మా రచయితలు

రచయిత పేరు:    ముత్తుకూరి హనుమంతరావు

కథలు

కొత్త కోడలు

ఈ మద్దెన నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులొచ్చి మనిషికి ఇంతకు ముందులక్క పన్జేసుకునేకి శ్యాతకాకపోతుండాదని మాయమ్మ ఒగటే యదారు(1) సేత్తుండాది. మా నాయన అన్నలు పని..పని అంటా యాయాళపొద్దున సేన్లో పడి సేన్లోనే లేస్తారు. నాను బడికి పోవడం, రావడం ఆ హోంవర్కులు రాసుకుంట సరిపోవడంతో ఇంట్లో ఒగరు గూడ ఇట్లున్న పుల్లని అట్ల ఎగేసి అమ్మకి సాయమయ్యేది లేదు. దాంతో పొగులంత సేన్లలో పని సేసొచ్చి, తిరగ.. ఇంట్లో సామాన్లన్ని తిక్కుకోని పొయ్యికాడ కుసోవల్లంటే అమ్మ యాసిరికి(2) పడుతుండాది. ఆ బాధలో.. ఆ గుడ్డి దేవుడు ఇద్దర్ని కొడుకుల్నే ఈయకపోతే ఒగర్ని ఆడపిల్లగా పుట్టీగూడదా! యాదో ఇంత సాయమై సేతిలో పని తప్పిస్తుండె కదాఅని ఆ దేవున్ని నిందిస్తుంటాది.

            ‘ఇంటేడుగురికి శాకీరు సెయ్యల్లంటే పోయినంతగాలం ఇంగా నాకేం పాయమొస్తుండాదా మామా! కండ్లతో సూస్తుండావు కదా దినాము మనిషి పడే యతలు. దానికని పెద్దోనికి పెండ్లి సేసేస్తే యాదో ఇంటికి క్వాల్లి(3) వొస్తాది. సేతికి సెయ్యి కలిసి తలాకొగ పని సేసుకుంటుంటాం. నాకి రోంత(4) వుసి సిక్కినట్లయి మనిషి నిమ్మలపడతానని దినాము అమ్మ మా నాయన్ని పోరడం మొదలుపెట్టింది.

            అమ్మ పొటుకు తట్టుకోల్యాక, ‘రొన్నాళ్ళు తట్టుకో యాదో ఒగ గతి సేస్తాల్యాఅన్జెప్పి, మా సిన్నతాత వొద్దకి పొయ్యి ఆలోసన సేసినాడు నాయన. దూదేకొండకోడెం నాగన్న రొండో బిడ్డ  రడీగ వుండాది మరి. పాప పనికి మొనగాడని ఆడీడ సెప్పంగ గూడ ఇంటిని. పాప నల్రూపున వున్న్యా.. మొకం కళయితే బాగుండాది. మన పెద్దోనికి అన్నిదాల సరిపోతాది. మన గురించి మన సంసారం గురించి వాళ్ళకంతా తెల్సు కాబట్టి, మనం పొయ్యి అడిగితే పిల్లని ఈయమనే మాటుండదు. అలోసన సేసుకోమన్యాడు తాత.

            మానాయన- అందందేముండాది ల్యా మామా! కడుక్కోని తాగి కడుపు నింపుకుంటామా అందాన్ని. యాదో ఇంత రైతు పని తెలిసుండి సంసారానికి ఏగితైన(5) పాపయితే సాలని మా బంధుబలాగాన్నంత కుప్పేస్కోని తాత సెప్పిన సంబంధాన్నే ఖాయపర్సుకోని, నెల తిరక్క తలకే పెండ్లి సేసి పారేసినాడు.

            వొదిన ఇంట్లోకి అడుగు పెట్నెంక మాయమ్మ సంబరం అంతా..ఇంతా కాదు! అప్పుడు యాయాళపొద్దున మోకాళ్ళ నొప్పులని తెగ బాధపడేది. ఇప్పుడు ఆ వూసే ఎత్తకుండ పనులు సేత్తుండాది. వొదిన అడ్డం పొయ్యి నాను సేస్తాను పక్కకి రాత్తా!అన్న్యా గూడా, యాదో సిన్నా సితక పనులు మాత్రమే వొదినకి అప్పజెప్పి మిగతాపన్లన్నిటికి తనే పూనుకుంటుండాది. మనిషికి లగువు(6) లేదంటావు ఏంటికిట్లా ఒక్కదానివే శ్రమ పడతావు మా!అని నానుగీన(7) అంటే, ‘కందమ్మ(8) పిల్ల కదా నాయనా! కొత్తలో ఎవరికైనా బెరుకుంటాది. అవన్ని దాటి మనింటికి ఇంగా రొన్నాళ్ళు అలవాటు పన్నెంక అప్పుడు ఆయమ్మే సేస్తాదిలేఅంటాది. ఈ పన్లన్ని సేసింది గాక మాసారిపూట తను ఎప్పన్నుంచో సెక్కపెట్టెలో దాసిపెట్టుకున్న మంచి.. మంచి సీరలన్ని బయటికితీసి దినామొకటి కట్టిస్తా మాలచ్చిమిలక్క వొదినని ముస్తాబు సేసి ఈ సీర భలే వొప్పింది శంద్రావతి నీకి! నా జిట్టే(దిష్ఠి) తగిలేతట్లుండాది తాలు తల్లేఅని, ‘పొయ్యికాటికి పోయి మసిని ఏలుకద్దుకోనొచ్చి అరికాల్లో పెట్టి, అత్తంటే అమ్మలక్కనే వుంటాదని మా వొదినకి తెలజెప్పుతుండాది.

            ఇట్లావన్ని సూసి, ‘దేవుడు నాకి ఒక్క ఆడపిల్లనన్న ఈలేదని బాధపడే సుంకమ్మతన క్వాల్లిలోనే   బిడ్డ(కూతురు)ని సూసుకోని మురిసిపోతుండాదని వూరువూరంతా ఇప్పటికే మిడుకుతుండాది(9)

            సేద్యాలు సేసి ఇత్తనాలు ఒల్సిపెట్టుకోని మోడాలకల్ల ఎగజూస్తావుండారు వూరి జనమంతా. నాలుగు సినుకులు రాలి ఇత్తనాలు మొంట్లో సల్లుకుంటే ఒగ యదారు తప్పయితాదని అందరి అపలాసన. మాకుండేది మొత్తం తొమ్మిదెకరాల బయలు భూమి. దాంట్లో ఒగ అరెకరం తప్ప మిగతాది యా పంటేసినా ఎనిక్కి రాదు. కానీ, మా గాచారమో ఏమోగాని అది యానాడు ఇరగపండి ధాన్యంతో ఇంట్లో గుమ్మిలు(10) నిండిందిల్యా! దుడ్లతో మా నాయన జొవ్వు(11) నిండిందిల్యా! యాదో బాధ్యత లేని గాసాగాడు(12) సేసే పనులక్క.. మీరు సేసిన కాటికి నాను పండిన కాటికి అన్నట్ల పండుతావుంటాది. కారణమేమంటే, భూమి ఒకటే మంచిదైతే సాల్దు. దానికి తగిన అదున్లో ఆ దేవుడు కరుణించి వానలు కురిపీయల్ల. శగితి కోసం ఎరువులు సల్లుకోవల్ల. కూలోల్ల కడుపులు నింపేదానికి మధ్యలో ఈ గడ్డి..గాదెం పడితే దాన్ని ఏరేయనీకి, పురగ..పుట్ర పడితే మందులు..మాకులు కొట్టుకోనీకి, మన సేతిలో దుడ్లు ఆడుతుండల్ల కదా! ఇవన్ని దాటి పండించుకుంటే, ఆడ మార్కెట్లో ఇంతింత బాన కడుపులేసుకోని కుసోనుంటారు భకారుసురగాళ్ళు. వాళ్ళకి సరుకు బాగుంది కొందామనే ఆశ కలగల్ల. మంచి రేటు అబ్బల్ల. ... ఇట్లా.. శానా తతంగముంటాది రైతు బతుకెనుకాల

            ఆయాళ రేత్రి మంచి వాన కురిసింది. అందరు వాళ్ళ..వాళ్ళ సేన్లకల్ల పొయ్యి యా మాత్రం లోతు పదునయ్యేదో సూసొస్తుండారు. అంతలక్క బాగనే పడింది వాన. పై పొక్కు ఆర్తే ఇత్తనం యెయ్యొచ్చునని గెలాలు సేసుకోవడం, కూలోల్ని బుడుక్కోవడం(13) ఇట్లా.. ఎవురి అగసాట్లు వాళ్ళు పడుతుండారు.

            పొద్దుపొడిస్తే ఇత్తనం అనంగ కోడికూతకే నిద్రలేసి అందరం నెత్తికి నీళ్ళు పోసుకున్యాము. అమ్మ వంట వార్పుల సంగతి సూస్తుంటే, నాయన- ముందునాడు పిల్సుకున్న కూలోల్లకి పొద్దుగాలుగ పోదాం తయారుకాండని ఎచ్చరిక సేసేకి పోయినాడు. అన్నవొదినలు.. ఎద్దులకి జొన్నగింజలు దానపెట్టి, గొర్రు, గుంటక, జడిగము(14), లొట్లు, సేతి కొడవిలి, పూటతాళ్ళు, ఇట్లా.. ఇత్తనం గొర్రుకి కావాల్సిన సాయెత్తునంతా బండి వొద్దకి సేరుత్తుండారు. నా(నే)ను వూర్లోవుండే అన్ని గుళ్ళకి పొయ్యి ఆకువక్క పెట్టి, ఇప్పుడు మాము ఇత్తబోయే అన్ని రకాల ఇత్తనాల్ని కలగలుపుకున్న వొళ్ళె మూటలోనుంచి.. ఐదు..ఐదు పిడికిళ్ళు ఆ దేవుళ్ళ పాదాల ముందర పోసి పూజించి, ‘పంట బాగ పండేతట్ల సూడండి స్వాములారాఅని మొక్కుకోనిపోసిన ఐదు పిడికిళ్ళ ఇత్తనాల్లో సగం దేవునికుంచి, మిగతా సగం భద్రంగ వొళ్ళెలో రొండోపక్క మూట కట్టుకున్న్యాను. దేవుళ్ళ పాదాల చెంత వుంచిన  ఈ ఇత్తనాల్ని కండోనిపొయ్యి(15) ఇంట్లో వుండే ఇత్తనాల్లో కలుపుకోని ఇత్తనమేస్తే పంట బాగ పండుతాదని మా నమ్మకం.

            సేన్లో బండి దిగి, తూర్పు మొకాన వుండేతట్ల గొర్రు..గుంటకలు కట్టి, జడిగం, లొట్లు బిగిస్తుండారు అన్నానాయనలు. వొచ్చిన కూలోల్లు కొందరు వాళ్ళకి సాయమైతుంటే, కొందురు పక్కాకి పోయి ఆకువక్కలు ఏసుకుంటా వుండారు. అమ్మ ఒక్క వస్తువుని గూడ తప్పీకుండ వొదిన్తో బొట్లు పెట్టిస్తావుండాది. జడిగము బిగిచ్చేది అయిపోయినంక దానికోసం ప్రత్యేకంగ తెచ్చిన పెద్ద(పట్టు) సీరని సుట్టి సుంగాన్లు పోసి, మిగిలిన కొంగు భాగాన్ని నగలపక్క పర్సినాడు నాయన. అప్పుడు అమ్మ ఆకువక్క సంచిలోనుంచి ముక్కురాయి, కమ్మలు తీసిస్తే నాయన అవి తీస్కోని జడిగానికి అందంగ పొదిగిచ్చి, పూలు సుడుతావుండాడు.

            వొచ్చిన కూలోల్లు ఏమి వాటంగ కుదిరింది! అచ్చం ఆ చౌడమ్మతల్లి రూపం కనపడుతుండాదని మాట్లాడుకుంటా వుండారు. నాయన అంత అయిపోజేసి పక్కకొచ్చి నిల్సి, మాయమ్మతో అమ్మేమన ధాన్య లచ్చిమి వున్నట్ల. ఇప్పుడొచ్చి కడ్డీలు ముట్టిచ్చి టెంకాయ కొట్టమన్యాడు.

            మాయమ్మ- యే పో..రదా! ప్రతి సముచ్చరం మనం పూజించి.. పూజించి బండ్లకి పండిచ్చి, ఇండ్లల్లో దాసుకునింది సాలుగాలేదా..అని కుశాలు పట్టిచ్చే మాట్లు మాట్లాడతా..,‘ఈయెత్తు మన క్వాల్లితో పూజింపజేసి, అట్లే ఆయమ్మ సేత్తోనే తొలి ఇత్తనంఒగ ఐదు పిడికిళ్ళు ఏపిచ్చిసూతాం. క్వాల్లి సేతి బలం కలిసొచ్చి ఏలినాటి శని యేమన్న తెగుతాదేమో!అనింది అమ్మ.     

            మాటకి నాయన నీ ఇష్టమున్నట్ల సేసుకో! నీ ఇష్టాన్ని ఎవురు కాదన్యారిప్పుడు. అయినా ఇప్పుడు నడిసేదంతా మీ ఆడోళ్ళ రాజ్యమే కదా. మీ మాట ఇనకపోతే మా మొగోళ్ళకి బువ్వ యాడుండాది’. అని కువ్వాడమాన్న్యాడు.

            మాయమ్మ- నువ్వు వగల మాట్లు మాట్లాడొద్దు ల్యా మరి పిల్లలెదురూగ! ..,ఆడోళ్ళు గీసిన గీతలో నడిసే మనిషి ఎవురంటే ముందు నీపేరే సెప్తుండారు మరి మనూర్లోన’. అని నక్కుంటనే(16) మా వొదిన్ని దెగ్గిరికి పిల్సుకోని మంచి-సెడ్డ సెప్పుకుంట పూజింపజేసింది. అట్లే, తొలి ఇత్తనం ఒగ ఐదు పిడికిళ్ళు వొదినతో ఏపిచ్చి సంతోషపడింది.   

            యప్పటిలక్కనే బుక్కుల భారం మోస్తా బడికి పోతా..వస్తా వుండాను నా(నే)ను. సేనికల్ల పొయ్యేదానికి ఈ మధ్యన వుసి(17) సిక్కకుండ వుండాది. ఇంట్లో ఆమ్మానాయన మాట్లాడుకునే దాన్నిబట్టి సూస్తే ఈ యేడు మా వొదిన సెయ్యి పనిజేసేతట్లే కనపడుతుండాది. ఇయ్యాళ కడా దెంతె(18) పట్కానికి కూలోల్లని సేసుకోని సేనికి పొయ్యినాడు నాయన. మ్యారసాల్లో యామార్నప్పుడు ఓ నాలుగు (వేరు)చెనిగసెట్లు దెంతెకి తగుల్కోని పెరక్కొచ్చినట్లుండాయి. అవిట్లని ఇంటికి వరకు మోసుకొచ్చి అమ్మకి సూపిస్తా.., ‘ఇగా ఇట్ల.. సెట్టుసెట్టుకి ఒగ నలవై లక్కన నీరు పట్టిన బుడ్డ వుండాయి. ఇవి మనకి కచ్చితంగ సెయ్యి సిక్కేవే. ఈ లెక్కన లెక్కేసుకున్యాగూడ కనీసమంటే ఎకరానికి పద్నాలుగు లేదా పదైదు సంచులు కావచ్చు. అంటే మొత్తం ఒగ నూటానలవై సంచి దాక తెగే సూచన కనపడుతుండాది. ఈ నీరు పట్టిండేవి గాక ఇంగా ఈ సుట్లుపక్కల వూడలు దిగుతుండేవి ఒక పదిపదైదు వరకుంటాయి కదా..! ఇవి గాని ఎగిసొచ్చినాయంటే, నువ్వు ఇత్తనమేసినాపొద్దు అనింటివే ఏలినాటి శనితెగుతాదేమో అని. అది కచ్చితనంగ జరిగి తీర్తాదని అన్ని లెక్కలేసి సెప్పి సంబరపన్న్యాడు. మరేడ్దో మర్సినట్ల మతికి సేసుకోని ఆ శెనిగి సెట్లు ఎవురి కంటపడకుండ గాడిపాట్లో ఎద్దుల ముందుకి ఇసిరేసినాడు.

            నాను అన్సకారికి మాయన్నని అడిగితే, ‘ఒగ చెనిక్కాయనే కాదుల్యా రా! మ్యార సాల్లులో ఏసిన జొన్న అట్లే కాపు పట్టింది. సొద్ద అట్లే కనపడుతుండాది. ఇంగ.. కందిఅక్కిడి గురించి సెప్పే పనేలేదు. వూరక దావెంబడి పోయే వోళ్ళ కండ్లకి కూడా రోంతసేపు ఆగి సూతామనేతట్ల నల్ల...గ అట్లే మిర..మిరమని కండ్లకి మెరుపు కొడతావుండాది. దానికే ఒగరి కండ్లు వున్నట్ల ఒగరివి వుండవని, మన దొడ్లో వున్నిన పాత అటక, సందిడు వరిగడ్డి తీసుకోని అట్లే.., ఆ సాకలి ఎంగటేషుతో పాత అంగీ-ప్యాంటు అడిగి ఇప్పిచ్చుకోని పొయ్యి, నాలుగు కట్లుతో జిఠ్ఠి(దిష్టి) బొమ్మ గూడ కట్టొచ్చినామని సెప్పి, ‘‘అసల్కే దినాలు బాగలేవు’’ మరి నువ్వు పిల్లాటమింద ఇవన్ని ఎవరితోనన్న అనేవని ఎచ్చరిక సేసినాడు.

            మా ఇంటి దేవుడు పులికొండ రంగస్వామిమాయమ్మ కోరిన కొండమింద వాన కురిపిచ్చినాడు. అనుకున్నకాటికి కన్నా ఇంగా ఇరవై సంచుల బుడ్లు(వేరు శనక్కాయలు) ఎక్కువైనాయి. లారీకి ఎత్తుకోని ఆదోని మార్కెట్టుకి పోతే ఆడ బుడ్ల పిండాల్ని సూసి యపారస్తులు నాకు కావాలంటే నాకు కావాలని ఎగబడి  కొన్నారంట. ఇన్నేండ్లకి ఆ తల్లి మామీద దయ సూపిందని, మానాయన వస్తా..వస్తా తిక్క లసమమ్మవ్వగుడికి పొయ్యి టెంకాయ కొట్టుకోని వొచ్చినాడు. మార్కెట్లో మా చెనిక్కాయల్కి తగిలిండే రేటుని విని, ఎదురుపన్నొళ్ళంతా ఈ యేడు యాడో నక్కతోక తొక్కిపొయ్యి ఇత్తనం ఏసినట్లుండారు ల్యా గౌరప్పోళ్ళని  వూరువూరంతా అబ్బురకపోయిరి.

            ‘మాయమ్మని ఇంక పట్ట పగ్గాలు ల్యాకుండపాయ. మామూలంగనే క్వాల్లిని సొంతం బిడ్డలక్క    సూసుకునే మాయమ్మకి, పంట బాగ పండడం, దానికి తగినట్ల రేటు తగులుకోవడం.. ఇవన్నీ ఆగ్గిదేవునికి గాలిదేవుడు తోడైనట్లయి, వొదిన్ని కండ్లలో పెట్టి సూసుకుంటావుండాది.

            మొన్నగనాడు యాదో పనిమీద మా సిన్నతాత ఇంటికొచ్చి, ‘ఇంగేం ల్యా సుంకమ్మా! యాదో నా మనవరాలు వొచ్చి కాలు మోపిందానికి మీ ముత్తుకూరొళ్ళు ఒగటేసారి పైకి లేసిపోతిరి కదా..అని నగతా అన్యాడు. ఆ మాటకి మాయమ్మగూడ నగతా.. తాతకి టీనీళ్ళు గలాసులేకి పోసిచ్చి నువ్వనింది నిజమే ల్యా సిన్నాయనా! నా క్వాల్లి అడుగుపెట్టినంకనే మాకి అదృష్టం కలిసొచ్చింది. ఒగ రకంగ సెప్పల్లంటే ఆయమ్మే మా ఇంటిదేవత వున్నట్లిప్పుడు. ల్యాకుంటే యానాడు అంత పంటని పండించింటిమి. అన్ని దుడ్లని యప్పుడు కండ్ల సూసింటిమిఅని మా వొదిన గురించి గొప్పగ సెప్పుకోని మురిసిపోతా వుండాంది.                                                                         

 

1) దిగులు 2) విసుగు 3) కోడలు 4) కొంచెం 5) సరియైన 6) (లగువు లేదంటే) ఆరోగ్యంగా లేక పోవడం 7) నేను గాని 8) పసికందు 9) గొప్పగా చెప్పుకుంటోంది 10) గాదెలు 11) జేబు 12) పాలేరు

13) వెతుక్కోవడం 14) విత్తనం వేయు ఒక పనిముట్టు 15) తీసుకుపోయి 16) నవ్వుతూనే 17) తీరిక

18) కలుపు మొక్కలను దున్నేసే ఒక పనిముట్టు 

                

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు