మా రచయితలు

రచయిత పేరు:    వకుళా వాసు

కవితలు

ఆమెను కాపాడుకుందాం

బంగారు లోగిలిలో భర్తకు ధర్మపత్ని ~ఆమె... 

భవబంధాల సాగరంలో అమృతభాండం ~ఆమె... 

వటవృక్షమై వంశాన్ని విస్తరింపజేసే జాయ ~ఆమె...

అన్యోన్య దాంపత్యంలో సత్వగుణంతో శోభించే సతి ~ఆమె... 

 

కార్యనిర్వహణా రంగంలో అకుంఠిత దీక్ష ~ఆమె... 

లక్ష్యాన్ని ఛేదించే నిష్ఠలో రామబాణం ~ఆమె... 

సంకల్పసిద్దిలోఎంతటివారినైనా ఎదురించే ధీశాలి ~ఆమె...

తనశక్తియుక్తులతో వెలుగొందే విజ్ఞానవీచిక ~ఆమె... 

మధురభావనలను పంచే మకరందాల వింజామర ~ఆమె... 

ఆంతర్యం అంతుపట్టని నిభిడీకృత అగాధం ~ఆమె... 

తనచుట్టూఅల్లిన కీచక ముళ్ళకంచెలను కాల్చే జ్వాల~ఆమె...

నీతిమాలిన చేష్ఠలను ఖండించే చూపులఖడ్గం ~ఆమె... 

తల్లిగా చెల్లిగా ఆలిగా బిడ్డగా నీకు తీయని లాలన ~ఆమె... 

ఆమె లేకుంటే అంతులేని శూన్యం ~అందుకే కాపాడుకుందాం అందాల బంధాల ఆమెని.

 

గురువు (నానీలు)

          1

తప్పటడుగులు

నడకనేర్చాయి

తల్లి ఒడి నుంచి

గురువు నీడ చేరి

 

          2

పుస్తకాల నీతులు

నీలో చేరాలా

వారధి గురువే

కాలమెంత మారినా

 

            3

కలుపు చేష్టలకు

కంచె వేసె ఒజ్జ

విజ్ఞాన వృక్షంగా

నీవెదగాలని

 

         4

 చదువు నదిలా

పారుతోంది

విధికంకితమైన

గురువు గొప్పతనంతో

 

         5

ఇంటి పనంతా

చేస్తే ఎంత హాయో

బళ్ళె సారు

అభినందన పూలనవ్వుకై

 

          6

విశాల విజ్ఞాన

వీచిక గురువు

చదువు పుప్పొడి

వెదజల్లుతూ

 

          7

భయం గుప్పిట

గురువు బోధన

ఫైసల చదువుతో

విద్యార్థి పెత్తనం

 

మౌన పోరాటం

మనుగడకై ఆరాటం మౌన పోరాటం... 

అలుపెరుగని అలల సవ్వడుల ప్రేమసాగరం ...

రెప్పలమాటున దాగిన సుడిగుండాల కల్లోలం....

సంతోషాల ముసుగు ధరించిన బడబానలం... 

కన్నుల వెన్నెల కురిపించే కాంతి సమీరం... 

నట్టింట్లో నడయాడే పసుపుకుంకుమల పరాగం... 

నందనవనాన్ని తలపించ విరబూసే మల్లెల సుగంధం... 

లోకాన్ని లాలించ వర్షించే ఆషాడమేఘం ...

మనసులు మలినాలు కడిగే నిప్పుల వర్షం ....

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు