కలుపు తీసిన చేయి నాది!
కడుపు నింపని పంట నాది!!
పత్తులేరిన చేయి నాది!
పస్తులుండాల్సిన గోడు నాది!!
అంట్లు తోమిన చేయి నాది!
అంట్ల మెతుకు దొరకని దుస్థితి నాది!!
చీపురు పట్టిన చేయి నాది!
చీ కొట్టబడిన బ్రతుకు నాది!!
అలుకు చల్లిన చేయి నాది!
అలుపెరుగని జీవితం నాది!!
బిందె పట్టిన చేయి నాది!
బిందెడు నీళ్లు లేని లోటు నాది!!
కట్టె కొట్టిన చేయి నాది!
కట్టుకున్నాక చావు నాది!!
ఆడదానిని నేను - అవనికి తల్లిని నేను
అబలను నేను - సహన భూమాతను నేను
సబలను నేను - కళ్లు లేని న్యాయమాతను నేను
శ్రీమూర్తిని నేను - సిరి లేని ధనలక్ష్మిని నేను
మాతృమూర్తిని నేను - నిస్వాతంత్ర భరతమాతను నేను
చదువుకోలేదు కానీ సరస్వతినయ్యాను!!!