మా రచయితలు

రచయిత పేరు:    జోడు కార్తీక్

కవితలు

ప్రియా..!

నా మనోవిహంగపు రెక్కలు రెపరెపలాడవా ప్రియా 

నీ చలచల్లని ప్రేమగాలి ఎద మీద వీస్తుంటే   

మైమరిచిపోదా ప్రియా నా మనసు

నీ తియ్యని మాటలు కవ్విస్తుంటే

 

మురిసిపోయాను ప్రియా నేను

నీవే అమృతవర్షినివై వస్తుంటే

మరిచిపోయావా ప్రియా నన్ను

నిన్ను ఎప్పుడు నా మదిలో ఉంచుకుంటుంటే

 

చలించిపోదా ప్రియా నా మనసు

నీ వలపుస్పర్శ కొత్త వెలుగునిస్తుంటే

తరించిపోదా ప్రియా నా మనసు

నీ వెన్నెల రూపాన్ని చూస్తుంటే

 

పలుకవా ప్రియా కాస్తయినా

నా గళం నీ పేరు నిత్యం పలుకుతుంటే

భరించగలనా ప్రియా  నేను,

నా పంచప్రాణాలనుకున్న నీవు దూరమవుతుంటే

 

వినబడలేదా ప్రియా

నీకోసం ప్రేమగానాన్ని ఆలపిస్తుంటే 

కనబడలేదా ప్రియా

నీకై నా గుండెలో ప్రేమజ్యోతిని వెలిగిస్తుంటే

 

కనికరం కొంతయిన లేదా ప్రియా నా పైన

నా మనసు నిత్యం నీకై నిరీక్షిస్తుంటే

క్షమించరాని తప్పు నేనేం చేసానని

నిన్ను ప్రతిక్షణం ప్రేమిస్తుంటే

 

రావా ప్రియా ఇకనైనా నా ఎదలోకి

నా మనసు తలుపులు తెరుచుకు కూర్చుంటే

అలుసా ప్రియా నేనంటే

నీ ప్రేమకై ప్రతిక్షణం వేచిచూస్తుంటే

 

దుఖించదా ప్రియా నా మనసు

నీ చూపులబాణాలు గుండెను చీల్చుతుంటే

తట్టుకోగలదా ప్రియా నా మనసు

నీ నవ్వులసడులు నా గుండెకు ముడులుగా పడిపోతుంటే

 

నమ్మవా ప్రియా ఇప్పటికైనా,

నా ప్రాణమే నీవంటుంటే

తోడు రావా ప్రియా ఇకనైనా,

నా ప్రాణం నీ తొడుకై తపిస్తుంటే

 

     

అతీతమైన స్నేహము

తేనెకన్న తియ్యని నీ మైత్రి

ఓర్పు నేర్చిన మరో ధరిత్రి

 

పాలకన్న తెల్లని నీ మనస్సు

మలినాలని హరించే ధనస్సు

 

మధురపలుకులు మదిలో

నిలుపుకున్న మృదుస్వభావి

తెలియకపోదు భావితరాలకు తన ఠీవి

వర్ణించుట నా తరమా అతని మహత్వం

సత్సాంగత్యముతో ముందుకుసాగే కవి

 

కష్టాల నిలయానికి ఎదురేళ్లే గుండె ధైర్యము

విజయపథంలో అతడే ఒక పెను సైన్యం

 

కారుచీకట్లలో వెలుతురు వెతికే మిత్రుడు

కష్టాల కన్నీళ్లలో ధైర్యాన్ని పంచె

మరో అతులితబలదాముడు

 

తెలివితేటల వైపు చూస్తే తెనాలిరాముడు

చిలిపిచేష్టలలో చిన్ని కృష్ణుడు

 

ఇది రామసుగ్రీవుల బంధమా?

లేక హనుమ దాశరథిలా వాత్సల్యమా

 

స్వార్థ తారతమ్యాలు చూడని విహితము

వర్ణించజాలదు నీ అతీతమైన స్నేహము

నీ సుందర వదనంలో చిరునవ్వు చూసేందుకే

నా యీ చిరు ప్రయత్నము.

 

  

రక్కసి కరోనా

మృత్యువు నన్ను వెంటాడుతుంటే ఎక్కడికి పారిపోను నేను

రక్కసి కోరలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏం చేయగలను నేను

 

మృతుల శవాలు గుట్టలుగా పెరిగిపోతుంటే

ఏ వైద్యం  చేసి వారిని కాపాడగలను నేను

 

దివ్వెళ్ల నవ్వుతున్న పసిహృదయాల ప్రాణాలు

గాలిలో కలిసిపోతుంటే ఏం చేయగలను నేను

 

నా వాళ్ళందరు ఒక్కొక్కరుగా స్మశానవాటికలో

కాలిపోతుంటే చూస్తూ ఎలా భరించగలను నేను

 

కల్మషంలేని మనుషుల పంచప్రాణాలను తీస్తుంటే

అది చూసుకుంటు ఎలా తట్టుకోగలను నేను

 

సుఖసంతోషాలలో గుర్తు రాని భగవంతుడిని

నేడు కష్టాలలో ఏమని వేడుకోగలను నేను

 

కరోనాను చంపే మందేలేదు ఓ కార్తిక్

గుండెధైర్యంతో ఎలా ఎదురు వెళ్ళగలను నేను

 

      

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు