మా రచయితలు

రచయిత పేరు:    వై.కె.సంధ్యశర్మ

కవితలు

ఇంకా ఎన్నాళ్లు....?

ఐరన్ బాక్స్ కింద ముడుతలు పడిన

ముతక చీరలా...ముచ్చెమటలతో

తడిచిపోయేవు....

పొగచూరులో మొద్దుబారిన

అంట్లగుడ్డలా మూలన దాగేవు

చెత్తకుప్పలో దాచేసే న్యాప్కిన్ పీస్ వై

పీస్ లెస్ ఉమెన్ లా సాగిపోతావు...

 

ఇంకెన్నాళ్ళు....

 

నాగరికమనే అనాగరిక రొచ్చులో

మలిన పేలికవై మిగిలిపోతావు...

ముసుగు వేసిన మూలికలా

మాయ చేెసిన మత్తులో  తూలిపోతావు...

మరమ్మత్తు లేని నయా

పాదరసంలా కరిగిపోతావు....

 

ఇంకెన్నాళ్ళు....

 

అణువణువూ నీ నీడే ఐనా

అడుగడుగునా నీపై దాడే

అణువణువూ నీ ప్రేమే ఐనా

అడుగడుగునా  విద్వేషమే

ఆకాశమంత సహనమే ఐనా

ఆకలి కడుపుకు కరిగిపోయే

కన్యత్వం...

విచ్చుకోని పసి మొగ్గలే  ఐనా

ముళ్ళుగుచ్చే మృగత్వాలే అన్నీ...

కనికరించని చీకటి పగుళ్ళే...

 

ఇంకెన్నాళ్ళు... 

 

దాగని నగ్నసత్యాలను

నడివీధులో పేర్చడం... 

వసంతం రాని ప్రకృతితో పోటిపడడం...

అందాల బొమ్మగా పరిచయమవడం

అంగడిలో సరుకుగా అమ్ముడుపోవడం...

అందుకే....

మనలో మనం ఏకమై

మనకు మనమే

గుప్పిటలోంచి జారే క్షణాలను

ఒడిసిపట్టి ఛత్రమై 

ఉక్కునరాలై ఉరికే ఉత్సాహంతో

పిడికిలి బిగించి కాలానికి

ఎదురీదుదాం... 

పరువు పరుగులో పరదాలను తీసి

పైచేయిగా పయనిద్దాం..

పలుకు పలుకు కూడదీసి

పలుగురాయిగా మారుదాం... 

పంచే ప్రేమలోను పెంచే దారిలోను

కలుపుమొక్కలను ఏరేద్దాం...

విలువలకు వలువలు తొడిగే

స్త్రీ జాతికి నిదర్శనంగా నిలుద్దాం...!

 

ఈ సంచికలో...                     

Jun 2021

ఇతర పత్రికలు