మా రచయితలు

రచయిత పేరు:    సురేంద్ర రొడ్డ

కవితలు

మా బతుకులు...

మా గుడిసింట్లో 

నాన్న మోకాళ్ళపై

ఊయలూగుతూ 

లోకాన్నే ఊరేగినట్లు 

పొందిన అనందాలు

అమ్మ పొయ్యి 

ముందుర కూర్చోని

ఉడికే సట్టి నుండి వుడికిందో 

లేదో చూడరయ్యా అంటూ

చిప్పకట్టితో వేసిన 

సొట్ట బోయిన సత్తుగిన్నె 

లోని ముక్కల రుచులు

అక్కాతమ్ముళ్ళతో 

పంచుకున్న ఎంగిళ్ళు

తూటు బడిన లోటాలో

తాగిన బెల్లం పాయసాలు

తాత నేర్పిన జానపదగేయాలు 

అవ్వ చెప్పిన నీతి కథలు

ఒక్కరికి జ్వరమొస్తే 

అందరూచేసే లంఖణాలు

దేవుళ్ళకు కట్టే ముడుపులు

కిరసనాయిలు బుడ్డీలో

వెలిగిన చదువులు

ఎండాకాలంలో

కురిసిన వెన్నెలలు

వానాకాలంలో 

తడిపిన చినుకులు

ఒక్క పూరిగుడిసింట్లోనే

వంటలూ వార్పులు

పడకలు చదువులు

మా బతుకులు 

ప్రేమకుటీరంలో 

విరిసిన ప్రేమ కుసుమాలు !

 

సూరిగోడు చేదబావిలో

సూరిగోడు చేదబావిలో

 "పాతాళభేరి" వేశాడు

బిందెలు బొక్కెనలు 

చేంతాళ్ళు చానా వచ్చాయి

ఊరూరంతా వుండజేరి 

వారోరి సామాన్లు ఏరుకొని 

ఇండ్లకు పోయినారు 

పరంటన పొద్దుగుంకతావుంది

సూరిగోడి కాలికి 

నా కంచుబిందె తగిలి ఖంగ్మంది

చీకట్లు ముసరతావుండాయి 

యీదరగాలీస్తావుంది

నా పైట గాలికెగిపోయింది 

సూరిగాడు చూపులు 

యాడో చిక్కుకున్నాయి 

క్షణంలో నే పైట సర్దుకున్నా

నా కళ్ళు 

సిగ్గుతో వాలిపోయాయి

మా అమ్మ అరుపుతో

నా గుండె గుభేళ్లంది

కంచు బిందెను ఎత్తుకుంటుంటే

సూరిగోడి వూపిరి వెచ్చగా తగిలింది

వాడెప్పుడూ గొంతిప్పి చెప్పనూలేదు

నేనూ నా గుండెలోని 

మాటను వినిపించనూ లేదు

ఊరిడిచొచ్చి ఎన్నోయేళ్ళు గడిచినా

ఏ పాతాళభేరి వేసి లాగినా

నా గుండెపాతాళంలో 

దాగిన వాడి జ్ఞాపకం 

గుండెసడిని వీడి బయటికి రాదు !

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు