మా రచయితలు

రచయిత పేరు:    ప్రవదా

కవితలు

మళ్లీ వస్తాం...

రోడ్లన్ని ఎరుపెక్కిస్తూ

సముహంగా పిల్ల జల్లలతో

గుంపులు గుంపులుగా

పగలు రాత్రి రాత్రి పగలు

వందలు వేల మైళ్లు

నడిసి నడిసి

కాళ్లు బొబ్బలచ్చి పగిలి

చీము నెత్తురు కారుతున్న

ఎదో తరుముతున్న

అందోళనతో అడుగులేస్తున్నాం

ఆకలిని మర్చిపోయం

దహన్ని వదిలేసం

కన్న పేగుల్ని మెడలేసుకోని వెలుతున్నాం

మా బతుకులు మావి

కాని కాడ

మమల్ని నిర్భందించారు బరువెక్కిన గుండెలు కావు మావి

బతుకు పోరు

తెలిసిన వాళ్ళం

పోరు బతుకుకు

పురుడు పోసుకున్నాం

మా అడుగులు

అద్దిన నెత్తుటి దారులను

తలుచుకుంటు

మళ్లీ వస్తాం -

వసంతం 

తొలకరితో పుడమి పులకరించి

ఆరుద్రను పురుడు పోసుకుంది

ఆరుద్ర తన అందాన్ని

ఎరుపెక్కిస్తుంటే

శ్రమ జీవులు పొక్కిలిచేసి

సేద్యం చేస్తున్నారు

సేద్యం చెమటను చిందిస్తుంటే

చేలు గింజలను రాలుస్తున్నాయి

గింజలు ఎవరివి?

శ్రమ అధిపత్యం ఘర్షిస్తున్నాయి

గింజలకై పోరు

శిశిర కాలంలో

యుద్ధంలా సాగుతుంది

యుద్ధం

వసంతాన్ని ప్రసవిస్తుంది

వసంతం శ్రమను అలింగనం చేసుకొని

గింజలను

బహుమనంగా ఇస్తుంది

త్యాగాలకు గురుతుగా

రాజ్యమా మరవకు

గొంతు వొకటే

కాని

అది కోట్లాది

ప్రజల సంఘర్షణ

తానే

అనంతం కాదు

కాని

తానే

అంత అంతటా

యవ్వనపు జ్వాలలను

కౌగిలించుకున్నవాడు

కాగడాగ మారి

ప్రజ్వాలించినాడు

విశాల హృదయుడు

'సముద్రుడు'

నిరంతరపు నిర్భంధంలో

నిటారుగా నిలిచిన వాడు

విశ్వ జననీయ మానవుడు

ఎనిమిది పదులను

హేలన చేస్తున్నాడు

తాను కలగన్న

మనిషి కోసం

మరణంతో పోరాడుతున్నాడు

తన రూపాన్ని చూపకపోవచ్చు

కడసారి నవ్వుల సూర్యుడికి

కరోనా ముసుగేయచ్చు

బింబ ప్రతి బింబాల

సహజీవనంలో

తాను

ప్రజల ప్రతిబింబమని

మరవకు

రాజ్యమా మరవకు

 (వివి సార్ కి కరోనా సోకడంపై అందోళనతో రాసిన సందర్భం)

ధిక్కారం 
 

ప్రజాస్వామ్యం అంటేనే

ప్రశ్నించడం

నేనేసుకున్న నల్లకోటు

ప్రశ్నించమనే చెప్పింది

నేను చదువుకున్న

రాజ్యాంగం

ప్రశ్నించడం నీ హక్కంది

నా ప్రశ్న

'కంటెంట్ అప్ ది కోర్ట్' అయితే

నేను మై లార్డ్ అంటూ

మోకరిళ్లను

అది నా భవాప్రకటన స్వేచ్ఛ అంటూ

యువరోనార్ అని

గర్జిస్తాను

మళ్లీ...మళ్లీ

నా ధిక్కార స్వరాన్ని

వినిపిస్తాను

ప్రజాస్వామ్యంలో

ప్రశ్న వోక్కటే

పురోగమనం అంటాను

 (సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భుషన్ పై కోర్టు ధిక్కారం కేసు మోపిన సందర్భంలో రాసిన కవిత్వం)

రైతన్న

తెల తెల వారంగనే

కాడేడ్లను కట్టుకొని

భూమిపై వాలిపోతావు

చెట్టు పుట్టను

చదునుచేసి

నాగలితో సాల్లు పెడ్తావు

మడులు మడులుగా జేసి

గింజె గంజెను జల్లి

నారోలే జెస్తావు

మోకాళు లోతులో

నడుమంత వంచి

వరి చేనును మోలిపిస్తావు

నీ కష్టమంత కన్నీరై వర్షిస్తే

గింజ గింజలుగ మారే

వాటిని రాశులోలే పోగుజేసి

దేశానికే మెతుకునిచ్చి

నీవు అన్న దాతవైనావు

ఓ రైతన్న

70 ఎండ్ల స్వాతంత్రంలో

నీవు నిలుచున్న చోటు

నీది కాకుండా చేసే

కార్పోరేట్ డేగలు

నిన్ను తరుమబట్టే

వెళ్ళను జోప్పించి

వేర్లను పుట్టించిన వాడివి

ఎన్నో కరువు కాటకాలను

ఎదుర్కున్నోడివి

పోరు కొత్తేమి కాదు నీకు

కర్రు నాగలితో

డేగ రెక్కలను విరిచివెయ్

కాయలు కాసిన

నీ చేతులతో

కలుపు కమలాన్ని పికివెయ్

ఓ రైతన్న

పికివెయీ

 (పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా బిల్ పాస్ చేయడాన్ని నిరసిస్తూ

వీల్ చైర్ తో విముక్తి 

 

జీవ పరిణామ క్రమంలో

అసంపూర్ణంగా

ఉదయించినవాడు

చక్రాల కుర్చీతో

శూన్యన్ని శాషిస్తూన్నాడు

తన మెదడెమి

మిసైల్ కాదు

అణుబాంబు

అంతకంటే కాదు

అయినా

ఎందుకంత భయమో

సూర్యుడు తాకని

'అండ'శయంలో

బంధించారు

మంచు కొండలలో

మనిషి

గడ్డకడుతున్నట్టుగా

క్రమక్రమంగా

కృషించుకపోతున్న

మెదడు పొరలలో

నిక్షిప్తమైన

దృఢసంకల్పం

అతనిది

తన తనువును

తాను కదలించని వాడు

ఆమరణ దీక్షకు

పూనుకున్నాడు

స్వేచ్ఛ గళమై

స్వేచ్ఛ కళమై

వీల్ చైర్ నుండే

విముక్తి పాఠం

నేర్పిస్తున్నాడు

 (జైల్లో జి. యన్. సాయిబాబా ఆమరణ దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంలో)

ఈ సంచికలో...                     

Nov 2020