పొడిబారిన పొద్దు తరుముతూ వస్తుంటే
తడి ఆరిన గొంతుకతో
తన వారిని చేరాలనే తపన
గమ్యాన్ని చేరే గట్టి నమ్మకం
తన పాదాలు పట్టుదలతో
పోటీ పడుతున్నాయి.
కళ్ళలో ఆశ
కాళ్ళలో సత్తువని
నింగీ నేలా దహిస్తున్నాయి.
కడుపులో ఆకలి
కన్నీటి ధారలకు దోసిలి
పడుతున్నది
ఎక్కడో ఒకచోట
ఎడారిలో ఒయస్సుల్లా
ఆకలి తీర్చే మానవత్వం
అలసిపోయిన మెనుకు
రైలు పట్టాలు తలకింద దిండై
జాలితో జోలపాట పాడుతున్నవి
నిద్రించని మనసుకు
ముందున్న అప్పుల కుప్పలు
కలగా కాటువేస్తూ
మరణం మృదంగం మ్రోగిస్తుంది.
దీనంగా తెరిచిన కంటికి
నడిరేయి నదిలా దారి చూపింది
తిమిరాన్ని మింగిన రవికిరణం
పచ్చని ప్రకృతికి దారి తీసింది
ఆకాశానికి చేతులెత్తిన పల్లెతల్లి
తిరిగొచ్చిన పేగు బంధాన్ని
ప్రేమతో పెనవేసుకుంది.
అలసి పోయిన
కాయానికి అన్నం పెట్టి ఆకలి తీర్చింది.
ఇకనైనా మేలుకొమ్మనీ...
మూలాలను వెతుక్కొమ్మని
కొత్త పాఠం నేర్పింది.