మా రచయితలు

రచయిత పేరు:    శాంతివనం మంచికంటి

కవితలు

సౌందర్య పిపాసి

నుదిటిన విభూతి ధరించి వచ్చాడతడు

 

మూసిన కన్నుల్ని విప్పకుండానే

నిద్రవోతున్న తల్లిమనసుని తట్టి లేపసాగాడు

 

పంట చేలో పైరగాలి వీచినట్టుగా

సుతిమెత్తని ఉన్ని చేస్పర్శతో

అద్దుతూ అద్దుతూ

అనంత లోకాలకు తీసుకు వెళ్ళాడు

 

కత్తి నిండా పూల వనాన్ని చుట్టి

చర్మానికి సుగంధ లేపనం అద్దినట్టు

అద్దుతూ అద్దుతూ మాటల వనంలోకి మౌనంగా  నడిపించుకు వెళ్ళాడు

 

ముఖం నిండా పన్నీటి జల్లును

తొలకరి చినుకుల్లా చిమ్మి

సుగంధ లేపన పరిమళ మద్దాడతను

ఆ చేస్పర్శతో  మౌనంలోని నవ నాడుల్ని మేల్కొల్పి  ఏవో లోకాలకు రథంపై ఊరేగింపుతో తీసుకు వెళ్ళాడు

 

అపూర్వమైన చిత్రకళాకారుడులా

పని తనానికి మెరుగులు దిద్దుతున్నట్టుగా

అతను కత్తితో చర్మంపై

చిత్రలేఖనాన్ని  లిఖిస్తున్నట్టు

రాతిపై ఉలితో శిల్పాలు చెక్కుతున్నట్టు కళాతృష్ణ తీర్చుకుంటున్నాడు

 

కళ్ళలో ఏవో వెలుగుల్ని పూయించాలని చర్మానికి తళుకులద్దే పని అతి నేర్పుగా చేసుకుపోతున్నాడు

 

నిద్రపోతున్న హృదయ వనానికి

మెలకువ తెలీకుండా గుసగుసగా కత్తితో

వెనుకా ముందుకూ  కదులుతున్నాడు

 

పూల స్పర్శతోనే తలను అటూ ఇటూ

కదిలీ కదలనట్టు

నెమ్మదిగా మరింత నెమ్మదిగా

మూసిన కన్నులు మూసినట్టుగానే

ఒక దేవతార్చనలో నిమగ్నమైనట్టు

పూజా సామగ్రిని అమర్చినట్టు 

అగరువత్తులను హారతి కర్పూరం వెలిగించినట్టుగా

నైవేద్యం సమర్పించినంత ధ్యానంతో ధ్యాసతో

 

చేయి చేసే సైగలతోనే మోము అందాలకు

పుప్పొడులు తెచ్చి అద్దుతూ అద్దుతూ

ఒక మైకంలోకి

ఒక మధుర స్వప్నంలోకి

ఒక పురాభావంలోకి      

ఒక పూపోదరింట్లోకి      

ఒక వెన్నెల వర్షంలోకి

నా బాల్యంలోకి

లాక్కెళ్ళి పోతున్నాడీ క్షురకుడు

చెట్టొక గొప్ప సామ్యవాది

చినుకులు పలపలా రాలగానే

చెట్టు వొళ్ళంతా పులకరిస్తుంది 

ఆకుల చేతివేళ్లు సంగీతం మీటుతాయి 

కొమ్మలు నాట్యం చేస్తాయి 

చిగుళ్ళు హాయిగా కళ్ళు తెరుస్తాయి

కొమ్మారెమ్మా రాగమందుకుంటాయి 

మొగ్గలు పూల చిందులేస్తాయి

చెట్టు వేళ్లకు నీటి లేఖలు రాస్తుంది

వేళ్ళు ఒళ్ళు విరుచుకొని నిద్ర లేస్తాయి

నీటిని ఆబగా ఒంటి నిండా పీల్చుకుంటాయి

కాండాన్ని తట్టి  లేపుతాయి 

వయ్యారంగా లేచిన కొమ్మలకు

నీటి పిలుపులు పంపుతాయి

కొమ్మలేమో రెమ్మలకు నీటిని జాలువారుస్తాయి

ఆకులేమో రెమ్మల నుండి 

నీటికి ఆహ్వానం పలుకుతాయి 

నోళ్లు తెరిచిన హరితం 

మత్తుగా ఒక్కో గుక్క వేస్తుంది 

సూర్యుడిని ఆహ్వానించి

కిరణాలు వెలుతురు సంతకం చేస్తాయి

చల్లని గాలి తెమ్మెర మెల్లగా చెంత చేరుతుంది సమిష్టిగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి 

చెట్టంతా హరితవనం పండుగ అవుతుంది 

చిగురు నుండి వేరు వరకు వాయిణాలు పంపుతుంది మొగ్గలు విచ్చుకుని పూల బాసలు చేస్తాయి 

రంగు రంగుల రెక్కలు వాలు చూపులతో 

తుమ్మెదలను రారమ్మని పిలుచుకుంటాయి మధురమైన మకరందాన్ని  పీల్చుతూ ఉంటే 

పువ్వు మధురోహల్లో తేలిపోతుంది 

పోతూపోతున్న తుమ్మెదకు పుప్పొడి వెల్ల వేస్తుంది వనమంతా పంచుకుంటూ తుమ్మెదలు రాగాలు తీస్తాయి 

పువ్వులు కాయలవుతాయి

కాయలు పండ్లవుతాయి

చిలకల గాయాలకు పులకించి పోతాయి

చెట్టు విరగ కాస్తుంది 

కొమ్మలు ఒళ్ళొంచుతాయి

రారండహో అంటూ వనానికి చాటింపు వేస్తాయి పక్షులు ఎన్నో గూళ్లు కట్టుకుంటాయి

చీమలు బారులు తీరుతాయి

పురుగు లెన్నో పాక్కుంటూ వస్తాయి 

మనుషులు ఆశల పల్లకీ ఎక్కుతారు 

జగమంతా చెట్టు చుట్టూ చేరి ఆకలి తీర్చుకుంటుంది

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు