1
ఎవరివో ఈ పాదముద్రలు?
దారిపొడుగూత చెమట చుక్కల సంతకం చేస్తూ
కాలిబాట పట్టాయి
నెత్తిమీద ముల్లెమూటలను సంకలో పిల్లజెల్లలను ఎత్తుకొని
గుంపులు గుంపులుగా పయనమయ్యాయి
గనులు భవనాలు కార్ఖానాలను
కాంక్రీటు ఇసుక ఇటుక బట్టీలను వొదిలి
పల్లెలను పట్టణాలను నగరాలను ఖాళీచేస్తూ
తప్పిపోయిన దారులను వెతుక్కుంటున్నాయి
2
ఏం రోగమో ఇది?
ఆకలి కన్నా పెద్దమాయ రోగం
ఈ భూస్థలమంతా వెతికినా దొరకదు కదా??
గూడు చెదిరిందో గుండె పగిలిందో?
రోజంతా పగలు రాత్రుళ్ళను కప్పుకుని
బిక్కుబిక్కుమంటూ నేలచూపులు చూస్తూ అడుగులేస్తున్నాయి
నడిచి నడిచి పాదాలన్నీ చిట్లిపోయినా
కళ్ళల్లో ఏవో ఆశల వొత్తుల్ని వెలిగించుకుని ముందుకు నడుస్తున్నాయి
3
నడక
నడక
ఎడతెగని నడక
వందల వేల కిలోమీటర్ల నడక
పాదాలన్నీ నెర్రలుబారిన నడక
ఆకలిని దప్పికను మరిచిన నడక
ఈ దేశపు ముఖచిత్రాన్ని నిలబెట్టిన నడక
వాళ్ళకు నడక కొత్తేమీ కాదు
ఏండ్లతరబడి ఆ చివరి నుండి ఈ చివరి వరకు-
ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎప్పుడూ నడుస్తున్న నడకనే కదా?
వాళ్ళను అలాగే నడనివ్వండి,దయచేసి ఆపకండి
4
పగిలిన పాదాలు
మట్టిని చీల్చకముందే వాళ్ళను వెళ్ళనివ్వండి
మాసిన ముఖాలు
మట్టిలో తెల్లారకముందే వాళ్ళ గడపను చేరుకోనివ్వండి
బతుకుపాఠంలో మళ్ళీ కొత్త కలలకు ఊపిరి పోసుకోనివ్వండి