గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు హుస్సేన్ ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి కొంత చెప్పండి?
మాది కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం. మా తల్లి దండ్రులైన రాజన్‍బీ, మహ్మద్ అంకూస్ గార్ల ముగ్గురు కొడుకులల్లో నేను చిన్న వాడిని. నాకు ఒక చెల్లెలు కూడా వుంది. మాది అర్దరైతు, అర్ద కార్మిక కుటుంబం. మహిళలు, పురుషులతో బాటు కుటుంబసభ్యులంతా వ్యవసాయ పనులు చేసేవాళ్ళం. విద్యార్థి దశలో నేను కూడా నాగలి దున్నడం, మోట కొట్టడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, ఒడ్లు పెట్టడం, తవుటం పెట్టడం, వరి కొయ్యడం, మొయ్యడం, కావలి వుండటం, ఎడ్లు కాయడం, గడ్డి కోయడం లాంటి పనులన్నీ చేసేవాడిని. ఉదయం నాలుగున్నరకే నిద్రలేచి మా అమ్మ, వదినతో కలిసి విసుర్రాయితో మక్కజొన్నల గడుక విసరడం, కుందెనపెట్టి రోకండ్లతో వడ్లు దంచడం చేసేవాడిని.
వ్యవసాయ పనులతో బాటు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్టులో కార్మికుల్లాగా మా తండ్రి దడువాయి పని చేస్తుండగా, మా పెద్దన్న ఎడ్ల బండి (హమాలీ బండి) ద్వారా వ్యవసాయ మార్కెట్టు నుండి రైస్ - ఆయిల్ మిల్లులకు బస్తాలు రవాణాచేసేవాడు. అప్పుడప్పుడు నేను కూడా పెద్దన్నతో బాటు కార్మికునిలాగా ఆపనిలో పాల్గోనే వాడిని. ఆ విధంగా విద్యార్థి దశలోనే రైతుగా, కార్మికునిగా శ్రమలో పాల్గొనేవాడిని.
ఇంటి వద్ద చదువుకునేందుకు, ఆడుకునేందుకు సమయం లభించేది కాదు. బడిఫీజుల కోసం, బలుపాల కోసం, పుస్తకాల కోసం డబ్బులు అడిగినప్పుడుల్లా డబ్బులు ఇవ్వలేక బడిమానేయ్యమనేవాడు మా తండ్రి. మూడు పైసల బలుపం కోసం కూడా ఏడ్వవలిసి వచ్చేది. ఆ విధంగా ఎప్పుడూ ఫెయిల్ కాకుండా 1969లో పదవ తరగతి (యస్.సయ్.సి) పాస్ అయ్యాక చదువు ఆగిపోయింది. ఆ విధంగా విద్యార్థి దశలోనే శ్రమవిలువ, డబ్బువిలువ, పేదరికం గురించి తెలిసి వచ్చింది.
నేను పెండ్లి చేసుకుంటే వరకల్నంగా వచ్చే రెండు వేల డబ్బును వరకట్నంగా మా చెల్లెకు యిచ్చి వివాహం చేసేందుకు నిర్ణయం జరిగింది. మా మేనమామ కూతురైన జిలానీ బేగంతో నా పెండ్లి జరిగింది. 1971 నుండి 73 చివరి వరకు జమ్మికుంట బస్టాండ్‍లో టీ స్టాల్ నడిపాను. 1974 ప్రారంభం నుండి సింగరేణి ప్రాంతమైన మందమర్రిలో కార్మికునిగా జీవితం ప్రారంభించాను. రోజుకు నాలుగు రూపాయల జీతంతో కాంట్రాక్టు కార్మికునిగా మందమర్రి కోల్, స్క్రీన్‍ప్లాంట్‍లో ఒక సంవత్సరంపాటు పనిచేసాక 1975 ప్రారంభంలో సింగరేణి కార్మికునిగా (అతి తక్కువ జీతం లభించే జనరల్ మజ్దూర్‍గా) మందమర్రిలోని కళ్యాణిఖని రెండవ భూగర్భగని ఉద్యోగంలో చేరాను.
నేను మందమర్రికి మారిన తర్వాత జమ్మికుంట టీ స్టాల్‍లో పెట్టి అమ్మిన విస్లవ సాహిత్యాన్ని మందమర్రికి తెప్పిస్తూ మిత్రుడి హోటల్ వద్ద పెట్టి అమ్మడం, చదివించడం, పాటలు పాడి వినిపించడం 1975 ఎమర్జెన్సీ ప్రారంభమయ్యే వరకు సాగించాను. ఎమర్జెన్సీలో మందమర్రి, బెల్లంపల్లికి చెందిన నాతోటి సంబంధం ఉన్న రాడికల్స్ను, కార్మికుల్ని పోలీసులు అరెస్టు చేసారు. నా కోసం పోలీసులవేట కొనసాగుతుండగా అరెస్టుకు గురికాకుండా రెండు నెలలు డ్యూటీకి పోకుండా, ఇంటి వద్ద వుండకుండా తప్పించుకు తిరిగాక తిరిగి ఉద్యోగంలో చేరాను. ఎమర్జెన్సీ ఎత్తివేసాక బహిరంగంగా, జోరుగా సాగిన విప్లవ రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో, కార్మికుల సమ్మెలు, ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటూ పోయాను. 1981 వరకు పార్ట్ టైమర్‍గా ఆర్గనైజేషన్ పనులు నిర్వహించి 1981 నుండి ఉద్యోగాన్ని వదిలి పూర్తికాలం కార్యకర్తగా మారాను. 1981 చివరలో సింరేణి బెల్ట్ కమిటీ సభ్యుడి గానూ 1992 లో బెల్ట్ కమిటీ కార్యదర్శిగానూ ఆ తర్వాత 1995లో ఏర్పడ్డ ఉత్తరతెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (రాష్ట్ర స్థాయి కమిటీ) సభ్యుడిగానూ (బెల్ట్ కమిటీ కార్యదర్శి బాధ్యతతో సహా) బాధ్యతలు నిర్వర్తించాను. 1986లో అరెస్టుకు గురై రెండున్నర యేండ్లు జైలు జీవితం అనుభవించి నల్ల ఆదిరెడ్డితో బాటు నేను, మరో ఇద్దరు జైలు బంధనాలను బ్రద్దలు కొట్టుకొని తిరిగి విప్లవోద్యమ బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2004లో పార్టీ కేంద్ర కమిటీ నన్ను జార్ఖండ్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ రాష్ట్రంలో మితద్రోహంతో 2009 జనవరిలో బొకారో పట్టణం దగ్గర అరెస్టు అయ్యి, తీవ్రమైన చిత్రహింసలు పొంది 29 కేసులు పెట్టబడి బొకారో, రాంచీ, వరంగల్ జైల్లల్లో నాలుగున్నర సంవత్సరాలు గడిపాను. జైలులో వున్న కాలంలో అనారోగ్యానికి గురైన కారణంగా రహస్య విప్లవోద్యమంలో పనిచేయలేక 2013 మే చివరలో జైలు నుండి విడుదలైనప్పటి నుండి జమ్మికుంటలోనే జీవిస్తున్నాను. నేను ఇంటికి వచ్చేనాటికి 1978లో పంపకాలు జరిగి నా తల్లిదండ్రుల సంపాదనలో నా వంతుకు వారసత్వంగా వచ్చిన భూమిని నా సోదరులు అమ్ముకున్నారు. నా ఇల్లును తమపేర మార్చుకున్నారు. ప్రస్తుతం నాకు స్వంత ఆస్తులేవీ లేవు.
2 మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితల గురించి చెప్పాలి? అలాగే జమ్మికుంట ఆదర్శ కళాశాల విద్యార్థులు మీ ఆలోచనల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపారు? జమ్మికుంటలో ఆదర్శ కళాశాల విద్యార్థులు నడిపిన విద్యుల్లత పత్రిక ప్రభావం మీమీద ఏమైనా వుందా? మీరు జమ్మికుంటో హోలట్ నడుపుతున్న కాలంలో జమ్మికుంటలో పరిస్థితులు ఎలావుండేవో చెప్పాలి?
ఈ ప్రశ్నలన్నీటికి కలెగల్పుగా, సంక్షిప్తంగా జవాబు చెప్పుతున్నాను. నేను జమ్మికుంట హైస్కూల్‍లో 1968, 69 లో 9వ, 10వ (యస్.యస్.సి) తరగతి చదువుతున్నప్పుడు నా కన్న పై తరగతి చదువుతున్న మడిపెల్లికి చెందిన తిరుపతి ద్వారా శీశ్రీ రచనలు, నాస్తిక సాహిత్యం, సి.వి. రచించిన సత్యకామ జాబాలి లాంటి సాహిత్యం అంది చదివాను. 1970 నాటికే బీజప్రాయంలోనే దేవుళ్ళూ, పూజలు, నమాజ్‍లపై వ్యతిరేకత ఏర్పడింది. అంతవరకు రంజాన్, బక్రీద్ లాంటి సందర్భాల్లో సామూహిక నమాజ్‍లో పాల్గొన్న నేను 1971లో నా పెండ్లి సందర్భంగా తప్పనిసరై నమాజ్ చేసన నేను ఆ తర్వాత మరెప్పుడూ నమాజ్ చేయలేదు. దేవుళ్ళకు మొక్కుతూ పండుగ చేయలేదు.
నేను జమ్మికుంట బస్టాండ్‍లో 1971 నుండి 73 చివరి వరకు ఫ్రెండ్స్ హోటల్ పేరుతో టీ స్టాల్ నడిపాను. ఎలా ప్రారంభించానో ఇప్పుడు యాదికి లేదు కాని విప్లవ రాజకీయాలతో కూడిన ‘‘పిలుపు’’ పత్రికను పోస్టుద్వారా రెగ్యులర్‍గా తెప్పించి అమ్మడం ప్రారంభించాను. మడిపెల్లి తిరుపతి కూడా రచనలు చేసేవాడు. అతని ద్వారా విద్యుల్లత, బద్‍లా కథలు అందేవి. ‘నూతన’, తదితర సాహిత్య పత్రికలు తెప్పించి టీ స్టాల్ వద్ద పెట్టి అమ్మేవాడిని. శీశ్రీ, వివి, చెరబండరాజు తదితరుల ప్రసంగాలు, కవితలు, జననాట్య మండలి విప్లవ పాటలు విని ఉత్సహం పొందాను. వివి గారి ఇంటికి పోయి మాట్లాడి పోస్టుద్వారా ప్రతినెల 30 సృజన పత్రికలు తెప్పిస్తూ టీ స్టాల్ వద్దే పెట్టి అమ్మాను. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు తీసుకునేవారు. విద్యార్థుల రూముల కాడికి పోతూ కూడా జననాట్యమండలి పాటలు వినిపించడం, సాహిత్యం ఇవ్వడం చేసేవాడి. అలాగే ప్రతి ఆదివారం హుజురాబాద్‍కు పోయి విద్యార్థుల రూముల్లో పాటలు వినిపించేవాడిని. ఆవిధంగా ఆవునూరి సమ్మయ్య, తాడిగిరి పోతరాజు, విద్యుల్లత విజయకుమార్, పల్లె కనుకయ్య తదితరులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆవునూరి సమ్మయ్య, పోతరాజుల నేతృత్వంలో హుజురాబాద్‍లో జరిగే సాహిత్య సమావేశాల్లో పాల్గొనే వాడిని. నేను పాటలు పాడడం తప్ప రచయితను కాదు. జమ్మికుంట కాలేజీలో చదువుతున్న నల్ల సుధాకర్‍రెడ్డి ద్వారా అతని తమ్ముడైన నల్ల ఆదిరెడ్డితో బాటు సాహూ (శనిగరపు వేంకటేశ్వర్లు) తదితరుల పరిచయమై నా దగ్గరి నుండి సాహిత్యం తీసుకునేవారు. మా ఇంటికి దగ్గరలో వున్న విద్యార్థుల రూమును వ్యాయామ సెంటర్‍గా మార్చి, వ్యాయామం కోసం వచ్చే విద్యార్థులు చదువుకునేలా సాహిత్యం పెట్టేవాడిని.
నేను 1973 చివరి వరకు జమ్మికుంటలో వున్నాను. ఆ కాలంలో రాడికల్ విద్యార్థి సంఘం కాని, విద్యార్థుల పోరాటాలు కాని లేవు. కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు జరిపిన ఎలాంటి సమావేశాల్లో నేను పాల్గొనలేదు. నేను తెప్పిస్తున్న సాహిత్యం చదవడం, హుజురాబాద్ సాహితీ మిత్రులతో సంబంధాలు, విరసం పాఠశాల, జననాట్యమండలి పాటలు మాత్రమే ఆ కాలంలో నాపై ప్రభావం చూపాయి.
3 మీరు సింగరేణి ఉద్యోగంలో చేరేనాటికి సింగరేణిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
నేను ఉద్యోగంలో చేరేనాటికి సింగరేణి వ్యాప్తంగా కార్మికులలో సిపిఐ అనుబంణ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐయన్‍టియుసి (రివిజనిస్టు, బూర్జువా) యూనియన్ల ప్రాల్యమే కొనసాగుతుండేది. కంక బొంగులతో నిర్మించిన గడ్డి లేదా డాంబర్ రేకులతో కూడిన చిన్న చిన్న గుడిసెల్లో మెజారిటీ కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తుండేవి. అలాంటి కార్మిక బస్తీల్లో కరెంటు, నీరు, రోడ్లు, మురికి కాలువలు గానీ, విద్య, వైద్య సౌకర్యాలు గానీ వుండేవికావు. వందలాది గుడిసెలతో కూడిన బస్తీకి ఒకటి, రెండు నల్లాలు మాత్రమే వుండేవి. కొన్ని బస్తీలలో ఒక్క నల్లా కూడ లేక కార్మికులు స్వయంగా బావులు తవ్వుకునేవారు. నీటి కోసం నల్లాల కాడ ప్రతి రోజూ మహిళలు కొట్లాడుకునేవారు. బస్తీల కాడినుండి గనుల వద్దకు ప్రయాణ సౌకర్యాలు లేక కొన్ని కిలోమిటర్ల దూరం కాలినడకన లేదా సైకిళ్లతో లేదా బొగ్గు లారీలపై ప్రయాణం చేస్తూ కార్మికులు డ్యూటీలు చేసేవారు.
గ్రామాల్లో భూస్వామ్య దొరలలాగే గనుల కాడ కంపెనీ అధికార్ల దౌర్జన్యాలు కొనసాగుతుండేవి. కంపెనీ అధికార్లను ‘‘అయ్యా దొరా’’ అంటూ కార్మికులు పిలుస్తుండేవాళ్ళు. అర్ధ బానిసల్లాగా అణగిమనిగి వుండేవాళ్ళు. గనుల్లోకి సరైన గాలి సప్లయి జరుగక, రక్షణ నియమాలు అమలుగాక కార్మికులు తొందరగా అలసిపోవడం, ప్రమాదాలకు గురికావడం, విషవాయువుల్లో పని చేయవల్సివస్తూ దీర్ఘ కాలిక రోగాల పాలవ్వడం, నష్టపరిహారాలు, వైద్యసదుపాయాలు సరిగాలేక పోవడం ఆనాటి పరిస్థితి. పనిభారం, వెట్టిచాకిరీలు అధికంగా వుండేవి. యేండ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగాలకు పర్మినెంటు ఉండేది కాదు. బాయి పనికి పోయినోళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో అనే భయంతో కుటుంబాలుండేవి. ప్రతి రోజూ యాక్సిడెంట్లు జరుగుతుండేవి. సంవత్సరంలో ఎంతోమంది కార్మికులు ప్రమాదాలకు లోనవుతూ, రోగాల పాలవుతూ చనిపోయేవారు. హక్కులు లేక, సౌకర్యాలు లేక, నిబంధనలు, చట్టాలు అమలుకాక, కార్మికులు, వారి కుటుంబాల బతుకులు చితికి పోతుండేవి.
సింగరేణిలోని అన్ని ప్రాంతాలలో రాజకీయ నాయకులు, యూనియన్ల నాయకులు పోషించేటి గూండాల అరాచకాలు ప్రజల పాలిట శాపంగా వుండేవి. మందమర్రిలో వేలాది ఎకరాల భూములు కల్గిన మాధవరావు కుటుంబం, ఆ కుటుంబంలోని శ్రీపతిరావు, అతని గూండాలు సాగించే గూండాయిజం, దోపిడీ, హత్యలు, అత్యాఆరాలకు అడ్డూ, ఆపు లేకుండేది.
కార్మిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసమే పుట్టుకొచ్చాయని చెప్పబడేటి ట్రేడ్ యూనియన్ల నాయకులు వారి సిద్దాంతాలకు, లక్ష్యాలకు, బాధ్యతలకు తిలోదకాలు యిచ్చి కంపెనీకి తొత్తులుగా, పైరవీకారులుగా, లంచగొండులుగా, వ్యాపారులుగా మారిపోయి కార్మికవర్గానికి ద్రోహం చేస్తూ వచ్చేవారు. ఎమర్జెన్సీ చీకటి కాలంలో ప్రభుత్వాల, కంపెనీ యాజమాన్యపు దొపిడీ పీడనలు, అణచివేతలు, ట్రేడ్ యూనియన్ల ద్రోహాలూ, అసమర్థతలు అనేక రెట్లు పెరిగిపోయి వారిపై కార్మికులకు వ్యతిరేకత, అసహ్యం పెరిగిపోయింది. సింగరేణి కార్మికుల సమస్యలు ఎంత చెప్పుకున్నా వొడిచిపోవు.
4 సింగరేణి ఉద్యోగం మీ ఆలోచనలలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
గనులల్లో భయంకరమైన, ప్రమాదకరమైన పని స్థలాలు, పనిలో తీవ్రమైన కష్టాలు, ప్రమాదాలు, పనిభారాలు, శ్రమదోపిడీలు, అణచివేతలు, హక్కులు, సౌకర్యాల కరువు, ట్రేడ్ యూనియన్ల విద్రోహాలు తదితరాల గురించి ఎవరో రచయితలు రాసిన రాతలు చదివో, ఎవరో నాయకుల ప్రసంగాలు వినో కాకుండా నేను స్వయంగా గని భూగర్భంలో అతి తక్కువ జీతం లభించే జనరల్ మజ్దూర్‍గా అనేక పనులు చేస్తూ, అనేక సమస్యలను ప్రత్యేక్షంగా అనుభవిస్తూ గమనిస్తూ వచ్చాను. అప్పటికే నాకున్న సిద్దాంత రాజకీయ చైతన్యంతో అర్థం చేసుకుంటూ వచ్చాను. బస్తీలోని చిన్న గుడిసెలో, కరెంటు లేక, ఫ్యాను లేక, నీటి సప్లయిలేక, ఎండ వేడిమితో, వర్షాకాలంలో పై నుండి ఊరుస్తూ, నేలంత నీల్లు ఊరుతూ....భార్యా భర్తలం కష్టాలను భరిస్తూ జీవించాం.
ఫలితంగా ప్రభుత్వాలపై, కంపెనీ యాజమాన్యంపై, ట్రేడ్ యూనియన్లపై వ్యతిరేకత పెరిగింది. విప్లవకర నాయకత్వంలో కార్మిక వర్గం చైతన్యయుతంగా, సంఘటితంగా పోరాటాలు సాగించపూనుకుంటే తప్ప సమస్యలకు పరిష్కారంలేదని భావించాను. అయితే ఉద్యోగం చేస్తూ, ప్రమోషన్లు పొందుతూ, డబ్బులు కూడబెడుతూ, భార్యా పిల్లలతో, సుఖ సంతోషాలతో జీవిస్తూ, కడుపులో చల్ల కదలకుండా - ప్రజల కోసం, విప్లవం కోసం పనిచేయడం సాధ్యం కాని పని అని అర్థం చేసుకున్నాను. అవసరాన్ని బట్టి, పసరిస్థితులను బట్టి ఎప్పుడైనా ఉద్యోగం వదులుకోవాల్సి వుంటుందనే ముందు చూపుతో ఉద్యోగంలో ఉన్నంతకాలం సాధారణ కార్మికునిగా ఉండడమే ఉపమోగకరమని భావించి ప్రమోషన్ల అవకాశాలను కూడా నిరాకరించాను. కార్మికునిగా, రాడికల్‍గా, పార్ట్టైమ్ కార్యకర్తగా 1981 ఏప్రిల్ వరకు కార్మికుల్ని ఆర్గనైజ్ చేస్తూ వచ్చాను. 1981 ఏప్రిల్‍లో నేను పని చేస్తున్న గని నుండి నేను, నాతోటి కార్మిక మిత్రుల నాయకత్వంలో సమ్మె ప్రారంభమై అనేక ప్రాంతాలకు విస్తరించి, చారిత్రాత్మక సమ్మెగా సాగి విజయవంతమైన ఆ సమ్మె నుండే నేను పూర్తికాలం కార్యకర్తగా మారి విప్లవోద్యమంలో బాద్యతలు నిర్వర్తిస్తూ వచ్చాను. ఆ సమ్మె తర్వాతనే సి.కా.స. ను స్థాపించి గైడ్ చేయడం జరిగింది.
నాలోనూ, నాలాంటి కార్యకర్తలలోనూ సిద్దాంత రాజకీయ అవగాహన కల్పిస్తూ, ఆలోచనల్లో మార్పులు తెప్పించడంలో 1977 మధ్యకాలం నుండి కామ్రేడ్ గజ్జెల గంగారం, నల్ల ఆదిరెడ్డిలు కల్పిస్తూ వచ్చిన బోధనలు, గైడ్‍న్స్లు ఎంతో తోడ్పడ్డాయి. నాలో పట్టుదలను, త్యాగనిరతిని పెంచాయి.
5 మీరు సింగరేణి కార్మికునిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు బెల్లంపల్లిలో లేదా మొత్తం సింగరేణిలో ఎలాంటి పిరిస్థితులు ఉన్నాయి?
ముందే చెప్పుకున్నట్లు ఎమర్జెన్సీ ఎత్తివేసే నాటికి అంటే 1977నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై, రివిజనిస్టు, బూర్జువా పార్టీలు వాటి అనుబంధ ట్రేడ్ యూనియన్లపై సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక వర్గానికీ ప్రజలందరికీ తీవ్రమైన వ్యతిరేకత, అసహ్యం పెరిగిపోయింది. సింగరేణి కార్మికుల్లోనైతే ఇక ఎంత మాత్రం భరించనంతగా అసహనం పెరిగింది. వర్గ కసి కట్టలు తెంచుకునేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘‘ఒక నిప్పురవ్వ దావానలం సృష్టించగలదు’’ అన్నట్లు పోరాడే విప్లవకర నాయకత్వం అండ లభిస్తే కార్మికోద్యమాలు ప్రజ్వరిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో విస్తృతంగా రాజకీయ ప్రచారం చేయాలని, ప్రజలను చైతన్య పర్చుతూ, సంఘటిత పర్చుతూ, సమస్యలని మా విప్లవ పార్టీ (సి.పి.ఐ-యంయల్- పీపుల్స్వార్ పార్టీ) తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా సింగరేణి ప్రాంతంలో రాడికల్ విద్యార్థి, యువజనులు, కార్మికులు, జననాట్యమండలి బృందాలు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నేనూ, నాలాంటి విప్లవాభిమానులైనా కార్మికులంతా రాడికల్స్ పేరుతో గనులు, బస్తీలు, విద్యాసంస్థలు, గ్రామల్లో రాజకీయ ప్రచారం కొనసాగించాం. కరపత్రాలు, వాల్‍పోస్టర్లు, బస్తీ మీటింగులు, బహిరంగ సభలతో సింగరేణి ప్రాంతం ఎరుపెక్కింది.
ఫలితంగా అనేక సమస్యలపై రాడికల్స్ నాయకత్వంలో ఎక్కడికక్కడ పోరాటాలు బ్రద్దలవ్వడం ప్రారంభమైంది. కార్మికుల్లోనూ ఐక్యత, కార్మికులు, విద్యార్థి, యువకుల్లోనూ ఐక్యత పెరుగుతూ సంఘటిత పోరాటాలు సాగుతూ పోయాయి. ముఖ్యంగా గనులల్లో గాలి సప్లయి కోసం, బెల్లంపల్లి పట్టణాన్ని సుందరంగా మార్చే పేర గుడిసెలను కూల్చపూనుకున్న బెటర్‍మెంట్ కమిటీని వ్యతిరేకిస్తూ, ఎమర్జెన్సీ కాలంలో ‘‘కంపల్సరీ డిపాజిట్ స్కీం’’ సి.డి.యస్.- పేరుతో జీతాల్లో కోత విధించిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తగ్గించిన బోనస్ శాతాన్ని తిరిగి పెంచాలనీ, బెల్లంపల్లిలో రాజేశ్వరీ అనే కార్మికుని బార్యను చెరచి చంపి ఆత్మహత్యగా చిత్రించిన కంపెనీ అధికారి కొడుకును శిక్షించాలనీ, బదిలీ కార్మికులను పర్మినెంటు చేయాలనీ, విద్య, వైద్యం, నీరు, కరెంటు సౌకర్యాలు మెరుగు పర్చాలని తదితర డిమాండ్లతో, పేరుకుపోయివున్న సమస్యలను పరిష్కరించాలంటూ సంఘటిత పోరాటాలు సాగుతూ పోయాయి. ప్రతి సమ్మె సందర్భంగా ఊరేగింపులు, ధర్నాలు, జననాట్యమండలి పాటలు, నినాదాలు మారుమోగాయి. దొంగ ట్రేడ్ యూనియన్ల నాయకత్వాలను కాలదన్నుతూ విప్లవకర నాయకత్వంలో నిరవధిక సమ్మెలు సాగుతూ విజయవంతమవుతుండడంతో కార్మికులకు తమ శక్తి ఎలాంటిదో తెలియవచ్చింది. కార్మికుల్లో, ప్రజల్లో రాడికల్స్ పై అభిమానం పెరుగుతూ పోయింది. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రాడికల్ కార్మిక యూనిట్ల నిర్మాణాలు బలపడుతూ పోయాయి.
అయితే ఈ పరిణామాలను ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం, జాతీయ దొంగ ట్రేడ్ యూనియన్లు, పాలకవర్గ పార్టీలు సహించలేకపోయాయి. తమ దోపిడీ వర్గ విధానాలను పరిరక్షించుకునేందుకు కూలిపోతున్న తమ పునాదులను, పలుకుబడులను కాపాడుకునేందుకు కల్సికట్టుగా కుట్రలు సాగించిండ్లు. వారి రక్షకులైన పోలీసుల అండతో ఉద్యమాలను, విప్లవ సంస్థలను, మిలిటెంటు నాయకులను దెబ్బతీసేందుకు పూనుకున్నరు. అందులో భాగంగా ‘‘స్ట్రయిక్ కంట్రోలింగ్ కమిటీల’’ పేర గనుల పై గూండాల కమిటీలను నిర్మించడం, అవి విఫలమైన తర్వాత ‘‘గ్రీవెన్స్ ప్రోసీజర్’’ (సమస్యలను పరిష్కరించుకునే పద్దతి) పేర తడి బట్టతో గొంతులు కోసే విధంగా సమస్యలను, చర్చలను సాగిస్తూ, పోరాట పటిమను దెబ్బతీసేటి విధానాన్ని ప్రారంభించిండ్లు. ఈ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాక ట్రేడ్ యూనియన్లు క్షమించరాని ద్రోహానికి పాల్పడుతూ - ‘‘మేము కొత్తగా డిమాండ్లు పెట్టమని, సమ్మెలకు పూనుకోమని, కార్మికుల సమ్మెలకు మద్దతివ్వమని, సమ్మెకారులపై మేనేజిమెంటు తీసుకునే చర్యలను వ్యతిరేకించం’’ అంటూ సిగ్గులేకుండా మేనేజిమెంటుకు రాసిచ్చిండు. ప్రతి అణచివేత రూపాన్ని పోరాటాల ద్వారా కార్మికవర్గం ఓడిస్తూ పోతుంటే తిరిగి కొత్తకొత్త అణచివేత రూపాలు అమలు చేయ పూనుకున్నారు. ఎనమిది మస్టర్ల జీతాల కోత చట్టం, అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) లాకౌట్ల ప్రకటన, అరెస్టులు, డిస్మిస్‍లు అమలుకు వచ్చాయి. ప్రతి అణచివేత రూపాన్ని, నిర్భంధాలను విప్లవకర నాయకత్వంతో కార్మిక వర్గం సంఘటిత పోరాటాల ద్వారా ప్రతిఘటిస్తూ, ఓడిస్తూ వచ్చింది. సమ్మెలకు, కంపెనీ పొందిన నష్టాలకు కారకులంటూ నన్నూ, నాతోటి మిలిటెంటు కార్మికుల్ని డిస్మిస్ చేసేందుకు పూనుకుని కార్మికుల వ్యతిరేకతకు భయపడి విరమించుకున్నారు.
‘‘తుపాకులతో దుక్కిదున్ని పంటలు పండించలేరు, తూటాలతో గనుల నుండి బొగ్గు వెలికి తీయలేరు. గనులకు తాళాలు వేస్తూ గన్నులతో అణిచేస్తే, చిచ్చురగిలి సింగరేణి నిప్పులయ్యి మండుతుంది’’ అంటూ నిర్భంధాలు ప్రతిఘటనకు దారితీస్తూ పోరాటాలు పెరుగుతూ పోయాయి.
7 మీ మొదటి రచన ఏది? కథనా, కవితనా, పాటనా? అది ఏ సందర్బంలో వచ్చింది?
నా మొదటి రచన పాటనే. 1974 ప్రారంభలో నేను మందమర్రికి పోయి రోజుకు నాలుగు రూపాయల వేతనంతో టెంపరరీ మజ్దూర్‍గా పనిచేస్తున్నప్పుడు సింగరేణి కార్మికుల జీవన పరిస్థితులను చూసాను. కార్మికుల బతుకులకు అద్దం పట్టే విధంగా ‘‘సింగరేణి బతుకులు’’ పేరుతో మొదటి సారిగా పాట రాసాను. భూమయ్య, కిష్టగౌడ్‍ల ఉరి శిక్షలను రద్దుచేయాలంటూ 1974 మధ్య కాలంలో రాష్ట్ర పౌరహక్కుల సంఘం బ్యానర్‍తో మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాలలో బహిరంగ సభలు జరిగాయి. ఆ సభల్లో శీశ్రీ, పత్తిపాటి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించగా హైదరాబాద్ జననాట్య మండలి బృందం సాంస్కృతిక ప్రదర్శన లిచ్చింది. ఆ సందర్భంగా ఆ వేదికలపై నేను రాసిన పాటను నేనే పాడి వినిపించాను. ఆ పాట కార్మికుల్లో మంచి ప్రాచూర్యం పొందింది. 1974, 75లలో హుజూరాబాద్, కరీంనగర్‍లో శీశ్రీ పాల్గొన్న బహింరగ సభలల్లో నేను పాటలు పాడిన తర్వాత తిరిగి ఈ సభల్లోనే పాడాను.
8 సమ్మె అనే కథను మీరు, నల్ల ఆదిరెడ్డి, చందు రాసారని విన్నాను. నిజానికి ఆ కథను మగ్గురూ రాయవల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ఒక్క రోజు సమ్మె చేసినా కూడా చట్ట విరుద్ద సమ్మెల పేరుతో రోజుకు ఎనిమిది రోజుల జీతం కోత పెట్టేలా 1936లో బ్రిటీష్ ఇండియా పాలకులు అమలుకు తెచ్చిన ఫాసిస్టు చట్టాన్ని ‘‘స్వతంత్ర’’ భారతదేశపు పాలకులు కూడా అమలుచేయ పూనుకున్నందుకు నిరసనగా నేను పనిచేస్తున్న కళ్యాణిఖని రెండవ భూగర్భ గని నుండి నేను మరియు నాతోటి కార్మిక మిత్రుల ప్రత్యక్ష నాయకత్వంలో 1981 ఏప్రిల్ 18 నాడు సమ్మె ప్రారంభమై దినదినం విస్తరిస్తూ గోదావరిఖని గనుల వరకు విస్తరించి యాబై ఆరు రోజుల పాటు సంఘటితంగా, సమరశీలంగా సాగి విజయవంతమైంది. బొగ్గు ఉత్పత్తులు ట్రాన్స్ పోర్టులు ఆగిపోయిన ఫలితంగా ఆ సమ్మె ప్రభావం దక్షణ భారతదేశం పైపడింది. ఆ చారిత్రాత్మకమైన సమ్మె కార్మిక వర్గాన్ని, విప్లవ ప్రజానీకాన్ని, కవులూ, రచయితలను ప్రభావితం చేసింది. ఆ పోరాట గాథలను కథలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఆలోచన వచ్చింది. అప్పటికీ కథలు రాసిన అనుభవం లేకపోయినా కూడా కథలు రాసేందుకు నేనూ పూనుకున్నాను. ఆ సమ్మెలో మా వెనుకవుంటూ గైడ్ చేసిన నల్ల ఆదిరెడ్డితో బాటు సమ్మె పోరాటానికి ప్రభావితుడైన పి. చందు కూడ రాసేందుకు పూనుకున్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని కథగా మలిచారు. సమ్మె ప్రారంభం, సమ్మె విస్తరణ, నిర్భందంలో సమ్మె, సమ్మె విజయం, లీడర్ - ఇలా ముగ్గురు కలిసి రాసిన కథలకు రచయితగా ‘‘కార్మిక’’ అనే పేరును పెట్టడం జరిగింది. రహస్య విప్లవోద్యమంలో పనిచేస్తుండే కార్యకర్తలు రచయితలుగా తమ స్వంత పేర్లు పెట్టుకుని ప్రచారం పొందాలనుకోరు కాబట్టి చందు రాసిన కథను కూడా కలిపి కార్మిక పేరుతోనే ప్రచురించడం జరిగింది.
8 మీరు, చందు, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘కార్మిక’ పేరుతోనే కథలు రాసారు కదా. ఒకే పేరుతో ఇంత మంది ఎందుకు రాసారు?
విప్లవోద్యమంలో కొనసాగుతుండే కార్యకర్తలు తమ కులం, మతం, స్వంత పేరు, స్వగ్రామం ప్రకటించుకోకుండా మారు పేర్లతో ఉద్యమంలో కొనసాగుతూ, మారు పేర్లతోనే రచనలు కూడా చేస్తుంటారు. వ్యక్తి గతమైన పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్పలు పొగడ్తలు రావాలనే సంకుచితత్వంతో పనిచేయరు. రహస్య జీవితంలో లేని వారు కూడా కొందరు వేరే కలం పేరుతో రాసే వారుంటారు. నా సంపాదకత్వంలో పార్టీలో నడిచిన ‘‘నెత్తుటి గోదారి’’ సాహితీ పత్రికలో నేను కార్మిక, కర్షక, శ్రామిక, గెరిల్లా, బుల్లెట్ తదితర పేర్లతో రాసేవాడిని. కార్మిక పేరుతో అరుణతారలో కథలు జననాట్యమండలి పాటలు వచ్చాయి. కార్మిక పేరు మాత్రమే ప్రచారంలోకి వచ్చింది. నేను విప్లవోద్యమంలో రహస్య జీవితం పాటించడం వల్ల రెగ్యులర్‍గా సాహిత్య పత్రికలు చదువలేక పోయినందున అల్లం రాజయ్య, రఘోత్తమరెడ్డి, చందులు కూడా కార్మిక పేర్లతో రచనలు చేసినట్టు నాకు తెలియదు.
9 బెల్లంపల్లి అనగానే సుధ (సుందిల్ల ధర్మయ్య) గుర్తుకు వస్తాడు అంటారు. అలాంటి సుధతో మీకు పరిచయం ఉన్నదా వుంటే ఆ అనుభవాలు చెప్పగలరా?
‘‘సుధ’’ అంటే సుందిల్ల ధర్మయ్య. తన ఇంటిపేరు, తన పేరులోని మొదటి అక్షరాలను కలిపి ‘సుధ’ పేరుతో రచనలు చేస్తూ సుధగానే ప్రచారం పొందాడు. ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం మంచిర్యాల జిల్లా) లోని జయపూర్ మండలంలోని ‘గంగిపెల్లి’ వారి స్వగ్రామం. ఎంతోమందిలాగే బతుకుకోసం స్వగ్రామాలను వదిలిపెట్టి పారిశ్రామిక ప్రాంతాలకు పోయి కార్మకుల్లా మారిన ప్రజలలాగే సుందిల్ల ధర్మయ్య తల్లి దండ్రులు కూడ కాగజ్‍నగర్‍లోని బట్టల మిల్లులో కార్మికులుగా పనిచేస్తూ జీవించేవారు. ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు ధర్మయ్య. రెండవ వాడు రాజయ్య మూడవ చిన్న కొడుకు అంజయ్య కూడా తల్లి దండ్రులతోనే కాగజ్‍నగర్‍లో వుండేవాళ్లు. ధర్మయ్య కూడా మిల్లులో స్పిన్నర్‍గా పనిచేసేవాడు. కుటుంబాల్లోని ఆడా, మగా కార్మికులుగా పనిచేస్తున్నా కూడా కడుపేదరికంలో జీవించేవారు.
ఆ కుటుండంలోని ముగ్గురు అన్నదమ్ములు విప్లవోద్యమాల ప్రభావానికి విప్లవాభిమానులుగా, కళాకారులు, రచయితలుగా మారారు. 1979 నుండి 1990 వరకు దాదాపు 60 నుండి 70 పాటల వరకు జనాట్యమండలి పాటలను సుధ రాసివుంటడు. వీటిలో చాలా పాటలు ప్రజల్లో చాలా ప్రచారం పొందాయి. అలాగే ఆ రోజుల్లో రాష్ట్రంలో అనేక వేదికలపై జననాట్యమండలి బృందాలు ప్రదర్శించిన ‘‘రగల్‍జెండా బ్యాలె’’ ఒగ్గు కథ కూడా కామ్రేడ్ సుధ రాసిండు. ఎమర్జెన్సీ తదనంతరం బెల్లంపల్లిలో పాముల రాంచందర్ నేతృత్వంలో జననాట్యబృందం ఏర్పడి వందలాది ప్రదర్శనలిచిచ్చింది. ఆ బృందంలో సుధతో బాటు అతని తమ్ముడైన సుందిల్ల రాజయ్య కూడ సభ్యులుగా పనిచేసారు. (ప్రస్తుతం ఈ రాజయ్య మందమర్రిలో స్థిరపడి తెలంగాణ ప్రభుత్వ అనుకూల ప్రచార దళంలో పనిచేస్తూ ప్రభుత్వ కళాకారుడిగా పొట్టపోసుకుంటున్నాడు. నాడు హైదరాబాద్ కేంద్రంగా గద్దర్ నాయకత్వంలో నడిచిన జననాట్యమండలి బృదంలో దాదాపు మూడు సంవత్సరాలు సుధ పనిచేసాడు. అయితే ఆ బృదం నాయకత్వంలో కొనసాగిన అన్యవర్గ ధోరణులను తట్టుకోలేక ఆ జెయన్‍ఎమ్ ను వదిలివచ్చి ఏ నిర్మాణంలోనూ కొనసాగకుండా ఒంటరిగానే కాగజ్‍నగర్ మరియు సింగరేణి ఏరియాలలో తిరుగుతూ పాటలు రాస్తుండేవాడు. సుధకు చిన్న తమ్ముడైన అంజయ్యను విప్లవాభిమానిగా వున్నందుకే చంద్రబాబు ప్రభుత్వ పోలీసులు పట్టుకొని కాల్చిచంపారు.
సుధ కుటుంబం కడుపేదరికంతో జీవిస్తుండేది. భార్య కొడుకుతో కలిసి కొంతకాలం మహారాష్ట్రంలోని చంద్రాపూర్ కాలరీ ప్రాంతంలో, ఆ తర్వాత సింగరేణి ప్రాంతమైన రామక్రిష్ణాపురంలో ప్రయివేటు టీచర్‍గా పనిచేసిండు సుధ. మంచి విప్లవగేయాలు రాసిన, పాడిన రచయిత, కళాకారుడైన ధర్మయ్య (సుధ) కు మత్తు పానీయాలు సేవించేటి, తంబాకు సున్నం నలిసిన సుడితిని తినేటి చెడు అలవాటు ఉండేది. 1991లో కాగజ్‍నగర్‍కు పోయిన సందర్భంగా పోలీసులు పట్టుకుపోయి వేధించిండ్లు. ఆ సందర్భంగా మానసిక బాధకుగురై కల్తీ కల్లు తాగడం జరిగి ఆరోగ్యం దెబ్బతిన్నది. వెంటనే కుటుంబసభ్యులు హాస్పిటల్‍కు తీసుకుపోయినా ఫలితం లేక మరణించాడు. సుధ సజీవంగా లేకపోయినా కూడ అతను రాసిన, గానం చేసిన పాటలు ప్రజల హృదయాలలోనూ, జననాట్యమండలి పుస్తకాలలోనూ సజీవంగానే వున్నాడు.
10 ఇంకా ఇలా మరుగున పడివున్న కళాకారులు ఎవరన్నా వున్నారా?
గోదావరి కేంద్రంగా రాజన్న అనే కళాకారుని నేతృత్వంలో ఒక జననాట్యమండలి బృందం 1980 దశకం ప్రారంభంలో కొంత కాలం పనిచేసింది. సింగరేణి ప్రాంతంలో సాగిన సంఘటిత కార్మికోద్యమాలు, సింగరేణికి చుట్టూతా సాగిన రైతాంగ, ఆదివాసీ పోరాటాలు, గెరిల్లా దళాల కార్యకలాపాలవల్ల ప్రజానీకం ఎంతో ఉత్తేజితులవ్వడం ఎందరో రచయితలు, కళాకారులు ఉద్భవించడం జరిగింది. అయితే నిర్భందాలు, నిషేదాల వల్ల వారందరూ ప్రచారం పొందలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో కొందరు తమ కళలను ప్రదర్శించగలిగినప్పటికీ వారి గురించి నాకు తెలియదు.
11 మీ చుట్టూ వున్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యంవైపు, ఉద్యమం వైపు నడిపించాయి?
విద్యార్థి దశలోనే రైతుగా, కార్మికునిగా శ్రమలో పాల్గొంటూ, పేదరికాన్ని అనుభవిసూ, బీజరూపంలో విప్లవ, నాస్తిక సాహిత్యం పఠిస్తూ చైతన్యం పొందిన నేను సింగరేణి కార్మికునిగా మారి, మందమర్రిలో జీవిస్తూ ఆనాటి భౌతిక పరిస్థితుల వల్ల అనేక మార్పులకు లోనయ్యాను. ముఖ్యంగా...
తమ కండలను కరిగిస్తూ, తమ నెత్తురు ధారబోస్తూ, ఉత్పత్తులు తీసి దేశానికి వెలుగునిచ్చేటి కార్మికులు చీకట్లో చితికి పోతుండటం, సకల ఉత్పత్తులను సృష్టిస్తుండేటి కార్మికులు, రైతాంగం కరువులతో, ఆకలి బాధలతో బతుకుతుండటం. అడ్డూ అదుపూ లేకుండా పారిశ్రామిక ప్రాంతంలో గూండాయిజం, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతుండటం. గ్రామాల్లోని భూస్వాములలాగే కంపెనీ అధికార్ల దొరపెత్తనాలు, జులుం కొనసాగుతుండటం, కార్మికవర్గానికి ఉపయోగపడే చట్టాలు, రక్షణ చట్టాలు, ట్రేడ్ యూనియన్లతో జరిగే అగ్రిమెంట్లు, సంక్షేమ కార్యక్రమాలు కాగితాలకే పరిమితమవ్వడం, స్వాతంత్య్రం, గణతంత్రం, ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించే పార్టీలు దళారీ పెట్టుబడి దార్ల, భూస్వాముల, సామ్రాజ్య వాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ప్రజలను దోపిడీ పీడనలకు, అణచివేతలకు గురిచేయడం, కార్మికవర్గాన్ని చైతన్యపర్చుతూ, సంఘటిత పర్చుతూ, కార్మిక శక్తిని ప్రదర్శింపచేస్తూ కార్మికవర్గ ప్రయోజనాలను పరిరక్షించవల్సిన ట్రేడ్ యూనియన్లు ముఖ్యంగా ఎర్రజెండా యూనియన్లుగా చెలామని అయ్యేవారు కార్మికవర్గ ద్రోహులుగా, కంపెనీతొత్తులుగా మారడం. ప్రజలకోసం నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేస్తుండే వారిని, న్యాయం కోసం, హక్కులకోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రజలను చిత్రహింసలకు, నిర్భంధాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురిచేస్తుండటం....అదిగో ఇలాంటి పరిస్థితుల మధ్య నేను జీవించాను. ఇలాంటి పరిస్థితులను గమనించాను. కార్మికునిగా దోపిడి పీడనలకు, అణిచివేతలకు, అసౌకర్యాలకు గురయ్యాను. అలాగే దేశంలోని పీడిత ప్రజానీకాన్ని ఉత్తేజపర్చిన నగ్జల్‍బరీ, శ్రీకాకుళ ఉద్యమాలు, జగిత్యాల జైత్రయాత్రలు, సింగరేణి సంఘటిత కార్మికోద్యమాలు, విప్లవరాజకీయ బోధనలు నన్ను ఉత్తేజపర్చుతూ, చైతన్యపర్చుతూ నన్ను రచయితగా, గాయకుడిగా, ఉద్యమకారునిగా, విప్లవకారునిగా మార్చాయి.
15 మీ సహచరి గురించి చెప్పండి? మీ సహచరి గురించి పి.చందు రాసిన నవల గురించి చెప్పండి?
లాకప్పులో చిత్రహింసలు పొంది కామ్రేడ్ క్రిష్టమూర్తితోబాటు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ, కదలలేని స్థితిలోవున్న కామ్రేడ్ జిలానీబేగం జ్ఞాపకాలుగా అనేక మంది విప్లవకారులను, వారి త్యాగాలను గుర్తుచేస్తూ ‘‘నెత్తుటి ధార’’ పేరుతో నవల రాసిన మిత్రుడు చందుకు అభినందనలు. నా సహచరి జిలానీ బేగంను చందు ఎరిగివున్నప్పటికీ ఆమె జీవిత చరిత్ర అతనికి పూర్తిగా తెలియదు. నెత్తుటిధార నవలలో ఎవరికి ఎలాంటి లోపాలు కనిపించినా కూడా ఆ నవల ద్వారా పాఠకులకు అనేకమంది అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ, కన్నీళ్లు తెప్పించిండు రచయిత.
ఆ నవలలో ముద్రించబడిన నేను రాసిన కవితలో నేను చెప్పినట్లుగా - సజీవంగా ఉన్నప్పుడు కొందరికి మాత్రమే తెల్సిన జిలానీ బేగం, అసువులు బాసాక అమరురాలిగా ఎర్రజెండాలో వెలిగిపోతూ లక్షలూ, కోట్లాది మందికి తెలిసిపోయింది. విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా పాల్గొనేందుకు ఆమె పడిన తపన, ఉద్యమంలో ఆమె పాత్ర, త్యాగనిరతి గురించి ప్రస్తుతం నేను రాస్తున్న నవలలో పూర్తిగా పేర్కొంటాను. ముద్రణకు నోచుకుంటే చదవండి.
16 ప్రస్తుత కాలంలో మార్క్సిజం, లెనినిజం, మావోయిజం బలహీనపడింది. ఇది ప్రజల సమస్యలకు పరిష్కారంం చూపలేదని కొందరు అంటున్నారు. ఇది నిజం అంటారా?
ఈ ప్రశ్న చాల బరువైంది. మార్క్సిస్టు వ్యతిరేకులకు లేదా సామాజిక ఉద్యమాలు విప్లవోద్యమాలలో జరిగిన వైఫల్యాలు, ఓటములవల్ల నిరుత్సాహం చెంది ప్రజలపైన సిద్దాంతంపైన నమ్మకం కోల్పోయిన వారికి నేను చెప్పే జవాబు రుచించకపోవచ్చు. అయినప్పటికీ నాకున్న అవగాహన, నాకున్న పరిమితుల్లో నా మాటల్లో చెప్పుతాను.
మార్క్సిజం + లెనినిజం + మావోయిజం = మార్క్సిజం. మార్క్సిజం అనేది గతితార్కిక, చారిత్రక, భౌతికవాద సిద్దాంతం. అది ఒక సైన్సు, సిద్దాంతం లేదా సైన్సు బలహీనపడడం, పనికిరాకుండా పోవడం అంటూ వుండదు. ఆ సిద్దాంతం వెలుగులో జరిగే ఉద్యమాలు, విప్లవాలు బందు పడడం, బలహీన పడడం, విజయాలు సాధించడం, ఓటమికి గురికావడం జరుగుతుంటాయి. అందుకు ఆనాటి భౌతిక పరిస్థితులు, నాయకత్వ సమస్యలు, పరిస్థితులు సరిగా అధ్యయనం చేయకపోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా సిద్దాంతాన్ని అన్వయించడంలో, వ్యూహం, ఎత్తుగడలు రూపొందించడంలో లోపాలు, విప్లవశక్తుల కన్న విప్లవ ప్రతిఘాతుల శక్తి బలంగా వుండడం లాంటివి ఉద్యమాలు, విప్లవాలు, విజయాలు బలహీనపడడానికి, దెబ్బతినడానికి కారణమవుతుంటాయి. విప్లవోద్యమాలు ప్రజ్వరిల్లడానికి భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, విప్లవకర సిద్దాంతం ఉన్నప్పటికీ, ఆ సిద్దాంతం వెలుగులో ప్రజల్లోకి పోయి పనిచేసే విప్లవకర నాయకత్వం లేకపోతే విప్లవాలు ఉండవు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పిన చారిత్రక సత్యాన్ని అర్థంచేసుకోకపోతే విప్లవకర సిద్దాంతమే పనికి రాదనో లేదా సిద్దాంతం బలహీనపడిందనో, దానికి కాలం చెల్లిందనో అనుకునే వారుంటారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ, కోట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేస్తూ, ఈ పాటికే లక్షమంది ప్రాణంతీసిన కరోనా వైరస్‍కు ప్రస్తుతానికి సరైన మందులేకపోతే వైద్యశాస్త్రం పనికిరానిదన్నట్లు, బలహీనపడినట్లు భావించలేం కదా. గతంలో కలరా, ప్లేగు, మసూచి, డెంగూ, ఎబోలా లాంటి అనేక వ్యాధులు పుట్టుకువచ్చి వేలూ, లక్షలాది మంది చనిపోయిన సంగతులు తెలిసిందే. ఆయా సందర్భాలలో ఆ వ్యాధులకు, మహమ్మారిని అరికట్టడంలో వైఫల్యం జరిగినప్పటికీ, ఆ తర్వాత సరైన మందులు కనుగొనడం, చికిత్సలో మెరుగుదల రావడం బరిగింది. ఈనాటి కరోనా వైరస్‍ను కూడా సైన్సు అరికట్టగలదు. వైద్య శాస్త్రాన్ని, సైన్సును కాదని చెప్పి యాగాలు, హోమాలు, దీపాల వెలుగులు, గోమూత్రాలు, ఆవు పేడతో కరోనా వైరస్‍ను నిర్మూలించగలమని చెప్పేటి భావవాదుల ప్రచారం తప్పు కదా. ఈ భావవాదులు కూడా తమ ప్రచారానికి, చిన్న చిన్న వ్యాధులకు గురైనప్పుడు కూడా సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు, విదేశాలకు పరిగెట్టుతూనే సైన్సును, వైద్యశాస్త్రాన్ని వ్యతిరేకిస్తుంటారు.... మార్క్సిజం బలహీనపడిందనో, పనికిరాని పాత చింతకాయ పచ్చడిగానో చెప్పేవారు మార్క్సిజానికి ప్రత్యామ్నాయంగా నేడు ఆధిపత్యంలో వున్న పెట్టుబడిదారి సిద్దాంతం అనుకుంటే అది ప్రపంచాన్ని పలు విధాలుగా విధ్వంసపరుస్తూ, కోలుకోలేని విధంగా సంక్షోభాలలో అతలాకుతల మవుతుండటం...అది విజయవంతమైనట్లా? సరైన సిద్దాతమన్నట్లా?....ఆలోచించండి. కుళ్ళి కంపుగొడుతున్న దానిని తొలగించి పాతరేసే శక్తుల బలహీనత వల్లే అది అస్థిత్వంలో వుండడం వాస్తవం కాదా.
17 సామాజిక ఉద్యమాల్లోకి యువతరం, కొత్తతరం ఎందుకు రాలేకపోతున్నారు?
నిజమే. సమాజంలో మార్పును కోరుకునే వ్యక్తులు, సంస్థలు, ఉద్యమకారులు ఆశించినట్లుగా సామాజిక ఉద్యమాల్లోకి యువతరం రాలేకపోతున్నారనేది నిజమే. అందుకు యువతరాన్ని తప్పుపట్టలేం. ఉద్యమాలు, విప్లవాలు కోరుకుంటేనేరావు కదా!
అన్నం కావాలి. అన్నంతిని ఆకలిని తీర్చుకుని ఆరోగ్యంగా వుండాలి అని కోరుకుంటేనే కడుపు నిండదు కదా. కంచంలోకి బువ్వ రావాలంటే - అంతకు ముందటి శ్రమలన్నీ జరుగాలి. అంటే - వ్యవసాయంలోని పనులన్నీ జరుగాలి. పారేటి నీటిని ఆనకట్టల ద్వారా పంటపొలాల వరకు మళ్లించాలి. నీరు వరదలా పారుతున్నప్పుడు నీటిని మళ్లించాం సరే కానీ....నదులు, వాగులు పారనప్పుడు ఎలా? వ్యవసాయం ఆపుకుంటామా? ఆకలితో బాధపడుతామా లేదు. బావులు తవ్వి, బోర్లు వేసి భూగర్బం నుండి నీటిని తోడుతూ పంటలు పండిస్తాం కదా! అంటే మన తండ్రులు, తాతల కాలంలోలాగ. వర్షం కొట్టి, వాగులు పొర్లి, చెరువులు నిండి, మత్తడి దుమికినప్పుడే, బావిలో నీరు ఊరినప్పుడే వ్యవసాయం చేయండం గాకుండా అనేక ప్రత్యామ్నాయ పద్దతులతో వ్యవసాయం చేయడం వుంటుంది. అయితే పంటపండగానే ఆకలి తీరదు. వడ్లను బియ్యంగా మార్చాలి. కర్రలు లేదా గ్యాసును సమకూర్చుకుని పొయ్యిని వెలిగించాలి. వంట పాత్రలో బియ్యం, నీరు పోసి, పొయ్యిపై పెట్టి ఉడికించాలి. వంట చెడిపోకుండా చూసుకునే వ్యక్తి ఉండాలి. ఆ తర్వాత అలా తయారైన భోజనాన్ని ఆరగించి, ఆకలి తీర్చుకోవచ్చు - అదే విధంగా ప్రజా ఉద్యమాల సంగతి కూడా.
నిబద్దతతో, నిమగ్నతతో ప్రజల్లోకిపోతూ చైతన్యపర్చడం, సంఘటిత పర్చడం, పోరాటాల్లోకి కదిలించడం లాంటి బాధ్యతలను నిర్విర్తించవల్సిన వ్యక్తులు, సంస్థలు ఆ బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోతేనూ లేదా బాధ్యతలను వదిలివేస్తేనూ లేదా నిబద్దతతో పనిచేయ పూనుకున్న వ్యక్తులు, సంస్థలను పోలీసులు ఆటంకపర్చడం, నిర్భంధించడం, హతమార్చడం చేస్తూవుంటే....మనం ఆశింంచినట్లు ఉద్యమాలు సాగకపోతే అందుకు ప్రజలను తప్పుపట్టలేం. పంటలు పండించి, ఆకలి తీర్చుకునేందుకు రైతులు పలు రకాల పత్యామ్నాయమార్గాలను చేపడుతున్నట్లే ప్రజలను ఉద్యమాల్లోకి కదిలించాలనుకునేవారు అననుకూలతల్లో కూడ లభించగలిగే అనుకూలతను ఉపయోగించుకుంటూ ఉద్యమాల పంట పండించగలుగాలి. అయితే మీరన్నట్లు గతంలోలాగ సులువుగా ప్రజల్ని ఉద్యమాలలోకి కదిలించడం సాధ్యం కాదు. అందుకు కారణాలుగా చెప్పుకోవాల్సివస్తే...
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు, విష సంస్కృతి వలన సమాజంలో అనేక దుష్పరిణామాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు, మానవీయ విలువలు దెబ్బతిన్నాయి. ఇంటర్‍నెట్ వలలో చిక్కుకుని మొబైల్ పోన్లను గెలుకుతూ కూర్చొనడానికే యువతకు సమయం చాలడం లేదు. యువతరం మాత్రమే కాదు పసిపిల్లలనుండి ముసలోల్ల వరకు టీవీలు, ఫోన్లకు ఆకర్షించబడ్డారు. సాహిత్యాన్ని, దిన పత్రికలను చదువేందుకు కూడా ఆసక్తి చూపడంలేదు. చదవడం సంగతి పక్కన పెడితే కనీసం భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులతోగాని, ప్రయాణంలో పక్కనున్న వ్యక్తితో గాని తీరిగ్గా మనుసు విప్పి మాట్లాడే పరిస్థితులే కరువయ్యాయి. చంటిపిల్లలు ఏడుస్తుంటే ఏడుపును ఆపించే ఓపిక సైతం లేక పిల్లలకు సెల్‍ఫోన్లు చేతికిస్తూ చూస్తూ సంతోషించమంటున్నారు. ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయతలు తగ్గిపోతూ అసహనం పెరుగుతున్నది. ప్రజల ఆలోచనలు, అలవాట్లు కలుషితమైపోతూ, కంపు గొట్టేలా మారుతున్నాయి. అవకాశవాదం, అవినీతి, లంపెనైజెషన్, మత్తుపదార్థాల వాడకం, నిరుద్యోగం, మార్కెట్టు సంస్కృతి తదితరాలతో యువతరం పక్కదారి పడుతున్నారు. మరో మాటలో చెప్పుకోవాలంటే కావల్సుకుని, పలువిధాలుగా పాలక వర్గాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి.
మానవ సమాజానికే కాకుండా మొత్తం ప్రపంచానికి, ప్రకృతికి సామ్రాజ్యవాదం కరోనా వైరస్‍లా పట్టుకుంది. దానితో బ్రాహ్మణీయ భావజాలం అంటకాగుతున్నది. కనిపించని వైరస్‍లా కాకుండా బాహాటంగా కనిపిస్తూ, బలాదూర్‍గా వ్యవహరిస్తూ పలురకాల విధ్వంసం సాగిస్తున్నప్పటికీ గత మూడు దశాబ్దాల క్రితం నాటిలాగా ప్రజల ప్రతిఘటనలేదు. అయినంత మాత్రాన ప్రజలు ఇక ఉద్యమించరని అనుకోవద్దు. బొగ్గుకు అగ్గితోడైతే, ఆక్సీజన్ వీస్తుంటే దావానలంగా మారుతుందన్నట్లుగా - వర్గ సమాజంలో వర్గపోరాటాలు సజీవంగానేవుంటూ, ఊహించని విధంగా ఉద్యమాలు పుట్టుకురావడం చారిత్రక సత్యం, అలా పరిణమించాలని ఆశిద్దాం.
18 సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమే అంటారా?
గతితార్కిక, చారిత్రిక భౌతికవాదం ప్రకారం వర్గపోరాటాల ద్వారానే సమాజంలో మార్పులు వచ్చాయి, వస్తుంటాయి. ఆ పోరాటాలకు సాహిత్యం దోహదపడాలి. పడుతుందికూడ. గత అనుభవాలు, వర్తమాన పరిస్థితులు, సమస్యలు, మూలాలను మార్క్సిస్టు దృష్టితో లేదా శాస్త్రీయ దృష్టిలో విశ్లేషిస్తూ వర్గపోరాటాలు మరోమెట్టు ముందడుగు వేసేలా సాహిత్యం దోహదపడుతుండాలి. పోరాటాల నుండి నాయకత్వం పుట్టుకచ్చునట్లుగానే సాహిత్యమూ పుట్టుకస్తూ తిరిగి ఆ పోరాటాల బలోపేతానికి దోహదపడుతుండాలి. ఏది ఏమైనా ప్రజా ఉద్యమాలు లేకుండా సాహిత్యమే సమాజంలో మార్పు తీసుకురాదు.
19 కొత్తగా మీరు ఏమి రాసారు? ఇంకా ఏమి రాయబోతున్నారు?
నేను నాలుగున్నర సంవత్సరాల జైలు జీవితం తర్వాత 2013 మధ్య కాలంలో విడుదలై వచ్చాను. దాదాపు రెండు సంవత్సరాలు గదిలో ఒంటరిగా కూర్చోని సింగరేణి విప్లవోద్యమ సంగతులు యాదికి చేసుకుంటూ ‘‘సింగరేణి కార్మికోద్యమ చరిత్ర - నెత్తుటి త్యాగాలు’’ అనే ఉద్యమ చరిత్ర రాసాను. సింగరేణి ప్రాంతంలో తిరగకుండా, ఎవరితోనూ, చర్చించకుండా రాసినందుకు అందులో ఇంకా పేర్కొనవల్సిన విషయాలు ఉన్నాయని తర్వాత అర్థమైంది. అది ఎంత అసమగ్రంగా వున్నా, లోపాలు వున్నా కూడ నెత్తుటి త్యాగాల కార్మికోద్యమ చరిత్రను రాసి ప్రజల్లోకి తీసుకుపోయినందుకు సంతోషపడ్డాను. అలాగే ఈ నవలను 40 రోజుల అతి తక్కువ కాలంలో పలువురు మిత్రుల ద్వారా ఇంగ్లీష్‍లోనికి అనువాదం చేపించి ‘‘ది హిస్టరీ ఆఫ్ సింగరేణి మైనర్స్ మూవ్‍మెంట్’’ పేరుతో ప్రచురించి ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. గోదావరిఖనిలో జరిగిన అంతర్జాతీయ గనికార్మికుల సదస్సులో ఆవిష్కరించి అమ్మడం, పంచడం ద్వారా సింగరేణి కార్మికోద్యమ చరిత్ర 20 దేశాలకు, అలాగే దేశంలోని పలు ప్రాంతాలకు పోగల్గింది.
అలాగే 2017లో ‘‘జైలు కమ్యూన్’’ పేరుతో మరొక పుస్తకం రాసాను. కాని ఆర్థిక సమస్యల కారణంతో ఆ పుస్తకం ప్రచురణకు నోచుకోలేదు. 1980 నుండే వరంగల్ సెంట్రల్ జైలులో మావోయిస్టు పార్టీకి చెందిన రాజకీయ ఖైదీలకు విడిగా ఒక బ్లాకు వుండేది. ఆ బ్లాకులోనే విడిగా వంటగది వుంటూ వారి వంట వారే చేసుకోవడం జరిగేది. బయటి నుండి విప్లవ సాహిత్యం తెప్పించుకుంటూ వందలాది పుస్తకాలతో బ్లాకులోనే లైబ్రరీని నడుపుకునే వారు. జైలును రాజకీయ పాఠశాలగా మార్చుకుని, రాజకీయ ఖైదీలలో రాజకీయ చైతన్యం, క్రమశిక్షణ, నిస్వార్థం, నిజాయితీ, త్యాగనిరతిని పెంచేందుకు ఖచ్చితమైన నియమ నిబంధనలతో ‘‘కమ్యూన్’’ను నడుపుతూ రావడంజరిగింది. 2009మధ్య కాలం నుండి దాదాపు రెండు సంవత్సరాలు నేను వరంగల్ జైలులో విచారణ ఖైదీగా కమ్యూన్‍లో వున్నప్పుడు కమ్యూన్ బాధ్యునిగా, ఖైదీల హక్కుల వేదిక కన్వీనర్‍గా కొనసాగాను. ఆ విధంగా ప్రత్యక్ష అనుభవం ఉన్నందున జైలు కమ్యూన్ ఎందుకు, ఎలా నడిచిదో ప్రజలకు పరిచయం చేయాలనే ఆలోచనతో ‘‘జైలు కమ్యూన్’’ రాయడం జరిగింది. కాని ప్రచురణకు నోచుకోలేదు.
అలాగే ‘‘సాహితీ గోదావరి’’కి కొన్ని కవితలు రాసి పంపగా ప్రచురించారు. మరొక ప్రయత్నంగా ‘‘విప్లవమాత గజ్జెల లక్ష్మమ్మ స్మృతిలో’’ మరొక చారిత్రాత్మకమైన నవలను రాసే ప్రయత్నంలో వున్నాను. సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన బెల్లంపెల్లికి చెందిన గజ్జెల లక్ష్మమ్మకు - విప్లవోద్యమానికి వున్న సంబంధాలు, గాథలకు అక్షరరూపం ఇస్తున్న నా ప్రయత్నం త్వరలో పూర్తి కానుంది. ఆర్థిక సమస్యకు పరిష్కారం లభిస్తే ముద్రణకు నోచుకుని ప్రజల ముందుకు రాగలదు.
20 చివరగా మా ప్రశ్న ఏమంటే -పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గొదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరు ఏమి చెప్పదల్చుకున్నారు?
కవులు, రచయితలు, సాహితీ వేత్తలకు చెప్పగలిగేంంతటి జ్ఞానవంతున్ని గాకపోయినా కూడ, నాకు తోచిన కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నా మాటలను అభిప్రాయాలను మీకు తెలిపే అవకాశం లభింపచేసి, మీ వరకు అందిస్తున్న గోదావరి అంతర్జాల పత్రిక నిర్వాహుకకులకు అభినందనలు.
మిత్రులారా...!
కలలు, సాహిత్యం ప్రజల కోసమే ఉండాలని మార్క్సిస్టు మహోపాధ్యాయుడు మావో చెప్పిండు. ఆ ప్రకారం చూసినప్పుడు ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా రచయితలు, కవులు, కళాకారులు తదితరులు ఆయా సామాజిక సమస్యలు, చరిత్రలు, సిద్దాంతాలపై సమగ్ర అవగాహన కలిగి వుండాల్సిన అవసరం ఉంది. అనేక గ్రంధాలు, పత్రికలు చదువుతుండటం, సామాజిక అధ్యయనాలు జరుపుతుండటం కూడా చాల అవసరం. అయితే వాళ్ల్లు పాఠకుల కోసం రచనలు చేస్తున్నప్పుడు పాఠకులకు అర్థంకాని పాండిత్యంతో గాకుండా సరళమైన ప్రజల బాషలో స్పష్టంగా అర్థంచేసుకునే విధంగా రాయాలి. నేటి పాఠకులను దృష్టలో పెట్టుకుని చిన్న చిన్న కథలు, వ్యాసాలు, చిన్న నవలలు రాస్తే బాగుంటుంది. సామాజిక సమస్యలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వార్తలు, నిన్నటి సమస్యలు పాఠకులకు పాసిపోయినవిగా అనిపిస్తుంటాయి. పూసల్లో దారంలాగా గతం గురించి చెప్పుతూ, వర్తమానంపై కేంద్రీకరిస్తూ భవిష్యత్తు పరిణామాల గురించి చెప్పుతుండాలి. ఈ రోజు సమాజంలో రగులుతున్న సమస్యలు, భవిష్యత్తులో తీవ్రతరం కానున్న సమస్యలు, అందుకు కారణాలు, పరిష్కారాలు ఏమిటి? ప్రజా ఉద్యమాలకు ఎవరు ఏ విధంగా ఆటంకంగా వున్నది, తక్షణ ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎలా సాధ్యం అనే విషయాలపట్ల ప్రజలకు కనువిప్పు కలిగేలా, ప్రజలను కదిలించేలా రచనలు వుండాలి. అది కూడా తక్కువ పేజీలతో సూటిగా, స్పష్టంగా అర్థమయ్యేలా వుండాలి. కీలెరిగి వాత పెట్టాలన్నట్లు సామాజిక రోగాలను గుర్తింపచేస్తూ రోగానికి తగ్గ మందును వాడించేలా సాహిత్యం వుండాలి తప్పితే రచయిత బుర్రలో పుట్టిన పాసిపోయిన పదార్థానికి సుగంధాలు, వర్ణనలు (శిల్పం) జోడించినప్పటికీ రోగులుగా వున్న పాఠకులు పొందే ఫలితం ఏముండదు. ఆశించిన ఫలితాలు రావు.
గత కొన్ని వారాలుగా కరోనా వైరస్‍తో ప్రపంచదేశాలు, ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై నేను చెప్పుతున్పప్పటికి 210 దేశాలకు వైరస్ విస్తరించి దాదాపు 17లక్షల మందికి వ్యాధి సోకడం, ఒక లక్షమంది మరణించడం జరిగింది. టీవీ ఛానల్లు, దినపత్రికల్లో కరోనా ముచ్చట్లు తప్ప మరేమీ ఉండడంలేదు. సహజమే మరి. అయితే గత కొన్ని దశాబ్దాలనుండి ‘‘సామ్రాజ్యవాద వైరస్’’ స్పష్టంగా కనిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని, ప్రాణులను, ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల సంస్కృతిని....ఎలా విధ్వంసపరుస్తూ వస్తున్నదో, ఫలితంగా లెక్కించడానికి సాధ్యంగాని మరణాలు, వ్యాధులు, బాధలు ఎలా తీవ్రమవుతున్నాయో ప్రజా రచయితలు ప్రజలకు తెలుపాలి. ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న ఆ సామ్రాజ్యవాద వైరస్‍ను అభివృద్దిగా వర్ణిస్తూ, నమ్మిస్తూ, దాన్ని భుజాలపై మోస్తూ, నెత్తినెట్టుకుని ఊరేగుతూ, దాని అగ్రనాయకుల చంకలు నాకుతూ, వారి చేయిని తాకడమే మహాభాగ్యమని తరించిపోతూ, వారు వచ్చినప్పుడు అంతులేని హంగామా చేస్తూ వస్తున్న వారి ( వైరస్ వందిమాగధుల) గురించి బట్టబయలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తుండాలి. కరోనా వైరస్ సమస్య కొంత కాలంలో సమసి పోవచ్చు కాని సామ్రాజ్య వాద వైరస్ సమస్య మిగిలే వుంటుంది. - కరోనా వైరస్ కారణంగా విధిస్తున్న లాక్‍డౌన్ వలన, నివారణ చర్యల వలన ఏం జరుగుతున్నదో, ఏం జరుగనున్నదో గమనించాలి.
పరిశ్రమల్లో ఉత్పత్తులు ఆగిపోతూ, అన్ని రకాల వ్యాపారాలు ఆగిపోతూ, ట్రాన్సపోర్టులు ఆగిపోతూ, కొనుగోళ్లు ఆగిపోతూ, నిర్మాణాలు ఆగిపోతూ, ఉద్యోగాలు ఊడిపోతూ, ఉపాధులు ఆగిపోతూ, ప్రజల ఆదాయాలు ఆగిపోతూ, ప్రభుత్వాల ఆదాయాలు కుంటుపడుతూ, ఖజానాలు ఖాళీ అవుతూ, ప్రజల ఆర్థిక స్థితి, కొనుగోలు శక్తి క్షీణిస్తూ - నిరుద్యోగం, పేదరికం, ఆకలిబాధలు, ఆకలి చావులు, అనారోగ్యాలు పెరుగుతుంటాయి.
ఈ పాటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు కరోనా వైరస్ దుష్పరిణామాలు భరించలేనివిగా మారతాయి. అలాంటి పరిస్థితుల్లోకూడ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదార్లు, పాలకులు తమ విధానాలను మార్చుకోరు. ఫలితంగా ప్రజల అన్ని రకాల సమస్యలు మరెంతగానో తీవ్రమవుతాయి. - ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్య పర్చుతూ కదిలించేలా రచయితలు తమ రచనలు చేయవల్సి వుంటుంది. ప్రజలతో కలిసి ఉద్యమాల్లో నడువవల్సి వుంటుంది.
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు