ఫ్యూచర్ డిజిటల్ తెరలపై బ్రేకింగ్ న్యూస్
"రైతులు కావలెను
మూడు పూటలా తిండి
ఆకర్షణీయమైన జీతం
ఉంటానికి వసతి సవులతు
వారానికి రొండు సెలవుదినాలు
ఆసక్తి వున్నోళ్లు సంప్రదించగలరు
వయసు పరిమితి లేదు"
ఇది రేపో మాపో వెలువడే ప్రకటన
కార్పోరేటు మాయా గొంగట్లో మెతుకులేరుకునే గతి పట్టబోతుందా ?
బ్రేక్ తర్వాత సూద్దం
* * *
భూమిపైకి పంపిన మరో ఉపగ్రహం
అన్నదాత ఆనవాళ్లు దొరికినట్టు సమాచారం
పురాతన యుగంలో మట్టిని సాగుజేసి పంటలు పండించేవారని పరిశోధనల్లో తేలింది
అక్కడక్కడా నీటిజాడలున్నట్టు తెలుస్తోంది
భవిష్యత్ లో భూమి మీదికి మకాం మార్చినా నోరెళ్లబెట్టాల్సిన పన్లేదు
* * *
కన్నంటుకున్నదో లేదో ఒక పీడకల
దిగ్గున లేచి కూసున్నడు రైతు
మాటల్ల మాటలు గలిపి ముచ్చట్లల్ల బడ్డం
నేను:
ఎవుసం కొండెక్కినంక
ఊళ్లన్ని వలసెల్లిపోయినంక
నువ్వొక్కడివే ఎన్నేండ్లని ఒంటరిగా యుద్ధంజేత్తవుజెప్పు?
పల్లెలు పట్నం సోకుల బడ్డంక
పట్నమే పల్లె పొలిమేర దాటినంక
పల్లె పంటభూములన్నీ పట్నం భవంతులకు పునాదులైతాంటె
సూసుకుంట సూసుకుంట నువ్వింకా ఇక్కడే వుంటవా జెప్పు ?
రైతు :
మాకు తిండిగింజలు దొర్కుతలెవ్వని
పంట పండించే రైతు జాడదియ్యమని
రేప్పొద్దున ఎవలన్న రాకపోతరా..ని ఎదురుసూత్తాన
నోట మాట పడిపోయింది
సుట్టూతా దిక్కులేని శూన్యం