మా రచయితలు

రచయిత పేరు:    డి కుమారస్వామి రెడ్డి

కవితలు

మే డే 

ఒకే నేల ఒకే నింగి ! !

అదే మనుష్యులనే సమస్యలూ !

సంవత్సరం కొత్తదైనా

మేడే అదే !

 

యుగ యుగాల

కార్మిక దాస్యం పై

సీష్ మహనీయుడు

రగిల్చిన పోరాటం

పునాది మేడే ! !

అది నేడే !

 

శతాబ్బాల పెను చీకటి కోరలు - - - - -

బానిసత్వపు అడ్డుగోడలు - - -

అధికార రక్కసి కి

ప్రాణాలు ఎదురొడ్డి తెగటార్చిన

కార్మికులు శౌర్యం

'చికాగో' వీధుల్లో

ప్రళయ నర్తన చేసిన రోజు ఇది !

మేడే ఇది

 

పెట్టుబడికి అదనపు విలువ

సృష్టించే కార్మికుల

అరుణారుణ రాగరంజితమైన

గుండె నెత్తురులు ,

పొంగిపొర్లిన దినమిది !

 

మనిషి మనిషిపై

చేసే దుర్మార్థం

త్యాగాల పెను తుపానుల్లో

పేక మేడలై కూలిపోయే

నవ శకానికి సూర్యోదయమిది !

మేడే ఇది !

 

మరల్లో యంత్రాల్లో

నిశ్శబ్దపు చీకటి

ప్రతిష్టంబనలో

నిస్తేజంతో నిస్సత్తువలో

నిస్సహాయంగా

శృంఖలాబద్ధమైన

కార్మిక జీవిత పరిధి నుండి

విముక్తి కోసం

కొత్త జీవితం కోసం

శ్రామికులు కార్మికులు

ముందడుగు వేసిన దినమిది !

చీకటి ఆకాశంలో

నెత్తుటి సూర్యుడిని

శ్రామిక కార్మిక వర్గం

ఆవిష్కరించిన దినమీది !

మే డే ఇది !

 

ప్రపంచ కార్మికుల

హృదయ సంస్పందనలో

పోరాట పటిమను

ఒక భాగంగా

మలచిన దినమిది !

భూమి , ఆకాశం

పర్వతాలు , సముద్రాలు

సమస్త ప్రకృతి

సకల కార్మిక లోకం

మృతవీరుల త్యాగం

గానం చేసే పండుగ ఇది

మే డే ఇది !

 

నూరేళ్ల జ్ఞాపకాల

అశ్రు నీరాజనమిది

హక్కుల సాధనలో

నేలకొరిగిన

శ్రామిక వీరులకు

మన సోదరులకు

హృదయ నైర్మల్యంతో

మనం స్మృత్యంజలి

ఘటించే సమయమిది !

మే డే ఇది !

 

రండి . . .

అశ్రువులతో కడిగిన

హృదయారుణ పుష్పాన్ని

ఆత్మీయతతో అమర

వీరులకు పాదాక్రాంతం చేద్దాం !

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు