మా రచయితలు

రచయిత పేరు:    పిళ్లా విజయ్

సాహిత్య వ్యాసలు

చరిత్ర గతిలో తెలుగు భాష

తెలుగు భాషను ప్రజలు కాలం నుంచి  మాట్లాడే వారు? తెలుగువారు ద్రావిడులా? వేదకాలం ముందు నుండి తెలుగువారు ఉండేవారా? తెలుగు లిపి ఎప్పుడు ఏర్పడింది?తెలుగు భాష ఎందుకు మధురమైన భాషగా పేరొందింది?తెలుగు భాష 2000 సంవత్సరాలకు పూర్వం లేదా? ఇలాంటి ప్రశ్నలకు   సమాధానాలను వెదుక్కోవడమే  వ్యాసం ప్రధాన ఉద్దేశం.

బౌద్ధ సాహిత్యంలో బుద్ధుని చూడటానికి అంధక రట్టం నుండి బావరి అనే బౌద్ధ భిక్షువు వచ్చాడని పేర్కొన్నారు. అంధకరట్టం అంటే అంధక ప్రాంతం అని అర్థం.    బుద్ధఘోషుడు  రాసిన 'మజ్జినికాయం'పై ప్రపంచ సూదని అనే పేరుతో ఒక వ్యాఖ్యానం వచ్చింది. దానిలో తమిళ,అంధకాదిభాషలోకి బౌద్ధ పిటకాలను అనువదించారని పేర్కొన్నారు. అంటే క్రీస్తు పూర్వం 400 నాటికే అంధక భాష సాహిత్య భాషగా ఉందని తెలుస్తోంది. తెలుగు భాష ప్రాచీన రూపమే అంధకభాషయని  పాళీ భాషా పండితుడు నళినాక్షి దత్తు పేర్కొన్నారని జయధీర్ తిరుమలరావు తన భాషా ఆవరణంలో పేర్కొన్నారు.   క్రీ.పూ. 500 లో బుద్ధుడు ఉన్నప్పటి నుండి క్రీ.పూ.400 వరకు పదాన్ని వాడారు. సుత్తనిపాతంలోని పరాయనవర్గంలో వత్తుగాథలో అస్సక, అశ్మకులు,అంధక రాజుల గురించి రాసినారు.

అస్సక అశ్మక (క్రీ.పూ. 700_ 300) అనే జనపదం తెలంగాణలోని నిజామాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోధన్ గా చరిత్రకారులు గుర్తించారు.దీనికి సంబంధించిన నాణేలు లభించడంతో జనపదాల గురించి తెలిసింది.నాణేల ద్వారా తెలుగు భాష  చరిత్ర ను కనుగొన్న వివరాల గురించి వ్యాసం లో మరోచోట చూస్తాం

క్రీ.పూ.2 శతాబ్దానికి చెందిన బౌద్ధ గ్రంథం సమంత పాసాధికంలో  తమిళులతో  పాటు ఆంధ్రుల ప్రసక్తి కూడా ఉంది. జైన జాతక కథ సెరివాణిజ కథలో ఆంధ్రులు తేల్ నదీ తీరాన అంధకపురం నిర్మించినట్లు ఉంది. తేల్ నది ఒరిస్సాలో  ప్రవహిస్తున్న మహానదికి ఉపనది.

ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో నివసించేవారని క్రీ.పూ.256 లోని అశోకుని శాసనంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది శాసనంలో అంధ్ర శబ్దమే నేటి ఆంధ్ర శబ్దమని తుర్లపాటి రాజేశ్వరి తెలుగు ధనంలో పేర్కొన్నారు.

      ఐతరేయ బ్రాహ్మణం ( క్రీ.పూ. 800) లో ఆంధ్ర అనే పదం వాడారు. దీనిని జాతి అనే అర్థంలో  వాడివుంటారని చరిత్రకారులు భావించారు. పదమే ప్రాకృతంలో అంధక గా మారిందిఅంధకరట్టం అంటే అంధక ప్రాంతమని అర్థం.   'అంధకరట్ట'నే 'ఆంధ్రాపథం' గా  క్రీ. . 300 నాటి పల్లవరాజుల కాలం  నాటి  గుంటూరు దగ్గర ఉన్న మైదవోలు శాసనంలో రాశారని చరిత్రకారులు గుర్తించారు

  ప్రాచీన నాణేలపై కనిపించిన పులుమావి పదం తెలుగు భాషా పదమేనని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాటి తెలుగు భాష, ప్రాకృతం లో కలిసి ఉండేదని హాలుడు రాసిన "గాథాసప్తశతి" ద్వారా తెలుస్తోంది. పైశాచిక భాష ప్రాకృతం లో ఒక భాగంగుణాఢ్యుడు రాసిన బృహత్కథను పైశాచీ భాషలో రాశాడు.ఆనాటి ఆంధ్రుల భాష దాదాపు పైశాచిక భాషకు దగ్గరగా ఉండేది.తెలుగు భాషపై సంస్కృతం, ప్రాకృత భాషల ప్రభావం ఎక్కువగా ఉంది. క్రీ. పూ. 1వశతాబ్దం నాటి బ్రాహ్మీ లిపిలో  ఉన్న తంబయ్య శాసనం విశాఖ జిల్లా కొత్తూరు సమీపంలో బయటపడింది. తంబయ్య అన్నది పూర్తిగా తెలుగు పదం. క్రీ.. 100 నాటి అమరావతి స్థూపం లో నాగబుద్ధ అనే తెలుగు శబ్దం లభించింది.    

కృష్ణా  ముఖద్వారాన్ని బౌద్ధ సాహిత్యంలోశ్రీలంక థాయిలాండ్ దేశాల  ప్రాచీన సాహిత్యంలో నాగ భూమని, వజ్ర దేశమని, మంజీర దేశమని పిలిచేవారు. నాగులు, శబరులు, యక్షులు అశ్మకులు తెలుగులో ఇక్కడ జీవించేవారు. ఆర్యుల దండయాత్రల వల్ల ఆంధ్రులనే తెగ ఉత్తరదేశంనుండి ఇక్కడకు వలస వచ్చారు.మొదట్లో వారి   క్కడ తెలుగువారితో  ఘర్షణ పడి తర్వాత కలిసిపోయారు. కృష్ణ గోదావరి తీర ప్రాంతంలో క్రీ. పూ.ఐదవ శతాబ్దం నాటికే వారిక్కడ స్థిరపడ్డారు. వీరు రాకపూర్వం కృష్ణా గోదావరి రాయలసీమ ప్రాంతాల జనపదాల ప్రజలు తెలుగు వారని, వారిభాష తెలుగని కోరాడ రామకృష్ణయ్య పేర్కొన్నారు.ఆంధ్రులు వింధ్య (దక్షిణ ఉత్తర దేశాల మధ్య సరిహద్దు మధ్యప్రదేశ్ )కు దక్షిణ ప్రాంతంలో పుండ్ర, పులింద,శబర,మూతిబుల తో కలిసి జీవించినట్లు ఐతరేయ బ్రాహ్మణంలో కూడా వర్ణించారు. బ్రాహ్మణాలు క్రీ.పూ. 900_700 మధ్య కాలం నాటివి.

తెలుగు మాట్లాడే ప్రజల్లో చాలామంది నాగజాతి వారే.ఆంధ్రదేశంలో అమరావతిలో క్రీ..ఒకటవ శతాబ్దానికి సంబందించిన ఒక రాతిపలకపై నాగబు అనే పదం ఉంది.దాని కింది లైనులో 'ద్ది గానం'అని వుంది. దాని పూర్తి పదం 'నాగబుద్ది దానం'. నాగ అనే పదం తెలుగు ప్రాంతం లో ఎక్కువ వాడుకలో ఉంది. నాగభవనం (నాగుల చోటు), నాగమాణవక (నాగ యువకుడు), నాగరాజు పదాలు శాసనాలలో ఉన్నాయి. నాగరాజును వైదిక సాహిత్యం 'దాహక'గా  చెప్పింది. కాలక్రమంలో దాహక పదం దాస గా అయిందన్నాడు అంబేద్కర్.

దక్షిణాపథంలోని స్థానికులను  ఆంధ్రులను ఆర్యులు రాక్షసులుగా చిత్రీకరించారు తాము రాసిన ఇతిహాసాలలో, పురాణాలలో. ఆంధ్రులు తమ సంస్కృతిని రక్షించుకోవడానికి ఆర్యుల తో ఘర్షణ పడ్డారు 

అందువల్ల వారిని  రాక్షసులుగా పేర్కొన్నారు.దాంతో వీరి భావజాలం జైన బౌద్ధ ధర్మాలకు ప్రాతిపదిక అయింది. క్రీ.. 5 శతాబ్దంలో మతంగముని రాసిన 'బృహద్దేశి' లో దేశీయ ప్రబంధాలు ఉండేవని,వాటిల్లో కందాలు,వృత్తాలు, గద్యం, దండకం మొదలైనవే కాక ద్వి పద,త్రిపద,పాట,పదం, ఏలలు వంటి దేశీ ఛందోరీతులు ఉండేవని అవి ప్రజలు పాడుకునే వారని జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు.దీనిని బట్టి నన్నయ కు ముందే చాలామంది కవులు ఉండేవారు.వారంతా అలిఖిత కవులు.

'కుమారసంభవం'లో నన్నెచోడుడు రాసిన "మును మార్గ కవిత లోకం/బున   వెలయగ దేశి కవిత బుట్టించి తెనుం/గును  నింపి రంధ్ర విషయం /బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్" పద్యంలో మొదటి పాదంలో చెప్పినట్లు మార్గ కవిత కంటే దేశి కవిత ముందే ఉండేదని తెలుస్తోందని తెలుస్తోందిదేశి కవిత ను ముందుకు తెచ్చింది జైనులని భాగవతుల ఉమామహేశ్వర శర్మ భావించారు. తెలుగు కన్నడ రాష్ట్రాల నేలిన బాదామి చాళుక్యుల కాలంలో పెరిగి పెద్దదయిన దేశి కవిత,వేంగి చాళుక్యుల కాలానికి (క్రీ. . ఏడవ శతాబ్దం) ఆంధ్రం అయ్యిందని శర్మ భావించారు.

దేశి కవిత నన్నెచోడుని నాటికీ తెలుగు కవితకు వర్తించిన పేరు. ఇది  అలిఖిత సాహిత్యం. దీన్ని ఆశుసాహిత్యం అన్నాడు వేల్చేరు నారాయణరావు. ఆశు కవి సహజ కవి.అతను రచిస్తూ పాడతాడు. పాడుతూ రచిస్తాడు. సాహిత్యమంతా కథాగేయాలుంటాయి. కథ ఒకే మార్గంలో సాగదు. లిఖిత సాహిత్యంలో లాగా ఏక ముఖంగా కాక వర్తుల క్రమంలో ఉంటుంది. ఆశుకవితకు తన గొంతు మించిన ఆధారం లేదు. తన పాత్రకు మించిన ప్రమాణం లేదు. బొబ్బిలి యుద్దం కథ, పల్నాటి కథ ఇలాంటివే. తర్వాత శైవకవులు దేశికవిత నుండి మార్గ కవితకు అంటే ఛందోబద్ధమైన కవితకు మల్లారు.

నన్నయ కంటే ముందే అనేక పద్యాలు, శాసనాలు జానపద సాహిత్యంలో ఉన్నాయి. వాటి ఆధారంగానే నన్నయ తన రచనలు కొనసాగించాడు. నన్నయకు పూర్వం కవిత పైన చెప్పుకున్నట్లు మౌఖికంగా జానపదం లో ఉండేది. నన్నయను ఆదికవిగా చెప్పడం వల్ల తెలుగు సాహిత్యానికి తీవ్ర అన్యాయం జరిగింది. దాని వల్ల తెలుగు ప్రాచీన హోదాకు చాలా కాలం పాటు విఘాతం కూడా ఏర్పడింది. కాకపోతే నన్నయ తెలుగు  లిఖిత కవిత్వానికి మొట్టమొదటి పెద్ద కవిగా నిలిచారని వర్ణించాడు వేల్చేరు.          

శాతవాహనుల కంటే ముందు అంటే క్రీ.పూ.200 లనే నిశంభుడనే రాజు తెలుగు జనపధాన్ని  కృష్ణా తీరాన ఉన్న శ్రీకాకుళంను రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. ఆంధ్ర విష్ణువు అనే రాజు నిశంభుడనే నాగజాతికి చెందిన తెలుగు రాజును ఓడించి తన రాజ్యాన్ని విస్తరించినట్లు, ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని చాలాకాలం పరిపాలించినట్లు  పురాణాలు చెబుతున్నాయి.    ఆంధ్రవిష్ణువు రాయలసీమలోని శ్రీశైలం,కోస్తాలోని భీమేశ్వరం, తెలంగాణాలోని కాళేశ్వరం లను కలుపుతూ తన రాజ్యాన్ని  నిర్మించుకొన్నాడని అంటారు. వీటి మధ్య ఉన్న ఆయన రాజ్యాన్ని త్రిలింగదేశం అన్నారు. వారి భాషను త్రిలింగ భాష అన్నారుకాలక్రమంలో త్రిలింగ ,తెలింగ ,తర్వాత అది తెలింగ, తెలుంగు గా మారి తెలుగు అయిందని భావిస్తున్నారు.

క్రీస్తుశకం 4 శతాబ్దానికి చెందిన నాట్యాచార్యుడు భరతుడు తన కాలంలో రంగస్థల కళాకారులు వాడే భాషలో ఆంధ్ర ఒకటని రాసుకున్నారు.  

శ్రీకృష్ణదేవరాయలు కన్నా 95 సంవత్సరాలకు ముందే ఇటలీ భాషా శాస్త్రజ్ఞుడు నికోల డి కోంటే    క్రీ.. 1420-21 లోరాయలసీమ ప్రాంతంలో తిరిగి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడారు. తెలుగు ఇటలీ భాష లాగా అజంత భాష కావడం వల్ల నూ, తెలుగులో సంగీత ధారా ప్రవాహం ఉండటం వల్లనూ ఆయన భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఉంటారని పరిశోధకులు భావించారు. ఇది  తెలుగుకు ఒక బిరుదుగా మారింది.

తెలుగు తేనెకన్నా తియ్యనిది. అది మధురమైన భాష. తెలుగు భాషకు ఉన్న వైదుష్యాన్ని శ్రీనాథుడు ఏనాడో చెప్పాడు చెప్పాడు. పాల్కురికి సోమనాథుడు చెప్పాడు. శ్రీనాథుడు అయితే "జనని సంస్కృతంబు సకల భాషలకును/ దేశ భాషలందు తెలుగు లెస్స " అనంటే కృష్ణదేవరాయలు అదే విధంగానే తెలుగు విశిష్టతను చెబుతూ

" తెలుగదేల యన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ /ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి/ దేశ భాషలందు తెలుగు లెస్స" అంటూ తెలుగును దేశవ్యాప్తం  చేశాడు. పాల్కురికి ప్రజల భాషకు పట్టం కడుతూ "ఉరుతర గద్య  పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జానుతెనుగు లో  ద్విపదలు" రాస్తానన్నాడు.

క్రీస్తుశకం 1020 ప్రాంతంలో నన్నయ వైదిక మతోద్దరణ కోసం సంస్కృత భారతాన్ని తెలుగులో కి అనువదించాడు.ఆయన దేశి మార్గాన్ని వదిలి మార్గ పద్ధతికి బాటలు వేశాడు. సంస్కృత పదాలకు చివరిలో డుమువులు చేర్చి తెలుగు పదాలుగా మార్చి వేసి తెలుగును సంస్కృతీకరణ చేశాడు. దీంతో తెలుగు పలుకు బడులు నాశనమయ్యాయి. వ్యవహారిక భాషకు తగిన తెలుగు పదాలు ఉన్నాయి. కానీ వాటికి సమానంగా సంస్కృత భాషలో లేవు.తల, కాలు, చేయి, గుండె ,పల్లె ,అమ్మ ,చెల్లి,మామ, బువ్వ,చెరువు, గాలి, వాన, రాయి,తిను ఇలాంటి తెలుగు పదాలను వదిలేసి సంస్కృత పదాలను దిగుమతి చేశాడు  తెలుగులోకి. దాంతో తెలుగు భాష కృతకభాషగా తయారైంది. 

కృష్ణా జిల్లాలోని నందిగామ మండలంలో సింగవరం గ్రామం లో అంధక తెలుగు జనపదానికి చెందిన తవ్వకాల్లో వెండి నాణేలు బయటపడ్డాయి. వీటిని సింగవరం నాణేలు అంటారు. నాణేలలలో నొక్కుడు గుర్తు గల నాణేలు  మౌర్యుల  కన్నా ముందుకాలానివిగా ఉన్న ట్లు గుర్తించారు. అందువల్ల తెలుగు జనపదం మౌర్యలకన్నా  ముందున్న రాజవంశాల పాలనలో ఉన్నట్లుగా  డా!!దెమో రాజారెడ్డి భావించారు.

అదే విధంగా కరీంనగర్ కు దగ్గర 72 కిలోమీటర్ల దూరంలో కోటిలింగాల గ్రామం ఉంది. కోటిలింగాలలో  నొక్కుడు నాణేలు దొరికాయి.ఇవి లిపిగల నాణేల కన్నా ముందువి. సింగవరం లో దొరికిన కొన్ని నాణేల పైన లిపి లేదు. వివరాలు లేని నాణేలు రాజు ముద్రించాడో చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డాడు డాక్టర్ రాజా రెడ్డి. కాకపోతే లిపిలేని నాణేలను మొదట, తర్వాత లిపిగల నాణేలను  మొట్టమొదట విడుదల చేసిన రాజు గోభదుడు. నాణాలలో బొరుసు ఖాళీగా ఉంది.ఇతని తర్వాత వచ్చిన రాజుల్లో చివరివాడు సమ గోపుడు.ఇతను విడుదల చేసిన నాణేలపై గల  అక్షరాలు లిపి శాస్త్రాల ప్రకారం  క్రీ. పూ. మూడవ శతాబ్ది గాని లేదా అంతకు ముందు కాలానికి గాని చెందినవని తేల్చారు.నాణేల ఆధారంగా తెలుగు భాష  క్రీ.పూ. మూడు శతాబ్దం నాటికే ఉందని  నిరూపించారు డాక్టర్ రాజా రెడ్డి తన పరిశోధన ద్వారా.

హైదరాబాద్ దగ్గరున్న కీసరగుట్ట దగ్గర ఒక రాతి గుండుపై క్రీస్తుశకం 4 శతాబ్దానికి చెందిన తొలుచు వాన్రు( బండలు తొలిచే వాళ్ళు) అనే చిన్న శాసనం లభించింది. ఇక మూడవ శతాబ్దంలో పాలించిన ఇక్ష్వాకుల శాసనాలలో ప్రాకృత భాషలో చాలా తెలుగు పదాలు ఉన్నాయి

తెలుగు భాష ప్రాచీనతను తెలుసు కోవడం అంటే మన అమ్మ భాష పుట్టు పూర్వోత్తరాలను మనం తెలుసు కొని దాన్ని కలకాలం కాపాడుకోవాలి.

 

పురాణాల ప్రాచీనత  -  ఒక పరిశీలన

మనదేశ లిఖిత చరిత్ర అంతా పురాణాల్లో నిండిపోయింది. అయుతే ఆ పురాణాలలో కర్మకాండలు, ధార్మిక విషయాలకు సంబంధించినవే ఉన్నాయి. పురాభవ ఇతిపురాణం అన్నారు. అంటే పురాణాలు ప్రాచీన కాలానికి చెందిన అంశాలు చెపుతాయని అర్ధం. పురాణాల్లో చెప్పే ప్రాచీనతను పురావస్తు పరిశోధనలు కనుక్కోవడానికి ప్రయత్నించారు. పురాణాలను మతధార్మిక విషయాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించి పునర్మూ ల్యాంకనం చేయాల్సిన అవసరం వుంది.

ప్రాచీన మైనవని ఎంతగా చెప్పినప్పటికీ పురాణాలలో  ఆధునిక విషయాలు ఉన్నాయి. రుగ్వేదంలోని కవితల్లో ఉన్న రెండు లైన్ల కథలకు పురాణాలు విస్తృత రూపాన్నిచ్చాయి.

పురాణాలు 18. ఉపపురాణాలు 18 ఉన్నాయి. కానీ 22 మరో పురాణాలు, లెక్కలేనన్ని ఉపపురాణాలు కూడా ఉన్నాయి.

పురాణాలను సంస్కృతంలో రాశారు. వాటిని తెలుగులోకి చాలా మంది కవులు అనువ దించారు. వేములవాడ భీమకవి అనువ దించిన నృసింహ పురాణాన్ని మొదటి అను వాదంగా భావిస్తున్నారందరూ. పురాణాల్లో 4,11,000 కవితలు (శ్లోకాలు) ఉన్నాయి. ఉపపురాణాల్లో ఎన్నో చెప్పలేం. ఈ పురాణాలు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి.

పురాణాల్లో ఉన్న ఈ కథల ఆధారంగా చాలా మంది కవులు అనేక కావ్యాలు సృజించారు. పెద్దన మనుచరిత్రకు మార్కండేయ పురాణంలోని కథ ఆధారం. తెనాలి రామకృష్ణుని పాండురంగమహత్యానికి స్కంద పురాణం ఆధారం.రాయల ఆముక్త మాల్యదకు విష్ణుపురాణం ఆధారం.

బ్రహ్మ పురాణాన్ని కుంపిణీ యుగం (క్రీ.శ. 1750-1850)లోనూ, పద్మపురాణాన్ని కాకతీ యులు, రెడ్డిరాజుల కాలంలో అనువదించారు. రెడ్డిరాజుల కాలంలో విష్ణుపురాణాన్ని పశుపతి నాగనాథుడు, భాగవత పురాణాన్ని బమ్మెర పోతన, స్కంద పురాణాన్ని శ్రీనాథుడు, కాకతీయుల కాలంలో మార్కండేయ పురాణాన్ని మారన, మలినాయక రాజుల కాలంలో భవిష్యత్ పురాణాన్ని కాకునూరి అప్పకవి  తెలుగులోకి అనువదించారు.  తిమ్మరాజు లక్ష్మణరావు కూర్మ, మార్కండేయ పురాణాలను వచనంలో రాశాడు. ఆయనే పువ్వాడ వెంకటరావుతో కలిసి మత్స్య పురాణాన్ని కూడా రచించారు.

పురాణాలు కుంఫిణీ యుగం వరకు ప్రబంభాలుగా, ద్విపద వచ్చిన కావ్యాలుగా వచ్చాయి. తర్వాత కాలంలో స్టేజి నాటకాలు గా వచ్చాయి. ఆధునిక కాలంలో ఇవే సినిమా కధలుగా వచ్చాయి. పురాణాలు భారతీయ సాహిత్య వారసత్వ సాహిత్యంగా పరిగణించ వచ్చు.

చాలా పురాణాలు ఆంగ్లంలోకి అనువదించబడినాయి. కెన్నడీ క్రీ.శ. 1800లో పురాణాలను అధ్యయనం చేసి 'ఏనిషియంట్ హిందూ మైథాలజీ' అనే గ్రంథాన్ని  రాసినాడు. దాదాపు ఇదే కాలంలోనే విష్ణు పురాణాన్ని విల్సను అనే ఆంగ్లేయుడు అనువదించాడు. ఇతనే ఇతర పురాణాలను కూడా అధ్యయనంచేసి తులనాత్మకంగా విశ్లేషించాడు.

పురాణాలను చెప్పేవారిని పౌరాణికులనేవారు. వీరు ఇద్దరు. ఒకరు వాచకులు - పురాణాలను చదువుతారు.

మరొకరు ఉపబ్రహ్మకులు - క్రొత్త విషయాలను చేర్చి పురాణాన్ని చెపుతారు. ఇలా చేయబడిన వాటిల్లో భవిష్యపురాణం ఒకటి.    భవిష్య పురాణంలో గత కాలపు రాజుల వివరాలేగాక కొత్తగా వచ్చిన రాజుల వివరాలు కూడా చెప్పినారు. చంద్రగుప్తుడు సెల్యూకస్ కూతురుని వివాహమాడటం, భర్తృహరి, క్రీస్తు, శంకరాచార్యుడు, మధ్వాచార్యులు, కీచడు, అన్వరు, ఔరంగజేబు, శివాజీ, నాదిర్‌షా మొదలగువారి గురించి వర్ణించారు. ఇంగ్లీషు వారి గురించి వికటావతి పేరుతో విక్టోరియా ప్రభుత్వం గురించి వివరించారు.

పురాణాలను వ్యాసుడే రాసినట్లు చెపుతారు. జయం(భారతం) రాసిందీ వ్యాసుడే. ఇతనే వేదాలను వింగడించి నాలుగు భాగాలుగా అక్షరబద్ధం చేశారు. ఇన్నింటిని ఒకే వ్యక్తి రాయడం సాధ్యం కాదు. వ్యాస అంటే నేడు మనం చెప్పే సంపాదకుడు అని  అర్థం చేసుకోవాలని ఆరుద్ర అన్నారు.

ప్రతి పురాణంలోనూ నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు పురాణాలు చెప్పినట్లు ప్రారంభమవుతుంది. మహాభారతం లోనూ ఇంతే. ఆ రోజుల్లో కథలు చెప్పే వాడిని సూతుడు అనేవారు.

ప్రధానమైనవి గా భావించేవి 18 పురాణాలు వున్నాయి. అవి 1. మార్కండేయ, 2. మత్స్య, 3. భవిష్య, 4. భాగవత, 5.. బ్రహ్మ, 6. బ్రహ్మరైవర, 7. బ్రహ్మాండ, 8. విష్ణు, 9. వాయు, 10. వరాహ, 11. వామన, 12. అగ్ని, 13.నారదీయ, 14. పద్మ, 15. లింగ, 16. గరుడ, 17. కూర్మ, 18. స్కాంద పురాణాలు. ఇవేగాక శ్రీ దేవి భాగవతం, శివపురాణం, ఆది జాంబవ పురాణం, డక్కలి పురాణం వంటివి కూడా ఉన్నాయి. జైన బౌద్ధ ధర్మాలలో బౌద్ధ జాతక కథలు  పురాణాలు వంటివే.

ప్రతి పురాణాంలో ఐదు అంశా లుంటాయి. అవి సర్గ(సృష్టి),ప్రతి సర్గ (ప్రతిసృష్టి), వంశం, మన్వంతరం. ఒక్కో యుగానికి మనువుల పుట్టుక,వంశాను చరిత్ర (సూర్యవంశాల చరిత్ర).

సర్గ అంటే పరమాత్ముని గురించి ఆలోచన. ప్రతి సర్గలో మనిషి సృష్టి క్రమం - ప్రళయం, జీవుల గురించి  ఊహలు, బ్రహ్మ నుంచి ప్రజాపతులు వచ్చారనడం లాంటివి చెపుతారు.  వంశంలో మొదటి రాజుల గురించి, మునుల గురించి వారి వంశాల గురించి, ప్రచారంలో ఉన్నవి. మునులు చెప్పుకున్నవి మొదలైనవి వుంటాయి.  మన్వంతరంలో మనువులు, దిక్పాలకులు, వారి కాలంలో జరిగిన విశేషాలు, మునుల కథలు మొదలగునవి వుంటాయి.  వంశానుచరితంలో భూగోళ, ఖగోళ వ్యవస్థలు, నిధులు, కొండలు, వాటి వివరాలు, విశేషాలు, తీర్థయాత్రలు, దేవుళ్లు, వారి అవతార మహిమలు, పాపపుణ్యాల జాబితా, మరణానంతర అవస్థలు వాటిని జయించిన వారి కథలు వినోదాత్మకంగా వర్ణించి చెపుతారు.

పురాణాలను మూడు రకాలుగా విభజించారు. అవి సాత్త్విక, తామస, రాజస పురాణాలు. పురాణంలో ప్రతి కథకు ఒక ఫలశ్రీతి ఉంటుంది. ఫలాన ఫలితం కావాలంటే ఫలాన నోము నోచమన్నారు. ఫలనా గంగలో మునిగితే ఫలానా పాపం పోతుందని చెపుతారు.

పురాణాలపై చాలా మంది పరిశోధనలు చేశారు. ఆరుద్ర, త్రిపురనేని రామస్వామి చౌదరి, నార్ల, కుసుమధర్మన్న, భాగ్యరెడ్డివర్మ, బోయి భీమన్న మొదలైనవారు హేతువాద దృష్టితో పురాణాలను అధ్యయనం చేశారు.

పురాణాలలో చెప్పిన కథలను ఆర్య, ఆర్యేతర సంఘర్షణలను ఆధిపత్య వర్గాల వారు తమ ప్రయోజనాలకు అనుగుణంగారూపొందించు కున్నారని వీరు గుర్తించారు. పురాణాల ద్వారా  ప్రజల సామాజిక సాంస్కృతిక జీవితాన్ని వారి ప్రవర్తనను నియంత్రించారు. పురాణాలు ఇలా చెప్పాయి, అలా చెప్పాయని భక్తి, కర్మ సిద్ధాంతాలను మేళవించి విద్యా వంతుల కులాలు, ఇతర కులాలను శాసించాయి. ఇవన్నీ బ్రాహ్మణ మతాన్ని, కులవ్యవస్థను నిలబెట్టే లక్ష్యంతోనే రాయబడి నాయి.

పురాణాలు ఎవరు రాశారో తెలీదుగాని, ఎప్పుడు రాశారో పరిశోధకులు వాటిలో చెప్పిన రాజుల కాలాల ఆధారంగా గుర్తించారు. మత్స్య, వాయు, విష్ణు, భవిష్య పురాణాలలో, భారతం, భాగవతంలాంటి పురాణాలు,

మగధరాజుల గురించి వివరించారు. అందువలన పురాణాలన్నీ వీరి కాలంలో గానీ, తరువాత కాలంలోగాని రాసివుంటారని భావిస్తున్నారు. మగధ రాజులు 187 సంవత్సరాలు పాలించారు. భాగవతం ద్వాదశ అధ్యాయంలో జనపదం నుండి మహా సామ్రాజ్యంగా మారిన  మగధ చక్రవర్తుల గురించి చెపుతూ,వారు 137 సంవత్సరాలు పాటించారని చెప్పినారు. మగధను పాలించిన శిశునాగులు, నందుల తరువాత క్షత్రియ ప్రభువులు నశించారని చెప్పినారు.

నందుల వంశంలో మహాపద్మనందుడిని హంతకుడుగా, శూద్రుడిగా పేర్కొన్నారు. దీనికి కారణం ఏమిటంటే మహానందుడికి శూద్ర స్త్రీ వలన మహాపద్మనందుడు పుడతాడు. దానితో నందవంశం అపవిత్రం అయినట్లు పురాణ  రచయితలు రాశారు. ఈ మహాపద్మనందుడే చాణిక్యున్ని అవమాన పరిచింది. చాణిక్యుడు అందుకు ప్రతీకారంగా నందవంశాన్ని నాశనం చేస్తానని ప్రతినబూని, నంద వంశపు చివరిరాజు ధననందుడిని పదవీచ్యుతున్ని చేయించి చంద్రగుప్తునికి  రాజ్యాభిషేకం చేయిస్తాడు.  చంద్రగుప్తుడు కూడా శూద్రుడని పురాణాలు చెపుతున్నాయి. చంద్రగుప్తుని తల్లి మొర. ఈమె కొండజాతి వనిత.నంద వంశపు చివరి రాజు ధననందుని తమ్ములలో ఒకడైన నందవంశపు రాజుకు మొరకు కలిగిన  పుత్రుడే చంద్రగుప్తుడు. అందువలన చంద్రగుష్మన్ని శూద్రుడన్నాయి పురాణాలు. ఆమె తల్లి పేర చంద్రగుప్తుని రాజ్యం మౌర్య సామ్రాజ్యమైంది. అంటే మౌర్యులది మాతృస్వామిక గణరాజ్యం.

పురాణాలలో మగధ, శాతవాహనుల గురించి రాయడాన్ని బట్టి అవి క్రీ. శ. 600-300 మధ్య కాలంలో రాయబడి వుంటాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి 10 నుండి 19వ శతాబ్దాల వరకు మార్పులు, చేర్పులు జరుగుతూ వచ్చాయి. విష్ణు పురాణం క్రీ.శ. 6వ శతాబ్దం నాటిది. భాగవతం క్రీ.శ. 11, 12 శతాబ్దాల నాటిది. అలాగే ఇతిహాస కావ్యమైన రామాయణం క్రీ.పూ. 200 - క్రీ. శ. 250 మధ్య కాలాల్లోనూ, మరో ఇతిహాసమైనమహాభారతం  క్రీ.పూ. 400 - క్రీ.శ. 400 మధ్య కాలంలోనూ గ్రంధస్తమయ్యాయని చరిత్ర పరిశోధకులు, పండితులు పేర్కొన్నారు.

వేదాలు కూడా క్రీ.పూ.500 తర్వాత కాలంలోనే గ్రంథమయ్యాయి. అప్పటి వరకు అవి మౌఖికంగానే ఒకరి నుండి మరొకరికి సాగాయి.వీటిని క్రీ.శ. 1850లో ఆంగ్లంలోకి అనువదించారు.

పురాణ కథలలో సృష్టి స్థితిలయల వృత్తాంతాలున్నాయి. ఇవన్నీ సునామీ లాంటి జల ప్రళయాలు సంభవించినప్పుడు జీవజాలం నశించిపోవడం, కొంత మంది మనుషులు మరణించడం వంటి సంఘటనలను పురాణాలలో వర్ణించారు. వీటికి సంకేతాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తమ కథల్లో పేర్కొన్నారు. బ్రహ్మను జ్ఞానానికి, సృష్టికి సంకేతంగా చెప్పినారు. వేదకాలంలో నగరాలను ధ్వంసం చేసిన దేవుడిగా కీర్తించిన ఇంద్రున్ని తరువాత కాలంలో ఆయన స్థానాన్ని విష్ణువుకు ఇచ్చారు. విష్ణువును ఉపేంద్రు డన్నారు. అంటే ఇంద్రునికి సోదరుడున్న మాట. అలా విష్ణువును మరో ఇంద్రునిగా చేసి దేవునిగా కీర్తించారు. వీరిద్దరూ ఆర్యదేవతలు.

పురాణాలన్నీ దాదాపు ఆర్య, ఆర్యేతర ఘర్షణల కథలుగా రూపొందాయి. ఆర్యులుఆర్యేతరులతో ఘర్షణపడడం మాని వారిని మెల్లగా తమలో కలుపుకొనే క్రమంలో సింధూ, హరప్పా కాలం నుండి కొనసాగుతున్న అనార్యుల దేవతైన పశుపతిగా పేరుగాంచిన శివునికి దైవం హెూదా ఇచ్చి, పురాణాలలో బ్రహ్మ విష్ణు,మహేశ్వరులుగా కీర్తించారు.

రుగ్వేద సూక్తాల్లో (కవితల్లో) కనిపించే చాలా కథల్లో ఆర్యుల దేవుడు ఇంద్రుడు. దాసులుగా ముద్రవేయబడివారు ఆర్యేతరులు.  రుగ్వేదం లో ఆర్యులకు ఆర్యేతరులైన ద్రావిడులకు మధ్య ఘర్షణలు కనిపిస్తాయి. వాటినే మరో రూపంలో పురాణాల్లో దేవాసుర సంగ్రామాలుగా రాయబడినాయని, ఇవన్నీ సింధూ, హరప్పా సంస్కృతిలో ఆర్య దస్సులకు మధ్య జరిగిన ఘర్షణల జ్ఞాపకాలుగా భావించాలని విజయభారతి పేర్కొన్నారు. హరప్పా నాగరికత క్రీ.పూ. 2000 నాటికి అత్యున్నత దశలో వుంది.మెల్లగా ఆర్యుల రాకతో క్రీ.పూ. 1500 వాటికి అది పతనమైందని చరిత్రకారులు భావిస్తున్నారు.

వేదకాలం నాటి ఆర్యులు ఇరాన్ నుండి వలస వచ్చి మొదట ఉత్తరభారతదేశంలో స్థిరపడ్డారు. వీరి జీవనం ఆహారసేకరణ దశ నుండి వ్యవసాయదశలోకి మారుతున్న క్రమంలో వీరు రాధించే దేవతల రూపాలు కూడా మారాయి. వీరి కంటే ముందుగా వలసవచ్చిన వారిలోనూ ముందు నుంచి వున్న అటవిక జాతి వారితోనూ సంఘర్షించారు. అభివృద్ధికర పనిముట్లు కలిగిన ఆర్యులు ఆధిపత్యం సాధించగలిగారు. నాగ, యక్ష, రాక్షస మొదలైన గణ సమాజాలను తమ ఆర్యగణంలోకి కలుపుకున్నారు. కలుపుకునే క్రమంలో ఆధిపత్య స్థాయిలో వున్న విద్యావంతులైన ఆర్యులు అనేక కథలను పురాణాలుగా ప్రచారం చేశారు.

         పురాణాల్లో చెప్పిన దేవలోకం, బ్రహ్మ లోకం, ఇంద్రలోకం, పాతాళలోకం అన్నీ మానవ లోకాలే. సరస్వతీ,దృషద్వతీ, నదుల మధ్యనున్న ప్రదేశాన్ని బ్రహ్మావర్తమన్నారు. ఇది దేవగణాలతో నిర్మితమైందన్నారు. అంటే  దేవలోకమన్నమాట. మనుస్మృతిలో ఈ ప్రస్తావన ఉంది. దీనికి దిగువన కురుక్షేత్రం ఉండేదన్నారు. అక్కడున్న మత్స్య పాంచాల, శూరసేనక జనపదాలను బ్రహ్మర్షిలోకం అన్నారు. అంటే అది బ్రహ్మలోకం అన్నమాట. లడాఖ్ ప్రాంతంలో సురూ లోయ వుంది. అక్కడ నివసించే వారిని సురులన్నారు. కార్గిల్ నుంచి 140 కి.మీ. దూరంలో వున్న 'పెంజలా వాటర్ షెడ్ ప్రాంతం నుంచి సురునది పుట్టిందట. పురాణాలలో చెప్పిన 'సురాపగ' నదే సురునది. ఈ నది, దానిఉపనదులు కొన్ని వేల కి.మీ. విస్తరించివున్నాయట. ఇదంతా సురులోయ ప్రాంతం. ఆర్యగణాలు తమను దేవగణాలుగా చెప్పుకున్నాయి.  బహుశా వీరు సురులోయలో మొదట నివసించి ఉండటంవల్ల అలాచెప్పుకొని వుంటారని పరిశోధకులు భావిస్తున్నారు. కాలక్రమంలో దేవ అనే పదాన్ని దేవతకు పర్యాయపదంగా వాడినారు.

ఉపనిషత్తుల్లో పరమాత్మ అంటే దేవుడని,అతడు ఒక్కడేనని చెప్పారు. కాని పురాణాల కథలలో మాత్రం ముప్పైకోట్ల దేవతలను వర్ణించారు. పురుష దేవతలందరూ ఒక్కడే దేవుడైన పరమాత్మ స్వరూపాలుగా, స్త్రీ దేవత దేవి ఒకటేనని, ఇతర దేవతలందరు ఆమె ప్రతి రూపాలుగా భావించాలని పండితులు పేర్కొన్నారు.

బౌద్ధమత ప్రభావంతో ఆనాడు సన్యసించే ధోరణులు ఎక్కువగా ఉండేవి. మరోవైపు రకరకాల శాఖలుగా బ్రాహ్మణమత విస్తరణలు ఉండేవి. వీటి సమన్వయం కోసం అనాటి ధర్మశాస్త్ర కర్మలు ఆనాటి  వైదికేతర సంప్రదాయాలను కూడా పురాణాల కథల్లోకి తీసుకొచ్చారు. నిమ్న జాతికులాలను గిరిజన కులాలను తమలోకి కలుపుకునే సందర్భం లో వారికి సంబంధించిన జానపదకథను  పురాణంగా మార్చేవారు. ఆ కధలో నిమ్నజాతి పేరుకు బదులు వైశ్యకులాన్ని తెచ్చి పెట్టేవారు. జానపదకథల్లో స్త్రీకి నిర్ణయాధికారం వుంటే పురాణాలలో స్త్రీ బదులు బ్రాహ్మనుని పెట్టి దాన్ని అతని నిర్ణయాధికారంగా మార్చారు.  స్థానిక జాతుల దేవతలందరూ పురాణాల్లోకి వచ్చారు.

వైదిక కర్మకాండలకు బదులు పురాణ కర్మకాండలు అమలులోకొచ్చాయి. దాంతో పురాణాలు చదివిన వారిని, విన్నవారికి మోక్షం లభిస్తుందని అవి చెపుతాయి. పురాణాలలో ప్రతి సమస్యకు, ప్రతి అపరాధానికి ఒక పరిష్కారం ఉంటుంది. జనాభా పెరిగే కొద్ది దేవతల సంఖ్య పెరగడంతో పురాణాల ఉపయోగం పెరిగింది. పురాణ పఠనం చేసేటపుడు ఇతర కులాలతోపాటు, నిమ్నజాతి కులాల స్త్రీలు కూడా ఉంటారు. వేరేవేరు విశ్వాసాలు, సంప్రదాయాలు పురాణాల్లోకి రావడంవల్ల పురాణాలలో పేర్కొన్న పూజావిధానాలలో బ్రాహ్మణుల పాత్ర చాలా వాటిల్లో లేదు. అయినప్పటికీ బ్రాహ్మణ పురోహితులే ప్రస్తుతం చేస్తున్నారు.

రుగ్వేదంలో ఉష, సంధ్య, అశ్విని వంటి స్త్రీ దేవతలు మాత్రమే ఉండేవారు. కానీ పురాణాలలో స్త్రీ దేవతల కథలు అనేకం వున్నాయి. స్త్రీ దేవతలలో ముఖ్యులు సదాదేవి (శివుని భార్య), పార్వతి (శివుని రెండో భార్య), చంద్రిక(మహిషాసురమర్ధని), వీరి ఆరాధన ఎప్పటి నుండో తెలియడం లేదు. కుషానుల కాలంలోని నాణాల పై దుర్గ, పార్వతి చిత్రాలున్నాయి. క్రీ.శ.ఒకటో శతాబ్దానికి చెందిన కుషాణుల శిల్పాలలో వృక్షదేవత యక్షిణి చిత్రం వుంది. ఆమె పాదాల క్రింద ఒక పురుషుడు వుంటాడు. బహుశా దుర్గకు తొలి రూపమై వుండవచ్చని పరిశోధకులు చెపుతున్నారు.

స్త్రీ పూజకు సంబంధించిన ఆధారాలు సింధూ నాగరికతలో వున్నాయి. దీని తరువాత మహాభారతంలో మాతృకల ప్రస్తావన వుంది. వీరిలో మహాకాళి, మృత్యుదేవత, నిశాదేవి మొదలగువారున్నారు. మార్కండేయ పురాణంలో చాలా మంది స్త్రీ దేవతల గురించి వుంది. దేవి మహత్యం కావ్యం స్త్రీ దేవతలకు సంబంధించిన దీర్ఘ కవితాకావ్యం. పురుష దేవతలకు వాహనాలున్నట్లే స్త్రీ దేవతలకు వాహనాలున్నాయి. శివునికి నంది, స్కంధునికి నెమలి, గణేశునికి మూషికం వుంటే పార్వతికి సింహం, చండిక, కాళిక పులిని కలిగి వుంటారు.

చండిక అనేక స్త్రీ దేవతల ఉమ్మడి శక్తి స్వరూపం. మహీషునిపై దండయాత్ర చేస్తున్న సమయంలో చండికకు ఇతర దేవతలు తమ  కమల పుష్పాలను కంఠమాలగా, సింహాన్ని వాహనంగా ఇస్తారు. చండిక మహిషున్ని (దున్న) మెడపై కాలితో తన్నుతుంది.దాని నోటి నుండి అసురుడు సగం మేర బయట పడతాడు. అప్పుడు అతని శిరస్సును ఖండిస్తుంది. మనదేశంలో మహిషాలను బలిచ్చే సంప్రదాయం వుంది. ద్రౌపదిని దేవతగా ఆరాధించే వారు ద్రౌపదికి,కాళీమాతకు బలులిస్తారు. జానపదుల కథలను పురాణాల్లోకి తీసుకువచ్చినపుడు చండిక కథను రాసివుంటారని వెండీడోనిగర్ అభిప్రాయ పడ్డారు.

 

చండిక మహిషుని చంపేశాక, శంభుకుడు ఆమెను మోహించి వివాహం చేసుకుంటానని వెంటపడతాడు. తనను ఓడించినోడినే వివాహమాడతానని ఆమె చెపుతుంది. దాంతో వారిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు ఆమె వైపు నిలబడి తమ శక్తులను ఆయుధాలను, వాహనాలను ఆమెకిస్తారు. దాంతో ఆమె శంభుకున్ని వధిస్తుంది. ఈ చండికనే దుర్గ అని కూడా పిలుస్తారు. స్కంధ పురాణాల్లో దుర్గ మహిషున్ని సంహరిస్తుందని రాశారు. దేవి స్తుతిలో చండిక రక్తభోజుడనే అసురుడితో‌ పోరాడుతుంది. అతని రక్త బిందువు నుంచి అనేక మంది రక్తభోజులు పుడుతుంటారు. ఇటువంటి కథలు పురాణాల్లో కి రావడానికి కారణం అనేక తాంత్రిక పూజలు ఆనాడు పుట్టుకు రావడం వల్లనే. దేవిపూజ, శృంగారపర కార్యకలాపాలు ఈ తాంత్రిక పూజలలో వుంటాయి. ఇవి హిందూ, బౌద్ధ సంప్రదాయాలో క్రీ.శ. ఆరు, ఎనిమిది శతాబ్దా లలో ప్రారంభమైనాయి. వీటికి రాజుల అండకూడా వుండేది. ఇవి కాశ్మీర్, నేపాల్, అస్సాం, బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లోజరిగేవి. ఈ పూజల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకొని తాము రాజులు, చక్రవర్తులు కాగలమని భావించేవారు.

ఇలా పురాణాలు ఆనాటి ఆదివాసి తెగలను, అనార్యులైన ద్రావిడులను వైదిక మతంలోకి కలుపుకొనే క్రమంలో ఆనాటి విద్యావంతులు రాసినారని వీటిని మనదేశ సాహిత్య వారసత్వ సంపదగా పరిగణించాలని పరిశోధకులు భావించారు. మనకు తెలియని చరిత్రను నిర్మించడానికి పురావస్తు పరిశోధన లలో పురాణాలు కూడా కొంత మేర తోడ్పడు తున్నాయి.

 

ఆధార గ్రంథాలు

1.పురాణాలు మరో చూపు__డా.విజయభారతి

2.హిందువులు_ వెండీ డోనిగర్

3.ప్రాచీన భారతదేశ చరిత్ర  కోశాంబి పరిచయం_ బాలగోపాల్

4. సమగ్రాంధ్ర సాహిత్యం_ ఆరుద్ర

5.మన చరిత్ర_ సంస్కృతి __ శైలజ బండారి

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు