అధరణ తాపడం చేయబడ్డ చేతులు
ఆ తనువు అణువుల్లోంచి
జాలువారే నమ్రత..భావాల నాన్యత
అనుభూతుల సౌకుమార్యం..మమతల సోయగం
అవ్యక్త సౌందర్య మామెది
ఊపిరి నింపి..జగతినంతా ఎత్తుకు ఆడించిన
బ్రహ్మణి తాను
రోజూవచ్చే తొలి మలి సంధ్య వర్ణాల్ని
సరికొత్తగా పరిచయం చేస్తుందామె
దారమై అనుబంధాల పువ్వుల్ను గుదిగుచ్చే
నేర్పుల ఓర్పుల పల్లకి..మమకారాల పాలకంకి
చూడగలిగితే..నిండుగా ప్రవహించే ఆవేదనలు..
అచ్చాదన లేని ఆ మనసు పరిచే ఉంటుంది
ఆ అభిమానాల సృజన శీలిపై
దాడులు..ఆకృత్యాలు..అల్లరులు
ఆనందాలను లెక్కకట్టుకుంటూ
లోటును పూడ్చుకునే క్రమంలో భంగపడి
అందిపుచ్చుకోలేక
ఆమె అడుగుల్లో..ఆమెను పొందనీక
ఆ మనసుకెన్నిసార్లు సిలువ లేసారో..
లెక్కలెవరు కట్టగలరు..?
ముద్రల్ని మోస్తూన్న
ఆ అడుగుల భారాన్ని ఎవరు తూచారు..?
అదో..ఆచూకీ లేని వెతల ఉనికి..!
ఎన్నో..బలత్కార శిశిరాలను భరించిన
ఆ చెట్టుపై ఎన్ని బంధాల పక్షులు వాలినా..ఇంకా పొదుపుకుంటూనే
కలలు చిగుళ్ళేస్తుంటుంది
సాకాలపు ఫలాలు రాకనే..రాలి నేలపాలౌతుంటాయ్
అపుడపుడూ
ఆ ఆశయాలన్నీ భయం లోయలో పడి
ఆనవాళ్లు కోల్పోతుంటాయి
మళ్ళీ ఆశల బొమ్మల కొలువును
అతి నేర్పుగా పెట్టుకుంటుంది
అలుసుచేసి అగ్గువచేసిన ప్రతిసారీ
వెక్కిళ్ళు పెడుతూ..బద్దలవుతూనే..కట్టుకుంటుంది
గుహలను గృహాలుగా మలచిన
ఆమె వెంటే..నడచిన ఒకనాటి మానవ సమాజం
అంచెలంచెలుగా చేజారిన..ఆ మాతృస్వామికం
ధూషణల తిరస్కారాల ముళ్ళు గుచ్చి గాయం చేస్తున్న
ఆ ఆధిపత్యపు అంపశయ్యపైనే తను
నరుక్కుంటున్న..తాము కూర్చున్న కొమ్మ ఆమేనని
వాళ్ళకింకా తెలియదు
ఊపిరి సలపనీయనీక ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
పరిది పరిమితుల నుంచీ...
కఠిన కచ్చడాల నుంచీ..
ఇనుప కౌగిళ్ళనుంచీ..
తనను తను విముక్తించుకుని..
తన వేదనల అగాధాలను
అంచనా వేసుకోవడం.. ఇపుడిపుడే నేర్చుకుంటోంది
తన జీవన మడిలో..తనకోసం
కాసిన్ని చిరునవ్వుల నారును నాటుకుంటోంది