బాల్య మిత్రులు వారు
విడిపోయి కలిసుంటారు
మిన్నూ, మన్నూ అంటారు
వారిని చూసేవారందరూ
ఒకరికొకరు తోడుంటారు
జగతిని ముందుకు నడుపుతుంటారు
ఉదార స్వభావాలతో వారు
ఉదకదానం చేసుకుంటారు
విపరీత కాలాల్లో ఒకరి
విపత్తులనొకరు తొలగించుకుంటారు
వేసవిలో . . . .
తన తనువు నెర్రెలు వాసినా
తన చర్మం ఎండి మాడిపోయినా
నేస్తానికి నీరిస్తుంది , స్నేహానికి ప్రాణం పోస్తుంది . . . . పృథ్వి
ఆవిరితో బరువెక్కినా . . . .
రవికిరణాలకు వేడెక్కినా . . . .
నీటి ధనం కలిగి ఉన్నా . . . .
ఆ సూర్యునితోనే కలిసి వెలుగుతుంది
ఆప్తుని జాడను మరిచి . . . . ఆకాశం
ఋతువు మారింది . . . . .
హితుణ్ణి తలచింది . . . .
వేసవిలో భూమికి ఎడంగా ఉన్న
రవికి దగ్గరగా ఉన్న ఆ మేఘాకాశం . . .
ఆపత్కాలంలో ఆప్తుణ్ణి వదిలి వెళ్లానని ఆలోచించి
స్నేహితుణ్ని బాధించానని గుర్తించి
అపరాధం క్షమించమని అర్థించి
పశ్చాత్తాపంతో నల్లగా మారి
భూమి ముందు తలవంచి నిలుచుంది . . .
ఆషాఢ మాసంలో తన పశ్చాత్తాపం తెలుపుతూ
అంబరం పలుకరించింది . . .
స్నేహితుని రాకతో అవని పులకరించింది