మా రచయితలు

రచయిత పేరు:    నల్లెల్ల రాజయ్య

కథలు

లాఠిన్యం  (గల్పిక)

ఎల్లవ్వ  పొయ్యి రాజేసి బియ్యం కడిగి పొయి మీదబెట్టింది. మంటను ఎగదోసి దిక్కుల్జూసింది. పెనిమిటి కనబడక పోయేసరికి కలవర పడ్డది. కరోనా లాక్డౌనాయే.  బైట తిరుగుతే  పోలీసోల్లు కొట్టుడాయే. ఇంటి ముందు లేడు ఇంటెనుకాలేడు.

లేకపోతే లేకపాయే యాడబోయిండోనని విచార పడ్డది. బువ్వైతే ఉడుకుతాంది. పోసుకతాగ లేకపాయే ఎట్లా ?చేతిల చిల్లిగవ్వ లేదు. పెనిమిటి అయిలయ్య దగ్గర ఏమన్నుంటే అడుగుదామనుకున్నదీ. అయిలయ్య జాడ లేదు. ఇంట్లనే అటిటు చూసింది. గోడకు పెనిమిటి అంగి తగిలించి ఉన్నది. ఎల్లవ్వ ఆ అంగి కీసల చెయిబెడితే యాభై రూపాల నోటు దొరికింది. కరోనా రోగంతో పనీ పాటల్లేక పైసలకు అరిగోసైతాంది కూలి నాలోళ్ళకు. అందులో ఎల్లవ్వ కుటుంబం కూడా ఒకటి.

ఆ యాభై రూపాల్దీసుకొని దుకాన్ల కూరగాయలన్నా తెద్దామని ఎల్లవ్వ మేన్ రోడ్డుకచ్చింది. రోడ్డు మీద జరుగుతున్న బీభత్సం జూసిన  ఎల్లవ్వ బిక్క సర్సుకపోయింది.  అంతల్నే తేరుకొని జూసేసరికి మూతికి గుడ్డలు, నెత్తిన మూటలు,సంకన పిల్లలు,జబ్బలకు బ్యాగులేసుకొని చానమంది జనం ఉరుకుడే ఉరుకుతాండ్లు.

సర్కారేమన్నా ఉరుకుడు పోటీల్గిన  బెట్టిండ్లా అని ఎల్లవ్వ అనుకునే అంతల్నే "క్యాబే సాలే కైకు పైదల్స్ జాతే " అంటూ పోలుసోళ్ళు బూతులు తిడుతూ లాఠీలతో గొడ్లను కొట్టినట్టు కొట్టుకుంటూ తరుముతున్నరు. లాఠీలూ వాళ్ళ వీపుల మీదా,కాళ్ళమీదా ఇమానం మోత మోగుతున్నవి.పడేటోళ్ళు పడుతున్నరు, ఉరికేటోళ్ళు ఉరుకుతున్నరు.బ్యాగులు,మూటలు, సైకిళ్ళు ఇడిసి పెట్టి ఉరుకుతున్నరు. వాళ్ళ అరుపులు, పోలీసు కేకలతో ఆ రోడ్డుమీదంతా  బీభత్స వాతావరణం నెలకొన్నది.

గిదేమీ తెల్వని ఎల్లవ్వ పోలీసోళ్ళ కొట్టుడు జూసి ఉండలేక పోయింది. ఏందర్రా గట్ల కొడుతున్నరు? మీ చేతులకు జెట్టలుబుట్టా, మీకేమన్న నాశనగాలమొచ్చిందా?మీరసలు మనుషులేనా? అని ఆవేశంగా  అరుస్తనే ఉన్నది. లాఠీలిరిగుతున్నా  దొరికినోళ్ళను దొరికినట్టు గుద్దుకుంట, తన్నుకుంట గొర్రగొర్ర గుంజుక పోయే  పోలీసులు ఎల్లవ్వ మాటలసలే పట్టించుకోకుండా వాళ్ళ పనీ వాళ్ళూ కానిస్తునే  ఉన్నరు. అట్లగుడ ఎల్లవ్వ రేషంతో పోలీసులను తిట్టుకుంటా  వాళ్ళెంబడి పడీ పోతునే ఉన్నది.

అంతల్నే ఎల్లవ్వ అరుపులిన్న ఎల్లవ్వ చిన్న మనవడు రమేశ్ గాడు దబ్బదబ్బ ఉరికచ్చి "ఓ ఎల్లవ్వ గట్లెందుకరుత్తానవేఅక్కడాగు’’ అని   ఉరికచ్చిఎల్లవ్వ రెక్కబట్టి ఆపిండు. అయినా ఎల్లవ్వ అటిటు గుంజుకుంటున్నది. “నన్నిడిసిపెట్టరా రమేశా’ అని మొత్తుకుంటున్నది.

రమేశు పట్టుకున్న రెక్క ఇడిసి పెట్టలే అయినా ఎల్లవ్వ నోరూరుకోవటం లేదు.

“ఏందిర రమేశూ, వాళ్ళ చేతులిర్గిపోను, వాళ్ళ లాఠీలకు  అగ్గిబెట్ట. ఆ ఉరికే బిడ్డలేం పాపం  జేసిండ్లని గట్ల మీద బడి కొడుతున్నరని ఎగపోసుకుం’టా అడిగింది.

వాళ్ళు కొడుతున్న దెబ్బలన్నీ తనకూ, తనవాళ్ళకే తాకుతున్నంత ఆవేదన చెందుతాంది. అదేనేమో మనిషి తనమంటే.

అప్పుడు రమేశు" అది కాదే నాయినమ్మా ! వాళ్ళంతా బీహారో, మహరాష్ట్రకో పోతున్నరు. వలసకూలోల్లట. వాళ్ళందరిని నిన్ననో మొన్ననో దారెంట నడుచుకుంట పోతుంటే పోలీసోళ్ళు దొరకబట్టి మీరెవలు పోవద్దు, మీరు బోతే ఇక్కడ పనులెవ్వల్జెయ్యాలె ?  అసలు లాక్డౌన్ల  ఇల్లు కదలొద్దని  రూల్ పెట్టిండ్లు కదా అని బైటికచ్చిన వీళ్ళందరిని ఓ ఫంక్షనాల్ జూసి అక్కడుంచిండ్లు. కనీ మేమిక్కడ ఉండం, మా సొంతూరుకు ఎట్లనో పోతం అనీ కాళ్ళ వేళ్ళ మీదబడ్డా కనికరించలే. మా ఇంటికాడున్న అయ్యవ్వ,పిల్లజెల్లను జూసుకోని కలోగంజి  తాగి బతుకుతమని  వలసకూలోళ్ళు ఒక్కతీరుగ బతిమిలాడిండ్లు. అయినా పోలీసోల్ల గుండెలు  కరుగలే.  వలస కూలీలు పోతమంటరు, పోలీసోళ్ళు పోవద్దంటరు.  అయినా కూడా పట్టు వదలకుండా కష్టాలు కడగండ్ల పాలవుతున్న వలస కూలీలేకమై    ఎట్లయితె గట్లాయని  గేట్లు దునికి రోడెక్కిండ్లు.  ఆపడానికి పోలీసోళ్ళ వశంగాలే. చూసే కండ్లు నడిచే కాళ్ళను నమ్ముకొనీ చీమల దండోలే దారి బట్టిండ్లు. "అరె మేంపోవద్దంటే ఎట్లెట్ల బోతర్రా  బాడ్ కావూల్లార అని  పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొడుతున్న’’రని  దీనంగా చెప్పబట్టిండు.

 

“నిజమే బిడ్డా!నువ్వన్నది నిజమే.  కనీ ఎక్కన్నో కానరాని దేశం నుండీ  మన ఇలాకలకు అయ్యవ్వను, పిల్లజెల్లను వదిలిపెట్టి, పొట్టచేతబట్టుకొనీ బతుకడానికొచ్చిన బిడ్డలకు పోయేటందుకు, ఆకలైతే తినేటందుకు, దూపైతే తాగేటందుకు సౌలతులు కలుగజెయ్యాలెగని , గింతగనం కొట్టుడైతే వాళ్ళకు నాయం గాదు  బిడ్డా !” అని దు:ఖపడుతూ అన్నది. మళ్ళీ  “అసలు  సర్కారోనికి కండ్లులేవా ? వాళ్ళు కాలినడకన ఎర్రటెండల నడిసిపోతాంటే  కనబడతలేదా బిడ్డా !” అని అనుకుంటనే “సర్కారోని కండ్లల్ల కాకులుబొడవ!  వానింట్ల పీనుగెల్లా, వాని పేగుల్దీసి పెంటమీదేయ్య, వాళ్ళసలు మనుషులేనా ?  అంటూ ఆవేదనతో కూడిన ఆక్రోశాన్ని వెలిబుచ్చింది.

అప్పుడు రమేశు కల్పించుకొని “కాదే ఎల్లవ్వ  ఈ రోడ్డు మీద గింత మంది జూత్తాండ్లు. ఎవ్వలేమన్నా అంటాండ్లా ! నీకెందుకే తండ్లాట అని అన్నడు. అట్ల రమేశ్ అనంగనే  అరే రమేశా నాది కూలి పేగు బిడ్డా ! కూలి పేగు ఎక్కడున్నా ఊకోదు బిడ్డా ! నోరిడిసి మాటనకున్నా మనమంతా  ఒక్కటే అని అండగ నిలబడతరు బిడ్డా” అని ఆకలి పేగుల ఆంతర్యాన్ని తెలియజేసింది.  ఆ మాటలిన్న రమేశ్ మనసు కూడా కలికలై పోయింది. కూలోల్లందరు ఒక్కటిగ ఉండాలేనన్న ఎల్లవ్వ సందేశంతో  రమేశ్ కు జ్ఞానోదయమైంది.

 

“అయినా రమేశా,  నాకు తెలువకడుగుతాన జర ఇను బిడ్డ! ఓట్లప్పుడేమో  ఇంటి ముందులకచ్చి కాళ్ళు గదవలు పట్టుకొని   ఒక్కడే కదమనలాగనే  రైల్ టేషన్ల పొంట ఏదేదో అమ్ముకుంట బతికినోడని , ఎనక ముందు లేనోడని ,ఏదిజేసిన పెదోళ్ళకే మేల్జేస్తడని  చెపితే    నమ్మి గెలిపిస్తే గింత గోసబుచ్చుకుంటాడేందిరా రమేశు ?  దేశంల జర్గరాని ఘోరాలు జరుగుతున్నా నోరు తెరుసుడే లేదేందిరా ?ఏదీ పట్టించుకోకుంట ఉండుడేంది ? అసలు మనిషా మకురమా వీనింట్ల పీనుగెల్ల , వీనికి  దినం బెట్ట  అని  తిట్ల దండకం చదువుకుం”ట  ఎల్లవ్వ  రమేశ్  ఎనకబడి పోతాంటే, కూరగాయలు యాదికచ్చి  ఎనకకు తిరిగి దుకాన్లకు బోయింది.

పోలీసోళ్లేమో  ఉరికినోళ్ళందరినీ దొరకబట్టి పొట్టు పొట్టు  కొట్టుకుంట మందను మర్లేసిన తీరుగా అందరినీ ఎనకకు  మర్లించి మళ్ళీ  ఫంక్షనాల్లకు తోలుకచ్చి గేటుబెట్టి కావలి గాత్తాండ్లు.

ఇగ మీరెట్లట్ల   పోతరో చూద్దమని.

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు