అబ్బా.. ఏం ఉక్కపోత!!.. ఎండలు ముదిరాయి కదా..ఈ రోజు మధ్యాహ్నం కరెంట్ పోయె సరికి ఇంట్లో ఒక్కటే ఉక్కపోత ..అది భరించలేకే.. అరుగు మీద కూర్చుని అలసట తీర్చుకుందామని అలా బయటకొచ్చాను.
అప్పుడే ఇంటి ముందు నుండి రోడ్డు మీద ఒక ముసలాయన(వరసకు తాత) వెళ్తున్నాడు.. పాపం వయస్సు మీద పడినట్టుంది.. మనిషి ఎముకల గూడులాగా అయిపోయాడు..
వరుసకు మనవన్ని కదా.. ఎప్పుడూ నాతో సరదాగా ఉండే తాతతో.. జోక్ గా..
"ఏం తాత ఎండలో కూడా అంత ఉసారుగా దమాంచి నడుస్తున్నావ్ ఏం సంగతి" అన్నాను.
“ఏం ఉసారొయ్ పిలగా.. ఈ ఎండల మీద దుబ్బపోయ మా దండిగా కొడుతున్నాయ్. పానం ఈ ఎండాకాలం లోనే పోయ్యేలా ఉన్నది..”అన్నాడు.
“గట్లంటవెందే.. మీలాంటి అనుభవం కల్లోల్లు ఈ సమాజానికి చాలా అవసరం. మీరు ఇంకా సాన ఏళ్లు బతకాలి.”
“ ఏం బతుకుడో ఏమో బిడ్డా.. గప్పుడు మీలా అయిసుల ఉన్నప్పుడు వొళ్ళు తెలవకుండా పనిచేసినం.. పనికి.. పొద్దున చీకటి పోకముందే పోయి మల్లా చీకటి పడ్డంక వచ్చేది. కనీసం కూడు కూడా సక్కగా దొరికేది కాదు.. తిని తినక.. నీళ్ళు తాగి చేసినం బిడ్డా.. గప్పుడు పనులు అలా చేసినందుకే మళ్లీ ఇప్పుడు మా మీదకు అవి తిరగపడ్డట్టు మమ్మల్ని సేతకాకుండా చేస్తున్నాయి.. ఒళ్లంతా నొప్పులే.. ఇంకా మా దగ్గర ఏముంది బిడ్డా.. డొక్కల్లో ఇసుమంత పానం లేదు.. ఆయింత ఉన్న ఊపిరి ఇడిస్తే.. ఈ భూదేవికి ఇంత బరువన్నా తగ్గుతుంది..” అని ఆయాస పడుతూ చెప్పేసరికి..
నేను “అయ్యో!..చాలా బాదేస్తుందే నీ కష్టాలు ఇంటాంటే .. గిప్పటి మా తరానికి గివ్వన్నీ తెళ్వకపాయే.. సెల్లుల్లో తలకాయలు పెట్టీ ప్రపంచాన్నే మరిచిపోతాండ్లు ..అదే గ్యానం అనుకుంటాల్లు..” అన్నాను.
“ అవును బిడ్డా!.. గిప్పుడున్న అసువంటి తరాన్ని నా ఇన్ని తరాల అనుభవం లో ఎప్పుడూ చూడలే.. పాడుకాలం.. స్వార్థం బాగా పెరిగింది. మనిషి ప్రకృతి కలిసిమెలిసి ఉండాలే..కానీ ఇప్పటి మనుషులేమో ప్రకృతి మీద పెత్తనం చేయబట్టే.. ఇగ గీ గత్తరలు రాకుంటే ఏం చేస్తాయ్” అన్నాడు.
వెంటనే నేను “నీకున్న సోయి(ఆలోచన) ఈ జనాలకి ఉంటే.. మానవుడు.. సూర్యుడు, చంద్రుడు ఉన్నన్ని రోజులూ ఉంటాడు.. కానీ మనిషి తన స్వార్థ చర్యలతో మధ్యలోనే మానవ జాతిని అంతమొందించేలా ఉన్నాడు తాతా.. 'అవ్ సరేగాని.. గా time లో గీ ట్రాక్టర్ లు లాంటి యంత్రాలు ఏం లేవానే" అన్నాను.
“ ఏం లేవు బిడ్డా.. బండ్లు ఉన్నా అవి కొందరికే ఉండేవి.. మా వీపులే అప్పుడు ట్రాక్టర్లు..ఎన్ని కుంచాల బరువున్న ఎత్తిన దానిని దించకుండా ఎంత దూరమైనా మోసేటోల్లం.. అప్పుడు అట్లా చేసినం గనుకే ఇగో గిప్పుడు చేతిలోకి మూడో కాలు వచ్చింది” అని, తాత తన చేతిలోని ' చేతికర్ర' చూపుతూ చెప్పాడు .
“ ఏమోనే తాతా.. నువ్ ఇంకా కాలాడిస్తున్నావ్ కానీ.. మీ అంత వయస్సు వచ్చేసరికి మేము బతుకుతమో సత్తమో .. అది సరే తాతా.. గింతిదివరకు నేను అడిగిన దానికి సమాధానంమే సెప్పలేదుగా” అన్నాను నేను.
“ఏం అడిగావొయ్ తాతా... నాకు గ్యాపకం లేదు” అన్నాడు తాత.
“అదేనే.. మా ఇంట్లున్నోల్లకే సళ్ళ సేమటలోస్తుంటే.. ఈ ఎండల పడి ఏడికోతున్నావ్..”అన్నాను నేను.
“గా పించనిత్తాండ్లు అంటే పోతాన బిడ్డా.... దిక్కులేనోల్లకు దేవుడే దిక్కు అంటారు.. కెసిఆర్ కొడుకు సళ్లగుండ.. ఇంట్లో పెద్దకొడుకు వోలె మా సేతగాని ముసులోల్లకు కాళ్ళు, చేతులు లేనోల్లను పైసలు ఇచ్చి ఆదుకోబట్టే.. లేకుంటే మమ్మల్ని ఇండ్లల్ల కొడుకులు గొర సేత్తున్నారా బిడ్డా... చిన్నప్పుడు ఎంత గావురంగ పెంచినం ఇప్పడు గంజికి లెక్క కాక పోతిమి..” అని చెప్పుకుంటూ తాత గుడ్ల నిండా నీళ్లు తీసిండు..
" తాతను అలా చూసే సరిగి.. బాధేసింది. కొంచం ఉషారు చేద్దాం అని"
“మరి నీ పెద్ద కొడుకు 2016 రూపాయలు ఇచ్చినాక మనం పుల్ దావత్ చేసుకుందాం.. ఓకేనా..” అని నవ్వాను నేను.
తాత నా నవ్వును హేళన చేస్తున్నట్టు.. ఆశ్చర్యంగా “2016 కాదు బిడ్డా.. 2000 రూపాయలే” అన్నాడు.
నేను ఇంకా ఆశ్చర్యంతో.. “అదెంది తాతా.. నీకు 2016 ఇవ్వడం లేదా..?” అని ఇంకా ఏదో చెప్తుండగానే తాత మధ్యలోనే కల్పించుకొని “నాకే కాదు బిడ్డా.. ఎవరికి ఇవ్వట్లేదు.. అవి, అంతే వస్తాయి 2000” అని అన్నాడు అమాయకంగా..
“అరె తాతా!!.. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ ఆసరా(పింఛను)లో అసలు ఇచ్చి కొసరు తింటున్నారు” అన్నాను.
“ఏమో.. బిడ్డా.. ఇప్పుడు అన్నీ కమిషన్లే నాయే.. బయట ఏ టి ఎం లో డబ్బులు విడిపిస్తే వెయ్యికి పది రూపాయలు తీసుకుంటరట కదా.. గట్లనే వెయ్యి రూపాయల పింఛనప్పుడు ఈల్లు కూడా అప్పుడు 10 రూపాయలు ఇస్తేనే వెయ్యి ఇచ్చేది.. ఇప్పుడు 2016 అంటున్నావ్ కదా.. ఆ పై పైసలు కమిషన్ గా తీసుకుంటున్నారు కావచ్చు.. అయినా వాళ్ళు బతకాలి కదానోయ్” తాత అన్నాడు మళ్లీ అమాయకంగా.. అందరూ మంచిగా బతకాలనే ఫిలాసఫీ తో బతికే తాత..
“అరె!!..అన్నీ తెల్సిన నువ్ కూడా ఏంది తాతా.. గవర్నమెంట్ నుండి వాళ్ళు మంచి జీతాలు తీసుకుంటున్నరు.. అయినా సంపాదించుకొనుటకు వాళ్లకు మస్తు దారులు ఉండగా.. మీ లాంటి మూసులోల్లు, కాళ్ళు చేతులు లేనొల్ల పైసలు తీసుకుంటానని వాళ్లకు చేతులెట్లా వస్తున్నాయ్...కనీసమన్నా వాళ్లకు కొంచం సిగ్గు శరం ఉండాలి..నువ్ చెప్పావ్ కదా తాతా ఇప్పటి తరం పూర్తిగా స్వార్థ తరమని అందులో పై మెట్టున ఉండేటోల్లు వీళ్ళు..” అని చెప్పి తాతను ఎక్కువసేపు నిలబెట్టడం ఇష్టం లేక..నేనే..”సరే తాత ఎండలు బాగా మండుతున్నాయి. నీళ్ళు బాగా తాగుతా ఉండు.ఆరోగ్యం జాగ్రత్త.. వెళ్ళి మరి నీ జీతం తీసుకొని రా రేపు మనం దవత్ చేసుకుందాం” అనగానే
“సరేనోయ్ తాతా” అంటూ.. ఆ మూడు కాళ్ళ మహా జ్ఞాని.. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు..
నేను కరెంటును చూడగానే నా చేతులకు రెక్కలు మొలిచినట్టు ఎగురుకుంటూ..ఇంట్లోకొచ్చి మళ్లీ నా బుక్ ఓపెన్ చేశాను. మీరు అనుకున్నట్టు ఫేస్బుక్ మాత్రం కాదండోయ్..