మా రచయితలు

రచయిత పేరు:    వి దిలీప్

కవితలు

ఆలోచనల ధార 

ఇక్కడ మట్టికి తప్ప

మనిషికి విలువ లేదు

అణిచివేతకి తప్ప

ఆలోచనకు అవకాశం లేదు

 

ప్రశ్నిస్తే నక్సలైటని

భిన్న స్వరాన్ని వినిపిస్తే

దేశ ద్రోహుణ్ణి చేస్తుంది నా దేశం

 

ఇనుప సంకెళ్లు జైలు గోడలు

మనుషులను బంధించగలవు గానీ

వారి ఆలోచనలని ఆపలేవని

తెలియని కుంచిత మనస్కులు

ఈ దేశ పాలకులు

 

ఆలోచనలని అంతం చేద్దామనుకుంటున్నారేమో

ఆలోచించే అన్ని మస్తీష్కాలలో

అవి విస్ఫోటనం చెందగలవు

 

నిర్బంధిస్తే...

నిరాశ నిస్పృహలతో

నీ దారికొస్తారని ఆశేమో నీది

అయితే...మీదోట్టి భ్రమ

 

వారక్కడ నూతన సమాజాన్ని

స్వప్నినిస్తున్నారు

సమ సమాజ స్థాపనకై కొత్త ఆలోచనలు చేస్తున్నారు

 

వారి ఆలోచనల ధార గాలితో కలిసి

సమాజంతో సంభాసిస్తుంది

 

మాతో సంభాషించే ఆ గాలిని

ఆపగలరేమో ప్రయత్నించి చూడండి

మీదొట్టి వ్యర్థ ప్రయత్నమని తప్పక తెలుస్తుంది...

 

రాజ్యమా...

రాజ్యమా...

నీదెప్పుడూ తికమకల తర్కమే

పెట్టుబడిదారుల మొండి బకాయిలు రద్దు చేసి

ఉత్పత్తి దారులకు మొండిచేయి చూపినపుడు

వ్యాపారస్తులకు వంత పాడి

వ్యవసాయ దారులను వంచన చేసినపుడు

నీదెప్పుడూ తికమకల తర్కమే

 

నా చేతిలో ఆయుధం నేరమై

నీ చేతిలో ఆయుధం రక్షనైనపుడు

మత్తు/మధ్య పానీయాలు వ్యక్తి విక్రయిస్తే శిక్షర్వాహమై

నీవు విక్రయిస్తే చట్టబద్ధమైనపుడు

నీదెప్పుడూ తికమకల తర్కమే

 

నీవు అడవులను ధ్వంసం చేస్తే అభివృద్ధి అయినప్పుడు

నేను అవసరాలకు వాడుకుంటే కేసులు పెట్టినప్పుడు

దేశ సంపదను అమ్మకానికి పెడితే

నీది దేశభక్తి అయినప్పుడు

అన్యాయాన్ని ప్రశ్నించిందినందుకు నాది దేశద్రోహమైనపుడూ

నీదెప్పుడూ తికమకల తర్కమే

 

దిలీప్ కవితలు  ఐదు

1

వామనావతారం

 

రాజ్యమా..

నీది వామనావతారం

 

మొదటి పాదం అడవుల పై

రెండవ పాదం గనుల పై

మూడవ పాదం నదులపై మోపినపుడు

రాజ్యమా.. నీది వామనావతారం

 

రాజ్యమా...

నీది వామనావతారం

 

మొదటి పాదం మైనార్టీల పై

రెండవ పాదం మహిళల పై

మూడవ పాదం బహుజనులపై మోపినపుడు

రాజ్యమా.. నీది వామనావతారం

 

 

రాజ్యమా...

నీది వామనావతారం

 

మొదటి పాదం కలాల పై

రెండవ పాదం గళాల పై

మూడవ పాదం ప్రశ్నించే ప్రతి మనిషిపై మోపినపుడు

రాజ్యమా.. నీది వామనావతారం

 

రాజ్యమా...

నీది వామనావతారం.

 

2

 

ఆపలేవు!

 

స్వరాజ్య భారతంలో

మేం జీవ నదులం

మా దారిలో మేము పయనిస్తామ్

 

స్వతంత్రమనే చెట్టుపై

స్వేచ్ఛగా వాలిన కోకిలలం

మేం స్వేఛ్ఛాగానం చేస్తాం

 

సమాజమనే వెదురుపై

వెలసిన స్వర వాహికలం

మేం భిన్న స్వరాలను వినిపిస్తాo

 

కలాలన్నిటిని సమాధి చేస్తే

నేల పొరలలో పరివ్యాపించి

కొత్త మొలకలై మొలకెత్తుతాం

నేలనేలంతా 

సుందర భరితం చేస్తాం

 

గళాలన్నిటికి సంకెళ్ళేస్తే

గొలుసు సందుల్లోనుంచి

నిశ్శబ్ద నినాదమై

గాలినంతా ఆవహిస్తాo

సమాజానికి

కొత్త ఊపిరులు ఊదుతాం

 

భానుడికడ్డుగా

మీరెన్ని పరదాలు కట్టిన

వెలుగు రేఖలు మీ ముఖాలపై

పడకుండా అడ్డుకోగలవు కానీ

భూమి పై ప్రసరించకుండా ఆపలేవు!

భూమి పై ప్రసరించకుండా ఆపలేవు!

 

 

3

 

శిక్షించండి...!

 

 

శిక్షించండి శిక్షించండి

పడుకోనిచ్చినందుకు పట్టాలను

ఆగకుండా దూసూకోచ్చినందుకు రైలును

కాదంటే... లేదంటే

పట్టాలపై పడుకోడమే నేరమనె నెపంతో

చిద్రమైన దేహాలను శిక్షించండి

 

శిక్షించండి శిక్షించండి

నడవనిచ్చినందుకు దారిని

నీడనిచ్చినందుకు చెట్టుని

కాదంటే... లేదంటే

అనుమతి లేనిదే రహదారిపై నడిచారనె నెపంతో

పగిలిన పాదాలను శిక్షించండి

 

శిక్షించండి శిక్షించండి

సొమ్మసిల్లి పడిపోతే యెళ్ళగొట్టని రైల్వే స్టేషన్ని

నిదురపోతుందేమొనని ఊరుకున్న అధికారులని

కాదంటే... లేదంటే

తల్లి చనిపోయిందని తెలియక

గుక్కపెట్టి ఏడ్చుతూ తల్లిని లేపే శిశువు కన్నీళ్ళు

మీ ఊకదంపుడు ఉపన్యాసాలకు అడ్డుతగిలి ప్రశ్నిస్తాయనె నెపంతో

ఏడ్చే చిన్నారిని శిక్షించండి...!

గుక్కపెట్టి ఏడ్చే చిన్నారి గొంతు ఆగేదాకా శిక్షించండి..!

 

 

4

 

ఎవరినీ...?

 

ఎవరినీ..

నన్ను నన్నుగా చూడని

దేశంలో నేనెవరిని?

 

ఎదురుగా ఉన్న నన్ను తప్పించి

కనపడని నన్ను పట్టి చూసే

సంస్కృతిలో నేనెవరిని?

 

తరాలు మారిన

అంతరాల దొంతరలో

అట్టడుగున ఉన్న వాణ్ణి

 

నా పనితో కన్నా

కులంతోనే గుర్తించబడుతున్నవాణ్ని

అందరి మధ్యన ఉన్న అంటరానివాణ్ని..

 

సదువుకి,సంపదకి

సంస్కృతికి,సమాజానికి

దూరంగా ఉంచబడ్డవాణ్ని

 

వెలి వేతలతో వేదనలను

అణచివేతలతో అన్యాయాలను

పుట్టుకతోనే పురుడు పోసుకున్నవాణ్ని

 

ఎవరిని

దేశంలో నేనెవరిని...?

 

 

*U.p లో దళిత మహిళా అన్నం వండినదని తినకుండా చేసిన లొల్లి సందర్బంగా

 

 

        5

 

నిజంగా ప్రజాస్వామ్యమే

 

 

మా ఓటు తో గద్దెనెక్కినోడు

మమ్ముల గద్ధురాంచంగా

 

మేమిచ్చిన అధికారం తో అందలమెక్కీనోడు

మమ్ముల అదిమిపట్టంగా

 

మా పేరు చెప్పి పాలించెటోడు

మమ్ముల పరాయికరించంగా

 

మా గొంతుకగా ఉండాల్సినోడు

మా గొంతులు నోక్కంగా...

 

ఇది నిజంగా ప్రజాస్వామ్యమే..

మేమేకదా మము ఏలుమని

మిము గద్దెనెక్కీచింది

 

నిజంగా ఇది ప్రజాస్వామ్యమే..!

నిజంగా ఇది ప్రజాస్వామ్యమే...!!

 

 

 

              

అన్నీ తానే....

నాకు తెలివి రాగానే

నేను చూసిన మొదటిదది

ఆ తొలిచూపులోనే నన్ను కట్టిపడేసింది

ఆ వెన్నెల చల్లదనాన్ని అరువు తెచ్చుకున్నట్లు

ఆ పువ్వులకే తన సుకుమారాన్ని అప్పుగా ఇచ్చినట్టుగా

అంత అందంగా ఉందది

 

తెల్లని మబ్బులను ఆక్రమించిన

నల్లని మేఘాలుగా పరుచుకుంది

మొగలి పూల పరిమళాల అన్నట్లు

సువాసనలు వెదజల్లుతుంది

ఇంద్రధనస్సు నుంచి రంగులను తెచ్చుకుందేమో అందుకే అంత అందం

 

ఆ అందం ఆ రూపం ఆ తేజస్సు

నన్ను గుక్కతిప్పుకోనివ్వట్లేదు

పడుకున్నా మెలకువగా వున్నా

తన ఆలోచనే

ఆలోచన కాదు

తానే నేనైనానేమో అనేట్టుగా మారింది

ఎంత చూసినా తనివి తీరట్లే

తనని తడుముతుంటే

అప్పుడే విచ్చిన పువ్వులను తాకినట్టుగా

తన బుగ్గలపై నిమురుతుంటే

తన వైపే లాగుతున్నట్లుగా

నన్ను విడువకు అన్నట్టుగా ఉంది

 

తనతో ఎంత గడిపినా

తనివి తీరట్లే...

రాత్రంతా తనతో వున్నా

అప్పుడే తెల్లారిందా అన్నట్లు

పగలంతా తనతో గడిపినా

అప్పుడే చీకటి పడిందా అన్నట్లు

కాలమే తెలియకుండా

తన చుట్టే తిరుగుతున్నా

 

అంతా నన్ను చూసి నవ్వుకున్నా

నవ్వుకుందురుపో...

 నాకేమి సిగ్గు? అన్నట్లు

తెగించి జతకట్టా

 

మిత్రులంతా

ఒరేయ్...వాడు పిచ్చోడురా అంటే

ఓహో... ఇంత అమితంగా ఇష్టపడ టాన్ని

పిచ్చి అంటారా? అని నవ్వుకున్నా

 

ఇంతకాలం తనతో సహజీవనం చేసినా

ఎంతసేపు తనని అనుభవించినా

ఇంకా కొత్తగానే ఉంటుంది

ఇంకా ఇంకా కలిసి జీవించాలని ఉంటుంది

కానీ...

ఇది దాహమా...?

అయితే... ఎప్పటికీ ఆగునో ఈ దప్పిక

ఇది మోహమా...?

అయితే... ఎప్పటికి తీరునో నా మోహము

ఇంతగా నన్ను ఆకర్షించి కట్టిపడేసింది

ఎవరనే కదా మీ ప్రశ్న

 

అది... అదీ...

'పుస్తకము'

పుస్తకము నా మస్తిష్కము

"నేను పుస్తకాన్ని వీడడం అంటే

నా ప్రాణాన్ని వదలడం"అని

అర్థం చెప్పాలేమో....

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు