మా రచయితలు

రచయిత పేరు:    నూనేటి సురేష్

కవితలు

ఇంద్రవెళ్లి రగల్జెండా
 

పటేల్ సాబ్ పట్వారీ సాబ్

బాంఛాన్ నీ కాళ్ళుమొక్కుతా

గీ భూమి మాది గీ జాగా మాది...

ఇ ధరణి తల్లి కోసమే...

ఏళ్లతరబడి గీడనే బతుకు సాగీతాన్నం...

మా అడవి తల్లి...

మా భూమి...

మా నీళ్లు....

మాకే కావాలి దొరా..

నీ బాంఛాన్...

అని ....

జల్ జంగల్ జమిన్ కై లేవనెత్తిన గొంతులను...

నొక్కి  సంపిందిక్కడే

అమాయక గిరిజనులను పోలీస్

అండతో అనగదోక్కిందిక్కడే..

మాది మాకే చెందాలని తిరగబడితే మచ్చ వేసి మరుగున పెట్టిందిక్కడే...

తూటాలకు రొమ్ము విరిచి ఎదురు నిలబడ్డ ఎర్రమందారాలు నేలరాలిందిక్కడే....

బిగి పిడికిళ్లేత్తిన ఉద్యమాన్ని

ఉసురు తీసిందిక్కడే...

ఆ అడవితల్లి నెత్తురింకా రగులుతూనే రగల్జెండై ఎగురుతున్నదిక్కడే...

గిరిపుత్రుల యేదలపైనా రాచపుండు పచ్చి నెత్తురింకలే....

నా ఆదివాసీ అమరుల నివాళికి ఆంక్షలింకా తొలగలే...

ఆ ఇంద్రవెళ్లి కొండా...కోన...

ఎదురుచూస్తున్నది..

నన్ను హత్తుకునీ ఎర్రజెండా వోలె ఎగురవేసే బిడ్డలెక్కడని...

ఊరి పొలిమేరలో అమరుల ఎర్రస్థూపం ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అమాయకులను అక్కున తీసుకునే అన్నలెక్కడని..

ఇదీ ఇంద్రవెల్లి రగల్జెండా

సెప్పుతాంది...

ఓ గిరిజన రంధీబోకు

సిన్నబోకు...

నీ నరనరానా ఉడుకుతున్ననెత్తురు నేనే...

మీ రగల్జెండానే...

 

ఇంద్రవెళ్లి ఆమరులకు జోహార్లు.....

 

మేడే-మాడిన బతుకులు

సుక్కపొద్దుతో..కోడికూతతో

వాళ్ళ జీవనం మేల్కొల్పు

సంకల సద్దిమూట..భుజాన బతుకు మోత..

పాషిపోయిన బువ్వ మురుసుకుంటా కడుపునింపుకుంటరు..

ఎగిలెత్తే దినమెట్లా గడువాలనే తిప్పలే

పున్నమి వేలుగులు వాళ్లకేరుకవు….

అమాసా సీకట్లే అనుక్షణం….

మనుసు నిమ్మలం ఉండదాయే

వాళ్ళ పని పయనం ఎగిరమెక్కువ

ఆ దారులు ఎటు మలుగుతాయే తెల్వదు..

 

ఆవుసు అరిగిపోతుంది..అప్పుకు ఆలీ పుస్తెలే దిక్కు..

డొక్కలు నిండేదాక బుక్కెడు బువ్వ కోసమే అగచాట్లు..

ఏరోప్లేన్లు ఎరుగవుకార్మిక కష్టాలు….

రోడ్డున తిరిగే రిక్షాబండ్లు వాళ్ళ సుట్టపోళ్లు

చందమామతో వాళ్ళ కష్టాల సల్లని ముచ్చట్లు

ఎండిన నా కార్మిక గొంతులకు రేలా పాటే సల్లని కూల్డ్రింక్

 

కండలు కరుగుతున్నాయ్.. గుండెలా బాధా రవ్వంతయిన కరుగదాయే

 

అడ్డా మీది కార్మికుల అరిగోసలు ఎప్పుడు తీరునో

హామాలి కార్మికుల కాయకాసిన వీపును అడుగు..

నా గడ్డమీదా కార్మికుల బతుకుల గూర్చి బహుబాగా చెప్తాయి..

హామలిలకో పెద్దమనిషి వాడు ఈసమంతైన పని చేయడు..

కానీ గాసానికి పోత్తుకస్తడు….

మా వడ్డెరన్న గుణపానికి భూమితల్లి అదురుతదాటా

చెక్కాడితో డొక్కాడని మా సెంట్రింగ్ కార్మికున్ని అడుగు..

అందని ఆకాశం ఏం  సంగతి యిసారిస్తుందో

కార్మికుల మోములపై

ఎరుపు రంగు చూస్తే ఎందుకో తెలియని సంబురం....

 

నా గడ్డ మీద ఎర్రజెండా మనుసునిండా ఎగురుతలే

ఆ జెండాలో సుత్తి, కొడవలి ఆయుధాలే మరువకుర్రి..

ఎత్తితే గీ దొరగాండ్ల కథ కంచికే….

 

ఎన్నినాళ్ళున్నా సెప్రాసి బతుకులు కావు మావి

స్వార్ధపు గుండెల్ని చీల్చే కండలివి

 

మేడే శుభాకాంక్షలు ఎట్ల చెప్పాలే..

మాడే బతుకులకు సలాం ఐతే చెప్పగలను

 

కార్మికుల ఐక్యత వర్థిలాల్లి

ప్రియమైనా కరోనాకు

కరోనా నీకు భయపడి బాధ్యతగా మెదిగినమ్...

మనిషికి మనిషికి దూరంగా ఉన్నమ్...

మాస్క్ లు పెట్టినమ్...

రీకామ్ లేకుంటా చేతులు కడిగినమ్..

చప్పట్లు కొట్టినమ్... దీపాలు పెట్టినమ్....

ఏమో చేసేటట్టే ఉన్నారనుకున్నమ్..

కొసకు గిట్ల ఎడ్డోళ్లను చేస్తారనుకోలే..

కనికట్టెదో చేసి లెక్కల గారడి చేస్తారనుకోలే...

 

 

అయినా ...నువ్వంటే గౌరవమే...

 

ఎందుకంటే లెనోన్ని ఉన్నోన్ని సమానంగా చూసినవ్...

నీకేం తెల్వదు కులం, మతం, పేద, ధనిక బేధం.....

 

వలస కార్మికులను చిల్లం కళ్ళం చేసినవ్...

పుట్టకొకరు చెట్టుకోకరు అయ్యిర్రు...

కాళీ కడుపు పట్టుకొని... చిరిగిన పాదాలతో మా రహదారులన్నీ రక్తపు మరుకలే...

నడిచే చిన్ని పాదాలకెమెరుక... గీ అలసిపోయిన పయనం ఎందాకాని...

గీ ఒంటరి బతుకులు ఇంకెంత కాలమని...

దేశాలు దాటి ఉన్నవాళ్లకేమో కడచూపు కరువయ్యే...

గిట్ల బతుకెందుకు అనిపియ్యబట్టే...

గా పాలిపోయిన పాదాలకు చెప్పునైనా కాకపోతిని...

వాళ్ళ నోటికాడ బుక్కెడు బువ్వనైనా కాకపోతిని...

 

అయినా...

నువ్వంటే గౌరవమే....

 

ఎందుకంటే లెనోన్ని ఉన్నోన్ని సమానంగా చూసినవ్...

 

మరి గీదేంది మళ్ళా...

అన్ని పారసీటమల్ కతల్ పడ్తవ్...

ఉన్నోనికి యశోదాలా... లెనోనికి గాంధీలా...

మరి నీకు కొంచమన్న లేదా...గివ్వే నచ్చయ్...

గా ఉన్నోన్ని జరంతా గట్టిగా అర్సుకోరాదు..

నీ బాంఛాన్ లెనోన్ని గావరపెట్టకు...

గానికి మాస్కుల్లేవ్..మందుల్లేవ్....

తిననికే తిండిలేదు జర సల్లగా చూడరాదు...

 

నీకోసం కోట్లరూపాలు ఖర్సైనయి...

పది రూపాల మాస్క్ మాదాక రాలే...

కరోనా నిజం చెప్పు గీ స్కామ్ల నీ వాటెంతా....

నువ్వుకూడా గీ కుంభకోణంలా కుమ్మక్కైనవ్లే...

 

జర పదిలంగా ఉండుర్రి అంతా దొంగలమూటనే..

        

 

 

జర సోచాయించు సోలోగా

సొల్లు కబుర్లు సల్లగానే మాట్లాడుకుంటాం...

రచ్చబండ కాడ దేశ రాజకియం ఈసారిస్తాం..

మా సారు ఇట్లా .. మా సారు గట్లా...

అబ్బో మా సారు చిన్నోడు కాదు... దేశమంతా పిట్టల దొర ముచ్చట్లు...

అబ్బర పులి అంటే తోక బారేడు ముచ్చట్లు...

 

గీ సారు మావోడే ఎం చెప్తేగది...

మనం నల్లంటే నల్లా.. తెల్లంటే తెల్లా...

మీరేం ఫికర్ చెయ్యకుర్రి... గుబులు అసలే చెయ్యకుర్రి....

మా సారు సామాన్యుడు కాదు.... ఐతది అంతా అనుకున్నట్టే ఐతది...

గీసొంటి బేకార్ పంచాయతులు ఇక బందుపెట్టుర్రి...బంధూకులెత్తుర్రి....

 

ఓ నవతరమా..... నెత్తురు చచ్చి చిక్కిపోయినవా....

కన్నతల్లి పేగులు పేకల్చి ఎముకలు విరిగే నొప్పులతో నీకు పురుడు పోస్తే....

నవమాసాల నీ జన్మకు అర్ధముందా....

కన్న పేగుగోషా ఆలకించవా.....

మత్తులో ఊగుతున్నవా... తెగతెంచుకున్నవా...

విత్తు భూమితల్లి పొత్తికడుపును చీల్చుకుంటూ మొలకెత్తుతుంది...

అలసి సొలసినా బాటసారికి బంధువైతది....సేద తీరుస్తది...

మరి నీ పుట్టుక ఎందుకూ పనికి రాదా...

వంతు పాడే రాజకీయముకు సందుపెట్టకు....సోర్రనియకు...

 

అమరుల... శవాల మీదా బంగారు నిర్మాణం జరుగుతున్నది...

పునాది బలం లేక బంగారు బంగ్లా కూలతట్టే ఉన్నది...

కూలనీ.. ఆ శితిలాల కిందా కుళ్ళిన శవాలమైదము....

మనం చేతకాని సన్నాసులమవుదాం....

మా కిరాయి బతుకులు గింతే అనుకుందాం...

బంగారు భవిష్యత్తును భవితకు బలినిద్దాం....

 

ఎత్తినా ఆ పిడికిళ్లు...

నినదించినా ఆ గొంతుకలు......

రంకెలేసినా ఆ ఉడుకు నెత్తుర్లు.....

భగ్గుమన్న ఆ త్యాగాలు....

 

అంతా మరిచినం.... మా నాయకులను కొలిచినం...

మేం గొర్రెలమ్.. మేం గొడ్డులమ్...గంగిరెద్దులం..

నువ్వు ఎట్లా చెప్పితే గట్లనే అనే నెత్తురు చచ్చిన యువకులమ్...

మేం నవభారత నిర్మాతలమ్....

 

ఓ నవతరమా....

జర సోచాయించు సోలోగా...

 

బాపు కోసం 

"బాపు"- నాకు ఊహాలేని ఒక మహత్తరమైన పాత్ర....

తన గారాల బిడ్డ ఎక్కి ఎక్కి ఏడ్చినపుడు అక్కున చేర్చుకున్న ఆ కౌగిలి నాకు ఊహ లేదు....

చిన్ని పాదం తడబడినపుడు తన అరచేతిలో సుతిమెత్తని దారుల్లో నడక నేర్పింది నాకు ఊహ లేదు...

పలురకాల రంగుల ప్రపంచాన్ని తన యేదల మీద ఎత్తి చూపింది నాకు ఊహ లేదు...

దారెంటా..పోటురౌతు తాకి నొసలుకు దెబ్బతగిలితే...

నీ కంటివెంట కన్నీటిరక్తమట...

ఏది నాకు ఊహ లేదు...

అక్షరం దిద్దినపుడు గదేంత కష్టమైతదో బిడ్డకని బడి నుంచి వచ్చిరాగానే చిన్ని వేళ్ళను తడుముతూ ముద్దాడింది ఊహ లేదు....

బతుకుజీవనం బహు కష్టమైనపుడు...

నాకు ప్రతిసారీ గుర్తొచ్చిన ఒక అదృశ్య అద్భుతం మా బాపు...

కడలిలో నడి సంద్రానా మము వదిలినవ్...

కన్నీరు మిగిలిస్తూ మాకు కనుమరుగైనవ్...

తూఫాను ధాటికి చెల్లాచెదురుగా గూడు చెదిరిన పక్షుల చేసినవ్...

ఊహ తెలిసి ...

బాపు అని ఆవేదనతో పిలిచినపుడు...

అందని దూరాన ఉండి నాకు బతుకు ఇగురం చెప్పినవ్...

నువ్ లేవని వెనుతిరుగక...

ఎదురీదమన్నావ్...

హాలమును నేర్సుకోమన్నావ్..

కడలిని సాధించమన్నావ్...

అక్కలకు అన్నను అవమన్నవ్...

కన్నీళ్లను దిగమింగుతూ

చిరునవ్వుతో చిరకాలం బతకమన్నావ్...

అయినా నువు పరీక్షించినవ్ కదా..

బాపు నేను నీ బిడ్డను..

తెగిస్తా...

సాధిస్తా...

కష్టాలతో దోస్తీ చేస్తా...

నిన్నేపుడు గెలిపిస్తూనే ఉంటా...

బరువెక్కిన ఈ గుండేతో నువు అనునిత్యం మాట్లాడుతూనే ఉంటావ్...

 

ఓ మనిషీ

ఓ మనిషి వదిలేయ్...

ఇకనైనా వదిలేయ్...

నీలో కూరుకపోయిన అసూయ...

నీలో పేరుకుపోయిన అమానవీయం...

నీలో సమాధి చేసిన మానవత్వాన్ని మేల్కొలుపు...

ఇకనైనా నిద్రలేపు... 

మరమనిషిని సైతం మనుగడలోకి తీసుకొచ్చిన నువ్...

నీలో మానవత్వాన్ని ఎందుకింకా శిథిలాల కింద చితకనిస్తున్నావ్...

ఓయ్ నువ్ మనిషివి కాదేమో మరమనిషివి కాబోలు ...

మనసు లేదేమో నీకు...

ఇంకేం చూడాలి నీ అహంకారం...

ఇంకెన్నాళ్లీ వ్యవస్థల బానిసత్వం...

నీ కంటిపాపకు కానరాట్లేదా...

ఆ ఊపిరాడని ఆర్తనాదాలు...

నీ అంతరాత్మ ఐనా అడుగుతా లేదా నిన్ను...

నన్నెందుకిలా బంధిస్తున్నవని...

ఊరి చివరన శేవాల కుప్పలు ఎదురుచూస్తున్నాయి...

నువ్ ఇకనైనా మారుతావా అని...

ఇంకా వేచి చూడకు....

నీలో మానవత్వం కంపుకొడుతుంది...

పాతరేస్తున్నవెందుకు నీలోని మనిషిని...మంచిని...

లే... ఇకనైనా అడుగేయ్ ....

లోపాల్ని కడిగేయ్...

నీ అడుగుకోసమే బలహీనుల బతుకులు

పొలిమేరనా ఎదుచూస్తున్నాయ్...

అమాయకపు జీవితాలు ఆగమైతున్నాయి...

నీ దాకా వస్తేనే నీదా...

మనం మనుషులమన్న...

కాసంతాయినా మనసుండాలే కదా...

లేదేం మరీ...

నువ్ అనుకుంటే కదులుతావ్...

కదిలిస్తావ్...

మరెందుకి ఎదురుచూపులు...

ఎగిరముగా కదిలిరా...

విధికి తిరగబడే సత్తా నీకున్నది...

నీ సత్తువను సంపినవా...

లేక బలవంతంగా ఉరి బిగించినవా...

ఓ మనిషి...లే మనిషి...రా మనిషి...

ఒక సామాన్యుని కంటినీరు తుడువనికి...

ఆ పేదల గుండెల్లో ధైర్యం నింపడానికి...

ఆ శవాల ఘోష... వినడానికి...

ఓ మనిషి...లే మనిషి...రా మనిషి...

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు