మా రచయితలు

రచయిత పేరు:    పల్లిపట్టు నాగరాజు

కవితలు

ప్రేమ రంగు ఆకాశం

ఆకాశం నీలిరంగు
సముద్రం నీలి రంగు
అమ్మముఖం ఏ రంగు?

పొద్దున్నే సూరుడిదేరంగు?
పొయ్యలో నిప్పుదేరంగు?
పొయ్యికాడ మనకోసం బువ్వై ఉడికే
తల్లిగుండెదేరంగు?

అడవులు
అడవులు నిండిన
ఆకురంగుపాటలపర్వతాలలోయలు
తోటలు
తోటలుపై కూతలయ్యే
ఈకమెరుపుల పిట్టల సమూహాలు
ఇంద్రధనుస్సులోకాన్ని
కనుపాపల్లో బొమ్మ గీసిన ఆమెరంగేది?

నదులు
నదులవెంబడి మైదానాలై
నేలంతా పరుచుకున్న ప్రాణస్పర్శ వీధుల్లో
రాళ్ళురప్పలు
రాళ్లపై పురాతన పాదముద్రల భాషలో
కాలాన్ని పురిటిబిడ్డగా లాలిస్తూ,
ప్రపంచానికి 'పాలిస్తూ'-

పుట్టుక్కే మూలమైన చోట
పుట్టుకే ప్రశ్నార్థమైన తావా
పంటిబిగువులో
అగ్నిపర్వతాలను అదిమిపట్టి
కుమిలిపోతున్న ఆ పేగుల్లో బాధదేరంగు?

అన్నీ తానే అయినా
అన్నీ తనవే అయినా
ఏ కొన్నింట్నీ కొంగునముడేసుకోలేనీ
మాతృమూర్తి త్యాగానిది ఏ రంగు??


 

దిగులుపోత

ఏదో వెలితిగా ఉంది
కాలుబయటపెట్టి అలా తిరిగిరాకుంటే
కబుర్లుచెప్పే మిత్రుని ముఖంచూసి రాకుంటే

ఎంత కాలమైంది?
ఒక వెచ్చటి కరచాలనం చేసి
నాలుగు మాటల పూలు
చెలిమి దోసిట్లో నవ్వుతూ పోసి
యాంత్రికంగా సెల్పోన్లో పలకరింపులే గానీ
ఎదురెదురుగా కూర్చొని
ఏ నాలుగు రోడ్ల కూడలిలో అన్ని టినీళ్లు తాగి
ఎన్నిదినాలయింది.

దూరం దూరంగా ఉండటమే
బతుక్కిరక్ష అయ్యాక
దగ్గరతనమేదో లోపల ఒంటరి గువ్వయ్యి
గొంతు కూకోనుంది

ఎన్నాళ్ళయిందస్సలు
ఎండలోనో వానలోనో
యకాయకా వచ్చిన చెలిమిగాలి
గ్లాసుడు మంచినీళ్లుతాగి భుజంపై చేతులేసి

ఏమిటో అన్నీ ఇంట్లోనే అయినా
ఎందుకో అందరం ఇంట్లోనే వున్నా
మనసులో ఏదో ఇరుకుగా ఉంది

ఇన్నాళ్లు 
ఇళ్లంటే ఇల్లు మాత్రమే అనుకున్నాను
కుటుంబమంటే కుటుంబం మాత్రమే అనుకున్నాను
దినమంతా యాడాడో తిరిగినా
సాయంత్రంగూడు చేరుకోవడమే పిచ్చిగా బతికేసాను
ఇపుడు ప్రతిపూటా
ఇంటితొర్రలోంచి విశాల ప్రపంచంలోకి తొంగిచూస్తూ
ఎటూ ఎగరలేని మనిషిపక్షినయ్యాను.

ఔరా...!
కంటికి కనిపించని నిజం
కంటిరెప్పలకింద ఎన్ని దిగులు సముద్రాల్ని తవ్వుతావుంది..!
అయినా
ఏ దిగులైనా ఎంతకాలముంటాదిలే
రేపో మాపో
మహా అయితే ఎల్లుండి.!
***             **               ***

 

మట్టి పొరలకింద

చుట్టూ..
పలుగు పారల గాయాలశబ్దం
నాగలికర్రుల ఎక్కిళ్ళ అలికిడి

మట్టిని తవ్వే చేతులు
మట్టిని దున్నే పాదాలు
వొళ్ళంతా మట్టివాసనతో పరిమళిస్తున్న సమూహాలు
కళ్ళలో మట్టికొట్టిపోతుంటే
కళ్ళుమూసుకుని ఎంతకాలముంటాయి?

మట్టి పగిలి
మట్టి పిగిలి
మట్టిపై ద్రోహపన్నాగాల్ని
మట్టిగలిపేయడమే చరిత్రపాఠం గదా!
మట్టితో పెట్టుకుంటే
మట్టిగరిచిపోవడమే!

మట్టే బువ్వై
మట్టే నవ్వై
మట్టికి సాగిలిపడి పట్టంగట్టే రోజులు
మట్టిపొరలకింద మొలకెత్తుతున్న
మట్టిమొలకల భాష
మక్కిపోయిన మురికిచెవులకు వినిపించదంతే!

మనుషులంతా
మట్టినితొడుక్కుని తిరుగాడే మట్టికువ్వలు
మట్టివేళ్ళతో చిగురించే మట్టిబొమ్మలు

శతకోటి కుట్రల
శత్రు వలయాల నడుమ
గుండెనిండా మట్టి వాసన పీల్చు
మనిషిగానైనా మిగుల్తావు!

**              ***               **
 

 

 

పోరుగాలి

అదే పనిగా 

కొట్టుకొంటోంది కిటికీ

పదేపదే 

వచ్చి పోయే గాలికి

        *

ఎక్కడదీగాలి?

ఎందుకింతలా యీ గాలి?

సంకెళ్లు తెంపుకున్న సమూహాల

పిడికెళ్లు పైకెత్తిన హోరు మోసుకుంటూ

చెట్లను

గుట్టలను

సచ్చుగా మొద్దునిద్రలో పడుండనీక

వొకటే పోరు గాలి

         *

చెరువుల వీపులపై సత్యవాక్యాలను రాస్తూ

దారుల చెవుల్లో పోరు రహస్యాలను పాడుతూ

అలలు అలలుగా కదిలి

ఎడతెరపి లేకుండా ఇంటిని చుట్టుముట్టిన గాలి

           *

అంతా పొరుగాలియేరు పారుతున్న బొమ్మ

చుట్టూ పొరుగాలివాగు సాగుతున్న చెమ్మ

           *

కిటికీలు

తలుపులు

గుండెల గోడల ఇళ్లు

అదే పనిగా కొట్టుకుంటున్నాయి

ఊరిలో

గాలి పోరులో..!

 

**      **      **

దుఃఖపు ఊబి

ప్రేమించడం

మొదలుపెట్టినప్పటినుంచే

దుఃఖించడం ఆరంభమైంది

రోజురోజుకీ కొంచెం కొంచెం

దుఃఖంలోకి దుఃఖం రగుల్చుతున్నమంటల్లోకి

చొచ్చుకు పోతున్నాను

గోతంలో ఇసుక పోసి కూరినట్టు

లోపల లోపలికి వేదన కూరుకుపోతావుంది

 

ఎక్కడెక్కడో తిరుగుతూ వున్నా

ఏడుపు గుంజకు కట్టేసిన కుక్కపిల్లలా

మనసు గిలాగిల్లాడుతున్నది

 

పర్వతాలకు

హిమాలయాలని

వింధ్యా సాత్పురాలని పేరుపెట్టేవాళ్ళకు

గుండెలోపలి దుఖఃపర్వతాలు కనిపిస్తాయా?

మోసుకుతిరుగుతున్న దిగులు సముద్రాలు

వినిపిస్తాయా???

 

కేవలం విలపించడం ఎంత తెలివిమాలినతనం?

కేవలం దుఃఖించడం ఎంత పిరికితనం?

ప్రేమించి ప్రేమించి

ప్రేమకోసమే దుఃఖపుఊబిలో దిగబడిపోతూ..

 

కూర్చున్న కుమిలే చోటుమీద

నడుస్తున్న నగ్నదారిమీద

దారికి ఇరువైపులా 

నిస్సహాయతగా నిలబడ్డ చెట్లమీద గుట్లమీద

రాళ్లురప్పలు మీద ,తుప్పలు మీద

తుప్పలకు ఆవల అరణ్యాలమీద

అరణ్యాల ఎదలు పాడే పాటలుమీద

పాటకు పరవశించి చిందుతొక్కే పక్షిరెక్కలు మీద

ఎంత ప్రేమ ఉంటే ఇంతటి దుఃఖదార ఉబుకుతుంది

ఎంత ప్రేమ ఉంటే ఇంతటి దిగులువాగు పారుతుంది

 

ప్రేమించడం పరమ పవిత్రమైన కార్యమని

కాలం నుదుటిపై వణికే పెదవులతో

తనివితీరా ముద్దాడిన శోకగీతం

ఎంతకాలమిలా పొగిలిపొగిలి పారుతుంది??

                     *

యీ పొడవాటి దుఃఖాలు సాగిసాగి

దుఃఖపు లోయలు పగులుతాయని

ప్రేమల మైదానాలు పిగులుతాయని

ప్రేమించడం మొదలైనప్పటినుంచి

దుఃఖపు కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నాను

దుఃఖానంతరం మండే ఆక్రోశగీతానికై..!

 

 

కోపమాధుర్యం

ఒక్కోసారి కోపం కూడా

చాలా బావుంటుంది

బావుండటమంటే?

ముద్దుగా మురిపెంగా

మనసు కొమ్మపై అలకపిట్ట వాలినంత

ముచ్చటగా ఉంటుంది.!

 

అనురాగపు నదిపొంగి

మదివొడ్డును గారంగా కౌగిలించుకున్నట్టు

 

అప్పుడప్పుడు

అమ్మో నాన్నో..

అన్నీ వదులుకుని

గుండెకుటీరపుగడపలో ముక్కర్రలానో

ఇంటి నట్టింట దీపంలానో వెలిగే తను...

విల్లులాంటి కనుబొమ్మలు సంధించి

కోపంగ చూడటం చాలా అందంగా ఉంటుంది

 

పంతాలు నెగ్గే కోపం పనికిరాదు కానీ

జీవన వనాన వసంతాలు పూయించే

కోపాల కుహూ కుహూ కూసితీరాలి..!

 

కోపం ఎంత మధురమైనదో.!?

కోపం ఎంత వెచ్చనైనదో.!?

కోపం మధురాతి మధురమైనది

ఒకరుకోసం ఒకరు

తడితడిగా వెచ్చపరుచుకునేంత స్వఛ్చమైనది.!

 

ఇద్దరిమధ్య

వొట్టి ప్రేమ మాత్రమే ఏం బావుంటుంది

చలి సాయంత్రపు వేళ చల్లారిన కాఫీలా

కోపతాపాలు లేకుండా బతుక్కి రుచెలా వస్తాది.?

కోపతాపాలు లేకుండా జీవితమెలా గుబాళిస్తాది.?

 

గడ్డిపరకంత కోపమే మొలవకుండా

బతుకు సాగుచేస్తున్నావంటే

ఎదలోపల ఏదో ఎడారి పిలిస్తున్నట్టే.!?

 

ఎప్పుడో ఒకసారన్నా

పిడికెడు మాటల మరమరాలకు

చిటికెడు కోపపుకారం కలిపి చూడాలి

 

రుసరుసల సంగీతం అనంతరం

ఓదార్పుల హృది గీతి అనంతరం

ప్రేమ సముద్రమొకటి

మనసు తీరాన్ని ముద్దాడుతూ

శతాబ్దాలకు ఇంకని చెలిమిపాతంలా..

చెవిలో ఇల్లుకట్టుకున్న మోహాన్ని తాగి చూడాలి..!

 

ఇప్పటికీ

ఆవగింజంత చిటపటలైనా పేలకపోతే..!

యీ సాయంత్రం నువ్వైనా

రవ్వంత కోపాన్నిగీటి చూడు..!

**                      **                          **

30/11/2021.

(తన కోపాన్ని తనకోసం ఇష్టంగా భద్రపరుస్తూ..)

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు