మా రచయితలు

రచయిత పేరు:    కోడూరు సుమన

కథలు

మనంబోలేం లేమ్మే

         ఊరంతా రొంత అడావుడిగా ఉండాది. అందురూ  రాబోయే ఆదోరం(ఆదివారం)ని తల్సుకోని ఇద ఇదాలుగా కతలు సెప్పుకుంటాండారు.

            నలుగురు సేర్తే అఏ ఇసయాలొస్తాండాయి. బీడాకులు సుట్టుకునే బుడాను పీరమ్మలూ బరిగొడ్ల దోల్కోంబోయే బసమ్మ ,బుడ్డోల్లూ సిలకలబాయికాడ సిలవరిబోకులు అమ్మేటి ఎంగట్లచ్మీ సిద్దప్పా, గుల్లో దేవునీ సుట్టకారందిర్గీ రోంచేపు కూచునే బత్తిగలోల్లూ, సీటీపాట్లకాడ అమ్మలక్కలూ, సిరిగిపొయిన గుడ్డలు కుట్కునే టేలరు నత్తిరాజూ, టీయంగిడి నాయిరన్న దోసిలంగిడిసుబ్బమ్మా కూడల్లన్నీట్లో అదే

ఇసియం  గుసగుస గునగున కసకసలబలబ ఎవుల్లకు జూశ్నా అదే ఖయాలు .

            సుబ్బరాయుని కోడలు సీమంతం ఆదోరం నాడు.

             అదేవంత పెద్దిసయమూ ఈకాలాన పంఛన్లేపంఛన్లూ దుడ్డుంటేసాలు తినేదీ ఏరిగేదీ గుడా

పంఛనుజేస్తాన్లా ఇదే పాశెను(ఫ్యాషన్)గదా.

            నిజిమే గానీ ఇంట సీమంతం ఇసిత్తరం కోడలూ ఆపల్లెకు ఇంతల్లోకిఇంత(వింతల్లో కి వింత)

ఆఇంతి కి సీమంతం వంటే కతగాకేందీ ‌‌సుబ్బరాయుడు ఆఊఊరికి సరుపంచు ఆయప్ప నాయిన, తాత, తాతోల్లతాతలకాడ్నించీ ఊరికి వాల్లకుటుంబమే పాలెగాండ్లూఏలేటోల్లూ..

            ఈడ ఇసిత్తరమైన ఇసియం ఏందంటే తరతరాలుగా వాల్లవొంశానికి నాగశాపం బట్టి బిడ్డలేకలిగేటోల్లు గాదంట మరి తరతరాలుగా ఎట్టేల్తన్నారూ రాజ్జెం...అనీ యోసినలో(యోచనలో) బడగాకండీ..ఆడికేవొస్తన్నా సుబ్బరాయుడు వోల్ల ముత్తాత చెండ్రాయుడు అనే మారాజు పెల్లానికి నలుగురు బిడ్లంట ఇద్దరాడోల్లూ ఇద్దురు మొగపిల్లోల్లూఅందరూ సంతోషంగా పెరిగీ పెద్దయి అంతోఇంతోసదుకోనీ నాయిన మాటపెకారం రాజకీ యాల్లో దిగీ ఊరిపెద్దలైనారంట. ఆడపిల్లోల్లు పెల్లిల్లయి అత్తోల్లింటికిబోయీ పిల్లాపాపలతో సుకంగా ఉండేటోల్లంట. సెండ్రాయిడి పెద్దకొడుకు కొండల్రాయుడు, అపుడపుడూ యాటాడ్నుబోయేదంట  లంకమల్లడవులతట్టు జీపులొఎక్కి సుట్టకారం మందిని ఎంటేస్కోనీ దొరలకోటూతెల్ల పెద్దంచు మాదారం పంచె మెల్లోపులిగోరుసెయినూ సేతులో గొట్టం తుపాకీ నోట్లో గుంటూరుసుట్టా బెట్కోని యాటకనీ రైయ్యిన బోతాంటే ఊరూరంతా ముచ్చటగాజూసేదంట బుర్రమీసాలూ పెద్దకనుగుడ్లూ బగుసక్కదనంగాఉండేటోడంట  వానికి పెల్లయి పెళ్లాం కానుపుకు పుట్టింటికిబోయినాదంట.

            టయములో ఈయప్ప ఏటకుబోయినాడంట రెండడివిపందుల్ని నాలుగు కనితుల్నీ ఏసినాడంట ఈసుట్టుండేటోల్లు ఆపొదలాఈపొదలా దిరిగీ చెవులపిల్లులబట్నారంట ఈటన్నిట్నీ జీపులోఏసుకోని  మెకం కూరకు ఏమసాలాబాగుంటాదో మాటాడ్తా జీపుదోల్తాంటే నవనవలాడ్తాబంగారువన్నెలో ఉండే జాతినాగుబాము జెర్రిపోతూ పెనేస్కోని సంసారంజేస్తాంటే అదాట్న జీను వాటిమీందికి ఎక్కించేశ్నాడంట రెండూ నుజ్జునుజ్జు గా నలిగి సచ్చిపోయినాయంట గబామని జీపుఆపి ఎనకదిరిగీ సూస్నాడంట అపుడే ఆనాగుబాము సివరీగా పడగెత్తి ఈయప్పతట్టుసూసీ పడిసచ్చిపోయిందంట

            ఇంటికొచ్చి ఎప్పుటాల తెచ్చిన యేటలతోరకరకాల వొంటలుజేపించీ ఊల్లోల్లందరికీతినిపించీ కాపుసారా దాపించేటోడు ఆపన్లేంసెయకండా గమ్మునుండాడంట కొడుకుమబ్బుగుండేది జూసీ సెండ్రాయుడూ అన్న ఇచారం జూసి తమ్ముడు శివ నిలదీసేతలికి ఇసియం

జెప్పి నాడంట.

            వోర్నీ ఎంతపన్జేచ్చివిరాఅనీ యాటంతా వండించీ  అందరికీ పంచేసీ ఇల్లూవోకిలీ సుద్దంజేపించీ

బాపనయ్యలనుబిలిపించీ పూజలు నోములుజేపిచ్చే ఊదొత్తులు కర్పూరంపొగ ఊరంతాదోమతెర మాదిరి

సుట్టుకునె.

          ఏం లాభం కోడలుకానుపైనాదీ మనవడుబుట్నాడు అన్నారు ఊరంతా సంతోసపడేలోగా పిల్లోడుపామ్మాదిరి బుసలిడిసి సచ్చిపాయెననిరి. ఈవాటంగనే నాలగు తూర్లు పెద్దకోడలికీ, రెండుతూర్లూచిన్నకోడలికీ బిడ్డలుబాయె  ఇంగిట్టగాదు వొంశవే లేకండబోతాదనుకోని దాయాదులబిడ్డను సాకుడుకు దీస్కోని బంగారంగాసదివిపిచ్చీ టీచెరుపనొచ్చెట  గాజేసీ బల్లారితట్టునుంచిపిల్లనిదెచ్చి పెల్లిజేసినారు. పిల్లకుబుట్టిన నాగసుబ్బరాయుడు బతికిబట్టగట్టే. ఇపుడు ఆయప్పబిడ్డడు నాగమోహను అనేటోడు.  టౌన్లలో పెద్దసదూలుసదూకోని కంపీటర్లంట సదువులన్నీ సదివి బెంగులూర్లో పెద్దపన్లో జేరినాడూ ఆడనే తనకూడా  పన్జేసే ఏరేజాతిపిల్లని పేమించుకోనిపెల్లిజేస్కోని దీస్కచ్చినాడు.  ఆయమ్మి సిన్మాయాట్టర్ల తల్లోదూరిపోయేమాదిరుండాదీ.  దేవకన్నెకున్నట్టే. పంజాపీపిల్లంట. మనబాసారాదూ. మల్లీ ఊర్లో చానా ఘనంగా పెల్లి జేసి వారంరోజులు  విందులు బెట్టి మందులుబోసీ రాయడోల్లంటే దేవుల్లే  అనిపించుకున్యాడునాగసుబ్బరాయడు. ఆయన పెద్దోళ్ల మాదిరి సరపంచుగాలా అయితే ఆయిన్జెప్పినోడే ఊరేలాల. అందురూ అదేనాయం అంటారుఆపంజాపీ పిల్లకు రెండేల్లయినా కడుపురాలేదంట.

            ఓయమ్మా మల్లీ ఏం శాపందగిల్నాదో అనుకునిరి అందురూ. వాల్లు అంతపెద్దూల్లో లచ్చలుజంపాయిచ్చే పన్లోఉండేటోల్లుగదా డాట్టర్లకూసూపెట్నారంట.  నాగమోహను కు ఏందో కనాలు లేవంట. ఆఇసయం దెల్సీ నవ్వినోల్లు సగమూరుకీ బాదపడినోల్లుసగమూరికీ

            ఇంగమల్లీకత తొలికొచ్చెనే వారసులెట్టా అనిఅందురూ అనుకుంటాంటే ఆపంజాపీకోడలు ఏందో సూదులేపిచ్చుకోనీ గర్బందెచ్చుకున్యాదంట.

            ఈడ అసలైనకతమొదలాయె ఊర్లో ఆడోల్లంతా ఇదేం ఇడ్డూరమనీ మెటికిలించిరీ. మెరకీది సంజెమ్మ ఊర్లో ఈమద్దెనేబెట్న ఆస్పత్రిలో పన్జేసే నరసమ్మ కు టీదాపిచ్చీ అసలు ఇసియం

గనిపెట్టె. అదేందంటే మొగునికి బిడ్డలిచ్చే కనాలు లేకండాబోతే. ఆలికి ఇంగెవురోముక్కూముగందెలీనోడి

కనాలు పెద్దసూదితోలాగి పెల్లాంకడుపులోకి సూదిదింపుతారంట.  అంటే గర్భం వొచ్చేది మొగుని వలన గాదు. ఎవురో మొగోని వలన తూ...నీ..యవ్వ ఏం కాలమమ్మా కాలిపోయిన కాలం

ఇంగ ఆమెకీ ఎబిసారికీ తేడాఏందీ…  పాపిట్టి సూలుకు సీమంతమొగటీ...చిచీ..

వోల్లెంతదుడ్లుండోల్లయినా కొట్టికోలాటంగా సీమంతంపండగ

జేసినా ఊర్లో ఆడోల్లమెవుల్లం  నీతిగజాతిగబుట్న ఆడోల్లం ,సావజంపేటోడైనా ఒకే మొగునికి బిడ్డలగన్యోల్లం ఎవుల్లం ఆతట్టే బోము  (గిఫ్ట్ లుగిపుట్లూ తగలంగాక తగలంఅని ఒట్టుబెట్టుకున్యాం

            పదిరోజుల్నిఃచీ ఊల్లో ఇదే ఇసయం ఇద ఇదాలుగ కథలు కథలుగా నలుగురుకూడేకాడంతా

మొగోల్లుమాత్రం ఎన్నేటలేచ్చారో ఎంతసారాబోత్సారో ఈతూరి ఇంగిలీసుమందుగానీ దెచ్చాండారంట

అనిలొట్టలేచ్చాండారు. ఏమ్మీ రవనమ్మా రాయుడింట్లో పనులకు బోలేదే  అడిగినాడు బాలయ్య

...ఏంబోతాంలేయ్యా..థూ...దీనయ్యపని..

ఆపనీఒద్దూ ఆలెక్కావొద్దు.అన్యాదిరవనమ్మ

అంటే ఏందమ్మే అడిగినాడు బాలయ్య..

...అదీ ఇంట్ల జరిగేటిదీఆడోల్లపండగ్గాదులే మొగోల్ల పండగ  అరచేతులు కొజ్జావోల్లాలతట్టి చివాల్నలోనికిబాయె రవనమ్మ.

ఏమైనా దీ ఇంటాడదీ ఇట్నే అంటాందీ….

బాలయ్య ఆలోసెనలోబడ్నాడు.

   *****

          కత అట్టదిరిగీ ఇట్టదిరిగీ...నాగసుబ్బరాయని సెవిన బడె.

            ఓమ్మేయ్...శాంతమ్మా...అంటూ పెండ్లాన్ని పిలిసినాడు

సేతులు సెంగుకు దుడ్సుకుంటా వొచ్చె ఇల్లాలు ఏందీ ఇసియం ఊర్లో ఆడోల్లంతా రేపు మనింటికి

రామని అంటాండారంటా…. అడిగాడు

          నాకేం దెల్దయ్యా, మద్దినేల(మధ్యాహ్నం) రాజమ్మను అడుగుతా ఊరంతా దిరుగుతాఉంటాది కదా విసియం జెప్తాదీ.. జవాబిచ్చింది శాంతమ్మ

ఆఆ ఇప్పుడే బిలిపిచ్చీ కనుక్కోరాదా...అన్నాడు నాగసుబ్బయ్య.

  ...అట్నేలేఅంటూ

రేయ్ మల్లేసూ…. రాజిమ్మను అరిజెంటుగ రమ్మన్యానని తోడకరాపోరా..

హుకూం జారీచేసింది శాంతమ్మ

గడ్డపారకేసి  నీల్లు టెంకాయలు పీచుఒలుస్తా ఉన్న మల్లేశు అది కిందపడేసిఉన్నపలాన

పరిగెత్తి నాడు.

            రాజెమ్మ పది నిముషాల్లో శాంతమ్మ ముందు నిలబడి నాది

ఎమ్మే రాజమ్మా ఇంట్లో ఇంతపెద్ద కార్యెం బెట్కున్యాం సుట్టాలంతావొస్తాండారూ మీకేమైనాదీ

ఈడెంతపనుంటాదీ ఎవుల్లూ ఈతట్టు మసలడంల్యా ఏమొచ్చినాదే...గదిమిందిశాంతమ్మ

అదీ అదేందంటేమ్మా….చేతులుబిసుక్కుంటా గునుస్తా అందురనుకునేది  బైటబెట్టె రాజమ్మ

             శాంతమ్మ అగ్గిదొక్కినమాదిరి కస్సునలేచీ నాకోడల్ని అంతమాటంటారే అంటూ

రాజమ్మ ను ఈడ్సి చెంపకుబట్టీ బెరికేతలికి రాజెమ్మకూ మూడులోకాలూ గానొచ్చె

            సూడూ మాదయా దాచ్చిన్యాలతో బతుకుతా ఉండే మీకే ఇంత పెగ్గె ఉంటే మాకెంతుండాల్నే

నువ్వేం జేస్తవో నాకుదెల్దు ఇంగో గెంటలో ఊర్లో ఆడోల్లు ముసిలీ ముతకా పిల్లాజెల్లాతో  నా ఎదురుగ రావాల. చానాకోపంగా జెప్పేతలికీ శాంతమ్మ కోపం తొలిసారి జూసిన రాజెమ్మ ఊర్లోకి బరిగిత్తినాది.

            అందరూ పెరటిదారిన శాంతమ్మ ముందర సేతులుబిసుక్కుంటా నిల్సినారు.

          ఏందే నీలమ్మా, లచ్మీ, రవనమ్మా….ఏందీకత కొయ్యకుర్చీలొ గూచోని చెయ్యి చూపిస్తా...అడిగెశాంతమ్మ

            ఏంలేదుమ్మా ఏముండాదీ...మనింట్లో ఇంత ఫంచను జేచ్చాండారూ  అదే ఇసిత్రమయిపోయె ఏపొద్దైనా మాఇల్లలో ఇట్లసేస్కుంటామా అనుకుంటాండామూ  రవనమ్మ దైర్యం జేసి జవాబిచ్చె

మరి పనీపాటా ఉంటాదని దెల్దా ఈపక్కకే రాగూడదనుకున్యట్టుండారే మీ ధూం దగలా

ఏమైనా దే...అన్నది శాంతమ్మ ఊర్లో వాళ్లే అయినోల్లనుకొని ఎంత స్రెమ పడ్తాన్దాము మీగురించి అందురికి పేరుపేరునా పట్టు సీర్లు, కుంకం డబ్బీలు ఎండివి తెప్పింస్తి.. మీకు కల్లు నెత్తికెక్కినాయో, తిక్క తేలు గుట్టినాదొ...కతలు బడ్తాన్దరేఏం తిమురుఅన్నది కోపంగా 

 గొడ్లకోసం గడ్డిమోపులు దీస్కోని పెరట్లోకి వచ్చిన బాలయ్య సెవి అట్టేసినాడు.

 ‌ఏంటికిరాముతల్లీ... ఫంచను ఆడేడనో  బెంగలూర్లో సేచ్చారంటాంటే….అందూరం

మేం ఏడబోతామూ అనుకుంటిమి ఈడైతే మీ కాల్లమొక్కి తలా ఒక  పనిజేసీ కడుపారాదినిపోమా 

ఏందిసెప్పండీ ఏంజెయ్యాల్నో...మూకుమ్మడిగాపలికిన  ఆడంగుల్ని జూసీ బాలయ్యనోరుదెరిసె.

ఈ సంచికలో...                     

Nov 2020