మా రచయితలు

రచయిత పేరు:    జిల్లేళ్ళ బాలాజీ

కథలు

కోకిలవాణిని ఎవరికీ గుర్తుండదు
 

తానొక ప్రధానమైన వార్తగా మారుతానని కోకిలవాణి ఏనాడూ అనుకోలేదు. కానీ అదే జరిగింది. ఆ వార్త వెలువడ్డ రోజు సెప్టెంబర్‍ 20, ఆదివారం, 1998. అప్పుడు ఆమె వయస్సు ఇరవైమూడేళ్లు.

          కోకిలవాణిని ఇప్పుడు ఎవరికీ గుర్తుండదు. ఒకవేళ మీరు రోజూ వార్తాపత్రికను తప్పక  చదివేవాళ్లయితే మీ జ్ఞాపకాలలో ఏదో ఒక మూలన ఆమె పేరు ముద్రింపబడి ఉండొచ్చు. కానీ రోజూవారి వార్తలను ఎవరు గుర్తుంచుకుంటున్నారు? అవి రోడ్డు ప్రమాదాలను కూడా ఆసక్తికరమైన సంఘటనలుగా మార్చేస్తున్నాయి. రక్తపు మరకలు లేని వార్తాపత్రికలే లేవు.

          ప్రమాదంలో మరణించిన వాళ్ల ఫోటోలను వార్తాపత్రికలు ఎందుకు అంతంత పెద్దవిగా ప్రచురిస్తున్నాయి? దాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడుతున్నారు. మనిషి, ఒకవేళ హింస యొక్క వికృత రూపాన్ని మనం లోలోపల ఇష్టపడుతున్నామా? కోకిలవాణిని ప్రధాన వార్తగా చేయటానికి మనం కారణం కాదని పక్కకు తప్పుకోవటానికి వీలులేదు. ఆమె మనల్ని నేరస్థులని చెప్పటం లేదు. కానీ ఆమె మనల్ని చూసి భయపడుతోంది. మనల్నందరినీ వదిలి దూరంగా ఉంటోంది.

          ఇవ్వాల్టికీ ఆమె పాదాలు రోడ్డుమీద నడవటానికి భయపడుతున్నాయి. చేతులు తనకు తెలియకనే వణుకుతున్నాయి. ఎవరైనా దగ్గరికి రావటాన్ని చూడగానే కళ్లు గాల్లో ఊగిసలాడే దీపం జ్యోతిలా రెపరెపలాడుతున్నాయి. అంతెందుకు, ఆమెకు నిద్రలో కూడా ప్రశాంతత లేదు. క్రూరమైన కలల వల్ల కెవ్వుమని కేకలు వేస్తోంది.

          ఆమె స్వేచ్ఛగా తిరుగాడిన ప్రపంచం ఒక్కరోజులో ఆమెనుండి దాన్ని లాక్కొని విసిరివేయబడ్డది. స్నేహితురాళ్లు, కుటుంబం, చదువు, ఉద్యోగం...అన్నీ ఆమెనుండి దూరమైపోయాయి. ఆయింటుమెంట్లూ, డజన్ల కొద్దీ మాత్రలూ, వ్రణచికిత్సా ఆమె రోజువారీ లోకమైపోయింది. ఏడ్చి ఏడ్చి నీరసించి ఒరిగిపోయింది. ఎన్నో సందర్భాలలో తనను టాయిలెట్‍ గది మూలలో విసిరి పారేసిన సగం కాలిన అగ్గిపుల్లలా గ్రహించింది.

          ఒక సంభవం అని తేలికగా వార్తాపత్రికలలో వివరించబడ్డ ఆ హృదయ విదారకమైన సంఘటన... ఇలాగే వార్తాపత్రికలలో వివరించటం జరిగింది.

          చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే కోకిలవాణి అన్న 23 ఏళ్ల యువతిమీద దురై అన్న యువకుడు ఆసిడ్‍ పోశాడు. దీనికి సంబంధించి గిండి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

          విచారణలో... దురై అన్న వ్యక్తి కోకిలవాణిని తానుగా ప్రేమిస్తూ వచ్చాడు. కానీ కోకిలవాణి, మహేష్‍ అన్న కాలేజీ స్టూడెంట్‍ను ప్రేమిస్తున్నది.

          తన ప్రేమను అంగీకరించకపోతే ఆసిడ్‍ పోస్తానని కోకిలవాణిని దురై చాలాసార్లు హెచ్చరించాడు. కానీ దురై ప్రేమను ఆమె అంగీకరించలేదు. దాంతో ఆవేశపడ్డ దురై తన స్నేహితులైన హరికృష్ణ, సంజయ్‍ మొదలైనవాళ్లతో కలిసి మాట్లాడుకొని కోకిలవాణి ముఖంలో ఆసిడ్‍ పొయ్యటానికి తంబుచెట్టి వీథిలోని ఒక అంగట్లో ‘సల్ఫ్యూరిక్‍ ఆసిడ్‍’ ను కొన్నాడు. మరుసటిరోజు ఉదయం గిండి రైల్వేస్టేషన్‍కు వెళ్లే దార్లో కోకిలవాణిని అడ్డగించి ఆసిడ్‍ను పోసి దురై తప్పించుకు పారిపోయాడు.

          దాంతో కోకిలవాణి ముఖం కాలిపోయింది. సంఘటన జరిగిన చోటే కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయిన ఆమెను కొందరు ప్రజలు రక్షించి ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. 60 శాతం వరకూ ముఖం కాలిపోయిన ప్రమాదకరమైన స్థితిలో ఆమె చికిత్స పొందుతోంది. దురై మీద పోలీసులు కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నారు.

                                                          ()  ()  ()

         

          పదిహేనేళ్ల వయసులో ప్రేమించటం గురించిన ఊహలు కోకిలవాణిలో మొదలయ్యాయి. పాఠశాల సమయాలలో దాని గురించే ఆమె, స్నేహితులూ రహస్యంగా మాట్లాడుకునేవాళ్లు. ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మంచుగడ్డను అరచేతిలో పట్టుకున్నట్టుగా ఆమె ఒంట్లో ఏదో తెలియని గిలిగింతలు ఏర్పడటం గ్రహించింది.

          రోడ్డుమీద, ప్రయాణంలో, సామూహిక ప్రాంతాలలో కనబడే వయసుమీదున్న యువకులను చూస్తున్నప్పుడల్లా ఇందులో ఎవరు తనను ప్రేమించబోతున్నవాడు అని తహతహలాడేది. ఆమె ప్రేమించటం కోసం తపించింది. ఎవరి ద్వారానో ప్రేమించబడటానికి ఎదురుచూసింది. దాని గురించి తన నోటుపుస్తకంలో ఏవేవో రాతలు రాసిపెట్టేది. కవితలు కూడా రాసేది.

          ఆమెకు దివాకర్‍ అన్న పేరు బాగా నచ్చింది. ఇంతటికీ ఆ పేరుమీద ఉన్నవాళ్లెవరినీ ఆమెకు తెలియదు. కానీ ఎందుకో ఆ పేరంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ పేరుతో ఉన్న ఒక్క వ్యక్తినైనా ప్రేమించగలిగితే ఎంత బాగుంటుందో కదాని కూడా అనిపించేది. కానీ అలా జరుగుతుందా ఏం?

          ఆ పేరుతో తన పేరును జతచేసి దివాకర్‍ కోకిలవాణి అని రహస్యంగా రాసి చూసుకుంటూ మురిసిపోయేది. ఒకరోజు ఆమె స్నేహితురాలు ఇందిర, ‘‘ఎవరే ఆ దివాకర్‍?’’ అని అడిగినప్పుడు... ‘‘పక్కింట్లో ఉన్న కుర్రాడు. అతణ్ణి నేను లవ్‍ చేస్తున్నాను.’’ అని అబద్ధమాడింది.  

          ఆ అబద్ధాన్ని ఇందిర నమ్మటమేకాక  ఆ ప్రేమ ఎలా మొదలయ్యింది, ఎంత కాలంగా జరుగుతోంది అంటూ అడగటం మొదలుపెట్టింది. ఆమె కోసమే కోకిలవాణి ఎన్నెన్నో ఊహించుకుని దివాకర్‍ను గురించి కథలు కథలుగా చెబుతూ ఉండేది.

          వాటిని విన్నప్పటి నుండి ఇందిర కూడా తానెవరినైనా ప్రేమిస్తే బాగుణ్ణు అనుకుంది. కానీ ఎలా ప్రేమించాలి అని భయపడేది. వాళ్లు ట్యూషన్‍ చదువుకోవటానికి వెళ్లే ఇంట్లో ఉన్న మురళీతో ఇందిర జంకుతూ అతణ్ణి ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది. అతను, తానుకూడా ఆమెను ప్రేమిస్తున్నట్టుగా చెప్పి మేడమీది గదికి రమ్మన్నాడు.

          భయమూ, కుతూహలంతో మేడమీదికి వెళ్లిన ఇందిర అరిచి హడలెత్తిపోతూ క్రిందికి దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ‘‘ఏం జరిగిందే?’’ అని కోకిల అడగినా, ఇందిర బదులేమీ చెప్పలేదు. ఏడుస్తూ ఉండిపోయింది. బస్సులో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు,  ‘‘లవ్‍ చేస్తున్నానని చెప్పి కిస్‍ చేసి పెదాల్ని కొరికేశాడే. అసహ్యంగా ఉంది.’’ అని చెబుతూనే కన్నీళ్లు కార్చింది.

          కోకిలవాణికి అమ్మయ్య, మనం ఎవరినీ ప్రేమించలేదని అనుకుంది. మరుసటిరోజంతా ఇందిర లవ్‍ చెయ్యటం తప్పని చెబుతూనే ఉంది. లోలోపల దాన్ని అంగీకరించకపోయినప్పటికీ ఇందిర కోసం తానూ దివాకర్‍ను లవ్‍ చెయ్యటాన్ని మానేశానని చెప్పింది కోకిలవాణి. కానీ మనసులో... బలవంతంగా కిస్‍ చెయ్యని మంచి కుర్రాడిని చూసి లవ్‍ చెయ్యాలన్న ఆశ ఉంటూనే ఉండేది.

                                                          ()  ()  ()

         

          కోకిలవాణి ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు పెద్దమనిషైంది. పదవ తరగతితో చదువును ఆపేసి కొన్ని నెలలు దగ్గరలోనే ఉన్న ఎస్‍.టి.డి. బూత్‍లో పనిచేసింది. అక్కడికొచ్చే యువకులలో ఒక్కడు కూడా ఆమెను పట్టించుకోలేదు. జిడ్డు ముఖంతో, సన్నని శరీరంతో ఉండటం వల్లనే తానెవరికీ నచ్చలేదేమోనని అనుకునేది. ఆమెకు రెండే రెండు మంచి చుడీదార్లు ఉండేవి. దాన్నే మార్చి మార్చి వేసుకుని పనికి వెళ్లేది. జీతం డబ్బుతో పసుపూ చందనమూ కలిసిన టర్మరిక్‍ క్రీమ్‍ కొనుక్కుని ఒళ్లంతా రాసుకునేది. ఫెయిర్‍ అండ్‍ లవ్లీ ని కొని రహస్యంగా ఉపయోగించి చూసుకునేది. పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగి అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించేది. ఎలా చేసినప్పటికీ ఆమెమీద ఎవరికీ ఇష్టం ఏర్పడలేదు.

          ఎస్‍.టి.డి బూత్‍ నడిపే చొక్కనాథన్‍ రోజూ ఆమెను పంపించి సిగరెట్లు తెమ్మనేవాడు. ఆమె ఒక ఆడది అని కూడా పట్టించుకోకుండా ఫోన్లో పచ్చి బూతులు మాట్లాడుతూ ఉండేవాడు. తనను ఒక ఆడదానిగా కూడా అతను చూడటంలేదన్న అక్కసు కోకిలవాణికి చాలానే ఉంది.

          తనను అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎందుకు తనకు మాత్రం మెడ ఎముకలు ఇలా పొడుచుకొచ్చినట్టుంటాయి, దవడ ఇలా ఎందుకు కుంచించుకుపోయి ఉందని ఆత్రంగా వచ్చేది. తనను ఎలాగైనా అందంగా మలుచుకోవాలని కొత్తకొత్తగా వచ్చే సబ్బులు కొని వాడేది. తల వెంట్రుకలను చుట్టగా చుట్టుకునేలా ప్రయత్నించేది. మూడు నెలలు స్పోకెన్‍ ఇంగ్లీషు ట్రైనింగు క్లాసుకు కూడా వెళ్లింది. అయినా ఎవరూ ఆమెను ప్రేమించనే లేదు.

          అయితే ఒకరోజు ఒక కుర్రాడు బైక్‍లో ఒక యువతిని తన వెనక కూర్చోబెట్టుకుని సినిమా థియేటర్‍ వైపు వెళుతుంటే ఆమెకేసి చెయ్యి చూపించి ఏదో  ఎగతాళిగా చెప్పటం చూడగానే అతనిమీద కోపం ముంచుకొచ్చింది.

          ప్రేమించటం మొదలుపెట్టక మునుపే ప్రేమలో ఓడిపోయిన కోపంతో ఆమె రెండుమూడు రోజులు మధ్యాహ్నం భోజనం కూడా తినకుండా విసిరి కొట్టింది. కానీ ఆకలిని ఆమె ప్రేమద్వారా గెలవలేకపోయింది.

          కొన్ని సమయాలలో సముద్రతీరానికి వెళ్లినపుడు ఇంతమంది ఎలా ప్రేమిస్తున్నారాని ఆశ్చర్యపోయేది. సముద్రాన్ని వేడుక చూడ్డంకన్నా ప్రేమికులనే చూస్తూ ఉండిపోయేది. ఆమెకన్నా సుమారుగా ఉన్న ఆడవాళ్లు కూడా ప్రేమిస్తున్నారు. ఎందుకు తనను ఒక్కరుకూడా ప్రేమించటం లేదని అక్కసుగా ఉండేది. దాన్ని తలుచుకుని ఎంతో బాధపడేది. ఎక్కువ జీతం తీసుకునే ఆడదానిగా ఉంటే ప్రేమిస్తారని ఇందిర చెప్పిన మాటల్ని వినటం తట్టుకోలేని ఆవేదనగా అనిపించింది. ప్రేమ మాత్రమే ఆమె జీవితం యొక్క ఒకే ఒక లక్ష్యంలా భావించసాగింది.

          చొక్కనాథన్‍, మాంబలంలో కొత్తగా ప్రారంభించిన జెరాక్స్ అంగడికి ఆమెను మార్పు చేసినపుడు రోజూ ఎలక్ట్రిక్‍ ట్రైన్‍లో వెళ్లి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగానే మహేష్‍ను కలుసుకుంది. రెండు రోజుల్లోనే మాటలతో అలవాటుపడ్డారు.          

           మహేష్‍ ఆమెకన్నా సన్నగా ఉన్నాడు. ఎక్కువగా నీలిరంగు ప్యాంటునే తొడుక్కొని వచ్చేవాడు. ఓరియంట్‍ సెలూన్‍లో పనిచేస్తున్నట్టుగా చెప్పాడు. మహేష్‍ ఆమెకు బాగా నచ్చాడు. రోజూ మహాష్‍ ఆమెకోసం టిఫిన్‍బాక్స్లో ఏదోఒక తినుబండారం తీసుకొచ్చేవాడు. రైల్లో పక్కనే కూర్చున్నప్పటికీ అతని చెయ్యి ఆమె మీద పడకుండా చూసుకునేవాడు. ఆమె మంచినీళ్ల బాటిల్‍ను తీసుకొని తాగుతున్నప్పుడు కూడా దాన్ని దూరంగా పెట్టే తాగేవాడు. అన్నిటికన్నా ఆమె కొత్త దుస్తులో, కొత్త హేర్‍క్లిప్పో ఏది తొడుక్కుని వచ్చినా ఇది నీకు చాలా బాగుందని పొగిడేవాడు. అందుకనే తానొక మంచివాణ్ణి ప్రేమిస్తున్నట్టుగా గొప్పగా భావించుకుంది కోకిలవాణి.

          ఒకరోజు సాయంత్రం మహేష్‍ రాకకోసం మాంబలం రైల్వేస్టేషన్‍ సమీపంలో ఎదురుచూస్తుంటే కాళ్లు నొప్పులుగా         ఉన్నాయని ఒక బైక్‍కు ఆనుకొని నిలబడింది. ఎదురుగా ఉన్న అంగట్లో నుండి ఒకవ్యక్తి ఆమెనే చూడసాగాడు. అతను తనను చూస్తున్నాడని గ్రహించిన మరుక్షణం తన దుపట్టాను సరిచేసుకుని తల వంచుకుంది కోకిలవాణి. ఆ యువకుడు ఒక సిగరెట్‍ను వెలిగించుకుని ఆమెను చూస్తూ పొగ పీల్చసాగాడు. మహేష్‍ రావటం  ఆలస్యమయ్యేకొద్దీ ఆమెలో కోపం అధికం కాసాగింది. అతను సిగరెట్‍ను ఆర్పేసి దగ్గరికొచ్చి నిలబడి... ‘‘ఇది నా బైక్‍. కావాలంటే ఎక్కి కూర్చోవచ్చు. లేదూ ఎక్కడికి వెళ్లాలో చెప్పండి, నేనే తీసుకెళ్లి దిగబెడతాను.’’ అని చెప్పి నవ్వాడు.

          దాన్ని భవ్యంగా అతను చెప్పిన విధం ఆమెకు నవ్వును తెప్పించింది. దాన్ని విన్న ఆ యువకుడు, బైక్‍ తాళాలను తీసి ‘‘మీరే కావాలన్నా నడపండి.’’ అన్నాడు. కోకిలవాణి ‘‘వొద్దు’’ అని తిరస్కరించి నవ్వుతూ పక్కకెళ్లి నిలబడింది. ఆ యువకుడు ఆమెతో ‘‘ఇల్లు ఎక్కడ?’’ అని అడిగాడు. ఆమె బదులివ్వకుండా స్టేషన్‍కేసే చూడసాగింది. అతను తన పాకెట్‍నుండి దువ్వెన తీసి తలను దువ్వుకుంటూ ఒక బబుల్‍గమ్‍ను తీసి ఆమె ముందుకు చాపాడు.

          ఆమె గబగబ రైల్వేస్టేషన్‍ లోపలికి నడవటం మొదలుపెట్టింది. అతను నవ్వటం వినిపించింది. మహేష్‍ వచ్చేంతవరకూ ఆమె తిరిగి చూడలేదు. మహేష్‍తో ఆ యువకుడి గురించి చెప్పాలా వద్దా అన్న సంధిగ్ధంలో పడింది. కానీ చెప్పలేదు.

          రెండురోజుల తర్వాత ఆ బైక్‍ యువకుణ్ణి మళ్లీ రైల్లో చూసింది. అతను కదిలి దగ్గరికొచ్చి నిలబడి ఆమెనే చూస్తూ       ఉన్నాడు. కోకిలవాణి అతణ్ణి ఓరకంటితో చూసినపుడు అతను పెదవిని కొరకటమూ, అరచేతిమీద ఐ లవ్‍ యూ, యువర్స్ దురై అని తన పెన్‍తో రాసి చూపించటమూ, వంకర నవ్వుతో చేతిని ఊపటం లాంటివి చెయ్యసాగాడు.  

          ఒక వారంరోజుల తర్వాత, ఒకరోజు ఉదయం ఆమె రైలు దిగి నడుస్తుంటే దగ్గరికొచ్చి ‘‘నీ కోసమే రోజూ తాంబరం నుండి ఇదే రైల్లో వస్తున్నాను.’’ అన్నాడు. కోకిలవాణి అతనితో మాట్లాడలేదు.

          అతనేమో చాలాకాలం నుండి ఆమెకు పరిచయమున్నవాడిలా దగ్గరికొచ్చి... ‘‘సినిమాకు వెళదామా?’’ అని అడిగాడు. ఆమెకు ఆ మాటలు వినగానే భయం కలిగింది. దాన్ని ప్రదర్శించకుండా... ‘‘నాకు ఇవన్నీ నచ్చవు.’’ అంది.

          దురై నవ్వుతూ... ‘‘అంటే నువ్వు నన్ను లవ్‍ చెయ్యలేదా?’’ అని అడిగాడు. కోకిలవాణి కోపంగా, ‘‘నేనెందుకు నిన్ను లవ్‍ చెయ్యాలి?’’ అని అడిగింది.

          ‘‘అంటే ఆ రోజు మాత్రం నవ్వావు. రోజూ లుక్స్ విసురుతున్నావే, అది ఎందుకు?’’ అన్నాడు దురై.

          ‘‘నేనేమీ నిన్ను లవ్‍ చెయ్యలేదు. నేను మహేష్‍ను లవ్‍ చేస్తున్నాను. గొడవ చెయ్యకుండా వెళ్లిపో.’’ అంది.

          వెంటనే దురై ఆమెను పచ్చి బూతులు తిట్టటమే కాకుండా... ‘‘నువ్వు నన్ను లవ్‍ చేసే తీరాలి. నేను డిసైడ్‍ చేసేశాను.’’ అన్నాడు. అతనికి భయపడి కొన్నాళ్లుగా బస్సులో వెళ్లసాగింది.

          ఒకరోజు మహేష్‍తో, ఒక యువకుడు తనను వెంటబడి తరుముతున్నాడని చెప్పింది. మహేష్‍ కాస్త కలవరపడి, ‘‘నేను మాట్లాడుతాను.’’ అని ఓదార్చాడు. ఆపై రెండురోజుల వరకూ మహేష్‍ను చూడ్డానికే వీలుకాకపోయింది. అతణ్ణి వెతుకుతూ ఓరియంట్‍ సెలూన్‍కు వెళ్లినపుడు మహేష్‍ ముఖంలో దెబ్బలు తిన్న వాపు కనిపించింది.

          మహేష్‍ తల వంచుకుని, ‘‘ఆ రౌడీనాయాలు దురై నన్ను కొట్టాడు కోకిలా. మనిద్దరినీ ఒకటిగా చూస్తే చంపేస్తానని చెప్పాడు. ఏం చెయ్యాలో తెలీటం లేదు. సెలూన్‍ ఓనర్‍ను ఐడియా అడిగాను. లవ్‍ వ్యవహారాలన్నీ తనకు నచ్చవని అంటున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలీటం లేదు. ఒకటే అయోమయంగా ఉంది.’’ అన్నాడు. కోకిలవాణి అక్కడే ఏడ్చింది. మహేష్‍ సెలూన్‍ ఓనర్‍ను అడిగి ఆమెను తీసుకెళ్లి దగ్గరున్న టీ కొట్లో రాగిమాల్ట్ కొనిచ్చి ఎన్నో ధైర్యవచనాల్ని చెప్పి పంపించాడు.

          ఆ తర్వాత మహేష్‍ ఆమెను కలుసుకోవటానికి రాలేదు. కానీ కోకిల ప్రేమను వదలలేకపోయింది. మళ్లీ ఒకనాడు మహేష్‍ను కలుసుకోవటానికి సెలూన్‍కు వెళ్లింది. అప్పుడు సెలూన్‍లో ఎవరూ లేరు. మహేష్‍ మాత్రం ఒంటరిగా కూర్చుని టి.వి. చూస్తున్నాడు. ఆమెను చూడగానే సెలూన్‍ కుర్చీలో కూర్చోమని చెప్పాడు. ఎదుటనున్న అద్దంలో ఆమె ముఖం కనిపించింది. మహేష్‍ నవ్వుతూ నీ వెంట్రుకల్ని కొద్దిగా ట్రిమ్‍ చెయ్యనా అని అడిగాడు.

          కోకిలవాణి కోపంతో అతణ్ణి తిట్టింది. తర్వాత ఆవేశంతో అతణ్ణి కౌగిలించుకుని వెచ్చటి ముద్దిచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపటి వరకూ మాట్లాడుతూ ఉండిపోయారు. ఆరోజు జతగా కలిసి ఇంటికి తిరిగొచ్చారు. కోకిలవాణి మళ్లీ ప్రేమించటం మొదలుపెట్టింది.

          అయితే వాళ్లను జంటగా ఉదయం థియేటర్‍లో చూసిన దురై... ‘‘నేను  మాత్రమే నిన్ను లవ్‍ చేస్తాను. ఇంకెవరు నిన్ను లవ్‍ చేసినా నువ్వు చచ్చినట్టే. నీమీద ఆసిడ్‍ పోస్తాను. చూసుకో.’’ అంటూ కఠినంగా తిట్టాడు. కోకిలవాణికి అది నిజమవుతుందని అప్పుడు తెలియదు.

          అది జరిగిన రెండురోజుల తర్వాత దురై బాగా తాగి ఆమె పనిచేస్తున్న జెరాక్స్ షాపుకొచ్చి... ‘‘నువ్వు నన్ను లవ్‍ చేస్తున్నావా లేదా అని ఇప్పుడే తేలాలి. చెప్పవే.’’ అని బెదిరించాడు. కోకిలవాణి అతనితో మాట్లాడలేదు. అతను అసహ్యంగా అరిచాడు. అతనికి భయపడి కొన్నిరోజులు పనికి కూడా వెళ్లకుండా ఉండిపోయింది. అయితే అతను వదిలిపెట్టలేదు. ఇంటి మందుకొచ్చి నిలబడుతూనే ఉన్నాడు. స్నానాల గదికి పక్కనున్న సందుకు మధ్యలో వచ్చి నిలబడి ఆమెనే చూస్తుండేవాడు. ఆమెకు భయంగానూ తడబాటుగానూ ఉండేది.

                                                          ()  ()  ()

         

          దురై ఆమె మీద ఆసిడ్‍ పొయ్యటానికి ముందురోజు ఉదయం కోకిలవాణి తండ్రికి ఎవరో... ఆమె మహేష్‍ను ప్రేమిస్తోందన్న విషయం గురించి చెప్పారు. అందుకు ఆ తండ్రి తన కాలికి వేసుకున్న చెప్పును తీసి ఆమె ముఖమ్మీద ఎడాపెడా వాయించటంతోపాటు మహేష్‍ కులం పేరు చెప్పి నీచంగా తిట్టటమే కాక, ఆమె తన కూతురన్న విషయాన్ని కూడా మరిచిపోయి అసహ్యంగా పచ్చి బూతులు తిట్టాడు.  

          ఆయనతోపాటు సెల్వం అన్నయ్య కూడా కలిసి... ‘‘వాడు మాత్రమే కాదు నాన్నా, దురై అని ఇంకో కుర్రవాడూ దీని వెనక తిరుగుతున్నాడు. ఒకే సమయంలో ఇద్దరు మొగపిలకాయలతో తిరుగుతోంది.’’ అని మరింత రెచ్చగొట్టాడు.

          నాన్న ఆమె జుట్టు పట్టుకొని లాగి గోడకు ఆనించి, ‘‘తిరగుబోతు లం....’’ అని మళ్లీ తిట్టటం మొదలుపెట్టాడు. అమ్మ ఆయన బలమైన పిడికిట్లో నుండి కోకిలను తప్పించి అన్నం గరిటెతో కాళ్లమీదా, కడుపుమీదా కొట్టింది. కోకిలవాణి ప్రేమకోసమే దెబ్బలు తింటున్నాననుకోవటంతో ఏడ్చి అరిచి గీపెట్టలేదు.

                                                          ()  ()  ()         

          ఆసిడ్‍ పోసిన రోజు ఉదయం దురై ఆమె ముందుకొచ్చి నిలబడగానే, ఎలాగైనా అతనితో జుజ్జగింపుగా మాట్లాడి తాను మహేష్‍ను ప్రేమిస్తున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలని మనసులో అనుకుంది కోకిల.

          అయితే దురై ఒక్కమాట కూడా ఆమెతో మాట్లాడలేదు. మాట్లాడటానికి అవకాశమూ ఇవ్వలేదు. ప్యాంటు ప్యాకెట్‍లో నుండి దువ్వెనను తీస్తున్నట్టుగా చిన్న ప్లాస్టిక్‍ బాటిల్‍ నొకదాన్ని బయటికి తీశాడు. దూరంగా ఎలక్ట్రిక్‍ రైలు వస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. ఆమె రైల్వేస్టేషన్‍ మెట్లకేసి నడవటానికి ముందు ఆమె ముఖమ్మీద ఆసిడ్‍ను పోశాడు.

          భగభగమంటూ దహిస్తున్న నిప్పులో ముఖాన్ని దోపినట్టుగా మండటం ప్రారంభించింది. చెవులు, ముఖము, ముక్కు, చెంపలు అంటూ అన్నీ మాడిపోతున్నట్టుగా తట్టుకోలేని బాధ కలగసాగింది. కోకిలవాణి గట్టిగా కేకలు పెట్టింది. గుంపును చీల్చుకుంటూ దురై పరుగెత్తటం కనిపించింది. తనముందున్న లోకం క్రమంగా మాయమవుతున్నట్టుగా ఆమెకు స్పృహ  తప్పింది.

                                                          ()  ()  ()

         

          కోకిలవాణి ఆరు వారాలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. కుడిపక్కనున్న ముఖం పూర్తిగా మాడిపోయింది. చెవి తమ్మలు కాలిపోవటంతో సగం చెవే మిగిలింది. ఆసిడ్‍ ముఖమ్మీద పడటంతో తల మధ్యభాగం వరకూ ప్రాకిన కారణంగా ఆమె తల వెంట్రుకలు సగం వరకూ కత్తిరించి ఉన్నాయి. ఆమె ముఖాన్ని చూడాలంటే ఆమెవల్లే సహించటానికి వీల్లేకపోయింది.    

          ఆమె ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఆమె తండ్రీ, తల్లీ, బంధువులూ మార్చిమార్చి ఆమెను క్రూరమైన మాటలతో తిడుతూనే ఉన్నారు. కోకిలవాణి మాడిపోయిన ముఖాన్ని చూసిన ఆమె తండ్రి... ‘‘అట్టా ఏంటే నీకు లవ్‍ కావాల్సి వచ్చింది. చచ్చిపోయుంటే శని వదిలిపోయిందని రెండు మునకలేసి ఊరుకునేవాణ్ణి. ఇకమీదట నిన్ను ఎవడే చేసుకుంటాడు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి విడిచిపెట్టాలే...’’ అంటూ తన ముఖంలో తానే చరుచుకుంటూ ఏడ్చాడు.

          ఎందుకు ప్రేమించాలని ఆశపడ్డాం. ప్రేమ అంటే ఇదేనా? దురై ఎందుకిలా తన ముఖంలో ఆసిడ్‍ పోశాడు. ఆమె ఆలోచింకొద్దీ దు:ఖమూ ఆవేదనా పొంగుకు రాసాగాయి.

          ఆమెతోపాటు చదువుకున్న విద్యార్థులు, తెలిసినవాళ్లు, స్నేహితులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదు. ఆసిడ్‍ బాధితురాలి స్నేహితురాలిని అంటూ చెప్పుకోవటానికి ఎవరు ఇష్టపడతారు. మహేష్‍ కూడా ఆమెను చూడ్డానికి రానేలేదు.

          లేడీ డాక్టర్‍ ఆమె ముఖాన్ని తుడుస్తూ... ‘‘నీకు ఎంతమంది లవర్స్ వే’’ అంటూ ఎగతాళిగా అడిగేది. కోకిలవాణి బదులేమీ ఇచ్చేదికాదు. కట్లుకట్టేవాడు ఆమె ముఖంలోని గాయాలకు ఆయింట్‍మెంట్‍ రాస్తూ... ‘‘ఇకమీదట ఒక్క మగపిలగాడు కూడా నీవైపు తిరిగి చూడడు. నువ్వు ఎక్కడికెళ్లాలన్నా వెళ్లొచ్చు. ఏ సమయానికైనా ఇంటికి తిరిగి రావొచ్చు. నిన్ను ఎవరు ఫాలో చేస్తారు.’’ అనేవాడు. కోకిలవాణికి ఆవేశం వచ్చేది. కానీ నోరు తెరిచి మాట్లాడదు. ఇలా అవమానాలపాలై జీవించటానికి బదులుగా నాన్న చెప్పినట్టుగా చచ్చిపోయుండొచ్చు. ఎందుకోసం బ్రతికిపోయాం. మిగిలిన జీవితాన్ని ఎలా గడపబోతున్నాం. ఆ బాధ ఆసిడ్‍ మంటకన్నా ఎక్కువగా ఉండబోతోంది.

                                                          ()  ()  ()

          కోకిలవాణి ఆ కేసు నిమిత్తం ఇరవైఆరుసార్లు కోర్టుకు వెళ్లి రావలసి వచ్చింది. ప్రతిసారీ ఆమె ప్రేమను ఎవరో ఒకరు ఎగతాళి చేసేవాళ్లు. కాలిన ముఖాన్ని చూపించి ఆమె కథను చెప్పి నవ్వేవాళ్లు. విచారణ కోసం మహేష్‍ రావటానికి నిరాకరించటంతోపాటు, తాను ఆమెను ఎన్నడూ ప్రేమించలేదని పోలీసు అధికారుల దగ్గర ప్రమాణపూర్వకమైన వాగ్మూలం ఇచ్చాడు. దురై ఏమో, ఆమె తనను ఎన్నో నెలలు ప్రేమించి చివరకు మోసం చేసినట్టుగా పోలీసుల వద్ద వాగ్మూలం ఇచ్చాడు. కోకిలవాణి తాను ఎవరినీ ప్రేమించలేదనీ, దురై తనను ప్రేమించమని బెదిరించాడని చెప్పింది. వకీలు ఆమె ఎవరితోనైనా శారీరక సుఖాన్ని కలిగి ఉన్నదా, మగ స్నేహితులు ఎంతమంది ఉన్నారని పదేపదే ప్రశ్నించాడు. కోకిలవాణి న్యాయస్థానంలో చాలాసార్లు ఏడ్చింది. అయితే ఎవరూ ఆమెను ఓదార్చలేదు. చివరకు దురై శిక్షింపబడ్డాడు.

                                                          ()  ()  ()

         

          సగం కాలిన ముఖంతో, ఎలకతోకకున్న వెంట్రుకల్లాంటి కొంచెం జుట్టుతో కోకిలవాణి ఇంట్లోనే పడి ఉంది. టి.వి చూడ్డం కూడా లేదు. తలలో పూలు పెట్టుకోవటమో, అద్దంలోకి చూస్తూ తిలకం దిద్దుకోవటమో కూడా చెయ్యటం లేదు. రెండుసార్లు ఆమెకు పెళ్లిమాటలు కొనసాగాయి. అయితే ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. కోకిలవాణి ఒంటరితనాన్ని అలవాటు చేసుకోలేక ఇంట్లో ఉంటూనే పుట్టగొడుగుల్ని పెంచి అమ్మకం మొదలుపెట్టింది. అమ్మానాన్నలు రోజూ  ఆమెను నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనూ ఆమె పాలుపంచుకోవటానికి అనుమతించ బడలేదు. నవ్వును మరిచిపోయిన దానిలా కోకిలవాణి ఒక జీవచ్ఛవంలా బ్రతకసాగింది.

                                                          ()  ()  ()

         

          ఉపాసన అన్న ఒక సేవాసంస్థ ఆమెను తమ సంస్థలో పనికి చేర్చుకున్నప్పుడు ఆమెకు ముప్పైరెండేళ్ల వయసు నడుస్తోంది. అది కళ్లులేని వాళ్లకోసం సేవచేసే సంస్థ. అంధత్వం కలిగినవాళ్లే అక్కడ ఎక్కువమంది పనిచేస్తున్నారు. అందుకని ఎవరూ ఆమెను ఎగతాళి చేస్తారన్న భయంలేకుండా ఆమె పనికి వెళ్లి రావటం మొదలుపెట్టింది. అక్కడున్న గ్రంథాలయంలోని ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చి చదువుతూ ఉండేది.    

          కొన్నిసార్లు ఆమెకు తెలియకనే శారీరక సుఖం గురించి మనసు తహతహలాడేది. అప్పుడు వేళ్లతో ముఖాన్ని తడుముకునేది. కరెంట్‍లో చెయ్యి పెట్టినట్టుగా మనసు వెంటనే ఆ ఆలోచనల నుండి తనను తాను ఖండించుకునేది.

                                                          ()  ()  ()

         

          గత సంవత్సరం ఒకరోజు సముద్రతీరాన యాథృచ్ఛికంగా దురైను చూసింది. అతనికి పెళ్లై పాపకూడాఉన్నట్టుంది. రెండేళ్ల వయస్సున్న ఆ పాప ఒక రంగురంగుల బంతితో ఆడుకుంటోంది. ఇసుకలో కూర్చున్నట్టుగానే దురై భార్యను గమనించింది. మంచి రంగు. ఆరెంజ్‍ కలర్‍ చీర కట్టుకుంది. చేతిలో ఒక హ్యాండ్‍బ్యాగ్‍. మెడలో చాలా నగలు వేసుకుంది. దురై ఫుల్‍హ్యాండ్స్ షర్ట్ ధరించి తలను చక్కగా దువ్వుకొని ఉన్నాడు.

          ఎందుకో దురై భార్య దగ్గరకు వెళ్లి మాట్లాడాలనిపించింది. ఆ పసిపాపను ఒకసారి బుజ్జగిద్దామా అని కూడా అనిపించింది. ఆమె తమనే చూస్తూ ఉండటాన్ని దురై గమనించి భార్యతో ఏదో చెప్పాడు. వాళ్లు పైకి లేచి నిలబడ్డారు.

          తానే కదా దురైమీద కోపమూ అసహ్యమూ కలిగి ఉండాలి. అతనెందుకు తనను చూడగానే లేచి పారిపోతున్నాడు? భయమా, గతకాలపు జ్ఞాపకాలు ఏవీకూడా తనముందుకొచ్చి నిలబడకూడదన్న తడబాటా... అన్న ఆలోచనతో వాళ్లు వెళ్లిపోవటాన్ని కోకిలవాణి చూస్తూ ఉండిపోయింది.

          ఒక మహిళ మీద ఆసిడ్‍ పోసినవాడు అని అతణ్ణి చూసి ఎవరైనా అనగలరా ఏం? అతనికి ఆసిడ్‍ పొయ్యటం అన్నది ఒక సంఘటన. కానీ తనకు? కళ్ల ముందు నుండి దురై మరుగయ్యేంతవరకూ అతణ్ణే చూడసాగింది.

          సముద్రతీరమంతా ప్రేమికులు నిండిపోయి ఉన్నారు. వీళ్లల్లో ఎవరో ఒక స్త్రీకి తనలాగా ముఖం కాలిపోవచ్చు లేదూ హత్య గావించబడనూ వచ్చు. నీచపు మాట, చెంపదెబ్బ, కాలితో తన్నటం, కాల్చటం, హత్య ఇవేనా ప్రేమకు చిహ్నాలు? హింసలోనే ప్రేమ వేళ్లు ఊనుకొని ఉన్నాయా?

          ఆమె కడలి కెరటాలను చూస్తూ ఉంది. చీకటి పడేంతవరకూ ఇంటికి వెళ్లాలనిపించలేదు.

          ప్రపంచం తన చేతిని వదిలిపెట్టి ఎవరూ లేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిన వైనాన్ని గ్రహించిన దానిలా చాలాసేపటి తర్వాత రైల్వేస్టేషన్‍కేసి ఒంటరిగా నడవటం మొదలుపెట్టింది.

          రైలుకోసం ఫ్లాట్‍ఫామ్‍మీద ఎదురుచూస్తుంటే, ఎందుకో తనకు ముప్పైఆరేళ్ల వయస్సు పూర్తయిందని గుర్తుకొచ్చింది.

          రైలు వెళుతుండగా వీచిన సముద్రపు గాలులు మచ్చలు మిగిల్చిన ముఖానికి తగలగానే మనసు తానుగా ప్రేమను గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. వెంటనే మనసులోనుండి ఇన్నేళ్లు గడిచినా మరిచిపోలేని ద్రావకపు మండే స్వభావమూ కాలుతున్న మంటా భయంకరంగా పైకి లేచింది. తనను మీరిన లోలోని బాధను ఆమె తట్టుకోలేకపోయింది.

          కోకిలవాణి పక్కకు తిరిగి చూసింది, ఎదుటి సీటులో ఒక యువతి ఒక యువకుడి ఒళ్లో వాలిపోయి సన్నని గొంతుతో మాట్లాడుతూ ప్రేమిస్తోంది.

          కోకిలవాణి వాళ్లను చూడకుండా బయట కనిపిస్తున్న చీకటినే చూస్తూ వచ్చింది. చీకట్లో ఎగురుతున్న ఒక మిణుగురు పురుగు ఆమె ముఖాన్ని రాసుకుంటూ వెళ్లింది.

          ప్రేమికుల జంట మాట్లాడుతూ నవ్వుకోవటం వినేకొద్దీ కోకిలవాణి తనకు తెలియకనే వెక్కిళ్లు పెట్టసాగింది. తన ప్రేమను ప్రపంచం ఎందుకు అంగీకరించలేకపోయింది? ఎందుకని తనకు ఇంతటి క్రూరమైన శిక్షను వేసింది? అని ఆలోచించి ఆమె ఏడుస్తూ ఉంది. రైలుతో పాటుగా మిణుగురులు ఎగురుతూ వస్తున్నాయి. అవి చీకటికి కళ్లు మొలిచి ఆమె దు:ఖాన్ని చూస్తున్నట్టుగా ఉన్నాయి.

                                                          ()  ()  ()

అస్థిత్త్వం 

                 ‘‘ఒరేయ్‍ కోదండా... ఆ ధనంజయోళ్లింటికి అట్టా పొయ్‍ రాగూడదా రా? వారం దినాల్నుండి సెప్పంపిస్తా ఉండారు!’’        పెళ్లో(పెరట్లో) మంచం మింద కూసోనున్న కొడుకుతో అన్నాడు నటేశుడు.

                ‘‘నేను పోను పో...’’ ముఖం పక్కకు తిప్పుకుంటా అన్నాడు కోదండ.

                ‘‘అట్టంటే ఎట్రా?... వాళ్లు మన కోసరం ఎన్ని దినాలని ఎదురు సూడాల? పెద్దోళ్లు పిలిస్తే పోకుండా ఉంటం మంచిది కాదురా...’’ అనునయంగా అన్నాడు నటేశుడు.

                ‘‘నాకట్టాంటి పన్లు సెప్పొద్దని నీకెన్నిమార్లు సెప్పుంటాను.’’ కోపంతో రుసరుసలాడినాడు కోదండ.

                ‘‘ఒరేయ్‍! అదేమైనా సెడ్డపనా ఏందిరా, సెప్పొద్దనటానికి? అది మన కులవుర్తిరా!...’’కొడుక్కి నచ్చజెప్పినాడు నటేశుడు.

                ‘‘అయినా, నేను సెయ్యనంటే సెయ్యనంతే! నాకు పరీచ్చలుండాయ్‍, సదువుకోవాల.’’మొండిగా బదులిచ్చినాడు కోదండ.

                ‘‘మళ్లా సదువుకుందువు లేరా. ముందు ఆ పని సేసొచ్చేయ్‍ పో! ఊళ్లో పెద్ద మనుసులు పిలిస్తే, పొయ్‍ మన వుర్తి మనం సెయ్యాల్రా. లేకుంటే కట్టు తప్పినోళ్లవుతాం. ఆపైన ఊళ్లో బతకటం చానా కష్టం రా.’’ బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు నటేశుడు.

                ‘‘అయితే నువ్వే పొయ్యి సెయ్‍ పో!’’ కోపంగా బదులిచ్చినాడు కోదండ.

                ‘‘నాకీ మద్దిన సేతులు వొణకతాండాయ్‍ రా. కత్తి పట్టి సక్రంగా గొరగలేక పోతన్నా. ఈ ఒక్కసారికీ అట్ట పొయ్యొచ్చేయ్‍పోరా!’’

                ‘‘పో నాయినా నేను పోను! ఆ ధనంజయోళ్ల తాతకి తలంతా పుండ్లే! ఎప్పుడూ రసి కారతా ఉంటాది. ఒగటే గొబ్బు. తల్లో సెయ్యి పెట్టాలంటేనే కడుపులో తిప్పతాది.’’ ముఖాన్ని అసయ్యంగా పెడతా అన్నాడు కోదండ.

                ‘‘అట్టనుకుంటే ఎట్రా? ఆటినంతా మనం సయించుకోవాల్రా. అదే రా వుర్తి ధరమం అంటే!’’ నచ్చజెప్పినాడు నటేశుడు.

                ‘‘తలతోటే ఆగడు నాయినా ఆ ముసిలోడు. గెడ్డమూ, సంకా అన్నీ గొరగాల. నేను పోను పో వాళ్లింటికి.’’ మళ్లా మొదటి కొచ్చినాడు కోదండ.

                ‘‘ఒరేయ్‍ కోదండా, ఈ ఒక్కసారికి ఎట్టో ఒగట్టా ఆయనకు గొరిగొచ్చేయ్‍ పోరా. మా నాయినివి గదా. ఇంగమీదట నీకు మన పన్లు జెప్పన్లే, ఇదే కడా! పొయ్యొచ్చే పో నాయినా!!’’ కొడుకును బతిమిలాడతా అన్నాడు నటేశుడు.

                తండ్రి మాటలకు అయిష్టంగానే మంచంమింద నుండి లేసినాడు కోదండ.                                                      

                                                                                                +     +     +

                కోదండ డిగ్రీ సెకండ్‍ ఇయర్‍ సదవతా ఉండాడు. పేరుకు డిగ్రీనే కానీ, అతనికి సరిగ్గా సదువెక్కలేదు. పదో తరగతిలో రొండుమార్లు తప్పి, ఇంటర్లో ఒకసారి ఫెయిలై, ఎట్టో ఒగట్టా డిగ్రీకొచ్చినాడు. డిగ్రీలోనూ ఫస్ట్ఇయర్లో ఇంగా మూడు పేపర్లు బాకీ ఉండాది.

                సదువు సంకనాకి పోయిందని యాష్టపడి, నటేశుడు పట్టుబట్టి కొడుక్కి తమ కులవుర్తి అయిన మంగలి పనిని నేర్పించినాడు. కానీ కోదండకు తమ కులవుర్తిని జెయ్యాలంటే మా సెడ్డ సిరాకు...

                ఊళ్లో ఎవురు పిలిసినా వాళ్లింటికెళ్లి తల కత్తిరించాలి, గెడ్డం గొరగాలి, సంక గోకాలి, గోళ్లు తియ్యాలి, గోళ్లల్లోని మట్టినీ       సుభ్రం సెయ్యాలి. అంతేగాదు... ఏ ఇంట్లో సావుకార్యం జరిగినా, కార్యం జరిగే సోటికి పొయ్యి, సావింటి దాయాదులకు గెడ్డాలు, మీసాలు తియ్యాలి. వాళ్లకు యాడైనా పొరబాట్న గోక్కపోతే... వాళ్ల ఈసడింపులూ, సులకన సేసి మాట్టాడే మాటలూ పడాలి. ఏకవచన పిలుపులు, బూతులు, కులవుర్తిని ఎగతాలి జేసే ఎత్తిపొడుపు మాటలు... ఈటన్నింటినీ భరించాలి, సగించాలి.

                ఆనక వాళ్లేమిస్తే అది తెచ్చి ఇంట్లో ఇయ్యాలి. నోరుతెరిసి ఇదేమని అడిగేందుకు ఈల్లేదు. అందుకే, ఇట్టాంటి పన్లు జెయ్యాలంటే కోదండకు అవమానంగా ఉండాది. ఈ కులంలో ఎందుకు పుట్టామురా బగమంతుడా...అని సణుక్కోని రోజు లేదు.  

                ఇంతకాలమూ ఈ వుర్తి జేసే తమ కుటుంబరాన్ని ఎట్టో ఒగట్టా లాక్కొచ్చినాడు నాయన.

                ఇప్పుడు తనను పూర్తిగా ఈ వుర్తిలోకి దించాలని బలవంతం సేస్తున్నాడు.

                తాను ఎళ్లనంటే ఎళ్లనని మొండికేస్తున్నా- బతిమాలో, బామాలో, గెడ్డం పట్టుకునో, ఎట్టో ఒగట్టా తనను ఒప్పించి, పనికి అంపిస్తా ఉండాడు.

                ఇంగ దానికి ముగింపు పలకాలనుకుంటున్నాడు కోదండ.   

                ధనంజయోళ్ల ఇంటికెళ్లి, ఆ ముసిలోడికి గొరుగుతున్నంతసేపూ కోదండ ఆలోసిస్తానే ఉండాడు.

                ఇంటికొచ్చినాంక కూడా అతని ఆలోసనలకు అంతులేకుండాపోయింది.

                ఇంట్లో ఉంటే, ఊళ్లో పనికి పొమ్మని తొందరపెడతాడు నాయన. ఆయన తర్వాత ఆయన కొడుకుగా తాను...ఈ కుల వుర్తిని కొనసాగించాలని ఆయన కోరిక. సూస్తా ఉంటే తన జీవితాంతరం ఈ పని జేసుకునే బతికేటట్టు ఉండాది పరిస్థితి. ఊరోళ్ల దయా దాచ్చిన్యాలపైన ఆధారపడి బతికే బతుకూ ఒక బతుకేనా? దీన్నుండి ఎట్టాగైనా బయటపడాలని తీవ్రంగా ఆలోసించినాడు కోదండ.

                మూదో రోజు ఒక స్థిర నిర్ణయానికొచ్చి...అర్థరేత్రి దాటినాంక ఇంట్లోనుండి పారిపోయినాడు కోదండ.

                ‘పట్నంలో బాగా సంపాయించి... ఊరికి తిరిగొచ్చి నాయన్నీ, అమ్మనీ, సెల్లినీ అందరినీ పట్నానికి తీసకపోయి ఆడే స్థిరంగా ఉండిపోవాల. తమ కులవుర్తిని పూర్తిగా వొదిలెయ్యాల. ఆ పైన జీవితాంతరం సుఖంగా, హాయిగా బతకాల. అది సూసి తమ బంధుగులూ, ఊళ్లోవాళ్లూ ఆచ్చెర్యపోవాల’... అనుకుంటా సీకట్లో గబగబ పట్నం వేపుకు అడుగులేస్తున్నాడు కోదండ.                                                                                                

                                                                                                +     +     +

                రాత్రంతా లారీ వోళ్లనూ, జీపు డైవర్లనూ బతిమాలుకుని ఎట్టాగో ప్రయాణించి, పట్నం పొలిమేరల్లోకి సేరుకున్నాడు కోదండ.

                మూడు గంటలకు పైగా పాల వేనులో ఇరుక్కుని కూసోవటం వల్ల, ఒళ్లంతా తిమ్మిర్లు పట్టేసుండాది కోదండకు.

                కాళ్లూ సేతులూ ఇదిలించి నడక మొదలుపెట్టినాడు.

                ఆ సమయానికి ఇంకా సీకట్లు కమ్ముకునే ఉండాయి.

                ‘ఊరొదిలి పెట్టి ఎన్ని కిలోమీటర్ల దూరం వొచ్చుంటాం?...ఏమో?, చానా దూరమే వొచ్చుంటాం! తాను పట్నానికి వొచ్చుంటానని నాయన ఊహించకపోవచ్చు. ఊహించినా, ఇక్కడ తన జాడ తెలుసుకోటం అంత సులభం కాదు. ఈ జనంలో ఏ మూల తనుంటాడో, ఎవుడు కనిపెట్టగలడు? కనక తన గురించి తెలుసుకోటం తన వాళ్లకు కష్టమే.’ అని అనుకుంటా గబగబ ముందుకు అడుగులేస్తున్నాడు.                   

                అట్టా ఎంతసేపు నడిసుంటాడో తెలీదు.

                నడిసి నడిసి బాగా నీరసించి పోయినాడు. దాంతో నిదానంగా నడస్తా ఉండాడు.   

                క్రమంగా ఆకాశంలో తూరుపు నుండి వెలుగు కనిపించసాగింది. సూర్యుని కిరణాలు మెల్లమెల్లగా భూమిని తాకసాగినాయి. కాకులు కావుకావు మంటున్నాయి.

                అక్కడక్కడా ఒగరిద్దరు మనుసుల కదలికలు కనిపిస్తా ఉండాది.

                రోడ్డు పక్కగా ఒక పెద్ద తాటితోపు కనిపించింది. ఆ తోపుకు ఎనకవైపు ఏముండాదో తెలియనంత దట్టంగా తాటిసెట్లు పెరిగుండాయి.

                ఆడొక సదును బండరాయి కనిపిస్తే, కొంచేపు ఆడ కూసోని పోదామనుకుని, వెళ్లి దానిమీద కూసున్నాడు కోదండ.

                కొంచేపటికి ఆ తాటితోపులో సందడి మొదలైంది.

                ఐదారుగురు కల్లుగీత కార్మికులు ఆ తాటితోపులోకి అడుగుపెట్టినారు. వాళ్ల ఎనకే మరికొంతమంది మనుసులు వొచ్చినారు.

                ఒక్కో కార్మికుడూ ఒక్కో తాటిసెట్టు దగ్గరికెళ్లి, సెట్టును భక్తి పూర్వకంగా సేత్తో తాకి కండ్లకద్దుకున్నాడు.

                ఆనక సెట్లెక్కటం మొదలుపెట్టినారు. వాళ్లు అలాగ్గా అట్టా సెట్లెక్కుతుంటే సూడ్డానికి రెండు కండ్లూ సాలటం లేదు. ఎంత పట్టు... ఎంత లాఘవం... పైకెళ్లినోళ్లు నడుము దగ్గరున్న కత్తిని తీసుకుని లేత తాటి వొంబాల్ని తెగ్గోసి, తాడుకు కట్టి కిందికి జారస్తా ఉండారు. కింద ఉండేటోళ్లు వాటిని జాగర్తగా పట్టుకుని, తాడు నుండి వాటిని ఏరుసేసి ఒకపక్కగా కుప్పగా పోస్తా ఉండారు.

                ఇంతలో...

                అక్కడికి ఒక న్యూస్‍ఛానల్‍ వాళ్లు కెమెరా, మైక్‍తో ప్రత్యచ్చమయినారు.

                రకరకాల కులవుర్తులు సేసుకునే వాళ్ల బతుకుల్ని, జీవన విధానాల్ని, అనుభవాల్ని ఒడిసి పట్టుకునే ప్రెయత్నంలో భాగంగా... తెల్లార్తోనే ఆడికి సేరుకున్నారు వాళ్లు.

                ఒక్కో మనిసి దగ్గరికీ పొయ్యి మాట్లాడించేదానికి ప్రెయత్నిస్తున్నారు. అదేదో సూడ్డానికి తమాసాగా అనిపించింది కోదండకు.

                లేసి వాళ్ల దగ్గరకు పోయినాడు.

                ఒక పాతికేళ్ల యువకుడు విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తున్నాడు...‘‘మా అమ్మానాన్నలు ఈ పని చేస్తూనే నన్ను కష్టపడి చదివించారు. నేను బెంగుళూరులో చదువు పూర్తిచేసి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. ఈ సీజన్లో తాటి ముంజలకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకని మా నాన్నకు సాయంగా ఉందామనీ ఇక్కడికొచ్చాను. మాకు ఈ తోపులో ఇరవై, ఇరవైఐదు తాటిచెట్లున్నాయి. తరతరాలుగా ఇవే మాకు ఆస్తి. వీటి మీద వచ్చేదే మాకు ఆదాయం. తెల్లవార్తో తాటికాయల్ని క్రిందికి దింపుకుని, ఆటోలో మార్కెట్‍కు తీసుకెళ్లో, లేక వీథులు తిరిగో సాయంత్రానికల్లా అమ్ముకొచ్చేస్తాను. నాకు మంచి ఉద్యోగం వచ్చినా వీటిని మాత్రం వదులుకోను. ఇవి మాకు కులదేవతలతో సమానం...’’ అంటూ చెప్పుకుపోతున్నాడు ఆ యువకుడు.

                ‘‘ఇంతకూ మీరెంత వరకూ చదువుకున్నారు?’’ అడ్డుపడి ప్రశ్నించినాడు విలేఖరి.

                ‘‘బి.టెక్‍.’’

                ఉలిక్కిపడినాడు కోదండ.

                ‘ఎంత గొప్ప సదువు! అంత సదువు సదివీ, తాటిసెట్లను మాత్రం వొదులుకోనంటున్నాడే?! ఎందుకట్టాంటి గెట్టి నిర్ణయం తీసుకున్నాడు?...’                              

                ఆలోసిస్తా ఆడనుండి కదిలినాడు కోదండ.                                                                                                                                    

                                                                                +     +           

                మద్దేనమైంది!

                రోడ్డుకు పక్కనుండే ఇండ్లను సూసుకుంటా నడస్తా ఉండాడు కోదండ.

                ‘రేపట్నించి ఈ పట్నంలో ఎట్టా బతకాల? బతకాలంటే, ఏదో ఒక పని సెయ్యాల. తనేం పని సెయ్యగలడు? అసలు తనకు ఏమేం పనులొచ్చు?’... ఆలోసనలో పడినాడు.

                బాగా ఆలోసిత్తే... ‘తనకు పెద్ద పెద్ద పన్లేమీ తెలియదని తేలింది.  కనక, తను ఇప్పుడు సిన్నా సితకా పనుల్నే సెయ్యాల. లేదంటే కూలీ పనికి పోవాల...’ అనుకుంటా ముందుకు నడస్తా ఉండాడు కోదండ. 

                ఆడొకసోట సెట్టుకింద ఒక సాకలి మనిసి తోపుడు బండిమింద గుడ్డల్ని నీటుగా ఇస్త్రీ జేస్తా ఉండాడు. ఆయన పెండ్లాం  ఇంటింటికీ పొయ్యి గుడ్డల్ని ఉడ్డేసుకొస్తా ఉండాది. ‘ఒక దినానికి ఎంత సంపాదిస్తారో వీళ్లు?’ అడిగి తెలుసుకుందామనుకుని... వాళ్లదగ్గరికి పొయ్యి...‘‘మడేలన్నా, ఒక ప్యాంటూ సర్టుకూ ఇస్త్రీ జెయ్యాలంటే ఎంత తీసుకుంటావన్నా...’’ అని సూటిగా అడిగినాడు కోదండ.

                ఆ పిలుపుతో సర్రున కోపమొచ్చింది అతనికి.

                ‘‘ఏమన్నావ్‍? మడేలా...నా? ఎవుడు మడేలు? నేను మడేల్ని కాను?’’ అన్నాడతను కోపంగా.

                ‘‘అంటే, అదీ... నువ్వు గుడ్డల్ని ఇస్త్రీ జేస్తా ఉంటే అట్టా అనుకున్నానన్నా...’’ అంటా నసిగినాడు కోదండ.

                ‘‘ఇస్త్రీ జేస్తే మడేల్నా? నేనేం మడేల్ని కాను. మాది ఏరే కులం. ఐదేండ్ల కిందట టవున్‍క్లబ్‍ జంక్షన్‍లో మాకు పెద్ద డ్రై క్లీనర్స్ సాపు ఉండే. మొదట్లో అది బాగానే జరిగే. నలుగురు మనుసుల్ని పెట్టుకుని, కరెంట్‍ ఇస్త్రీ పెట్టెల్తో ఇస్త్రీ జేసి, గుడ్డల్ని మల్లి పువ్వుల్లాగా కవర్లల్లో ఏసి కస్టమర్లకు ఇచ్చేటోణ్ణి. కానీ, రాన్రానూ కస్టమర్లు తగ్గిపోయి సాపు మూతబడే. ‘ఇప్పుడేం జెయ్యాల? ఎట్టా బతకాల?’ అని ఆలోసించి ఈదిన పణ్ణా. ఈ కాలనీ జూసుకుని, ఈ సెట్టుక్రింద సెటిలైనా! ఇండ్లకాడికి మేమే పొయ్యి   ఉడుపులు ఉడ్డేసుకొచ్చి ఇస్త్రీ జేసిస్తున్నాం. ఇంట్లో ఐరన్‍ బాక్సులున్నా ఇస్త్రీ జేసే ఓపిక మనుసుల్లో లేకపోవటంతో... మా అట్టాంటోళ్లు ఇట్టా బతకతా ఉండాం. అంతేగానీ, నేనేం మడేల్ని కాను.’’ అంటా ఒక పెద్ద ఉపన్యాసమే ఇచ్చినాడతను.

                నోరు తెరుసుకుని ఆయన మాటల్ని ఇంటా ఉండిపోయినాడు కోదండ. తర్వాత ఆణ్ణించి బయలుదేరినాడు.

                ఆచ్చెర్యంగా ఉందతనికి! ‘పట్నంలో... ఎవురెవురో... ఏదేదో కులవుర్తుల్ని జేసుకుని బతికిపోతా ఉండారు. మరి ఆ కులంలోనే పుట్టినోళ్ల గతి ఏమైపోవాల? వాళ్లెట్టా బతకాల?’

                ఆలోసిస్తా ముందుకు నడిసినాడు కోదండ.                                                                   

                                                                                                +     +     +

                ఆ రోజంతా ఊరు తిరగతా ఉండిపోయినాడు కోదండ.

                తెచ్చుకున్న డబ్బుల్లోంచి మద్దేనం భోజనానికి మాత్రం ఖర్సుపెట్టినాడు. ఇంకొంచిం డబ్బు మిగిలుండాది, అంతే!

                సాయంకాలమైంది. సీకట్లు కమ్ముకుంటా ఉండాది.

                ఈదులు జూసుకుంటా నడస్తా ఉండాడు కోదండ.

                గంగమ్మ గుళ్లో నుండి ‘సండోలు’ వాయిస్తున్న శబ్దం, ‘గంట’ కొడుతున్న శబ్దమూ ఇనిపించినాయి.

                గుళ్లోకి నడిసినాడు. గర్భగుడి ముందర పరదా ఏసుండారు. అమ్మోరికి అభిసేకం జరిగేటట్టుంది. అభిసేకం జరుగుతున్నంత సేపూ ఆ శబ్దాలు ఇనిపిస్తానే ఉండాయి. కొంచేపటికి పరదాను తొలిగించినారు. అయ్యోరు కర్పూర ఆరతి ఇస్తా ఉంటే... కండ్లు మూసుకుని అమ్మోరిని మొక్కుకున్నాడు కోదండ.

                ఆరతిని కండ్లకద్దుకుని, తీర్థం తీసుకుని నోట్లో పోసుకున్నాడు.                                       

            ప్రదచ్చిణ జేద్దామని ముందుకెళ్లి కుడివైపుకు తిరగ్గానే... ఆడ కనిపించిన దృశ్యాన్ని సూసి ఆచ్చెర్యపోయినాడు కోదండ.

                అక్కడ సండోలు, గంటల శబ్దాలు ఇనిపిస్తా ఉండాయి. కానీ వాటిని వాయించే వాయిద్యగాళ్లే లేరక్కడ. వాటిని ఒక మిషిను వాయిస్తా ఉండాది. కట్టితో సండోలు మీద దెబ్బలేస్తా ఉంది. తాడును పట్టుకోని ఇంగో మిషిను గంట కొడతా ఉంది. మనుసులు లేకనే వాయిద్యాలు మోగతా ఉండటం వింతగా అనిపించింది కోదండకు. ఇంతలో ఒక మనిసి ఆడికొచ్చి, ఆ మిషిను స్విచ్చిను ఆపు జేసినాడు. అంతే! అవి వాయించటం ఆపేసింది.

                విసిత్రంగా వాటినే జూస్తా...గుళ్లోనుండి బయటికొచ్చినాడు కోదండ.

                ‘మనుసులు వాయించాల్సిన వాయిద్యాలను మిషిన్లు వాయిస్తున్నాయ్‍. ఇట్టా అన్నింటికీ మిషిన్లు వొచ్చేస్తే... ఇంగ మనుసులెట్టా బతకాల? రేపు ఏ క్యాసెట్టునో, సి.డి.నో పెట్టి దేవుడి స్తోత్రాలు, శ్లోకాలు  ఇనిపించేలా జేసి... పూజజేసే అయ్యోరును గూడా పక్కన బెట్టినా ఆచ్చెర్యపడాల్సిన పన్లేదు. అట్టాగే... దేవుళ్లకు మర మనుషుల(రోబోలు) ద్వారా అభిషేకాలూ, పూజలూ, హారతులూ సెయ్యిస్తారో? ఏమో? అప్పుడు ఈ కులవుర్తుల మీదే ఆధారపడి బతికే మనుసుల బతుకులు ఎట్టుంటాయ్‍?’...

                ఆలోసిస్తా ముందుకు అడుగులేసినాడు కోదండ.                                                                                               

                                                                                                +     +     +            

                కోదండ పట్నానికొచ్చి రొండు దినాలైంది.

                అతని దగ్గరున్న డబ్బంతా ఖర్సయిపోయింది. కానీ అతనికి పనిమాత్రం దొరకలేదు. మనిసి ఊరికి కొత్త కావటంతో ఎవురూ అతనికి పనియ్యలేదు. ఓటల్లో పని దొరికితే అన్నానికి లోటుండదని ఆశించినాడు. కానీ ఏ ఓటల్లోనూ అతనికి పని దొరకలేదు.

                రోజూ పని కోసరం ఊరంతా తిరగటం... రేత్రయితే బస్టాండ్లో పడుకోవటం సేస్తున్నాడు.

                బతకటానికి తానిప్పుడు ఏం జెయ్యాల్నో అతనికి తెలియటం లేదు.

                ఈ రొండురోజుల్లో అతను మెయిన్‍ బజార్లో ఉండే ‘సూర్య హెయిర్‍ సై్ట ల్స్’ సాపు ముందునుండి చానాసార్లు తిరిగినాడు.  ఆడ ఎప్పుడు జూసినా కస్లమర్లు నిండుగా ఉంటున్నారు.

                సివరికి వేరే దారిలేక... అందులో పని సేయటానికే సిద్దపడినాడు కోదండ.

                అందుకే ఆ సాపు యజమానిని పని కోసరం అడగాలని నిర్ణయించుకున్నాడు. 

                ధైర్నంజేసి ‘సూర్య హెయిర్‍ సై్ట ల్స్’ సాపులోకి అడుగుపెట్టినాడు.

                ఆ సాపులో గుండ్రంగా తిరిగే సెయిర్లు నాలుగుండాయ్‍. ఆ నాలుగు సెయిర్లలోనూ నలుగురు కస్టమర్లు కూర్సోనుండారు.   వాళ్లల్లో ఇద్దరు కస్టమర్లు క్రాపు కత్తిరించుకుంటున్నారు. ఒక కస్టమరు గెడ్డం గీయించుకుంటుంటే, ఇంగో కస్టమరు తలకు రంగు ఏయించుకుంటున్నాడు. ఇంగా ముగ్గురు కస్టమర్లు తమ వొంతు కోసరం ఎదురుసూస్తా, ఆ దినం నూస్‍పేపర్‍ సదవతా కాలచ్చేపం జేస్తా ఉండారు. పని పూర్తయినాంక ప్రెతి కస్టమరూ, ఆడ సోఫాలో కూర్సోనుండే ఒగ పెద్దమనిసికి డబ్బిచ్చి బయటికి పోతాండాడు. ఆ పెద్దమనిసి నల్ల కండ్లద్దాలు పెట్టుకుని, టీసర్టు ఏసుకుని బలిష్ఠంగా ఉండాడు.

                నేరుగా అతని ముందుకుపోయి నిలబడినాడు కోదండ.

                ‘‘నమస్తే అన్నా!...’’ అని పలకరించినాడు.

                ‘‘కొంచేపు వెయిట్‍ జెయ్యాల. ఆడ సోఫాలో కూర్చో పో!’’ అన్నాడతను కేర్‍లెస్‍గా.

                ‘‘అన్నా, నేను కటింగ్‍ కోసరం రాలేదన్నా....’’ విషయం ఎట్టా సెప్పాల్నో తెలియక నసిగినాడు కోదండ.

                ‘‘అయితే ఇంక దేనికోసరం వొచ్చినావ్‍?...’’ సూటిగా కోదండను ప్రెశ్నించినాడతను.

                ‘‘అన్నా, నేను మీ క్యాస్ట్ మనిసినే. ఈడ పని దొరుకుతుందేమోనని వొస్తిని...’’ అని తల గోక్కుంటా అన్నాడు కోదండ.

                ‘‘మీ క్యాస్ట్ అంటే?’’ సీరియస్‍గా అడిగినాడతను.

                ‘‘అదే అన్నా, బార్బర్‍ క్యాస్ట్!’’

                ‘‘నాది బార్బర్‍ క్యాస్ట్ అని నీకెవరు జెప్పినారు?’’ కోపంగా అన్నాడతను.

                ‘‘అదే అన్నా, ఈడ కటింగ్‍ అదీ... సేస్తన్నారు. ప్రెతి మనిసీ మీ సేతికే డబ్బిస్తా ఉండాడు. అందుకనీ ఈ అంగడి మీదే అనుకున్నా.’’

                ‘‘ఈ షాపుకు నేనే ఓనర్ని. అది నిజిమే! కానీ, నువ్వనుకున్నట్టు నేను బార్బర్‍ క్యాస్ట్కు చెందినవాణ్ణి కాను.’’అన్నాడతను.

                ‘‘ఆ...’’ అంటా నోరు తెరిసినాడు కోదండ.

                ‘‘నా పేరు షౌకత్‍ అలీ. లాభదాయకంగా ఉంటుందని ఈ హెయిర్‍ స్టయిల్‍ షాపును తెరిసినాను. ఏడు సమచ్చరాలుగా ఈ షాపును నడపతా ఉండాను. కాలేజీ స్టూడెంట్స్ కోసరమే ఇంత పెద్ద షాపును పెట్టినాను. నాకు తోడుగా నలుగురు మనుషుల్ని పెట్టుకున్నాను. అక్కడ పనిచేస్తున్నారే వాళ్లల్లో ముగ్గురు ఏరే ఏరే క్యాస్ట్లకు చెందినోళ్లు. సన్నగా పొడుగ్గా ఉండాడే జీన్స్ ప్యాంటు ఏసుకుని... ఆడొక్కడే బార్బర్‍ క్యాస్ట్కు చెందిన మనిషి. అయినా ఈ పని జెయ్యాలంటే పని తెలుసుండాలే కానీ, క్యాస్ట్తో పనేమిటికి?...’’ అన్నాడు ఆ మనిసి. 

                ‘‘మరి నీకొచ్చా అన్నా మా పని?’’ అమాయకంగా అడిగినాడు కోదండ.

                ‘‘రాకేం. ఎవురైనా పనిలోకి రాకపోతే, అవసరమైతే నేనూ పనిలోకి దిగిపోతా. కస్టమర్‍ ముఖ్యం. డబ్బు అంతకన్నా ముఖ్యం.’’ నవ్వతా అన్నాడు ఆ మనిసి.

                కోదండ ఆచ్చెర్యంగా సూస్తా ఉంటే, ఆ మనిసి తన మాటల్ని కొనసాగించినాడు.

                ‘‘నువ్వు ‘షేక్‍ చిన మౌలానా’ పేరు ఎప్పుడైనా వినుండావా?’’

                ఆయనెవరో ఇంకో పెద్ద సాపుకు ఓనరై ఉంటాడనుకున్నాడు కోదండ.

                ‘‘ఆయన ఓ గొప్ప నాదస్వర విద్వాంసుడు. దేశ విదేశాలలో కచేరీలు చేసి, మహా మహా పండితుల చేత శెబాష్‍ అనిపించుకున్న మనిషి. ఆయన పుట్టింది మా క్యాస్ట్లో. పేరు తెచ్చుకునింది ఇంగో దానిలో. మరి దీనికేమంటావ్‍?’’ కండ్లెగరేస్తా అన్నాడతను.

                అట్టాగా అన్నట్టు తలాడించినాడు కోదండ.

                ‘‘ఇంతకీ నీకేం గావాల?’’

                ‘‘అన్నా, నేనూ సేవింగూ, కటింగూ సేయగల్ను. నాకూ ఈడ పనిప్పిస్తే...’’

                ‘‘చూడూ, ఒళ్లొంచి పనిజేయాల. పనిమీద గెవనం పెట్టాల. నువ్వెంతమందికి పని జేస్తే, అది షేవింగ్‍ అయితే 10 రూపాయలు, కటింగ్‍ అయితే 20 రూపాయలు మాత్రమే నీకు ముడుతుంది. ఏ రోజు డబ్బులు ఆ రోజు సాయంత్రమే నీచేతికిచ్చేస్తా. నీ కిష్టమైతే ఇప్పుడే పన్లోకి జేరు, లేకుంటే ఈణ్ణించి కదులు.’’ అంటా నిక్కచ్చిగా సెప్పినాడు ఆ మనిసి.

                కోదండ సేతిలో ఇప్పుడు సిల్లిగవ్వ లేదు. మద్దేనానికి కడుపు మాడ్సుకున్నా, రేత్రికి ఏదో ఒగటి తిని కడుపు నింపుకోవాల. అందుకే ఇంగో ఆలోసన ఏదీ లేకుండా పన్లోకి సేరిపోయినాడు.

                సాయింత్రం వరకూ నిలికిడి లేకుండా పనిజేసినాడు కోదండ.

                ఆ సాయింత్రం సేతికి డబ్బందగానే సాపు నుండి బయటికొచ్చినాడు.

                రోడ్డుమింద నడస్తా ఆలోసనలో పడినాడు.

                ‘నేను అవమానకరమని భావించి వొదిలేయాలనుకున్న పనిని...ఈ మనిసి సొంతం జేసుకుని, నాలుగు సెయిర్లేసి, నలుగురు మనుసుల్ని పెట్టుకుని, కాలుమింద కాలేసుకుని ఎంత ఈజీగా సంపాయిస్తా ఉండాడు. ఎంత గౌరవంగా బతకతా ఉండాడు. ఒక సాయిబే ఈ పని జేసుకుని బతికిపోతా ఉంటే, మంగలి కులంలోనే పుట్టి, పెరిగి, ఆ వుర్తి నేర్సుకున్న నేను... ఇంగెంత గొప్పగా బతకొచ్చు! నాలుగు సెయిర్లు ఏసుకుని, నలుగుర్ని పెట్టుకునే స్తోమత తనకిప్పుడు లేకపోవచ్చును గానీ, ఒక్క సెయిరునైనా ఏర్పాటుజేసుకుని గౌరవంగా బతకలేమా?...

                అందుకే ఎంటనే ఊరెళ్లిపోయి, నాయన్నడిగి, ఇల్లును అమ్మి అయినా సరే, ఈ పట్నంలో ఒక సాపును తెరవాల...’ అని ఆలోసిస్తా...  గబగబ బస్టాండుకేసి అడుగులేసినాడు కోదండ.                 

                                                                                                () () ()                                                                                   

                                                                                               

                  

          

                 

                                                                                                                                                                                               

ఈ కథకు మూడు శీర్షికలు

1.  ఇది దివ్య కథ

            దివ్య అనగానే, కొన్నాళ్ల క్రితంవరకూ ఊళ్లల్లోనూ, కోర్టుల్లోనూ, పోలీస్‍స్టేషన్లలోనూ, రాజకీయ నాయకుల ప్రసంగాలలోనూ సంచలనాత్మకంగా ప్రస్తావించబడ్డ దివ్య అని మీరై ఊహించుకొని, ఆమె కథ ఈ ప్రపంచానికే తెలుసుగా అని చదవకుండా  ఉండిపోతారేమో? అయితే ఇది ఆమె కథ కాదు ఆత్రగాళ్లారా! ఎందుకంటే ఆ దివ్యది కథ కాదు. మన కాలంలో మన కళ్లెదుటే జరిగిన నిజం. నిజం... ఆదీ అంతమూ నిజమే ఉన్నది. నిజాన్ని సృష్టిస్తున్నప్పుడు అది, ఆ నిజాన్ని ఇంకా కెలికి దానికొక సార్వజనీనతను కలిగించటానికి న్యాయంతో లిఖించబడాలిగా? అలా రాస్తే, ఎంత విడిపోయి వచ్చేసినప్పటికీ హత్య కాబడ్డవాడు తన ప్రియమైన భర్త అన్న దు:ఖంలో మునిగిపోయిన ఆ యువతికి ఈ కథ ఇంకా వేదనను కలిగిస్తుందన్న కారణంచేత రాయకుండా వదిలివేయబడుతోంది. ఏ సంబంధమూ లేకుండానే వాళ్ల జీవితాల్లో తలదూర్చి ఊరూరా వెంటబడి పరిగెత్తించినవాళ్లు, నయవంచనతో దూరం చేసినవాళ్లు, నాటకాలాడి పడదోసినవాళ్లు అంటూ ఎందరో... ఈ కథలోనూ ఆ విధంగానే జొరబడి కథనూ తమదిగానే మార్చుకునే ప్రమాదాన్ని నివారించటానికి రాయకుండా వదిలివేయబడుతోంది.

            ఒకవేళ ఇది ఆ దివ్యను గురించిన కథగానే ఉన్నప్పటికీ మీరు చదివే తీరాలి. ఎందుకంటే ఆమె విషయంలో మీరూ నేనూ ఎక్కువగా తెలుసుకున్నది ఆమె పేరును మాత్రమే తప్ప మనసునో, జీవితాన్నో కాదు. (దివ్య అనే కాదు, సాధారణంగా ఏ స్త్రీ మనసునూ తెలుసుకోవటానికి ఈ సమాజం ఎప్పటికీ ప్రయత్నించదు) తమ కులంలో పేడపురుగుల్లా పుట్టుకొచ్చిన ఎందరో కుర్రాళ్లను కాదని, ఆమె ఒక దళిత యువకుణ్ణి ప్రాణాధికంగా ప్రేమించింది. ఒక కుక్కనో, పిల్లినో ప్రేమించకుండా మనిషిని ప్రేమించటానికి నిర్ణయించుకున్నందు వల్ల, తన ప్రేమలో తిరుగుబాటో కలహమో దాగి ఉందని ఆమె అనుకోలేదు. ఆడా మగా అన్న స్వతస్సిద్ధమైన పద్ధతిననుసరించి అనుమతించే హద్దుల్లోనే ఉండి తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటానికి కులాన్నిఒక కొలత సాధనంలా ఆమె భావించలేదు. అనగా ప్రేమించేటట్టున్నా సొంత కులంలోనే ప్రేమించాలి అని చెప్పుకొచ్చే అభిప్రాయాల్నీ, పంచాయితీ పెద్దల బెదిరింపుల్నీ ఆమె తన చర్యలతో తిరస్కరించింది. ఆ రకంగా, ప్రేమ అన్నది కులాన్నో / మతాన్నో చూసి పుట్టదన్నది చాలాకాలంగా నిరూపించబడ్డ ఒక సత్యాన్ని తన భాషలో చెప్పటానికి ప్రయత్నించింది. లేదూ, ఇద్దరిదీ ఒకే కులం అయినపుడు ప్రేమించాల్సిన అవసరం ఎక్కణ్ణించి రా వచ్చింది?’ అని ఎవరినో అడగటానికి ప్రయత్నించింది. నిజమేగా, సొంత కులంలోనే ప్రేమించటమనే దానికన్నా మోసమైనది ఇంకొకటి లేదు.        

            వాళ్ల ప్రేమకు వాళ్ల కుటుంబమూ, కులమూ అడ్డుగా ఉన్నప్పుడు వాటినుండి బయటపడి అతణ్ణి పెళ్లి చేసుకున్నట్టుంది. ఇష్టప్రకారం అతనితో కలిసి కొంతకాలం కాపురం చేసినట్టుంది. వాళ్లు కలిసి జీవించినందుకు గుర్తుగా నిలిచిన గర్భాన్ని, పుట్టబోయే తమ బిడ్డను గురించిన కలలను మోస్తూ సంతోషించినట్టుంది. మొదటి గర్భం నిలవకుండా పోయినప్పుడు రెండవ గర్భాన్ని కచ్చితంగా తీసెయ్యాల్సి వచ్చినపుడు ఆమె ఎంతగా తపించి ఉంటుందో మనకేం తెలుసు? గర్భం నుండి చెదిరి బయటపడ్డ రక్తపు ముద్దల్ని చూసి ఆమె ఏడవటాన్ని నా రాతలు విడమరిచి చెప్పగలవా? చూసేలోపే చెదిరిపోయినదాన్ని కల అని చెప్పగలదా, కల్పితమని అనుకోగలదా? తన ప్రేమను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆర్తితో జాతీయవాదులతోనూ, పోలీసు అధికారులతోనూ, న్యాయస్థానాలలోనూ ఎంత ధైర్యంగా వాగ్వివాదం చేసిందనీ?

            తనకు సంబంధించిన అన్నింటినీ తానే నిర్ణయించుకోవటానికి ఆమెచేసిన ప్రయత్నాలవల్ల... ‘‘చిన్నపాపైనా, పడుచుపిల్లైనా ఎందుకూ ముసల్దైనా తమ ఇంట్లో సైతం స్వేచ్ఛగా ఏమైనా చెయ్యటానికి అనుమతించకూడదు’’ అని కొక్కిరించే మనుస్మృతిని తమ మూత్రంతో కడిగి పారేసేలా చేసే ఆడవాళ్ల ప్రయత్నానికి బలాన్ని చేకూర్చింది. వెంటవెంటనే ఎవ్వరూ ఎదురుచూడని కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను ఇంత చిన్నవయసులోనే తీసుకున్న ఆ దివ్యకు పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి ఇక మీరు చదవబోయే కథలో వచ్చే దివ్య. సరిగ్గా చెప్పాలంటే ఇద్దరికీ పేర్లొక్కటే తప్ప ఇంకే రకంగానూ పోలికలు లేవు. కనుకనే ఈ వాక్యం నుండి కథ శీర్షిక కూడా ఇది వేరొక దివ్య కథఅని మార్చుకోవచ్చు.

            శీర్షిక మారుతోందంటే కథకూడా మారుతోందని అర్థం. ఒకే శీర్షిక క్రింద వేర్వేరు కథలను రాయటమూ లేదూ వేర్వేరు శీర్షికల కింద ఒకటే కథను వండి వార్చటంలాంటి మోసం ఇక్కడ చెల్లుబాటు కాదు. దృష్టి పెట్టండి, శీర్షిక మారుతోందంటే కథ కూడా మారుతోందని అర్థం. కనుక, ఆ దివ్య ప్రేమించిన భర్త మర్మహత్య గురించో లేదూ కొంతకాలం గడిచాక ఈమెకూడా మర్మంగానే మరణించవచ్చు అన్నదాని గురించో ఈ కథలో ఎక్కడైనా ఒకచోట రాసి ఉండొచ్చన్న ఆసక్తితో ఎవరూ చదవకండి. నిజం లాగానే ఈ కథలోనూ దివ్య ఎవరికీ సంబంధంలేని వ్యక్తిగా ఉన్నదా అన్న ప్రశ్న ఇక్కడా లేవవొచ్చు. నిజంలో దాగివున్న వాళ్లు ఇష్టప్రకారం జీవించటానికి కళలూ సాహిత్యమూ కృషిచేయటాన్ని గమనించకపోవటం వల్ల లేచే ప్రశ్న ఇది. అధికార అహంకారంచేత మళ్లీమళ్లీ వేదికమీదికి లాక్కు రాబడ్డ పరిస్థితి మారి ఒంటరిగా ఉన్న ఆమె ఈ ప్రస్తుత స్థితిలోకి మనం కల్పించుకోకూడదని పాఠకులను అభ్యర్థిస్తున్నాను. ఆయా పరిస్థితుల ప్రభావం నుండి బయటపడటానికి అప్పటికప్పడు గబగబా తాను తీసుకున్న నిర్ణయాలన్నీ సరిగ్గానే ఉన్నాయా అని ప్రశాంతంగా పరిశీలించటానికో, శాశ్వతంగా మరిచిపోవటానికో ఆమెకు కాలం ప్రసాదించిన ఈ ఒంటరితనం నావల్ల చెదిరిపోకూడదని ఆమెను కథలో నుండి బయటికి పంపించేస్తున్నాను.

           

            2. ఇది మరొక దివ్య కథ

            ఈ కథను రాస్తున్న వ్యక్తి ఇదివరకే చెప్పినట్టుగా ఆ దివ్యకు నేను పూర్తిగా వ్యతిరేకం. అలాంటి వ్యత్యాసం పుట్టినప్పటి నుండే మొదలైంది. ఔను, నేను ఆ దివ్య కులంలో పుట్టినదాన్ని కాను. సరిగ్గా చెప్పాలంటే నేను కులం నిర్మాణంలోకే రాని సామాజిక వర్గంలో పుట్టినదాన్ని. కానీ వాళ్లు కులం లేని జాతివాళ్లుగా మమ్మల్ని గుర్తించారు. చివరకు మేమూ మమ్మల్ని ఒక జాతిగా నమ్మటం మొదలుపెట్టిన మహావేదన గురించి మరొకరోజు మాట్లాడుదాం. మా నివాసస్థలం వాడ’. వాళ్లు నివసించేది అనేక కులాలవాళ్లతో కలిసి జీవించే ఊరుఅన్న బహిష్కత ప్రదేశం. మమ్మల్ని ఎదిరించటానికి, దాడిచెయ్యటానికి, కబళించటానికి మాత్రమే ఊరివాళైన వాళ్లు తమలోతాము ఒకటౌతారు. మిగతా సమయాల్లో ఎవరు గొప్పఅని వాళ్లల్లోవాళ్లు ఎప్పుడూ గొడవపడుతూ కొట్టుకుంటుంటారు. నన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ శివకుమార్‍ ఆ కులాల్లో ఒకదానికి చెందినవాడు.

            సాధారణంగా ఊళ్లో ఉండే మగ పిలకాయలు మమ్మల్ని ప్రేమించరు. వాళ్లవాళ్ల కులాల్లోనే చూడ్డానికి లక్షణంగా, తెల్లతోలుతో ఉండే, కాస్త సౌకర్యమైన కుటుంబపు ఆడపిల్లల వెంటే ప్రదక్షిణం చేస్తుంటారు. దీన్ని ప్రేమ అనికూడా చెప్పుకుంటుంటారు. ఇద్దరూ ఒకే కులానికి చెందినవాళ్లుగా ఉన్నప్పుడు అక్కడ ప్రేమకు పనే ఉండదు. సుగుణమూ, ఆరోగ్యమూ, సౌకర్యమూ ఇలాంటి విషయాలు కలిశాయంటే రెండు కుటుంబాలూసమ్మతితో పెళ్లిని ముగించేస్తారు. ఇలా ఏదీ ఇరుగుపొరుగున కలవకపోతే ఏడుజతల చెప్పులు అరిగిపోయేలా ఎక్కడెక్కడో తిరిగైనా సరే అదే కులంలో ఒక అమ్మాయిని వెతికి పట్టి పెళ్లిచేసుకుంటారు.                                                                                             తలరాత కొద్దీ కొందరు ఊళ్లో ఉండే వేరే కులపు ఆడపిల్లను ఇష్టపడతారు. ఏ ఒక్క కులమూ ఇంకో కులాన్ని సమానమని అంగీకరించనందువల్ల రెండు కుటుంబాల అంగీకారంతోవాళ్లు పెళ్లిచేసుకోలేరు. గొడవలు, కొట్లాటలు జరగటానికి అవకాశం ఉన్నందువల్ల ఆడపిల్లను వెంటబెట్టుకొని పారిపోతారు. లేదూ, వచ్చే జన్మలోనైనా కలిసి జీవిద్దాం అన్న భావావేశంతో ఏడ్చుకుంటూ విడిపోతారు. ఈ శనిగాళ్లే గడ్డం పెంచుకుని, బీడీలు తాగుతూ... ప్రేమకావ్యం, దోమకావ్యం అంటూ ఏదో ఒకటి రాసి మన ప్రాణాల్ని తీస్తారు. శివకుమార్‍ ఈ రకం కాదు. నాకు పెళ్లిచేసుకునే వయసొచ్చింది. నా మనసుకు నచ్చిన నిన్ను పెళ్లిచేసుకుని బ్రతకటానికి సిద్ధంగా ఉన్నాను.అన్నాడు. ఏ ఒక్క సందర్భాన్నీ వదిలిపెట్టకుండా తన ఇష్టాన్ని తెలపటం మాత్రం కొనసాగిస్తూ వచ్చాడు. తన ప్రార్థన ఫలిస్తుందని భావిస్తూ రకరకాల పూజలు కొనసాగించే మూర్ఖభక్తుడు అతనిలో దర్శనమిచ్చాడు.

            ఊళ్లోని కుర్రాడొకడు వాడ అమ్మాయి దగ్గరికొచ్చి నువ్వు నచ్చావ్‍, ఐ లవ్‍ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ అనవసరంగా వాగడు. వాడలోని ఎవరైనా అమ్మాయి నచ్చితే... అంటే ఆమె ఒంటిమీద కోరిక కలిగితే ఒంటరిగానో గుంపుగానో బలవంతంగా ఆమెను ఎత్తుకెళ్లి పాడుచేస్తారు. పండితే పాపం, తాకితే దోషం అని గొణుక్కునే ఊళ్లోని కుర్రాళ్లు సరాసరి రోజుకు ముగ్గురు వాడ అమ్మాయిల మర్మాంగాల్ని చించేస్తున్నారు. ఇందులో వయస్సు వ్యత్యాసం, వర్గ వ్యత్యాసం అంటూ ఏ గాడిదగుడ్డూ ఉండదు. ఇలాంటి అకృత్యాలను చెయ్యటానికిగల హక్కుల్నీ, అధికారాల్నీ తాను పుట్టిన కులం తనకు కల్పిస్తోందని ఊళ్లోని ప్రతి కుర్రాడూ గట్టిగా నమ్ముతున్నాడు. దీనిమీద ఆమె నుండో ఆమె కుటుంబం నుండో ఏ ఫిర్యాదూ బయటికి రాకుండా చూసుకునే తంత్రాలూ అతనికి బాగా తెలుసు. ఒకవేళ ఫిర్యాదులొస్తే దాన్ని బలహీనపరిచే మార్గాలూ అతనికి తెలియనిదేం కాదు. అతనిలో ఉన్నది కామం కూడా కాదు, కామ పిచ్చి. అయితే వాళ్లల్లో ఒకడుగా ఈ శివకుమార్‍ లేకపోవటం నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. అయినప్పటికీ వాడలో పూచిన కెందామరలాంటి పోలికల్ని చెప్పి అతణ్ణి ఎప్పుడూ నేను అవమానించలేదు. నన్ను బలవంతంగా ఎత్తుకెళ్లటానికి వీలుకాకపోవటంతో ప్రేమిస్తున్నట్టుగానూ, పెళ్లిచేసుకోనున్నట్టుగానూ చెబుతున్నాడా అన్న అనుమానమే నాకు మొదట కలిగింది.

            నా అనుమానాలనూ, సందేహాలనూ గౌరవించి దానికి తగ్గ సమాధానాలను అతను చెప్పిన విధం నాకు మొద బాగా నచ్చింది. తర్వాత అతడూ నచ్చాడు. అయితే మా ఇంటివాళ్లు, బంధువులు ఎవరికీ అది నచ్చలేదు. ఇలా చెప్పుకుంటూ వచ్చే ఎంతోమంది కుర్రాళ్లు మన ఆడపిల్లల్ని గర్భవతుల్ని చేసి పారిపోయినదంతా మరిచిపోయావా? పిండాన్ని చిదిమేసి బ్రతికే మార్గం చూడూ అని ఊరిపెద్దలు ఉపదేశాలివ్వటాన్ని కూడా మరిచిపోయావా? వద్దే పిల్లా ఈ సావాసం. వాళ్ల మనుషులు చంపేస్తారుఅని ఎన్నో చెప్పి నా మనసును మార్చాలని చూశారు.        

            వాళ్లు చెప్పిన ఏ విషయమూ అబద్ధం కాదు. వాడలోని వాళ్లకూ ఊళ్లోవాళ్లకూ మధ్య తీరని పగ ఉంది. ఆ పగ రెండువేల సంవత్సరాలుగా వేళ్లూనుకొని దృఢంగా ఉంది. ఇద్దరిమధ్యా ఇచ్చిపుచ్చుకోవటాల్లాంటివేవీ ఎప్పుడూ లేదు. తమ కులాన్ని కాదని వాడలో పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చిన ముత్తును చంపేశారు. మధురైవీరన్‍ కాళ్లూచేతులూ నరికేశారు. కణ్ణగీ మురుగేశన్‍ ఇద్దరినీ చావగొట్టి సగం ప్రాణంతీసి, చెవుల్లో విషంపోసి చంపటమేకాక వాళ్లవాళ్ల స్మశానాల్లో వాళ్లను మంటల్లో పడేయటమూ దేశానికి తెలుసు. అభిరామితో పారిపోయి, భార్యాభర్తలయ్యి, ఒక బిడ్డనూ కన్నాక ప్రియంగా మాట్లాడి పిలుచుకొచ్చి శూరకోట మనుషులు మారిముత్తును చంపేసిన విషయం టివిలో కూడా వచ్చింది. మనుషుల్ని అపహరించటం, ఇంటిని ధ్వంసం చెయ్యటం, ఊరిని కాల్చేయటం అంటూ వాళ్లు మావాళ్లకు వ్యతిరేకంగా చేసే పైశాచికత్వాలను చూశాక కూడా నన్ను శివకుమార్‍కిచ్చి ముడిపెట్టటానికి ఎలా అంగీకరిస్తారు మా ఇంటివాళ్లు?

            ‘రక్తపు గాయాలు కాకుండా కులం నాశనం కాదుఅన్న అంబేద్కర్‍ మాటను పదేపదే చెప్పే శెల్వి అక్కయ్య మాత్రమే మా పెళ్లికి సానుకూలంగా ఉంటుందని నమ్మాను. అయితే ఆమె అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. కుల నాశనం అన్న రాజకీయ నాశనాన్ని ముందుపెట్టుకునా మీరు ప్రేమించుకున్నారు?’ అని అక్కయ్య అడగగానే నేను తడబడిపోయాను. అలాగంతా అనుకొని ఒకరు ప్రేమించగలరా అన్న ప్రశ్న మా ముందుకొచ్చి నిలబడింది. కులాభిమానాన్ని అలాగే ఉంచుకొని, రక్తపుగాయాలు మాత్రం అయ్యి, దానితో కులం నాశనమవుతుందని అంబేద్కర్‍ ఎప్పుడూ చెప్పలేదని ముఖమ్మీదే చరిచినట్టుగా చెప్పేసింది అక్కయ్య. రెండు కుటుంబాలను కాదని, కులం ప్రాతిపధికన లేని, కొత్త కాపురాన్ని ఏర్పాటు చేసుకోవటానికి వీలవుతుందన్న నమ్మకం ఉండే పక్షంలో పెళ్లిచేసుకోండి అన్న ఆమె ఆలోచన నాకిప్పుడు ఉచితంగా తోచలేదు. అక్కయ్య ఆలోచనలను శివకుమార్‍ కూడా తిరస్కరించాడు. ఇప్పటివరకూ ప్రపంచంలో లేని ఏదో ఆచారాన్ని మొట్టమొదట మమ్మల్ని ఉంచుకొని చెయ్యాలనుకునే అత్యాశను అక్కయ్య బయటికి చెబుతోందని ఇద్దరమూ భావించాం. మాకు పెళ్లిచేసే ప్రయత్నంలోకి దిగటంతో ఏర్పడే సమస్యలనుండీ, దాడులనుండీ తప్పించుకునేందుకే ఆమె ఇలాగంతా చెప్పి నాజూకుగా నివారిస్తోందా అన్న అనుమానాన్ని లేవదీశాడు శివకుమార్‍.

            సాధారణంగా కులాంతర వివాహం చేసుకునేవాళ్లు మొదట కలిసిఊరొదిలి పారిపోతారు. కొన్నాళ్లు గడిచాక రెండు కుటుంబాలలో ఏదో ఒకదానితో మాటలు కలిపి, మంచి చెడ్డా కార్యక్రమాల్లో దూరంగానైనా నిలబడి కలుసుకుంటూ అలాగే అతుక్కుపోతారు. ఇలా కలవటానికే... కన్న ప్రేమ / మనవడు / వారసుడు’  లాంటి సెంటిమెంటు ఫార్ములాలు ఎన్నో తమిళ సినిమాల్లో రావటానికి ముందే ఊళ్లళ్లో మామూలైపోయాయి. ఈ అవకాశాలు కూడా ఊళ్లోని కులాల్లో పారిపోయేవాళ్లకు మాత్రమే తప్ప వాడలోని వాళ్లతో కలిసి పారిపోయేవాళ్లకు కాదని... నొక్కి చెప్పిన అక్కయ్య - పారిపోవటం మంచిది కాదని చెప్పింది. ఒకవేళ మీ ఇంట్లోవాళ్లు అంగీకరించినప్పటికీ, వాడ అమ్మాయిని చేర్చుకున్న ఇంటివాళ్లతో స్నేహభావాన్ని అంగీకరించని ఊరివాళ్లు... తెలివిగా నీ కుటుంబాన్ని వెలి వేస్తారు. లేదూ అప్పుడొక పెద్ద ప్రమాదం          ఉన్నట్టుగా చూపించి నీ కుటుంబం వాళ్లే మిమ్మల్ని దూరం పెట్టినా పెట్టవచ్చు!అని ముఖానికి నేరుగా ఉంచిన సత్యాలను ఎదుర్కోలేని శివకుమార్‍ తన కటుంబం మీద అనవసరంగా ఆరోపణలు చేస్తోందని కోపగించుకున్నాడు.

            శెల్వి అక్కయ్య చెయ్యి వదిలేశాక అయ్యేది అవుతుందని మేం పారిపోయాం. మునుపటిలా ఉండిఉంటే, ‘నీ కూతురు నా కొడుకును లోబరుచుకొని పారిపోయింది.అని మా కుటుంబాన్ని పంచాయితీలో నిలబెట్టి వీళ్ల మనుషులు గొడవపెట్టుకొని           ఉండేవాళ్లు. ఊరివాళ్ల అమ్మాయి ఎవతైనా వాడలోని కుర్రాడితో పారిపోతే... నీ కొడుకే నా కూతుర్ని లోబరుచుకున్నాడుఅని ఎగిరెగిరి ఉండేవాళ్లు. అదే ఊరివాళ్ల అబ్బాయొకడు వాడ అమ్మాయితో పారిపోతే అప్పుడూ... నీ కూతురే మా కొడుకును లోబరుచుకుందిఅని గొడవపెట్టుకుని ఉండేవాళ్లు. మొత్తానికి ఊళ్లోని మగపిలకాయలూ అమ్మాయిలూ ఏమీ తెలియని అమాయకులనీ వాడలోని వాళ్లే విల్లాది విల్లన్లని సాధిస్తారు. వాడలోని వాళ్లు బుట్టలో పడేస్తే పడే స్థాయికి మీ కులం ఆడామగా పిలకాయలందరూ వీక్‍ పార్టీలా? ఆ ప్రాయంలో రాదగిన ప్రేమోద్రేకాలన్నీ రాకూడదని మీ అమ్మాయిలకు చింతపండు కూర్చి అడ్డుపెట్టారా? లేదూ కుర్రాళ్లది కోసి కాకులకూ గ్రద్దలకూ వేసేశారా?’ అంటూ అడగటానికి ఇప్పుడు మా వాళ్లల్లోనూ కొందరు తయారైపోవటంవల్ల ఏ గొడవా రాకుండా సద్దుమణిగిపోయింది. గొడవలు మాత్రం రాలేదు కానీ పగ మాత్రం ఏర్పడింది. అంటే ఎప్పుడూ ఉండే పగను నేనూ శివకుమారూ మరింత పెంచాం. పగ అంటూ ఏర్పడితే గెలవటం తాముగా ఉండాలన్నది ఊరివాళ్ల అహంకారం, (ఏడు గాడిదల వయసు ఎనిమిది రెట్లు పెరిగినా) మేజర్‍ కాని తమ కొడుకును ఒక ఆడపిల్ల అపహరించిందని ఒక అబద్దపు ఫిర్యాదైనా ఇస్తేకానీ అది తగ్గదు. అయితే శివకుమార్‍ కుటుంబీకులు అలా చెయ్యకుండా ఎంతో ప్రశాంతంగా ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందో తెలియక నేను భయపడుతూనే ఉన్నాను.             

            ‘పెళ్లి తర్వాత రెండు కుటుంబాలలో ఏ ఒక్కదానిలో నైనా మీరు ప్రవేశించినా ఆ కుటుంబానికి చెందిన కులం, తన సొంత కులాన్ని అంతర్గతంగా స్వీకరించి దానికి వ్యతికేకమైన ఇతరులను ఇంట్లోనే దాచేస్తుంది. ఆ కుటుంబం మీ ఇద్దరినీ ఒకే విధంగా చూడదు. ఎందుకంటే, ఇంకో కులాన్ని సమానంగా చూడటానికి గల సంప్రదాయాన్నో, తర్ఫీదునో ఆ కుటుంబం ఎప్పటికీ సంపాదించలేదు.ఇలాగంతా శెల్వి అక్కయ్య చెప్పిన మాటలే చివరకు మా జీవితంలోనూ సంభవించాయి.

            పారిపోయిన మేము ఐదారు నెలలు అక్కడా ఇక్కడా ఉంటూ మా కుటుంబాలకు దూరంగానే ఉన్నాం. అంటే నేనలాగే అనుకున్నాను. అయితే అతను నాకు తెలియకుండా తన కుటుంబానికి చెందిన కొందరు మనుషులతో సంబంధం పెట్టుకునే           ఉన్నాడు. వాళ్లద్వారా తన తండ్రిని లోబరుచుకుని ఇంట్లోకి వెళ్లే అతని పథకం నాకు తెలిసేసరికే దాదాపు అంతా పూర్తయిపోయింది. బయటినుండి కష్టపడింది చాలు, రా మాఇంటికెళదాం. అక్కడ సమస్యలేవీ ఉండవు, అన్నీ మాట్లాడి సముఖంగా చేసిఉంచాను. అటూ ఇటూ ఉన్నప్పటికీ రాన్రానూ సర్దుకుంటుంది.అని అతనన్న మాటలు అతనికే నమ్మశక్యం కాకుండా మళ్లీమళ్లీ చెబుతూనే ఉన్నాడు. అతని చిరునవ్వూ, మాటలూ తారాస్థాయికి చేరుకునేసరికి సరే అదీ చూద్దాంఅని అతని ఇంటికి వెళ్లటానికి అంగీకరించాను. (ఇలాంటి ఒక ఇక్కట్టైన పరిస్థితిలో ఆ దివ్య ఉండి ఉంటే, ‘ఏదైనా సమస్య వస్తే ఇంట్లోనుండి బయటికెళ్లిపోవాలిఅన్న మాటనైనా అతన్నుండి తీసుకొని ఉండేది... అని నేను అనుకోవటం కద్దు.)

            ఇలాంటి పరిస్థితుల్లో ప్రారంభంలో అన్నీ సరిగ్గానే ఉన్నాయిఅన్న మామూలు వాక్యంతోటే ఈ భాగాన్ని ప్రారంభించి ఉండాలి. కానీ ప్రారంభం సరిగ్గా ఉండుంటే కొనసాగింపో, ముగింపో ఎలా తప్పుగా ఉండేది అన్న తర్కం వచ్చినందువల్ల ప్రారంభం నుండే ఏదీ సరిగ్గా లేదుఅని మొదటి వాక్యం మార్చి ఉండటాన్ని గమనించి ముందుకు చదవండి.         

            కనుక, ప్రారంభం నుండే ఏదీ సరిగ్గా లేదు. నాతో కలవటం వల్ల ఏర్పడ్డ మచ్చకు పరిహార తంతుచేసి అతణ్ణి ఇంట్లోకి తీసుకున్నప్పుడే అన్ని తప్పులకూ పునాదులు పడ్డాయనే చెప్పాలి. వాడ అమ్మాయితో కలిసినవాణ్ణి ఇంట్లోకి చేర్చుకోవటానికే పరిహారం చేశారంటే, వాడ అమ్మాయినైన నన్ను ఇంట్లోకి చేర్చుకోవటానికి వాళ్లు ఏమేమి చేసుంటారన్న విషయాలు అదే కులం బురదలో కూరుకుపోయి తలపండిన మీకు బాగానే తెలుసు.

            కొత్తగా నేనొకదాన్ని వచ్చానన్న విషయాన్ని అతని కుటుంబ సభ్యులు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎదురుగా నేను నిలబడున్నా ఎవరూ లేని ప్రదేశాన్ని దాటుకొని వెళ్లిపోయినట్టుగానే ఆ ప్రదేశాన్ని దాటుకొని వెళ్లేవాళ్లు. ఇక నన్నూ లోపల బంధించింది ఆ కుటుంబమే అన్న భావన నాకో వాళ్లకో రానంతగా బహష్కరణలు స్వతస్సిద్దంగానూ, స్వేచ్ఛగానూ ప్రకటితమయ్యాయి. ఏ కారణంచేతా నేను పుట్టింటికి వెళ్లకూడదు, అక్కణ్ణించీ ఎవరూ రాకూడదు, ఇంట్లో దేన్నీ నేను తాకకూడదు, వంటగదిలోకి ప్రవేశించకూడదు అన్న కట్టుబాట్లంన్నింటినీ ఒక్కమాటా చెప్పకనే వాళ్లు అమలు చేసేశారు. ఆ ఇంట్లో నూగుల ఉంటలూ,          ఉలవల పచ్చడీ ఎప్పుడూ తినటానికి దొరకటం కూడా వాళ్ల వారసత్వం నాలో నిలవకుండా చెదిరిపోయే ఏర్పాట్లని నేను తెలుసుకునేలోపే రోజులు గడిచిపోయాయి.

            నేను వాళ్లందరి మనసు బయటే నిలబెట్టబడ్డాను. బయటివాళ్ల కంటికి కనిపించని ఒక మాయా వాడను ఇంట్లోనే సృష్టించి అందులో మాత్రమే నన్ను తిరగాడేలా చేశారు. పోనుపోను సర్దుకుంటుందిలే అన్న సంప్రదాయమైన జవాబును చెబుతూ వచ్చిన నా భర్తను నా కంటిముందరే అతని కులం లోలోపలికి లాక్కోసాగింది. అతను తన కులంలో వేగంగా ఇమిడిపోతున్నాడన్న విషయాన్నీ, వాడ అమ్మాయి అని తప్ప ఇంకే చిహ్నాలనూ నాలో కనిపించనంతగా అతని మనసు మారిపోవటాన్నీ నేను గ్రహించిన ఆ తరుణాలు బాధాకరమైనవి.     

            1. శివకుమార్‍ కుటుంబానికీ పక్కింటివాళ్లకూ దారికి సంబంధించిన హద్దు గొడవ ఒకటి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. దానికి సంబంధించిన వాగ్వాదం ఒకరోజు కొట్టుకునే దాకా వెళ్లింది. ఆత్రగాడైన ఇతని తమ్ముడు కొట్టిన దెబ్బకు అతని నోట్లోని పన్నొకటి నేలమీదికి రాలిపడింది. ఎదుటివ్యక్తి శాశ్వతంగా పన్ను పోగొట్టుకున్న వైనాన్ని గురించి శివకుమార్‍ కుటుంబమంతా కలిసి క్రూరంగా నవ్వుకుంటున్న తరుణంలో ఆ చెడువార్త వచ్చి చేరింది. పన్ను పోగొట్టుకున్నవాడు న్యాయం కోరి పోలీసు స్టేసన్‍లో ఫిర్యాదు దాఖలు చేశాడట. అతనికన్నా పెద్ద ఫిర్యాదుతో వ్యతిరేక ఫిర్యాదు నొకదాన్ని ఇస్తే అతని ఫిర్యాదును బలహీనపరచొచ్చు, ఖైదు కావటం నుండీ తప్పించుకోవచ్చునని ఒక పోలీస్‍ ఆఫీసరూ, ఒక లాయరూ వీళ్లకు ఒక ఆలోచన చెప్పారు. ఆ ప్రకారం తయారుచెయ్యబడ్డ ఫిర్యాదులో నన్ను ప్రస్తావించటం జరిగింది. అనగా, ‘‘పోయిపోయి ఒక వాడ పిల్లను ఇంట్లో చేర్చుకున్న కులం చెడ్డ కుటుంబంమీది...’’ అని వీళ్లను పక్కింటివాళ్లు ఎగతాళిగా మాట్లాడి అవమానించినట్టుగానూ, చాటుమాటుగా నా కులం పేరుచెప్పి నన్ను తిడుతున్నట్టుగానూ, దీన్ని అడిగినందుకు వీళ్లను వాళ్లు కొట్టినట్టుగానూ రాయబడ్డ ఆ ఫిర్యాదు మొత్తం శుద్ధ అబద్దం. ఇందులో తారాస్థాయి హింస ఏంటంటే, కులాన్ని అవమానించిన పక్కింటివాళ్ల మీద అట్రాసిటీ చట్టంక్రింద చర్యలు తీసుకోవాలని ఇంకొక అబద్దపు ఫిర్యాదును ఇవ్వమని వీళ్లు నన్ను బలవంతం చెయ్యటమే!

            మరిదిని కాపాడటానికి ఇలాంటి ఒక అబద్దపు ఫిర్యాదును ఇవ్వటంలో తప్పేమీలేదని శివకుమార్‍ కూడా వాదులాడినపుడే నాలో అతని మీదున్న మొదటి వాంతి ప్రారంభమైనట్టుంది. నిజానికి అలాంటి ఒక ఫిర్యాదును ఇచ్చేటట్టుంటే మొదట నీ కుటుంబం మీదే నేను ఇవ్వాల్సి ఉంటుంది. మీరేమో ఏ పాపమూ ఎరుగని పక్కింటివాళ్లమీద అబద్దపు ఫిర్యాదును ఇవ్వమని నన్ను బలవంతం చేస్తున్నారు. తప్పుచేసిన మీ తమ్ముణ్ణి కాపాడ్డానికి నా కులాన్ని ఒక సాకుగా చూపించటం నాకిష్టం లేదనినిరాకరించాను.  

            2. నా మరిది అలాంటివాడైతే నా ప్రియమైన భర్త శివకుమారేమో ఒకరోజు ఊరి పశువులాసుపత్రికి వెళ్లి అక్కడి డాక్టరుతో అనవసరంగా గొడవపెట్టుకొని తగులుకున్నాడు. కాలు విరిగిన ఒక మేకపిల్లకు చికిత్స చెయ్యించేందుకు ఇతను దాన్ని ఎత్తుకెళ్లాడు. మేకపిల్లను పరిశీలించిన డాక్టరు, బయటికెళ్లిన కాంపౌండరు రాగానే కట్టు కట్టించుకొని వెళ్లమని జవాబిచ్చి ఇంకో పేషెంటును పిలిచాడు. అర్థగంట ఎదురుచూసినా కాంపౌండరు రాకపోవటంతో సహనం కోల్పోయిన ఇతను, డాక్టరు దగ్గరికెళ్లి మీరే కట్టుకట్టండి అని చెప్పి గట్టిగా అరిచినట్టున్నాడు. ఇతని అరుపుల్ని అతను పట్టించుకోలేదని తెలియగానే కోపంతో... కాంపౌండరు చేసే పనుల్ని నువ్వే చేస్తే నీ గౌరవం తగ్గిపోతుందా? డాక్టరున్నా తక్కువ స్థాయిలోని ఏ పనినీ చెయ్యని పరంపర నుండి వచ్చావా నువ్వు? చచ్చిన ఆవును ఎత్తినవాళ్లు, ఇప్పుడు ప్రాణంతో ఉన్న మేకపిల్లకు కట్టు కట్టటానికి వీలుకాదంటారట. పాత విషయాలను మరిచిపోయి ఎగిరెగిరి పడకు...అని నోటికొచ్చినట్టుగా ఏదేదో మాట్లాడేసి మేకపిల్లకు కట్టు కట్టించుకోకనే తిరిగొచ్చేశాడు. అవమానానికి గురైన ఆ డాక్టరు, ఇతనిమీద అట్రాసిటీ చట్టం క్రిందచర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ఇవ్వనున్నట్టుగా ఎవరో పుకార్లు లేవదీశారు.

            ‘ఆ డాక్టర్‍ ఫిర్యాదు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే, ముందుగానే అతనిమీద నువ్వొక ఫిర్యాదును ఇచ్చిపెట్టు. ఒకవేళ ఆ డాక్టర్‍ ఫిర్యాదు చేస్తే అతణ్ణి లొంగదీసుకోవటానికి నీ ఫిర్యాదు సాయపడుతుంది.అని ఎవరో ఇతనికి చెప్పినట్టున్నారు. ఆపైన ఇతను తయారుచేసిన ఫిర్యాదును మీరే చదవండి.

            ‘‘కాలు విరిగిన మేకపిల్లకు చికిత్స చెయ్యించేందుకు పశువులాసుపత్రికి వెళ్లిన నాభార్యతో డ్యూటీలో ఉన్న డాక్టర్‍ తప్పుగా ప్రవర్తించటానికి ప్రయత్నించాడు. ఆయన్నుండి ఎలాగో తప్పించుకొచ్చిన నాభార్య, నాతో ఆ విషయాన్ని చెప్పుకొని ఏడ్చాక నేను ఆసుపత్రిళ్లి ఆ డాక్టర్‍ను నిలదీశాను. తాను అలాగే నడుచుకుంటానని గర్వంతో మాట్లాడిన ఆ డాక్టర్‍, దీని గురించి బయటికి చెప్పావంటే నా కులాన్ని సూచిస్తూ నిందించినట్టుగా నీమీద తప్పుడు కేసుపెట్టి జైల్లో పెట్టిస్తాను అని - నన్ను బెదిరించాడు కూడా. నాభార్యకు జరిగిన మానభంగం ఇంకో అమ్మాయికి జరగకుండా ఉండాలంటే, డాక్టర్‍ రూపంలో తిరిగే ఈ కాముకుడి మీద తగిన చర్యలు తీసుకోవలసిందిగా దీని మూలంగా అభ్యర్థిస్తున్నాను.’’

            తమ కులంవాణ్ణి లొంగదీసుకోవటానికి గతంలో నా కులాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించిన శివకుమారూ అతని కుటుంబీకులూ... ఇప్పుడు నా కులంవాణ్ణి లొంగదీసుకోవటానికి ఆడది అన్న నా ఒంటినే ఉపయోగించుకోవటానికి సాహసిస్తున్నాడు అన్న విషయాన్ని ఆలోచించటానికే అసహ్యంగా అనిపించింది. ఆ డాక్టర్‍తో ఒకసారి పడుకొని వచ్చి ఇలాంటి ఒక ఫిర్యాదును నేనే ఇవ్వనా?’ అని అడిగిన తర్వాతే ఆ ఫిర్యాదును అతను చించి పారేశాడు. దాన్ని చించింది కూడా నాకు తెలిసిపోయిందిఅన్నందువల్లే తప్ప, తన తప్పును తెలుసుకొని కాదు. చెప్పాలంటే ఇందులో అతని తప్పు అంటూ వేరుగా చెప్పటానికి ఏమీలేదు. వాడలోని వాళ్లను మాత్రమే కాదు వాళ్లకు చెందిన చట్టాలను కూడా తమ ఇష్టానుసారం ఎలాగైనా           ఉపయోగించుకోగలం అని నమ్ముతున్న ఊరివాళ్ల మనసు దేన్నంతా చెయ్యగలుగుతుందో వాటిని అతనూ చెయ్యటానికి సాహసిస్తున్నాడు.

            అంతే, ఇంకా మాట్లాడటానికి ఏముందనీ? మేము ప్రేమించిందీ నిజం. ఎప్పటికీ దూరం కాకుండా బ్రతుకుతాం అని పెళ్లి చేసుకోవటమూ నిజం. పడకలో మాత్రమే హింసించకుండా ఉన్న అతణ్ణి నేను వదిలించుకొని వచ్చెయ్యటం ఇంకో నిజం. నిజం తప్ప ప్రేమలో ఇంకేమీ లేదని నమ్మిన ఒకే కారణం వల్ల ఇవ్వాళ ఆ దివ్యలాగానే నేనూ ఒంటరిదాన్నై పోయాను.        

            మగతోడు లేకుండా ఒంటరిగా నీవల్ల బ్రతకటానికి వీలవుతుందా అని నేను ఎదురుచూసిన ప్రశ్ననే వినగలిగే స్థాయిలోనే అతని జ్ఞానముంది. ఒంటరిగా పుట్టి, ఒంరిగా పెరిగి, ఒంటరిగా చావబోయే నేను నా సొంతానికి మళ్లుతున్నాను అన్న విషయాన్ని అర్థంచేసుకోలేని ఆ మగతనం అదే పాత ప్రశ్నను అడుగుతోంది.

           

            3. ఇంకా కొందరు దివ్యల కథ (లేదూ ప్రతి అమ్మాయీ  దివ్యగా మారే కథ)

            మా ఇద్దరి ఛాయలనుండీ మా నుండీ కాస్త వేరై ఇప్పుడు ధర్మపురి ప్రాంతం నుండి ఒక దివ్య రూపొంది ఉండటం  మీకు తెలుసు. మా లాగానే ఆమెకూడా ఒంటరిదైపోయింది. ఆమె ఒంటరిదైపోయిన విధానం ఎంత క్రూరమైనది అని ఆ క్రూరత్వాన్ని ప్రదర్శించిన మీదగ్గరే చెప్పటం అధికప్రసంగితనం. ఇలా నేను చెప్పటం మీ కులపు అహంకారానికి దక్కిన ప్రశంసలని మీరు ఆస్వాదించవచ్చు లేదూ నిరాధారమైన నేరారోపణలని ఖండిచవచ్చు. అయితే జరిగిన నేరాలలో మీరు ఎంతగా భాగస్వాములయ్యారన్నది దివ్యలమైన మాకు తెలుసు. మీ భాగస్వామ్యంతోటే, ఆదరణతోటే ఇక్కడ దివ్యలు రూపొందించ బడుతున్నాం.

            మీరు ఒక్కొక్కరూ మాలో ఒక్కొక్కర్నీ దివ్యగా మార్చే ప్రయత్నంలో మునిగిపోయున్నారు. ఆ రకంగా మాకు పెద్దలు పెట్టిన పేర్లు ఉండటాన్ని కూడా సహించలేని వాళ్లయిపోయారు. ఈ దివ్య, ఆ దివ్య, ఇంకో దివ్య అంటూ మీరు పిలుచుకుంటున్న మా శరీరాల నుండి ఒఠి కులానికి చెందిన శరీరాల రకాల మాదిరిగానూ, వ్యతిరేకంగానూ తయారుచేస్తున్నారు. వాడ అమ్మాయిల మర్మాంగాలను తెరిచే డూప్లికేట్‍ తాళంచెవులను చాలాకాలం క్రితమే కనిపెట్టిన మీరు, ‘ఆయా కులంవాళ్ల బాణాలకు మాత్రం తెరిచి మూసుకునేలాంటి మర్మాంగ సంచులను మా అమ్మాయిలకు పుట్టుకతోనే రూపొందించి ఇచ్చే దేవుళ్లారాఅన్న ప్రార్థనతో భగవంతుణ్ణి భయపెట్టటం మాకు తెలుసు. మీ ప్రార్థనలకు భయపడి మా గర్భసంచిలో నిలిచి పరిశోధన పనిలో మునిగిపోయి ఉన్న దేవుడు, మేము ప్రతిసారీ లోదుస్తుల్ని విప్పేటప్పుడు క్రిందికి పడిపోతుంటాడు. అక్కడ రక్షణ నిలయాన్ని ఏర్పాటుచేసి చుట్టూ కాపలా పనిలో మునిగిపోయి ఉన్న కాపలాదారులు, ఫాస్ట్ ట్రాక్‍ కోర్టు న్యాయవాదులు మరియు న్యాయాధిపతులు, సి.ఐ.డిలు, కులసంఘపు పెద్దలు, అంటూ అందరూ అలాగే క్రింద పడిపోవటమూ తర్వాత లేవటమూ చేస్తున్నారు. నడుముకు క్రింద ఇంతమందిని భరిస్తూ ఎలా మేము స్వాభావికంగా నడవటానికి వీలవుతుంది, మూర్ఖుల్లారా?

            మూత్రపుగుంట అంటూ ఉన్నదాన్ని కంటితో చూడాలని మా లోదుస్తుల్లో దాక్కున్నవాళ్లారా, ప్రసాదించాం మీకు సామూహిక క్షమాభిక్షను. బయటికి రండి. మా మూత్రం వాసనకు అలవాటైన మీ నాసికలు ఇకనైనా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చనీ. మా తొడలసందు ముగింపు ఎల్లలుగా కలిగిన మీ ఆధ్యాత్మిక, సాహిత్య, రాజకీయ ప్రయాణాలు ఇకమీదటైనా విస్తారమైన ఈ ప్రపంచాన్ని చూసేటట్టూ , దృశ్యాలలో లీనమయ్యేటట్టూ  ఏర్పడనీ అని ఆశీర్వదిస్తున్నాం.

                                                                                                                         ఇట్లు

                                                                                                             మీపై పశ్చాత్తాపపడే దివ్యలు

                                                                        ()()()

 

           

కాలు

       ఉన్నట్టుండి తాను ఎవరూలేని ఒంటరివాణ్ణని గ్రహించటానికి వీలైంది. నిదానంగా లేచి మేడమీది గదిలో నుండి బయటికొచ్చి వరండాలో నిలబడి ఎదురుగా వ్యాపించి వున్న మామిడి చెట్టును చూశాడు. గుత్తులు గుత్తులుగా కాయలు నిండివున్నాయి. ఆరేడు ఉడుతలు... అవి తమకోసమే వున్నాయన్న హక్కుతో ఆ కొమ్మలలో ఇటు అటు పరుగెడుతున్నాయి. చాలారోజులుగా గమనించకుండా వున్న ఆ చెట్టు నిండుదనం అతనిని ఆశ్చర్యపరిచింది.

            మేడమీది గదులలోనూ, కింది కార్యాలయంలోనూ తక్కువంటే ముప్పైమంది పని చేస్తున్నప్పటికీ, ఏ శబ్దమూ లేక వుడుతల శబ్దాన్ని ఇవ్వాళ మాత్రం ఒంటరిగా వినటానికి వీలైంది.

            ఇలాంటి ఒక ఏకాంతం ఏర్పడి చాలా కాలమైంది. కీర్తిప్రతిష్ఠల్ని పట్టుకొని మింగే మొదటి అంశం ఈ ఏకాంతమే. అది తనకు చిన్నవయసులోనే లభించటం అదృష్టంగానూ, దురదృష్టంగానూ చెప్పుకోవచ్చు. ఈ మేడమీది గది నుండి దిగి వెళ్లి, కారు అద్దం గుండా మాత్రమే చూసే ఆ మూలనున్న టీకొట్లో నిలబడి ఒక టీ తాగటానికి తనవల్ల వీలవుతుందా?

            గుంపు చేరిపోయి, ట్రాఫిక్‍ ఆగిపోయి, పోలీసులు రాకుండా అక్కణ్ణించి మళ్లీ రెండు నిమిషాల నడకలో అధిగమించి తన కార్యాలయానికి చేరుకోలేని కీర్తిప్రతిష్ట అది. గత పదీ ఇరవై ఏళ్లలో మరింకే తమిళ నటుడూ ఎంతగా పోటీ పడినప్పటికీ తానున్న స్థాయిలో సగం కూడా చేరుకోలేకపోయారు.  

            ఇప్పుడు ఒక చిరునవ్వు తననూ అధిగమించి పూయటం అంతరాత్మ ఆస్వాదించింది.

            తన అలవాటైన దినచర్యల నుండి ఇవ్వాళైనా దూరం కావాలన్న మనిషి భావనను మౌనంగా అంగీకరించాడు.

            తన సొంత గ్రామంలోని పెంకుటిల్లు, దాని వెనకున్న పెరడూ, దానికి మధ్యనున్న తులసికోట, తమ ఇంటి రాత్రి భోజనమూ అన్నీ గుర్తుకొచ్చాయి.

            ఇప్పుడే గమనించాడు, ఆరేడు కావు పదీ ఇరవైకి పైగానే ఉడుతలు ఆ చెట్టు కొమ్మల్లో అంతా వ్యాపించి వుండటాన్ని. ఒకప్పుడు తమ ఇల్లూ ఇలాగే ఉన్నది. అది తమందరినీ బయటికి పంపించే కదా తాళం పెట్టుకుంది. తర్వాత ఒక ప్రదర్శన వస్తువైంది. ఈ చెట్టు పచ్చదనం కోల్పోయి చెట్టు ఎండిపోతే, ఈ ఉడుతలూ ఇక్కణ్ణిండి వెళ్లిపోతాయి. దూరమై ఎక్కడెక్కడికో వెళ్లి అతుక్కుపోతాయి. బంధాలూ స్నేహమూ వాటి ఎడబాటూ, కనుమరుగైపోవటం కూడా ఈ కీర్తిప్రతిష్ఠల ముందు ఏమీ లేనిదైపోతుంది.

            కాసేపటి క్రితం మెరిసిన చిర్నవ్వు మాయమై ఇంకేదో మనసును తొలుస్తోంది. బర్మా టేకుతో చేసిన తమ ఇంటి డైనింగ్‍ టేబుల్‍ గుర్తుకొస్తోంది. ఒక దినాన్ని పూర్తిచెయ్యటం కోసం ఒక్కొక్క దినమూ జరిగే కోలాహలాన్ని స్వీకరించిన మంటపం అది.

            ఎప్పుడూ అక్కే సంభాషణల్ని ప్రారంభించేది. మాటల దొంతర అగ్గిపుల్లల్లా ఎప్పుడూ ఆమె వద్దే వుండేవి. లోతుగా ఆలోచిస్తే అవి సంభాషణలు కావు. కథలు. కథలు కూడా కావు. ఒకే ఒకరి జీవితంలోనుండి తొలిచి వెలికి తీసిన చేదుమాత్రలు. ఎందుకీమె చేదును ఇంతగా ఆస్వాదిస్తుంది.

            ఆ ఇంటి డైనింగ్‍ టేబుల్‍ దగ్గరున్న కుర్చీల్లో అక్క మాససికమైన ఆర్‍.కె.వి కీ ఒక చోటుంది. చెప్పాలంటే అక్క తన ఆదర్శ రచయితకు వేసిన సింహాసనం చుట్టూ వాళ్లందరూ వున్నారు.

            అక్కడ జరిగేదంతా వినోదంగా వుంటుంది. అన్నం, భోజనం బల్లమీదికి రావటానికి మునుపే అవ్వాళ అక్క కథ చెప్పటం కొన్నిసార్లు పూర్తయ్యేది. వడ్డించిన భోజనం నోటికి అందించటం మరిచిపోయి మాటలు విరిసేవి. భోజనం చివరలోనూ వివాదం ప్రారంభమయ్యేది. చిరు చిరు గొడవలు లేక రాత్రి నిద్ర వుంటుందా?

            పగటిపూట ఆర్‍.కె.వి. కథలు చదవటమూ, సాయంత్రం దాకా వాటి గురించే చర్చించే అక్కకు రాత్రి భోజనం రణస్థలమే. తన మేథస్సు ఈ వివాదాల ద్వారా పదును తేలటం ఆమె గ్రహించి ఒక్కో రాత్రికోసమూ ఎదురుచూసేది.

            నాన్న, అన్నా, ఎప్పుడూ ఆమె మాటలను వ్యతిరేకించేవాళ్లుగానూ, వదినా, అతనూ దాన్ని మౌనంగా భద్రపరుచుకునే  వాళ్లుగానూ వున్నారు. వదినె మౌనం ఎవరివల్లా కొలవటానికి వీలుకాదు.

            అప్పటివరకూ వున్న మొత్తం తర్కాన్నీ చెదరగొట్టేందుకు ఆమెకు ఒక వాక్యం కాదు, ఒక్క మాట చాలు. ఆమె ప్రదర్శించే ప్రశాంతత అందరినీ ఎప్పుడూ ఒక రకమైన అప్రమత్తతలోనే వుంచుతుంది.

            అతనికి చదవటంపై ధ్యాస పెట్టలేని కాలం అది. వినటం, చూడటం, దృశ్యీకరించటం. ఇది వరుస మారి మారి వస్తూ వెళుతుండేవి.

            అయితే, ఒక ముగింపుకు వచ్చేశాడు. ఈ ముఖం తెలియని ఆర్‍.కె.వి ఎప్పుడూ ఈ ఇంటి డైనింగ్‍హాల్లో కూర్చుని వివాదాల సంకెళ్లను తెంపేసేవాడు. అది స్వేచ్ఛగా పరుగులు తీసేవి. అవి కొలిక్కి రావటానికి ముందు రాత్రి తనలో అందరినీ పొదుపుకునేది. ఇది తీరని వ్యాధిలాగా వ్యాపించింది. చెన్నైకు వచ్చి, మొదటి ఆరేడు సినిమాలలోనే తారాస్థాయికి వెళ్లిక్షణకాల ఏకాంతానికీ తపించిన ఒక వర్షాకాల రాత్రిపూట, సినిమా షూటింగ్‍ రద్దయ్యి ఇదేవిధంగా జీవించిన ఒక ఏకాంతంలోనే ఆర్‍.కె.వి యొక్క మొదటి కథను అతను చదివాడు. ఆ సంపుటిని పూర్తి చేయటానికి అతనికి యేడాది సరిపోలేదు. ఇప్పుడు వివాదాలను మొదలుపెట్టేందుకు అక్క అవసరం లేదతనికి. అతను మాత్రమే చాలు. నాన్న, అన్నా తననుండి ఎంత దూరంలో నిలబడ్డారో కొలవటానికి వీలైందీ అప్పుడే.

            అక్క ప్రతిరోజూ ఆరోజుటికి తగ్గ అగ్గిపుల్లల్ని ఈ దాచిన దానిలో నుండే వెలిగించేటట్టుంది. వదినె తన మౌనంతో వాటిని మనసులోనే అంగీకరిస్తున్నట్టుంది.

            ఈ నిదానంలో, ఉడుతల ఉత్సాహంలో, ఒక పండిన మామిడికాయ రాలిన శబ్దంలో అన్నీ అర్థమవుతున్నాయి.

            జీవితం తనను మాత్రమే ఎందుకు ప్రారంభంలోనే తారాస్థాయికి తీసుకెళ్లి దింపి, మిగతా వాళ్లందరినీ వంగి చూసేలా చేసింది? పిచ్చిపట్టి చదివిన అక్కను ఏది దాన్ని విదిలించి పడేసేలా చేసింది? విని పెరిగిన నన్ను ఏది చదవటానికి ప్రేరేపించింది? అన్నీ ఎప్పుడూ మార్పుకు లోనయ్యేవే.

            ఇప్పుడు శబ్దం చేస్తూ నవ్వటానికి వీలైంది.

            నలభై ఏళ్లుగా చూడటానికి ఇష్టపడని ఆర్‍.కె.వి. ని ఇవ్వాళ చూడాలని ఇదిగో ఈ ఎవరూలేని ఈ తరుణం అతనిని ముందుకు నెడుతున్నది. ఆయనతో మాట్లాడటానికి, విమర్శించటానికి, గొడవపడ్డానికి, ఇప్పటివరకూ అడ్డుపడ్డ కాలం పరుగులు పగిలి చెదిరిపోతున్నాయి. ఆ జ్ఞాపకాల అంతంలో టి.నగర్‍లోని జగదీశ్వరన్‍ వీథిలో కాస్త లోపలగా వున్న ఆ ఇంటి ముందు అతని రేంజ్‍ రోవర్‍ కారు ఆగింది.

            దారంతా అతని ఎన్నో హావభావాలతో వున్న పెద్ద పెద్ద బ్యానర్లు అతనిని ఇంకా పారవశ్యానికి లోను చేసింది.

            కార్లో నుండి దిగి ఆ వీధిని చూశాడు. ప్రజలు తమ తమ దినచర్యలలో మునిగిపోయి వున్నారు. ఒక్కరూ తనను గమనించలేదని కదలగానే ఎక్కణ్ణించో నలుగురైదుగురు పరుగెత్తుకొచ్చి కరచాలనం చేశారు. ఎదురింటి నుండి ఒక స్త్రీ నలిగిన చుడీదార్‍తో  ఒక ఆటోగ్రాఫ్‍ కోరుతూ నిలబడింది. అంతా ఒక్క క్షణమే. వెంటనే ఆ ఇంటికి పక్కనే వున్న మేడమెట్లపై నడుస్తున్నాడు. తన షూల శబ్దం ప్రత్యేకంగా వినిపించటం గ్రహించాడు. ఇది తానుఅన్న గొప్పతనానికి చిహ్నం. నన్ను గమనించు, నన్ను గుమిగూడుఅన్న ప్రాబల్యపు ఆహ్వానం. ఆగి తన షూలను విప్పేశాడు. ఒక్కక్షణం వాటిని అక్కణ్ణించి అలాగే విసిరేద్దామనిపించింది. అయితే వీలుకాలేదు.      

            మెట్ల పక్కగా వాటిని వేరుగా పెట్టాడు. తనవాటితో పోల్చటానికి వీలుకాని ఇరవైకి పైగా చెప్పులు అక్కడున్నాయి. వాటిని బట్టి లోపలున్న వాళ్లను అంచనా వెయ్యటానికి ప్రయత్నిస్తున్న తన అజ్ఞానానికి తనకే వాంతి వచ్చేలా అనిపించింది.

            నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించాడు. అది మేడమీద కొబ్బరాకులతో కట్టిన ఒక కొట్టం. ఒక సౌకర్యవంతమైన కుర్చీలో ఆర్‍.కె.వి కూర్చొని వుండగా ఆయనకు ఎదురుగా కొందరు కూర్చొని కనిపించారు.

            ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించాడు. ఈ వినయం తన జీవితంలోనే మొదటిసారి.

            ఆయనలోని అలక్ష్యాన్ని గమనించాడు. లేదూ తనముందు ఇప్పటివరకూ కొనసాగిన వంగొని వుండే స్థితికి ఇది మొదటిసారి వ్యతిరేకం.

            ‘‘కూర్చోండి.’’ అని ఎదురుగా వున్న ఒక పాత కుర్చీని చూపించారు.

            ఆయన ముందు వ్యాపించి వున్న మౌనంలో మాటలన్నీ కుమ్మరించి వున్నాయి. అందులో ఒక్కమాట కూడా అతనివల్ల ధైర్యంగా తాకటానికి వీలుకాలేకపోయింది. చాలాసేపటి తపన తర్వాత, ‘‘మీరెందుకు ఇప్పుడు ఏమీ రాయటం లేదు?’’ వరుసగా పేర్చిన మాటలు చెమర్చాయి.

            ‘‘రాసిందే ఎక్కువని ఇప్పుడనిపిస్తోంది.’’

            సన్నని చిరునవ్వు ఒకటి పూచేలా చేశాడు.

            ‘‘నేను మీ కథలను విని పెరిగినవాణ్ణి.’’

            ఆయన ఇప్పుడే అతణ్ణి ముఖాముఖి చూశారు. చూపులు చాలా దగ్గరగా వున్నాయి.

            ‘‘పెరిగాకే చదవటం మొదలుపెట్టాను.’’

            ‘‘ఎవరు పెరిగాక?’’

            మౌనాన్ని ఇద్దరూ ఆశ్రయించారు.

            ‘‘మీరు మీ గాయత్రిని ఒక రోల్‍మోడల్‍గా చేసి సమాజం ముందు నిలబెడుతున్నారు. అది నాకు సమంజసమనిపించటం లేదు. కేవలం  సంచలనాల కోసం కావాలనే సృష్టించారు. గాయత్రి మునుపటిలా లేదు.’’

            అతను మాట్లాడుతూ వున్నాడు. ఆయన అతనిని అధిగమించి తన చూపులతో దూరంగా వున్న ఒకరి దగ్గర ఆగారు. అతనూ ఆగకుండా ఆయన ముందు గుమ్మరించసాగాడు. చాలు అని భావించగానే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ‘‘రాసిన వాటిని గురించి మాట్లాడటమన్నది, శవం వెంట్రుకలను దువ్వటం లాంటిది. అది నాకెప్పుడూ ఇష్టం వుండదు.’’

            ‘‘మీరు రాసిన వాటికి మీరు బాధ్యులు కారా?’’

            ‘‘అది అచ్చుకుపోయిన వెంటనే నేను దాన్నుండి నన్ను ఖండించుకుంటాను. తర్వాత అది నీలాంటి పాఠకుడి బాధ్యత.’’

            ‘‘అయితే సమాజానికి సాహిత్యంపట్ల భాగస్వామ్యమెంత?’’

            ‘‘వీటికంతా సమాధానం నా దగ్గర లేదు.’’

            ఈ మాటలలో ఎన్నో ఏళ్ల విసుగుంది.

            ‘‘సరే, మీ కథలు ఒక సామాన్య మానవుణ్ణి ఏం చెయ్యగలుగుతుందని భావిస్తున్నారు?’’  

            ‘‘ఒక్క బొచ్చూ చెయ్యదని అనుకుంటున్నాను.’’ అని, తన ఎడమచేతిపై పెరిగి వాలిన వెంట్రుకలను పక్కకు తోశాడు.

            ‘‘అయితే ఎందుకు సార్‍ రాస్తున్నారు?’’

            ‘‘ఎందుకో రాస్తున్నాను. నిన్ను ఎవరు చదవమన్నారు? అంతటితో ఆగకుండా రాసినవాణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఇలా రెచ్చగొట్టటం అనాగరికం.’’

            అతను నిశ్చేష్ఠుడయ్యాడు. ఇంకా మిగిలి వున్న మాటలూ లోలోపలే అణిగారిపోయాయి.

            గాజు గ్లాసులలో అందరికీ టీ వచ్చింది. ఆయన ఒకదాన్ని తీసుకొని అతనికీ ఇవ్వమని చెయ్యి చూపించారు.

            టీ తీసుకొచ్చిన పిల్లవాడి వెనకే ఎంతో హుందాగానూ, గంభీరంగానూ వున్న ఇంకొక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు.

            ‘‘రండి బి.ఎస్‍!’’ అని ఎంతో ఆప్యాయంగా ఆయనను ఆహ్వానించి, తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇతనిని చూసి ఆయన ఒకింత కూడా ఆశ్చర్యపోయినట్టుగా అనిపించలేదు. అయితే అతను లేచి నిలబడ్డాడు.

            ‘‘ఈయన నా నలభైఏళ్ల మిత్రుడు. పేరు బి.ఎస్‍.’’

            ఆ మిత్రుడు ఎంతో హుందాగా కరచాలనం చేశాడు.

            ‘‘మీరు మాట్లాడుతూ వుండండి.’’ అని దూరంగా వున్న ఇంకో కుర్చీ దగ్గరికెళ్లాడు. జరుగుతున్నదంతా ఇంతకుమునుపు అతను చూడనటువంటివి.

            ‘‘నాకు తమిళనాడంతా రెండువేలకు పైగానే సామాజిక సేవా సంస్థలున్నాయి.’’

            ‘‘అభిమాన సంఘాలా?’’ అలక్ష్యానికి చిహ్నంగా మాటలు వెలువడ్డాయి.

            ‘‘మరో దారి లేదు. నేనూ వాటిని అలాగే స్వీకరించాల్సి వచ్చింది. అయితే వాటిని నేను వృద్ధి చెయ్యటానికీ, ఇంకా పై స్థాయికి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తున్నాను.’’

            ‘‘చెయ్యండి.’’అలక్ష్యం కొనసాగింది.

            ‘‘వాళ్లు చదువుతారా, సమాజానికి ఏదైనా చెయ్యదగినవారేనా?’’

            ‘‘ఔను!’’

            ‘‘మంచిది.’’

            ‘‘అందుకు మీ సాయం కావాలి.’’

            ‘‘నేనేం చెయ్యగలనని మీరనుకుంటున్నారు.’’

            ‘‘ఏం లేదు, ఏం లేదు. మేం నడిపే ప్రాంతీయ మహానాడులో మీరొచ్చి మాట్లాడాలి!’’

            ‘‘సారీ. ఇలా అభిమాన సంఘాలకంతా వచ్చి మాట్లాడి నా సమయాన్ని వృథా చేసుకోవటం నాకిష్టం లేదు.’’

            ‘‘లేదు. మీరు అలా పక్కన పెట్టేయకండి. అభిమాన సంఘాలంటే అంత  కేవలమైంది ఏం కాదు. అందులోనూ చదువుకున్న వాళ్లు, సృష్టికర్తలూ, డాక్టర్లు, శాస్త్రవేత్తలూ అందరూ వున్నారు.’’

            ‘‘వాళ్ల ముందు నేనేం మాట్లాడతాను. నేను ఎనిమిదో తరగతి కూడా దాటలేదు.’’

            సంభాషణలోని తీవ్రతను గట్టిగా పట్టుకొని పైకెగబ్రాకాడు.

            ‘‘మీరిలా నిరాకరిస్తే నేనెలా సార్‍ వాళ్లను పై స్థాయికి తీసుకెళ్లేది. అలాగే అక్కడే వొదిలేస్తే...’’ అని కాస్త గొంతును పెంచాడు.

            అతనే ఊహించని ఒక తరుణంలో, ‘‘వస్తాను, ఏ రోజుటికి?’’ అని అడిగారు.

            ‘‘మీరు ఎప్పుడు చెబితే ఆ రోజు.’’ అని పరవశించాడు.

            ‘‘డిసెంబర్‍ 11 భారతియార్‍ పుట్టినతేదీకి, ఏ చోట్లో?’’

            ‘‘నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను సార్‍. చాలా ధన్యవాదాలు.’’ అని చేతులు జోడించి లేచినవాణ్ణి మళ్లీ చెయ్యి చూపించి కూర్చోమని చెప్పారు.

            ఇప్పుడు అందరి చుట్టూ తిరుగుతూ వున్న ఆ పైపు(గంజాయి పైపు) మూడవసారి అతని దగ్గరకొచ్చింది. గాఢంగా ఒకసారి లోపలికి పీల్చి ఇచ్చినదాన్ని ఆనందంగా తీసుకునేందుకు రెండు చేతులు చాచి ఎదురుచూస్తున్నాయి.

            ఇతను సెలవుతీసుకున్నప్పుడు ఆ గదిలోని ఒకవ్యక్తి పాడటం మొదలుపెట్టాడు. దానికి బాక్‍గ్రౌండ్‍గా అక్కడ అలుముకున్న చిరు పొగమేఘాలు కమ్ముకుని కనిపించాయి.

            ‘ఉదయించటమూ లేదు అస్తమించటమూ లేదు ప్రకాశించే సూర్యుడు

            పెరిగేది లేదు తరిగేది లేదు పరిహసించే చంద్రుడు

            జీవితం ఒక రూపం, క్షణంలో ఎన్నో మార్పులు

            చదివిందీ లేదు, పరీక్షలూ లేవు నా జాతకం

            స్వశక్తి వుంది, ఇంకే బలమూ లేదు కవితా జీవితం

            మెట్లు దిగుతుంటే అతని పెదాలపై కవితా జీవితం...అని గొణుగుతూ వున్నాడు.

 

                                                                        () () ()

 

            అదొక ప్రవైటు పాఠశాల యొక్క విశాలమైన మైదానం. వేదిక అలంకరణలో ప్రతీచోటా ప్రత్యేక శ్రద్ధా, దృష్టీ పెట్టటం జరిగింది. అతని పదిరోజుల సినిమా చిత్రీకరణ పూర్తిగా రద్దైయింది. కొన్ని కోట్లు పక్కకు మళ్లాయి. అన్నింటిలోనూ తుది నిర్ణయం అతనిదిగానే వున్నది, వేదికమీద మూడు కుర్చీలు మాత్రమే వుండాలనేంత వరకూ.

            ఒకటి ఆయనకు, ఇంకొకటి తనకు, మూడవది సేవాసంస్థ ప్రాంతీయ అధ్యక్షునికి.

            ‘‘కారు పంపించనా సార్‍?’’

            ‘‘వద్దు. సరిగ్గా ఆరున్నరకు స్నేహితునితో కలిసి కార్లో వచ్చేస్తాను.’’

            అలాగే ఆరు ముప్పైఐదు నిమిషాలకు ఆ కారు మైదానంలోకి నిదానంగా ప్రవేశించింది.

            వేదిక పక్క నుండి పరుగుపెట్టి కారు ముందరి తలుపు తెరిచి ఆయనకు కరచాలనం చేసి, అక్కడే ఒక శాలువను కప్పి, గొప్ప కోలాహలం మధ్య ఆయనను గంభీరంగా వెంటబెట్టుకొని వచ్చాడు. వందలకొద్దీ కెమెరాలు పోటీలు పడి మెరిశాయి.

            వేదికమీద నిలబడి నమస్కరించారు. పక్కన నిలబడి అతను అందరినీ కూర్చోమన్నట్టుగా చేత్తో సైగచేశాడు. కాస్త కూడా విరామం లేకుండా అధ్యక్షుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.

            ‘‘మన కథానాయకుడు ఎంత గొప్పవారో చూడండి. ఆయనే కీర్తిప్రతిష్ఠలు తారాస్థాయిలో వున్న ఒక నటుడు. అయితే తన ఆదర్శ రచయితను మనకోసం ఆహ్వానించి ఆయన ఒక సేవకుడిలా దీనికోసం శ్రమించి...’’ మాటలు తడబడసాగాయి. ఇదివరకే విన్న హితవచనాలకు బలం చేకూరి, మొత్తం గుంపు నిశ్శబ్దాన్ని పాటించింది.

            ఈల శబ్దమైనా, అదెక్కణ్ణించి వచ్చిందో తెలిపేటంత నిశ్శబ్దం అది.

            ఆర్‍.కె.వి. తన కాలిమీద కాలు వేసుకొని ఆ కుర్చీలో వెనక్కు ఆనుకొని కూర్చొని వున్నారు. పకనే ముఖంలో ఆనందమూ, పారవశ్యమూ కలగలిసిన అతనున్నాడు.

            ‘‘కాలును తియ్యరా.’’ అని ఒక ఆవేశపూరితమైన గొంతు గుంపులో నుండి వచ్చింది.

            మాటలు తెగి పడ్డాయి. ఆదుర్దాగా లేచి అతను మైక్‍ ముందు నిలబడ్డాడు. ఆయన ఆ గొంతు వినవచ్చిన దిశగా చూస్తూ, తన చేతిని వుంచుకొని కాళ్లను దూరం పెట్టుకున్నారు. అన్నీ జరిగి పూర్తికావటానికి ఒకట్రెండు నిమిషాలు కూడా కాలేదు. ఎంతో ఆదుర్దాతో అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.

            ‘‘ఏది జరగకూడదని నేను భావించానో అదే జరిగిపోయింది. అభిమాన సంఘాలంటే అది థర్డ్ రేట్‍ మనుషుల గుంపు అని ఆయన మొండిగా రావటానికి నిరాకరించారు. నేనే ఆయనను బలవంతం పెట్టి పిలుచుకొచ్చాను. మేమంతేరా అని మీరు నిరూపించేశారు.

            అయ్యో, నేను విని, చదివి, పెరిగిన ఒక జెయింట్‍ను ఇలా అవమానించేశారు కదరా. ఇంకో ఐదు నిమిషాలలో అలా అరిచిన వ్యక్తి ఈ వేదిక మీదికి రావాలి. మీ అందరి ముందూ సార్‍ కాళ్లమీదపడి క్షమాపణ అడగాలి. అప్పుడే ఈ కార్యక్రమం కొనసాగుతుంది.’’ అని మాట్లాడుతుండగా వేదికమీద నుండి వచ్చిన చిన్న కదలికను విని వెనక్కు తిరిగాడు.

            నలిగిన తెల్ల చొక్కాతో ఒక వ్యక్తిని నేలమీద కూర్చోపెట్టి వున్నారు. పెదవి చివరన సన్నని రక్త రేఖ కనిపించింది. కొట్టినట్టున్నారు. అతని చుట్టూ ఆరేడుమంది నిలబడి వున్నారు.

            ‘‘ముందు మీరందరూ కిందికి దిగండి.’’

            ‘‘ఆయనను అవమానించిన ఆ వ్యక్తి ఇప్పుడు ఈ సభలోనే ఉన్నాడు. ఇప్పుడు మనందరి ముందూ...’’

            అతను మాట్లాడుతూ వుండగానే, కింద కూర్చొని వున్నవాడు దూకి ఆయన ముందు టీపాయ్‍మీదున్న హ్యాండ్‍మైక్‍ను తీసుకున్నాడు. అది జారి క్రిందపడింది. అనవసరంగా అతని చేతులూ మాటలూ వణికాయి.

            ‘‘ఆయన మా వాడు, ఆయన మా వాడు.’’

            మత్తులో అతను గొంతెత్తి అరిచాడు. మొత్తం సభను లోబరుచుకునేంతగా అతని గొంతు ప్రతిధ్వనించింది. అతను టీపాయ్‍మీద తలను వాల్చి, వేదిక యొక్క నేలమీద దాదాపు ఒక వలయంలా మెలి తిరిగి విచిత్రంగా కూర్చొని వున్నాడు. తన రెండు సన్నని కాళ్లను పక్కకు పెట్టుకొని వున్నాడు.

            అతను ఇంకా ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నంతలో వేదికమీద నిలబడ్డవాడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించి ఆయనకేసి తిరిగి చూశాడు. ఆయన ఎంతో స్వాభావికంగా కాలిమీద కాలు వేసుకొని మునుపటికన్నా గాంభీర్యంగా కూర్చొని వున్నారు.

                                                           

() () ()

 

 

                                                                                               

           

ఇంటర్వ్యూలు

సాహిత్యమన్నది ఒక పెద్ద కాన్వాస్ - జిల్లేళ్ళ బాలాజీ

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కథ, నవలా రచయిత, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ జిల్లేళ్ళ బాలాజీగారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీ వ్యక్తిగత జీవితం గురించి కొంచెం చెప్పండి?

శ్రీకాళహస్తిలో పుట్టానని, శనివారం పుట్టినందువల్ల మా కులదేవుడైన వేంకటేశ్వరస్వామి పేరుమీద బాలాజీ అని నాకు పేరు పెట్టారని మా తాతయ్య అప్పుడప్పుడూ చెబుతుండేవాడు. మా బంధువులందరూ తిరుత్తణిలో ఉంటారు కనుక అదే మా సొంతూరుగా భావిస్తున్నాను. మంగలి కులంలో పుట్టినందువల్ల ఆర్థిక స్తోమతలేక ఆరోజుల్లో మానాన్న ఎలాగో ఎస్సెస్సెల్సీ పూర్తిచేశాడు. ఉద్యోగం దొరక్క కులవృత్తి పై ఆధారపడి మా కుటుంబాన్ని పోషించేవాడు. చనిపోయిన వాళ్లు పోను చివరకు ఇద్దరు అక్కలూ, నేనూ మిగిలాం. అమ్మతో కలిసి మొత్తం అయిదుగుర్ని నాన్న ఒక్కడే పోషించాలంటే చాలా కష్టమయ్యేది. చివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎలాగో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు నాన్న. .

అప్పటి ఉమ్మడి తమిళనాడు రాష్ట్రం నుండి ఉద్యోగరీత్యా మేము చిత్తూరుకు మారవలసి వచ్చింది. కులవృత్తిని నమ్ముకుంటే ఎదగలేమని, మేము బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తేనే బాగా బ్రతగ్గలమని ఎంతో దూరాలోచన చేసి మా నాన్న మమ్మల్ని చదివించాడు. పెద్దక్క పి.యు.సి. వరకూ చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం సంపాదించింది. కానీ నేను మాత్రం చదువులో కొంత వెనకబడి ఉండటంతో ఎలాగో బి.కాం డిగ్రీని పూర్తిచేశాను. కానీ నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని మాత్రం సంపాదించలేకపోయాను..

ఖాళీగా ఉండటంతో గ్రంథాలయంలో గంటలు గంటలు గడిపేవాణ్ణి. ఏది పడితే అది చదివేవాణ్ణి. ఆ ప్రభావంతో నేనూ కథలు రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రాయటం మొదలు పెట్టి అడపా దడపా కథలు రాస్తుండేవాణ్ణి.

కానీ అవి జాగ్రత్తగా నాకే వెనక్కి తిరిగొచ్చేవి. 1984లో మూడు రోజుల వ్యవధిలో నా మొట్టమొదటి కథ, కవిత ప్రచురితమయ్యా యి. అప్పటినుండి ఏదో ఒకటీ అరా కధలు ప్రచురితమవుతుండేవి. నిరుద్యోగిగా అదొక్కటే నాకు ఆనందాన్నిచ్చే విషయమైంది.

బతకలేక బడిపంతులైనట్టు అన్న సామెత నా విషయంలోనూ నిజమైంది. 1993న మరోదారి తెలియక రెండువందల యాభై రూపాయల జీతానికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నా జీవితాన్ని ప్రారంభించాను. 1వ తరగతి నుండి మొదలు పెట్టి మెల్లమెల్లగా పై తరగతులకు పాఠాలు చెప్పే అవశాకం కల్పించారు. ఆ క్రమంలో నాకు బి.ఇడి. పట్టా లేకపోవటంతో కనీసం ఎమ్మే అయినా ఉంటేకానీ హైస్కూలుకు చెప్పే అవకాశం రాదని తెలుసుకున్నాను. కనుక ఎలాగైనా పిజి పూర్తి చేయాలనుకుని, కఠినమైన గ్రూపులు కాక సులభంగా ఉంటుంది కదాని ఎమ్మే తెలుగు కరస్పాండెన్స్ కోర్సులో చేరాను.

ఆ రెండేళ్లలో భాషాశాస్త్రం, వ్యాకరణంతో పాటుగా ప్రాచీన, ఆధునిక సాహిత్య సంబంధ పాఠాలు కూడా చదివే అవకాశం కలిగింది. ఆ రకంగా నాకు తెలుగుభాష పట్లా, తెలుగు సాహిత్యం పట్లా మరింత మక్కువా, ఇష్టమూ ఏర్పడ్డాయి. సాహిత్యం పై అభిరుచిని మరింత పెంచుకునేందుకు వీలు చిక్కింది.

మంచి ఉద్యోగం లేక జీవితంలో విసిగి వేసారిపోయి, ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి వివాహమే వద్దనుకున్న నేను మా నాన్న మరణానంతరం 1995లో నా 35వ ఏట వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత నా సంసారాన్ని తిరుపతికి మార్చవలసి వచ్చింది. ప్రారంభంలో ఇద్దరమూ ఉపాధ్యాయులుగా కొంతకాలం పనిచేశాం.

పిల్లలు పుట్టుకురావటంతో ఆమె గృహిణిగా ఉండిపోవలసి వచ్చింది. ప్రస్తుతం నేనొక ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ 10వ తరగతికి కూడా పాఠాలు చెప్పే అవకాశాన్ని దక్కించుకున్నాను. నాకిద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి బి.ఫార్మశీ పూర్తిచేసింది. చిన్నమ్మాయి బయో టెక్నాలజీ డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతోంది.

2.         మిమ్మల్ని ప్రభావితం చేసిన సాహిత్యం గురించి తెల్పండి?

ప్రారంభంలో ఒక పద్ధతీ పాడు లేకుండా ఏది పడితే అది చదివాను. ఏ ఒక్క గొప్ప రచయిత సాహిత్యాన్ని నేను పూర్తిగా చదవలేదు. అయితే ఆనాడు పత్రికల్లో సీరియల్స్ గా వచ్చేవాటిల్లో నేను ఇష్టపడి చదివింది మాత్రం యండమూరినీ, మల్లాదినీ! అలాగే అప్పటి వారి సమకాలీన రచయితలైన కొమ్మనాపల్లి గణపతిరావు, గండికోట బ్రహ్మాజీరావు, కొమ్మూరి వేణుగోపాలరావ్, లల్లాదేవి, మొ!! వాళ్లు ఏ సీరియల్ రాసినా అప్పటి ప్రధాన పత్రికల్లో వాటిని చదివాను.

క్రమంగా నేను రాసిన రచనలు పత్రికలలో అడపా దడపా ప్రచురితమవుతున్నప్పుడు నామిని, కేశవరెడ్డి గార్లను బాగా ఇష్టపడ్డాను. వాళ్ల రచనలు నన్ను అమితంగా ఆకర్షించాయి. వాటిని నేనొక కథా రచయితగా కాక ఒక మామూలు పాఠకుడిగానే వాళ్లను అభిమానించాను. అలాగే చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బాలభారతం వంటి పుస్తకాలు విరివిగా చదివాను. బుజ్జాయి బొమ్మల కథలంటే ఎంతిష్టమో చెప్పలేను. అలాగే రష్యన్ అనువాద కథలంటే కూడా ఇష్టంగా చదివాను. ఆ పుస్తకాలు అప్పట్లో ఎంతో నాణ్యతగా ఉండేవి. అవి నాకు చాలా ఇష్టం.

కోడూరి కౌసల్యాదేవి, ముప్పాళ రంగనాయకమ్మ, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి వంటి రచయిత్రుల నవలలు సీరియల్ గా వచ్చిన వాటిని మానాన్న బౌండుచేసి భద్రపరిచేవారు. ఆ పుస్తకాలను ఎన్ని వేలసార్లు తిరగేసి చూసుకుని చదివేవాడ్లో చెప్పలేను.

3.         ఏ పరిస్థితులు మీరు అనువాదకుడిగా మారటానికి తోడ్పడ్డాయి?

నేను తెలుగుణే. నా మాతృభాష తెలుగే. మా బంధువులందరూ తిరుత్తణిలో ఉండటం మూలాన, సెలవుల్లో చిత్తూరు నుండి తిరుత్తణికి వెళ్లి బంధువులతో గడపాల్సి వచ్చేది. అప్పుడు ఆ ఊరి వాళ్లతో తమిళంలో మాట్లాడవలసి వచ్చేది. అలా మెల్లమెల్లగా తమిళం మాట్లాడ్డం అలవాటు చేసుకున్నాను. అంతేకాక ఎస్ఎఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జయశంకర్ వంటి హీరోల సినిమాలను బాగా చూసేవాణ్ణి. దాంతో తమిళం బాగా అర్థం కాసాగింది. అలాగే దినత్తంది, దినమలర్, దినకరన్ వంటి వార్తాపత్రికలు, ఆనంద విగడన్, రాణి, కుముదం, కల్కి, కుంగుమం వంటి వారపత్రికలను లైబ్రరీకి వెళ్లినపుడు కూడి కూడి చదువుతూ అర్థం చేసుకునేవాణ్ణి.

ఒక విషయం గమనించాలి - అప్పట్లో సినిమాలు, పత్రికలు, రేడియో ఇవే మాకు కాలక్షేపాలు. ఇప్పటిలా టి.వి.లు, మొబైల్ ఫోన్లు, అంతర్జాలం, ఫేస్ బుక్కు యూట్యూబు, కంప్యూటర్లు, పార్కులు, పబ్బులు వంటివేవీ లేవు. అసలు మా ఇంట్లో టివి కూడా ఎంతోకాలం తర్వాతే వచ్చి చేరింది. అలా నేను తమిళభాషను బాగానే నేర్చుకున్నాను. నేను తమిళభాషను ఏ బక్లోనూ చదువుకోలేదు, ఏ గురువుగారి దగ్గరా తర్ఫీదు తీసుకోలేదు. అది కాలానుగుణంగా నాకు ఒంటబట్టింది. అంతే!

ఇక మా పెద్దక్క చిత్తూరులో ఉద్యోగం చేస్తున్నా, ఆమె అత్తగారిల్లు తిరుత్తణే కావటంతో ఎక్కువ రోజులు అక్కడికి వెళ్లవలసి వచ్చేది. దాంతో ఆమె తమిళ నవలల్ని బాగా చదువుతుండేది. ముఖ్యంగా డిటెక్టివ్ రచయిత రాజేష్ కుమార్ నవలల్ని భోజనం చేస్తున్నప్పుడు కూడా వదిలి పెట్టకుండా చదువుతుండేది. అలా ఆమె చదివిన డిటెక్టివ్, సస్పెన్స్ నవలల్ని మాకు చెబుతుండేది. నేను అప్పుడప్పుడే కథలు రాస్తుండటంతో నన్నూ అలాంటి కథల్ని రాయమని కోరేది. కానీ నేను ఆ ప్రయత్నం చెయ్యలేదు. ప్రారంభంలోనే నాకు అలాంటి కథల్ని రాయాలనిపించలేదు. ఆ విషయాన్ని పెడ చెవిన పెట్టాను.

కానీ మా అక్క నన్ను వదిలి పెట్టక "పోనీ ఈ నవలనే నువ్వు తెలుగులోకి రాయి...అంటూ సలహా ఇచ్చింది. సరే, ఇదేదో బాగుంది. మనం కష్టపడి ఆలోచించి రాయాల్సిన పన్లేదు, రెడీమేడ్ గా ఉన్నదాన్ని తెలుగులోకి రాస్తే సరిపోతుంది. పైగా తమిళభాష మనకు ఎటూ వచ్చు. అనుకొని మొదట ఒక డిటెక్టివ్ నవలను తెలుగులోకి అనువదించాను. అది చతురలో ప్రచురితమైంది. అలా నేను అనువాదకుడిగా మారాను. ప్రారంభంలో కొన్ని డిటెక్టివ్ నవలలు అనువదించాను.

 

4.         మీ రచనల గురించి చెప్పండి?

ముందే చెప్పానుగా 1984లో నా మొదటి కథ ప్రచురితమైందని. ప్రారంభంలో నా కథలు నాకంత గొప్ప పేరునేమీ తెచ్చి పెట్టలేదు. అవి పత్రికలలో ప్రచురితమవుతున్నాయి అంతే! ఎప్పుడైతే నేను కాపురాన్ని తిరుపతికి మార్చానో ఆ మార్పు నా రచనా సాహిత్యంపై కూడా మలుపు తిప్పిందనే చెప్పాలి. కొందరు పేరున్న స్థానిక రచయితలతో సాన్నిహిత్యం, వాళ్ల రచనలు నన్ను సీరియస్ సాహిత్యం వైపు మళ్లేలా చేశాయి. కాలక్షేపం కథలు కాక, మన జీవితానుభవాలు, మన సంఘర్షణలు, మన పోరాటం, ఇత్యాదివన్నీ కథలుగా మలిస్తే ప్రయోజనం ఉంటుందనీ, అవి నలుగురికీ చేరుతాయనీ, వాటిని గుర్తుంచుకుంటారనీ, అవి నాలుగు కాలాలపాటు నిలుస్తాయనీ గ్రహించాను.

విద్యార్థిగా ఉన్నప్పుడు మంగలి కులంలో పుట్టినందున నేనెంతో అవమానానికీ, ఆత్మన్యూనతా భావానికి గురయ్యాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగం రాక ఒక నిరుద్యోగిగా నేనెంతో సంఘర్షణను అనుభవించాను. నేనెంతో కుమిలిపోయేవాణ్ణి. అలా జీవితంలో నేను పడ్డ ఆవేదనను, వివిధ ఘట్టాలను కథలుగా మలిచే ప్రయత్నం చేశాను. కొన్ని వాస్తవాలు, కొన్ని కల్పితాలు. అయినా యథార్థ జీవిత కథలుగా రాసే ప్రయత్నం చేశాను. అలా రాసినవే సిక్కెంటిక, కొలువు, వొంతు, జ్వలనం, సజీవం, వాడు, తమ్ముడి మరణం, తోబుట్టువు, బూబూ, పంజా, రాచబాట, గుండెలేని మనిషి, ముఖాముఖం, ఆప్తహస్తం, అమ్మ డైరీ ఇత్యాది కథలు. అలా మొత్తం 200కు పైగా రాసిన డైరెక్టు కథలలో 13 కథలకు బహుమతులను కూడా అందుకున్నాను.

కథలు రాసుకుంటూ పోతున్నానే కానీ వాటిని పుస్తక రూపంలో తీసుకురాకపోతే ప్రయోజనం లేదని మిత్రులు సెలవిచ్చారు. ఒక ప్రైవేటు స్కూలు టీచరునైన నేను పాతికవేలకు పైగా ఖర్చు పెట్టి కథల సంపుటిని ఎలా తీసుకురాను? కష్టసాధ్యమైంది. ప్రారంభంలో కొంత బాలసాహిత్యం రాశాను. వాటిని విశాలాంధ్రకు పంపితే 'మాట్లాడే పక్షి' పేరుతో 2011లో ప్రచురించారు. అదే నా మొదటి కథల పుస్తకం. ఆ తర్వాత మేం ముగ్గురు స్నేహితులం కలిసి (నేనూ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రమణ్యం) భాగస్వాములై మా ముగ్గురు కథలతో 'మై 'శ్రీ' వనం' అన్న పేరుతో వినూత్నమైన ఒక కథల సంపుటిని తీసుకొచ్చాం. అయినా తృప్తి కలగలేదు నాకు. బాలసాహిత్యం కాక నా కథలతోటే ఒక పుస్తకాన్ని తేవాలని ఎంతో ప్రయత్నించి చివరకు 2013లో నా మొదటి కథల సంపుటిని (సిక్కెంటిక) అతి కష్టమ్మీద తీసుకురాగలిగాను. (దీనికి కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం(చిత్తూరు), గురజాడ కథా పురస్కారం(కడప) పొందాను). దీని తర్వాత మరో కథా సంపుటి(వొంతు) 2016లో తీసుకొచ్చాను. కాస్త మార్పుగా ఉండాలని గత సంవత్సరం నా తర్వాతి కథల సంపుటిని (ఉండు నాయనా దిష్టి తీస్తా.... హాస్య,సరసమైన కథలు) తీసుకొచ్చాను.

5.         ఇటీవల ఏ భాషల నుండి ఎక్కువ సాహిత్యం తెలుగులోకి అనువాదం అవుతున్నది?

నిజానికి అనువాదం ఒక క్లిష్టమైన ప్రక్రియ. దాన్ని అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. మొదట్లో నేను విరివిగా చేస్తున్న అనువాదాలను చూసి... "ఆ ఏముందీ, అనువాదం అంటే చూసి కాపీ కొట్టటమేగా...అన్న ఎవరివో మాటలు విన్నప్పుడు ఎంత బాధపడ్డానో చెప్పలేను! అనువాదం గురించి ఒక మహానుభావుడేమన్నాడంటే 'ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ లేషన్... ఇట్స్ ఎ ట్రాన్స్ క్రియేషన్...' ఎంత చక్కటి భావన. మూల రచయిత భావాలను పట్టుకొని రాయటం అంత సులభం కాదు. మూలభాషపై పట్టు అనువాదానికి మొదటి మెట్టు. మూల భాష రాకుండా అనువాదం చేయటం అపచారం. నాకు తమిళం వచ్చు కనుకనే నేను తమిళం నుండి రచనలను అనువదిస్తున్నాను. లేకపోయుంటే చేసేవాణ్ణి కాను.

కానీ ఇవ్వాళ ప్రపంచం నలుమూలలున్న భాషల నుండీ అనువాదం అవుతున్నది. వినటానికి బాగుంది. కానీ.... నేనొక విషయం చెబుతాను. నాకు తెలిసిన ఒక అనువాదకుడు హంగేరీ, రష్యన్, లాటిన్, కాశ్మీరీ, తుళు అంటూ వివిధ భాషల నుండి అనువాదాలు ఎడాపెడా చేసేస్తున్నాడు. ఒకసారి అతను ఎదురుపడ్డప్పుడు...అబ్బ ఎన్ని భాషలు నీకొచ్చు!అన్నాను.నాకా? వచ్చా, పాడా. ఇంగ్లీషులో నుండి చదివి రాసేస్తున్నాను.అన్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి. మూల భాషలో నుండి ఇంగ్లీషులోకి వచ్చేటప్పటికి 10 శాతం, ఇంగ్లీషు నుండి తెలుగులోకి వచ్చేసరికి మరో 10 శాతం పలచబడితే మనకందేది 80 శాతమే. అదే మూలభాష వచ్చి ఉన్నట్టయితే దాన్ని వందకు వంద శాతమూ అందించ వచ్చుగా.

ఏది ఏమైనా ప్రపంచ భాషల నుండి అనువాదాలు వస్తున్నాయి కానీ, అవి అంత ప్రయోజనం లేవన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వాళ్ల జీవన విధానాలు, పద్ధతులు, సంస్కృతీ సంప్రదాయాలు వేరు. వాటిని గురించి తెలుసుకోవచ్చును అంతే! ప్రయోజనం అంతగా ఉండదు. కానీ అదే మన భారతీయ భాషా కథల అనువాదం మనకెంతో మేలును చేస్తాయి. భారతీయ భాషల సాహిత్యం మనకు అవసరం కూడానూ.

అనువాదకుడిగా నామీద ఇతర తెలుగు రచయితల ఫిర్యాదు ఒకటుంది. అదేంటంటే 'అటు నుండి ఇటు తెలుగులోకి చేస్తున్నావు కదా, అలాగే ఇటు నుండి కూడా అటు చెయ్యి' అన్నారు. మొదట ప్రయత్నం చేశాను. కానీ అది ఎంతో పేలవంగా తయారైంది. కారణం తమిళం కాక తెలుగు నా మాతృభాష కావటం! తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు ఒక్కో పదానికి ఎన్నో పర్యాయపదాలు, సమానార్థక పదాలు ఊటలా ఉబికి వస్తాయి. కానీ ఇటు నుండి అటు తమిళంలోకి రాయాలనుకున్నప్పుడు నేను తమిళ పదాలకోసం బాగా తడుముకోవలసి వచ్చేది. అందిన పదాలు వాడినప్పుడు అవి పేలవమైన రచనగా బయటికొచ్చేది. పైగా నేను తమిళం విని అర్థంచేసుకోగలను, మాట్లాడగలను, చదవగలను కానీ లిపి అంత బాగా రాయలేను. ఈ కారణాలచేత నేను తెలుగునుండి తమిళంలోకి అనువాదం చెయ్యకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. వాళ్లు నా మీద కినుక వహించటానికి అదే అసలు కారణం. అంతెందుకు నా కథల్ని నేనే తమిళంలోకి తీసుకెళ్లలేదుగా. అది నాకు తెలియని పని. దాన్ని మరొకరు చెయ్యాల్సిందే. నా పని తమిళం నుండి తెలుగులోకి అనువదించటమే!

నాకు తెలిసీ ఇంగ్లీషు భాష నుండే ఎక్కువమంది తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆ తర్వాత హిందీనే! దక్షిణాది భాషలు తీసుకున్నట్టయితే కన్నడ భాషా సాహిత్యం తర్వాతే తమిళ భాషా సాహిత్యం తెలుగులోకి వస్తోందని అనుకుంటున్నాను.

6.         ఇటీవల తెలుగు నుండి ఇతర భాషలలోకి అనువాదం అయ్యే సాహిత్యం ఏ మేరకు ఉంది?

ఈ విషయంలో చాలా చాలా తక్కువనే చెప్పాలి. అసలు ఈ ప్రక్రియను ఎవరు చేపట్టాలి. ప్రభుత్వమా? సాహిత్య సంస్థలా? అకాడెమీలా? పత్రికలా? సాహిత్యా భిమానులా? ఎవరు? ఎవరు మటుకు వాళ్లు ఇతరులు చేస్తారులే అని మిన్నకుండిపోతున్నారు. అసలు ఈ విషయంలో ఒక విజన్ అంటూ ఉన్నదా అన్నది కూడా అనుమానమే. ముందుగా మన విలువైన సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చెయ్యించాలి. అటు తర్వాత దాన్ని వివిధ భాషల్లోకి ఆయా భాషల అనువాదకుల చేత రాయించే ప్రయత్నం జరగాలి. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఖర్చుతో కూడుకున్నది. అనువాదకులను ప్రోత్సహించాలి. వాళ్లకు చక్కటి పారితోషికం ఇచ్చి రాయించే ప్రయత్నం జరగాలి. డబ్బుతో ముడిపడ్డ వ్యవహారం కనుక ప్రభుత్వం అకాడెమీల ద్వారా చేయించాలి. ప్రస్తుతం మన ప్రభుత్వాలు సాహిత్యం పై అంతటి శ్రద్ధాసక్తుల్ని కనబరిచే పరిస్థితుల్లో లేవు. భవిష్యత్తులో చేస్తాయని ఆశిద్దాం.

ఎప్పుడైతే మన తెలుగు సాహిత్యం ఇంగ్లీషులోకి తర్జుమా అవుతుందో అప్పుడది అంతర్జాతీయ భాషల్లోకి వెళ్లే మార్గమూ సుగమమవుతుంది. ప్రాంతీయ భాషల్లోనూ వచ్చే అవకాశం ఉంది.

7.         ద్రావిడ విశ్వవిద్యాలయం అనువాద సాహిత్య రంగంలో చేస్తున్న కృషిని ఎలా చూడాలి?

ప్రస్తుతం ఆ విశ్వవిద్యాలయం అనువాద సాహిత్య రంగంలో ఏం చేస్తోందో నాకు తెలియదు. తెలియని విషయాలు మాట్లాడ్డం తప్పు. కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం.

కానీ ఆ విషయంలో కొంతలో కొంత సాహిత్య అకాడెమీ చేస్తున్న సేవలు మేలనిపిస్తోంది. సాహిత్య అకాడమీ 2018లో మూడు రోజులపాటు సేలంలో అనువాదం పై ఒక వ షాపు ఏరాటుచేసింది. ముఖ్యంగా తమిళమూ, తెలుగులో అనువాదం చేస్తున్న ఒక పదిమంది అనువాదకులను పిలిపించి వాళ్లచేత తమిళంలోనుండి అలాగే తెలుగులో నుండి కొన్ని గొప్ప కథలను అనువదింపచేసే కార్యక్రమం చేపట్టింది. అందులో నేనూ పాల్గొన్నాను. ఆ మూడు రోజుల్లో ఒక్కొక్కరు 5 కథలను అనువదించాం. ఎంతో ఉపయోగకరమైన వర్క్ షాప్ అది. అందుకు సేలంలోని పెరియార్ యూనివర్సిటీ ఎంతగానో సహకరించింది. ముఖ్యంగా తమిళ డిపార్టుమెంటు మా కందించిన తోడ్పాటు జీవితాంతం మరువలేనిది.

8.         అనువాద సాహిత్యం గతంతో పోలిస్తే ఏ విధంగా ఉంది?

ఏం చెప్పమంటారు? అసలు అనువాద సాహిత్యాన్ని ఎవరు ప్రోత్సహించాలి? ముందుగా పత్రికలు. ఔనా! మరి అన్ని పత్రికలూ అనువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయా? తెలుగులో టాప్ త్రీలో ఉన్న మేగజైన్లను ఒకసారి గమనించండి. అందులో అనువాద రచనలు ఎన్నుంటాయి? మీకస్సలు కనిపించదు. ఎందుకో వాళ్లకు అనువాదాలంటే చీదర. తేళ్లు జెర్రులూ పాకుతున్నట్టు ఉంటాయేమో? ఏదో చతుర, విపుల లాంటి మేగజైన్ల వల్ల నాలాంటివాళ్లు ఇంకా అనువాదాలు చేస్తున్నాము కానీ, లేకపోతే ఏనాడో మానేసేవాళ్లం. అసలు అనువాదకులు ఎక్కడున్నారండీ. చాలామటుకు తగ్గిపోయారు. ఇంగ్లీషులో నుండి అనువదించేవాళ్లను పక్కన పెట్టండి, ప్రాంతీయ భాషల్లోనుండి అనువదించేవాళ్లు ఎంతమంది ఉన్నారో చూడండి. ఉన్న ఒకళ్లిద్దరు అనువాదకులనైనా ఉపయోగించుకుంటేగా! అసలు ఎక్కడ చావుదెబ్బ తీస్తున్నారంటే, ఎంతో కష్టపడి అనువదించిన రచనలను వారపత్రికల్లో వెయ్యరు. దినపత్రికలే గతి. అదీ ఒకటో రెండో ఉన్నాయి, అంతే!

9.         ప్రస్తుతం అనువాద సాహిత్యానికి కాలం చెల్లిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మీరు ఏమనుకుంటున్నారు?

అంతేగా మరి! అనువాదమే కాదు, అసలు డైరెక్టుగా రాసిన కథా, నవలా సాహిత్యాన్ని మాత్రం ఏ అందలం ఎక్కిస్తున్నారనీ. వాటి పరిస్థితీ అంతే! ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఎన్ని పత్రికలు ఉండేవండి. అన్ని పత్రికలనూ చదివేవాళ్లం. మాకు ఇంకే కాలక్షేపాలూ లేవు. పుస్తక పఠనమే నన్ను రచయితను చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

ఇప్పుడు... మొబైళ్లు అందుబాటులోకి వచ్చాక ఈ కాలం యువతరానికి అసలు ఆ అలవాటు ఏర్పడిందా? ఎంత సేపూ అంతర్జాలాలు, యూట్యూబులు, ఫేస్ బుక్కులూ, వీడియోలు, చాటింగ్లూ ఇలాంటివి ఏడిస్తే ఇంకెక్కడినించి పఠనానికి అవకాశం ఉంటుంది చెప్పండి. ప్రభుత్వాలు బలవంతంగానైనా వీటిని నియత్రించిన నాడే యువతరం పుస్తకాలకు అలవాటు పడతారు. లేదంటే ఇంతే! ఇంటర్నెట్ లో ఫ్రీగా పుస్తకాలు దొరుకుతాయంట. మొబైళ్లలో డౌన్ లోడ్ చేసుకుని చదువుకోవచ్చట. యువతరమంతా అలాగే చదువుకుంటున్నారట. ఏంటండీ ఇది? పుస్తకం హస్త భూషణం. హాయిగా కుర్చీలో కూర్చునో, ఈజీ చైర్లో వాలో, బోర్లాపడుకునో పుస్తకాన్ని చదువుతుంటే వచ్చే ఆనందం ముందు ఇవి ఎంత?

ఏదైనా చదివే పాఠకులు ఉంటేనేనండీ సాహిత్యం బ్రతకటం. రాసీ రాసీ అచ్చేసి ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం?

10.       రాయలసీమ సాహిత్య ప్రత్యేకత ఏమిటి?

ఇదో పెద్ద టాపిక్. దీనిమీద ఒక పెద్ద గ్రంధం రాయొచ్చు. సరే, అసలు రాయలసీమ అంటేనే సాగునీరు, తాగునీరు, దుర్భిక్షం, ముఠా కక్షలు, ఆత్మహత్యలు, హత్యా రాజకీయాలు, వలసలు, వివక్షలు మొదలైనవన్నీ మన కళ్లముందు కదలాడుతాయి. ఈ ప్రాంతంలోని రచయితలకు చేదు అనుభవాలు, విషాద దృశ్యాలు తప్పనిసరి. ఇవే ఈ ప్రాంత కథలకు ముడిసరుకులు. అందుకే ఇతర ప్రాంత ప్రజలకు ఇక్కడి కథలు బరువుగానూ, బాధగానూ, వేదనగానూ కనిపిస్తాయి.ఈ ప్రాంత కథా రచయితలలో ఆద్యుడిగా చెప్పబడే కె.సభా రచనల్లో సామాన్య ప్రజలే కనిపిస్తారు. వాళ్ల కష్టాలు కన్నీళ్లు, అలాగే సన్నకారు రైతుల వ్యధలు వేదనలు ఆయన కథల నిండా కనిపిస్తాయి.

రాయలసీమకే ఒక గుర్తింపు తెచ్చిన రచయిత మధురాంతకం రాజారాం. ఈయన కథల నిండుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాల కోపతాపాలు, ఆశ నిరాశలు, అసూయాద్వేషాలు, ఆదర్శాలు, త్యాగాలు ఇవన్నీ విభిన్న కోణాలలో చూపించటం జరిగింది. ఇక ప్రాంతీయ జీవిత చిత్రణకు పెద్దపీట వేసిన రచయిత కేతు విశ్వనాధరెడ్డి. ఈయన రచనల్లో స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన రాయలసీమ పరిణామాలు, జీవితాలు అద్దం పడతాయి. అలాగే సింగమనేని నారాయణ రైతు జీవితాలను తన కథల నిండుగా చెప్పారు. మన కళ్లముందరే ఛిద్రమైపోయే పల్లెలు గ్రామ ప్రజల ఆవేదనలను చూపించారు. వీరేకాక పులికంటి కృష్ణారెడ్డి రాయలసీమ మాండలికాన్ని సొగసుగా కథల్లో పొందుపరిచిన రచయిత. అలాగే కలువకొలను సదానంద, రాసాని, స్వామి, దేవపుత్ర, మధురాంతకం నరేంద్ర, శాంతినారాయణ, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, గోపిని కరుణాకర్, పలమనేరు బాలాజీ, సుంకోజి దేవేంద్రాచారి వంటి కథకుల కథల్లో రాయలసీమ వాసన గుభాళిస్తుంటుంది.

ఇక కథలుకాని కథలు రాసినా అందులోనూ రాయలసీమ ప్రాంత జీవితాలను అద్భుతంగా మలిచినవారు ఇద్దరున్నారు. ఒకరు పెన్నేటి కథలు రాసిన పి.రామకృష్ణారెడ్డి గారైతే మరొకరు పచ్చనాకు సాక్షిగా, మిట్టూరోడి కతల రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాయలసీమ ప్రత్యేకత చేదబావి చేంతాడంత ఉంటుంది.

11.       మీ సాహిత్య వ్యక్తిత్వము రూపుదిద్దుకున్న విధానాన్ని వివరించండి?

చిన్నప్పుడు మా నాన్న ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి వంటి పత్రికలను ఇంటికే వేయించుకునేవారు. వాటిని మా అక్కలు, నేను తలా ఒక పుస్తకాన్ని చేత పట్టుకొని ఒక్కో చోట కూర్చుని చదువుకునేవాళ్లం. అంతేకాక వాటిలో వచ్చే సీరియళ్లను బౌండు చేయించి భద్రపరిచేవాడు నాన్న. ఆయన చనిపోయాక ఆ అలవాటు నాకొచ్చింది. నేను కొనసాగించాను. అలా పుస్తక పఠనం అన్నది మా కుటుంబంలో ఒక అలవాటుగా మారిపోయింది.

దాని ప్రభావమేమో నేను డిగ్రీలో ఉండగా నాకూ కథలు రాయాలన్న బుద్ధి పుట్టింది. అడపాదడపా రాస్తూ వచ్చాను. కానీ నామిని గారి పచ్చనాకు సాక్షిగా, మిట్టూరోడి కతలు, సిన్నబ్బ కతలు పత్రికలో సీరియల్ గా వస్తున్న రోజుల్లో వాటిని నేను మా కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని చదివి వినిపించినపుడు నేను పొందిన అనుభూతి, ఆనందం అపారం. అలాగే కేశవరెడ్డి గారి అతడు అడివిని జయించాడు, చివరి గుడిసె, సిటీ బ్యూటిఫుల్, రాముడుండాడు రాజ్యం ఉండాది వంటి నవలలు చదివాక కథలను సీరియస్ గా రాయాలన్న దృక్పథం కలిగింది. అంతేకాక స్థానిక రచయితల సాన్నిహిత్యం నన్ను పదును పెట్టాయని అనుకుంటున్నాను.

దాని ప్రభావంతో అనుకుంటా 'సజీవం' అన్న కథ నుండి జీవితపు లోతుల్ని తడమటం మొదలు పెట్టాను. ఆ కథకు ఈనాడు బహుమతిని కూడా ఇచ్చింది. ఆ వరుసలోనే 'సిక్కెంటిక' కథను రాస్తే- వందేళ్ళ మన తెలుగు సాహిత్యంలో తల వెంట్రుకలపైన రాసిన మొదటి కథ అని ప్రశంసించారు. ఆ కథకూ బహుమతి వచ్చింది. అలాగే 'కొలువు, వొంతు, కథలను నేను మాత్రమే రాయగలనని చెప్పారు. కావచ్చు, ఎందుకంటే ఆ జీవితాన్ని అనుభవించిన వాణ్ణి కనుక. అలాగే రాచబాట, జ్వలనం, వాడు, తమ్ముడి మరణం, అమ్మడైరీ, బూబూ, ఆప్తహస్తం వంటి ఎన్నో కథలు నాకు పేరును తెచ్చిపెట్టాయి.

ఇక అనువాదంలోనూ మార్పు చేశాను. ప్రారంభంలో కొన్ని డిటెక్టివ్ నవలల్ని అనువదించిన నేను, మిత్రులు మధురాంతకం నరేంద్రగారి సలహాతో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ జయకాంతన్ నవలను అనువదించే అవకాశం కలిగింది. నేను మొదట అనువదించిన ఆయన నవల 'కల్యాణి వెడ్స్ దివాకర్' పేరుతో ఆంధ్రజ్యోతి డైలీలో సీరియల్ గా రావటమే కాక, అది నాకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని సైతం అందుకునేలా చేసింది. అప్పుడు ఆయన నవలల్ని మరింత విరివిగా చదవసాగాను. ఆయన నవలల్లోని మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలు, మానవీయత ఉట్టి పడే కథలు, మనిషి మనిషిగా బ్రతకగలిగే కథనాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆలోచింపచేశాయి. వాటిని అనువదించే క్రమంలో ఇప్పటివరకూ నేను 'ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం, ఎదురు చూపులు, గతించిన కాలాలు, ప్యారిస్కు పో, గంగ ఎక్కడికెళుతోంది' మొదలైన నవలల్ని తర్జుమా చేశాను. ఆయన నవలలు నన్ను పూర్తిగా మార్చివేశాయి. ఏ రచన చేసినా గాఢంగా, లోతుగా, ఆలోచనాత్మకంగా రాయాలన్న పాఠాన్ని నేర్పాయి.

అలా నేను ఇప్పటి వరకూ మొత్తం వంద రచనలకు పైగా తెలుగులోకి అనువదించాను. అవన్నీ కూడా నన్ను ఒక చక్కటి అనువాద రచయితగా గుర్తింపు తెచ్చుకోవటానికి ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను.

12.       సాహిత్యంలో భావజాలాలకు స్థానం ఉంటుందా? విభిన్న భావజాలాలు అనువాద సాహిత్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి?

సాహిత్యమన్నది ఒక పెద్ద కాన్వాస్. దేన్నైనా మనం చిత్రీకరించుకోవచ్చు. మంచినైనా సరే, చెడునైనా సరే! ఒక ఆలోచనను, ఐడియాలజీని, భావజాలాన్ని కథ ద్వారా వ్యక్తీకరిస్తున్నప్పుడు అది అందరికీ ఆంగీకారయోగ్యం కావాలన్న రూలేమీ లేదు. ఎవరైతే సదరు భావజాలానికి స్పందిస్తారో, ఇష్టపడతారో, ఆకర్షితులవుతారో వాళ్లు ఆ భావజాలాన్ని చదువుతారు, అనుసరిస్తారు. తక్కినవాళ్లు దాన్ని ఇష్టపడక వదిలేస్తారు. ఇది సర్వసాధారణం. అంతమాత్రాన సాహిత్యంలో అలాంటి వాటికి స్థానం ఉండకూడదు అని ఎవరైనా అన్నారంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. కనీసం ఇలాంటి భావజాలం ఒకటుంది, ఇది అంగీకారమూ అనుసరణీయమూ కాదు అని చెప్పటానికైనా అది ఉండాలిగా. కాకపోతే అలాంటి భావజాలాలు సాహిత్యంలో ఏ స్థానాన్ని ఆక్రమిస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. వాటికి అసలు సాహిత్యంలో స్థానం ఉంటుందో ఉండదో కూడా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. మొదట భావజాలంగా ప్రారంభమయ్యేవి చివరకు వాదాలుగా కూడా పరిణామం చెందవచ్చు. మరి ఇవ్వాళ సాహిత్యంలో అనేక వాదాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయిగా. దీన్నేమనాలి? కనుక ఎవరి భావజాలం వాళ్లది. ఎవరి వాదాలు వాళ్లవి. ఈ విషయంలో అనువాదానికి మినహాయింపు ఏమీ లేదు. ఎవరికి ఇష్టమైనవి వాళ్లు అనువదిస్తారు. అంతే!

13.       అనువాద సాహిత్యానికి సంబంధించి సాహిత్య సంస్థల, పాలక వర్గాల కర్తవ్యం ఏమిటి?

ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్లు చెబితేనే బాగుంటుంది. ఇంకొకళ్లు చెబితే బాగుండదేమో? ఈ విషయంలో నా ఆలోచనను మాత్రం చెబుతాను. ఎందుకోగానీ మనం మొదటినుండి- సాహిత్యం నుండి అనువాద సాహిత్యాన్ని వేరుచేసి చూస్తున్నాం. అది అంత మంచిది కాదు. ఏదైనా సాహిత్యమే. దానిపట్ల చిన్నచూపు అవసరం లేదు. ఒక్కసారి మన తెలుగు సాహిత్యం ప్రారంభాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మనం పంచమ వేదంగా పిలుచుకుంటున్న మహాభారత రచనను 'ఆంద్రీకరణం' అని చెప్పుకున్నాం కదా. అంటే అది స్వేచ్ఛానువాదం కాదా? అందులో అనువాదం లేదా? మహాభారత రచనలోనే అనువాదం మిళితమై ఉన్నప్పుడు... ఇప్పుడు దాన్ని వేరుగా చూడ్డమెందుకు?

మీ ప్రశ్నలో- 'అసలు సాహిత్యానికి' ఏ ఇబ్బందీ లేదనీ, అనువాద సాహిత్యానికే ప్రమాదం వచ్చి పడిందన్న ధ్వని వినిపిస్తోంది. చూడండీ, అసలు సాహిత్యానికి మాత్రం ఆదరణ, ప్రోత్సాహం ఎక్కడుందండీ? అదీ అంతంత మాత్రమేగా. కనుక ముందు అసలు సాహిత్యానికి విలువ పెరిగే విధంగా సాహిత్య సంస్థలు కృషి చేసినపుడు మన తెలుగు సాహిత్యం మరింత వెల్లివిరుస్తుంది. నిష్పక్షపాతమైన సాహిత్య సంస్థల కృషికి పాలక వర్గాలు ఎప్పుడూ బాసటగా నిలుస్తాయని నేను భావిస్తున్నాను.

14.       ప్రస్తుతం తెలుగు సాహిత్యాన్ని ఒక అనువాదకుడిగా ఎలా చూస్తున్నారు?

ఏమీ చెయ్యలేనివాడిగా, చేతకానివాడిగా చూస్తున్నాను. తమిళ సాహిత్యాన్ని నేను ఎలాగైతే తెలుగులోకి అనువాదం చెయ్యాలని తహతహలాడుతున్నానో, తపిస్తున్నానో అలా మన సాహిత్యాన్ని కూడా ఎవరైనా ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే ఎంతో బావుణ్ణని కలలు కంటున్నాను. నిజానికి నాకూ తమిళ రచయితలెవరూ ఏ సాయమూ చెయ్యటం లేదు. నాకు తెలిసిన తమిళ రచయితలను 'తమిళం నుండి తెలుగు భాషలోకి వెళ్లవలసిన సాహిత్యం గురించి తెలియజేయండి, కథలైనా సరే నవలలైనా సరే...అని అడిగితే ఒక్కరూ చెప్పనంటారు. పైగా వాళ్ల కథలనే అనువదించమని అడుగుతారు. వాళ్లవైనా అన్నీ చదివి ఏది బావుంటుందో నిర్ణయించుకోవటానికి సమయం పడుతుంది కదా. అందుకని వాళ్ల రచనల్లోనే బాగుండే వాటిని సూచించండి అన్నా ఆ పనీ చెయ్యనంటారు. ఎందుకో ఈ విషయంలో వాళ్లు ఇలా ఉన్నారు.

అందుకే ఎవరైనా ప్రముఖులు ఏదైనా రచనను సూచిస్తేనే దాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను. అలా ఒక తమిళ పత్రికాధిపతి సూచించిన 'యామం' అన్న ఒక గొప్ప పెద్దనవలను తెలుగులోకి అనువదించాను. కానీ దాని ప్రచురణకు ఎన్నిఅవస్తలు పడాలో అన్నీ పడ్డాను. చివరకు అది 2014లో చతురలో ప్రచురితమయ్యింది కానీ దాన్ని బాగా కుదించి ప్రచురించటం జరిగింది. పూర్తి నవలను పుస్తకంగా తీసుకురావాలని ఆనాటి నుండి ప్రయత్నిస్తున్నా వీలుకాలేదు. చివరకు ఆ తమిళ రచయితే దాన్ని కొద్ది కాపీలు ప్రచురించి మద్రాసులో తన పుస్తకాలతో పాటు దీన్ని ఆవిష్కరించి, నన్ను సత్కరించటం జరిగింది. ఆ పత్రికాధిపతే సూచించిన కొన్ని తమిళ దళిత కథలతో ఒక పుస్తకం త్వరలో నవచేతన వాళ్లు తీసుకురానున్నారు.

ఇక నేను రెండు భాషల రచనలనూ చదవుతుండటం చేత ప్రస్తుతం మన తెలుగు కథల స్థాయి కొంత తగ్గినట్టుగా అనిపిస్తున్నది. విభిన్న అంశాలమీద తమిళంలో ఎన్నో రకాల ప్రయోగాలతో కథలు రాస్తున్నారు. ప్రశంసలు అందుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితిలోనే మన తెలుగులోని ఆణిముత్యాలవంటి సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను.

15.       యువతరం అనువాద సాహిత్యం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణాలను ఎలా చూడాలి? అనువాద రంగంలోకి యువతరాన్ని ఆకర్షించాలంటే ఏం చెయ్యాలంటారు?

నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. మా తర్వాత ఎవరు? అసలు యువతరం కథలు రాయటానికి ఉత్సాహం చూపిస్తేగా. కథా రచనకే ముందుకు రానివాళ్లు ఇక అనువాదం వైపు మొగ్గుచూపిస్తారా? ఎంతసేపూ అంతర్జాలంలో మునిగి తేలుతుంటే ఇక కథాసృజనకు, సాహిత్య సృష్టికీ ఎక్కడ అవకాశం.

అందుకే కథా సృజనపై యువతరానికి, ముఖ్యంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు కార్యశాలలు నిర్వహించాలి. కొత్త తరాన్ని వీలైనంతగా ప్రోత్సహించాలి. మేము ప్రారంభంలో ఎలాగైతే కాస్త పేలవంగా ఉన్న కథలు రాసినా పత్రికలు ప్రచురించాయో అలాగే ఈనాటి యువతరాన్ని కూడా పత్రికలు ప్రోత్సహించాలి. అంతేకాదు, పత్రికలు తమ బాధ్యతలను, పద్ధతులను చక్కగా నిర్వహించాలి. కథలు పంపితే వీలైనంత త్వరలో ఏ విషయమూ వ్యక్తిగతంగా తెలపాలి. రచన ప్రచురితమైతే కాంప్లిమెంటరీ కాపీ పంపాలి. పారితోషికాన్ని కాలానుగుణంగా తప్పనిసరిగా ఇవ్వాలి. కొత్త పత్రికలు రావాలి. పాఠకులు పెరగాలి. మన సాహిత్యం విస్తరించాలి. పదికాలాల పాటు నిలబడాలి.

ఇదే నా వాంఛ, ఆకాంక్ష!!

 

 

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు