మా రచయితలు

రచయిత పేరు:    అనిల్ కర్ణ

కవితలు

వస్తే వచ్చింది గాని....

తలలు తెగలే నెత్తురు పారలే,

కరోనా రేపిన కల్లోలానికి కలకలం రేగింది ప్రపంచమంతా..

 

ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు,

చెట్టుకోలు పుట్టకోలు బందీలైనారు..

ముప్పొద్దుల ముద్ద దొరికే వాడికి ముచ్చటైన సెల్ఫీలు ,

ఒక్క ముద్ద గూడ దొరకని బక్క పాణాలకి ఆకలి ఆర్త నాదాలు ..

 

దాని రాకకు (కరోనా)  లోకమే జడిసింది

కాలంతో చేతులు కలిపి, దినసరి కూలీల పొట్టలు గొట్టింది..

యాచకులు గొంతుకలకు ఉచ్చులు బిగించింది..

విద్యార్థుల విజ్ఞానానికి, ఆటంకం కలిగించింది..

బలవంతులమని విర్రవీగే వారిని జూసి ఫక్కున నవ్వింది

  

వస్తే వచ్చింది గానీ.... మనుషులంతా సమానమని నేర్పింది

నమస్కారమే సంస్కారమని తెలిపింది

క్రమశిక్షణతో మెలగాలని నేర్పింది

పరిశుభ్రతే ప్రథమం అని చాటింది

ఎన్నాళ్ళు ఉంటుందో గానీ

వేల ప్రాణాలు బలిగొంటుంది.

ఖబర్దార్ కరోనా మా స్వీయ నిర్భందంతో

నిన్ను మా దరి చేరనీయం

నిన్ను అంతమొందించే వరకు అడుగు బయట పెట్టం

నిన్ను జయిస్తం నిన్ను జయిస్తాం

మా శాస్త్రీయ విజ్ఞానంతో నిన్ను నివారిస్తాం...

 

  

చెళ్లల్ల చేతిలో ఆయుధాన్ని నేను

 

పల్లవి

నీ కాళ్ళ కింది చెప్పును

నా చరితను ఎంతని చెప్పను

నేను నీ కాళ్ళ కింది చెప్పును

నా చరితను ఎంతని చెప్పను

-నీ బరువంత మోసేటి రథమును

బైట కాళ్ళను కాపాడే రక్షణ నేను                                   (నీ కాళ్ళ)

 

చరణం-1

ఆటలాడేటి పిల్లల మోటరు బండినయ్యి

దళితన్నలాసర(మాదిగల) చేతి వృత్తినయ్యి..2)

ఆకతాయిల చెంపల చెల్లు మనిపించేటి

చెళ్ళల్ల చేతిలో ఆయుధంబును ..                          (నీ కాళ్ళ)

 

చరణం-2

ఇంట్ల భూతాల భయముకు బాసట నేను అయ్యి

చెట్ల కొమ్మల్లో వేలాడ దిష్టికి రూపమయ్యి..2)

మంత్ర వాదుల మెడలోన మాలను

నేనయి

తనువును దండించే తంత్రాన్ని నేను                            (నీ కాళ్ళ)

 

చరణం-3  

ముళ్ల బాటలు దాటంగ కాళ్ళకు కవచంబునయి

రామ రాజ్యాన్ని ఏలిన రాజుకు బదులు నేనై..2)

అవినీతి పాలక వర్గాన్ని అంతమొందించేల

సామ్రాజ్య వాదుల తరిమేది నేను                         (నీ కాళ్ళ)

బ్రతుకే కొలిమి...

తగ్గుతుంది మహిలో నేడు ఆయువు కాలం

మనిషిలోన పెరుగుతుంది పెను బలహీనం

పీల్చే గాలి కలిషితం త్రాగే నీరు కలుషితం

పంటనేల కలుషితం ఇంట బయట కలుషితం

మనుషలమే కలుషితమై కరువుకు కారణమవగ తగ్గుతుంది ఆ........

 

అధిక పంటకై రైతు రసాయనికెరువులు వేస్తే

నిండుగ ఒక పంటైన చేతికందరాదాయే భూసారం తగ్గి నేడు బువ్వలో బలమే లేక

ముప్పై ఏండ్లు నిండముందే ముసలి తనము రాబట్టే

మూడు కాలాల పంటలను ఇచ్చిందానాడు

నేలమ్మా ఎదపై ఎటు జూసిన ఎండిన మొక్కలు నేడు

తగ్గుతుంది..ఆఆ

 

సకలకోటి ప్రాణులకాధారమైన వాయువు

వాహన ఫ్యాక్ట్రీల పొగతో కలుషితమై పోయె

సహజ వనరులను సైతం గ్యాసులు ఏసి లు అంటూ

సంతలోన బేరమెట్టి అమ్ముకునే రోజులొచ్చే

పళ్ళు తోమే పుల్ల మొదలు పాడే దాకా చెట్టేర

అంతరింప జేస్తు మనం అంతరించి పోతున్నాం

 

ప్రకృతితో చేయాలి మనము చెలిమి

లేకుంటే క్షామంలో బ్రతుకే కొలిమి...

 

లేబరోళ్ళం

ఒళ్లు మండినా గొంతు ఎండిన

కాళ్ళు కాలిన కడుపు కాలిన

కూటి కోసం కోటి తిప్పలు

రెక్కగుంజిన బక్కచిక్కిన

దుమ్ము ధూళి నోట పేరుకుపోయిన

బాధ్యత కోసం భారమైన పనులు

పొద్దంతా పని జేసీ ఒళ్ళు పుండైన

ఇంటికిబోంగనే పొల్లగాండ్ల(ఇంటిదానీ) ముఖం జూస్తే

పడ్డ కష్టం యాదికే రాదు

ఆశ బారెడు సంపాదన మూరెడు

వారం కాంగనే పైసలు ఇట్ల వచ్చి అట్ల పోతుంటే

మళ్ళ పడ్డ కష్టం ఆదికొచ్చే

 

ఓ నాగమల్లి నా కన్నె జాబిల్లి

వంకా వంక దారుల్లో వంపుగున్న తోవల్లో

వయ్యారంగా వచ్చేటి ఓ నాగమల్లి ఓ నాగమల్లి

నా వంక జూసుకుంట నన్నాగం జెయ్యకే ఓ నాగమల్లి

నా కన్నె జాబిల్లి

 

మక్కాజొన్న సేలల్లో ముచ్చట నాది దెస్తుంటే

మందిలో నేను బోతుంటే నీ సూపులు నా వీపు గుచ్చుతుంటే

నువ్వు నన్నే బిలిసినట్టాయే ఓ నాగమల్లి

ఓనాగమళ్ళి

నా వెన్నే దట్టి నట్టాయే.. ఓ నాగమల్లి నా కన్నె జాబిల్లి

 

కట్టా కింద పొలంలో నువ్ వంగి కలుపు దీస్తుంటే

కట్టా మీద నేనేమో కాలి నడక బోతుంటె

నీ సన్నా సన్నని నవ్వుకేమో ఓ నాగమల్లి ఓ నాగమల్లి

నా గుండె గిల్లి నట్టాయె.. ఓ నాగమల్లి నా కన్నె జాబిల్లి

 

పొద్దుగూకే ఏలల్లో ఇద్దరొద్ది కయ్యే తావుల్లో

నువు నేను ఎదురు బడుతుంటే  ఎద కిందికి జారినట్టుందే

మనసైన దానివే పిల్లా.. ఓ నాగమల్లి ఓ నాగమల్లి

మనువాడుకుందం రాయే ఓ నాగమల్లి నా కన్నె జాబిల్లి

తరాల చరితలో...

పల్లవి:-

తరాల చరితలు చూసిన గానీ జరగలేదు ఏ న్యాయం

ఆడ బతుకు అన్యాయం

యుగాలు ఎన్ని గడిచిన గాని వనితకు తీరని శోకం మగ గర్వాందులదాపాపం.

పురుషులు చేసిన పుణ్యమేమిటో

మహిళలు చేసిన పాపమేమిటో

ఇరువురి కలయిక కాల గర్భాన కానరాని ఆ మర్మమేమిటొ

                       "తరాల చరితలో"

 

1):-

విద్య వైద్య సాహిత్య సేవలలో వెల్లువల్లే వెలుగొందే స్త్రీలు

భార్యగా బాధ్యత వచ్చే నాటికి

ఇంటికెందుకో అంటిల్లాయేను....(2)కో

మగని మాటకే లోబడి ఆడది

బానిసగాయెను....(2)

కష్టాల కాలానికెదురుగ తాను బతుకు బండినే లాగుతున్నది          

                       "తరాల చరితలో"

2):-

పుట్టగానే చంపేసే తీరు

ఎదుగుతుంటే ఆ నిందలే వేరు

ఆదిపత్యుల చేతికి చిక్కగా

అతి వేదనతో అంగలార్చేను ...(2)కో

పతి మాత్రం పాపిష్టి వాడైన

దైవము కంటే మిన్ననుకున్న

భోగ దేహిగా చూస్త ఉన్నరు

చదువుల తల్లని కొలుస్తున్నరు

                       "తరాల చరితలో"

3):-                                                 

కన్యాశుల్కం రోజులేడా

వరకట్న సంప్రదాయమెవడు  తెచ్చెను

విధవ అయితే ఏ గౌరవమొందని

వింత ఆచారమెవడు పెట్టెను

అవని వదిలి ఆకాశ పయనాలు

చేసి ఘనతలే పొందిన

అన్నిట తానై ఉంటున్నా

అబలగ ఎందుకు మారిందో 

                       "తరాల చరితలో"

4):-                                   

గడియారంలో సెకను ముళ్లులా

అలసటెరుగక పనులు చేసిన

గంట కోసారి కదిలే ముళ్లుకు

ఆ గర్వ మెందుకు...

కన్న తండ్రి తన సొంత అన్నలే

కామంతో కాటేస్తే ....

ఉరి తీయని నిర్భయ చట్టాలెందుకు

మగ కామాంధులు మారనప్పుడు

                       "తరాల చరితలో"

అయ్యో.......

పల్లవి:

పూటకో పువ్వు రాలినట్టుగా మట్టి బిడ్డ ఘోర మరణం

చేరదీసి బాధ బాపే వాడు లేక అన్నదాత  కంట శోకం.        (2)

వెళుతుండో వెళుతుం డో

పొలము కొడుకులను సెలక బిడ్డలను

కండ్ల జూసుకుంటనాదలను

జేసీ వెళుతుండో

అయ్యో.......

 

చరణం 1:-

వడ్డీకి దెచ్చినప్పు పంట నిలపక పాయె

పరువే ఉరి తాడై పురుగు మందు తో ప్రాణాలు తీసే

పంట చేతికి వస్తె గిట్టు బాటు ధరలు జాడ లేక

ధీర బోయిన గుండె ముక్కలయ్యి నేల కొరిగే

(పంట)  సచ్చినంకనే  నష్ట పరిహారము     -2

ఉన్నప్పుడు జెయ్యరే సాయము

వెళుతుండో వెళుతుం డో

పొలము కొడుకులను సెలక బిడ్డలను

కండ్ల జూసుకుంటనాదలను

జేసీ వెళుతుండో

అయ్యో.......

 

చరణం 2:-

ఆశలే పెట్టి నాడు గెలిసి గోసలే పెట్టే

సూడు

రైతుల ప్రాణాలతోటి ఆటలే .. ఆడే నేడు

రైతిళ్లలో తిండి లేక

వాళ్ళ కళ్ళలో నీళ్ళింకి పాయే

ఒక్క పూట తిండి గూడ లేక

ఎన్ని గోసలో వాళ్ళ  బతుకులో

(పంట) సచ్చినంకనే నష్ట పరిహారము

ఉన్నప్పుడు జెయ్య రే సాయమంటు

వెళుతుండో వెళుతుండో.....

పొలము కొడుకులను సెలక బిడ్డలను

కండ్ల జూసుకుంటనాదలను

జేసీ వెళుతుండో

అయ్యో.......

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు