మా రచయితలు

రచయిత పేరు:    గాలి రోహిత్ కుమార్

కవితలు

ఘనచరిత

సాగిపోయే గాలి అలల్లో..

కదులుతోంది ఘనచరిత..

 

రాజ్యాలు ఆవులిస్తున్నాయి..

తిరగేసిన చరిత్రపుస్తకపు పుటల్లోంచి..

 

కోటగోడలు ఎరుపెక్కుతున్నాయి..

మునుపు రాలిన రక్తపుబొట్లను అద్దుకుంటూ..

 

ఇక్కడి పువ్వులు, నవ్వులను మరచి,

రాజదర్పాన్ని ప్రదర్శిస్తున్నాయి..

 

నరకంఠాలను రాల్చి విశ్రాంతి తీసుకుంటున్న ఖడ్గాలు..

తమ మబ్బునువదిలించుకుంటున్నాయి..

 

సైనికుల వీరత్వాన్ని ఆవహించిన సోమరితనం..

వారి సమాధులపై మొలచిన గరిక మొక్కని చూసి పారిపోతుంది..

 

ఆకాశంలోని తోకచుక్కల్లా రాలిపోయిన రాజవైభవాలు..

తిరిగి మెరుస్తున్నాయి.. పసితారామణుల్లా..

 

సింహాసనం అరవై హస్తాలతో ఆహ్వానిస్తోంది..

కదిలిపోయిన రాజకిరీటాలను తన ఒడిలోకి..

 

కాలచక్రపు గాడీ వెనక్కి మరలుతోంది..

తన చక్రాలకింద పడినలిగినవారిని తట్టిలేపుతూ..

 

ఇక,

ఉదయిస్తుంది మరోలోకం..

గతవైభవాల స్మృతులే పునాదులుగా..

ఊపిరి పోసుకుంటుంది లోకం..

ఆశలే తన శ్వాసలుగా..

 

సాగిపోయే గాలి అలల్లో..

కొనసాగిపోతోంది ఘనచరిత..!!

 

ఎన్నో

నడిరేయి నిద్రలో.. నే మేలుకొని..

వెన్నెల వెలుగుల్లో.. పదాలనేరుకొని..

కూర్చిన పాదాలెన్నో..

 

ఇసుకగూళ్ళలో..

ప్రసవించిన ఊహలకు రెక్కలుతొడిగి..

వాటి ప్రయాణానికి నేనేర్పరచిన..

దారులెన్నో..

 

కంచిగోడలను తాకిన కథలను..

ముంచెత్తే మాయాఅలలకు చిక్కకుండా..

నే తప్పించినదెన్నిసార్లో..

 

విరిగిన ఆశలరేకులను

తిరిగి అతికించుకొని,

కాలపు సమాధానానికై దీనంగా

నే వేచిచూసింది ఎన్నిమార్లో..

 

మాటల బాణాల..

మానని గాయాలకు..

నామది ఎదురొడ్డిన క్షణాలెన్నో..

కరగని శిలలకు..

నే చేసిన తరగని పూజలు అవెన్నో..

 

శ్రమ నుండి విశ్రాంతికి..

భ్రమ నుండి బాహ్యానికి..

భారం నుండి దూరానికి..

భావం నుండి భాగ్యానికి..

దగ్గరవ్వాలనే కోరికలు ఎన్నో.. ఎన్నెన్నో..!!

 

ఇంకా జీవించే ఉన్నాను

ఇంకా జీవించే ఉన్నాను.

నేనింకా జీవించే ఉన్నాను..

 

పేదలరక్తాలు త్రాగే

దానవమానవ జలగల

గలగలలు వింటూ..

చెవిటినై నే అవిటినై

ఇంకా జీవించే ఉన్నాను..

 

పూటకు తిండిలేక,

కడుపు చేతపట్టుకొని

కాళ్లరిగేలా తిరిగే యాచకులను

చూస్తూ, గుడ్డినై నే ఎడ్డినై

ఇంకా జీవించే ఉన్నాను..

 

ఆకలికోసం మానాన్ని అమ్ముకునే

దౌర్భాగ్యపు జీవుల యాతన చూస్తూ

నే ఏమీ చేయలేని వాడినై..

నిద్రావస్థలోనున్న జీవనాడినై

ఇంకా జీవించే ఉన్నాను..

 

మంచినెంచని మతవాదుల మధ్య..

కుళ్లుబుద్దుల కులవాదుల మధ్య..

కనిపించని సంకేళ్ళు..

కాళ్లకు వేసుకుని..

నేనింకా జీవించే ఉన్నాను...!!

 

 

 

ఎవరు ?

నిలువెత్తు మానవునిలో

ఎర్రని రక్తపుకాల్వల తవ్విందెవరు..

అల్లుకున్న నరాలతీగలను నాటిందెవరు..

శిలలాంటి పుర్రెల చెక్కిందెవరు..

జిగురుతో కీలు బొక్కలను అతికించిందెవరు..

 

నరుని శిరోసీమపై కురులవిత్తులు జల్లిందెవరు..

నాల్కలనాగుకు నోళ్ళపుట్టను కట్టిందెవరు..

స్థిరమైన మెదళ్ళకు చంచలత్వపు చక్రాలు అమరిందెవరు..

అస్థిపంజరాన' అవయవ చిలకల దాచుంచిందెవరు..

 

 

కంటికి చూపునూ..

కడుపుకు మేపునూ..

నోటికి మాటనూ..

కాలికి బాటనూ..

తనువుకు నీడనూ..

తలపుకు గోడునూ..

సరిగూర్చిందెవరు..??

 

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు