్వర్

 నువ్వు పోతున్నవా లేదా దావఖానకు సోమయ్యను కూడా  మందలి ఇచ్చిండు ప్రభు. ఆ పోయిన అన్న....

ఏమన్నారు మరి.... ప్రభు

ఏమంటారు పరీక్షలు అన్ని చేసిండు ఏం ప్రాబ్లం లేదన్నారు పిల్లలు అయ్యేదాకా మందులు వాడు మరో కొన్ని రోజులు వాడినం బందు చేసినం.... సోమయ్య

ఎందుకు మరి అయ్యేదాక వాడితే అయిపోవు కదా.... ప్రభు

నీకు తెలువనిది  ఏమున్నది అన్నా ఏం చేయాలన్నా పైసలు కావాలె... మనకు లేనిదే అదాయే సోమయ్య బదులిచ్చాడు.

మరి చర్చి కన్నా పోరాదే.... ప్రభు నువ్వు నమ్మవు గాని ఉండబట్టలేక చెప్పుతన్న.

చర్చి కి పోతే పిల్లలు చిత్రం బాపు ఈశ్వర్.

మస్తు మంది కి ఐండ్లు బాపు అందుకే చెపుతున్నా‌.... ప్రభు

"తాయితులకు పిల్లలు అయితే తానెందుకు"అనే సామెత ఉన్నది అన్నా ఈ లోకం మొత్తం లగ్గాలు చేసుకోకుండా చర్చిల పొంట, గుల్ల పొంటా తిరుగుతే అయిపోతది కదా.... ఈ లగ్గాలు గిగాలు ఎందుకే అడిగిండు సోమయ్య. ప్రభుకు కోపం  వచ్చింది నువ్వన్నీ తికమక సమాధానాలు  చెపుతావు ఇక మేము చదువుకోలేదని కదా నీకు నా తెలివి తోని నానోరు మూపితన్నవ్. అన్నడు

అన్నా గట్ల అనుకోకు చదువుకున్న వాళ్ళంతా సంస్కారవంతులు జ్ఞానవంతులు అంటే నేను ఒప్పుకోను. మరి మనకంటే ముందుతరం వారికి ఏ చదువు ఉన్నది వాళ్లు ఎంత సంస్కారవంతులు, మనిషిని ఎంత ఈజీగా పసిగడతారు ఎదుటి వ్యక్తికి ఏం కావాలో ఇట్టే గమనిస్తారు కదా వాళ్ళ కంటే గొప్పోళ్ళ మానే...... సోమయ్య సమాధానానికి ఈశ్వర్ తోడయ్యాడు నిజమే అన్న వాళ్లే చాలా గొప్పోళ్ళు కన్నడు. ప్రభుకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మళ్లీ సోమయ్య కల్పించుకొని అన్నా నేను ఏసుప్రభుకి వ్యతిరేకం కాదు పాస్టర్లు చేసే మోసానికి వ్యతిరేకిని. నిజానికి ఏసుప్రభు ఒక బానిస వ్యవస్థ కోసం నిలబడి అత్యంత క్రూరంగా చంపబడ్డ వ్యక్తి ఇప్పటి మన భాషల చెప్పుకోవాలంటే ఒక ఉద్యమ కారుడిగా ఆయనను చెప్పచ్చు. అట్లా కొట్లాడి ప్రాణం ఇచ్చిన ఆయన పేరు చెప్పుకొని ఈ పాస్టర్లు ఎన్ని సంపాదిస్తున్నారు అన్న, ఎక్కడి దాకా ఎందుకు నువ్వే చెప్పు నువ్వు ఎంత కష్టం చేస్తావు ఇంట్లో ఒక టైంలో బువ్వ ఉండదు మరి  పాస్టరు ఏం పని చేస్తాడు వాళ్లకు కార్లు, బైకులు ఎక్కడన్నా.....

అంటే మేము సేవ చేతనం కాబట్టి దేవుడు మాకు ఇచ్చిండు అంటారా..... అంటే దేవుడు కూడా " కువ్వారం"తో ని సూతడ.... వాళ్లు వాక్యం చెప్పగా చూడు మనలా ఎంత తిడుతరో.... గొర్రెలు, పాపులు అంటారు. ఇంకా ఎన్నో రకాలుగా అంటారు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో చెప్పొచ్చు. చివరకు ఏసునీ కూడా ఏమంటారో చూడు "రాజులకు రాజు" అట ఇది ఎంతవరకు నిజం  అన్న ,,, ఉదాహరణకు ఒకటి చూద్దాం రాజు గుణం ఏంటిది అన్న.... ప్రజల దగ్గర అ దోచుకుంటాడు ఏంటి సాకిరి చేయించుకుంటాడు. ఇతర  కులాల స్త్రీలను లోబరుచుకున్నాడు ....ఒక రాజే ఇట్లా ఉంటే ఈగ  రాజులకు రాజు అని ఆయనని అంటారు .మరి  ఈయన అంత క్రూరంగా ఉన్నాడే.... అమాయకుల కోసం ప్రాణం కల్పించిన ఉద్యమ కారుని రాజులకు రాజు అని వ్యంగంగా తిడితే ఎంతవరకు మంచిదన్న..... ఒకవేళ అ పాస్టరు మీ ఇంటికి ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు వస్తే మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలి లేదంటే  ఆ కుటుంబం దేవుని ప్రేమకు లోబడని కుటుంబమని ముద్ర  వేస్తారు. ఇదంతా మంచి పద్ధతేనా..... ఇన్ని మోసపూరిత కుట్రలు ఉన్న కాడికి ఎట్లా రమ్మంటావే. మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేయాలి..... అసలు కాళ్ళ మీద ఎవలు కూర్చుంటరన్న తప్పు చేసిన వాళ్లను కూర్చో పెడతారు నాకు తెలిసి  నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను చర్చికి రాను... సోమయ్య చాలా చాలా సాదా సీదాగా చెప్పిండు మనుసుల ఉన్నదంత...

ఇది మాత్రం నిజం అన్న నేను కూడా  గమనించిన.... ప్రభు

మరి ఇవన్నీ గమనించి ఎందుకు పోతున్నావు బాపు..... ఈశ్వర్

అన్నా  నువ్వు చర్చికి పోవడం తప్పు అని అంట లేము పో... నీ లెక్క ప్రకారం చూస్తే దేవుడు అనేవాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు ప్రత్యేకంగా చర్చికి పోవాల్సిన అవసరం లేదు కదా.....

అయినా సరే పో కానుకలు వెయ్యకు ఆ పైసలు ఊళ్లే ఎవ్వాలన్నా ఎందుకు లేనోళ్లకు ఇయ్యి పాపం ఒకపూట గడుస్తుంది కదా.... చర్చ్ అనేది మానసిక రోగులు అంటే దయ్యాలు, గియాలు కానీ నమ్మేవాళ్ళకు మాత్రమే మంచిగా పని చేస్తది తప్ప ఒరిగేది ఏమీ లేదు ఇంకోటి చెప్పుతా కళ్ళు తాగద్దు అంబారు తినొద్దు దేవుడు శిక్షిస్తాడు అని చెప్పడం వల్ల  కొంతమంది మారి  కుటుంబాలు కూడా  అయినాయి. ఇది ఒక రకంగా సైకలాజికల్ గా పనిచేస్తుంది ఈ పరంగా మాత్రం నేర్చుకోవచ్చు

ఉదాహరణకు ఇద్దరూ క్రిస్టియన్ వ్యక్తులు ఉన్నారు అనుకో అందులో ఒక వ్యక్తి  చర్చికి ఎప్పుడో ఒకసారి  వస్తాడు. కానీ కళ్ళు తాగుతాడు అంబరు తింటాడు ఎవరికైనా ఆపద వస్తే సహాయం చేస్తాడు. రెండో వ్యక్తికి ఈ తాగుడు తినుడు అలవాటు లేదు క్రమం తప్పకుండా చర్చికి పోతాడు కానుకలు దండిగా సమర్పించుకుంటారు కానీ బొక్కల తనం, కొంచెం తనం, ఎక్కిరేవుల తనం, ఓర్వలేనితనం, కళ్ల మంట తనం ఉంటది. ఇవన్నీ మొదటి వ్యక్తి కి ఉండయి...... వీళ్ల ఇద్దరిలో ఎవరి వల్ల మూడో వ్యక్తికి నష్టమన్న  సోమయ్య అడిగిండు....

ఈశ్వర్ కల్పించుకొని అన్నా మొదటి వ్యక్తి తాగుడు తినుడు వల్ల ఆరోగ్యం పాడైతే వాడే చచ్చిపోతాడు ఈయన వల్ల సమాజానికి ఏ నష్టం లేదు. కానీ నీ రెండో వ్యక్తి వల్ల సమాజానికి చాలా  ఇష్టం ఉన్నది కాబట్టి మొదటి వ్యక్తి నయం అని బదులు ఇచ్చాడు

అట్లా చాలామంది  ఉన్నారు అన్న చర్చికి వచ్చే వాళ్లలో.... ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సమన్వయ సంబంధం ఉండది వాళ్లు ప్రార్థిస్తున్న ప్పుడు ఉన్నంత పశ్చాత్తాప గుణం, ప్రేమ ప్రార్థన అయిపోయి బయటికి రాంగానే మాయమై పోతది రెట్టింపు స్థాయిల కుట్రలు చెరువుని తనాలు..... ఒకటా రెండా మస్తుంటాయి. ఇవన్నీ పాస్టర్లకు తెలువదంటవ....సోమయ్య

అన్ని తెలుసు కానీ ఎత్తి చూపితే ఈయనకు ఉపాధి పోద అన్న.... ఈశ్వర్

ఈ మధ్యల ఒక పెద్ద మనిషి చెప్పిన మాట చెప్పుతా విను" ప్రేమించే వారు ఆశయాలు ముందుకు తీసుకుపోతాడు","ప్రార్థించేవాడు స్వలాభం కోసం పాకులాడుతడు" అని అని చెప్పిన  మాటలకు నేను నేను ఏకీభవిస్తున్నా.... అని చెప్పుకొచ్చిండు సోమయ్య

అన్నా నీ దగ్గర  అన్నీ నచ్చాయి కానీ నువ్వు నువ్వు చర్చికి రాకపోవటం  నువ్వు దేవుని గురించి వ్యతిరేకంగా  మాట్లాడటం కొద్దిగా నీ మీద కోపం తెప్పిస్తుంది.... ప్రభు.

ముగ్గురు మిత్రులు నవ్వుకున్నారు. అన్నా నేను  చర్చికి రాకపోవడం వల్ల జరిగే నష్టం లేదు, రావడం వల్ల వచ్చే లాభం లేదు కానీ  ఏడికి పోయిన నిజాన్ని గమనిస్త ,నాకు అలవాటు అయ్యిందే అని సోమయ్య చెప్పిండు...

చల్లగా ఉన్న కూల్ డ్రింక్స్ ముగ్గురు మిత్రులు మనసులు వేడెక్కిన యి

పక్క ఊరిలో కొత్తగా చర్చి ఒకటి కటిండ్లు ఆ పాస్టరు ఒక నాడు సోమయ్య ఇంటికి వచ్చి మన చర్చికి రా తమ్మి ఒకసారి  మన దగ్గర  కూడా చూడు నచ్చితే రా లేకపోతే రాకు అని చెప్పిండు.

ఇంతకుముందు వీరి  మధ్యల కొన్ని అంశాల మీద చర్చ జరిగింది కాబట్టి  సోమయ్యను అంచనా వేసి ఈ ఆఫర్ ఇచ్చిండు ఉండబట్టలేక పాస్టర్ గారు.....

అయ్యో అదేం లేదు అన్న వస్తా...... నేను కూడా సాక్ష్యం చెప్పేది ఉన్నది సాక్ష్యం చెప్పుడు అయిపోయినాక ఒక పది నిమిషాలు కూడా మాట్లాడాలి అని బదులిచ్చాడు సోమయ్య

రా తమ్ముడు నీది సేవా గుణం మంచి ఆలోచన వచ్చి చెప్పు.... నీకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడే రమ్మంటూ చేయి కలిపి వెళ్ళిపోయాడు పాస్టర్ అయ్యా.....

సోమయ్య మనసులో చిన్నగా నవ్వుకున్నాడు....

 

 

ఈ సంచికలో...                     

Jul 2021

ఇతర పత్రికలు