మా రచయితలు

రచయిత పేరు:    రావిపాటి నాగజ్యోతి

కవితలు

నవజీవన విహంగం 

పొత్తిళ్లలో ఓ ఆడపిల్ల

ముద్దులొలికే ముద్దబంతి పువ్వై

ముద్దు మాటలు చెప్పు

పాలుగారు పసితనం

 

ఆ చిట్టితల్లి కాలి మువ్వల సవ్వడి

సందడిని తనవెంట తేగా

ఆడిపాడిన బాల్యం

తెలియక గడిచింది

 

అమ్మ చాటు ఆ బుట్టబొమ్మ

పరువపు రాగలతో

ప్రాయపు సిరిలను పొంది

ఊహల పల్లకిలో ఊరేగుతుంటే

 

అరవిచ్చిన కలువ కన్నుల

చిన్నదాని నవ్వుకు ఆంక్షలెన్నో

చూపులు కత్తులై గుచ్చుతుంటే

పరదాల చాటునే దాగే వైనం

 

కోరిన విద్య తన సొంతమవగా

అణకువతో అందలం ఎక్కినా

పురుష గర్వం వెలుగు చూడనీక

నీడలా తరుముతుంటే

 

సహనమే తన తోడుగా

సాహసయాత్ర చేస్తూ

నవజీవన యానంలో

సమిధగా సాగుతుంటే

 

గుండెలపై పడిన బంధం

కొత్త మలుపులు చూపిస్తే

ఇల్లాలి పాత్రలో ఒదిగిపోతూ

నిలువెల్లా కరిగిపోతూ

 

పునర్జన్మ లో తల్లిగా

ప్రాణంపోస్తూ తరానికి

తరగని పునాదిగా

బలాన్ని ఇచ్చి

 

బహుముఖ ప్రజ్ఞగా

ఒరిమిలో భూమిజగ

భాధ్యతను భుజాలపై

అవలీలగా మోస్తూ

 

నవోదయాల కాంతికి

చిరునామా అవుతున్నా

మృగాళ్లు చేతిలో చిక్కి

శల్యమై నెత్తురోడు

 

అతివను అబలగా

బంధించే  మనుష్య

వైఖరికి చరమగీతం పాడి

చెడును అంతమొందించి

 

ఆత్మరక్షణ ఆయుధంగా

జీవంపొరటమే సలుపగా

ఉద్భవించదా మహాశక్తి

స్వేచ్ఛను పొందు విహంగమై!

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు