గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు భూమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ
చాలామంది బాల్యం గురించి చాలా మురిపెంగా చెప్పుకోవడం విన్నప్పుడు, చదివినప్పుడు నాకు అలాంటి బాల్యం లేనట్టు గట్టిగా అనిపించింది. మా నాన్న రైల్వేలో టికెట్ కలెక్టర్‍గా పనిచేసేవాడు. అతని క్లాస్‍మేట్లు కొందరు ఆల్ ఇండియా సర్వీసెస్‍లో పనిచేయటం గమనించినాయన తన పిల్లలు తప్పకుండా సివిల్ సర్వీసెస్ బండి ఎక్కాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉండేవారు. చాలా స్ట్రిక్ట్. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఒక చెల్లెలు, అతని డిసిప్లెన్ వల్ల బడి, చదువు, మార్కులు తప్పిస్తే మరొక్కటి ఉండేది కాదు.
నా సెవెన్త్ ఫారమ్ లో మంచి మార్కులతో పాసవుతానని గట్టి నమ్మకంతో ఉండేవాడు. సరిగ్గా పరీక్షల సమయానికి ఒక విపత్కర పరిస్థితిలో ఇంటినుండి పారిపోయి (ఆ నేసథ్యమంతా ఆసక్తి కలదే. ముందెప్పుడైనా చెబుతా) మద్రాస్‍లో ఒక పది రోజులు టీ, మిల్క్ దుకాణంలో పనిచేసినాను. వెదికి వెదికి మా నాన్న పట్టుకొచ్చినాడు. సెవెన్త్ ఫారమ్ అంతా ఇదీ తనూ పానయినాను. దాంతో మా ఊరు నందలూరు నుండి ఫ్యామిలీ తిరుపతికి షిఫ్ట్ చేసి ఇక్కడే సెటిల్ అయ్యేట్టు నిర్ణయించుకున్నాడు.
తిరుపతి యస్ వి యులో డిగ్రీ పి.జి చేసినపుడే నాలో పెనుమార్పులు. సాహిత్యం, చలం ప్రభావం, ఉద్యమాలు, విరసం అన్నీనూ. విద్యార్థిగా ఉన్నపుడే రివల్యూషనరీ స్టూడెంట్స యూనియన్ ఏర్పాటు చేస్తే - ఆ పేరుతో విద్యార్థులు అట్రాక్ట కారని కె యస్ అంటే రాడికల్స స్టూడెంట్ యూనియన్ గా పేరు మార్చినాను. ఆ తర్వాత రాడికల్ ఎంత సంచలనమో - అనుకుంటే ఆశ్యర్యం. నిజానికి విప్లవ విద్యార్థి ఉద్యమానికి రాడికల్ ఏ కోశానా పొసగదు. అలా జరిగిపోయింది.
1972లో యం.ఏ. పొలిటికల్ సైన్స్ పూర్తయింది. అప్పటికీ చాలా యాక్టివ్. విప్లవ రాజకీయాల్లో, టి టి డిలో లెక్చరర్ పోస్టు పడితే ఎలాగూ రాదులే అటెండ్ అవ్వు చూద్దాం అని అంటే అప్లయి చేసినాను. ఇంటర్వ్యూలో ఎలాటూ వచ్చేది కాదని ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చేసినాను. అపుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. టి టి డి ఇ ఓ గా సుబ్రమణ్యం గారు ఉండేవారు. సిఫారసులకు లొంగేవాడు కాదు. ఈయన ప్రస్తావన ఆర్ బి ఐ రిటైర్డ గవర్నరు వై వి రెడ్డి గారి ఆత్మకథలో ఉంది. ఇంటర్వ్యూలో భూమన్ అనే ఇతడు రాడికల్, ఉద్యోగం యిస్తే విద్యార్థులను చెడగొడుతాడని బోర్డులోని సభ్యులందరూ ఇవ్వరాదని గట్టిగా పట్టుబడితే అట్లా జరిగినపుడు చూసుకోవచ్చులే అని గట్టి నిర్ణయంతో ఉద్యోగంలో సెలెక్ట చేసినాడు. పూర్తిగా ఆయన గట్టి వైఖరి వల్లే సాధ్మమైంది. సెలెక్టు అయినా వివిధ రాకాల ఒత్తిల్ల కారణంగా ఆరు నెలల తర్వాత అపాయింట్మెంటు ఆర్డర్ ఇచ్చినారు.
ఉద్యోగం ముందు ఎట్లున్నానో అట్లాగే ఉద్యోగంలోనూ ఉన్నాను. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి విరసం సభలు, సమావేశాలకి తిరుగుతున్న రోజుల్లో మదనపల్లిలో పలవలి రామకృష్ణా రెడ్డి గారితో పరిచయం కావడం, వారి పెద్ద కూతురు పలవలి కుసుమకుమారి అనంతపురం సత్యసాయి ఇనిస్టిట్యూట్ లో పనిచేయటం తెలిసింది. వారి ఇంటికి శ్రీశ్రీ, కెవిఆర్, త్రిపురనేని, ఐ వి సాంబశివరావు, నేను పోయినప్పుడు ‘పెళ్లి’ ప్రస్తావన రావడం, ఆమె యూనివర్సిటీలో నా బ్యాచ్ మేటు. ఆమె తెలుగు, నేను పొలిటికల్ సైన్స్. ఐ వి పెళ్లి ‘ఝంఝాటం ’ వద్దని గట్టిగా వారించడం ఒక జ్ఞాపకం. 1974 లో శ్రీశ్రీ, కెవిఆర్, త్రిపురనేని, కాశీపతి, డా. యం వి ఆర్ ల సమక్షంలో మీటింగు పెళ్లి. ఆ రోజుల్లో అదొక సంచలనం. కుసుమకుమారిగారికి తండ్రి వల్ల కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి. బాగా చదువుకున్న వ్యక్తి. ధైర్యస్తురాలు. అన్నీ తెలిసి అంగీకరించింది.
పెళ్లయిన సంవత్సరానికే చిత్తూరు కుట్రకేసులో అరెస్టు చేసినారు. ఉద్యోగం నుండి సస్పెండు చేసినారు. బెయిల్ మీద వచ్చి అనంతపురంలో ఉండేవాణ్ణి. అప్పుడు మంచి మిత్రుడు ఇమాం పరిచయం. ఇతని మూలాన అనంతపురం జిల్లా అంతటా తిరిగినాను. ఎన్నో సభల్లో ఉపన్యసించినాను. ఇతని వల్లనే రాయలసీమ సమస్యల గురించి లోతుగా తెలుసుకున్నాను. ఇమామే తరిమెల నాగిరెడ్డి గారిని పరిచయం చేసారు. తరచూ ఆరాం హాస్టల్లో కలుసుకునేవాళ్ళం. టి యన్ మంచి చదువరి. శివసాగరర్, చెరబండరాజుల రచనల గురించి మెచ్చుకునేవారు. ఒకమారు పాతూరులో ఆయన బహిరంగ సభకు పోతే స్వయంగా ఆయనే చెయిర్ తీసుకొచ్చి నా భార్యకు అందించటం - అనుకుంటే ఆశ్యర్యంగా ఉంటుంది. ఇట్లా మేం తిరుపతి, అనంతపురంలో ఉండటం గమనించి భూమన్ అనంతపురంలోనే ఉద్యోగం చూస్తాం - ఆగు అని అనటం గుర్తుంది. ఈ లోగా ఎమర్జెన్సీలో అరెస్టు. ఈ అరెస్టుతో ఉద్యోగం నుండి డిస్మిస్ చేసినారు. ఎమర్జెన్సీలో నాతో పాటు నా విద్యార్థులు ఇద్దరు అరెస్టయినారు. ఒకరు నా తమ్ముడు భూమన కరుణాకర రెడ్డి. మరొకరు శైలకుమార్. మా మామ పలవలి రామకృష్ణా రెడ్డి గారిని కూడా అరెస్టు చేసి ముషీరాబాదు జైటుకు తీసుకొచ్చినారు. (జైలు అనుభవాల గురించి మళ్ళీ ఎప్పుడయినా రాస్తాను).
జైలు నుంచి విడుదలయిన తర్వాత మద్రాసులో లా లో చేరదామని అప్లై చేసుకున్న. ఉద్యోగం పోయినందున నా భార్య మాత్రం అధైర్యపడలేదు. ఆమె ఉద్యోగం ఉంది కదాని అభయమిచ్చింది. ఈ లోగా విషయం తెలుసుకున్న సత్యసాయిబాబా ( వీరి కళాశాలలోనే నా భార్య పి జి లెక్చరర్ గా పనిచేస్తున్నది) అభ్యంతరం లేకపోతే వైట్ ఫీల్సలో ఉద్యోగం ఇప్పిస్తానని చేరతాడేమోన కనుక్కోమని ఆమెతో చెప్పినాడు, ఆ రోజుల్లో సత్యసాయిబాబా తరచూ అనంతపురం కాలేజీకి వచ్చి కొంత సమయం గడిపేవాడు. నేను చేరేదిలేదు పొమ్మన్నాను.
ఈ లోగా జైల్లో మాతో పాటు ఉన్న సి కె నారాయణరెడ్డి గారు, యస్ ఆర్ శంకరన్ గారితో కలిసి గట్టి ప్రయత్నంతో నన్ను రీఇనిస్టీట్యూట్ చేసినట్టుగా ఆర్డర్ తెప్పించినారు. దాంతో మళ్లీ లెక్చరర్ గా కొనసాగవల్సి వచ్చింది. లేకుంటే నా జీవితం మరొకలా ఉండేది.
1977 అక్టోబరులో తిరిగి ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఏ పి టి యఫ్ సభలు, సమావేశాలకు తిరుగని వారం లేదు. కాలేజీలో మంచి పేరే ఉండటం వల్ల లీవులకు పెద్ద ఇబ్బందులు రాలేదు. 1980లో జన సాహితీతో రాష్ట్రమంతా పర్యటన. 1983 నుండి రాయలసీమ ఉద్యమంలో కీలకమయిన పాత్ర. ఉద్యోగం చేస్తూనే సభలు, సమావేశాలు, పాదయాత్రలు విస్తృతంగా చేసే వాణ్ణి. 1983లో వరంగల్ లో డి యస్ ఓ రాష్ట్ర మహాసభల్లో చేసిన ప్రసంగం గురించి ఇప్పటికీ చాలా మంది ప్రస్తావిస్తుంటారు. వరవరరావు చాలా మెచ్చుకొనేవాడు. అదే సంవత్సరం తెనాలిలో జరిగిన హేతువాద మహాసభల్లో గద్దర్, కత్తి పద్మారావులతో పాటు చేసిన ప్రసంగం కూడా చాలా మంది మెచ్చుకునేవారు. దాన్న సి డి చేసి పద్మారావు చాలామందికి పంచేవాడు. ఆ ఉపన్యాసాన్ని ఇప్పటికీ ప్రతిసభలో ప్రముఖ విమర్శకుడు తిరుపతిరావు గుర్తు చేస్తుండటం గొప్ప సంతోషాన్నిస్తున్నది.
1980 - 83లలో నా భార్య పి హెచ్ డి కోసం తిరుపతి రావటం వల్ల ఫ్యామిలీ కుదుట పడింది. 1984లో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ఆమె అతికష్టం మీద లెక్చరర్ గా సెలెక్టు అయ్యింది. నక్జలైట్ భార్య అని సెలెక్టు చేయొద్దని చాలా ఒత్తిడి. ఆ ఇంటర్వ్యూ బోర్డులో విద్వాన్ విశ్వంగారు ఉండటం, అప్పటి వి సి వనజా అయ్యంగార్ అభ్యుదయవాద భావాలు కలిగి ఉండటం ( ఆమె మోహిత్ సేన్ భార్య) వల్ల సాధ్యమైంది.
ఆమె అనంతపురంలోనే పి జి లెక్చరర్. తెలుగు తెలుగు అని అరిచే ప్రభుత్వం విశ్వవిద్యాలయంలో యం.ఏ. తెలుగు కోర్సును అడ్డుకుంది. ఐదేళ్ల పాటు ఏ బోధనా లేకుండా ఉండి 1989 నుంచి యం.ఏ. తెలుగు ఇంట్రడ్యూస్ చేయడంతో రీడర్ గా ప్రొఫెసర్ గా స్థిరపడింది. ఆ తెలుగు పెట్టించటం కోసం అదోక పోరాటం. ఎంతో మందిని కలిసి సాధించినట్టే లెక్క, ఆమె డిపార్టుమెంటు ఫౌండర్ హెడ్డుగా విశ్వవిద్యాలయానికి పిలవని సాహితీ ప్రముఖులు లేరు. కారా, ఓల్గా, జ్వాలా దగ్గరనుండి దాదాపు అందరూ స్త్రీ వాద, మైనారిటీ కవులందరూ వచ్చినారు. ఆమె విశ్వవిద్యాలయంలో దాదాపు అన్ని విభాగాల్లో పని చేసినారు. ఇంగ్లీష్‍లో మంచిపట్టు ఉండటం వల్ల దేశమంతా తిరగ్గలిగినారు.
అల్టిమేట్ గా 2008లో అనంతపురం ఎస్ కె యు వైస్ చాన్సలర్ అయినారు. ఇక్కడా పోరాటమే. చాలా కాంప్లికేటేడ్ యూనివర్సిటీ. ఈమె భయపడే వ్యక్తి కాదు. ఈమెకు ముందు ఉన్న వి సి కొన్ని పోస్ట్సు భర్తీ చేయబోతే అక్కడి దుష్టశక్తులు అడ్డుకున్నాయి. అవి దళిత, మైనారిటీలకు చెందిన పోస్ట్సు. ఈమె అన్ని అనుమతులు పొంది పోస్ట్సు ఫిలప్ చేస్తే, తట్టుకోలేని దుష్టశక్తులు వాటిని అడ్డుకోవాలని నానావిధాల ప్రయత్నం చేసినారు. అవి 21 పోస్ట్సు మాత్రమే. వారు అందరూ దళితులు, మహిళలు. ఈమె ఉద్యోగం పోయినా ఫర్వాలేదు, ఆ పోస్ట్సు ఇచ్చి తీరటమే లక్ష్యం అని గట్టిగా నిలబడింది.
అప్పటికీ నిజం చెప్పొద్దూ, నాలోనూ మార్పులు. పోతే పోతాయి వదిలెయ్యమని నా అభిప్రాయం. ప్రభుత్వం రీకాల్ చేసేంతా ఒత్తిడి తెస్తున్నాయి ఈ దుష్టశక్తులు. వద్దని నా విన్నపం.
ఆమె ఒకే మాట అన్నది అభ్యుదయం, విప్లవం అని చెప్పిన మీరే తీరా ‘నిర్ణయం’ తీసుకోవాల్సిన సమయంలో ఇట్లా అయితే ఎట్లా - ఒకవేళ మీ ప్రతిష్టకు ఇబ్బందిగా మీరు ఫీల్ అయితే ‘విడాకులు’ ఇస్తాను గాని రీకాల్ కు జంకేది లేదని తెగేసి చెప్పి పోస్ట్సు ఇచ్చేసింది.
నేనే ఆత్మవిమర్శ చేసుకుని నా ఆలోచనను తప్పుగా గ్రహించి అండగా నిలబడ్డాను. హైకోర్టు లో న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మింది. దురదఋష్టవశాత్తు మేం నమ్మి కేసు ఇచ్చిన లాయర్ చేసిన మోసం, ద్రోహం వల్ల కేసు వీగిపోయింది. ఎస్ కె యు విషయం బాగా తెలిసిన జస్టీస్ రాములు బెంచ్ లో ఉండే అతనిముందు కేసు వేయకుండా జాప్యం చేసి కేసును తప్పుదోవపట్టించి ప్రభుత్వానికి లాలూచీ అయినాడు. వాని పేరు ప్రస్తావించటానికి కూడా ఇవ్వాళ మనస్కరించదు.
ఏమయితేనేం ఆమె ఇచ్చిన పోస్ట్సు, మిగిలిన అన్నీ కొనసాగుతున్నాయి. అదే గొప్ప తఋప్తి. ఆమెతో పాటు ఒక మారు ఎస్ కె యుకి వెళితే అప్పటి వి సి ఒక్కమాట అన్నాడు. ఎవరైన పదవి తర్వాత తిరిగి వస్తే వాళ్లకాడికి ఒక్కరూ రారు. ఏంది మేడం మీరు వస్తే వందల మంది ఇట్లా మీ వెంట వస్తున్నారని. ఇంతకంటే మించింది ఏముంటుంది.
మా అబ్బాయి యు ఎస్ ఎలో యం.యస్ చేసిన తర్వాత హైదరాబాదులో మేనేజ్‍మెంటు చేసి టెక్ మహేంద్రలో వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాడు. ఇతనే హైదరాబాదులో టెక్ మహేంద్ర వారి ఎకోలా ఏర్పాటు చేయటంలో కీలక నాత్ర నిర్వహించినాడు. ప్రస్తుతం కాలీఫోర్నియాలో ఉంటున్నాడు. ఇతని భార్య కూడా యు ఎస్ లో యం యస్ చేసి హైదరాబాదు ఐ యస్ బిలో మేనేజ్ మెంటు కోర్సు చేసింది. షి ఈజ్ ఏ నోటేడ్ ఆర్టిస్ట్ . రాహూల్ భూమన్ శ్వేత.
మా అమ్యాయీ నీలూభూమన్. యాక్టివిస్ట్. ఫిల్మ్స తీస్తుంది. కొన్న సినిమాలు ఇంటర్నేషనల్ గా చాలా నగరాల్లో ప్రదర్శింపబడ్డాయి. యల్ జి బి టి క్యూ, బ్లాక్స్, మైనారిటీ రైట్స్ కొసం కొట్లాడతా ఉంటుంది. ఇద్దరూ అమెరికా మరియు యు కె సిటిజన్ షిప్. అమెరికాన్ ను పెళ్లాడి ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఆమె భర్త అండ్రూ నికోల్సన్ గూగుల్ లో పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాలు తిరగటం, పుస్తకాలు విరివిగా చదవటం, మార్జినలైజ్డ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడటం ఈమె చేస్తున్న పని. ‘విపశ్యన’ కోర్సులు తరుచూ చేస్తుంటారు.
బిట్వీన్ ద లైన్స చాలా గ్యాప్స ఉన్నాయి. తీరిగ్గా వీలుచూసుకొని చెబుతా.
కొన్నయినా చెప్పే అవకాశం కల్పించినందుకు గోదావరి అంతర్జాల పత్రికకు, సంపత్ గారికి ధన్యవాదాలు.
2. మిమల్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?
నా డిగ్రీ రెండవ సంవత్సరంలో చలం, ఆనందం, విఫాదం పుస్తకాలు చదివి అత్యంత తీవ్రమైన ప్రభావానికి గురై ఇంట్లో చెప్పా పెట్టకుండా తిరుపతి నుండి విల్లుపురం పాసింజర్ రైల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణించి నేరుగా తిరువణ్ణామలై స్టేషన్‍లో దిగి నడుచుకుంటూ పోయి చలం గారి ఇంటికి చేరుకున్నాను. చలంగారు సాదరంగా చేరదీసినారు. ఏమీ ప్రశ్నంచలేదు. వారి మనిషిగా చూస్తున్నారు. సౌరీస్, కృష్ణారావు గార్లతో సాన్నిహిత్యం అక్కడనే. రోజూ సాయంకాలం చలంగారు వాకింగ్‍కు పిల్చుకుపోయి దగ్గర్లోవున్న ఒక పాడు బడ్డ మండపం వద్ద కూర్చోపెట్టుకుని వారికి వచ్చిన ఉత్తరాలు చదివించుకునేవారు. అక్కడే శీశ్రీ, జల సూత్రం రుక్మిణీశాస్త్రి, చింతా దీక్షితులు పేర్లు విన్నాను. నెల రోజులుండి తిరుపతి వచ్చేసాను. చలంగారితో ఉత్తర ప్రత్యుతరాలు ఉండేవి. వారు, వారి రచనలే నన్ను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసినాయి. మల్లొక్క మారే చలం దగ్గరికి వెళ్లింది.
అది 1968వ సంవత్సరం. నగ్జల్బరీ వసంత మేఘగర్జన రోజులు. శ్రీకాకుశ పోరాటం ఉవ్వెత్తున లెగుస్తున్న సందర్భం. నాకు 18సంవత్సరాలు. బి.ఏ. రెండవ సంవత్సరం. నా క్లాసుమేటు జి.సుబ్రమణ్యం రెడ్డి నగ్జల్బరీ దారి చూపించినవారు. ఇక వెన్వెంటనే చలంను వదిలేసి ఇక మీ దగ్గరకు రానని ఉత్తరం రాస్తే కమ్యూనిస్టులు నా దగ్గరకు వస్తుంటారు. నీకు బుద్ధి పుట్టినప్పుడు రావచ్చునన్నారు. నగ్జల్బరీ ప్రభావంతో చలం పూర్తిగా మరుగున పడిపోయినారు. ఈ క్రమంలోనే త్రిపురనేని మధుసూదనరావుతో పరిచయం, గాఢమైన స్నేహం కుదిరింది. త్రిపురనేని పరిచయంతో సాహిత్యం, తత్త్వం, రాజకీయం ఇష్టం కలిగిన అంశాలైనాయి. త్రిపురనేని ఆధ్వర్యంలో యువకులం కొందరం కలిసి ‘లే’, ‘విప్లవం వర్ధిల్లాలి’ కవితా సంకలనాలు తీసుకొచ్చినాము. ‘లే’ ముందు మాటకోసం మద్రాసుకు పోయి మహాకవి శీశ్రీని కలిసి రావటం ఒక గొప్ప అనుభవం. ఆ తర్వాత శీశ్రీ మాకు అత్యంత ఇష్టుడు. మా కోసమే తిరుపతి వచ్చిన సందర్భాలు అనేకం. 1970లో విరసం ఏర్పిడినప్పుడు మేమీద్దరమూ చేరలేదు. ఆ తర్వాతనే చేరింది. విరసం చాలా ఇన్‍ప్లూయన్స్ చేసింది. శీశ్రీ ‘మహాప్రస్థానం’, ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ ఇష్టమైన పుస్తకాలు. అప్పట్లో ఫ్రాంటియర్, ఎకనమిక్ మరియు పొలిటికల్‍విక్లీ బాగా ప్రభావితం చేసిన పత్రికలు.
3. మీ రచనల గురించి చెప్పండి?
నగ్జల్బరీ ప్రభావమే నన్ను రచనలవైపు పురిగొల్పింది. 1970లలో తిరుపతి నుండి ‘రాయలసీమ’ అనే పత్రిక వచ్చేది. అందులో విపరీతంగా రాసేవాణ్ణి. కవితలు, వ్యాసాలు విరివిగా వచ్చేవి. ‘లే’, ‘విప్లవం వర్ధిల్లాలి’, ‘రక్త గానం’లో నా కవితలు ఉన్నాయి. తర్వాత తర్వాత ఇది కవిత్వంగా లేదేమోననే బెంగతో ఆవైపే పోలేదు. కవిత్వం అంటే చాలా ఇష్టమున్న రాయబుద్దేయలేదు. మంచి కవిత్వం రాసే శివారెడ్డి, మహెజబీన్ లాంటి వాళ్ల కవిత్వం మహా ఇష్టం.
విరసం, జనసాహితి నుండి బయటకి వచ్చిన తర్వాత రాయలసీమ కరువు, కాటకాల గురించి నా మిత్రుడు ఇమాం ద్వారా తెలుసుకున్నాను. 1983లో ఇమాం సారధ్యంలో ‘కదలిక’ అనే పత్రిక వచ్చేది. వివిధ రకాల పేర్లతో విరివిగా వ్యాసాలు రాసేవాణ్ణి. ‘కదలిక’కు మంచి పేరు ఉండేది. రాయలసీమ సమస్యలు తెలుసుకోడానికి ‘కదిలిక’ బాగా ఉపకరించింది. తర్వాత రాయలసీమ మీద వ్యాసాలతో ‘చరిత్రలో రాయలసీమ’, ‘రాయలసీమ ముఖచిత్రం’ పుస్తకాలు తీసుకొచ్చినాను.
4 మీ ఆలోచనల్లో సాహిత్య అధ్యయనం ఎలాంటి మార్పుతెచ్చింది?
సాహిత్య అధ్యయనమే నాకు ఆలోచించటం, అర్థం చేసుకోవటం, విశ్లేషించుకోవటం నేర్పింది. సాహిత్య అధ్యయనానికీ నేను రుణపడి ఉంటాను. కందుకూరి, గురజాడ, శీశ్రీ, చలం, కొడవటిగంటి, రావిశాస్త్రీ, బీనాదేవి, రంగనాయకమ్మ,, దాశరథి రంగాచార్య, ఆరుద్ర, సోమసుందర్, సుంకరలాంటి వారు నాకు దారిదీపాలు.
5 మీ చుట్టు ఉన్న ఏ సామాజిక, ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
ఫలానా అని చెప్పలేను. వివరంగా చెప్పడానికేమీ లేదు. స్కూలు విద్యార్థిగా శరత్ నవలలు, అంతటి నరసింహం రచనలు సమాజం గురించి ఎంతో కొంత నాకు అర్ధమయినట్టుగా చెప్పినట్టు గుర్తు. ఆ తర్వాత చలం, శీశ్రీ, కమ్యూనిస్టు ప్రణాళిక సమాజం గురించి చాలా చెప్పినాయి. వాటి ద్వారా సమాజం, రాజకీయం, ఆర్థికం తెలుసుకున్నాననుకుంటున్నాను. నాకు ఉన్న పరిస్థితులు ప్రోద్బలం చేయలేదు.
6 మీ మొదటి రచన ఏది? అది ఏ సందర్భంలో వచ్చింది?
‘లే’ కవితా సంకలనంలో వచ్చిన కవితలే నా మొదటి రచనలు. నక్షల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాట నేపథ్యమే నా రచనలకు నేపథ్యం.
7 ఇటివలి మీ రచన ఏది? దాని నీపర్యం ఏమిటి?
పర్‍స్పెక్టివ్స్వారు విరసం ఎలా ఉండాలి అనే అంశం మీద ఒక వ్యాసం రాసివ్వమంటే రాసిచ్చాను. విరసం వారు అడిగితే ఒక వ్యాసం రాసాను. అరుణతారలో వచ్చింది. విరసం 50 వసంతాల సందర్భంగా వచ్చింది. కె.వి.ఆర్ మీద ఒక వ్యాసం రాసాను.
8 విరసం ఆవిర్భావం నాటికి రాయలసీమలో ఉన్న సాహిత్య వాతావరణం ఏమిటి?
కె. సభాగారు రాయలసీమ గురించి రాస్తున్నారు. ముధు రాంతకం రాజారాంగారు మధ్య తరగతి జీవితాలతో పాటు మా ప్రాంతం గురించి రాస్తున్నారు. పుట్టపర్తి నారాయణ చార్యులు గారు నేరుగా రాయలసీమ గురించి రాయకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉండేవారు. నా ‘చరిత్రలో రాయలసీమ’ పుస్తకాన్ని పుట్టపర్తి వారే ఆవిష్కరించినారు.
ఆ రోజుల్లో సంప్రదాయవాదులు అధికంగానే వున్నా, విరసం పట్ల వ్యతిరేకంగా మాత్రంలేరు. సాహిత్య వాతావరణం స్నేహాపూరితంగా ఉండేది. సహన వాతావరణం చూసినాను. మమ్మల్ని ఎందరో సాంప్రదాయవాదులు ఆదరించిన మాట నిజం. మా అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా ఇడారే వీళ్లు చెబుతున్నది సబబుగా ఉన్నట్లున్నదేననే ధోరణి.
9 విరసం ఆవిర్భావం తరువాత రాయలసీమ సాహిత్యంలో వచ్చిన మార్పులు ఏమిటి?
సరిగ్గా ఆ రోజుల్లోనే రాచమల్లు రామచంద్రారెడ్గి గారి సారధ్యంలో ‘సంవేదన’ వచ్చేది. ఆ పత్రిక ఒక సంచలనం. అభ్యుదయ రచనలు చేసే చాలా మంది విరసం ప్రభావం వల్ల విప్లవ రచనలే చేసినట్టు జ్ఞాపకం.
విరసంలో లేకపోయినా కేతు విశ్వనాథ రెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, సింగమనేని నారాయణ లాంటి వాళ్లు అద్భుతమయిన సాహిత సృజన చేసినారు. మధురాంతకం రాజారాంలాంటి వారు విరసం నిర్భందానికి గురైనపుడు నిరసించినారు. రాయలసీమ సాంప్రదాయ ధోరణినుండి బయటపడిందని గట్టిగా చెప్పవచ్చు. విరసం ప్రభావం వల్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా చాలా మంది రచయితలు సామాజిక స్పృహతోనే రచనలు చేస్తూ వస్తున్నారు.
10 విరసంలో మీరు ఏ సందర్భంలో విభేదించారు?
నేను విభేదించలేదు. వర్గ శత్రునిర్మూలన సరైంది కాదు అనే ఆలోచనతో ఉన్నందుకు, విరసంతో ఉండనక్కరలేదని జైల్లో ఉండగా విరసం పెద్దలే చెప్పి విరసం నుండి వైదొలిగేట్టుగా చేసినారు. అప్పట్లో అనుమానాలు, అపార్థాలు ఎక్కువ. సరైన అంచనా లేకుండా నిర్ణయాలు జరిగేటివి.
11 విరసం నుండి బయటకు రావడాన్ని ఆలోచిస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది?
నేను బయటకు వస్తేకదా? బయటకు పంపించినారు. విరసం మంరికొంత ప్రజాస్వామికంగా వ్యవసహరించి వుంటే నేనేకాదు, చాలామంది బయటికి వచ్చినవారు విరసంలోనే ఉండే వారేమో?
12 విరసం 50 సంవత్సరాల సందర్భాన్ని ఎలా చూస్తున్నారు చూడాలంటారు?
ఈ 50ఏళ్ళల్లో విరసం తెలుగు సమాజాన్నే కాదు, మిగిలిన భారత భూభాగాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితంచేసింది. అరెస్టులతో, నిర్భంధాలకు, చావులకు భయపడని ధీర సంస్థ విరసం. ఎదిరించటంలో, ప్రజల్ని సమీకరించడంలో ముందు పీఠాన నిలచింది విరసం.
మతం,కులం, అసహన ధోరణులు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో మరింత పటిష్టంగా, మొక్కవోని ధీరత్వంతో పనిచేయాల్సివుంది. ప్రజాస్వామికంగా ఆలోచించే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఒక విశాల వేదికను ఏర్పరచేందుకు కృషిచేయలి. ఇవ్వాళ కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక ధొరణుల్ని ఎదుర్కోవాలంటే విరసం ఒక్క దాని వల్లే అయ్యే పని కాదని గుర్తించి కలిసివచ్చే వారినందరినీ కలుపుకుని ఒక బ్రాడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పరచాటానికి కృషిచేయాలి. చొరవ తీసుకోవాల్సింది విరసమే. వర్తమానంలో చాలా మంది మేధావులు, లౌకిక వాదులు, కవులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు సరైన తీరులోనే సృందిస్తున్నారు. అంది పుచ్చుకోవాల్సిన బాధ్యత విరసందే. ఏ అరమరికలూ లేకుండా మన దేశంలోనే పెచ్చు మీరుతున్న అసహన, మత, మౌఢ్య ధోరణుల్ని ఎదుర్కోన తప్పదు.
13 మీరు మొహమాటం లేకుండా వ్రాస్తారు. మాట్లాడతారు అని అంటారు. దీని వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు?
ఏమీలేవు. ఈ ప్రశ్న భళేగా ఉంది. 1970లలో ఇట్లాంటివి ఎదుర్కొన్నాను. ఇప్పుడనిపిస్తుంది కొంత సర్దుకుపోవడమే మంచిదని.
14 శీశ్రీ, కె.విఆర్, వి.వి. త్రిపురనేని, చెరబండరాజులతో మీకున్న పరిచయాన్ని చెప్పండి? వీరితో మీ మీద తీవ్రంగా ప్రభావితం చేసిందెవరు?
‘లే’ కవితా సంకలనానికి పీఠిక రాయించుకోటానికి మద్రాస్ పోయి శ్రీశ్రీతో రాయించుకున్నప్పటి నుంచి శ్రీశ్రీతో సన్నిహిత సాంగత్యం ఏర్పడింది. మా పెళ్లి పెద్ద కూడా శ్రీశ్రీ. ఆ రోజు మీటింగు పెళ్లికి శ్రీశ్రీ, కెవిఆర్, యంవిఆర్, కాశీపతి, త్రిపురనేని పెద్దలు. ఫోటోలు కూడా తీయించుకోని పెళ్లి. అన్నింట పట్ల అంత వ్యతిరేకత ఆ రోజుల్లో. నక్సలైట్లు మా పెళ్ళికి సహకరించినారని ఆ తర్వాత మా మీద ప్రభుత్వం పెట్టిన చిత్తూరు కుట్ర కేసులో వొక ఆరోపణ. శీశ్రీని చిత్తూరు జిల్లాలో తిప్పని ప్రదేశం లేదు. విరసం సభలన్నింటికి హాజరయ్యేవారు. పైగా అతనికి మద్యం అలవాటు వుండటం వల్ల మా తిరుపతితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకున్న మాట వాస్తవం. 1983లో మా తమ్ముడు కరుణాకర్‌రెడ్డి మీటింగు పెళ్ళికి ఆహ్వానించటమే చివరి పలకరింపు. పెళ్ళి సమాయనికి శీశ్రీ ఆసుపత్రిలో ఉన్నారు.
త్రిపురనేని, నేను అత్యంత సన్నిహితంగా మెలగినవాళ్ళం. స్నేహితం కన్నా మించిన అనుబంధం మాది. త్రిపురనేని వల్లనే తత్తత్వం. రాజకీయం, సాహిత్యం, సామాజికం నేర్చుకున్నాను. వారు, నేను కలిసి కొన్ని వందల సభల్లో పాలుపంచుకున్నాము. మేము కలుసుకోని రోజు ఉండేదికాదు. ఎప్పుడు కలిసిన ఏదో ఒక అంశం గురించి చర్చించుకోవటం, మాట్లాడుకోవటమే గాని, పొద్దు పోని మాట మాట్లాడం ఒక్క క్షణమూ లేదు. ఒక వక్తగా ఎదగటానికి త్రిపురనేని చాలా సహకరించినాడు. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను త్రిపురనేని పరిచయం గాకుండా వుండే నా జీవితం ఇలా వుండేది కాదు. చిత్తూరు కుట్రకేసులో నిందితులం. అత్యావసర పరిస్థితిలో నిర్భందితులం. మా కుటుంబం నుండి నేను, మా తమ్ముడు భూమన కరుణాకర్ రెడ్డి, మామ పలవలి రామకృష్ణారెడ్డి అత్యవసర పరిస్థితుల్లో ముషీరబాదు జైల్లో ఉన్నాం. ముగ్గురికి కావాల్సిన వ్యక్తి త్రిపురనేని.
కె.వి.ఆర్. తిరుపతి మిత్రులకు చాలా సన్నిహితుడు. వారి వల్ల సాహిత్య చరిత్ర బాగా తెలిసింది. బాగా చదువుకున్న వారని మాకు ప్రత్యేక గౌరవం. వారి ‘ఎర్రపిడికిలి’ కవితా సంకలనాన్ని తిరుపతి మిత్రులమే ప్రింటు చేసినాము. తిరుపతి నుండి మేం ప్రచురించిన నాలుగు పుస్తకాలకు బాధ్యుణ్ణి నేనే. మద్రాస్‍లో క్రాంతి ప్రేస్‍కు పోయి ధనికొండ హనుమంతురావు గారిని కలుసుకోవటం, చర్చించుకోవటం మంచి జ్ఞాపకం. కె.వి.ఆర్.ని పెద్ద దిక్కుగా చూసేవాళ్ళం. మద్రాస్ పోయినప్పుడల్లా పాండీ బజారులో ఉండే రాణి బుక్ స్టాల్, ఆరుద్ర గారిని కలిసి వచ్చేవాణ్ణి.
చెరబండరాజు గారి ఇంట్లోనే మొట్టమొదట గద్దర్, భూపాల్‍ను కలుసుకొంది. గొప్పమిత్రులు. హైదరాబాదులో వాళ్ళింట్లో తరచుగా కలుసుకునే వాళ్ళం. మేము దిగంబర కవులను తిరుపతికి పిలిపించి సభలు పెట్టినప్పటి నుండి చెరబండరాజు మంచి ఆత్మీయ స్నేహితుడు.
వరవరరావు గారు ‘సృజన’తో మాకు చాలా దగ్గరవారు. నిబద్ధరచయితగా మేమంతా ఇష్టపడేవాళ్ళం. అందరికన్నా ఉద్యమంలో ముందు పీఠాన ఉన్న వ్యక్తి వరవరరావు. ఆ రోజుల్లో జిల్లా పరిషత్ ఛైర్మ్న్ ప్రతిష్ట కన్నా వరవరరావు ప్రతిష్ట ఎక్కువని అనుకునేవాళ్ళం.
త్రిపురనేని తర్వాత నాకు అత్యంత సన్నిహిత మిత్రులు నిఖలేశ్వర్, జ్వాలాముఖి.
నా మీద చలం ప్రభావం తప్ప మరెవరి ప్రభావంలేదు.
15 త్రిపురనేని మధుసూదన్‍రావు ప్రభావం ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా ఉన్న యువకుల మీద, సాహిత్యాకారుల మీద ఎలా ఉండేది?
త్రిపురనేని రాకతోనే తిరుపతిలోఅభ్యుదయ, నాస్తిక, విప్లవ భావాలు వరుస క్రమంలో ప్రవేశించినాయి. ఆ రోజుల్లో సి.పి.ఐ, సి.పి.యం పార్టీల ఉనికి తిరుపతి. త్రిపురనేని అత్యుత్తమ వక్త. ఆలోచనాపరుడు. కళాశాలలో లేడు. అధ్యాపకుడిగా అతనికి చాలా మంచిపేరు. త్రిపురనేనితో పరిచయమైన చాలా మంది విద్యార్థులు, యువకులు విప్లవ భావజాలానికి మళ్ళిన మాట వాస్తవం. ఆ రోజుల్లో తిరుపతిలో ప్రతిరోజు ఏదో ఒకచోట ప్రతిపురనేని ఉపన్యాసం ఉండేది. పోటిపడి హజరయ్యేవారు. మా వూళ్ళో కొనేటి కట్ట బహిరంగ సభల వేదిక. మేమిద్దరం స్నేహితులమైనాక మేం కలిసి అనేక సభలు, సమావేశాలు, సాంప్రదాయవాదులు కూడా త్రిపురనేని ఉపన్యాసాలు వినాడానికి ఆసక్తి చూపేవారు. విప్లవాభిమానులు ‘తిరుపతి మావో’గా త్రిపురనేని గుర్తుంచుకున్నారు.
త్రిపురనేనిని రాయటం వైపు మళ్ళేలా చేసింది తిరుపతి మిత్రులే. రాయటానికి చాలా బద్ధకం. ఎంత సేపయినా మాట్లాడతాడు కాని రాయటం అంటే మొరాయిస్తాడు. 1971 నుండి అనుకుంటా రాయటం మొదలయింది. ప్రతివ్యాసం మొదటనేనే చదివేవాణ్ణి. ‘కవిత్వం - చైతన్యం’ మా తిరుపతి మిత్రులమే ప్రచురించింది. క్రిటిక్ ఆఫ్ ద టైం అని నేనంటే ఏటుకూరి బలరామమూర్తి గారు తీవ్రంగా స్పందించటం జ్ఞాపకం.
నేను తి.తి. దేవస్థానం కాలేజిలో అధ్యాపకుడిగా చేరిన తర్వాత ఇద్దరం కలిసి అనేక సభలు, సమావేశాల్లో పాల్గోన్నాము. దిగంబర కవుల్ని మొట్టమొదట తిరపతి ఆహ్వానించి యస్.వి. యూనివర్సిటిలో, త్యాగరాయమంటపంలో అద్భుతమైన సభలు ఏర్పాటుచేసింది. త్రిపురనేని గారే తిరుపతి చాలా జీభవన్‍లో మొట్టమొదట సారిగా శీశ్రీ, కొడవటి గంటి కుటుంబరావుల్ని పిలిపించి విప్లవ జేగంటలు మోగించింది త్రిపురనేనిగారే.
త్రిపురనేనిని తిరుపతి ఎప్పటికీ మరవదు.
త్రిపురనేని మధుసూదనరావు పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ అట్టర్ ఫెయిల్యూర్. పెళ్లిళ్లు, చావులు, చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స కు కూడా వెళ్లేవాడు కాదు. ఆ కొన్ని సంవత్సరాలు బావుందేమోకానీ, ఆ తర్వాత వాటినే పట్టుకున్న మేము చాలా ఇబ్బంది పడ్డాం. వ్యక్తిగత సంబంధాల్లో అపార్థాలు, అపోహలు చేటు చేసుకొని చాలా నష్టపోయినట్టే లెక్క.
తిరుపతిలో ఉన్నన్ననాళ్లు తిరుమలకొండ కూడ చూసిన వాడు కాదు. కూతురు బీనా పెళ్లిలో మాత్రమే తప్పని పరిస్థితుల్లో కొండెక్కినాడు.
త్రిపురనేని అంటే మహాకవికి, కె.వి.ఆర్, కొ.కు,కు చాలా ఇష్టం. కొ.కు.తో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా కొనసాగేవి.
త్రిపురనేని లానంటి హాస్యప్రియుణ్ణి , చతురుణ్ణి మళ్లీ చూడలేదు.
ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకోకపోయినా ఆనాటి నగ్జలైటు వీరులందరూ త్రిపురనేనిని మెచ్చుకునేవారు. చర్చల సందర్భంగా జరిగిన ఒక బహిరంగసభలో ఆర్. కె., త్రిపురనేని గురించి మాట్లాడిన మాటలు చాటా గొప్పవి. అప్పటికి త్రిపురనేని చనిపోయి వున్నారు.
త్రిపురనేని తిరుపతిలో ఆ అంశాన్ని వదిలినవాడు కాదు. స్థానిక సమస్యలతో పాటు, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలన్నింటినీ పట్టించుకుని యువతను చైతన్య పరిచేవాడు. కె జి సత్యమూర్తిని, కొండపల్లి సీతారామయ్యను బాగా ఇష్టపడేవాడు. ఆ రోజుల్లో అండర్ గ్రౌండులో ఉన్న చాలా మంది అగ్రనాయకులు త్రిపురనేనిని కలిసేవారు. నాకు తెలిసి చారు మజుందారు, కానూ సన్యాల్ లాంటి వారిని కూడా కలిసినట్టు జ్ఞాపకం. ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసే.
సాహిత్యపరంగా కేతవరపు రామకోటిశాస్త్రి గారిని బాగా ఇష్టపడేవాడు. వారు తిరుపతి వచ్చినప్పుడల్లా కలిసేవారు.
గోపిగారి నేతృత్వంలో గురజాడ అధ్యయన కేంద్ర ఏర్పాటయి ‘‘100 ఏళ్ల కన్యాశుల్కం’’ సభలను చిత్తూరు జిల్లాలో దాదాపు 75 నిర్వహించటం ఒక అపురూపం. ప్రతి సభకు త్రిపురనేని వచ్చినాడు. ‘‘దేశచరిత్రలు’’ గేయాన్ని ఊరురా పాడటం ఒక అద్వితీయమయిన జ్ఞాపకం. ప్రతి కార్యక్రమాన్ని నావల్ గా చేసేవాడు.
16 ఇప్పుడు వెలువరుతున్న రాయలసీమ సాహిత్యమును ఎలా చూడాలంటారు?
ఇప్పుడు వస్తున్న రాయలసీమ సాహిత్యం రాయలసీమ నిజ జీవితాన్ని ప్రతిఫలిస్తున్నది. రాయలసీమ సేద్యం, నీళ్ళు, కరువు, వలసలు, అణిచివేత, లేకుండా సాహిత్యలేదు. అద్భుతమయిన కథ, నవల మా రాయలసీమ నుండి వస్తున్నాయి. సీనియర్ రచయితలయిన కేతు విశ్వనాథ రెడ్డి, సింగమనేని నారాయణలతో పాటుగా నన్నపరెడ్డి వెంంకట్రామిరెడ్డి, స్వామి, దేవపుత్ర, సడ్లపల్లి, వెంకటకృష్ణ, మారుతి, పౌరోహితం, రాసాని, వెంకటకృష్ణ, పాణి, శాంతినారాయణ, దాదాహయాత్‍లాంటి వారెందరో అద్భుతమయిన సాహితీ సృజన చేస్తున్నారు. రాయలసీమ వారిని చూసి గర్వపడుతున్నది. ఉద్యమాల వెంట పయనిస్తున్న మా రాయలసీమ రచయితలు మా సీమ సమస్య పరిష్కరానికి చేయుతగా ఉంటారనటంలో సంందేహం లేదు. రాయలసీమ అస్థిత్వ పోరాటంలో భాగంగానే మా సాహిత్యాన్ని చూడాలంటాను.
17 ప్రస్తుతం రాస్తున్న రచయితలలో మీరు ఇష్టపడే రచయితలు - ముఖ్యంగా రాయలసీమ రచయితలు ఎవరు?
రంగనాయకమ్మ, ఓల్గా, కుప్పిలి పద్మ, మహెజబీన్, నామినీ, ఖాదర్, కె. శివారెడ్డి, నాగసూరి వేణుగోపాల్, ‘కథ’, ‘అన్వీక్షకి’, ఎన్. వేణుగోపాల్, ఖదీర్‍బాబు, రాచ పాళెం చంద్రశేఖర్‍రెడ్డి, కొలకలూరి ఇనాక్, జి ఆర్ మహర్షి - ఇంకా ఎందరో, మరెందరో??
స్వామి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రాసాని, జి. వెంకటకృష్ణ, ‘‘నేలంకని రచయితలు’’, మారుతి పౌరోహితం, మధురాంతకం నరేంద్ర,, కేతు విశ్వ నాథరెడ్డి, సింగమనేని నారాయణ, శాంతినారాయణ, వేంపల్లి షరీఫ్, సాకం నాగరాజు మొదలైనవారు.
18 ఒక రచయితగా ప్రస్తుత సామాజికోద్యమాలను ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ప్రస్తుత సామాజిక ఉద్యమాలు సరైన మార్గంలోనే నడుస్తున్నాయి. శత్రువు బలంగా ఉండటం మెయిన్ స్ట్రిమ్ మీడియా వాళ్ళకు బాకాగా తయారు కావటం వల్ల మిగిలిన రంగం బోసిగా అనిపించవచ్చు. విడివిడిగా చాలా బలంగా ప్రజావ్యతిరేక వ్యవస్థను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం వుంది. మొన్నటికి మొన్న కా( సి ఎ ఎ) కు వ్యతిరేకంగా ఢిల్లీలో మహిళలు కదలి రావటం అపూర్వంకదా? ముస్లిం వ్యతిరేకతను, అసహనానికి, కులవివక్షకు, మహిళా అణిచివేతకు వ్యతిరేకంగా కలిసి వస్తున్న జనసముహం గొప్ప ఆశాజనకంగా ఉంది.
ప్రస్తుత సామాజిక ఉద్యమాలు ఒక సరైన నాయకత్వంలో మలుపు తిరిగే రోజు ఎంతో దూరంలేదు.
19 సామాజిక ఉద్యమాలలోనికి యువతరం, కొత్తతరం ఎందుకు రాలేక పోతున్నది?
యువతరానికి, కొత్త తరానికి ప్రస్తుత నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. పాత తరానికన్నా వీరు బాగా ఆలోచిస్తున్నారు. విశ్లేషించుకుంటున్నారు. సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నట్టుంది.
తెలంగాణా ఉద్యమంలో యువకుల కొత్త తరం పాత్ర ఎంత క్రియాశీలకంగా ఉందో చూసినాము.
మా రాయలసీమ ఉద్యమంలో యువతరం, కొత్త తరం చాలా ఆశాజనకంగా ముందున్నది.
జల్లి కట్టు ఉద్యమంలో కాని, పౌరసత్వ బిల్లుకు వ్యతిరేక ఉద్యమంలో గాని అస్సలు ఊహించని జనం ఎట్లా కలిసి వస్తూన్నారో చూస్తున్నం.
నూతన పరిస్థితి, కొత్త సవాళ్ళు భవిష్యద్దర్శనం, శాస్త్రీయత కలిగిన నాయకత్వంకోసం ఈ తరం ఎదురుచుస్తున్నది.
మనం సెకండరీ స్థాయి పుస్తకాలు చదివి అవగాహన కలిగి వుంటే ఈ తరం ఒరిజినల్ రైటింగ్స్ చదువుతూ మరింత పదునెక్కుతున్నారు.
ప్రపంచం మొత్తంగానే యువకుల్ని చూస్తుంటే ముచ్చటేస్తున్నది. యల్ జి బి టి క్యూ లాంటి ఉద్యమాలు ఎంత ముందుకు పోతున్నాయో గమనించండి. సంకీర్ణ ఆర్థిక, సామాజిక విశ్లేషణలో ఈ తరం రాటు తేలుతున్నది. అది ఉద్యమ రూపం తీసుకోవటం ఎంతో దూరంలేదు. కాకపోతే విడివిడిగా అస్థిత్వ ఉద్యమాల్లో ఉన్న వారినందరినీ కలుపుకుని ఉద్యమబాటను ఏర్పరచవలసిన తరుణం ఇది. ఎదురుచుస్తున్నది ఆ నాయకత్వం కోసం ఈ తరం.
20 సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా? మీ అనుభవం ఏమిటి?
ప్రపంచ విప్లవ పోరాటాల్లో స్వాతంత్య్ర పోరాటాల్లో సాహిత్యం, రచన కీలక పాత్ర పోషించినాయి. చైనా విప్లవంలో మావో రచనలు, కవితలు, వియాత్నాం హోచీమన్ రచనలు, రష్యా విప్లవంలో లెనిన్ రచనలు, టాల్‍స్టాయ్, మయకోవిస్కీ, మాక్సింగోర్కీ రచనలు, మనదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ, నెహ్రు రచనలు తెలంగాణా పోరాటంలో బొల్లిముంత, సుంకర, దాశరథి, సోమసుందర్‍లాంటి వారి రచనలు ఎంతో ప్రేరణ కలిగించినాయి. సాహిత్యం సామాజిక మాతృకకు ఒక చోదక శక్తి. ఒక దీవధారి. నేనూ సాహిత్యపఠనం ద్వారానే ఉద్యమరంగంలో అడుగు పెట్టిన వాణ్ణి.
21 శ్వేత ప్రాజెక్టు గురించి చెప్పండి? మీరు చేసిన ప్రయోగాలు, అనుభవాల గురించి చెప్పండి?
శ్వేత - శ్రీవెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా సంస్థ. తిరుమల - తిరుపతి దేవస్థానం 2002లో ఉద్యోగుల్లో క్యూ మేనేజ్‍మెంట్, క్రౌడ్ మేనేజ్‍మెంట్, ఫైల్ రైటింగ్. సంస్థ పూర్వోపరాలు తదితర అంశాల్లో అవగాహన కలిగించటానికి ఏర్పండింది. నేను 2005లో సంచాలకుడిగా బాధ్యతలు తీసుకున్నాను. ఉద్యోగులకు సుశిక్షుతులైన అధ్యాపకులను పిలిపించి అనేక అంశాల గురించి తరగతులు ఏర్పాటు చేసేవాణ్ణి. రానురాను పరిధి విస్తృతమై గ్రంధాయం, డిజిటల్ లైబ్రరీ, తరిగొండ వేంగమాంబ ప్రాజెక్టు, వేటూరి ప్రభాకర శాస్త్రీ ప్రాజెక్టు, కొన్నాళ్ళు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడిగా పనిచేసే అవకాశం కలిగింది.
ఉద్యోగులకు తెలుగులో ఫైళ్ళు రాయటం అంకౌట్స్ మరియు అడిట్, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలతోపాటూ మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకొనేలా ఊతమివ్వగలిగినాను.
లైబ్రరీకి ఒక ఉచిత బస్సు ఏర్పాటు చేయించి తిరుపతిలోని అన్ని పాఠశాల విద్యార్థులను పిలిపించి చదివించే అలవాటు చేయగలిగినాను. ఉద్యోగ విరమణ చేసిన వారికి, వృద్ధులకు ఈ సౌకర్యం ఏర్పరచకలిగినాను.
ప్రతి సంవత్సరం, పుస్తక పఠన దినోత్సవాన్ని, గాడిచర్ల హరిసరోత్తమరావు జయంతి, కందుకూరి జయంతిని క్రమం తప్పకుండా జరిపించేవాడిని. మహిళా దినోత్సవం ఇప్పటికీ కొనసాగుతుండటం సంతోషంగా ఉంది.
డిజిటల్ లైబ్రరీ సంచాలకునిగా రాష్ట్రమంతటా తిరిగి చాలా పుస్తకాలు సేకరించి డిజిలైజేషన్ చేయించినాను. ఈ ప్రాజెక్టు యూనివర్సల్ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టుకు అనుబంధం. దీని వ్యూహకర్త ప్రొ. రాజ్‍రెడ్డి. వీరు కార్నెగల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్సి మరియు కంప్యూటర్ సైన్స్లో ఆచార్యులు. నిష్ణాతులు. అప్పట్లో దాదాపు 60 ప్రభుత్వలకు కంప్యూటర్ సలహదారునిగా వుండేవారు. వీరు డిజిటల్ లైబ్రరీకి కావాల్సిన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అంతా ఉచితంగా సమకూర్చినారు. టి.టి.డి చేయవల్సిందల్లా పుస్తకాల్ని డిజిటలైజేషన్ చేయటమే. దీన్ని నాకు ఉన్న ఆసక్తి వల్ల ఒక ఉద్యమంలా చేయగలిగాను. మద్రాసులో కన్నెమరా గ్రంథాలయం, తంజావూరులోని సరస్వతీ గ్రంథాలయం వేటపాలెంలోని కొన్ని పుస్తకాలు, మచిలీపట్టణంలోని విక్టోరియా గ్రంథాలయం, నెల్లూరులోని వర్దమాన సమాజం లాంటివన్నీ తిరిగి, వారిని ఒప్పించి డిజిటల్ లైబ్రరీ ఖర్చులతో డిజిటలైజ్ చేయగలిగాను. విశాలాంధ్ర మేనేజర్ పి. రాజేశ్వరరావు గారి సౌజన్యంతో తరిగొండ వేంగమాంబ జీవిత చరిత్రను హిందీ, ఇంగ్లీషులోనూ వచ్చేలా చేయగలిగినాను. రాసాని నాటకం రాస్తే, దాన్ని హిందీలోకి తర్జుమా చేయించటం జరిగింది. విశాలాంధ్ర ప్రచురణలను కూడ కొన్నింటిని చేయించకలిగినాను.
అన్నింటి కన్నా ముఖ్యం ‘చందమామ’ అన్ని సంవత్సారాల, అన్ని భాషల కాపీలను డిజిటలైజ్ చేయించటం ఒక అపురూపమయిన అనుభవం. అందుకు బి. విశ్వనాథరెడ్డి గారి సహకారం మరువలేనిది. ‘చందమామ’ 60 వసంతాల పండుగను ‘శ్వేత’ నే ఘనంగా తిరుపతిలో నిర్వహించింది.
అంతేగాకుండా చాలా మంది రచయితలను వొప్పించి వారి గ్రంథాలయాలను శ్వేత గ్రంథాలయానికి చేర్పించగలిగినాను. సి.ఆర్. రెడ్డి గ్రంథాలయం, బాలశౌరి రెడ్డి గారి గ్రంథాలయం లాంటి వెన్నో శ్వేత గ్రంథాలయంలో చేరిపోయినాయి. విడిగా ఎంతో మంది వ్యక్తులద్వారా పుస్తకాలు సేకరించేవాణ్ణి, విద్యార్థులు పొటి పరిక్షలకు సిద్ధంకావటానికి వారికి అవసరమయిన కరిక్యూలర్ ఆర్.సి.రెడ్డి ఐ.ఎ.యస్. స్టడి సర్కిల్ నుండి ఉచితంగా తెప్పించి అందుబాటులో ఉంచేవాణ్ణి.
నా ఆ మూడేళ్ళల్లో తరిగొండ వేంగమాంబ సినిమా వచ్చేలాగా చేయటంలో నా కృషి కూడా కొంత ఉంది. అందుకు దొరస్వామి రాజుగారి ఉదాత్తతను గుర్తుచేసుకొవాలి.
అన్నింటికన్నా ముఖ్యమయిన విషయమేమిటంటే శ్వేత ద్వారా రాష్ట్రంలోని ప్రతి దళిత వాడ, మత్స్యకార గ్రామాలనుండి ఎంపిక చేసిన వారికి వారం రోజలు పాటు పూజా విధానంలో శిక్షణ ఇవ్వటం. దీనికి బోర్డు అనుమతి లేకపోయినా కె.వి. రమణచారి గారి సాంగత్యం వల్ల చేయగలిగాము. వారికి రానుపోను ఛార్జీలు ఇప్పించి, శ్వేతలోనే వసతి సౌకర్యం, అక్కడే భోజనాలు ఏర్పాటు చేయించగలిగినాము.
మనకు భక్తి లేక పోయినా సమాజంలో భక్తి కలిగిన అణగారిన వర్గాలకు ఆ అవకాశమే లేకుండా పోయిందికదా అనేదీ నా ఆలోచన. ఆ ఊళ్ళన్నీ తిరిగి పిలిపించేవాణ్ణి. తరువాత గిరిజన గ్రామాలనుండి కూడ, ఇదొక పెద్ద సంచలనంగానే జరిగింది.
టివి9 వారు నన్ను ఆ రోజుల్లో ఇంటర్వు చేస్తూ ఈ శిక్షణ పొందిన దళితులు, గిరిజనులు తిరుమల దేవాలయంలో మాకూ అవకాశం ఇవ్వాలని డిమాండు చేస్తే ఎట్లాని అడిగితే ‘‘అంతకుమించిని డిమాండు మరే ముంటుందని’’ జవాబిచ్చాను. ఎన్నో కంట్రావర్సిస్ మధ్య ఆ కార్యక్రమం కె.వి. రమణచారి గారి ప్రోత్సహంతో ఘనంగా జరిగింది.
ప్రతి ఒక్కరికీ అవకాశం అనే సిద్ధాంతంతోనే ఎవరెన్ని రకాలుగా విమర్శించినా ముందుకు పోగలిగినాను.
వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రాజెక్టు ప్రారంభ సంచాలకుడిగా వారి పుస్తకాలన్నింటిని వేటూరి ఆనంద మూర్తి గారిని వొప్పించి శ్వేతకు తెప్పించి కలిగినాను. మిగిలిన పుస్తకాలను పరిష్కరింపజేసి ప్రచురించటమే గాకుండా, అన్ని గ్రంథాలయ పుస్తకాలను డిజిటలైజ్ చేయించకలిగినాను. విశ్వ విద్యాలయాల్లో వేటూరి పేరిట సదస్సులు నిర్వహంచకలిగినాను. వారి విగ్రహం కూడా శ్వేత ఎదురుగా ప్రతిష్టింపచేయటం జరిగింది. తరిగొండ వేంగమాంబ విగ్రహం, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, సాధు సుబ్రమణ్యం శాస్త్రి గార్ల విగ్రహాలు కూడా శ్వేత గుండానే ప్రతిష్టింపబడినాయి.
చివర్లో సారంగపాణి ప్రాజెక్టు ఏర్పాటు చేయటానికి పాటు పడ్డాను కాని, కుదరలేదు. నేను వైదొలిగిన తర్వాత కార్వేటి నగరంలో ప్రతిష్టింపచేసినారు.
అప్పటి కార్యనిర్వహణాధికారి సారంగపాణి శృంగార కీర్తనలు రాసినాడంట కదా అంటే అన్నమాచార్య శృంగార కీర్తన రచనల పుస్తకాలు చూయించి మారు మాట్లడకుండా చేయగలిగినాను గాని, ప్రాజెక్టు మాత్రం సాకారం కాలేకపోయింది.
తి.తి. దేవస్థానం మహాభారతం అన్ని సంపుటాలు ప్రచురించిన తర్వాత ‘శ్వేత’ ఆధ్వర్యంలో తిరుపతి, వరంగల్, రాజమహేంద్రవరం, డిల్లీ, హైదరాబాదు, అనంతపురంలో ఘనమైన సదస్సులు నిర్వహించి ఒక మంచి సావనీరు తీసుకురావటం విలువైన జ్ఞాపకం.
సాదా సీదాగా ఉన్న ‘శ్వేత’ ఆధ్వర్యంలో తీరిక లేనన్ని కార్యక్రమాలు నిర్వహించటం విశేషంగా అనిపిస్తుంది.
తి.తి.దేవస్థానపు యస్.వి. ఆర్టస్ కాలేజిలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‍గా పనిచేస్తూ డిప్యూటేషన్‍పైన శ్వేత సంచాలకుడిగా ఐదు సంవత్సరాలు పనిచేసినాను. శ్వేత సంచాలకుడిగా అదనంగా నాకు వచ్చిన ఆర్థిక లాభాలు, అధికార వసతులుగాని లేవు. అవకాశం వచ్చింది చేయగలవన్నీ అప్పటి కార్యనిర్వహణాధికారుల సహకారం, ప్రోత్సాహం వల్ల చేయగలిగినాను.
నేను లెక్చరర్‍గా వున్న ఆ రోజుల్లో మధ్య సంచాలకుడిగా పోత్నుప్పుడు నా విద్యార్థి ఒకరు ఒక మంచి ప్రశ్న వేసినాడు. అభ్యుదయ భావాలతో, చైతన్యపూరితమయిన ధోరణితో పాఠాలు చెప్పే మీరు మమ్ముల్ని మధ్యలో వదిలేసిపోతే ఎట్లా సార్ అని. అందుకు మాత్రం వొకింత దిగులే. నా విశ్వాసాల్ని కాపాడుకుంటూ ‘‘శ్వేత’’ ను అందల మెక్కించగలిగినాను. తిరుమల - తిరుపతి దేవస్థానంలో త్రిపురనేని మధుసుదన్ రావు, డి. నాగసిద్ధారెడ్డి, నేను హేతువాద, అభ్యుదయ విప్లవ భావాలు కలిగిన వాళ్ళం పూరి్త సర్వీసు పని చేసినాము. తి.తి.దే. ప్రజాస్వామికంగా వ్యవహరించిందే గాని మమ్ముల్ని వేధించే అసహనాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. మేము కేసుల్లో నిర్భంధించబడినప్పుడు, అత్యవసర పరిస్థితిలో అరెస్టుయినప్పుడు కూడ సహకరిచిందే గాని యాక్షన్ తీసుకొలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రోజులు ఉండవని ఇప్పుడు గట్టిగా అనిపిస్తున్నది. ఈ అసహన, మతధోరణుల మధ్యన ఆనాటిని ఊహించటం కష్టమే.
తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రారంభ సంచాలకుణ్ణి నేనే. తరిగొండ వెంగమాంబ మీద మొట్ట మొదట పి.హెచ్‍డి చేసిన ఆచార్య కె.వి. క్రిష్ణమూర్తి గారి సారధ్యంలో ఆమె రాసిన పుస్తకాలన్నింటినీ పరిష్కరించి ప్రచురించకలిగినాము.
తరిగండ వెంగమాంబ ఆ రోజుల్లోనే సామాజిక దుష్టాచారాన్ని ఎదిరించిన ధీర వనిత. పుష్కర పీఠాధిపతిని ప్రశ్నించిన వైనం ఆదర్శప్రాయం. తిరుమలలో అన్న ప్రసాదాన్ని ప్రవేశ పెట్టిన వ్యక్తి ఆమె. తిరుమలలో తరిగొండ వెంగమాంబ ప్రవేశ పెట్టిన ముత్యాల హారతితోనే కార్యక్రమాలన్నీ ముగుస్తాయి.
వారు రాసిన పాటలన్నింటిని సి.డి.లుగా తీసుకొచ్చినాము. ఈ పనుల్లో మిత్రులు సాయికృష్ణ యాచేంద్ర గారి సహకారం అపూర్వం. వారు మంచి కళాకారులతో పాడించకలిగినారు.
ఆమె రచనల్లో చాలా ముక్తకాలని ఎవరో అడ్దుచెబతే, పాటకు వొదగ గలిగినప్పుడు ముక్తకాలైతే నేమని పాడించగలిగాను.
తరిగొండ వెంగమాంబ రచనల మీద పి.హెచ్‍డి చేసే విద్యార్థికి రూ. 6000 లు పారితోషికం ఇచ్చేట్టుగా ఉత్తర్వులు ఇప్పించినాను. ఏ విశ్వవిద్యాలయంలో చేసినా సరే.
తరిగొండ వెంగమాంబ సాహితీ సదస్సుకు దాదాపు ముఖ్య విశ్వవిద్యాలయాలన్నింటిలో జరిపించగలిగినాము.
తరిగొండ వెంగమాంబ నాటకాన్ని సురభి వారు ప్రదర్శించే ఏర్పాటు చేయగలిగినాను. అందులో అప్పుడు ఈ.ఓ. కె.వి. రమణాచారి గారి ప్రోత్సాహం మరువలేనిది.
నేను ఆర్ట్స కాలేజీ నుండి ‘శ్వేత’ సంచాలకుడిగా పోయేప్పుడు మంచి ప్రశ్న వేసిన నా విద్యార్థి వెంకటరమణ ఆ ఐదేళ్లు నా కార్యక్రమాలన్నింటినీ ఫాలో అయ్యి నేను రిటైరయిన రోజున, మీరు ‘నామం’ కూడ పెట్టుకోకుండా మీ అభిప్రాయాలను సంరక్షించుకుంటూనే నడిపినందుకు సంతోషంగా ఉంది సార్ అనటం - ఆదావ అనిర్వచనీయమయిన ఆనందం. ఒక స్టూడెంటు నుండి అంతకు మించిన సర్టిఫికేటు ఏముంటుంది?
మహిళలకు కూడా పూజా విధానంలో శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో కాలం మించిపోయింది. నిజానికి ఇంట్లో పూజా పునస్కారాలు చేసేది మహిళలే. తీరా బయట గుళ్లల్లో వారికి అవకాశమే లేదు. దేవాలయాల్లో మహిళలు కూడా పూజా విధానాలు నిర్వహించే రోజు రావాలి.
నా హయాంలో శ్వేతకు డా. యం వి ఆర్, బొజ్జా తారకం, జ్వాలాముఖి, కె. విశ్వనాథ్, సుధా నారాయణమూర్తి, విశ్వనాథరెడ్డి, సినారె లాంటి పెద్దలెందరో రావటం మరపురాని జ్ఞాపకం.
22 మీ ట్రెక్కింగ్ అనుభవలు- విశేషాలు ఏమిటి?
నేను లెక్చరర్‍గా పనిచేసే రోజుల్లో ప్రతిరోజు తిరుమల గాలి గోపురం వరకు ఎక్కి, దిగి వచ్చి కాలేజికి పోయి పాఠాలు చెపేవాణ్ణి. అట్లా అలవాటయిన ఆ తీరుతో చంద్రగిరి వైపున శ్రీవారి కాలిబాటకు దారి మళ్ళింది. ప్రతిరోజూ (అది నా 40వ ఏటనుండి అనుకుంటా) ఎక్కడం, దిగడం ప్రాక్టీస్ అయ్యి 20 నిముషాల్లో ఎక్కి 15 నిముషాల్లో దిగివచ్చేవాణ్ణి, నాతో పాటు జర్నలిస్టు మిత్రుడు ఆలూరి రాఘవశర్మ ఉండేవాడు. ధమ, ధమ దూకే వాళ్ళం. అట్లా మొదలయ్యి మా శేషాచలం అడవులన్నీ తిరగాలనే అభిలాషతో ప్రతి తీర్థం తిరిగినాను. తిరుపతి ఎదురుగా కనిపించే కొండ ఆ కొస నుండి ఈ కొస వరకు ఆ మాట కొస్తే ప్రతి అంగుళం తిరిగినట్టే.
అంతవరకు రాయలసీమ కరువు బండ యాత్ర 600 కి.మీ. చేసిన అనుభవం. 1980లలో శ్రీకాకుళం కొండలన్నీ దాదాపు 200కి.మీ. తిరిగిన అనుభవం ఉంది.
ట్రెక్కింగ్ నా జీవితంలో ఒక భాగమై ప్రకృతి కలయ తిరగటం, ఆ అందచందాలను ఆస్వాదిచటం గత నాలుగు సంవత్సరాలుగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నది. తిరుపతిలో మిత్రులు బి.వి. రమణ, బాలు సాధ్యంలో మొసాయిక్ అడ్వంచర్ కమ్యూన్ అనే సంస్థ ఏర్పడి ప్రతి ఆదివారం సన్‍రైస్ ట్రెక్కింగ్ నిర్వహిస్తూన్నాము. ప్రతి ఆదివారం తప్పని సరిగా ఎంతమంది వచ్చినా ఉదయం 5.30 నుండి 9.30 గం।।ల వరకు ఉంటాయి. తిరుపతి దాని చుట్టు పక్కల 20 కి.మీ. పరిధిలో ఉన్న ఒక 20, 25 ప్రాంతాలను ఎన్నుకున్నము. మా ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 5000వరకు సభ్యులున్నారు. ప్రతి ఆదివారం 50 నుండి 100 వరకు వస్తారు. ఈ ట్రెక్కింగ్ గ్రూప్‍లో 70 ఏళ్ళ వయస్సు పై బడిన వాణ్ణి నేనొక్కణ్ణే,. యూత్‍కు ఇన్‍స్పైర్‍గా ఉంటుందని ఫేస్ బుక్‍లో ఫోటోలు షేర్ చేస్తూంటాను.
ట్రెక్కింగ్ వల్ల ఆరోగ్య నియమాలను సమస్థితిలో ఉంచుకోవటం, ప్రకృతితో మమేకం గావటం, ప్రకృతిలో మనం భాగం అని తెలుసుకోవటం, అందచందాలను ఆస్వాదించటం, అడ్వంచర్‍లో భాగస్వాములు గావటం మనిషిని స్మార్ట్గా ఉంచుతాయని నా నమ్మకం.
ట్రెక్కింగ్ అలవాటువటం వల్ల ఎక్కడికి పోయినా, అమెరికాకు పోయినప్పుడు తప్పనిసరిగా ట్రెక్కింగ్ చేస్తాను. భూటాన్ పోయినప్పుడు టైగర్‍నెస్ట్ అనే ప్రాంతానికి అద్భుతమయిన ట్రెక్ చేయటం ఒక గొప్ప అనుభవం. హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడా మంచుకొండల్లో చేసినాను. హైదరాబాదులో చార్మినార్ నుండి ప్రతి ఆదివారం ఉదయం హెరిటేజ్ వాక్స్ ఉంటాయి. నాలుగు వాక్స్ చేసినాను. ఏ నగరానికి పోయినా హేరిటేజ్ వాక్స్లో భాగస్వామినవటం ఒక అలవాటుగా మారింది.
మా కొండనే 20కి.మీ (రానుపోను) దూరం వుండే ట్రేకింగ్స్ అద్భుతమయినవి కొన్ని పదులసార్లు చేసినాను. అవి 1. శేషతీర్థం, 2. తుంబుర తీర్థం, 3. రామకృష్ణ తీర్థం, 4. తాంత్రిక లోయ, 5. కుమారధార మొదలైనవి.
ఐ లవ్ అండ్ రిలిష్ ట్రెక్కింగ్. ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్ అలవాటు చేసుకొమ్మని మా మనవి.
23 కదలిక పత్రిక ఏ సందర్భంలో పెట్టారు? మీ అనుభావాలు ఏమిటి?
‘కదలిక’ ప్రారంభ క్రెడిటంతా పూర్తిగా మిత్రుడు ఇమాందే. నేను, బాషా, ఏయన్ సహకరించినాము. ఇమాంకు రాయలసీమ సమస్యలు, నీటి పారుదల వ్యవస్థ మీద మంచి పట్టు ఉండేది. 1984ల తెలుగుగంగ పథకం మొదలయినప్పుడు రాయలసీమ సమస్యలు వెలుగులోకి వచ్చినాయి. డా।। యం.వి.ఆర్ చాలా ప్రశ్నలు సంధించినారు. సరిగ్గా ఆ సమయంలో ‘కదిలిక’ రాయలసీమ సమస్యలపై విస్తృతంగా పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించింది. ఎన్నెన్నో కొత్త సంగతులను ఆవిష్కరించింది. రాయలసీమ సమస్యలతో పాటు అనేక సాహితీ, సామాజిక, రాజకీయ వ్యాసాలను ప్రచురించింది. నేను వివిధ పేర్లతో విరివిగా వ్యాసాలు రాసేవాణ్ణి. నేను, ఇమాం కదలిక, రాయటమే గాకుండా రాయలసీమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించినాము. పోతిరెడ్డి పాడు కరువు బండ యాత్ర మా ఆలోచనే. నేను మదనపల్లె నుండి కర్నూలు జిల్లా పోతిరెడ్డి పాడు వరకు సుమారు 550కి.మీ దూరం మిత్రులు సి.హెచ్, శ్రీధర్‍లతో పాటు పాద యాత్ర చేసినాను. 1986 జనవరి 1వ తారీకు నుండి 22వరకు. అది ఒక గొప్ప అనుభవం.
తెలంగాణా ఉద్యమం మొదలైనప్పుడు శ్వేత సంచాలకుడిగా ఉండినా ప్రత్యేక తెలంగానా రాష్ట్రనికి మద్దతును గట్టిగా సమర్థించటానికి ఈ నేపథ్యమే కారంణం. తెలంగాణాతో పాటు రాయలసీమ కూడ ప్రత్యేక రాష్ట్రం కావాలనేది నా డిమాండు.
1984 నుండి కదలికను మోస్తూ రాయలసీమ ఉద్యమంలో మేము తిరగని ఊరు, మాట్లాడని ప్రదేశంలేదు.
‘కదలిక’ ఎందరినో ప్రభావితం చేసింది. ఎంతగానంటే ప్రముఖ రచయిత స్వామి ‘‘రాయలసీమ సమాజము - సాహిత్యము’’ పుస్తక ఆవిష్కరణ సభలో ‘కదలిక’ ను సన్మానించేంత వరకు. కదలిక వల్లనే రాయలసీమ సమస్యలు బాగా అవగతమయినట్టు స్వామి సభా ముఖంగా చెప్పటం నిర్వాహకులంగా మా కెంతో గర్వకారణం.
24 పాఠకులు, కవులు, రచయితలు, సాహితీ వేత్తలకు గోదావరి అంతార్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదల్చుకున్నారు?
దేశంలో అసహన ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. మత విద్వేషాలు పరాకాష్టకు చేరుతున్నాయి. ప్రజాస్వామిక ధోరణులు దాదాపు చంపబడుతున్నాయి. స్వేచ్చ, హక్కులకు భయంకరమయిన భంగం కలుగుతున్నది. ఈ పరిస్థితుల్ని అర్ధం చేసుకొని, శాస్త్రీయ దృక్పథం పెంచుకుని రచనలు చెయ్యండి. ఉన్న అందుబాటులో జరుగుతున్న మంచి రచనలను అధ్యయనం చేయండి. మనం రాసే రాతలు మన ముందున్న రాతకన్నా ఫర్వాలేదా అని విశ్లేషించుకొని ప్రచురించండి. రాయాలని రాయమాకండి. రాసి ఉన్న రాతల్ని అర్థం చేసుకొని అవగాహన పెంచండి. మన రాతలు సమాజంలో ప్రజావళిని చైతన్యపరుస్తాయి. ఆ చైతన్య సమరంలో సమిధలు కావటమే రచయితల ధర్మం, కర్తవ్యం.
గోదావరి అంతార్జాల పత్రిక ద్వారా స్వేచ్ఛాయుతమయిన, అణిచివేత లేని, ధనిక, పేద తేడాలేని ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి అందరం కృషిచేయాలనేది నా ఆకాంక్ష.
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు