మా రచయితలు

రచయిత పేరు:    గుండేటి శ్రీధర్

కవితలు

ఏమని రాయను 
 

మా అమ్మ కమ్మదనం ఏమో గానీ,

కొంచెం మా అమ్మ బతుకులోకి తొంగి చూస్తే

బతుకంతా  అన్నం మెతుకుల వెతుకులాట

ఒక కొట్లాట

 

కష్టాల కడలిలోలే

కన్నీళ్ల నదులను

తనలో కలిపేసుకుంటున్న

మా అమ్మ బతుకును

ఏమని రాయను

ఏమని పాడను

ఏమని మాట్లాడను

 

రాసిన

రాయడానికి రాతలే కాదు

పాడటానికి పదాలు

మాట్లాడటానికి మాటలు

కూడ పెగలట్లేదు

 

అయిన నా పిచ్చిగాని

మా అమ్మ ఆయువంతా

అరిగోసాలు పడుతుంటే

ఆవేశంగా

మా నాన్న ఊగుతుంటే

ఒక్క అక్షరాల మాల అమ్మ మెడలో ఎలా వేయమంటావ్

 

కడుపులో కత్తులు

కాలిలో ముళ్లులు

కూడబలుక్కొని కుచ్చుకుంటున్న

నా కన్నతల్లి కన్నీళ్ల గురించి

ఏమని కవితలు రాయను

 

ఒకవేళ రాసినా

తన కాలి ధూళికి

కూడ సరితూగదు కదా!

 

నేనెవరిని 
 

నేనెవరిని

గుండేటి సుధీర్

 

చిగురించే నేలలో

చితికిపోయిన బతుకులు నావి

చినుకుల వర్షంలో

చితిలా మండుతున్నావాణ్ణి

 

పాడుబడ్డ బతుకులో

గుడ్డిదీప వెలుగులో

చూస్తున్న...నన్ను నేనే

 

నేనెవరిని అని

నేనెవరిని అని

 

పుష్పించే చెట్లకు

ఉరితాళ్ల ఉయ్యాల్లా

ఊగుతూ చూస్తున్న

 

నాకోసం వస్తున్నాయి

రైళ్లు వెతుకుతూ  వెతుకుతూ

పట్టాలపై పడుకోబెట్టడానికి

 

నేనెవరిని

 

నాకోసం వస్తున్నాయి

కుల కత్తుక కోరలు

వెతికి వెతికి కాటు వేయడానికి

 

నేనెవరిని

 

నాకోసం వెతుకుతున్నాయి

గోతము సంచులు

ముక్కలు ముక్కలుగా

నరికి

నదిలో ముంచడానికి

 

నేనెవరిని

 

తేలుతున్న చేపలా

శవమై

తెగిపడుతున్న అంగ అంగం

ఏకలవ్యుడి వేలులా.......

 

నేనెవరిని

నేనెవరిని

 

స్వేచ్ఛగా మీరు

సంకెళ్లతో నేను

 

నేనెవరిని

 

షవర్ షాంపూలో మీరు

చెమట కంపులో నేను

 

నేనెవరిని

నేనెవరిని

 

నగ్నంగా నిలబెట్టబడ్డ

దేశ ముఖచిత్రం ముద్రించడానికి

 

నేనెవరిని

 

దేహ గాయాలతో నిలబడ్డ

దేశ గేయాన్ని వినిపించడానికి

 

నేనెవరిని

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు