మా రచయితలు

రచయిత పేరు:    రామా రత్నమాల

కవితలు

నీడ

నా కలల పూమొగ్గలు చిదిమివేయబడినపుడు

పల్లవించే నవ్య రాగానికి శ్రీకారం చుట్టే ప్రేరణవవుతావు

నా ఊహల రెక్కలు తెగినపుడు గమ్యంకై ఊతమిచ్చే ఊపిరివవుతావు

 

నా దృక్కులు శూన్య విహారం చేసినపుడు 

పలకరింపుల పిల్లతెమ్మెరవవుతావు

నా మదిలో నైరాశ్య మేఘం క్రమ్ముకొన్నపుడు

ఆశల కాంతిని ప్రసరింపజేసే చైతన్య దీపికవవుతావు

 

నడకలో నా పదములు  తడబడినపుడు  జతగా సాగే అందియల రవళివవుతావు

నా మానస వీణ మౌనగీతమాలపించినపుడు శృతి చేసే కవితా తంత్రివవుతావు

 

విషాద తిమిరం నన్ను అలముకొన్నపుడు 

ఆనందాల పల్లకిలో ఊరేగించే సాంత్వనవవుతావు

నా నవ్వుల జలపాతానికి వెన్నెల సంతకం అద్దే జాబిలివవుతావు

 

ధ్వాంతమైనా, మయూఖమైనా

బాధైనా, సంతోషమైనా

నేనెంత కసిరినా

నేనెంత తరిమినా ...

 

ఓయీ! ఎన్నడూ నను వీడని నీడవు

ఎప్పుడూ నన్నంటుకొని

నాతో నడయాడే నా నీడవు నీవు!

చైతన్య విపంచి
 

స్వప్నాలన్నీ శైథిల్య శిశిర పత్రాలైనా

ఆకుపచ్చని భవితకై గగనమే హద్దుగా   

ఆత్మవిశ్వాసంతో సాగే కలకంఠి 

 

ఆమె నీ వస్తువు కాదు

ఆమె నీ సొంతం కాదు 

మరి ఆమెపై ఎందుకింత రాక్షసత్వం

 

జీవితాన్ని మోడు వార్చే అకృత్యాలకు చెల్లుచీటీ రాయాలి

ఆశయాల పరాగం చిదిమి వేసే అధములను అంతం చేయాలి 

అసుర పల్లేర్లను ఏరివేసి నల్లేరుపై నడకై సాగిపోవాలి

 

ఓ సుదతి!  శత్రువు ఎదపై ఎగదన్నే ఉక్కుపాదం కావాలి

ముగ్ధలా ఉన్నా యుద్ధంలో దగ్ధం చేసే తెగింపు కావాలి

 

నువ్వెత్తే పిడికిలి వాడి నెత్తిపై విస్ఫోటనమై దహించాలి

సమయస్ఫూర్తితో  చరితను తిరుగరాసి చరిత్ర సృష్టించాలి

నిన్ను నీవు శృతి చేసుకున్న చైతన్య విపంచివై

నవ్య రాగాలాపన చేయాలి

 

లింగ వివక్ష లేక కుటుంబం

అనుబంధాల అల్లికతో ముడివడాలి 

మది లోగిలిలో విలువల దీపికలు వెలిగించి

నవ సమాజ నిర్మాణంకై నాంది పలకాలి!

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు