మా రచయితలు

రచయిత పేరు:    సాలం నాగరాజు

కవితలు

జీవితం 

మట్టి గోడలు

తాటి కమ్మలు

తలుపు తాళం లేని

గుడిసె జీవితం !

నా పల్లె జీవితం !!

అయినా సరే..

కూలో-నాలో

చేస్తే ఓ మెతుకు దొరికి

బతుకు సాగే

పేద జీవితం!

నా పల్లె జీవితం!!

 

ఎరుపెక్కిన పొద్దు

విడుపుతో

ఆ గుడిసెలో ఉదయించెను

చీకటి రూపం

అయినా సరే..

వెలిగించిన గుడ్డి దీపంలో

కునుకు తీసే వెలుగు జీవితం!

నా పల్లె జీవితం!!

 

నిదురించిన రేయికి

మెలుకువ నిచ్చే

కోడికూత

ఇంటి ముందు

కల్లాపి

నోటిలోన వేప పుల్ల

మట్టికుండలో రాగి సంకటి 

కూడు బువ్వ

కథలు చెప్పే ముసలి అవ్వ

మేకపిల్లలు

పిల్ల వాగులు

పసిడి పంటలు

పరుగు తీసే

లేగదూడలు

చుట్టు పక్కన

అందరూ చుట్టాలే

కష్టనష్టాలకు తోడునీడలు

అచ్చమైన జానపదం

అమ్మ పాడే జోల పాట

సందు గొందుల్లో పిల్లల ఆట

కల్లాకపటం ఎరుగని

అనుబంధాల జీవితం!

నా పల్లె జీవితం!!

 

తరతరాలకు

కూడు పెట్టే కడుపేద జీవితం

అయినా సరే..

బంగారు జీవితం!

నా పల్లె జీవితం!!

 

 

వలస జీవుల ప్రయాణం 

ఆకలి గోసలో

పరాయి రాజ్యాన

ప్రాణం బడవలేక

తట్ట బుట్టా సర్దుకోని

పిల్ల జెల్లని

సంకనేసి

 

పరుగు పరుగున

కాలి నడకన

నడచినడచి

అలసి సొలసి

 కునుకు తీయబోతే

 తట్టిలేపే దావు భయం ...

 ఇది వలస కూలీల

 బతుకు ప్రయాణం ...

 

ఓవలస కూలి

నీ ఊరు చేరేదెప్పుడు

పరుగు ఆగేదెప్పుడు

 

అలుపెరగని పయనంతో

గాయపడిన పాదంతో

ఆకలి బాధతో

తడి ఆరిన గొంతుతో

చెమ్మగిల్లిన కళ్లతో

సొంత ఊరికి పయనం ...

ఇది వలస జీవుల

కన్నీటి కథనం ...

 

ఓవలస కూలి

నీ ఊరు చేరేదెప్పుడు

పరుగు ఆగేదెప్పుడు

 

కరోనా కల్లోలం

నీ బతుకులో విలయతాండవం

వలస పక్షిలాగా

నీ సొంత గూడు వదిలి

కూడు కోసం

దేశదేశాలు తిరుగుతున్నావా

ఏడు దశాబ్దాల స్వరాజ్యం ..

కూడు పెట్టలేదు

ప్రజాస్వామ్యం ...

 

వలస కూలి

నీ ఊరు చేరేదెప్పుడు

పరుగు ఆగేదెప్పుడు

 

ఓనా దేశ పాలకులారా

అపండి ప్రయాణం

మరణాన్ని చేరకముందే ..

వీళ్ళు కూడా మీకు ఓట్లు

వేసి గెలిపించిన వారే ...

 

కరోనాతో రాబోయే పల్లె పరిస్థితి 

మందులేని మహమ్మారి

మా పల్లె చేరే

లేనిపోని భయం

మాలో లేవనెత్తే

చావుబతుకుల

లెక్క లేవో

టీవీలోన సూపబట్టి

గుండెలోన గుబులు

పెరిగి పీడకలై మెదలవట్టే

 

నమ్మి ఓటు వేస్తే

గెలిచినోళ్ళు పట్టణంలోన

పట్టనట్టు తిరుగుతుంటే

పల్లెలన్ని చిన్నబోయి

పంటలన్నీ ఆరిపోతే

కూడు లేని రాజ్యము

కరోనా కన్నా కష్టతరము

 

మూతికి గుడ్డ

చేయి గడిగే

మందులేని గరీబోళ్ళం

ఎవరు రాక

ఎదురు చూసి

బతుకులఅన్ని అరిపోతున్నాం

సరిగ్గా కూలినాలి

లేక డొక్కలన్ని ఎండిపోతున్నాం

చిరు నవ్వులన్ని వాడిపాయే

సావు కల నాట్యమాడే

పట్టించుకునే నాథుడేమొ లేకపాయె

 

పల్లె పరిస్థితి

చూసి జర ఆదుకుంటే

మళ్లీ ఓటేసి

పట్నం పంపుతాం..

ఈ కష్టకాలంలో

మమ్మల్ని చూసుకుంటే

మళ్లీ పట్టంకట్టి

మిమ్మల్ని ఆదుకుంటాం..

ప్రజా ప్రశ్న..!!

తరతరాల నుంచి చెబుతున్న తీరని వ్యధలే

ఎన్నటికీ కడతేరని కథలే

సామాన్యుల జీవన విధానాలు

నిరుపేదల నిత్య గాధలు

 

పరాయి రాజ్యాన్ని పారద్రోలి

సాధించిన సంపదేమున్నది

దశాబ్దాల స్వరాజ్యం దరిద్రాన్ని

పోగొట్టిన దాఖలాలెక్కడున్నవి

స్వరాజ్యం అన్నమాట చెప్పుకోవడానికి తప్ప

అనుభవించడానికి ఏమున్నది

 

ఆనాడు పరాయి పాలనలో

ప్రాణం తీసినారు మానం దోషి నారు

బతుకు దోచుకున్నారు మెతుకు దోచుకున్నారు

అభివృద్ధి దేశమని అందంగా అప్ప జెప్పినారు

 

కానీ ఈనాడు కూడా..

స్వరాజ్య పాలనలో మన రాజులు

అదే మాట మళ్లీ మళ్లీ

చెప్పి చెప్పి మభ్యపెడుతున్నారు

మార్పు జరుగుతుందని మతలబు చేస్తున్నారు

 

ఇంకెన్నాళ్లు ఇంకెన్నేళ్లు

ఈ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది

 

ప్రజలారా..!

 

మన కష్టాలు తీర్చేవి కావాలి

కానీ మన కష్టాలు చెప్పుకునేవి ఎందుకు

 

జీవన విధానాన్ని మార్చేవి కావాలి

గాని జీవనవిధానాన్ని మురిపించేవి ఎందుకు

 

జ్ఞానంతో ఎదిగేవి కావాలి

గాని అజ్ఞానంలో మునిగెవెందుకు

 

ఓ మనిషి బతకడానికి నిత్యావసరాలు కావాలి

కాని అనవసరమైనవి ఎందుకు

 

జనులారా..!!

 

ప్రశ్నించే తత్వం లేనిదే మార్పు లేదు

మార్పు లేనిదే మనుగడ లేదు

మనుగడ లేకపోతే మనిషి లేడు

 

ప్రజలారా..!!!

 

మీ వంతు ప్రయత్నం లేకపోతే

ఈ ప్రజాస్వామ్యంలో మీ పాత్ర పోషించకపోతే

తరతరాల కైన ఈ తంతు మారదు

 

ఏమని తెలుపను...!!

నడిరాతిరి నిశీధిలో

తట్టి లేపి కలవరపరిచే

కవిత్వమా...ఆగని పోరాటమై

అక్షరాలు సంధించి ఏం శోధించి

సాధించ ఆవహించావు

 

జ్ఞానాన్ని అమ్మే

ఈ అజ్ఞాన లోకంలో

విజ్ఞానాన్ని పంచ మంటావా

పైసల కోసం దిగజారిన

విద్యావ్యవస్థల

తీరు వల్ల

ప్రజలు పడుతున్న

అవస్థలు

చూడ తలచితివా

ముక్కుపచ్చలారని

పసి మనసుల

స్వేచ్ఛను నాలుగు

గోడల మధ్య

పాతరేసే

ఈ విద్యా విధానాన్ని

తిలకింప తలిచావా

జ్ఞానాన్ని కొంటున్న

దౌర్భాగ్య దృశ్యాన్ని

దర్శింప చేయమంటావా

విద్య నేర్వని వాడు వింత పశువైతే

విద్య నమ్మేవాడు ఏమవుతడో

ఏ అక్షరాల కలబోతతో

ఈ వలపోత వినిపించ మంటావు

 

పండించే రైతుకే

కూడులేని

ఆ ఆకలికేకలు

వినగలుగుతావా

తరతరాల పంటలు

తీర్చలేని కష్టాలు

ఆత్మహత్యలకు

దారి తీస్తే

ఆ దృశ్యాలు చూడగలుగుతావా

వరదల్లో

నారు పొలం

నీటమునిగితె

రైతన్న గుండె

పగిలిన

ఆ బాధ భరించగలుగుతావా

పంట పోయి

మొడైనా

ఆ జీవితాల

ముందు నన్ను

ఎట్ల మోకరిల్ల మంటావు

అనావృష్టికి

ఎండిన బతుకులు

అతివృష్టి

ముంచిన బతుకులు

ఏ పదాల అల్లికతో

ఈ పసిడి రైతుల గోడు వినిపించమంటావు

 

 

తరాలైనా మారని సమాజతత్వం

ఓ..! తల్లి...!!

ఈ మనుధర్మం ఆంక్షలతో

నిన్ను బంధిస్తున్నదా

అన్ని రంగాల్లో ముందుకు

వస్తున్నారని ఆనంద పడక

అప హేళన చేస్తున్నాదా

 

నిబంధనలు విధించిన ఆ రాతియుగపు

ఆనవాళ్లు ఇంకా నిన్ను వెంటాడుతున్నయా

మనిషిని మనిషిగా చూడలేని ఈ లోకం

నిన్ను ఆడదని చులకనగా చూస్తున్నాదా

 

సమానత్వాన్ని మరిచి

ఈ సమాజం మానవత్వాన్ని

మట్టి కలుపుతున్నదా

మనిషి తత్వాన్ని వదిలి

నీ వ్యక్తిత్వాన్ని చంపుతున్నాదా

 

తల్లులారా....! అక్కచెల్లెల రా..!!

కలత చెందకండి

కన్నీరు కార్చకండి

మనోబలంతో ముందడుగేయండి

స్వేచ్ఛకై పోరాడి

మానవధర్మాన్ని చాటి చెప్పండి

తరతరాల చరితను మార్చి

రేపటి తరానికి నాంది పలకండి

 

చిన్నతనం నుంచే ఆడపిల్లలని

బలహీనతను పెంచి పెద్ద చేస్తున్నారు

కన్నా అమ్మైనా పెంచే నానైనా

తోబుట్టువులైనా బంధుమిత్రులైన

అసమానతలతో

మనిషితనాన్ని గుర్తించకపోతే

ఇకపై సర్దుకోకండి..!

సహించకండి...!!

 

ఉరుమై ఉరిమి

ఉగ్రరూపం దాల్చండి

పిడికిలి బిగించి

పిడుగై దూకండి

మీ ఉనికిని చాటి

ఉన్నత స్థానాలకు చేరండి

నరం లేని ఈ సమాజ తత్వాన్ని

మీ స్వరంతో సమాధి చేయండి

 

 

                                           

                                         

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు