రామ్ కి ఆ పేరు వాళ్ళ తల్లితండ్రులు ఏ ముహూర్తాన పెట్టారో గానీ ఆ పేరుని రేమ్ (రేండమ్ ఏక్సస్ మెమొరి) గా మార్చేసుకుని కంప్యూటర్ కి ఎంతగా బానిస అయిపోయాడంటే, చిన్నపుడు ఆటలు అంటే కంప్యూటర్ లో ఆటలు;గేమ్స్ అంటే వీడియోగేమ్స్ అనేటంతగా. ఈ అలవాటు వయస్సుతో పాటు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా ఇంజనీరింగ్ లో కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచి తీసుకుని చివరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు.అయినా కూడా ఈ కంప్యూటర్ భాషను ఆఫీస్ లోనే కాదు యింటివద్దా విడిచిపెట్టేవాడు కాదు. నిరంతరం కంప్యూటరో,కంప్యూటర్ భాషలో మునిగితేలడమే రామ్ పనిగా ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్ లో రూమ్ తీసుకుని ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్నాడు.
***
“ఒరేయ్!రామ్,మీ అమ్మకు ఈ మధ్య కాస్త నలతగా ఉంటుంది.హైదరాబాద్ లో చూపిస్తే బాగుంటుందేమో” అన్నాడు వాళ్ళ డాడీ ఫోన్లో.
అంతే “ఓ.కె!డాడీ, మమ్మీని అక్కడ అప్ లోడ్ చేయండి; ఇక్కడ నేను డౌన్ లోడ్ చేసుకుంటా”అన్నాడు రామ్
“అప్ లోడ్ ఏంట్రా అప్రాచ్యుడా!డౌన్ లోడ్ ఏంట్రా దౌర్భాగ్యుడా!”అని వాళ్ళ డాడీ మందలించేసరికి ఈ లోకంలోకి వచ్చి అదే డాడీ, అమ్మను అక్కడ బస్సు ఎక్కించండి, ఇక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను” అన్నాడు సవరించుకుని
“సరే!సరే! జాగ్రత్తగా అక్కడ స్పెషలిస్ట్ కి చూపించి పరీక్షలు చేయించు” అన్నాడు వాళ్ళ డాడీ
“అలాగే, తప్పనిసరిగా; ఏమైనా వైరస్ ఎటాక్ అయ్యిందేమో, వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ చే స్కాన్ చేయించి తగిన ఏంటీవైరస్ ఇమ్మని అడుగుతా” అన్నాడు మరల తన కంప్యూటర్ భాషలో
“నీ మొహం మండా! నీ కంప్యూటర్ భాషను కాసేపు ప్రక్కన పాడేసి అమ్మకు తగిన పరీక్షలు చేయించి వైద్యం చేయించు” అని చెప్పటంతో ఆ విషయం అక్కడికి ముగిసింది.
***
ఇంతకీ నీ సిస్టమ్ లో వచ్చిన ప్రాబ్లెం ఏమిటి?వాళ్ళ మమ్మీని యింటికి తీసుకువచ్చిన తరువాత అడిగాడు రామ్.
“సిస్టమ్ ఏంట్రా నీ బొంద! ఏమి తిన్నా సరిగా జీర్ణం అవడంలేదు అదే యిబ్బంది” అంది వాళ్ళ మమ్మీ.
వాళ్ళ మమ్మీని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి” డాక్టర్! మా మమ్మీకి ప్రోగ్రామింగ్ కరెక్ట్ గా ఫీడ్ అవ్వక సిస్టమ్ కరెప్ట్ అయింది” అన్నాడు
“ఏంటో సరిగా చెప్పవయ్యా మహానుభావా! అని అడిగేసరికి స్పృహలోకి వచ్చి అదే డాక్టర్ మా మమ్మీకి ఏం తిన్నా జీర్ణం కావడంలేదని చెప్పాడు. డాక్టర్ తగిన పరీక్షలు చేసి మందులు రాసిచ్చాడు.
***
ఆ రోజు రామ్ కి పెళ్ళిచూపులు. రామ్ తన మమ్మీ,డాడీ లతో అమ్మాయిని చూడడానికి పెళ్ళికూతురు వాళ్ళింటికి వెళ్ళాడు. అమ్మాయి తల్లితండ్రులు, ముగ్గురుకి మూడు ప్లేట్లలో స్వీట్స్ పెట్టి మరో మూడు ప్లేట్లలో మూడు ఆపిల్స్ పెట్టారు.స్వీట్స్ తిన్న తర్వాత ఆపిల్స్ ముక్కలు చేసి ఇద్దామని.అలా పెట్టారో లేదో స్వీట్స్ విడిచిపెట్టి రామ్, మూడు ప్లేట్లలో ఒక్కొక్క ఆపిల్ తీసుకుని చిన్నముక్క కొరికి తిని కొరకగా మిగిలిన ఆపిల్ ని ఒక్కో ప్లేట్లో ఒక్కోదానిని పెట్టాడు. ఈ దృశ్యాన్నిచూసి రామ్ వాళ్ళ మమ్మీ,డాడీ బిక్కచచ్చిపోతే;అమ్మాయి,వాళ్ళ తల్లితండ్రులు బిర్రబిగుసుకుపోయారు. వీళ్ళందరిని చూసి “ఏమిటి?మీరందరు అలా స్ట్రక్ అయిపోయారు” అడిగాడు రామ్. ముందుగా వాళ్ళ డాడీ తేరుకుని “ ఏంట్రా! ఆ పని, ఆపిల్ పళ్ళంటిని చిన్న,చిన్న ముక్క కొరికి పెట్టావు” అని అడిగేసరికి ఇహలోకం లో వచ్చి “ఓహో!అదా, ఆపిల్స్ చూసేసరికి స్టీవ్ జాబ్స్ “ఆపిల్”కంపెని లోగో గుర్తుకు వచ్చి అలా చేసాను అనేసరికి అంతా తేలిక పడ్డారు.
“సరే, అమ్మాయినేవైనా ప్రశ్నలు అడుగుతావేమో అడుగు అన్నారు వాళ్ళ డాడీ,అంతే ఆ అమ్మాయితో “ఏవండీ, మీకు ఏది యిష్టం లేదా రెండూ కావాలా అన్నాడు. ఆ ప్రశ్నకు అంతా వెర్రిమొహాలు వేసి చూస్తుంటే అప్పుడు వాస్తవంలోకి వచ్చి “అదేనండి, ఇంట్లో డెస్క్ టాప్ యిష్టమా,లేప్ టాప్ యిష్టమా లేదా రెండు కావాలా అని అడిగాను అని చెప్పేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి మరల ఇంకో ప్రశ్నను సంధించాడు “మీ ఇంట్లో మౌస్ ఉందా”అని.రామ్ కంప్యూటర్ పిచ్చి గురించి ఇంకా పూర్తిగా తెలియని ఆ అమ్మాయి మా ఇంట్లో అసలు మౌస్ అనేది ఉండదండి అని సమాధానమిచ్చింది. అంతే ఒక్కసారిగా లేచి నిలబడి కనీసం మౌస్ కూడా లేని ఈ సంబంధం నాకు నచ్చలేదని మొహం మీదే చెప్పేసాడు. మౌస్ లేకపోవడానికి,సంబంధం నచ్చకపోవడానికి లింకేంటబ్బా అని అమ్మాయి,అమ్మాయి తల్లితండ్రులు తీక్షణంగా ఆలోచిస్తుంటే ,రామ్ వాళ్ళ డాడీకి విషయం అర్ధమై “ఒరేయ్! వాళ్ళు చెప్పేది ఇంట్లో సుంచి(మౌస్) ఉండదనిరా” అని చెప్పేసరికి స్థిమితపడి పెళ్ళికి ఒప్పుకున్నాడు.
***
వెరైటీగా పెళ్ళి శుభలేఖలు మిత్రులకు, బంధువులకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఇతర సోషల్ మీడియాలో ఆహ్వానాలు పంపాడు. మిత్రులు, బంధువులు అదే రీతిలో స్పందించి చాలా మంది “లైకులు”కొడితే “అభినందనలు” రూపంలో కొంతమంది “కామెంట్లు”పెట్టి సరిపెట్టారు.
***
రామ్ కొత్తగా కాపురం అపార్టమెంట్ లో ఫ్లాట్ లోకి మార్చి నెట్ కనెక్ట్ చేయించుకుని వైఫై ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళకి ఎదురుగా ఉండే ఫ్లాట్ వాళ్ళకి కూడా నెట్ కనెక్షన్ ఉండి వైఫై ఉంది. ఒకసారి రామ్ వాళ్ళ “మోడెమ్” పాడయి నెట్ రాకపోతే ఎదుటి వాళ్ళ ఫ్లాట్ తలుపు కొట్టి తలుపు తీసిన తరువాత ఎదురింటాయనతో మీ వైఫై ను ఒకసారి ఉపయోగించుకుంటాను అన్నాడు. అది ఆయనకు వైఫ్ అని వినిపించేసరికి రామ్ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టోయి నట్లైంది.దీంతో కొంతవరకు కంప్యూటర్ పిచ్చి తగ్గింది.
***
రామ్ కి ఒంట్లో బాగోక సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాడు. అంతకుముందు రోజే వాళ్ళ బాస్ పెన్ డ్రైవ్ యిచ్చి దానిలో ఫైల్స్ ఓపెన్ కావటంలేదు పరిశీలించమని పురమాయించాడు. ఆ రోజే రామ్ స్నేహితుడు తన పెళ్ళి శుభలేఖ ను యిచ్చాడు. ఒంట్లో బాగోని కారణంగా వాళ్ళకి మెయిల్స్ పంపాడు. కంగారులో బాస్ కి “కంగ్రాట్స్, మెనీమెనీ హేపీ రిటర్న్స్” అని,మిత్రుడికి “వైరస్ ఉన్న సిస్టమ్స్ లో పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసారు” అని పంపించేసరికి ఇద్దరినుంచి చెడామడా చివాట్లు పెడుతూ వచ్చిన మెసేజ్ లు అందుకున్నాడు. అప్పటితో పూర్తిగా జ్ఞానోదయం అయింది. ఆ తర్వాత నుంచి ఒళ్ళు దగ్గరపెట్టుకుని అవసరం మేరకు ఇంటా బయటా కంప్యూటర్ భాషని, కంప్యూటర్ ని ఉపయోగించటం అలవాటు చేసుకున్నాడు.