తాను పాతాళంలో మునిగి
స్వర్గంలోని సురగంగలో తేలి
ఎగిరే తురగమై శరవేగమున
వసుధలోని వయ్యారులను చేరి
వారి ఉయ్యాలలో మోహన లాలనలలో
సేదతీరుతూ వారి సుధలు నిండిన సూధులను
గుండెలనిండా గుప్పించుకొని
విశాల విశ్వంలో
తనను తాను మరచి
ప్రణయగీతికలు పాడుతూ
చివర ఆ వినీలాకాశంలో
తాను ఒంటరినే అని తలచి
చెలి తన చెంత చేరలేదని తెలుసుకొని
తీరం తెలియని విరహమహాసాగరాలలో
వింత వింత భావనలకులోనై
భైరాగియై విరహకవన వనాలకు
పురుడుపోసి విరహానందాన్ని
విరహసౌందర్య మాధుర్యాలను
లేలేత బ్రహ్మకమలాల దళాల మీద
సుకుమారంగా లిఖియిస్తాడు
అంతలోనే మరో విశ్వం నుండి
వైవిధ్య నాదాలు నగ్న పాదాలు
ముల్లులతో పొంచి ఉన్న
అగ్నితో మండుతున్న
అలలతో తట్టబడుతున్న
దారిలో ప్రగతికై ఉప్పెనలా
ఎగసిపడుతున్న జీవితాలను
అవగతం చేసుకొని
భగభగమండే సూరిడినుండి
ఎర్రగమండే జ్వాలల నుండి
ముందుకు దూకే ఆ నదుల నుండి
అనంతమైన అక్షరమైన జవాన్ని
కక్షల నుండి రక్షించేందుకు ప్రకాశాన్ని
వెన్ను చూపడమెరుగని
వెనుకకు తిరగని
ఎప్పుడూ ఉప్పొంగే గుణాన్ని
అప్పుగా తెచ్చుకొని
నూతన సిరా మిశ్రమాన్ని నూరి
భూ అంతర్భాగాన ఉన్న వజ్రాలను
వెలికితీసి కలముగా చేసి
అందులో పోస్తాడు.
ఇంకేముంది ఆ కలం
ఉడగని బలంతో ముందుకే ఉరుకుతూ
మిరుమిట్లు గొలిపే కాంతులను మీటుతూ
తరగని సిరాతో చెరగని దివ్యాక్షరాలను
అక్షతములుగా తీర్చిదిద్ది
భూమి కంపించినా విశ్వం విస్ఫోటం చెందినా
శిథిలం కాకుండా పదిలంగా
పది యుగాలు నిలిచి ఉండేలా
పది జగాలు మెచ్చేలా
ఆ జీవితాలు వికాస రాగాలతో
వినులవిందు చేసుకునేందుకు
విప్లవ వీణను మీటుతూ
విప్లవ గీతికను రాస్తాడు.
అవును మరీ!
సుక్ష్మంలోకి సుతారంగా దూరేది
దక్షిణ ధ్రువంలో మునిగి ఉత్తర ధ్రువంలో తేలి
కాంతి వేగంతో వీరవిహారం చేసేది కవియే కదా!..