మా రచయితలు

రచయిత పేరు:    చిన్నీ

కవితలు

కన్నీరు 

ఈ రోజు పెసరట్టు తిన్నా

నిన్న బొబ్బట్టు తిన్నా

రేపు కోడిగుడ్డు అట్టు తింటా

 

 

పాపం ఎక్కడో దూరాన

గర్భిణీ స్త్రీ తిండి కొరతతో

ఒక పూట పస్తులున్నది

 నా గుండె కదిలింది

మనస్సు చెలించింది

కన్నీరు  కంట కారింది !

 

ఎన్నెన్నో 

పసికందు నుంచి పండు ముసలిదాక

అమ్మ అక్క చెల్లి అన్న వరసలు మరిచి

చిన్న పెద్ద అన్న తేడాను విడిచి

స్వేచ్ఛను తుడిచి

ఊర కుక్కల వలె కరిచి

శవాన్ని కూడా వదలని

ఎన్నో ఉదంతాలు సంఘటనలు

 

కొవ్వొత్తుల ర్యాలీలు

దారిపొడగు నిరసనలు

మీడియా స్క్రోలింగ్లు

ప్రభుత్వపు పనికిరాని చట్టాలు

చేతిలో బ్యానర్లు

నోటి మాట నినాదాలు

మర్నాడు యథావిధి బ్రతుకులు

 

ఈలోగా మళ్ళీ రోజుకో గంటకో నెలకో

ఇలా ఎన్నో ఎన్నెన్నో

వెలుగులోకి రాని ఘటనలు.

 

 

ఓయ్ కూలి

ఓయ్ కూలి

ఏం పని చేస్తావ్ ?

బరువులు మొస్తా

ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ?

ఖాళీ ....!

ఎక్కడి నుంచి వస్తున్నావ్ ?

ఇంటి దగ్గర నుంచి

ఎక్కడికి వెళ్తున్నావ్ ?

ఇంటికి...!

ఎక్కడ ఉంటావ్

ఇంట్లో.....!

ఇల్లెక్కడా ?

నేన్ ఎక్కడ బ్రతికితే అక్కడ.

తల పైన ఏముంది ?

బరువు...!

ఆ బరువేంటి ?

నా కుటుంబం...!

 

 

 

 

గొంతు దిగదు !

నా ఆనందం వర్ణించలేనిది

రూపాయి ఇంకమ్ లేకపోయినా

రోజుకి ఒక్కసారైనా కాగితం పైన

ఇంక్ పెట్టనిదే కంచంలోని ముద్ద

గొంతు దిగదు !

చిన్ని కవితలు  ఐదు

1

మందలో మంద

మందలో మంద

అందులో నేనొక్కడినీ నా బొంద

ఏదో బతికేస్తున్నాను మీ ముందర

ఏదేమైనా అన్యాయంపై గొంతు పెగలదు నా బొంద

నాకు కావాల్సింది బడా బాబుల అండ

రోజు మూడు పూటలా అన్నం కుండ

మందలో మంద

బురద రాజకీయాలే నా మొహం నిండా

అయినా కడిగేసుకుంటాను సిగ్గు లేకుండా

మందలో మంద

ఎవడు ఎటుపోతే ఏంటి నా బొంద

నా ఏడ్పు నేను ఏడుస్తా ముండ

మందలో మంద

పెంట కుప్పపైన నా కొంప

అయినా సరే కొడతాను అత్తరు నా దేహం నిండా

గుంజకు ఏలాడేదే నా స్వాభిమానం అంట

ఛీ సిగ్గులేకుండా

మంద వెనుక తిరగేస్తాను ఊరినిండా

మందలో మంద నా బొంద

నేను చచ్చాక పాతేస్తారు పెద్ద బండ

దానిపైన మెరిసిపోతుంది పూల దండ !

2

ఎన్నాళ్ళు

 

ఎన్నాళ్ళు ఏడుద్దాం ?

ఎన్నాళ్ళు బరిద్దాం ?

ఎన్నాళ్ళు సహిద్దాం ?

అలవాటై పోయింది

కన్నీళ్ళను దాచిపెట్టు

మరో మగువకోసం

మన ఆవేశాలు కోపాలు

ఫేసబుక్ పోస్ట్లకి వాట్సప్ స్టేటస్లకే పరిమితం

ఏం చేస్తాం ? ఏం చేయగలం ?

ఇంకెన్నాళ్లకు కలుగుతుందో

మానవ మృగాలకు విచక్షణం

ఇంకెన్నేళ్లకు కళ్ళు తెరుస్తుందో ప్రభుత్వం

3

పరదా లేని బ్రతుకులు

 

పరదా లేని బ్రతుకులు

గంజి కూడు మెతుకులు

ఎండి పోయిన గొంతులు

పాపం వరుణ దేవుడు కరుణించాడు

కష్టజీవి కుటీరాన్న వడగళ్ల వాన కురిసింది

పై కప్పు రంధ్రం కులాయిగా మారే

నీరంతా సంద్రంగా చేరే

వరద అనే బురదలో ఇళ్లనే గొడుగు కొట్టుపోయే !

4

మీనింగ్ లెస్ !

పేదోడి ఆత్మహత్య

పేపర్ వాడికి యూజ్ లెస్

గొప్పోడి ఆత్మహత్య

ప్రభుత్వానికి ప్రైజ్ లెస్

నిరుద్యోగం నిటారుగా

ఆకాశానికి నిచ్చెన వేసింది

కదిలే కాళ్ళను చచ్చుబడేలా చేసింది

కరోనా మై హూ నా అంటూ అందరిని కౌగలించింది

రూపాయి రూపాన్ని కాల్చింది

రేపటి ప్రగతిని పీల్చింది

బ్రతికే తీరుని మార్చింది

బ్రతుకులను రోడ్డుకు ఈడ్చింది

ఇలాంటివి మీడియాకి

అటెన్షన్ లెస్

అలాంటి మీడియా నా దృష్టిలో మీనింగ్ లెస్ !

5

ఆడపిల్ల

తనో ఆడపిల్ల

వీధుల్లో అంగడిబొమ్మ

తన గుండె గుప్పిట్లో

తన ఒళ్ళు వెయ్యి కళ్ళల్లో

తను నడిచే దారి ఈలలతో

తనపై చేసే దాడి మాటలతో చేతులతో కత్తులతో

నిత్యం రోజు చస్తూ బ్రతికే తాను

ఒకరికి అమ్మ

ఒకరికి భార్య

ఒకరికి అక్క

ఒకరికి చెల్లి

ఒకరికి స్నేహితురాలు

మనలాగే తనో సాటి మనిషి

 

 

పాత గణితం

అదిగో చూడు భాగ్య నగరం

ప్రకృతి సృష్టించిన వరద భీభత్సం

మూసీ నది పోంగిన తరుణం

రోడ్లు మురికి కాలువలా మారిన వైనం

తల నిండా మునిగే నీటి గుండం

బస్తీవాసులపై పడ్డ పెద్ద గండం

అయితేనేం ఉందిలే నష్ట పరిహారం

అని మా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పే పాత గణితం

అది వొంగి వొంగి ఓట్ ఏసినందుకు మాకు ఇచ్చే బహుమానం !

అంబేడ్కర్

తను అస్తమించని సూర్యుడు

నిరంతరం జ్వలించే సూర్యుడు

కులం అర్ధం లేని పదం

అని తన కలంతో ఖండించిన వీరుడు

తను తిరుగుబాటుదారుడు

మాటే ఆయుధంగా

సమానత్వమే ధ్యేయంగా

అంటరానితనం అణిచివేత కార్యాలను

సమాధి చేసే దిశగా పయనించిన నెలబాలుడు

మతం హితం కాదని

జననం నుంచి పుట్టే ధర్మం

జన ఆరాధన పొందలేదని

జనియించిన వాడి పుట్టు పూర్వతరాలే అసమానతగా

అడ్డ గోలుగా అడ్డ గోడగా పెరిగే సమాజంలో

సామాజిక నడవడికతోనే నేల మట్టం చేయగలమని

ఎలుగెత్తి చాటి చెప్పిన గొప్ప తత్వ వేత్త

తను తిరుగుబాటు దారుడు

జననీ నుంచి పుట్టిన జన్మ

జన్మాంతం స్వేచ్ఛ కోరుతుందని అది దాన్ని హక్కు

ఆ హక్కు కోసం తన మరణాంతం వరకు పోరాడిన వీరుడు !

 

 

 

 

ఏం మారింది?

అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది

మారిందా ?

మార్చావ ?

మారావ ?

ఏనాడైనా అలోచించావా  ?

నువుంటున్న సమాజంలో నువ్వంటున్న సమాజాన్ని

నీ చుట్టూ ఉన్నవాళ్ళని

నీ చుట్టూర చేరినవాళ్ళని

నువ్వు చుట్టిన వాళ్ళని

చుట్టూ చుట్టూ ఒకరి చుట్టూ చేరి

ఒకరికొకరం చుట్టు కొలతలా మారి

తిట్టుకొని కొట్టుకొని పోగొట్టుకొని

చూసినవెన్నో చూడనివెన్నో

చేసినవెన్నో చేయనివెన్నో

ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదోరకంగానో

నువ్వు నేను మనమందరం

బాధపడిన వాళ్ళం

బాధపెట్టిన వాళ్ళం

బాధ్యులం

బాధితులం

 

ఈ సమాజానికి

ఈ సమాజానికి నువ్వా - నేనా కాదు

నువ్వు నేను కావాలి.

బలం - బలహీనత కాదు

భాద్యత కావాలి.

సొంతం - పంతం కాదు

చెడు పై అంతం కావాలి

My dear comrade

You are a dynamite

Make your path wide and bright

Decide and activate

The power within you

For a better visionary side

And make the country pride.

           

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు