మా రచయితలు

రచయిత పేరు:    తిరునగరి శరత్ చంద్ర

కవితలు

పొయెట్రీ టైమ్

ఎంత ఎదిగిందో నిన్నటి చూపు

రేపటి కాలాలను కౌగిలించుకుంటూ..

ఎంత ఒదిగిందో నిశ్శబ్దం

శతాబ్దాల చీకట్లను మింగేసుకుంటూ..

 

     *****

 

ముట్టి చూడు ప్రతి మట్టి

కవితై పలుకుతుంది

తట్టి చూడు ప్రతి చెట్టు

మమతై కనబడుతుంది

 

         *****

 

పర్వతమని అంటావెందుకు?

నేనింకా పరమాణువునే..

మహావృక్షమని అంటావెందుకు?

నేనింకా చిగురునే..

 

      *****

 

జీవితం అనుభవమైతే

ప్రతి పుట ఒక కావ్యమే..

 

      ******

 

అతడు మౌని

కాని

నిశ్శబ్దాల శిరస్సులపై

ప్రళయాన్ని సృష్టిస్తాడు

 

అతడు జ్ఞాని

కాని

పాతాళంలో కూర్చుని పాపాల్ని పోగు చేసుకుంటాడు.

 

     *****

 

చదువుతున్నాను

పుట పుటకు కాలాన్ని పుకిలించుకుంటూ..

నడిచిపోతున్నాను

అడుగు అడుగుకు సహనాన్ని వెలిగించుకుంటూ..

 

      *****

 

ఏది కవితంటే?

తెల్ల కాగితం మీద నల్లగా రాసేదా?

కాదు

నల్లని మనసు మీద తెల్లగా పూసేది.

 

       *****

 

కీట్స్ విస్తుపోయే

ఒక కొత్త మెటఫర్  అలమారాలో

దాచిపెట్టాను.

 

        ****

పొయెట్రీ టైమ్

శిఖరం నుంచి

లోయలోకి దూకితే అది సాహసం

లోయ నుంచి

శిఖరానికెదిగితే అది జీవితం

 

నీ వ్యక్తిత్వం చూసి

శిరసెత్తిన శిఖరాలు సిగ్గుపడాలి

నీ గమనం చూసి

అలలెత్తిన సముద్రాలు అలసిపోవాలి

 

పర్వతమని అంటావెందుకు?

నేనింకా పరమాణువునే..

మహావృక్షమని అంటావెందుకు?

నేనింకా చిగురునే..

 

ఈ చీకటి ఏం చేస్తుంది?

నా కవితల వాకిటిలో దీపమై కూర్చుంటుంది.

 

పేజీలు తిరగేయడమే కాదు

చరిత్ర తిరగరాయడమూ తెలుసు

 

 

కవిత్వంలో కనబడతాను

కవిత్వమై నిలబడతాను

 

 

 

 

పొయెట్రీ టైమ్ – 3

మనసు తెర మీద

ఒక బొమ్మ రవివర్మ ఊహలాగా

మెరిసింది

అందుకున్నాను ఆ అందాన్ని

రుడాల్ఫ్ వాలంటినో లాగా..

 

 *********

 

ఆమె జడలల్లుతుంది

నేను కవితలల్లుతున్నా

నా కవితలు ఆమె జడలో

గుబాళిస్తే చాలు సిరిమల్లెలుగా..

 

*********

 

జెబున్నిసా గుబులుపడే

మిస్రాలు నా కలం జేబులో

భద్రపరుచుకున్నా.

 

*********

 

ఆమెకు ఎదురుగా వెళ్ళాను

అంతే

ఎదలో నందనం పూసింది.

 

********

 

ఇలాగే ఉంటాను

ఎలాగైనా

కలలోన మెరిసిన కళలాగా...

 

 

పొయెట్రీ టైమ్ – 4

ఆమె మౌనిక

కాని మాట్లాడుతుంది

ఆమె దీపిక

కాని చీకట్లో బతుకుతుంది

ఆమె గీతిక

కాని స్వరమే లేదు..

మరి వీళ్ళు

పేర్లున్న అనామికలు...

 

********

 

నా కలం కంటిలో నుంచి

ఖయ్యాం కదిలిపోతున్నాడు

నా గళం ఇంటిలో నుంచి

నజ్రులిస్లాం తొంగి చూస్తున్నాడు

 

*********

 

 

నేను నీలో లీనమౌతాను

నువు

నాలో ప్రాణమైపో...

 

*********

 

గుల్ మొహర్ కు నాకు

ఒకటే తేడా

అది ఎర్రగా పూస్తుంది

నేను ఎదలో పూస్తాను..

 

  ********

 

థామస్ ఆల్వా ఎడిసన్

సినిమాకు ప్రాణం పోసి

దృశ్యాన్ని కదిలించాడు

నువ్వు నా కవితకు ప్రాణం పోసి

నేనై కనిపించావు.

 

 

    

పొయెట్రీ టైమ్ - 5

పిరదౌసి తన ఎద తీసి

షాయరీగా రాయగానే

పూలన్నీ పులకింతలే..

శిలలన్నీ చిగురింతలే..

********

రోజులు గడిచినా

బూజు పట్టని

నజ్రులిస్లాం నగుమా నజరానా

గాలి తరగల్లో తాజాతాజాగా..

********

జ్వాలలాగా రగిలి రగిలి

కవిత్వమై మండుతాను

*********

ఆమె కురుల సంకెళ్ళతో

గాలిని బంధించింది

అయినా

తన ప్రేమను శ్వాసగా

నాకు అందించింది.

********

లూయి ఆరగాన్ లాగా కాను నేను

నిర్భయంగా నా కవితను వినిపిస్తాను.

 

పోయెట్రీ టైమ్ – 6

కాలం ముగిసిపోయే వరకు

కలం ఎగిసిపోవాల్సిందే..

 

********

 

దృశ్యాల జాతరలో

నా చూపులు తప్పిపోయాయి

 

********

 

ఇవ్వాళ్టి ముళ్ళకంపలో

రేపు చిక్కుకుంది

 

********

 

ఆలోచనల నొసళ్ళపై

రాలిపడిన ఎడారి చూపులకు

వేడిని తోడిపోసే

నిశ్శబ్దం కావాలిప్పుడు.

 

*******

 

పులుపు

ఎంత తీయగా ఉంది

నీ తలపుల్లో తడిశాక..

 

 

 

ఈ సంచికలో...                     

Nov 2020