గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సిరికి స్వామినాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి ?
గురజాడ పుట్టిన నేల. విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక బొబ్బిలి సమీపంలో వేగావతీ నదీతీరాన ఓ మారుమూల గ్రామం , ' కుసుమూరు ' అగ్రహారం నా పుట్టినూరు . 1972లో ఓ సామాన్య రైతు కుటుంబంలో ఏకైక సంతానంగా పుట్టాను. అమ్మ ' గౌరమ్మ '. నాన్న ' సత్యం నాయుడు '. పొట్టలో అక్షరంముక్క లేకపోయినా పిడికెడు మట్టితీసి యిక్కడ ఏ పంట పండుతుందో చెప్పగల శాస్త్రవేత్తలు . నేనేడాది బిడ్డగా ఉన్నపుడే అమ్మా నాన్నా ఎడబాటు కావటం, పద్నాలుగేళ్లకు అమ్మను నాన్నను కలపడం, పదిహేనేళ్లకు తండ్రిని కోల్పోవడం, మళ్లీ తండ్రిలేని జీవితాన్ని గడపడం, నా బాల్యమంతా కష్టాలతోనే గడచింది ! గాబు తీసేటపుడో .. గొప్పు తవ్వేటపుడో .. అమ్మ కళ్ళల్లో కన్నీటి చారల్ని చూసాను. అద్దెకు బండిపూసి, బస్తాలు వీపున మోసీ, బండి పర్రానికి ఎక్కించేటపుడు నాన్న వీపున నెత్తుటి మరకల్ని చూసాను. నాగేటిచాళ్ల మీద నడకనేర్పిన నాన్న వెళ్లిపోయాక అమ్మే రేయింబవళ్లు పొలాన కష్టపడి, అన్నిటా తానై నన్నీ స్థాయికి చేర్చింది. మగదిక్కు లేక పొలాన నీరు కట్టడానికి నడిరాతిరి పీకడులోతు నదిని దాటుకుంటూ అమ్మకు తోడుగా వెళ్లడం, ఆడుకునే వయస్సులో అమ్మతోపాటు పొలాన తారెలు తీయడం, ఆకుబట్ట దున్నడం, గడ్డికోస్తూ వేళ్లు తెగ్గోసుకోవడం, బహుశ ఇవన్నీ నా అంతరాంతరాలలో నిక్షిప్తమై బయటకు చెప్పుకోలేని బాధ ఏదో లోలోపల సుడులు తిరుగుతూ కవిగా నేను రూపాంతరం చెందడానికి దోహదపడ్డాయేమో ! ప్రాధమిక విద్యంతా పెదపెంకి తాతగారింట సాగింది . ఉన్నత విద్య వంతరాం, నందబలగ లలో సాగింది. ఇంటర్మీడియట్ బలిజిపేటలోనూ, డిగ్రీ బొబ్బిలి రాజా కళాశాలలో పూర్తిచేసి, టీచర్ ట్రైనింగ్ గుంటూరులో చేసాను. 1997 నుండి సిక్కోలు గిరిజన రైతాంగ పోరాట ప్రాంతమైన ఏజన్సీప్రాంతంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం పార్వతీపురం లో 2009లో స్థిర నివాస మేర్పరుచుకొని నివసిస్తున్నాను. భార్య అరుణ, పాప శివాని గాయత్రి, బాబు నిఖిల్. సంతృప్తికర జీవితం. చాలు.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి ?
నా బాల్యమంతా పెదపెంకి తాతగారింట గడచింది. మేనమామల వామపక్ష భావజాలం చిన్ననాడే లీలగా పరిచయమైంది . ఆరోజుల్లో వంగపండు ప్రసాదరావుగారి ' భూమిభాగోతం ' స్పూర్తిని కలిగించింది. 1997లో ఉద్యోగరీత్యా వేగావతీ నదీతీరం నుండి నాగావళీ నదీ తీరానికి వలస వచ్చేను. అప్పటికి నాకింకా సాహిత్యంతో పరిచయంలేదు. 1999లో ప్రముఖ కథారచయిత , కవి గంటేడ గౌరునాయుడు మాస్టారి పరిచయం నా సాహితీ గమనాన్ని మలుపు తిప్పింది. ప్రతీరోజు సాయంకాలం నాకు సాహితీ పాఠాలు బోధించేవారు. నేను మొదటగా చదివిన కవితా సంపుటి ' తోవ ఎక్కడ ' నారాయణ స్వామిది.
మా ' స్నేహ కళా సాహితి ' శనివారపు సాయంత్రాల చర్చల్లో గంటేడ ప్రసంగాలు , స్నేహ కళా సాహితీ మిత్రుల సహకారం నా కవితకు పదునుపెట్టాయి . . ప్రముఖ కవుల పుస్తకాలిచ్చి చదవమనేవారు , కవిత రాయించేవారు. రాసింది సరిదిద్దేవారు. మందలించేవారు. నేను కన్నీళ్లు పెట్టుకుంటే ' నీ ఎదుగుదల కోసమే కదరా .. అంటూ ఓదార్చేవారు. కవిగానే కాదు , మనిషిగా నాలోని లోపాలు ఎత్తిచూపి నా చిటికెనవేలు పట్టి బతుకుదారుల్లో నన్ను నడిపించింది గంటేడ గౌరునాయుడు మాస్టారే . ' ఒరే .. కీర్తి కోసం నీవు ప్రాకులాడినన్నాళ్లూ అది నీ దరికి రాదు . నీబాధ్యతని నీవు నిర్వర్తించుకుపో.. కీర్తి నీ వెనకాల కుక్కలా వస్తుందనేవారు. ఆ మాటలు శిలాక్షరాలై ఇప్పటికీ నన్ను హెచ్చరిస్తున్నట్టే ఉంటాయి. నాటినుండి కవిత్వమే నాకు ప్రాణమైంది. కష్టాలలో కవిత్వమే నాకు తోడయింది . మనోమాలిన్యాల్ని తొలగించి మనిషిగా నిలబెట్టింది . తరువాత నాకు స్పూర్తినిచ్చి , ఇంత ప్రేమనిచ్చి పుత్ర వాత్సల్యంతో సాకి ప్రోత్సహించింది కె శివారెడ్డి గారు. ఆయనను ఇప్పటికీ నా కుటుంబానికి పెద్దదిక్కులా భావిస్తాను. ఏ కష్ట సుఖాలైనా ఆయనతో పంచుకుంటాను. నాన్నా... అని పిలిచేంత చనువు ఆయనతో. గంటేడ , అట్టాడ, శివారెడ్డి గారు నన్ను ప్రభావితం చేసిన రచయితలు. గురువులు ఎన్ . గోపి , దేవీప్రియ, శీలా వీర్రాజు , సుగంబాబు , శిఖామణి , ఆశారాజు , కొప్పర్తి , చినవీర భద్రుడు , దర్భశయనం , భగ్వాన్ , అడిగోపుల వంటి కవుల నుండి చాలా నేర్చుకున్నాను. రాచపాళెం , సింగమనేని , కీశే " ఆవంత్స సోమసుందర్ , అద్దేపల్లి రామ్మమోహన్ రావుగార్లు చూపిన వాత్సల్యం మరచిపోలేనిది .
3. మీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి ?
కళింగాంధ్ర ఒక పోరుభూమి . తక్కిన నేలంతా చీకట్లో మునిగిపోయినపుడే యిక్కడ వేయి వేకువల వెలుగు ప్రవహించింది. తూరుపువాకిట నెత్తుటి కళ్లాపి చల్లి బలిదానాల తోరణాలు వేలాడదీసింది . కొత్త ఉదయాల్ని రాబోయే తరాలకు అందివ్వాలనీ యీ నేల నిత్యం కలలు కంటోంది . గత కొన్ని దశాబ్దాలుగా యీ కళింగాంధ్ర మట్టిమీద జరుగుగుతున్న పరిణామాలు, యిక్కడ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. అభివృద్ధికి ఈ నేల ఏనాడూ వ్యతిరేకం కాదు. కానీ అదే సమయంలో అభివృద్ధిపేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని సహించదు. ఏదో ఓ రూపంలో నిరసిస్తూనే ఉంటుంది. నినదిస్తూనేఉంటుంది. ఎక్కుపెట్టిన విల్లమ్ములు ఏ చేయీ దించొద్దని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఛిధ్రమైపోతున్న పల్లెలూ, శిథిలమైపోతున్న గ్రామీణ జన జీవితాలూ, అంతరించిపోతున్న సంస్కృతీ సాంప్రదాయాలు, కొండల్నీ గుట్టల్నీ కొల్లగొట్టే బాక్సైట్ తవ్వకాలూ, పవర్ ప్లాంట్లూ పారిశ్రామిక వాడలూ, కోస్టల్ కారిడార్లూ, విమానాశ్రయాలు, నిర్బంధపు భూసమీకరణాలూ, ఇలా నా ప్రాంతపు ఉనికి ఒక కుదుపుకు లోనవుతోంది. ఏ తరానికా తరం సంక్షోభాల అంచుల్లో కూరుకుపోతోంది . ఆయాప్రాంతపు సంక్షోభాలే అక్కడ కవుల్నీ రచయితల్నీ తయారుజేసుకొని, సాహిత్యాన్ని సారవంతం చేయడమే కాదు పోరువంతమూ చేసుకుంటాయి. ఉద్యోగరీత్యా ఉత్తరాంధ్ర లోవముఠా అటవీప్రాంతంలోని గిరిజనగూడేలలో పనిచేయడం వలన ఆదివాసీ జీవితాల్లోని అలజడిని పసిగట్ట గలిగాను. తీరప్రాంతపు జాలరి వాడల్లోని ఆటుపోటుల్ని చూసాను. పచ్చనిమైదానాలమీద పడగనీడల్ని చూసాను . నా చుట్టూ ఆవరించి ఉన్న అనేకానేక సంక్షోభాలూ, అంతరించిపోతున్న మానవ సంబంధాలూ సంవేదనలూ చూసీ గుండెల్లోపొగిలే దుఃఖాన్నీ వేదననూ వెల్లగక్కేటందుకు కవిత్వం నాకు అనివార్యమైంది. గురజాడ నుండి రావిశాస్త్రి , చాసో , పతంజలి , కారా , భూషణం , అట్టాడ , గంటేడ వంటి కథకులు , గురజాడనుండి శ్రీశ్రీ , నారాయణబాబు , ఛాయరాజ్ , గంటేడ వంటి కవుల సాహితీ వారసత్వం అందిపుచ్చుకున్నాను. అప్పటికే ఈ నేలమీద జరుగుతున్న దోపిడీని తమ రచనల్లో చెప్పి, నాకు మార్గం చూపారు. అ దారుల్లోనే సాహితీ పయనం సాగేందుకు నిర్ణయించుకున్నాను. మందస రైతుయాత్ర, శ్రీకాకుళ గిరజన రైతాంగపోరాటం మొదలు నిన్నమొన్నటి కాకరాపల్లి మత్స్యకారుల, కన్నెధార గిరిజన పోరాటాల వరకూ సాగిన వెనుకటి తరాల పోరాటాలు గొప్పస్ఫూర్తినిచ్చాయి. యీ ప్రాంతపు అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు కవిత్వం నాకు ఆయుధమైంది. యింకా ఎడతెగని దుఃఖమేదో వెంటాడుతూనే ఉంది. ఉందామన్నా యిక్కడ మట్టి నన్ను మౌనంగా ఉండనీయదు.
4. మీ రచనల గురించి చెప్పండి ?
2011 లో ' మంటి దివ్వ ' కవితా సంపుటితో కళింగాంధ్ర మౌళిక సమస్యల భూమికతో వచ్చాను . చెప్పాల్సింది ఇంకా ఉందనిపించింది . నిలబడ్డ నేలమీద ఇంత దుఃఖాన్ని మోస్తూ ... కడుపునిండిన భావ కవిత్వాన్ని చెప్పలేకపోయాను. అందుకే గుండె పగిలే యీ నేల దుఃఖాన్ని, వేదనల్ని కవితగా రూపు కడుతూ 2018 లో ' మట్టిరంగు బొమ్మలు' కవితాసంపుటితో వచ్చాను. సాహితీలోకం ఆదరించింది. కొంత ఉపశమనం దొరినట్టయింది. 2021 లో నూతన కవితాసంపుటితో కొత్తగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను .
5. మీ మొదటి రచన ఏ సందర్భములో వచ్చింది ?
నా మొదటి రచన కవిత " మట్టి ఆతని చిరునామా " రైతు నేపథ్యంలో కవిత సాగింది . ఇది 1999 డిసెంబర్ 31 వ తేదీన శ్రీకాకుళ సాహితి అవిష్కరించిన ' జముకు ' కవితా సంకలనంలో వచ్చింది. మహాకవి శివారెడ్డి గారు ఆవిష్కరించారు. ఆ రోజు శివారెడ్డిగారి చేతులమీదుగా పుస్తకం అందుకున్నాను. గొప్ప జ్ఞాపకం.
6. తెలుగు సాహిత్యంలో ఉత్తరాంధ్ర సాహిత్య స్థానం ఎక్కడ ఉంది ?
తెలుగు సాహిత్యంలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఇవాల సముచిత స్థానంలోనే ఉంది . ఆయా ప్రాంతాల అస్థిత్వాన్ని ఆయా ప్రాంతపు రచయితలు బలంగానే చెబుతున్నారు . ఉత్తరాంధ్రకి వచ్చేసరికి గురజాడ నుండి రావిశాస్త్రి , చాసో , పతంజలి , కారా , భూషణం , అట్టాడ , గంటేడ వంటి కథకులు , గురజాడ , శ్రీశ్రీ , నారాయణబాబు , ఛాయరాజ్ , అల, గంటేడ వంటి కవులు, వారి సాహితీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నూతన తరం బలంగా తమ గొంతును వినిపిస్తున్నారు. కథ ఈ ప్రాంతపు అస్థిత్వాన్ని బలంగానే చెప్పింది. కానీ కవిత్వానికి వచ్చేసరికి శ్రీశ్రీ , నారాయణబాబు తర్వాత భారీ ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని పూరిస్తూ ఛాయరాజ్, అల వంటి వాళ్లు వచ్చారు వారి దారుల్లో యిపుడు కవిత్వం ఈ ప్రాంతంనుండి చాలా బలంగా నిర్ధిష్టంగా వస్తోంది.
7. ఇప్పుడు వెలువడుతున్న ఉత్తరాంధ్ర సాహిత్యం ప్రత్యేకతలు ఏమిటి ?
సమస్యలమీద స్పందించటమే ఉత్తరాంధ్ర సాహిత్యపు ప్రత్యేకత. వలసలు , పేదరికము , వనరుల దోపిడీ , భూమి పరాయికరణ, ఉద్దానం మూత్రపిండాల రోగాలూ ఇత్యాది సమస్యలపైన ఉత్తరాంధ్ర రచయితలు కలమెత్తుతున్నారు .. అన్నిటికంటే ఈ నేలమీద ప్రేమతో ఒక నిబద్దతతో రచనలు చేయటం ఈ ప్రాంతపు ప్రత్యేకత . ఉత్తరాంధ్ర రచనల్లో మట్టివాసన ఉంటుంది. తరగని కన్నీటి వేదనుంటుంది.
8. అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్ర లో జరుగుతున్న వనరుల విధ్వంసంను సాహిత్యం ఎలా ఎత్తి పట్టింది ?
ఉత్తరాంధ్రలో కొదువలేని సహజ వనరులున్నాయి. అపారమైన అటవీ సంపద ఉంది. సారవంతమైన మైదాన ప్రాంతముంది . విస్తారమైన సముద్ర తీరముంది. నాగావళి , వంశధార , జంధ్యావతి , వేగావతి , చంపావతి , గోస్తనీ వంటి జీవ నదులున్నాయి. అయినా ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉంది . నిక్షరాస్యత , పేదరికంతో ప్రజలు నిత్యం బాధపడుతుంటారు. అందుకు ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యం , వనరుల దోపిడి . అభివృద్ధి పేరుతో పెను విధ్వంసం. సారవంతమైన భూములున్నా .. ఒకనాడు నీటి సదుపాయం లేక కరువు కాటకాలతో ఈ నేల అల్లాడిపోయింది. వర్షాధారంమీద ఆధారపడటం వలన పంటలు పండక, భూములున్నా బీళ్లుగా ... గుండెలమీద భారంగా మారిపోయే సందర్భం. ఇదే అదునుగా వలస వచ్చిన పెట్టుబడి మా భూముల్ని కొల్లగొట్టింది. భూమి పరాయికరణ చెందింది. ఏ భూమి మీద రైతుగా బతికాడో అదే నేలమీద ఇవాల రైతుకూలీగా పనిచేస్తున్నాడు. తోటపల్లి , వంశధార. జంధ్యావతి వంటి ప్రాజక్టులు వచ్చినా .. నూతన వ్యవసాయ పద్ధతులు , వాణిజ్యపంటల సాగు విధానం వచ్చినా .. ఇపుడు భూములు మా రైతుల చేతుల్లో లేవు. పెట్టుబడిదారుల పరమైపోయాయి. ఇపుడీ పచ్చదనం మాదికాదు. అందుకే అప్పుల పాలై ఇక్కడ రైతులు కుటుంబాలతో సహా వలసబాట పడుతున్న విషాద సందర్భం ఇవాల ఉంది. హైదరాబాద్ , చెన్నై , విజయవాడ , ఎక్కడైనా చూడండి .మా ఉత్తరాంధ్ర వాసులే భవన నిర్మాణ కూలీలుగానో , కోస్తాతీరంలో రైతుకూలీలుగానో కనిపిస్తారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అందులో మా ఉత్తరాంధ్ర వాసులుంటారు. బాక్సైట్ తవ్వకాలతో పచ్చనికొండల్ని, అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఆదివాసీలు జీవనోపాధి కోల్పోయి వలస కూలీలుగా మారిపోతున్నారు. పర్యాటక ప్రాంతం పేరుతో అభివృద్ది అంటూ వచ్చి అరకు , పాడేరు లాంటి అందమైన ప్రాంతాలలో ఆదివాసీ యువతని ప్రలోభాలతో లొంగదీసుకుంటున్నారు. ఇవాల అక్కడ ఎయిడ్స్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. అలాగే ఇంకోపక్క కోస్టల్ కారిడార్ పేరుతో మత్స్యకారుల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. ప్రగతి చక్రాల కింద ఉత్తరాంధ్ర నలిగిపోతోంది .ఈ విధ్వంసాన్నే ప్రధానంగా ఉత్తరాంధ్ర సాహిత్యం ఇవాల ఎత్తిచూపుతోంది.
9. రావిశాస్త్రి , భూషణం , అట్టాడ అప్పలనాయుడు , కారా , గౌరునాయుడు , బజరా లాంటి గొప్ప కథకులు ఉత్తరాంధ్ర నుండి రావడానికి గల కారణాలు ఏమిటి ?
ఏ నేల మీద సంక్షోభం , దుఃఖమూ ఉంటుందో ఆ నేల మీంచి ధిక్కార స్వరాలు వినిపిస్తాయి . గాయపడ్డ గాధలు వినిపిస్తాయి. భూమి పరాయికరణ చెందడాన్ని మొదటగా గంటేడ తన కథల్లో చెప్పారు. ఈ నేలమీద జరుగుతున్న వనరుల దోపిడీని అట్టాడ, బజరా వంటి కధకులు చెబుతున్నారు. పెట్టుబడి మా ప్రాంతంమీద విరుచుకు పడుతోంది. కాళ్లకింద నేల కదలబారుతోంది . అభివృద్ధిపేరుతో విద్వంసం రాజ్యమేలుతోంది. మా సంస్కృతీ సాంప్రదాయాలు , ఆచారాలు , పండగలు పున్నాలు, అన్నింటపైనా ఒక దాడి జరుగుతోంది. ఉత్తరాంధ్ర తలమానికమైన విశాఖపట్టణం మాది కాదిపుడు . ఎక్కడినుండో వచ్చిన పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మా జీవితమక్కడ లేదు. మా విశాఖ మాకివాల పరాయిదయింది. మా యాసంటే చులకన . సినిమాల్లో పనిమనుషులు , పాలేర్లచేత మా యాసను పలికిస్తున్నారు. యాస మా జీవనాఢి. మా కట్టూబొట్టంటే చిన్నచూపు. ఇవాల మా ఉనికిని మేము కోల్పోతున్నాం. ఈ నేపధ్యంలోంచే ఒక నిబద్ధతతో రచయితలు , కవులు ఈ నేలమీంచి పుట్టుకొస్తున్నారు. కీర్తి కోసం ఎపుడూ ఈ ప్రాంతపు రచయితలు ప్రాకులాడరు. పురస్కారాల కోసం వెంపర్లాడరు. ఎవరికైనా ఓ గౌరవం దక్కితే అది అందరిదీ అనుకుంటాం. అది ఈ నేలగొప్పదనమని ప్రకటిస్తాం.
10. ఉత్తరాంధ్ర సాహిత్యం ఉత్తరాంధ్ర ను ప్రత్యేక రాష్ట్రము వైపుగా ఎందుకు నడిపించలేకపోయింది ?
స్వతహాగా ఇక్కడ ప్రజలు చాలా శాంతి కాముకులు. నిరక్షరాస్యత ఎక్కువ. పేదరికంలో మగ్గిపోతున్నా .. అలజడులకు , ఆందోళనలకూ దూరంగా ఉంటారు. ఈ సహనాన్నే పాలకులు చేతగానితనంగా తీసుకొని పెట్టుబడిదారులు దోపిడీ చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజలు ఎంత సహనంగా ఉంటారో ... తమ ఉనికిని కోల్పోయిన స్థితి వస్తే అంతగా తిరగబడతారు . సిక్కోలు గిరిజన రైతాంగపోరాటం , కాకరాపల్లి మత్స్యకారుల పోరాటాలులాంటివి ఈ కోవలోనివే. అందుకే ఉత్తరాంధ్ర సాహిత్యం నిత్య చైతన్యంతో ప్రజలకు నిరంతరం కాపలాగా ఉంటోంది. ఈ నేల మీద జరిగే పోరాటాలకు సాహిత్యమే ఊనికైంది. కానీ కాలమూ కలసి రావాలి గదా ... !
11. ప్రస్తుతం ఉత్తరాంధ్ర సాహిత్యం ను ఎలా అర్థం చేసుకోవాలి ? ఇప్పుడు వెలువడుతున్న సాహిత్యం ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్నదా ...?
అవును . ప్రస్తుతం ఉత్తరాంధ్ర సాహిత్యం ఉత్తరాంధ్ర జనజీవిత ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తోంది . రావిశాస్త్రి , చాసో కారా మాస్టారి కథలు తీసుకోండి. మైదాన ప్రాంత జన జీవితాల స్థితిగతుల్ని కళ్లకు కడుతాయి. రాజకీయ చైతన్యంతో నిండి , దుఃఖంతో నిండిన వ్యంగ్యాన్ని జోడించి ఈ ప్రాంతపు వ్యధల్ని కథలుగా చెప్పారు పతంజలి. గిరిజన జీవితాల్లోని చీకటిని భూషణం మాస్టారు తన కొండగాలి కధల్లో ఆవిష్కరించారు. వారందించిన కాగడాపట్టుకొని నేడు అట్టాడ అప్పలనాయుడు గారు పోడూ పోరు కథలు , క్షతగాత్రగానంలాంటి కథాసంపుటాలతో , పునరావాసం , ఉత్కళం వంటి నవలలతో ఈ నేలమీద జరుగుతున్న దోపిడీని ఎండ గడుతున్నారు. ఏటిపాట , ఒకరాత్రి రెండు స్వప్నాలు వంటి కథాసంకలనాతో గంటేడ గౌరునాయుడు గారు నమ్ముకున్న నేలమీద జరుగుతున్న పెట్టుబడుల విధ్వంసాన్ని, భూమి పరాయికరణను ఎత్తి చూపారు. ఈ ప్రాంతపు రచయితలు ఏనాడు మార్గంతప్పలేదు . ప్రజలతోనే ఉన్నారు. ప్రజల ఆకాంక్షలనే తమ రచనల్లో ప్రతిబింబిస్తున్నారు. వారి అడుగుజాడల్లోనే మా తరమూ నడుస్తోంది.
12. ఒక రచయితగా ప్రస్తుతం సాహిత్యాన్ని , సాహిత్య విమర్శను ఎలా చూస్తున్నారు ?
సాహిత్యం మనిషిని విశాలం చేస్తుంది. సమస్త మాలిన్యాల్నీ కడిగి పారేస్తుంది. గోడల్ని కూలగొడుతుంది. మనిషిని మనిషిగా నిలబెడుతుంది. నిజమైన సాహిత్యకారుడు కులానికి మతానికి ప్రాంతానికి అతీతుడవుతాడు. విశ్వమానవుడవుతాడు. యాకూబ్, అఫ్సర్ లాంటి కవులు విశాల సాహితీవేదికల్ని ఏర్పాటుజేసి చాలామంది యువకవులతో సాహితీసేద్యం చేస్తున్నారు. పాతతరం ఎప్పటికప్పుడు తమ వారసత్వంగా కొత్తతరాన్ని తయారు చేసుకోవాలి. కొత్త ఆలోచనలకు దారివ్వాలి. సరైన మార్గం చూపాలి. అలాగే కొత్తతరం పాతతరాన్ని గౌరవించాలి. ఇక విమర్శకొస్తే ... ఏ రచయిత అయినా సద్విమర్శను స్వీకరించాల్సిందే. అది అతన్ని ఆకురాయిలా మరింత పదును పెడుతుంది. ఇవాల సాహిత్యానికి చేరా , రాచపాళెంలాంటి విమర్శకుల అవసరం ఎక్కువుంది. నిబద్ధత నిండిన సాహిత్యవేత్తలు , నిక్కచ్చితనం నిండిన విమర్శకులు నేటి సాహిత్యాన్ని బతికించటానికి ముందుకు రావాల్సిన సమయమిది.
13. సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా ?
కొంత వరకు సాధ్యమే . మహా మహా విప్లవాలన్నీ సాహిత్యకారులే నడిపించిన సందర్భాలు కోకొల్లలు. ప్రజలు తిరగబడకుండా, తన అరాచకాన్ని ప్రశ్నించకుండా రాజ్యం అన్నీ ఉచితాలిస్తుంది. శ్రమకు దూరంజేసి సోమరులను చేస్తోంది. నిత్యం మత్తులో ముంచి ప్రజల్ని ఉద్యమాలకు పోరాటాలకు దూరం చేస్తోంది. ఇవన్నీ సాహిత్యకారులే ప్రజల్లోకి తీసుకుపోవాలి. సాయుధ విప్లవం కంటే సాహిత్య విప్లవం గొప్పది. పుస్తక పఠనం తగ్గినా సోషల్ మీడియా రూపంలో మన భావాల్ని పంచుకునే అవకాశం దక్కింది. అంతిమంగా సాహిత్యవేత్తలు సమాజహితం కోసం పాటుబడాలి.
14. సాహిత్య జీవితంలో మిమ్ములను కదిలించిన అనుభవాలు గురించి చెప్పండి ?
కవిత్వం నాకు తోడు లేకపోతే నాకున్న వ్యక్తిగత సమస్యలకు నేను ఆత్మహత్యయినా చేసుకోవాలి , లేదూ పిచ్చివాణ్ణయినా అయిపోవాలి. దుఃఖం నల్లమబ్బులా ముసిరేవేళ కవిత్వమే నన్ను కాపాడింది. కవిత్వంలో మునిగి సాంత్వన పొందేవాణ్ణి. అందువలన కవిత్వం నాకు కాలక్షేపం కాదు. విడిచిపెట్టుకోలేని వ్యసనమై పోయింది. కాకపోతే ఎక్కడో ఓ మారుమూల మట్టి పిసుక్కునే సామాన్యమైన రైతు బిడ్డని , ఈ సాహిత్యమే గదా నన్ను విమానమెక్కించి దేశరాజధాని ఢిల్లీలో నిలబెట్టింది . సమాజంలో ఇంత గౌరవాన్నిచ్చింది. ఈ కవిత్వమే లేకపోతే శతకోటి లింగాల్లో బోడిలింగమన్నట్టు మామూలు సగటు ఉపాధ్యాయునిగా మిగిలి పోదునేమో ...! 2014 లో న్యూ హార్వెస్ట్ పేరుతో న్యూఢిల్లీలో కేంద్రసాహిత్య అకాడమీ ఓ కార్యక్రమం చేసింది . అన్ని రాష్ట్రాలనుండీ అన్ని భాషల యువ కవుల్నీ పిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగు భాష ప్రతినిధిగా పాల్గొని తెలుగునేల మట్టివాసనతో చదివిన కవితలకు ఆహుతులనుండి అపూర్వ స్పందన రావటం , గురువులు ఎన్ గోపి గారు , కాత్యాయనీ విద్మహే గారు అక్కడ అభినందించటం మరచిపోలేని ఒక మరచిపోలేని జ్ఞాపకం .
ఓసారి మహాకవి శివారెడ్డిగారు నా ఇంటికొస్తానంటే సంబరపడ్డాను గానీ కనీసం ఆయనకు మర్యాద చేయడానికి ఆ రోజు ఇంటి వద్ద ఎవరూ లేరు. ఆ మాటే అన్నాను. అయినా పద అన్నారు. నా ఇంటికొచ్చారు. మర్యాదకోసమనీ పళ్లూ , స్వీట్లు పెట్టాను. కానీ ఆయన అవేమీ ముట్టుకోలేదు . నాలుగు గదులూ తిరిగీ, మా వంటగదిలో కొచ్చి బస్తాలో ఉన్న కొత్త చింతపండు బొట్ట తీసీ తిన్నారు. నా ఇంట ఓ పూట గడిపి, నా భార్యాపిల్లలతో ఫోన్ చేసి మాట్లాడారు. అప్పటినుండి నా పిల్లలూ ఆయన్ని తాతయ్యా అని పిలుస్తారు. నా మీద ఏ కంప్లైంట్ అయినా నా భార్య ఆయనకే రిపోర్ట్ చేస్తుంది. నాతోనే కాదు ఆయన చాలామంది కవులతో అలానే ఉంటారు. మనుషుల్ని అంతగా ప్రేమిస్తారు. ఆయనతో కలసి బతికిన సందర్భాలని , సభానంతర మహాసభల్ని మరచిపోలేను.
15. పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు ?
సాహిత్యం పోటీకాదు. ఎవరి భావజాలం వారిది. ఎవరి శైలి వారిది. ఎవరి ముద్ర వారిది. ఒకరిలా ఇంకొకరు చెప్పలేరు. సాహిత్యానికి ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత అనేదే ప్రధానం. తరానికీ తరానికీ మధ్య చెప్పేవిధానంలో తేడా ఉన్నా అంతిమంగా సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించాలి. ఆ కాలాన్ని రికార్డ్ చేయాలి. ప్రపంచీకరణ వరదలా ముంచేస్తోంది . సాహిత్యవేత్తలు పిడికెడు మంది ఉన్నారు. మన బలం చాలటంలేదు. సమస్త పురోగమన శక్తులన్నీ ఏకమవ్వాల్సిన సందర్భం కావాలి. ముంచుకొస్తున్న విధ్వంసాన్ని ఎదుర్కునేందుకు , దాని విపరీతపోకడలను ఎండగట్టేందుకు రచయితలూ కవులూ, ఒక వేదిక మీదకు రావాల్సిన అవసరముంది. మారుతున్న సమాజానికి సాహిత్యం ముందుచూపునివ్వాలి. పేరుకో పురస్కారాలకో లేదూ కులానికో మతానికో ప్రాంతానికో పరిమితంకాకుండా విశ్వమానవ సౌభ్రాతృత్వానికి సాహిత్యం కృషి చేయాలి. సాహిత్యం ఒక నదిలాంటిది. అన్ని మాలిన్యాల్ని అధిగమించి స్వచ్ఛంగా ప్రవహించాలి. మనుషులు విశాలం కావాలి. సాహిత్యం శాశ్వత ప్రజాపక్షం కావాలి. అందుకు నిబద్ధతతో కూడిన, విలువలతో కూడిన సాహిత్యానికి అందరం కృషి చేయాలి.
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు