మా రచయితలు

రచయిత పేరు:    దొంతం చరణ్

కవితలు

ఆకలి రాగం
 

నా కడుపులో ఆకలి శబ్దిస్తోంది గాండ్రిస్తోంది

వినే హృదయం నాది మాత్రమే..!

 

మళ్లీ ఇంకో శబ్దం

ఈసారి మంటల రాగాలాపన

వినే హృదయం మళ్ళీ నాదే..!

ఏమిటో మళ్ళీ ఇంకో చప్పుడు

కడుపులో కార్చిచ్చు అంటుకున్న చప్పుడు

నరాలను మీటుతున్న చప్పుడు

పొట్టలో పురుగులు మునకలేస్తున్న చప్పుడు

ఇప్పుడు వినే జీవి...మళ్ళీ నేనే..!

 

ఇన్ని శబ్దాల నడుమ

నా కడుపు ఎప్పుడో పేలిపోయింది

మళ్ళీ ఇంకో శబ్దం కడుపులో తిరగాడుతోంది

కానీ వినడానికి నా హృదయం మేలుకతో లేదు

ప్రస్తుతం స్పర్శ కోల్పోయి కోమాలో వుంది

 

అనేక రకాల శబ్దాలను విని తట్టుకోలేక

ఇప్పుడు నా శరీరం .సి.యూ లో వుంది

నా పొట్ట ఎన్నిసార్లు మొరపెట్టుకుందో పాపం

ఎండిన చెరువు ఏడుస్తున్నట్టు చప్పుడు

మోడుబారిన వృక్షం మూల్గుతున్నట్టు చప్పుడు

పగిలిన మట్టికుండ విషాదంగా పాడుతున్నట్టు చప్పుడు

ఇక్కడ వినిపిస్తున్న ప్రతీ చప్పుడులో

రాగం ఒక్కటే..జీవితం

 

పాడే పాటలో

ఖచ్చితంగా ఉండే రాగం

ప్రతీ జీవిలో తాండవమాడే రాగం

 

రాగం

శంకరాభరణం కాదు

చక్రవాకం కాదు

సారంగ రాగం కాదు

మళహరి రాగం కాదు

కీరవాణి రాగం కూడా కాదు

ఇది.......    ఆకలి రాగం..!!

 

 

       

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు