ఏ కాలం దాపు లేని ఉదయాలు..
నిస్తేజంగా కురుస్తున్నాయ్..
మాపు తెలీని గాయాల మధ్యన ఒక్కో
వెలుగుచుక్క వెలుస్తూనే వుంది..
మాధ్యమాల ఉద్యమ ఊరేగింపుకో
ఉత్సవ విగ్రహమై
దిగ్గున మెరిసి చీకటిలో కలిసిపోతుంది..
ఏ 'దిశ 'నో 'నిర్భయ'ంగా ..నిర్లజ్జగా ..
ఓరేయి తెల్లారితే కాఫీకో బిస్కట్ వార్తై
ఇంకో మనసుని పిప్పి చేస్తుంది.
బరువైన ఆగ్రహాల నడుమ మరోసారి ఆ ఆత్మ నలిగి చితికి పోతూనే ఉంటుంది..
మరునిమిషం మదిగోడల పేరుకున్న మరుపుపూతతో మాయమైపోతుంది.
లేకి చూపుల ఉదయాలకి అనంతాన ప్రమీలా రాజ్యాల జాడ వెదకాలో..
అమ్మపాలతో ఉసురు పోసుకున్న ,పిశాచాల' జాడ్యనికి ఎదురీదాలో..
తెలియని వయసు.. చినిగిన విస్తరాకై చివరకి మిగిలిపోతోంది...
మట్టివాసనలు పేర్చుకున్న.. వావి వరసలు చరిత్రపుటల్లో ఏమూలనో సమాధికాబడ్డాయ్..
బ్రతకలేని పుట్టుక...ప్రశ్నించే లోపే వాడి ఒక్కొక్కటిగా రాలి పోతోంది...
మాసిపోని మనోవేదనకి కొత్త రాజ్యాంగం రాసేదెన్నడు..?
మహిషి రూపం సంతరించుకున్న మనిషి ..మనీషి అయ్యేదెన్నడు...
కాల చక్రంలో కరిగిపోవడం మినహా.. స్వతంత్ర్య కవచంతో మనుగడ సాగించేదెన్నడూ..?
కలాల యుధ్ధంలో కాయజుడు ఓడేదెన్నడు??
వేధించే ప్రశ్నల సమాధానానికై ఉక్కిరిబిక్కిరవుతూనే ఉన్నా..!
నేటికీ నిన్నటి వంచనలోనే బ్రతుకీడుస్తున్నా...!!