మా రచయితలు

రచయిత పేరు:    క్రాంతి కిరణ్

కవితలు

అవును కదా

గొడసాటున గొసరిల్లిన బ్రతుకులు

ఈ సామ్రాజ్యవాదనికి సంకెళ్లే కదా

అంకెలదారిలో ఇంకిన బ్రతుకులు

ఈ ఫాసిజానికి కంచలే కదా

పాలకోసం బాల కన్నీటిబ్రతుకులు

ఈ సామ్రాజ్యవాదనికి రక్త సంచులే కదా

రేపటినిగన్నా రేవులేని బ్రతుకులు

ఈ ఫాసిజానికి పిరంగులే కదా

భువిని చీల్చి పురుగొప్పెన లేపి

అన్నాన్ని గుంజితే అగామైన బ్రతుకులు

ఈ సామ్రాజ్యవాదపు మరణకేకలే కదా

అవును కదా

మూగబోయిన గొంతులు

ప్రతిధ్వనిస్తే ఆ ఘీంఖర శబ్దం

ఈ ఫాసిజానికి గుండెకోతే కదా

బందీకాబడ్డ ప్రశ్నల వెల్లువ ప్రజ్వాలిస్తే

ఈ సామ్రాజ్యవాదనికి ప్రకంపమే కదా

అవును కదా

అంతా వింతేమీ కాదుకదా

పిడికెలేత్తటమే ఆలస్యం

వసంతం వికసించును కదా

 

పోరు కెరటం

వసంత ఋతువుని

వర్షించే మేఘాన్ని

మట్టి వాసనని

అడవి అందాన్ని

పైడి  పదాన్ని

వెన్నెల వసంతాన్ని

వేకువ ధీరత్వాన్ని

పోరు కెరటాన్ని

నువు అణిచేద్దామని అనుకున్నప్పుడల్లా -

మరింత ఉవ్వెత్తున లేస్తూనే ఉంటుంది

ఉప్పెనై ఉప్పొంగుతూనే ఉంటుంది

 

వేచి ఉంటాను

బహుశా నీవు

గమనించలేదేమో

ఎప్పుడూ ఏది అలాగే ఉండదు

కాలం మారుతోంది

విధానం మారుతోంది

ఈ మట్టి వాసనతో మమేకమైన

మన జీవితంలో ఆ చిరునవ్వు

మళ్ళీ నేను చూస్తాను

నిక్కచ్చిగా చూస్తాను

అప్పటివరకూ నాకు ఓటమి లేదు

అంతవరకు నాకు మరణం లేదు

ఎప్పుడూ ఓ స్ఫూర్తి చరిత్రనై

నీ వెనువెంటే ఉంటాను

నీ వెంటే ఉంటాను

నీ ప్రేమకై వేచి ఉంటాను

 

రెడ్ రోడ్

ఈ కళలు చిగురిస్తూ చిగురిస్తూ

కన్న కనులు కనుమరుగవచ్చు

ఈ శ్వాసల సరిగమలు సాగి సాగి

శాశ్వతంగా సమాధి కావచ్చు

ఈ ఆశల హరివిల్లు విరిసి విరిసి

వీగి విరిగిపోవచ్చు

ఈ స్వచ్ఛ స్వేచ్చా అడుగుల గమనం

కదిలి కదిలి కాలంలో శున్యమవచ్చు

ఈ ప్రాణం చలించి జ్వలించి

కాటిలో కాలిపోవచ్చు

డియర్ కామ్రెడ్

నా రేపటి ఆకాంక్ష నీవే

నా రేపటి రూపం నీవే

నా రేపటి పోరాటం నీవే

నా రేపటి స్వేచ్ఛా నీవే

నీ ప్రేమకై

నువు పంచే ప్రేమకై

నీను నా చీకటి ప్రేమలు

ఎదురుచూస్తు ఎదని మలుస్తూ

చూస్తుంటాం కామ్రేడ్

ఎదురు చూస్తుంట్టాం

 

ఈ సంచికలో...                     

Nov 2020