మా రచయితలు

రచయిత పేరు:    లడె నిత్య

కవితలు

మాతృమూర్తి

నింగిలో ఉన్న చుక్కలను లెక్కేయలేను

భూమి పొడవెంత అంటే కొలవలేను

నీ ఒడిని మించిన స్వర్గాన్ని వెతకలేను

నీ ముఖములోని బాధను చూడలేను

 

నీ  చిరునవ్వును మించిన సంతోషం నాకు ఏది లేదు

నువ్వు లేకుండా నేనేమవుతానో ఊహించలేను నీపై నా ప్రేమ మాటల్లో వివరించలేను

నిన్ను మించిన దైవం నాకు ఏది లేదు

 

భూదేవియే తలవంచుతుందేమో

నీకున్న ఓపికను చూసి ,

ఆకాశమే అంతమైపోతుందేమో

నీ విశాల హృదయాన్ని చూసి ,

త్రిమూర్తులే కరములచే నమస్కరిస్తారేమో

కష్టాలను ఎదురించిన నీ ధైర్యం తీరును చూసి ,

గంగంమ్మ కంట నీరు పెడుతుందేమో

నువ్వు పడ్డ కష్టాలను చూసి ,

లక్ష్మీదేవియే ఈర్ష్య పడుతుందేమో

నీ అందమైన చిరునవ్వు చూసి ,

పుణ్యక్షేత్రాలు దర్శించితే పుణ్యమేమో

 

కాని నీ పాదాలను తాకితే చాలు

అమితమైన పుణ్యముతో

ఇక ఊపిరి కూడా అనందంగా వదిలేసి

స్వర్గ లోకంలో సంతోషంగా బతికేయచ్చు.

 

ఆనాడు పరమ శివుడి  కంఠంలో

విషం ఉందని  అందరికి తెలిసింది

కాని నీలోని  బాధలు

ఏనాడు, ఎప్పుడు, ఎలానో,ఎవరికి తెలియలేవు

గుండె నిండ బాధలు ఉన్నా

తీయని పలకరింపు మాత్రం

నీవెన్నడు మరువలేదు

 

నేను కష్టాలలో ఉన్నప్పుడు

నీ ముఖములో  చిరునవ్వు

సంతోషమై ఎదురొచ్చింది

చీకటిలో భయపడుతుంటే

నీ కళ్లల్లోని తేజస్సు

వెన్నెలై వెలుగునిచ్చింది.

చీకటనే భయాన్ని పారద్రోలించింది.

ప్రశ్నలతోనే సతమతమైపోతుంటే

నీ మాటలే

 మెరిసే నక్షత్రంలా

త్వరగా ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

 

నీ  వల్లనే

నా జీవితానికో అర్థం.

నీవు లేని

నా జీవితం వ్యర్థం.

నీతో ఉన్న ప్రతిక్షణం

నాకో సరికొత్త

నందనవన వీక్షణం...

    

ఇది కాదు 

ఇది కాదు నేను సాధించాలనుకున్న సమాజం...

తల్లనకా , చెల్లెనకా

 బాలికనగా, బాలింతనకా

అందరూ అమ్మలాంటి

 వారే అన్న మాట మరిచిన.

కామాంధుల చేతులో ఆడబిడ్డల జీవితాలు

అన్యాయ అక్రమాలను ఆపలేని భగవంతుడు

ఇది కాదు నేను కోరుకున్న స్వాతంత్య్రం

 

ఇది కాదు నేను కావాలనుకున్న సమాజం

అడుగేసే అవనిపై లేని తేడా

పీల్చే గాలిలో లేని తేడా

తాగే నీరులో లేని తేడా

కేవలం, మనుషులు సృష్టించారు

కులమతములనే తేడా

అయినా

కనబడుతున్న తేడా

మనుషుల మధ్యే కదా..!

మనసుల మధ్య సృష్టించలేరు కదా...!

కానీ, ఇలాంటి మార్పు కాదు నేను కోరుకున్నది...

తరతరాలుగా కాపాడిన సంప్రదాయాలు

కనుమరుగైపోతున్నాయి ఈనాడు

సాక్షాత్తు

భరతమాత

పాదాలముందు వదిలేస్తున్నారు మన సంస్కృతి, సంప్రదాయాలు..

అమ్మ కళ్లముందే అలవరుచుకుంటున్నారు ఇంగ్లీషు వాళ్ల అలవాట్లు

ఒక్కసారైనా

 ఆలోచించలేరా తల్లి ఆవేదన,

తన పిల్లలను చూసి

 తను పడే బాధ

ఎవరికి కనబడడం లేదా....!

ఎదకు ఇష్టంగా హత్తుకుంటున్నారు విదేశీ సంప్రదాయాలు

పుడమిపైన ఇదే మనం చేసే పెద్ద పొరపాటు.....

 

అసలు ఏమవుతుంది

నా సమాజం,,,

సముద్ర సాగరంలో కలుస్తున్న సంప్రదాయాలు,

కలుషితమైన మనుషుల మనసులు

దయ హృదయం లేని దుర్మార్గులు

ఆలోచన లేని

 అచల దేహాలు

మన జీవం ఉండగా

 కన్నతల్లి కళ్లల్లో కన్నీరు

కన్నతండ్రిని ఎదురించి అడుగుతున్నారు

ప్రశ్నలు,

ఇది కాదు నేను కోరుకున్న సమాజం,

ఇది కాదు నేను కలలుకన్న స్వరాజ్వం,

అసలు ఇది కానేకాదు నా పవిత్రమైన భూమి...,,

 

నేను సాధించాలనుకునే సమాజం కోసం

సముద్రంలో అలల్లా ఎగసిపడతాను

మంచి కోసం

అగ్నిపర్వతంలా రగులుతాను

చెడును తొలగించే

చేమంతినై విరబూస్తాను

సమస్యలతో పోటి పడతాను

నేనో విజయం బాట వేస్తాను

నా బాటలో నలుగురిని నడిపిస్తాను

నా సమాజాన్ని

 నేను వెనక్కి తెచ్చుకుంటాను ....

 

 

జగతికి ఆధారం ఆమె

లాలి లాలి అంటూ నీకు జోల పాడింది ఆమె

కమ్మని కథలు చెప్పి నిన్ను నిద్రపుచ్చింది ఆమె

కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంది ఆమె

నీకు

తనకు నచ్చేలా

ఈ లోకం మెచ్చేలా నిన్ను తీర్చిదిద్దింది ఆమె

నీపై తనకున్న ప్రేమను ఆకాశంతో పోల్చలేను

నీపై తనకున్న బాధ్యతను భూదేవితో పొల్చలేను

ఓ.. నవ మానవజాతి ఆణిముత్యమా....

గర్వించుమా...

నీవు ఓ వనిత చేతిలో పెరిగావని

ఆ వనితే నీకు ఆధారమని గర్వించు...

నీ అంధకార జీవితంలో వెలుగు నింపిన దీపం

అంతటి లేతకుసుమానికి ఏది నీవిచ్చే గౌరవం?

వావివరుసలు లేని నీ నీచపు బుద్దితో

కామాంధుడవై

ఆ కరుణామయురాలిపైననా నీ పైశాచికత్వం?

నీచ ప్రవర్తనతో ఎందుకు ఈ అవనిపై నువ్వు

భుమాతకే బరువు నువ్వు

సత్ప్రవర్తనతో నడుచుకో

లేదా కనుమరుగైపో...

కానీ...., దుర్మాగుడిలా మాత్రం నేలపై మిగిలిపోకు

ఆడపిల్ల అంటే నీకెందుకు అంత చులకన

నిన్ను ప్రాణమనుకుంది గనుకన?

ఒక్కసారి ఆలోచించు మనిషిలా

ఆ ధీరవనిత లేనిది నీవున్నావా అని?

ఆ స్త్రీ అంతరంగం నీకు అర్దమవుతుంది.

నువ్వు వేసే ప్రతీ అడుగు వెనకాల నీడలా తానుంది

నీ చిరునవ్వు వెనకాల ఆమె రూపం దాగి ఉంది

నీ కష్టం వెనకాల తోడుగా ఆమె ఉంది

అసలు.... ఒక్కమాటలో చెప్పాలంటే

నీ బ్రటుకును చరితార్థం చేసింది ఆమె

ఆమె లేనినాడు నీవు లేవు

ఈ లోకమే లేదు...!

 

ఈ క్షణం

ఈ క్షణం ఇలాగే

ఊపిరాగిపోతే బాగుండని

తపన పడుతున్న

మనసు అర క్షణమైన

ఆలోచించట్లేదు

నువ్వు లేని మరుక్షణం

నిన్ను తలిచే వారుండరని,

కన్నీటి బొట్టైన కార్చరని ,

ఊహల్లో కూడా ఉండవని,

ఈ జన్మకేదో అర్దం ఉంది

కానీ, అర్ధరహితంగా,

అర్ధాంతరంగా,

ఆశ్చర్యంగా,

అవనిని చేరుతానంటున్న

అలోచన మాత్రం

అర్ధం అవ్వడంలేదు.

నలుగురికి నవ్వు  పంచి,

పలువురికి ప్రేమను పంచి,

మంచి నడవడిక నేర్పి,

నాలుగు గోడల మధ్య నుండి

దారి తెలియని లోకంలోకి

వెళ్తానంటున్న

ఆ ధర్మాత్మురాలి బాధ

నీకెలా తెలుస్తుంది

నీవెప్పుడు తన సంతోషాన్ని

మాత్రమే కదా పంచుకుంది

గుండెల్లో ఉన్న గాయాన్ని

నీవెప్పుడు చూసావని

అయినా నీకెలా తెలుస్తుంది

ఆ గాయానికి కారణం నీవేనని

తను ప్రేమను మాత్రమే

పంచగలిగింది

కానీ, ఆ ప్రేమకు నీవు

అర్హుడివి కాదని

తెలుసుకోలేకపోయింది

అందుకే.., ఇప్పుడు

తన దేహం మాత్రమే జీవిస్తుంది

మనసేనాడో మట్టిలో కలిసింది....!   

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు