మా రచయితలు

రచయిత పేరు:    చిలకమారి తిరుపతి (స్వరమయూరి)

కథలు

సుడి తిరిగిన కథ (జానపద కథ)

           శరత్కాల వెన్నెల్లో చల్లని రాత్రి మచ్చలేని చందమామ మబ్బు తెరలు తొలగించుకొని పిండి ఆరబోసినట్లుండే వెండి వెన్నెల వెలుగులో ఒక పచ్చని జొన్నచేను నవనవలాడుతు నవయవ్వనిక లా కన్పిస్తుంది. చేను యజమాని దాని చుట్టూరా ముళ్ళ పొదలతో ఇతరులెవ్వరి కనుచూపులు సోకకుండా కంచె అల్లుకున్నాడు ప్రతి రోజులాగానే పంటచేతికి వచ్చే సమయంలో పశువులు మేయకుండా కాపలాగా రాత్రి చేనులోనే పడుకున్నాడు. అర్థరాత్రి కలికి గాంధారి వేళ లో ఒక గంగిరెద్దులా కనిపించే ఆంబోతు పంటను మేయడానికి పచ్చని చేనులోకి ప్రవేశించింది. అది గమనించిన కాపువాడు ప్రాణంగా చూసుకుంటున్న పంటను పశువు మేయడంతో కోపగించి దానిని అనుసరించి ఆంబోతు తోకను గట్టిగా పట్టుకున్నాడు దానితో రంకే వేసిన ఆంబోతు దగ్గరనే ఉన్నా నీటి సుడిలోకి దూకింది తోకను పట్టుకున్నా కాపువాడు ఆంబోతు తో పాటుగా సుడిలోకి వెళ్ళి పోయాడు.అది సుడికాదు సకల దేవతలు కొలువున్న గుడిలా, సర్వమతాల సంస్కృతి కి ఒరవడి లా, సాంప్రదాయాలు వెల్లువిరిసే మడిలా, కైలాసం కన్నా మిన్నగాను వైకుంఠం కన్నా ఉత్తమంగాను, గోలోకం కన్నా శ్రేష్టం గాను భాసిల్లుతున్నట్టుందిఅందుకే దానిని నేడు.కాకర్లసుడి అని అంటారు జగత్తులో దాన్ని అధిగిమించిన సుందరమైన ప్రదేశం వేరొకటి లేదు. అది భువనత్రయానికి ఛత్రంలా అమరి ఉంటుంది సంసార సంతాపాల్ని నాశనం చేస్తూ అది బ్రహ్మాండాలన్నిటికి చల్లని నీడను ప్రసాదిస్తూ ఉంటుంది. గంభీర వైశాల్యాలతో సమమైన యోజనాలు కలిగి ఉంది దానిలో ఎప్పుడు నీరు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. సుడిలో వాయు స్పర్శ కి ఉవ్వెత్తుగా లేస్తూ శీతల తరంగాలు, రతనాల సైకత దక్షిణావర్ణ శంఖాలు, అనేక వర్ణాల చేపలు కనువిందు చేస్తూ ఉంటాయి. అక్కడ అసంఖ్యాక తరంగాల సంచలనం వల్లా చల్లని నీటి తుంపరలు ప్రదేశాన్ని శోభాయమానం చేస్తూ ఉంటాయిఇటువంటి సుధీర్ఘమైన తీరాలలో నయనానందకరంగా సకల దేవతలు తమ స్థావరాలు వదిలి భూలోక కైలాసం లా భాసిల్లుచున్న సుడిలో కొలువున్నారు. దాని లోపలి భాగంలో నిర్మించబడిన సప్తయోజనాల విస్తీర్ణముగల ధృఢమైన గుహ ఒకటుంది. నానా అస్త్రాలు ధరించి యుద్దం  చేసిన విశారదులైనా రక్షకభటులు కాపలాగా ఉంటారు. నాలుగు ద్వారాలలో ద్వారపాలకులు  కాపలాకాస్తుంటారు ప్రతీ ద్వారంలో వందలాది మంది భటులుంటారు అక్కడ అడుగడుక్కీ స్వచ్ఛ శీతల మధుర జల సంభరిత సరోవరాలున్నాయి.అక.కడి సుగంధ పవనాల వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది అందుకే కల్పవనం లో వసంతేషుడు కొలువై అహోరాత్రులు వసంతశోభలను వ్యాప్తింపజేసాడు.

          అతడు పుష్పచ్ఛత్ర ఛాయలో పుష్పంసింహాసనం పై ఆసీనుడై ఉంటాడు పుష్పాభరణాలను ధరించిన అతడు పుష్పమధువును పానం చేసి మత్తెక్కి ఉంటాడు సదా మంధస్మిత వదనార విందాలతో అలరారే భార్యలతో కూడి వసంతుడు పూలబంతులతో క్రీడిస్తు ఉంటాడు. మధుధారలు ప్రవహించుచున్న సుడి ఆపారానందాన్ని కల్గిస్తుంటుంది. అక్కడ పద్మరాగమణిసంభరిత ప్రకాశంతో ఆసంఖ్యాక మండపాలున్నాయి వాటినడుమ  వివిధ ఆయుధ రత్న భూషణ ధారులై వీరులు,చతుష్షష్టి కళలున్నాయి దీనికి ఈశాన్య భాగంలో మహారుద్రలోకం తేజరిల్లుతూ ఉంటుంది

         అమూల్య  రత్న నిర్మితమైన అందులో మహా రుద్రడు స్వయంగా భాసిల్లుచున్నాడు. మహాగ్రుడై  ధీప్తి నయనుడై మూపున అమ్ముల పొదిని ధరించి వామహస్తాన ధనువును తాల్చిన పార్వతీ సమేతుడై కరిచర్మదారిలా చితాభస్మదారియైన పరమేశ్వరుడున్నాడు

ఆంబోతు తోక సహాయంతో సుడిలోకి వచ్చిన కాపువాడు అద్భుతమైన ప్రదేశాన్ని చూసిమురిసి పోయాడు అక్కడి నుండి ఎలా బయటకు వెళ్ళాలని అక్కడి భటులను అడగగా ప్రతీ పౌర్ణమికి దానికి ఇష్టమైన ఆహారం స్వేచ్ఛగా తినడానికి సుడి బయటకు వెళ్తుంది కావున దాని తోక పట్టుకుని వెళ్ళమని బదులు పలికారు భటులు,చేసేది ఏమిలేక కాపువాడు ఒక మాసం రోజులు సుడిలోని ఉండిపోయాడు.

       తన భార్య బంధువులు కాపువాడు చనిపోయాడని భావించి కర్మకాండ జరిపించారు. సుడిలోన ఆహ్లాదకరమైన వాతావరణం లో గడుపుచుండగానే పౌర్ణమి రానే వచ్చింది.

          కాపువాడు బయటకి వెళ్ళే సంధర్భంలో సుడిలోని దేవతలు ఒక దైవరహస్యం చెప్పి శాసించారు అదేమిటంటే నీవు సుడిలో ఉన్నట్లు మరియు దేవతలు కొలువున్నట్లు ఎవరికి చెప్పకూడదని ఒకవేళ చెపితే క్షణమే శిరస్సు పగిలి చనిపోతావని హెచ్చరించి అదృశ్యమై పోయారు అలాగే నని వారి ఆజ్ఞను శిరసావహించి కాపువాడు ఆంబోతు తోక సహాయంతో బయటకు వచ్చాడు ఆంబోతు మళ్ళీ సుడిలోకి వెళ్ళిపోయింది. ఉదయమే కాపువాడు ఇంటికి వెళ్ళినాడు తన భార్య,బంధువులు కాపువాడు చనిపోయాడని భావించుకోవడంతో సులభంగా నమ్మలేదు ఎలాగో వారందరిని నమ్మించాడు కాని తన భార్య ఎంత చెప్పిన వినకుండా ఇన్నాళ్లు ఎక్కడున్నావో చెపితేనే నీతో కలసి ఉంటానని అంటుంది దానితో కాపువాడు కూతురు పెళ్ళి ఐన తర్వాత చెబుతానని భార్యతో అంటాడు కొంతకాలం తర్వాత కూతురు పెళ్ళి నిశ్చయం అవుతుంది. ఏర్పాట్లు చేసుకొని పెళ్ళి కాకముందే కాపువాని భార్య ఇంతకాలం ఎక్కడున్నావో చెప్పమని మళ్ళీ నిలదీస్తుంది అప్పడు కాపువాడు ముందే చెపితే నా శిరస్సు పగిలి చనిపోతానని, తర్వాత చెపుతానని భార్యతో అంటాడు కాని ఆమె ఒప్పకోదు వెంటనే చెప్పాలని పదే పదే అందరి ముందు అడుగుతుంది చేసేది ఏమి లేక నిస్సహాయ స్తితి లో దేవతలు చెప్పినటువంటి కాకర్లసుడి రహస్యాన్ని నేను చూశాననిఅక్కడ దేవతలు కొలువున్నారని,అక్కడే కొంతకాలం గడిపానని చెపుతాడు దానితో శిరస్సు వేయిముక్కలై కాపువాడు చనిపోతాడు, తన కూతురి వివాహం ఆగిపోతుంది. కాపువాని భార్య విధవ అవుతుంది.

        దైవరహస్యం తెలుసుకోకుంటేనే బాగుండేదని చాలా చాలా బాధపడుతుంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది.

ఎన్నోరోజులుగా ఉన్నా కాకర్లసుడి రహస్యం అందరికీ తెలిసిందని అక్కడ వున్న దేవతలతో సహా భటులు, ఆంబోతు స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పటినుంచి అది దేవళ్ళగడ్డ,కాకర్లసుడి అని ప్రసిద్ధిగాంచింది ప్రస్తుతం ప్రదేశ పరిసరాల్లోకి అపవిత్రం గా ఉన్నవారు ఎవరైనా వెళితే సర్పాలు వెంబడిస్తాయి ఎందుకంటే ఇప్పటికీ భూలోక స్వర్గాన్ని నాగకన్యలు రక్షిస్తూ ఉంటాయి.అక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి ఆదివారం ఘనంగా జాతర జరుపుకుంటారు.

      గమనిక::ఇది ఆదిలాబాద్ (ప్రస్తుతం మంచిర్యాల) జిల్లాలో కోటపల్లి మండలం అన్నారం గ్రామ సమీపంలో ప్రాణహిత నది తీరంలో ప్రచారంలో ఉన్న కథ.

 

 

        

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు