రాల్చిన ఆకులను
చిగురు తొడగించ వచ్చిన కాలప్రవాహినివో
వెతల రాత్రికే వేకువ పాడి
వ్యథల ఆర్తిని
తొలగింపవచ్చిన
కాల ఫలానివో
ఓ "శార్వరి" నీ ఆగమనం
మానవతకు వేయాలి అందలం
మానవాళికి కావాలి ఆనందం
భ్రాంతులన్ని విడిపోయే
కాంతులెన్నొ చెలరేగి
జగం జగం ప్రణమిల్లే
యుగం ఒకటి స్ఫురించాలి
ఓ "శార్వరీ"
ఈ యుగాది వేళ
మా జీవితాలకు
షడ్రుచులే కాదు
అమృతాలను అందించు
యువశక్తు ల గుండెలలో
నవ శక్తులు ప్రసరించు
కర్షకుల నెత్తురు ఫలించి
కార్మికుల కష్టం తరించి
పాడిపంటలు సుఖ భోగాలు
లోకమంతా వరించాలి
ఓ "శార్వరీ" నీ రాకతో
స్త్రీ వేదన పోవాలి
నేలంతా "శ్రీ"మయం కావాలి
ఎలకోయిల ఎలుగెత్తి
స్వస్తి స్వస్తి స్వస్తి అని
పంచమమై కూయాలి