‘‘వెంట వెళ్లైనా చూడాలి. ఇంట ఉండైనా చూడాలి’’ ఒకప్పుడు పల్లెల్లో తరుచుగా వినిపించే సామెత ఇది. ఒరే నేను చెబితే విన్నావా? ఎదుటివాడు మంచోడా? చెడ్డోడా? అని తెలుసుకోకుండా ఎవరో చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేసి మోసపోయావు. మన పెద్దలు ఊర్కె అన్నారా ‘‘వెంట వెళ్లైనా చూడాలి. ఇంట ఉండైనా చూడాలని’’ ఇది జన జీవన అనునభవ సారం నుండి పుట్టిన సామెత. ఇదే అనుభవసారం మౌఖిక సాహిత్యం నుండి లిఖిత సాహిత్యంలోకి వెళ్తుంది.
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజు డేపోనీతి పరు డు మహిలో సుమతీ...
బద్దెన రాసిన సుమతి శతకంలోని ఈ పద్యాన్ని చదువుతుంటే పైన పేర్కొన్న జానపదుల సామెత తప్పని సరిగా స్ఫురణకు వస్తుంది. అది మౌఖిక సాహిత్యమైనా, లిఖిత సాహిత్యమైనా ఒక తరం నుండి మరొక తరానికి ప్రవహిస్తుంది. కాబట్టి సమాజం, సాహిత్యం ఏ తరంలోనైనా బింబ ప్రతిబింబాలుగా వుంటాయి. పరస్పరం మార్పులు పొందుతుంటాయి.
ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించలేక కొందరు సాహితీవేత్తలు, విమర్శకులు, కళాకారులు వేసిన దారి వెంట వెళ్తూ నే ఉంటారు. ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళు కొత్త దారులు వెతుకుతారు. ఈ రెండు దారులు ప్రతితరంలోనూ ఉంటాయి.
ఇవ్వాల సమాజం ప్రపంచీకరణ ప్రభావానికి లోనైఉంది. కాబట్టి నేటి సాహిత్యంలో ఈ ప్రతిబింబం బలంగా ఉంది. చాలా మంది కవులు, రచయితలు, విమర్శకులు ఈ ప్రవాహంలో కొట్టుకపోతున్నారు. ఎవరికి వారు తమ ఉనికి కోసం ఆరాట పడుతున్నారు. అనుభవం, అనుభూతి, సామాజిక పరిశీలన, అవగాహన, అధ్యయనం - ఇవేవి లేకుండా పత్రికల్లోనూ, ముఖపుస్తకాల్లోనూ (ఫేస్‍బుక్) వాట్సాప్‍ల్లోనూ, గ్రూపులుగా ఏర్పడి పుంఖాను పుంఖాలుగా కవిత్వం రాసేస్తున్నారు. వ్యాసాలు, సమీక్షలు అంటూ గీకేస్తున్నారు. ఆహా, ఓహోలతో ఒకరినొకరు పొగిడేసుకుంటున్నారు. సాహిత్య కాలుష్యాన్ని పెంచేస్తున్నారు. రూప పరమైన ప్రయోగాలతో రచనల రాశిని పెంచుతున్నారు. వాసిలేదు. ఫలానా ప్రయోగానికి ఫలాన కవి - రచయిత అద్యుడంటూ భజన బృందాలతో పొగిడించుకుంటున్నారు. కారణం ఈమధ్య కాలంలో అభిరుచి సాహిత్య విమర్శ విస్తరించి నంతగా ప్రామాణిక విమర్శ నిష్పాక్షిక విమర్శ విస్తరించలేదు. యదార్థవాది లోకవిరోధి అవుతున్నాడు. అందువల్ల ఎవరికివారు మన కెందుకు వచ్చిన గొడవ అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా సాహిత్యానికి వున్న విలువ పోయింది. సమిష్టి ప్రయోజనతత్వాన్ని కోల్పోయి వ్యష్టి ప్రయోజన వాంఛ పెరిగిపోయింది.
తెలుగు సాహిత్య విమర్శ దారితప్పడానికి ఇదొక ప్రధాన కారణం. రెండో కారణం సమాజంలోని మనుషులు కులాల వారిగా, మతాలవారిగా, ప్రాంతాలవారిగా, లింగవివక్ష పరంగా దృక్పథాలను ఏర్పరుచుకొని అడ్డుగోడలు కట్టుకోవడం. నేటి సమాజంలో మానవ సంబందాలన్ని ఆర్థిక సంబంధాలతో ముడిపడివున్నాయన్న వాస్తవాన్ని కవులు రచయితలు గుర్తించినప్పుడు దృక్పథాల్లో ఈ వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉండేవి కావు. ఈ విషయాన్ని మధ్యయుగాల్లోనే గుర్తించిన ప్రజాకవి వేమన ఇలా అన్నారు.
‘‘కులము గలుగు వారు గుణముకలుగువారు
విద్య చేత విర్రవీగువారు
పసిడి గల్గు వాని బానిస కొడుకులు’’
ఈ పద్యం ద్వారా మనం గుర్తించ వలసిందేమంటే నేటి సామాజిక వ్యవస్థలోని కార్పోరేట్ లక్షణాలను అన్ని రంగాల్లో విస్తరించినట్లుగానే సాహిత్యంలో కూడా ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి వ్యక్తి అభివృద్ధి కేంద్రంగా ప్రసార సాధనాలు, పుస్తకాలు, సభలు - సమావేశాలు పుడుతూ, ప్రచురణ పొందుతూ, నిర్వహింపబడుతూ సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల విషయం భయాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం కొన్నింటిని పరిశీలిద్దాం.
2020 ఏఫ్రిల్ 4వ తేదిన వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్‍లో ‘‘వనపర్తి ఘటనలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి మన కులస్తుడే అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...రామాలయం వీధిలో వీరి నివాసం... దాడిని మనం కూడా తీవ్రంగా ఖండించాలి’’ అని ఒక ప్రకటన వచ్చింది. అక్కడ జరిగిన సంఘటన మీద వీడియో కూడా అన్ని గ్రూపుల్లో వైరల్ అయింది. దాని ఫలితమే అ ప్రకటన. దీనిపైన నేను ఈ విధంగా కామెంట్ పెట్టాను.
‘‘కుమత భేదాలు భాషావిభేదాలు చెలరేగేనేడు ప్రతి మనిషి ఇంకొకడిని హింసించేవాడే తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడే’’ - శీశ్రీ... ఇవ్వాళ ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే కులం పేరుతో ఇలాంటి రెచ్చగొట్టే పోస్టింగ్‍లు అవసరమా? కొట్టడం తప్పే...కాని కొట్టిన పోలీసు కులం అడిగి కొట్టాడా? ఆపదలు అందరికీ వుంటాయి. అయినా చిన్న పిల్లవాన్ని బండిమీద ఎక్కించుకొని లాక్‍డౌన్ సమయంలో వెళ్లవచ్చా? పౌరహక్కులతో పాటు విధులు కూడా వుంటాయి. సోషల్ మీడియలో కనిపించేదంతా నిజమేనా? ప్రభుత్వం తన పరిధిలో తాను స్పందించిందికదా? నిజంగా కులాభిమానం వుంటే...ప్రభుత్వ చర్య పట్ల సంతృప్తి లేక పోతే నిజనిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు సేకరించండి. కోర్టులో కేసు ఫైల్ చేయండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి పోస్టులను పెట్టకండి. మనుషులను ప్రేమించండి. అని రాసాను. ఇక దీనిపై స్పందన చూడండి.
‘‘లాఠీ చేతిలో ఉందికదా అని సామాన్య వ్యక్తి ఒళ్లును టూఠీ చేయడాన్ని మీరు సమర్ధిస్తారా? సోషల్‍మీడియాలో వైరల్ అయిన వీడియోను మాత్రమే మీరు చూసి వుంటారు. పోలీస్ స్టేషన్‍కు తీసికెళ్లి బాధిత వ్యక్తి ఒళ్లును హునం చేసిన సంఘటనలు మీ కనురెప్పలను చేరలేవు కాబోలు.... పోలీసు అతన్ని టార్గెట్ చేసి కొట్టాడో లేదో తెలియదు కానీ మీరు నన్ను టార్గెట్ చేసుకొని అడ్డదిడ్డంగా అక్షర బాణాలను సంధిస్తున్నట్లు తేటతెల్లమవుతుంద’’ని తన ప్రతిస్పందనను పెట్టాడు. దీన్ని చదివితే మన దృష్టికి బాధ్యతా రాహిత్యమైన రెండు మూడు అంశాలు వస్తాయి.
ఈ స్పందనను రాసిన వ్యక్తి వైరల్ అయిన వీడియోను చూసే; ఆయనకు మనుషులమీద ప్రేమ వున్నట్లు నాకు పోలీసులమీద ప్రేమవున్నట్లు సూత్రీకరించాడు. ఈ నిర్ధారణను సంఘటన స్థలం దగ్గరకు వెళ్లి విచారణ చేసి ప్రకటించివుంటే సంతోషించేవాన్ని. పొద్దుపొద్దున జరిగిన ఈ సంఘటనను సినిమా షూటింగ్ చేసినట్లు వీడియో ఎలా తీసారు? కనీసం అలా తీసిన వ్యక్తి ఎవరో తెలుసుకొని నిజనిజాలను తెలుసుకుందాం? అతసేపు వీడియోతీస్తుంటే పోలీసులు చూడలేదా? ఇలా ప్రశ్నలు వేసుకొని కనీసం ఆలోచించివుంటే ఇలా రెచ్చగొట్టే ప్రకటన చేసేవాడు కాదు. ఇందులో ఇంకో సందేహం కూడా వుంది. లాక్‍డౌన్ నిబంధనలను ఉల్లంగించి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిపై పోలీసులు సడన్‍గా లాఠీతో దాడి చేశారా? లేక ఇరుపక్షాల మధ్య ఏమైన చర్చ జరిగిందా? అన్న అంశం కూడా లేదు. ఉన్నత విద్యావంతుడు, ఉద్యోగి అయివుండి పౌరవిధులను ఎలా ఉల్లంఘిస్తాడు. ఈ ఆలోచనలు ప్రశ్నలు ఏవి చేయకుండానే పోలీసులు అనగా అహంకారులు, దుష్టులు, దుర్మార్గులు - అంటూ సాహితీ వేత్తలు, కవులు, రచయితలు, మేధావులు ఎన్ని ప్రకటనలు చేశారో? ఎన్ని కవితలు రాసారో వాళ్లందరూ సోషల్ మీడియాలో పండుగ చేసుకొని సామాజిక సృహను ప్రకటించుకున్నారు.
ఇదే నెలలోనే మేధావులకు చెందిన గ్రూప్‍లోనే ఒక మేధావి బళ్లారి రాఘవ మీద వ్యాసం రాస్తూ అశ్వద్ధామ అత:కుంజర: అన్నట్లు ఈయన పద్మశాలి అనే మాటలను బ్రాకెట్లో పెట్టాడు. ఈ వ్యాసంపై స్పందిస్తూ ‘‘అదేమటండి నేను రాఘవాచారి గారిని శ్రీవైష్ణవుడనుకున్నా! గతంలో ఒక మిత్రుడు నాతో సంభాషిస్తూ విశ్వకర్మ కులానికి చెందినవాడన్నారు? ఇంతకు ఆయన కులమేదో తెలియచేయండి’’ అని రాసాను. ఆ మేధావి నుండి సమాధానం లేదు. ఇంతకు ఆ గ్రూప్ వున్నది సామాజిక స్పృహ హకోసమా? కులస్పృహ కోసమా అన్నది ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కులస్పృహ ఉండకూడదు అనలేంకానీ, నిజనిజాలు తెలుసుకోకుండా కళాకారులకు మేధావులకు కులరంగు పూయడం ఏమేరకు సమంజసం? అంటే అందులో వ్యక్తి ప్రయోజనం వుంది తప్ప సామాజిక ప్రయోజనంలేదు.
ఇక ఈ మధ్య కాలంలో కరోన మీద వలస కూలీల మీద మనకవులు - రచయితల స్పందన చూస్తుంటే, వీళ్ల కవితా ప్రభాంజనాలు సమాజాన్ని సమూలంగా మార్చేస్తాయి అన్నంత భావన కలుగుతుంది. మచ్చుకు కొన్నింటిని పరిశీలిద్దాం.
ఒక గ్రూపులో రైలు బోగీల మధ్య చంటి పిల్లతో ప్రయాణం చేస్తున్న ఒక ఛాయ చిత్రాన్ని పెట్టి...‘‘ఇదీ మన వలసకులీల పరిస్థితి కవిత రాయండి’’ అని ప్రకటన పెడితే ఒక కవి మిత్రుడు ఇలా రాశాడు. శీర్షిక ‘వలసతల్లి బతుకుయాత్ర’ చూడండి.
‘‘కూలినాలీ దొరకలేని
కాని కాలం వచ్చిపాడై
ఉన్నచోట ఉండలేక
నెలలగుడ్డును చేతబట్టి
బహుదూరపు బాటసారి
ఇల్లుచేర బయలు దేరే....’’ అంటూ కవిత సాగుతుంది. ఇది చదివి నేను ఇలా స్పందించాను. ‘‘రైళ్లో ఉచితంగా వలసకూలీలను పంపుతున్నారు వారి వారి ప్రాంతాలకని విన్నాను...అదినిజం కాదా? బోగి మధ్యన చిన్నపిల్లతో పయనిస్తున్న తల్లి ఫోటోమార్ఫింగ్ అని విన్నాను. అది అబద్దమేనా? ఇవి సందేహాలు మాత్రమే నిజాలు మీకు తెలిస్తే నివృత్తి చేయగలరని మనవి’’...
నా రిక్వెస్టుకు కవి నిజాయితీగానే స్పందిస్తూ ‘‘.... ఇది 2017కు సంబంధించిన వీడియో. ఇది అసలు మన దేశానిదే కాదు. బంగ్లా దేశ్‍దని మిత్రులు సూచించారు. అరసం గ్రూపులో ఈ వీడియోను పెట్టి కవితను రాయమంటే రాశాను’’ అన్నారు. అప్పుడు నేను స్పందిస్తూ అరసం లాంటి సంస్థకు చెందిన గ్రూపులో ఇలాంటి ఫేక్ వీడియో పెట్టి కవిత్వం రాయమని అడగటం ఏంటి ఇంతకన్న ఆత్మహత్యా సదృశ్యం ఉందా? అంటే, తప్పును ఒప్పుకోకుండా ఒక మిత్రుడు స్పందిస్తూ, ‘అరసం గ్రూపులో ఒక మిత్రుడు పోస్టింగ్ పెట్టిండు. అది అరసం పెట్టినట్టుకాదు. సంస్థను నిందించడం సరైంది కాదు’ అంటే మరో మిత్రుడు ‘ఈ వీడియో పెట్టింది కవుల సృజనను తెలుసు కోడానికే. అంత మాత్రానా ఆత్మహత్యా సదృశ్యం అంటారా? అతని వివేచనకే వదలి వేస్తున్నాను. ఇష్టం వుంటే కవిత రాయండి. కానీ గ్రూప్‍ను కలుషితం చేయకండి’ అంటూ తన ఆగ్రహాన్ని ప్రకటించారు. పైగా అదిఫేక్ ఫోటో కాదు రెండు రోజుల కింద పత్రికలో వచ్చిందన్నారు. ‘ఏ పత్రికలో వచ్చిందో చెప్పండి’ అంటే సమాధానం లేదు. ‘అదేంటి అరసం గ్రూప్‍కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. ఏదైనా గ్రూప్‍కు ఒక ఆశయం - లక్ష్యం వుంటాయి కదా. ఫేక్ వీడియోలు పెట్టి కవిత రాయమనడం - అదీ స్థలకాల, దేశాలకు భిన్నంగా రాయమనడం తప్పుకదా’ అంటే ‘ఈ మాత్రానికే నెత్తిన నోరు పెట్టుకొని అరవాలా? ఉబుసుపోక ఎందుకండి ఈ అనవసర సమయాన్ని మరేదానికైనా ఉపయోగంచుకుంటే మంచిదేమో జర ఆలోచించండి’ అంటూ లౌక్యంగా సూచన కూడా చేశాడు. దీన్ని బట్టి మనకు ఏమి తెలుస్తుంది కవులు - రచయితలు ఏదిరాసిన గుణవివేచన చేయకుండా ఆహా! ఒహో! అని విమర్శకుడు రాయాలి. చాలా మంది అలాగే రాస్తున్నారు. ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి. వీటిని కూడా మనం బహిర్గతం చేయకూడదు. చేస్తేనానాయాగి చేస్తారు. ఎందుకంటే మేఘాలను చూసి చెంబులోని నీళ్లను వలక పోసుకొనేంత అమాయకులు కాదు. వర్షాకాలపు మేఘాలకోసం ఎండకాలంలోనే మరొక చెంబును పట్టుకొని ఎదురుచూసే లౌక్యులు. కాబట్టి పత్రికలను బట్టి భావ ప్రకటనలకు గ్రూపులకు (సామాజికమాధ్యమాలు) గుణాలుంటాయి.
చివరిగా ప్రచురణ మాధ్యమాలకు సంబంధించిన ఒకటి రెండు విషయాలను చెప్పి ఈ వ్యాసాన్ని పూర్తిచేస్తాను.
ఆ మధ్య ఒక పత్రికలో ‘‘మనువాదం ధాటికి రాజ్యంగం విలవిల అనే శీర్శికను ఒక వ్యాసం వచ్చింది. అందులో కొన్ని విరుద్ధమైన అసంబద్దమైన ప్రతిపాదనలు వున్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావీస్తాను. 1) రాజ్యాంగమంటే లిఖితమైంది కావచ్చు. అలిఖితమైందికావచ్చు. 2) మనుధర్మ రాజ్యాంగంలోని 2వ అధ్యాయం (స్మృతి) 16వ శ్లోకం (ఆర్టికల్) ననుసరించి శూద్రలెవరూ చదువరాదు - ఇలా కొన్ని ప్రతిపాదనలు చేశాడు. దీనిపై నేను అదే పత్రికలో ‘అధ్యయనలోపం అవగాహనరాహిత్యం’ అనే శీర్షికన ఆయన ప్రతిపాదనలను పూర్వపక్షం చేస్తూవ్యాసం రాసాను. రాజ్యాంగం నిర్వచనం అలిఖితం అనికాదు. ఆ మాటలను సాహిత్యంలో లిఖిత సాహిత్యం అలిఖిత లేదా మౌఖిక సాహిత్యం అని వాడుతారని రాసాను. అలాగే మనుధర్మ శాస్త్రం అనేది రాజ్యాంగం కాదు. అది మతపరమైంది. రాజ్యాంగం కుల మత ప్రాంతీయాతితమైంది అని రాశాను. నా వ్యాసంలో ఆయన అభిప్రాయాలను విషయపరంగా నేను పూర్వ పక్షంచేస్తే ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏమో విషయాన్ని పక్కకు పెట్టి వైయక్తికవైన విశ్లేషణకు దిగాడు. ‘‘మనువాదంపై మోజు - అభ్యుదయంపై ఫోజు’’ అది శీర్షిక. దీన్ని బట్టే వ్యాస రచయిత వైక్తికమైన విమర్శకు పాలుపడుతున్నాడన్న విషయం స్పష్టమవుతుంది. వ్యాస రచయిత అధ్యయనలోపం - అవగాహన రాహిత్యం వల్ల మోకాలికి బోడిగుండుకు ముడివేసినట్లు భారత రాజ్యాంగానికి, మనుధర్మ శాస్త్రానికి ముడివేయడానికి ప్రయత్నించారన్నది నా వాదన. తరువాత వ్యాసంలో నావాదన తప్పు అని నిరూపించాలి. లేదా అంగీకరించాలి. ఈ రెండు చేయకుండా నేను నా వ్యాసంలో రాయని అంశాలను ఉటంకిస్తూ ‘వామపక్షపార్టీల్లో తిరుగుతున్న నన్ను, కులాంతర వివాహాలు చేసుకున్న నా పిల్లల్ని, నా మిత్రుల పిల్లల్ని చంపలేక పోయామని ఎత్తిచూపడం ఆక్షేపనీయం - వీరాచారి గారు మీరు రాసిన వ్యాసంలోని మొదటి భాగంలో మనువాదాన్ని విమర్శించినట్లు బాగా నటించారు. కానీ మీ వ్యాసంనిండా మనువాద రక్షకుడిగానే బహిర్గతమైనారు కాదంటే, మీరు ఇంకా చర్చ కావాలంటే దళత పేద సంఘాలు మీతో చర్చించుటకు ముందుకు వస్తాయి’’ అని విమర్శను తప్పుదోవ పట్టించడానికి నన్ను అంటే అన్నావు మా అన్నను అని చూడు అంటూ నాలో రాగద్వేషాలున్నట్లు స్టేట్‍మెంట్లు ఇస్తూ వ్యాసాన్ని ముగించారు. ఇది ఏ రకమైన సాహత్య విమర్శకు దారితీస్తుందో ఆలోచించండి