మా రచయితలు

రచయిత పేరు:    చీపిరిశెట్టి కవిత (సహాయ ఆచార్యులు)

సాహిత్య వ్యాసలు

“మట్టిపాట” రైతు జీవన చిత్రణ

గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే పల్లెలు అభివృద్ధి పథంలో సాగాలి. పల్లెలే దేశ ఆర్థిక ప్రగతికి పట్టు కొమ్మలు. దేశ సౌభాగ్యానికి, సౌభ్రాతృత్వానికి, సహజీవనానికి పల్లెలే ఆదర్శం. “దేవుడు గ్రామాన్ని సృష్టించాడు. మనిషి  పట్టణాన్ని సృజించాడనివిలియం కాపర్ అంటాడు. ఎన్ని మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగు తోటే మొదలవుతుందని, ఒక్కొక్క నీటి బిందువు కలయికే మహా సముద్రం అయిన విధంగా చిన్న చిన్న గ్రామాల కలయికే నేటి పట్టణ రూపంను సంతరించుకుంటుంది. దేశ అభివృద్ధి అంతా పల్లెల మీదనే ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో కవులకు, రచయితలకుపల్లెజీవనం వస్తువుగా దొరికింది. పల్లె జీవనాన్ని ఆధారంగా చేసుకొనిమట్టి పాటపేరుతో ఏనుగు నరసింహా రెడ్డి గారుపల్లె బతుకు మాదిపాడు గానుఅనే మకుటంతో శతకం రాశారు. పూర్తిగా పల్లె జీవనాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన శతకాలలో ఇదే మొదటిది కావడం విశేషం. శతకంలో గ్రామీణ జీవన చిత్రణ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుత వ్యాసం గ్రామీణ జీవనంలో అత్యంత ముఖ్యమైన వృత్తి వ్యవసాయం. “మట్టిపాటశతకంలో రైతు జీవన చిత్రణ ఎలా ఉందో, రైతు కష్టాల కడగండ్లను వివరించడం ప్రస్తుత వ్యాసం ఉద్ధేశం.

మట్టిపాట శతకం - రైతు జీవన చిత్రణ

ఏనుగు నరసింహా రెడ్డి గారు భువనగిరి జిల్లాలోని కల్లోని కుంట గ్రామంలో పుట్టారు. పెరిగింది మాత్రం నల్గొండ జిల్లా చిట్యాలలో. చిన్న తనంలో నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగారు. వ్యవసాయ నేపథ్యంతో అనుబంధం ఉన్న నరసింహా రెడ్డి గారు పల్లె ప్రజల్లోని కష్టాలను, సుఖాలను, ఆనందాలను, సంతోషాలను పల్లె ప్రజల జీవన విధానాన్ని శతకంలో వర్ణించారు. శతకంలో పల్లె ప్రజలు వలసలు పోవడానికి గల కారణాలను, కులవృత్తులు పతనమైపోతున్న తీరును, పల్లెల్లో నివసించే ప్రజల బాధలను, కష్టాలను, రైతు జీవితాన్ని, విచ్ఛిన్నమవుతున్న గ్రామీణ జీవనాన్ని అత్యంత సహజంగా అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన శైలిలో శతకాన్ని రాశారు. మట్టి పాటతో పాటు వీరి కలం నుండి కొత్త పలక, మూలమలుపు, హైదరాబాద్ విషాదం, అంతరంగం లాంటి మరికొన్ని పుస్తకాలు వెలువడ్డాయి. ఇంతింతై వటడింతై అన్న విధంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి డిప్యూటీ తహసీల్దార్గా, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఎదిగారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్త్వం వారిది.

దేశ అభివృద్ధిలో వ్యవసాయం పాత్ర కీలకమైంది. పొద్దున లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనిషి బతకడానికి కావాల్సింది ముఖ్యంగా ఆహారం. ఇలాంటి ఆహారాన్ని పండించడానికి నిరంతరం శ్రమిస్తూ సేద్యం చేస్తున్న రైతన్న పూజనీయుడు. అతని శ్రమ వెలకట్టలేనిది. అంకిత భావంతో చేసే పనిని వర్ణించడం మాటలకందంది.

పల్లెల్లో రైతు కోడి కూతతో నిద్ర లేచింది మొదలు పొలంలోకి వెళ్తాడు. పొలంలోని పనులతోనే అతనికి శారీరక వ్యాయామం అవుతుంది. కానీ పట్టణాల్లో ఉండే ప్రజలు మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని శారీరక శ్రమ లేకుండా పని చేస్తున్నారు. శారీరక శ్రమ కోసం జిమ్ లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నారు. విషయాన్ని గురించి కవి ఇలా చెప్తున్నాడు

పొద్దు పొడవ లేచి పొలం పనులు/ఎక్ససైజ్ లంటూ ఎవడు సేయు/బలిసినోడి యాట పనిలేని పాటరాఅంటాడు.

రైతు పంట పండించాలి అంటే ముందు నీళ్లు కావాలి. “తలాపున పారుతుంది గోదారి మన సేను, మన సెలకా ఎడారిఅని ఒక కవి అన్నట్టు తెలంగాణలో నీళ్లు ఉన్న రైతు పొలాల్లోకి నీళ్లు రాక, పంటలు పండించే వీలులేని స్థితిని, రైతు పడుతున్న బాధ బతుకు భారాన్ని ఇలా కవితాత్మకంగా చెప్తారు.

చెరువు నోరు దేరిసే చెల్క కన్నీరిడిసే/చుక్కనీరు లేదు దుక్కి దున్ని

తేట తెల్ల మాయే తెలంగాణ యవసమ్ము.....

ఆగే హల్దీ వాగు ఆగేరా పెను గంగా/ఆగిపోయే డిండి ఆగే మూసి

సాగు టెట్లు బతుకు సాగేటి నదిలాగ.....

నదుల నుండి నీళ్లను ఆశించిన రైతు ఆశ అడియాస గానే మిగిలింది. చేసేదేం లేకకృషితో నాస్తి దుర్భిక్షంఅన్న విధంగా రైతు తానే స్వయంగా అప్పు చేసి  డబ్బు ఖర్చుపెట్టి బోరు బావి గురించి నీళ్ల కోసం ప్రయత్నిస్తే అక్కడా నిరాశే ఎదురైంది మరోవైపు అప్పు కుప్పలుగా పెరిగిపోయింది.

అప్పు చేసి నీరు ఆశించి బోర్లే యా/గంతెడైన రావు కంట్లో నీరు

పరగ దయ్యమా యే పాతాళ గంగమ్మ....

రైతు పంట వేసిన అప్పటినుంచి అది చేతికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల నుండి, అడవి జంతువుల నుండి  రక్షించుకోవాల్సి ఉంటుంది. విత్తనం వేశాక మొక్క బాగా ఎదుగుతునప్పుడు రైతు కళ్ళలో ఆనందం గురించి చెప్పడం మాటలకందనిది. పంట చేతికి వచ్చే సమయానికి పంటకు తెగులు సోకి పంట నష్టపోతే రైతు బాధ వర్ణనాతీతం. ఒక రైతు వేరుశనగ పంట వేసి చేను బాగా ఎదగడం చూసి ఈసారి అప్పులు తీర్చవచ్చు అనుకున్న రైతుకు ఒక్కసారిగా పంటకు తెగులు సోకితే రైతు బాధ అతని కష్టం వృధా ప్రయాస గానే ఉంటుంది.

రైతు పంట పండించడానికి ఎంతగానైతే కష్టపడతాడో, తాను పడ్డ కష్టమంతా సులభంగా పంట నష్టపోతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, కరెంట్ కష్టాలు, ఎరువులు, విత్తనాలు దొరకకపోవడం ఇలాంటి సమస్యల వల్ల రైతులు ఈనాడు బాధపడుతున్నారు.

కొన్ని రోజుల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఒక్క గాలివానతో తూడ్చి పెట్టుకొని పోతుంది. రైతు కంట కన్నీరు మిగుల్చుతుంది.

దొంగలు వడి ఊరు దోచుకున్న తీరు/గాలివాన వలన వాలు చేను/

కాంచిలాభమేమి  కంట నీరే తప్ప.

రైతు వ్యవసాయం చేయడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి రేయింబవళ్ళు చెమటోడ్చి పంటల పండిస్తాడు. వ్యవసాయ క్షేత్రంలో తనతో పాటు తన కష్టాలను పాలుపంచుకునే పశువులను రైతు తన కన్న బిడ్డ లాగా ఆలనా పాలనా చూసుకుంటాడు. కరువు వల్ల పశువులకు మేత వేయడానికి కూడా గడ్డి దొరకక కొందరు రైతులు కసాయి వాళ్లకు అమ్ముకోవడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. అలా కసాయి వాళ్లకు అమ్ముకోవడం ఇష్టం లేని రైతులు మూగజీవాల ఆకలిని తీర్చ లేక పోతున్నారు. చివరకు మూగ జీవాలు ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నాయి. మూగజీవాల ఆకలి బాధను కరువు తీవ్రతను గురించి కవి ఇలా చెప్తున్నారు

గట్టు గట్టు తిరిగి గడ్డికై వెతకంగ/ నడ్డి బోవు నడుము గడ్డి లేదు

అసువు లోడూలూ పసులు అర్ధాకలి చేత...

రైతుకు భూమే సర్వస్వం. భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. భూమీ రైతు ఆస్తి. కుటుంబం మొత్తం భూమి మీదనే ఆధారపడి బతకాల్సి ఉంటుంది. రైతు ఆర్థిక స్థితిగతులను గురించి చెబుతూ

ఆడ బిడ్డ పెండ్లి కైదేకరాలయే/కొడుకు చదువు కొరకు కొంత బాయే

ఉన్న ఆస్తులెల్ల  ఉడ్చితేనే బతుకు.....

భుములమ్మమెని  బువ్వ కెట్లు/ సర్వమ్ముకున్న సాగదే మీ బతుకు?

పిల్లల చదువుకు, ఆడకూతురు పెళ్లిళ్లకు, అనారోగ్య సమస్యలకు ఇలా ఉన్నదంతా అమ్ముకున్న రైతు బతుకు బండి మాత్రం సాగడం కష్టంగానే ఉందని కరువు కష్టాన్ని గురించి కవి చెప్పారు.

రైతు వ్యవసాయం చేయడానికి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని ప్రభుత్వం ఆర్బాటంగా ప్రచారం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలోని సన్నకారు రైతులకు మాత్రం అప్పులు పుట్టడం అందని ద్రాక్షగానే ఉంది. దేశంలో కోట్లకు కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా పారిపోయే బడా పారిశ్రామికవేత్తలను మాత్రం నమ్మి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి. కానీ కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా బతికే రైతుకు మాత్రం అప్పు ఇవ్వడానికి ముందు వెనకా ఆలోచిస్తున్నాయి. రైతు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన అతనికి మాత్రం అప్పు పుట్టడం లేదంటాడు కవి

అంజుమాను బ్యాంకు అప్పులిస్తమనిరి /తిరిగి తిరిగి చెప్పులరిగిపోయే

అప్పుబుట్టదేప్పుడు అసలైన పేదలకు....

రేయింబవళ్ళు కష్టపడి పంట పండిస్తే అసలు తాను పెట్టిన పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఈనాడు రైతు ఎదుర్కొంటున్నాడు గిట్టుబాటు ధర లేని వ్యవసాయం గురించి చెబుతూ

 

అర్ధరాత్రి యనక అపరాత్రి యనకుండ/ తోట గాచినాము పాటు బడుతూ

మిగులు మాట పోతే నగదైన రాదాయే..

లాభం సంగతి దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని స్థితి ఈనాడు వ్యవసాయంలో రైతు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు కూరగాయలు ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతుంటే మరోవైపు తాను పెట్టిన పెట్టుబడి, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. దళారులు రైతు పండించిన పంటంతా తక్కువ ధరకు స్వాధీనం చేసుకుని వాళ్లు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముకుంటూ రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతు పరిస్థితిఅమ్మబోతే అడవి కొనబోతే కొరివితయారయింది.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు పేరుతో అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రభుత్వాలు రైతుల నుండి భూములను ఆక్రమించుకున్నారు. రైతు తన భూమిని కోల్పోయి నిరాశ్రయుడు అవుతున్నాడు. రైతులకు తూతూమంత్రంగా నష్టపరిహారాలు చెల్లిస్తూ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి ఆశకల్పించి చివరకు మొండిచేయి చూపిస్తున్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కవి ఇలా చెప్తున్నారు

పొలము లెల్ల చెరపి ఫాక్టరీలను గట్టి/ పనుల వేళ గనరు మనల నసలు

ఊరు  దూరపోల్ల కుద్యోగమిచ్చారు.

రైతు  దగ్గరనుండి  వేల ధరకి భూమిని కొని కొద్దిరోజుల్లోనే అదే భూమికి రెక్కలు వచ్చి లక్షల్లో ధరలు పలకడానికి వెనుక  మర్మం ఉందని చెప్తూ ఇలా అంటారు

వేల ధరకు మంది పాలాయే భూమి/ అమ్మ గానే నింగినంటే  రేట్లు

మతల బేదో ధరల కతలోనే ఉన్నది

సన్నకారు రైతులకు అభివృద్ధి పేరుతో ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతున్న అది మాత్రం రైతుకు అందడం లేదుకేవలం రాతలకు మాత్రమే పరిమితమవుతుందనే విషయాన్ని చెబుతూప్రగతి లేదు కానీ పద్దైతే రాస్తారుఅంటాడు. రైతు పేరు మీద వచ్చే నిధులు అంత ఎటు వెళ్తున్నాయో అని ప్రశ్నిస్తూ జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి అందరి చేత ఆలోచింప చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా రైతు జీవితంలో మాత్రం మార్పు రావడం లేదని అలాంటి ప్రభుత్వాల వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని రైతు హృదయంలో నుంచి వచ్చిన మాటల కనిపిస్తాయి  వాక్యాలు

రామారావు గెలిచే రాజీవూ గెలిచెను /ఎన్నుకున్న మనల నేవడు కనడు

ఎవడు వస్తే మాత్రం మేముంది లాభమ్ము

 ప్రభుత్వం నుండి  సహాయం అందక, చేసిన అప్పులు తీర్చలేక, అప్పుల బాధ పడలేక చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆత్మహత్యలకు గల కారణాలు గురించి ఇలా చెబుతున్నారు.

వరుస కరువులొచ్చి వర్షమ్ము  లేమితో/పంట మీది ఆశ మంటగలిపే

పురుగు మందే మాకు సరిగమయ్యమాయేరా

అప్పులోల్లు  పైసలడిగితే ఎట్లంచు/ పొట్టకూటి గింజ లేట్టులనుచు/

వెరచి రైతు బిడ్డ  ఉరికొయ్య కుగేరా!.....

ముగింపు

పంట పండించడం, కష్టపడడం తప్ప ఎదుటి వారిని మోసం చేయడం తెలియని పసి మనసు రైతుది. పంట వేసినది మొదలు పంట పూర్తి అయ్యేవరకు ఈసారి వేసిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుందా?దిగుబడి వస్తుందా? చేసిన అప్పు తీరుతుందా? అని తనలో తానే ప్రశ్నల వర్షంతో తడిసి పోతాడే తప్పా తనను గురించి తన ఆరోగ్యం గురించి పట్టించుకునే ఓపిక తీరికా రైతుకు ఉండదు. తాను నిరంతరం సైనికుడిలా శ్రమిస్తూ అందరి  మనుగడకు తోడ్పడుతున్నాడు. ఎలాంటి స్వార్థం లేకుండా, రేయింబవళ్ళు నిస్వార్థంగా పని చేస్తున్నాడు. అలాంటి రైతును మనం ఆదరించాలి. రైతు ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావించాలి. రైతును రక్షించుకునే దిశగా మనమందరం అడుగులు వేద్దాం. రైతు బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటే దేశం బాగుంటుంది.

ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు