మా రచయితలు

రచయిత పేరు:    ఆచార్య పి రాజేశ్వరమ్మ

సాహిత్య వ్యాసలు

తొలి తెలుగు పద్యకావ్యం ‘‘మానవతావాది మహాత్మాపూలే’’

కడప జిల్లాకు చెందిన తెలుగు పండితులు ఒంటెద్దు రామలింగారెడ్డిగారు రాసిన పద్యకావ్యం మానవతావాది మహాత్మా పూలె’. ఇది పూలే గురించి భారతీయ భాషలలో వచ్చిన తొలి తెలుగు పద్య కావ్యమని చెప్పవచ్చు. ఇది మూడు ఆశ్వాసాలు 1133 పద్యాలతో కూడుకొని ఉంది. వీరరస ప్రధానమైన కావ్యంగా చెప్పుకోవచ్చు.

            ప్రస్తావనలో తాను కావ్యం రాయడానికిగల కారణాన్ని

            తే।।   పద్యకావ్యంబు నొక్కటి వ్రాయదలచి

                     విషయమందున నవ్యత వెలయనెంచి

                     హితము సందేశమును గూర్చు విధము నొప్పి

                     జన ప్రబోధంబుగా నది సాగదలతు’’        నని తెలియజేశాడు.

            తే।।   ఆంగ్లమున తెలుగు భాషలయందు పూలె

                        చరితలుండెను పెక్కులా సారమెఱిగి

                        వ్రాసితిని దేనికిని యనువాద మవదు

                        దొర్లియుండగ వచ్చును దోషములను

            అని తన ఈ కావ్యం దేనికి అనువాదం కాదని, పూలె గురించిన అనేక రచనలు చదివి సారాన్ని తెలుసుకొని రాశానని స్వయంగా చెప్పుకున్నారు.      

            బ్రాహ్మణుల ఆగడాలు తూర్పారబట్టి

            వారి నెదిరించి పోరిన వీరనరుడు

            జ్యోతిరావు పూలే కంటే ప్రఖ్యాతిగన్న

            కావ్య నామకులెవ్వరు గలిగిలేరు’’   అని రామలింగారెడ్డిగారు పూలే గొప్పదనాన్ని త్యాగజీవితాన్ని గుర్తించి, రచన రాయడానికి ప్రేరణగా భావించాడు. అందుకే తేట తెలుగు పదాలతో సులభంగా అర్థమయ్యేలాగా కావ్యాన్ని తీర్చాడు.

 

పూలే పూర్వీకులు:

            ‘మాలికులానికి చెందిన వారు గోరెఅనే ఇంటి పేరుతో ప్రసిద్ధిపొందారు. వీరి ముత్తాత గ్రామ కరణమైన కులకర్ణితో గొడవపడి తన ఉద్యోగాన్ని వదిలేసి, ఆ గ్రామాన్ని వదిలి పూనా జిల్లాలోని ఖానువాడికి వచ్చి చేరాడు. అతనికి షేతిబా అను కొడుకు జన్మించాడు. ఇతనికి రాణోజి, కృష్ణ, గోవిందులను ముగ్గురు కుమారులు జన్మించారు. వీరు మేకలను కాస్తూ           జీవనం గడిపేవారు. మరికొంత కాలానికి ఒక పూల వ్యాపారి దగ్గర పూల వ్యాపార మెళుకువలను నేర్చుకొని మహారాష్ట్ర పాలకులైన పీష్వాలకు పుష్పాలతో రకరకాల చిత్రణలు                            చేసి పంపేవారు. వీరి పూల అలంకరణ చాతుర్యానికి మెచ్చి, పీష్వా 35 ఎకరాల భూమిని దానం చేశారు. దీంతో వీరి ఇంటిపేరు పూలెగా  స్థిరపడిపోయింది.

            జ్యోతిరావు పూలే గోవిందు, చిమ్నాబాయి దంపతులకు 1828 ఫిబ్రవరి 20న జన్మించారని చరిత్రకారులు తెలిపారు. పూలే గురించి బాగా తెలిసిన ధనుంజయకీర్‍గారు 1827 సం।।లో జన్మించారని తెలిపారు. ఈ విషయాన్ని

            తే।।   పదియునెన్మిది శతయిరువదియునేడు

                        వత్సరంబుగ నాంగ్ల విద్వాంసుడైన    

                        శ్రీధనుంజయకీర్గారు జెప్పినారు,

                        సత్యమేది యొ పూర్తి విష్పష్టమవదు  ... అని రెండు తేదీలలో ఏది ఒప్పో కచ్ఛితంగా తెలియదని తెలిపారు.

పీష్వాల కాలంలో మరాఠా స్థితి:

            ‘‘ఛత్రపతి పాలనము దాక సత్యముగను

             సాగె పరిపాలనము విప్రజనము కేమి

             గౌరవంబులు ప్రత్యేక గతులు లేవు

             ఛత్రపతి తోడ నంతయు సమసిపోయె’’

శివాజీ తర్వాత పాలించిన పీష్వాల కాలంలో సాంఘీక పరిస్థితులు చాలా దారుణంగా                           ఉండేవని, 2వ బాజీరావు ఆంగ్లేయుల ఆధిపత్యానికి లొంగి ఉన్నాడని, ఇతని బలహీనతల దృష్ట్యా త్రాగుబోతులు, నీచులు, అధర్మపరులు, చాడికోరులు, అతని చుట్టూ ఉంటారని, వృత్తి విద్యలన్నీ వెలిసిపోయాయని తెలిపాడు. 2వ బాజీరావును బ్రాహ్మణులు భగవదవతారమని భజన చేసి, తమ కిష్టమైన వాటిని పొందేవారు. వారే రాజులుగా ఆధిపత్యాన్ని చెలాయించేవారు. మహిళలకు రక్షణ లేదు. నీతిమంతులు, యోగ్యులు నిలువలేక పూనా పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు.

విద్యా విధానం:

            జ్యోతిభా పుట్టే కాలానికి, బ్రాహ్మణేతరులకు విద్యను నేర్చుకొనే అవకాశం లేదు. అగ్రవర్ణాల వారికి గురుకులాల వంటివి కొన్ని అక్కడక్కడ మాత్రమే ఉండేవి. 1813లో ఆంగ్ల ప్రభుత్వం చార్టర్‍ చట్టంను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు సైతం విద్యను అభ్యసించడానికి వీధిబడులను ఏర్పాటు చేసింది. ఈ వీధి బడిలోనే తండ్రి గోవిందరావు కుమారుడ్ని 7వ ఏట బడిలో చేర్పించాడు. 13 సం।। వయస్సలో ఆ కాలంనాటి ఆచారం ప్రకారం 8 సం।।ల సావిత్రీబాయితో వివాహం జరిపించి చదువును మాన్పించారు. పొలం పనులు పగలంతా చేసినా రాత్రుల్లో బుడ్డి దీపం ముందు చదువుకోవడం మానలేదు.

            తే।।   జ్యోతిరావింటి ప్రక్కన సుజనులైన 

                        పండితోత్తములిద్దరు బరగియుండి

                        విద్యవిలువల దెలిపి గోవిందరావు

                        కొడుకు జదివెడి విధమొడగూర్చినారు

పూలే చదువు శ్రద్ధను గమనించిన ఉర్దూ, పర్షియన్‍ భాషా పండితుడు జఫ్వర్‍ బేగ్‍ మున్షి, లెజిట్‍ అనే మతాధికారులు చదివించమని, తండ్రికి సలహా ఇచ్చారు.

విప్లవ భావాలు:

            14 ఏండ్ల వయస్సలో తిరిగి పాఠశాలలో చేరి మరింత పట్టుదల దీక్ష సంకల్ప బలము తోడ చదువుకోవాలని శ్రద్ధ గలిగి చదివాడు. చదువుతున్న కొద్ది అతనికి చుట్టూ ఉన్న సమాజంలో మతమనుపేరుతో హిందూమతంలో జరుగుతున్న మోసం, అతని హృదయాన్ని కలిచి వేసింది. మతమే అగ్రకులాలకు మదం, అధికార గర్వమని తలంచాడు.

            సీ।। జ్యోతిరావ్‍ గోవాండె సునిశిత జ్ఞానులు కార్యదీక్షాక్తి గల్గువారు, పఠనంబుతో బుద్ది పదునెక్కగ శివాజి జార్జి వాషింగ్‍టను చరిత జదివి తామా మహావీర తరహాలో తమ మాతృభూమి సేవలో తృప్తి బొందవలయు నంధవిశ్వాసాల నడగించి ప్రజలకు నండదండగుచు దాముండ వలయు

            తే।।   జీవితాంతంబును సమాజ సేవే జేయ  

                        బద్ద కంకణులై దేహబలము కొఱకు

                        విజిత రోగార్తి వ్యాయామ విద్య నేర్వ

                        సాహసించిరి యెంతటి సంఘ ప్రేమ

తాను చదువు ద్వారా తెలుసుకున్న జ్ఞానం, చదివిన జీవిత చరిత్రలు కారణంగా స్ఫర్తి పొంది జీవితాంతం సమాజసేవ చేయడానికి, తగిన విధంగా శరీర దారుఢ్యము కూడా అవసరమని భావించి, వ్యాయామ విద్యను కూడా నేర్చుకున్నాడు. పూనాసంస్కృత  కళాశాల యందు గోవాండె, అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడ జ్యోతిబాకు మోకోవిఠల్‍ వాల్వేకర్‍, సుఖరాం, యశ్వంతరావు పరంజసేలు, పాశ్చాత్య విద్యా ప్రభావం వలన వీరి హృదయాలు కలిసి స్నేహితులయ్యారు. వీరు అనేక మత సమీక్షలను జరిపి అందులోని మూఢాచారాలను నిగ్గు తేల్చుతూ వచ్చారు. చివరకు వీరు

            తే   ప్రతి మతంబున నున్నట్టి హితము, ధర్మ

                        సూత్రముల మాత్రమనుసరించుచును మంచి

                        మనసు  గల్గిన చాలదే మంచి మతము

                        మానవతకేది మించిన మతము లేదు’’... అని నిర్దారించుకున్నారు. దీంతో పాటు జాన్‍ స్టవర్ట్మిల్‍ రాసిన ఆన్‍ లిబర్టీఅను గ్రంథాన్ని చదివిన తర్వాత అన్ని పనులలోను స్వాతంత్య్రము, స్వేచ్ఛ, ఉండాలని గుర్తించాడు.

వర్ణవ్యవస్థపై తిరుగుబాటు భావుటా:

            జ్యోతిరావు ఒక బ్రాహ్మణ మిత్రుని ఆహ్వానం మేరకు అతని వివాహ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆ సమయంలో అక్కడున్న ఒక బ్రాహ్మణుడు పట్టరాని ఆవేశంతో

            తే।।   చదువుకొంటినియని నీకు స్వాతిశయము?

                        శూద్రుడెంతగ జదివిన సోమయాజి

                        కాడు మా తోడ నడవంగ గాదు నీకు

                        వెళ్లుమిట నుండి నీకు వివేకమున్న’’......అని పరుషంగా మాట్లాడి అవమానించాడు. ఘటనతో పూలేకి బ్రాహ్మణుల అంటరానితనం, అమానుషత్వం అర్థమైంది. అవమానం తనకు వెయ్యి లాలతో గుచ్చినట్టుగా రాత్రంతా బాధపడ్డాడు. తండ్రి అతన్ని ఓదార్చుతూ

            ‘‘బలవంతులతో వైరము

            బలహీనులకగును చేటు బ్రాహ్మణజనముల్

            బలవంతులు సంఘంబున,

            బలిసిరి పాలకులు వారి పక్షమునుండన్

            ఈ సంఘమందు బ్రాహ్మణజనము ప్రబల శక్తివంతులై ఉన్నారు. బలవంతులతో వైరం మనకు నష్టం కలుగుతుంది. శూద్రులకు ఇసుమంత కూడ భద్రతలేదు. సహనమొక్కటే మనకు వజ్రాయుధముఅని మనలాంటి పేదలకు కోపం పెదవికి వేదనయని తెలిపాడు. ఆ రాత్రంతా నిద్రరాక పగిలిన గుండెతో ఆలోచించాడు. చివరకు స్వార్ధపూరితమైన సమాజంపైన తిరుగుబాటు చేయక తప్పదని నిర్ణయించుకున్నాడు. దీనికి ముందు సంఘంలోని అంధవిశ్వాసాలను, మూఢాచారాలను, మొదట తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కులమతాల పేరిట సాగుతున్న అగ్రవర్ణ ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించాడు.

            ‘‘పరుగు దీసిన నందరు తరుమువారె

            తరుమవెన్నంటి నందురు పఱచువారె

            సాహసికునకు చావొకసారె వచ్చు

            పిరికిపందకు ప్రతిరోజు మరణమగును             ... అని మనసున ఆలోచించారు. దీనిని సాధించడం కోసం కృషి చేయనారంభించారు. సంఘసంస్కరణాభిలాష గలిగినవారు ఇతనిని మిక్కిలి గౌరవించి జ్యోతిబాఅని పిలుచుకున్నారు.

            21 సం।। వయస్సులో జ్యోతిరావు సంఘసంస్కరణకు పూనుకున్నారు. సమాజంలో పెనుమార్పులు చోటుచేసుకోవాలంటే దీనికి విద్య సాధనమని, భావించాడు. ముందుగా స్త్రీలను విద్యావంతులుగా చేస్తే గృహము, పిల్లలు, ప్రయోజనవంతమగుటయేగాక, దేశమే సౌభాగ్యమవుతుందని, వారి కొరకు ఒక పాఠశాలను పూనాలోని బుధవార్‍ పేటలో ఏర్పాటు చేశాడు. ఇందులో పంచములతోపాటు ఆసక్తి ఉన్న మిగిలిన వారెవ్వరైనా విద్యనభ్యసించవచ్చని చెప్పడం జరిగింది. దీనికి తన మిత్రులు సహకారం కూడ అందించారు. శూద్రులకు మరొక శూద్రుడు పాఠశాలను నడపడం బ్రాహ్మణులకు మింగుడ పడక, దీనిని వారు దేశవిద్రోహచర్యగా తలంచారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న బ్రాహ్మణ ఉపాధ్యాయుడిని బెదిరించడంతో ఆయన పాఠాలు చెప్పడం మానివేశాడు. ఇక లాభం లేదనుకొని తన భార్య సావిత్రీబాయికి చదువుచెప్పి, ఆమె చేత పాఠాలు చెప్పించిన మహానుభావుడు పూలే.

సత్యాగ్రహ మార్గం:

            భారత్‍లో సత్యాగ్రహమార్గానికి మొదటి గురువు జ్యోతిభాయే. అతడు తన లెటరు ప్యాడ్‍ పైన ‘‘సత్యమేవ జయతే’’ అని నినాదాన్ని వ్రాసుకునేవారు. దీంతో పాటు సత్యాగ్రహంలోని శక్తిని, సత్యాన్ని ఎరిగి, నిరాడంబర జీవితాన్ని ఆచరించి, తర్వాత తరంవారికి ముఖ్యంగా గాంధీజీకి, అంబేద్కర్‍కు మార్గదర్శకుడయ్యాడు. ఎంతో మంది శూద్రులు, నిమ్నకులాల వారిని విద్యావంతులుగా తీర్చిన ఘనత వీరిదే.

            ‘‘పంచ కర్మేంద్రియములతో పనులుగాని,

            పంచ జ్ఞానేంద్రియములతో మనసుగాని,

            న్యాయపథమును వీడి అన్యాయమునకు

            తేరి చూడని నిశ్చల ధీమతుండు’’         జ్యోతిభా.

 

మతం:

            మతం మత్తుమందు కారాదు. మతం మత్తున పడిపోయి మానవతను మరచిపోయి మానవులు ప్రవర్తిస్తున్నారు. మానవీయత లేని మతం వద్దని, పరమత సహనం ప్రతిఒక్కరికి  ఉండాలని ప్రబోధించాడు.

            ‘రాళ్లు రప్పల పూజింప రాదుముక్తి

            చెట్టు చేమలు మనిషి రక్షింపలేవు

            నిర్మలంబగు మనసుతో నిష్ఠతోడ

            ధ్యానమే జాలుగా భగవాను కృపకు’’ అని తెలిపాడు.

మూఢాచారాలు నిరసన:

            భారత్‍లో రాజారామ్‍ మోహన్‍రాయ్‍ 1929లో సతీసహగమన నిషేద చట్టాన్ని తీసుకువచ్చారు. దీనినే పూలే సైతం బలపరిచాడు. అనాథ వితంతువులకు ఒక శరణాలయాన్ని ఏర్పరిచాడు. ఇదే భారత్‍లో తొలి వితంతు శరణాలయం. తండ్రి అంత్యక్రియలకు బ్రాహ్మణులను పిలవక, తానే మంత్రాలను పఠించి, తండ్రి పేర బీదసాదలకు అన్నదానం చేశాడు.

వాస్తవికతావాది:

            విక్టోరియా మహారాణి భారత్‍ను సందర్శించినపుడు విద్యా ఉద్యోగవకాశాలను అన్ని కులాల వారికి సమంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. భారత్‍లో అసమానతలు పెరగడానికి కారణం బ్రాహ్మణులు సృష్టించిన వర్ణ వ్యవస్థ, వారు చూపిన వివక్షనే కారణమని గుర్తించాడు. వీరి మనస్తత్వాన్ని, చర్యలను, ప్రవర్తనను గులాంగిరిఅను రచనలో సవివరంగా పూలే తెలియజేశారు.

            1857 సిపాయిల తిరుగుబాటు భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, విఫలమవడానికి గల కారణాలను నిక్కచ్ఛిగా గుర్తించిన హేతువాది పూలే. ఆ కారణాలను మచ్చుకకు ఇలా చెప్పుకోవచ్చు. హిందువులలో ఐకమత్యం కొరవడటం, ఈ తిరుగుబాటులో స్వార్థపరులైన సంస్థాన రాజులు మాత్రమే పాల్గొనడం, మరికొంతమంది ప్రజలు ఆనాటి సంస్థానాధీశుల నిరంకుశ పాలనకంటే బ్రిటీష్‍ పాలకుల పాలనే మెరుగని భావించడం, ఈ ఉద్యమంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా పాల్గొనకపోవడం, ఈ తిరుగుబాటు కేవలం ఉత్తర భారతానికే పరిమితమవ్వడం, దక్షిణాదివారు పాల్గొనకపోవడం, మొ।। న వాస్తవిక కారణాల్ని అంచనా వేసిన మేధావి పూలే.

హత్యాయత్నం:

            కొంతమంది బ్రాహ్మణులు కూడబలుక్కొని పూలేని అంతమొందించడానికి క్రూరులు, దుర్మార్గులైన ఇద్దరు హంతకులు థొండేరాం, రామోశీలకు చెరి ఒక వెయ్యి రూపాయలు ధనమాశ చూపించి చంపమని సుపారీ ఇచ్చారు. వారు రహస్యంగా రాత్రి ఇంట్లోకి వచ్చి దాగుకొని                  ఉన్నారు. అర్థరాత్రి సమయాన భార్య నీళ్ళకు లేచి చూస్తే దొంగలు కన్పించారు. జ్యోతిభా మేల్కొని వారిని పట్టుకొని నిలదీస్తే అసలు విషయం చెప్పారు.  

            ‘‘వారి చర్యకు జ్యోతి విహ్వలత జెందె ‘‘---పేదరిక బాధ’’ అని వారు ఈ పనికి పూనుకోవడానికి కారణం వారి అజ్ఞానం, ఆకలి, పేదరికమని, భావించాడు. నేను మీలాంటి వారి అభివృద్ధి కోసం, నా జీవితాన్ని పణంగా పెట్టి సేవచేస్తున్నాను. నా మరణం వల్ల మీరు,  మీ  కుటుంబాలు, మీ జీవితాలు బాగుపడతాయంటే తనను చంపమని గర్జించాడు. వారు తమ తప్పును తెలుసుకొని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకడు థొండే రామ్‍  జ్యోతిబాకి అంగరక్షకునిగా వ్యవహరించారు.

సాహసి మానవతావాది:

            తాను నమ్మిన సిద్ధాంతములను పలువురికి తెలియజెప్పడానికి సత్యశోధక సమాజమును స్థాపించి 60 మంది సభ్యులతో నడిపించారు. అనాథలైన పిల్లలకోసం బాలాశ్రమమును, స్థాపించి  దాదాపు 2000 మంది పిల్లలను సంరక్షించారు. బొంబాయిలోని నూలు మిల్లు కార్మికుల కష్టాలతో పోరాడి వేతనం పెంచే విధంగా సమస్యను పరిష్కరించాడు. మద్యం దుకాణాలపై నిరసన తెలిపాడు దీనివలన

            ‘‘ఆయురారోగ్య సంపద లడగిపోవు

            పరువు మర్యాద మన్నన పలుచనగును

            బడుగు మధ్య కుటుంబాల బ్రతుకులెన్నో

            ఛిద్రమగుచున్న ప్రభుతకే చింతలేదు’’   ..... కనుక ఎవరికి వారుగా ఈ సత్యాన్ని తెలుసుకొని ఆరోగ్యవంతంగా ఉండి బ్రతుకును కాపాడుకోవాలని, ప్రజలను, బాగుచేయడం కోసం ప్రభుత్వాలు ఆలోచించవనే సత్యాన్ని పూలే ఆనాడే తెలిపాడు.

            శూద్రులు సమాజంలో వెనుకబడడానికి గల కారణాల్ని

            ‘‘విద్య లేక వివేకంబు వెలితి, బుద్ది

            లేక నీతియు గొఱ నీతి లేక ప్రగతి

            తగ్గె నదిలేక సంపద తగ్గె ధనము    

            శూన్యమయి నాశమొందిరి శూద్రులంత’’

ఈ పద్యంలో చక్కగా వివరించారు. దీనిని అధిగమించడానికి శూద్రులందరికి పలకలను, పుస్తకాలను పంచిపెట్టి విద్యను బోధించి బడుగు విద్యార్థులకు బాసటగా నిలిచాడు. దీనికొరకు తన స్వంత ఆస్తినే అమ్మిన సాత్త్వికుడు సాహసి జ్యోతిబా.

            పూలేకు 30 సం।। వయస్సులో షష్టిపూర్తి’ 1888 మే 11న జరపాలని అతని అభిమానులు బొంబాయి పట్టణములో సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు బరోడారాజు, సాయాజీరావు, రావడమేగాక ప్రజల కోరిక మేరకు మహాత్మాఅను బిరుదును ప్రదానం చేశారు. ప్రజల చేత, ‘‘మహాత్మా’’ అను పేరుతో పిలిపించుకున్న మహానుభావాడు జ్యోతిభానే. ఆనాటి మహారాష్ట్ర రాష్ట్రంలోని అణగారిన కులాలైన మహర్‍లకు, మాంగులకు, కూడ మానవతతో విద్య నేర్పించి విజ్ఞులుగా మార్చిన ఘనత జ్యోతిబాదే. భారత్‍లో వందలేండ్లుగా అణగారిన బడుగువర్గాల బతుకులపై దృష్టిపెట్టిన మొదటి నాయకుడు జ్యోతిబానే. తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న సహృదయులందరికీ, బాధ్యతాయుతంగా జీవించాలనుకునే ప్రతిఒక్కరికి పూలేజీవితం ఆదర్శప్రాయం. విలువలు కనుమరుగవుతున్న వర్తమాన సమాజానికి పూలే జీవితం, ఆలోచనా విధానం, పాటించిన నియమాలు సత్యసంధత నేటికి ఎంతో ప్రాసంగికతను కలిగి ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఇతని జీవితం అందరికి అనుసరణీయమని, నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇటువంటి మహానుభావుని జీవిత ఘట్టాలను ఒక పద్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఒంటేరు రామలింగారెడ్డిది. ఇది రామలింగారెడ్డిగారికి పూలే పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చక్కని తేటనైన తెలుగు పద్యాలలో పూలే జీవిత చరిత్రను పద్యాలలో కూర్చి సులువుగా అర్థమగునట్లు కూర్చడం రెడ్డిగారి పద్య వైదుష్యానికి నిదర్శనం ఈ కావ్యం.

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు